క్రెడిట్ కార్డులు

Sudhakar
[సుధాకర్]

అప్పిచ్చువాడు, వైద్యుడు…అంటూ ఎప్పుడో చెప్పిన సుమతీ శతక కర్త ఇప్పుడు వుంటే కనక ఆ “అప్పిచ్చువాడు” అనే పదాన్ని పీకి పారేసేవాడు. లేకపోతే “అప్పంటగట్టే వాడు లేని” అని ఒక కొత్త పదాన్ని చేర్చేవాడు. అప్పు చెయ్యటం ఒక బలహీనత, ఒక ఆనందం. తీర్చటం ఒక చేదు అనుభవం, ఒక భారం. ఇది ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. అయితే ఆనందాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి. అందువల్లనే అప్పు ఇప్పుడు సర్వాంతర్యామి. సరిగ్గా దీనినే ఇపుడో అద్భుతమైన వ్యాపారంగా మలచుకున్నాయి, చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు. జీవిత కాలపు ఉచిత క్రెడిట్ కార్డులు ఇస్తాం అని వెంటపడి మరీ అప్పుల్లో జనాలను మత్తుగా మునిగేటట్లు చేస్తున్నాయి. అందువల్లన ఇవి లేకుండా గడపటం పట్టణ ప్రజలకు సాధ్యమయ్యే పని కాదు. కాక పోతే కొన్ని జాగ్రత్తలు మాత్రం అవసరం.

ముఖ్యంగా మనం క్రెడిట్ కార్డులు వాడే అవసరాలు చూద్దాం..

1. ఖరీదయిన వస్తువులు కొనేచోట
2. అంతర్జాలంలో (ఇంటర్నెట్) వస్తువులు కొనాల్సి వచ్చినపుడు
3. వివిధ రకాల బిల్లులు చెల్లించాల్సివచ్చినపుడు
4. రికరింగ్ డెబిట్ (నెలసరి బిల్లులకు) చెల్లించాల్సి వచ్చినపుడు
5. టెలిఫోన్ ద్వారా హోటల్ బుకింగులు
6. పెట్రోలు బంకులు

ఇలా చాలా చోట్ల మనం ఈ క్రెడిట్ కార్డులను వాడేస్తూ వుంటాం. అయితే ఈ అలవాటు కొన్ని సార్లు చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం వుంది. ఎందువల్లనంటే కేవలం క్రెడిట్ కార్డుల మీద వుండే అతి కొద్ది అంకెలు తెలిస్తే చాలు, మీ బదులు ఎవరైనా మీ కార్డుని దుర్వినియోగ పరచవచ్చు. మీకు ఎన్ని ఎక్కువ కార్డులుంటే అంత జాగ్రత్తగా వాడాల్సి వుంటుంది. క్రెడిట్ కార్డుల వలన మీ జీవితంలో ఆర్ధిక ప్రమాదాలు ఈ క్రింద పేర్కొన్న రకాలుగా జరగవచ్చు.

1. మీ అజాగ్రత్త, బద్ధకం
2. క్రెడిట్ కార్డు కంపెనీలు
3. ఆర్ధిక నేరగాళ్లు

ముందుగా ఈ ఆర్ధిక ప్రమాదాల గురించి, వాటి నివారణ గురించి తెల్సుకుందాం. ఇవి తెలుసుకునే ముందర ఒక సారి క్రెడిట్ కార్డులో ముఖ్యాంశాలు చూడాలి.

క్రెడిట్ కార్డులు ముఖ్యంగా రెండు అంకెల మీద ఆధారపడి వుంటాయి. ఒకటి మీ క్రెడిట్ కార్డు నంబరు. రెండవది CVV నంబరు. (దీని గురించి చాలా మందికి తెలియదు).

క్రెడిట్ కార్డు నంబరు గూర్చి అందరికీ తెలిసిందే…ఇక CVV నంబరు గూర్చి చూద్దాం. క్రింద ఇవ్వబడిన బొమ్మలు గమనించండి.

Credit Card image - 1 Credit Card image - 2

ఈ నంబరు చాలా ముఖ్యమైనది. మీ క్రెడిట్ కార్డు నంబరు, ఎక్స్పయరీ తేది, ఈ నంబరు ఎవరికైనా ఇచ్చారంటే చాలు. ఇక మీ కార్డు వారి కార్డు అయినట్లే. కాబట్టి, క్రెడిట్ కార్డులు వాడేవారు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని వున్నాయి.

అంతర్జాలం (ఇంటర్నెట్) లో వాడేటప్పుడు

  • మీరు ఏ సైటు నుంచి కొనుగోలు జరుపుతున్నారో ఆ సైటు తప్పని సరిగా https:// ని లంకెలో కలిగి వుండాలి. అంతే కాక ఆ సైటు ఒక ప్రామాణిక డిజిటల్ సర్టిఫికెట్ కలిగివుండాలి. మీరు ఈ విషయాన్ని ఇప్పుడు వున్న కొత్త బ్రౌజర్లలో ఈ క్రింద చూపిన విధంగా గమనించవచ్చు.
  • ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఫైర్ ఫాక్సులో
    మంచి సైటు Good card in IE

    —-
    ప్రామాణికత లేనిది

    Bad card in IE

    Bad card in FF

  • కొన్ని సైట్లు, కేవలం మీ వయస్సు నిర్ధారణ కోసమే క్రెడిట్ కార్డు సమాచారం కావాలని అడుగుతాయి. ఇచ్చారో ఇక పప్పులో కాలేసినట్లే. సదా జాగ్రత్త!
  • మీకు కొన్ని సార్లు మీ క్రెడిట్ కార్డు కంపనీ నుంచి వచ్చినట్లుగా ఈ-మెయిల్ రావచ్చు. అందులో మీకొక లంకె ఇచ్చి, మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చెయ్యమని అడుగుతారు. వారు మీ బ్యాంక్ సైటును మక్కీకి మక్కీ దింపేసి మీకు ఏ మాత్రం అనుమానం కూడా రానివ్వరు. కాబట్టి మీరు ఉపయోగించే సైటు లంకెను జాగ్రత్తగా పరిశీలించండి. లేకపోతే ఇక అంతే సంగతులు.
  • కొంత మంది వ్యక్తులు ఈ మధ్య మీకు కొత్త క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పి, మీ పాత క్రెడిట్ కార్డు వివరాలన్నీ రాసుకుంటున్నారు. అది ఎందుకని అడిగితే మీకు ఎక్కువ క్రెడిట్ వస్తుందని చెప్తారు. ఇది పక్కా మోసం, అంతే కాక మీరు వాడుతున్న క్రెడిట్ కార్డు కంపెనీతో మీరు సంతకం చేసిన ఒప్పందం రద్దు అయిపోతుంది. మీకు ఎలాంటి ఆర్థిక ప్రమాదం జరిగినా క్రెడిట్ కార్డు కంపెనీ భరోసా ఇవ్వదు, పూచీ వుండదు.
  • కొన్ని సార్లు, మీరు హోటల్ బుకింగులు గట్రా ఏజంట్ల ద్వారా చేసేటప్పుడు, వాళ్ళు మీ క్రెడిట్ కార్డు వివరాలు అడుగుతారు. ఇచ్చారా అంతే….వాళ్లు ఆ వివరాలను ఎలా అయినా వాడుకోవచ్చు.

అందరూ పాటించాల్సిన క్రెడిట్ కార్డు జాగ్రత్తలు కొన్ని వున్నాయి…

  • మీ కార్డుపై ఒక కన్నేసి వుంచండి. అది ఎంత తొందరగా మీ చేతికి వస్తే అంత మంచిది. లేక పోతే మీరే కౌంటర్ దగ్గరకు వెళ్లి తీసుకోండి.
  • ఏ బాధ్యతాయుతమైన కంపెనీ కూడా మిమ్మల్ని క్రెడిట్ కార్డు వివరాలు ఫోన్లో అడగదు. కాబట్టి ఎప్పుడూ ఈ వివరాలు ఇవ్వకండి.
  • మీ కార్డు వివరాలు చాలా అర్జంటుగా కావాలి, లేకపోతే మీ కార్డుకు ఫైన్ పడుతుందనే ఈ-మెయిళ్ళను నమ్మవద్దు. ఎప్పుడూ ఈ-మెయిళ్ళలో ఈ వివరాలు ఇవ్వకూడదు.
  • మీకు కార్డు రాగానే, దాని వెనకాతల స్పష్టంగా సంతకం చెయ్యండి. ఫోటో వున్న కార్డయితే మరీ మంచిది.
  • ఎప్పుడూ మీ పిన్ నంబరును ఎక్కడా రాయవద్దు, క్రెడిట్ కార్డుపై కానీ, పేపరు మీద కానీ. కొంతమంది పిన్ వివరాలున్న మెయిల్ కూడా పర్సులో పెట్టుకుని తిరుగుతారు. ఇది ప్రమాదకరం.
  • మీ కార్డులు, రసీదులు ఎక్కడ పడితే అక్కడ (చెత్త బుట్టలో) పడెయ్యవద్దు.
  • క్రెడిట్ కార్డులను అందరికీ కనిపించేలా ఎక్కువసేపు పట్టుకోవటం మంచిది కాదు. సెల్ ఫోన్ కెమెరాలకు దూరంగా వుంచటం మంచిది.
  • అన్ని రకాల అకౌంటు నంబర్లు, కార్డు నంబర్లూ, వాటి బ్యాంకు తాలుకా సర్వీస్ ఫోన్ నంబర్లు ఒక డైరీలో రాసి భద్రంగా పెట్టుకుంటే, కార్డు పోయిన సందర్భాలలో వెంటనే వారికి తెలియచెయ్యవచ్చు.
  • మీకు అవసరం అయిన కార్డులు మాత్రమే దగ్గర వుంచుకోవటం మంచిది.
  • ప్రతీ సారి కూడా మీకు వచ్చిన క్రెడిట్ కార్డు బిల్లులను తప్పనిసరిగా చదవండి. కొన్ని సార్లు మీకు బోగస్ బిల్లింగ్ జరగవచ్చు. మీకు చెప్పకుండా సాంవత్సరిక రుసుమును పెంచివెయ్యవచ్చు. ఇది మన దేశంలో తరచుగా చేస్తున్నారు.
  • మీ క్రెడిట్ కార్డు నంబరు, వివరాలు ఎక్కడ పడితే అక్కడ రాయటం, పెద్దగా ఫోన్ లో ఇంకొకరికి చెప్పటం అస్సలు చెయ్యవద్దు.
  • క్రెడిట్ కార్డులని వేరే ఒక చిన్న కవర్లో పెట్టి వుంచటం మంచిది. జేబు పర్సులో పెట్టటం అంత మంచిది కాదు.
  • ఎప్పుడూ, ఎవ్వరికీ మీ కార్డు నంబరు, వివరాలు వారి కొనుగోలుకు గానీ, బ్యాంకులకు పూచీకత్తుగా గానీ ఇవ్వవద్దు.
  • మీ బ్యాంక్ నంబర్లు ఎప్పుడూ దగ్గర వుంచుకోవటం మర్చిపోవద్దు.

పైన చెప్పిన జాగ్రత్తలన్నీ చాలా ఎక్కువగా కనిపించినా, నిజానికి చాలా చిన్నవి. మీరు ఇప్పటికే కొద్దిగా జాగ్రత్తపరులైతే ఇవన్నీ చాలా సులువు. ఇవన్నీ మీకు కొత్త అయితే, ఒక్క సారి జాగ్రత్తగా ఇవన్నీ చదివి ఏవైనా తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. అవన్నీ సరి చేసుకోవటానికి ప్రయత్నించండి.

అప్పు పుట్టటం ఇప్పుడు సులువే, కానీ తీర్చటం మనసుకు కష్టం, దానికి తోడు పైన చెప్పిన ఆర్థిక ప్రమాదాలలో ఒక్కటి జరిగినా మీరు కోలుకోవటం కష్టం.

—————————

సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో బ్లాగు. ఇవికాక ఆయన తక్కువ తరచుగా రాసే బ్లాగులు ఇంకో రెండున్నాయి. పొద్దులో సుధాకర్ నిర్వహిస్తున్న శీర్షిక వివిధ.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

3 Responses to క్రెడిట్ కార్డులు

  1. రెండునెలల క్రితమే కార్డు తీసుకున్న నాలాటి వాళ్ళెందరికో ఈ జాగ్రత్తలు ఎంతగానో అవసరమౌతాయి.. అనేక నెనర్లు…

  2. radhika says:

    నెనర్లు

  3. Siva Rama Krishna says:

    It is very useful tips, thanks for the suggestions…..

Comments are closed.