తరగతి గదిలో

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రచనల్లో 2 కథలు ఈమాట లో, మిగిలిన కథలు, కవితలు తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి. సౌమ్య రాసిన ప్రయోగాత్మక కథ తరగతి గదిలో…

—————-

గోడంత ఉన్న బోర్డు కాస్తా మెల్లి మెల్లి గా కుంచించుకు పోవడం మొదలయింది. బోర్డు పక్కనే ఉన్న ప్రొఫెసర్ ఆకారం మెల్లి మెల్లి గా కనుమరుగు కావడం మొదలుపెట్టింది. ఆయన గొంతుక క్రమంగా వినిపించడం తగ్గింది. ఇక పూర్తిగా చీకటి అయింది అనుకున్న క్షణం లో పక్కనే కూర్చున్న కిషోర్ డొక్క లో ఓ పోటు పొడవడం తో మెలుకువ వచ్చింది రాజేష్ కి. “చా! మంచి నిద్ర పట్టే టైం కి లేపావ్ కద రా వెధవా” అనబోయి నాలుక్కరుచుకున్నాడు రాజేష్. అప్పుడే తట్టింది తను క్లాసు లో ఉన్నాడు అని. కాస్త సిగ్గేసింది రెండో బెంచీ లో కూర్చుని మరీ ఇంత ఆదమరిచి ఎలా ఉన్నానా అని. వెంటనే నిటారు గా కూర్చుని బోర్డు వంక చూడడం మొదలుపెట్టాడు. ఈ ప్రాఫ్ అంటే తనకెంతో ఇష్టం అని ఎందరికో చెప్పాడు రాజేష్. అయినా నిద్ర పోతున్నాడు అంటే – ఏమిటి అర్థం? తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఇంతలో ప్రొఫెసర్ కంఠం ఖంగుమని మోగడం తో మళ్ళీ పాఠం పై దృష్టి పెట్టాడు. కానీ, రాత్రి నైట్ అవుట్ హేంగోవర్ ఇంకా వదల్లేదల్లే ఉంది. కాసేపటికే ఇందాకటి బోర్డు చిన్నదవడం, చూపుల్లో చీకటి నిండడం మళ్ళీ పునరావృత్తమైంది.

“ది నెట్వర్క్ హేస్ ఎ ఫ్యూ ప్రాబ్లంస్……” – తరువాత ఏం చెప్పారో రాజేష్ బుర్ర కి ఎక్కలేదు. నిస్సహాయంగా కళ్ళు మూసి బెంచి పై వాలాడు. ఓ నిముషం పడుకున్నాడేమో. ఇంతలో అంతరాత్మ తట్టి లేపిందో లేక పడుకునే తరహా ప్రశాంతత లేదో గానీ … మళ్ళీ లేచాడు. ఓ సారి ప్రొఫెసర్ తల మీదుగా గోడ గడియారం చూసాడు. 6:30. ఓ క్షణం అర్థం కాలేదు. అదేంటి 10 కి కదా క్లాసు మొదలైంది? అనుకున్నాడు. ఓ అర క్షణం పట్టింది అది పని చెయ్యడం లేదు అన్న విషయం గుర్తు రావడానికి. తన వాచీ చూసుకున్నాడు. ఇంకొ ముప్పవు గంట. “హా! ఎందుకిలా ఔతోంది నాకు?” – వందో సారి అనుకున్నాడు. ఈ ప్రొఫెసర్ కి పిల్లల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. మామూలుగా అలాంటి అభిమానం పొందే వారు తక్కువ. తనూ ఆయనకి అభిమానే. అయినా ఎందుకిలా?? ఈసారి రాజేష్ మదిలో మెరుపు మెరిసింది. “ఇది ఎవరి అసమర్థతా కాదు … మనిషి శరీరం నిస్సహయత!” అని నిశ్చయించాడు. “ఆహా! ఏం వేదాంతం!” – తనలో తానే మురిసిపోతూ ఉండగానే మరో సారి దాడి – ఆవులింత. కళ్ళు మూసినట్లే మూసి వెంటనే మామూలుకంటే పెద్దగా తెరిచి బోర్డు వైపు చూడడం మొదలుపెట్టాడు. “ది జాబ్ ఈజ్ నాట్ ఓవర్ విత్ దిస్ సొల్యూషన్…..” – ప్రొఫెసర్ గొంతు. చివర విన్న వాక్యానికి, ఈ వాక్యానికి మధ్య ఎంత క్లాసు జరిగిందో ఊహించుకుని “ప్చ్!” అనుకున్నాడు రాజేష్.

“నిద్రా? క్లాసా?” – అన్న సందిగ్ధావస్త. “తల్లా? పెళ్ళామా?” అన్నట్లు ఉంది రాజేష్ కు. ఇన్నేళ్ళ స్టూదెంటు అనుభవం లో పవర్ పాయింట్లు ఉపయోగించని ప్రొఫెసర్ల క్లాసు లో పడుకోవడానికి ఓ విధానం కనిపెట్టాడు రాజేష్. వెంటనే దాన్ని పాటించడం మొదలుపెట్టాడు. అదేమిటంటే – ఆయన బోర్డు పై రాస్తున్నంత సేపు కళ్ళు మూసుకుని పడుకుంటాడు. రాయడం అవగానే టక్కున లేచి కూర్చుంటాడు. బోర్డు పైన చాక్పీసు కదిలే శబ్దం వినిపిస్తోందా లేదా అన్నది ఈ యుక్తి లో – “నిర్ణయాత్మక సమయం” అన్నమాట. దీని వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ప్రొఫెసర్ కి మనం పడుకున్నామా లేదా అన్నది తెలీదు అన్న భ్రాంతి లో జీవించగలగడం ఒకటి. రెండోది – అక్కడక్కడ అన్నా క్లాసు వింటే రేపొద్దున్న కనీసం “ఏమి చదువుకున్నావు?” అంటే జవాబివ్వడానికి పదజాలం అన్నా తెలుస్తుంది. – ఇవీ రాజేష్ ఆలోచనలు!నిద్ర పోకుండా ఉండడానికి చేసే వ్యర్థ ప్రయత్నాల్లో ఒకటైన – “నోటు పుస్తకం లో బొమ్మలు గీయడం” అన్న ప్రహసనం మొదలుపెట్టాడు. కానీ, మనసొప్పలేదు. “నిద్ర – ది డెవిల్” అని రాసి దాన్ని దిద్దడం మొదలుపెట్టాడు. ఈ దిద్దుడు లో కొన్ని క్షణాలు బానే గడిచాయి. కానీ, ఎందుకో తల ఎత్తిన రాజేష్ షాక్ కొట్టిన వాడిలా అలాగే చూస్తూ ఉండిపోయాడు. కారణం తన పక్కనే ప్రొఫెసర్. ఆయన చేయి తను “నిద్ర-ది డెవిల్” అని రాసుకున్న పేపరు ని ఆనుకునే ఉంది. ఆయనేమో క్లాసుని ఉద్దేశించి – “నౌ, లెట్ అజ్ సీ ది ప్రాబ్లం ఆఫ్ స్టోరింగ్ దిస్ పాటర్న్” అంటున్నారు. అప్పటికి తట్టింది రాజేష్ కి ఆయన దీన్ని చూసి ఉండకపోవచ్చు అని. వెంటనే చేయి అడ్డం పెట్టి సీరియస్ గా రాసుకుంటున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. మరి ఆయన చూసారో లేదో కానీ, ఏమీ మాట్లాడలేదు. కాసేపటికి ఆయనటు వెళ్ళగానే పక్కనున్న కిషోర్ వైపు తిరిగి ఓ వెధవ నవ్వాడు.

ఆయనటు వెళ్ళగానే మళ్ళీ నిద్ర మొదలైంది. కళ్ళు మూతలు పడుతూండగా కిషోర్ పక్కన ఉన్న రంజన్ తన్ను చూసి ఓ వెటకారపు నవ్వు లాంటిది నవ్వం లీలగా కనిపించింది. కోపం వచ్చింది రాజేష్ కి ..తనమీదే. అయినా మైకం గెలిచింది. కళ్ళు మూసుకున్నాడు. కానీ, చెవులు మూసుకోలేకపోయాడు. అటు పక్క బెంచి అమ్మాయిల గొణుగుళ్ళు, వెనకెవరో సందేహ నివృత్తి బాపతు జనాల గొంతుకలు, ఇక్కడ ప్రొఫెసర్ సమాధానమూ, పేజీలు తిప్పే శబ్దాలూ – అన్నీ చేరి రాజేష్ ని స్థిమితంగా పడుకోనివ్వలేదు. లేస్తూ ఉండగా చూసాడు పక్క బెంచీ లీల, కళ గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు. “నన్ను గురించే అయి ఉంటుంది” – అనుకున్నాడు. “చీ! వీళ్ళకేం పనీ పాటా లేదు. క్లాసు వినకుండా నా గురించి ఎందుకో?” అనుకున్నాడు…. తనది ఊహ మాత్రమే అన్న విషయం మరిచి. నిట్టూర్పో, అబ్బురమో తెలీని ఓ చూపు ఒకటి కదలాడింది రాజేష్ కళ్ళల్లో.
“నిద్రొస్తోంది రా …” – పక్కనున్న కిషోర్ గొణిగాడు రాజేష్ తో. రాజేష్ కి ఇది నిజమో వ్యంగ్యమో అర్థం కాలేదు.
“వచ్చి నాకా చెప్తున్నావు?” అన్నట్లు చూసాడు. వెంటనే బోర్డు వైపు కి తిరిగాడు.
“అసలు క్లాసు లో నిద్రపోతావా? తప్పు కదూ??”
“నిద్రొస్తే నిద్రపోక ఏంచెయ్యాలోయ్?”
“పక్కన వాళ్ళ ఏకగ్రత దెబ్బతినదూ నువ్వు నిద్రపోతే?”
“ఇక్కడ పక్క వాళ్ళ గోలే నన్ను నిద్రపోనివ్వడం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోను??”
“ఎందుకు రా …. ఎందుకు రా ఇలా తయారయ్యావు?”
“అది తరువాత ఆలోచిస్తా గానీ … ముందు ప్రొఫెసర్ తో సహా అందరూ నిశ్శబ్దం పాటించడానికి
మార్గాలేమైనా ఉంటే చెప్పు. తెలుసు కదా .. శబ్దం ఉంటే నాకు నిద్ర రాదు”
– రాజేష్ లో రెండు భిన్న ధ్రువాలు ఇలా సంఘర్షించుకుంటున్నాయి. సంభాషించుకుంటున్నాయి.

మళ్ళీ ఓ సారి మత్తుగా కళ్ళు తెరిచాడు రాజేష్. తల ఎత్తి తదేకంగా బోర్డు వైపు చూసాడు. “డిడ్ యు నోటీస్ దిస్ తింగ్?” – ప్రొఫెసర్ క్లాసు ని అడిగిన ప్రశ్నకి బుద్ధిగా తలఊపాడు. బోర్డు పై ఏదో ఈక్వేషన్ రాసి ఉంటే దాన్ని దించాడు పుస్తకం లోకి. మరో సారి గడియారం చూసాడు. ఇంకో 20 నిముషాలు. ఎక్కడో చిన్న చలనం రాజేష్ లో. కాసేపన్నా విందాం అనుకున్నాడు. చెవులు రిక్కించి వినడం మొదలుపెట్టాడు. కానీ, వినలేకపోయాడు. ఏమన్నా అర్థమైతే కద! అక్కడేదో సూత్రాన్ని డిరైవ్ చేస్తున్నారు. మన వాడు మొదటి లైను వద్ద పడుకుని చివరి లైను వద్ద లేచాడాయే. “ఓ మాథెమటిక్స్!!” – రాసి దాన్ని దిద్దాడు కాసేపు – ప్రొఫెసర్ ఇటు వైపు కి రారు అని నిర్థారించుకుని. నిట్టూర్పో, అబ్బురమో తెలీని ఓ చూపు ఒకటి కదలాడింది రాజేష్ కళ్ళల్లో.
“నిద్రొస్తోంది రా …” – పక్కనున్న కిషోర్ గొణిగాడు రాజేష్ తో. రాజేష్ కి ఇది నిజమో వ్యంగ్యమో అర్థం కాలేదు.
“వచ్చి నాకా చెప్తున్నావు?” అన్నట్లు చూసాడు. వెంటనే బోర్డు వైపు కి తిరిగాడు.

“అసలైతే ఈ గంటన్నర లో ఎంత బాగా పడుకుని ఉండొచ్చు? నువ్వొట్టి అసమర్థుడివి. క్లాసు లో పడుకోవడం కూడా చేతకాని దద్దమ్మ వి”
” ఈయన క్లాసు లో కూర్చోవడమే ఒక అదృష్టం అంటారు. ఇలాంటి క్లాసు లో ఇలా చేసావంటే నీ అంత వెదవ ఎవరూ ఉండరు.”
– రాజేష్ లోని ఇద్దరూ రెండు రకాలుగా తిడుతున్నారు. “చా! ఏ విధంగా చూసినా నేను వేస్ట్ ఫెలో నే నా??” – దిగులు గానూ, కోపం గానూ అనుకున్నాడు రాజేష్.

” ఒరే, ఈ చివరి 10 నిముషాలన్నా విను రా!” – కిషోర్ గొణిగాడు.
“వీడో సిన్సియర్ అవతారం తగిలాడు నాకు. ఇలాంటి వాళ్ళ వల్లే నాకు నేనే లోకువౌతున్నా!” – కసిగా అనుకున్నాడు రాజేష్.

“స్టూడెంట్స్, ఐ హేవ్ అ అసైన్మెంట్ ఫర్ యు టుడే….” ప్రొఫెసర్ గొంతు వినబడగానే చకచకా పెన్ను పేపరు తీసి కిషోర్ రాసుకోవడం మొదలుపెట్టాడు. దానితో రాజేష్ కి కూడా రాయక తప్పింది కాదు. ఏదో ఆ ప్రశ్న రాసుకున్నాడు. ఇంతలో కిషోర్ –

” కానీ, ఇది ఇంకా పూర్తిగా చెప్పలేదు. ఇదిగో … ఈ ఈక్వేషన్ ఉందే, సార్ ఇది పూర్తిగా చెప్పలేదు అనిపిస్తోంది నాకు. నీకేమనిపిస్తోంది?” అన్నాడు పుస్తకం లో ఏదో చూపిస్తూ. “నీ పుస్తకం చింపి నీ మొహం ఎలా ఉంటుందో చూడాలనిపిస్తోంది” – అనడాన్ని బలవంతాన నిగ్రహించుకున్నాడు రాజేష్.

మళ్ళీ ఆవులింత ….. ఇంక చిరాకు దాచుకోలేకపోయాడు రాజేష్.
“ఒరే, నేను వెళ్ళిపోతా రా ఇంక.” – లేవబోయాడు.
“ఇంకో 5 నిముషాలు కూర్చోరా బాబూ! నువ్వూ, నీ నిద్రా కాదు గానీ!” – కిషోర్ ఆపాడు.
– “ఇంక నుంచి రాత్రుళ్ళు సమయానికి పడుకోవాలి. పొద్దున్న సమయానికి లేవాలి.”- ఓ వెయ్యో సారో, లక్షో సారో అనుకున్నాడు. అనుకుంటూ మళ్ళీ కళ్ళుమూసాడు.

” వి విల్ స్టాప్ హియర్. వి విల్ మీట్ ఆన్ సాటర్డే..” – వెళుతూ వెళుతూ ప్రొఫెసర్ అన్నమాటలకి “హుర్రే!” అని ఎగరాలనిపించింది రాజేష్ కు. కానీ, “హమ్మయ్య!” అని మాత్రం అనుకుని లేచాడు.

” బంగారం లాంటి క్లాసు పాడు చేసుకున్నావు కద రా!” – అని ఒక వైపు నుంచీ
“పోతే పోనీ, మార్చి కాకుంటే సెప్టెంబర్” – అన్న వెటకారం మరోవైపు నుంచీ
– మనసు లోని ఇద్దరూ దాడి చేస్తూ ఉంటే – “మీరిద్దరూ నోర్లు మూయండి. నాకు నిద్రొస్తోంది అసలే…” అంటూనే మరో క్లాసు వైపుకి దారి తీసాడు రాజేష్.

——————-
గమనిక: ఇది కథేనా? అన్న సందేహం వచ్చే అవకాశం ఉంది దీన్ని చూస్తే. అయితే, నేను అర క్షణం లో నిర్ణయించుకుని ఓ గంట లో టైపు కొట్టి, వెంటనే పంపాను. ప్రయోగాత్మకంగా రాసాను. ఏ విషయం మీదైనా కథ రాయగలమా లేదా అని తెలుసుకునే ప్రయత్నం లో ఇదో అడుగు మాత్రమే అని గమనించగలరు.

-V.B.సౌమ్య (http://vbsowmya.wordpress.com)

About వి.బి.సౌమ్య

తానొక చదువరిని, నిత్య విద్యార్థినిని అని చెప్పుకునే సౌమ్య సాహిత్యం, సంగీతం, తన అనుభవాలు, అనుభూతుల గురించి తన బ్లాగులో విస్తృతంగా రాస్తారు. సౌమ్య రాసిన కథలు ఈమాటలోను, పొద్దులోను; కథలు, కవితలు అనేకం తెలుగుపీపుల్.కాం లో ప్రచురితమయ్యాయి.

This entry was posted in కథ and tagged , . Bookmark the permalink.

21 Responses to తరగతి గదిలో

 1. అమ్మో సౌమ్య గారూ,
  నేను క్లాసులో నిద్రపోవడం మీరు గానీ చూశారా ఏమిటి? అచ్చులో గుద్దేశారు?
  మీ కథకు హింట్లు. నిద్ర ఆపుకోవడానికి
  1. నాలాంటి నిద్ర వచ్చేవాళ్ళని కలుపుకొని జోకుల చిట్టీలు అందించుకొనే వాళ్ళం.
  2. ముందు బెంచీ అమ్మాయిని వెనుక నుంచీ ఎంత బాగా గీయగలమో అభ్యాసం చేసే వాళ్ళం.
  3. నొట్‌బుక్‌లో మన క్సిష్టమైన బుక్ పట్టుకెళ్ళి లెక్చరర్ అటు తిరిగి రాస్తున్నపుడు ఇటుతిరిగి చదువుకొనేవాన్ని. ఆయన రాయడం ఆపి ఇటు తిరగగాన్నే ఆ బోర్డుమీదిది ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనపడేవాన్ని.
  ” వి విల్ స్టాప్ హియర్. వి విల్ మీట్ ఆన్ సాటర్డే..” – వెళుతూ వెళుతూ ప్రొఫెసర్ అన్నమాటలకి “హుర్రే!” అని ఎగరాలనిపించింది రాజేష్ కు.”
  ఇది మాత్రం అక్షరాలా నిజం. ఆ క్షణం ఎంత హాయో!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. Krishh Raem says:

  ఒక్క సారి క్లాస్ లో మైండ్ డైవర్ట్ అయ్యిందో నిద్రా దేవి రెడీ గా ఉంటుంది !! ఇది ఎవరి కైనా కామన్ , కేవలం నిద్ర పోవడానికే కాలేజికొచ్చే శాల్తీలు కొన్ని ఎలాగూ ఉంటాయనుకోండి !!

  మొత్తానికి సూపర్ గా రాసారు !!

  @ ప్రసాద్ గారు
  “ముందు బెంచీ అమ్మాయిని వెనుక నుంచీ ఎంత బాగా గీయగలమో అభ్యాసం చేసే వాళ్ళం”
  ఇదేదో మంచి ఐడియా లా ఉందే .. దొరకనంత వరకూ సేఫే … రేపే ఇంప్లిమెంట్
  చేసేస్తా !!

 3. radhika says:

  ప్రయాణాన్ని కధ గా రాసినప్పుడే అనుకున్నాను మీరు గొప్ప రచయిత్రి అని.ఈ కధ కూడా బాగుంది.కానీ మధ్యలోనుండి కొద్దిగా బోర్ అనిపించింది. తీసుకున్న అంశం మాత్రం చాలా నచ్చింది నాకు.

 4. ఈ చీటీ లు అందించుకోవటాలు నేనే అనుకున్నా ఇన్కా ఉన్నరనమాట అలా చేసేవాళ్ళు.
  కొందరు అధ్యపకుల క్లాస్ అని తెలిసిందగ్గర్నుంచి ఆయన ఇవ్వాళ్టికిది చాలు అనేంతవరకు నిద్ర వదల్దు ఎందుకో.
  ఇన్క బటాణీలు తినటం, ఐస వాటర్ తో కళ్ళు కడుక్కోవటంలాంటి బాధలు పడినప్పుడు మనసులో తీవరం గా అనిపించేది నేను లెక్చరర్ ఐతే నిద్ర పోయే పిల్లల్ని ఏమి అనకూడదు అని:)

 5. విజయ says:

  నాకు కధ మొదలు పెట్టిన లైన్స్ బాగా నచ్చాయి.బోర్డ్ కుంచించుకు పోవడం,ప్రొఫెసర్ గారి ఆకారం మాయమవడం…నిజమే మన నిద్రా రాజ్యంలోకి వెళ్ళే ముందు..అనుభవం భలే ఉంటుంది.మొత్తానికి మీ ప్రయోగం బాగుంది.మద్యలో మాత్రం కొన్ని లైన్స్ రిపీట్ ఐనట్టు అనిపించాయి.

 6. కథ బాగుంది, స్కూలు, కాలేజీలలో కొన్ని సన్నివేశాలు గుర్తుకొచ్చాయి.
  కళ్ళు అలా మూసుకుపోతూండగా కిందకు చూడడం, ఏదో పడిపోయినట్టు కింద కి వంగి అలా కాసేపు కళ్ళు ముయ్యడం గుర్తొస్తున్నాయి.
  అప్పుడప్పుడూ ముందే లాస్ట్ బెంచ్ కి వెళ్ళిపోయి కునుకేసిన రోజులు కూడా ఉన్నాయి.

  ఇప్పుడయితే ఎంచగ్గా క్యూబ్ లోనే పడుకుంటా నిద్రొస్తే. :)

  అమ్మ చరసాల గారూ అమ్మాయిల బొమ్మలేసారా ? ఆహా…

 7. నమ్ముతారో నమ్మరో కానీ..మూడవ సెమిస్టరు నుండి ఆఖరు సెమిస్టరు వరకు…ప్రతి ఒక రోజూ క్లాసులో నిద్రపోయాను :(
  ఈ విషయంలో నాది గిన్నీస్ రికార్డేమోనని నా అనుమానం. ఇంటరు వరకు ఒక్కరోజు కూడా క్లాసులో నిద్రపోని నేను….రోజూ ఎందుకు నిద్రపోతున్నానా అని అనుమానం వచ్చేది…మన ట్యూబులైటు బుర్రకి కాలేజి అయిపోన తరువాత కారణం తెలిసింది. రోజూ రాత్రి ఒంటి గంటా రెండు గంటల వరకు హాస్టల్లో కబుర్లు చెప్పుకొంటూంటే…పొద్దున్నే 7:30 క్లాసులో నిద్ర రాకుండా ఎలా ఉంటుంది? అదీ కాక అందరూ చెత్త లెక్చరర్లే….వారు చెప్పేది పాఠంలాకాక సోదిలాఉంటుంది.

 8. సౌమ్యా, కథ చాలా బావుంది. నిద్ర ఆపుకోలేని విద్యార్థి మనసులో సంఘర్షణని బాగా పట్టుకున్నారు. నిద్ర ముంచుకొచ్చే లక్షణాల్లో ఇంకోటి -బహుశా మీకు అనుభవంలోకి రాలేదేమో – ఒక నిమిషం సీరియస్గా నోట్సు రాసుకుంటూ ఉంటాము. ప్రొఫెసరు గొంతు హాయిగా జోలపాటలాగా సాగుతుంటుంది. మరుక్షణం ఉలిక్కి పడి మెలకువ వచ్చేప్పటికి నోటుబుక్కులో నోట్సు కాదు, కోడి గీతలుంటాయి.

  మీరెవరూ అమెరికాలో బడికెళ్ళినట్టు లేదు. సాయంత్రం ఆరుకి మొదలెట్టి రాత్రి తొమ్మిదిదాకా ఒకటే లెక్చరు – ప్రొఫెసరుకి దయుంటే మధ్యలో ఒక పది నిమిషాలు విరామం ఇస్తాడు, లేకుంటే అదీ లేదు! క్లాసు మధ్యలో పది నిమిషాల పవర్ నాప్ అనే విషయమ్మీద PhD తీసుకున్నాను.

 9. సుధాకర్(శోధన) says:

  మాకయితే ఈ బాధే లేదు.ప్రొఫెసరు వచ్చే ఐదు నిమిషాల ముందే క్రికెట్ కిట్టు పట్టుకుని ఆంధ్రా యూనివర్సిటీ మైదానానికి మెల్లగా నడుచుకు పోయి రాత్రి ఎనిమిది వరకూ వుండి క్లాస్ అయిపోయే సమయానికి వచ్చే వాళ్లం. మా కాలేజీ సమయాలన్నీ కాస్త వెరైటీగా వుండేవి లెండి.

 10. అద్భుతం. మీ ప్రయోగం దివ్యంగా ఉంది. చాలా బాగా రాశారు. దీనికి మంచి స్క్రీన్‌ప్లే రాయొచ్చు.

 11. అదేమిటో తెలీదు కానీ మూడు సంవత్సరాలూ నేను భౌతిక్క శాస్త్ర మాల్యాద్రి సార్ క్లాసులో నిద్రపొయినాను.

  కొన్ని రోజులు ఆ మహానుబావుడు నన్ను మేల్కువతో ఉంచాలని రకరకాల ప్రయత్నాలు చేసి విఫలం చెంది వదిలేసి చివరకు ఎప్పుడన్నా నేను నిద్ర పోక పోతే వింతగా చూసేవాడు :)

 12. నేను చదువుకునేటప్పుడు కొన్ని క్లాసుల్లో అయితే భయంకరంగా నిద్రొచ్చేది. అందుకే నాక్లాసుల్లో పిల్లలు నిద్రపోతోంటే ఎక్కువ డిష్టర్బ్ చేయను. కానీ ఒక్కోసారి చెప్పాల్సి వస్తుంది. మాసార్లయితే మొహం కడుక్కురమ్మనేవారు. అదే పధ్ధతనిపించి ఒకఅమ్మాయిని అలాచేయమని చెప్పా. ఎంతకీ వెళ్ళదే. అప్పుడు ఇంకో పిల్ల జ్ఞానోదయం చేసింది- మేకప్ పోతుందని వెళ్ళట్లేదని. :)

 13. నేను ఇంటర్ లో ఉండగా, సైన్స్ కి ఒక సార్ వచ్చేవారు.
  ఆయన క్లాసు లో అందరూ నిద్రపొయ్యేవారు. ఆయన మట్టుకు ఇదేమీ పట్టనట్టు తన పాఠం తాను చెప్పుకుని వెళ్ళిపొయ్యేవాడు.
  ఇంతకీ, చాలా బాగా రాసారు. నాకు నా కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయ్ !!

 14. ఇలా కథలు వ్రాయాలని ఎప్పటి నుండో నా కోరిక. బాగుంది.

 15. తెలుగబ్బాయి says:

  అద్భుతం గా ఉందండీ.. కాకపోతే కధ లో మలుపు (prof చూడటం లాంటిదేమైనా) ఉంటుందేమో అనుకున్నా… :)

 16. వివినమూర్తి says:

  మీరు రాయగలరు. ప్రయత్నించండి.

 17. Sowmya says:

  అందరికీ ధన్యవాదాలు. ఏదో సరదాకి రాసిన కథ. అందరూ ఇంతగా ఆదరిస్తారు అనుకోలేదు. ఇంతకీ నాకో ఆలోచన వచ్చింది. తరగతి గదిలో సీరీస్ రాద్దామని :). పరీక్షలవగానే ప్రయత్నిస్తాను.

 18. Srinivas says:

  katha parvaledu kaanee prayogatmakam etlaa ayyimdo teliyaledu.

 19. Sowmya says:

  “ప్రయోగాత్మకం” అనడం లో నా ఉద్దేశ్యం “ఏ విషయం పైనైనా కథ రాయగలమా లేదా ” అని తెలుసుకునే ప్రయత్నం లో ఇది ఓ ప్రయోగం అని. ప్రయోగం లో మరో ప్రయోగం ఏమిటి అంటే – అనుకుందే తడువుగా, కథ మొదలెట్టి కథ సాగే కొద్దీ కథ గమనాన్ని నిశ్చయించుకోవడం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం. అలా రాసినా కూడా కథను readable గా ఉంచొచ్చు అని చెప్పాలని నా తాపత్రేయం. ఆ మధ్య ఒక స్నేహితులు నేను కథ అలా రాస్తా అంటే – “అలా రాస్తే ఎలా?” అని అన్నారు. ఇలా – అని చెబుదామని. :) కథ రాయడం లో negligent గా ఉంటే ఎలా ఉంటుండో ఈ కథ చూస్తే తెలుస్తుంది.

 20. రవికిరణ్ తిమ్మిరెడ్డి says:

  బావుందండీ సౌమ్య గారూ,

  పెద్ద, పెద్ద ప్రణాలికలూ, క్లిస్టవన చిత్రీకరణ, అనుకోని మలుపులూ, గొప్ప సందేశాలూ, వీటన్నిటిల్నీ వివరించడానికి పదుల సంఖ్యలో పేజీలూ, వాడాల్సిన భాషకోసం వారాల తరబడి ఆలోచనలూ ఇవన్నీ కథలకి అవసరం లేదని అనను. కానీ ఇవేవీ అవసరం లేకుండా, బ్రతుకులో సాధారణ సంఘటనలు, రోజువారీ విషయాలూ, అతి సామాన్యమైన, ఫలాని హీరోలకే కాకుండా, మనందరికీ కూడా అనుభవమైన విషయాలు కూడా చెప్పే విధంగా చెప్తే చక్కని కథ, ఒకటి, రెండు పేజీల్లోనే తయారవుతుందనే మీ అవగాహనకి, అలాగ కథ చెప్పగలిగిన మీ ఆత్మ విశ్వాసానికి నా అభినందనలు.

  రవికిరణ్ తిమ్మిరెడ్డి

 21. vinay chakravarthi says:

  theme baagundi same naku narration nachhala…………nadi same…..oka sari m.tech lo oka professor mistake(tanaki antaledu)cheste correct chesa ika noted manam…notes raayanu nenu just running notes…..derivations note chesukonu annamata……daily champedi ika……enduku raayavu ani…………..proxy attendance kooda cheppaleka poyevaru friends naku…….bunk kodadam anukunte…………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *