సాహిత్య సంగీతాలని అభిమానించే కొత్తపాళీ సాంప్రదాయ తెలుగు సాహిత్యాన్ని యువతరానికి పరిచయం చేసే ఉద్దేశంతో Classical Poetry (http://telpoettrans.blogspot.com) బ్లాగుని మొదలు పెట్టారు. యువబ్లాగరుల ఉత్సాహం ఇచ్చిన ఉత్తేజంతో సాహిత్య, సంగీత, చలనచిత్రాల చర్చ కోసం విన్నవీ కన్నవీ (http://vinnakanna.blogspot.com) బ్లాగునీ, ఇతర చర్చల కోసం కొత్తపాళీ (http://kottapali.blogspot.com) బ్లాగునీ నిర్వహిస్తున్నారు.
ఆంధ్రులు ఆరంభ శూరులు అని ఒక అపవాదు. కథాసాహితి వాళ్ళ పట్టుదల ఈ అపవాదుని వమ్ము చేస్తుంది. తెలుగులో సృజనాత్మక సాహిత్య ప్రచురణ ఏ మాత్రం లాభసాటి కాకుండా పోయిన ప్రతికూల వాతావరణంలో పదహారేళ్ళ పాటు క్రమం తప్పకుండా, ప్రచురణ విలువల్లో రాజీపడకుండా ప్రతి ఏడాదీ ఒక ఉత్తమ కథల సంకలనం తీసుకురావటం నిజంగా గొప్ప విషయం. వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ ఈ కథారథ చోదకులు.
ఏమైనా, చిన్నప్పుడు నెలనెలా చందమామ కోసం చూసినట్టు ఇప్పుడు ప్రతి ఏడూ కథాసాహితి వాళ్ళ సంకలనం కోసం ఎదురు చూడ్డం, పుస్తకం చేతికి అందగానే అందులో ఎవరెవరి కథలున్నాయో ఆత్రంగా చూసేసి, ఆ తరవాత ఒక్కో కథా – చందమామ చదివినట్టే ప్రచురించిన వరుసలో కాకుండా – నింపాదిగా ఒక నెలరోజులపాటైనా ఆస్వాదించటం నాకు అలవాటైపోయింది.
నిజం చెప్పొద్దూ, ఈ 2005 సంకలనాన్ని నేను కొంచెం భయం భయంగానే అందుకున్నా. 2003, 2004 సంవత్సరాల సంకలనాలు చదివినప్పుడు అసలు తెలుగు కథంటేనే నీరసం పుట్టింది. ఈ సంకలనాల మీద కోపమొచ్చింది, ఇన్ని వందల కథలు ప్రచురితమవుతుంటే వీళ్ళకి ఇంతకంటే మంచి కథలు దొరకలేదా అని. ఆ భయమూ కోపమూ ఎగిరి చక్కా పోయాయి కథ 2005 చదవగానే. హమ్మయ్య, పర్లేదు, మంచి తెలుగు కథలింకా పుడుతున్నయ్యి అని ఒక ధైర్యమొచ్చింది మళ్ళీ.
కథ 2005 లో పదమూడు కథలున్నాయి. అన్ని కథలూ నాకు నచ్చాయి కొంచెమెచ్చు తగ్గుగా. ఒక్కొక్క కథనీ లోతుగా విశ్లేషించాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇది సమీక్షే కాని విమర్శ కాదు గనక కొన్ని కథల్ని మాత్రం స్థాలీపులాక న్యాయంగా రుచి చూపిస్తాను.
నా ఉద్దేశంలో ఈ సంకలనానికి తలమానికం వివినమూర్తిగారి “జ్ఞాతం”. కులాంతర వివాహం చేసుకున్న మోహన్ – వసుధ దంపతుల ఒక్కగానొక్క కొడుకు సుమన్ బెంగుళూరు ఐటీ రంగంలో పని చేస్తూ సహోద్యోగి సౌమ్యని ప్రేమించాడు. సాంప్రదాయ కుటుంబం నించి వచ్చిన సౌమ్యకి తనకేం కావాలో బాగా తెలుసు. ఈ పెళ్ళి జరుగుతుందా? ఈ పెళ్ళి జరగాలంటే ఎవరు దేన్ని త్యాగం చెయ్యాలి? ఎవరు ఎన్ని మెట్లు దిగి రావాలి? క్రితం తరం వారి ఆదర్శాలు ఈ తరం యువతకి అర్థం లేని, అర్థం కాని అనవసరపు త్యాగాలా? సంక్లిష్టమైన కథా వస్తువు చెయ్యి తిరిగిన రచయిత చేతిలో తీగలా సాగి వలలాగా అల్లుకుంటుంది. రచయిత మన చెయ్యి పట్టుకుని మెలికలు తిరిగే దార్ల వెంబడి మనల్ని ఒడుపుగా నడిపిస్తారు. యుక్తిగా అల్లిన సన్నివేశాలు సజీవమైన పాత్రల నిర్దిష్టమైన వ్యక్తిత్వాల్ని ఆవిష్కరిస్తాయి. చదవటం సుళువుగా జరిగిపోతుంది. చూస్తుండగానే కథ చివరికొచ్చేస్తాం. కానీ ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి కథంతా మళ్ళీ చదవాల్సిందే.
ఇంకొక ఎన్నదగిన కథ ఖదీర్ బాబు (మన బ్లాగరులు అభిమానించే దర్గామిట్ట కతల రచయిత) రచన “కింద నేల ఉంది”. ముందే చెబుతున్నా – ఈ కథ దర్గామిట్ట కతల్లాగా ఉండదు. అనేక రకాలుగా తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఒక తల్లి తన ఒక్కగానొక్క కొడుకైనా మనిషిగా బతకాలని తాపత్రయ పడి ఆ అస్తిత్వపు మూలాలకోసం వెతకడం ముఖ్య కథాంశం. ‘నేల విడిచి సాము చెయ్యటం’ అని మనలో వాడుక – మూలాలు మరిచి పోవద్దు అని అదొక సున్నితమైన హెచ్చరిక. మన మూలాలు నేలలోనే ఉన్నయ్యి అని కథ పేరుతోనే సూచించిన రచయిత వర్తమాన జీవితంలో ఎన్ని విధాల మనం ఆ మూలాలకి దూరమవుతున్నామో కథలో పాత్రల ద్వారా సహజంగా, సమర్ధవంతంగా చెప్పించారు. కథకుడు జరుగుతున్న కథలో లీనం కాకుండా ఒక సాక్షిలాగా కథ చెప్పటంతో మనమొక డాక్యుమెంటరీ చూస్తున్నట్టు ఉంటుంది.
వర్ధమాన రచయిత సుంకోజి దేవేంద్రాచారి కథ “కొమ్మిపూలు” ఒక్క తాపుతో మనల్ని బాల్యపు బూరెల బుట్టలో పడేస్తుంది. ఈ బూరెలకి పిండి అయినవారి ఆప్యాయతలూ, పల్లెల్లో మాత్రమే వికసించే ప్రకృతి అందాలు అయితే బెల్లపు పాకంలా ఈ బూరెల్ని పట్టి ఉంచేది తియ్యటి చిత్తూరు మాండలికం. ఆ తీపి, ఆ రుచి అనుభవైక వేద్యం, మీరే రుచి చూడండి – ఇంతకంటే నేనేం చెప్పలేను.
భారత యుద్ధంలో పాండవులూ, వాళ్ళ ఒక్కగానొక్క మనవడూ తప్ప మిగిలిన వాళ్ళంతా చచ్చారు కాబట్టి పీడా వొదిలింది. ఏ కౌరవుల సామంతుల కొడుకో మిగిలి ఉన్నాడనుకోండి – ఏమై ఉండేది? తండ్రి తనది కాని యుద్ధంలో వీరస్వర్గ మలంకరించాడు. విధవరాలైన తల్లిని లోకం వీరపత్ని అని కీర్తిస్తుంది. అయినవాళ్ళు ఆ కీర్తనని అందుకుని ఇక వీరమాతవు కూడా కావాలె .. నీ కొడుకుని వీరుణ్ణి చెయ్యి అని ఊదర కొడతారు. ఇకా ఆ వీర వలయం అలా అవిఛ్ఛిన్నంగా సాగుతుంటుంది. ఆ వలయంలో చిక్కుకున్న వాళ్ళకి వీరులనే కీర్తి తప్ప విముక్తి లేదు, గెలుపు అంతకంటే లేదు. ఈ విష వలయాన్ని ఛేదించిన ఒక వీర వనిత కథ “వీరనారి”. త్రివిక్రమ్ బ్లాగుటపాల్లో కవిగా, కథకుడిగా మనకి చిరపరిచితుడైన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ కథ రాశారు. బతుకుని నిలబెట్టేదే నిజమైన వీర గుణమని కొత్త నిర్వచనమిచ్చే వీరనారిని సృష్టించి ఫాక్షనిస్టు మారణ ఝంఝామారుతానికి చేతులడ్డు పెట్టి జీవనజ్యోతిని వెలిగించారు రచయిత.
రావి శాస్త్రిని గుర్తుచేసే పదునైన వ్యంగ్యం సువర్ణముఖి రాసిన “పరమవీరచక్ర”లో, రాయిగా రూపాంతరం చెందుతున్న టీవీ రిపోర్టర్ల మనసుల మీద ఫోకస్ మునిసురేష్ పిళ్ళె రాసిన “రాతి తయారి”లో, మంచి చెడులను ఆలోచించనివ్వని యవ్వనపు ఉధృతం వారణాసి నాగలక్ష్మి రచన “ఆసరా”లో కనిపిస్తాయి. కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం (జాన్సన్ చోరగుడి), బైపాస్ రైడర్స్ (బాషా. జి.), బతికి చెడిన దేశం (అట్టాడ అప్పల్నాయుడు), నెమలినార (బి. మురళీధర్), బృంద (కాశీభట్ల వేణుగోపాల్), రెండంచుల కత్తి (కె.ఎన్. మల్లీశ్వరి) ఈ సంకలనంలోని ఇతర కథలు. వస్తువులో మంచి విస్తృతి కనబడుతోంది – పల్లెల్లో మనుగడ, మహానగరాల్లో యాంత్రిక జీవనం, అస్తిత్వాల కోసం వెతుకులాట, పెనుగులాట, ఇలా. కథ చెప్పే పద్ధతులూ విలక్షణంగా ఉన్నై, విశ్లేషణాత్మకంగా కొన్ని, సాక్షీభూతంగా కొన్ని, వ్యంగ్య వైభవంతో కొన్ని. కథల, పాత్రల దృక్కోణాల్లోనూ తగినంత వైశాల్యముంది. ఇక భాషలో బోలెడు వైవిధ్యముంది – అటు సువర్ణముఖి గారి శీకాకోళం నించీ ఇటు సుంకోజి గారి చిత్తూరు దాకా.
“కథాశిల్పం” రచనకి కేంద్ర సాహిత్య ఎకాడెమీ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత, విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారి వ్యాసం “రాయలసీమలో కథా విస్తరణ” ఈ సంకలనానికి కొసమెరుపు. మొత్తమ్మీద తెలుగు కథనీ, ప్రత్యేకించి రాయలసీమ కథనీ సన్నిహితంగా ఎరిగిన పండితులు శ్రీ వల్లంపాటి. చారిత్రక నేపథ్యాన్ని తీర్మానించి, వివిధ రాజకీయ సామాజిక పరిస్థితులలో సీమలో ఏ కథకులు ఎలాంటి కథలు రాశారో స్థూలంగా చర్చించారు. ఎవరైనా సాహిత్య విద్యార్థులు రాయలసీమ కథలని లోతుగా పరిశోధించ దల్చుకుంటే ఈ వ్యాసాన్ని మొదటి మెట్టుగా వాడుకోవచ్చు. శ్రీ వల్లంపాటి ఈ సంవత్సరారంభంలో కన్ను మూశారు. తెలుగు కథాప్రియులకు ఈ వ్యాసమే వారిచ్చిన చివరి బహుమతి కావచ్చు.
కథా సాహితి వారి దృఢ సంకల్పానికి కొన్ని సంవత్సరాలుగా ఆర్ధిక బలం చేకూర్చటం తెలుగు ఎసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వారు చేస్తున్న ఒక మంచి పని. ప్రతి కథతో పాటు రచయిత ఛాయాచిత్రం, చిన్న పరిచయం, చిరునామా, కథ మొదటి ప్రచురణ వివరాలు ఇవ్వటం బాగుంది. ఆదివారం వార్త, ఆదివారం ఆంధ్రజ్యోతి, రచన లంటి ఆంధ్రదేశ పత్రికలతో పాటు అంతర్జాల అమెరికా పత్రికలు (సుజనరంజని, తెలుగు నాడి), సావనీర్లు (తెలుగు పలుకు 2005 తానా సావనీర్) ఈ కథలకి మూలస్థానాలు కావటం తెలుగు కథల విస్తృతినీ సంపాదకుల శోధనా పరిధి విశాలమవటాన్ని సూచిస్తోంది. బ్లాగుల ఆగమనంతో మంచి కథలకోసం అంతర్జాలాన్ని విశాలంగా శోధించాల్సిన బాధ్యత ఇంకా పెరుగుతుంది సంపాదకులకి రానున్న సంవత్సరాల్లో.
ఈ పుస్తకం ఇక్కడ దొరుకుతుందిః http://www.avkf.org/BookLink/view_titles.php?cat_id=4996
వీలైతే చదవాలండి. మంచి కధలు ఎన్నో సార్లు మన అలోచనల్ని సాన బెట్టి, అభిప్రాయాల్ని పునర్విమర్శించుకునేలా చేస్తాయి.
చక్కటి సమీక్ష. చాలా బాగుంది. కృతజ్ఞతలు.
ఈ పుస్తకం చదివాక ఏ కథనైనా లోతుగా చర్చించాలని ఎవరికైనా అనిపిస్తే నేను సిద్ధం.
మీ సమీక్ష చదివాక ఇప్పుడు పుస్తకమూ చదవాలని అనిపిస్తూంది.
(పొద్దు సంపాదకులూ, కొత్తపాళీ గారి బ్లాగుల లింకులు సరిగ్గా ఇవ్వలేదు సరిచేయండి.)
–ప్రసాద్
http://blog.charasala.com
ప్రసాద్ గారూ!
లింకు సరిగా ఇవ్వలేదని తెలిపినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు సరిచేశాం.
‘poddu ‘patrika
telugu saahityaaniki toli poddu.
mI samiiksha (kathaa saahiti)baagunnadi.
EdO ‘tuu tuu maMtraMgaa’ kaaka ,
prati kathanuu diikshatO chadivi , chEsina samiiksha idi.