– త్రివిక్రమ్
ఈ కథలసంపుటిలో పాలగిరి విశ్వప్రసాద్ రాసిన పది కథలు, ఒక వ్యాసం ఉన్నాయి. ఈ పది కథల్లో స్త్రీ పురుష సంబంధాల్లోని భిన్న పార్శ్వాలను చూపే కథలు, ఆర్థిక సమస్యలు, మానవసంబంధాల్లోపలి ఆర్థిక సంబంధాలను విప్పి చూపే కథలు, మనుషుల ప్రవర్తన గురించిన కథలు , భూస్వామ్యభావజాలంతో నిండిన రాయలసీమ గ్రామాల్లో దళితులెలా అణగద్రొక్కబడుతున్నారో, క్రింది కులాలవాళ్ళను పైవాళ్లెలా తోలుబొమ్మల్లా ఆడిస్తున్నారో వివరించే కథలు ఉన్నాయి. అవే రాయలసీమ గ్రామస్థుల జీవితాల్లో ఫాక్షనిజమ్ ఎలా చీకట్లు నింపుతుందో చెప్పే కథ ఒకటైతే( కరువొచ్చె కక్షలూ వచ్చె) ఆ చీకట్లోనుంచి వేకువను సూచించే చుక్కపొడుపు చివరి కథ. వీటికి తోడు పుస్తకం చివర చేర్చిన వ్యాసంలో రాయలసీమలోని వర్గపోరాటాల (ఫాక్షనిజమ్) నిజస్వరూపాన్ని, చారిత్రక పరిణామాన్ని కూలంకషంగా వివరించడమేగాక సినిమాలతో సహా ప్రసార మాధ్యమాల్లో అది వికృతీకరించబడడం పట్ల ఆవేదనను వ్యక్తం చేస్తారు.
చాలా మంది రచయితల్లా ఈయన జీవితపు పైపై మెరుగులను వర్ణించి చెప్పడంతో తృప్తిపడలేదు. ఈ సమాజమిలా ఎందుకుంది? మనుషులింత అమానుషంగా ఎలా, ఎందుకు ప్రవర్తిస్తారు? అని ఒక ఆర్తితో, అశాంతితో ప్రశ్నించుకుని సమాధానంకోసం వెతుక్కునే ప్రయత్నంలో బయటపడిన కథలివి. ” ముసురు” అలాంటి ఒక కథ. ఈ కథలోని మతిస్థిమితం సరిగా లేని ఒక పిచ్చిదానిది కడుపుకాలే ఆకలి. అంతటి దయనీయ పరిస్థితుల్లో ఆమె చేత అసభ్యకరంగా డాన్స్ చేయించి వినోదించే యువకులకదో వినోదం. ఆమెను బెదిరించి, ఆపై అన్నం పెడతామని ఆశ చూపి వానలో తడిపించి, చలికి వణికించి, పైట తీయించి, అసభ్యనృత్యం చేయించి అన్నిరకాలుగా వినోదించి చివరకు ఆమెనోటి దగ్గరకు చేరిన అన్నాన్ని లాగేసి వాళ్ళు ఆమెతో ఆడిన చివరి ఆటను చూస్తూ ఆగ్రహించనివాడు మనిషి కాడు. ప్రథమపురుషలో సాగిన ఈ కథలోని కథకుడు ఆపుకోలేని ఆవేశంతో వారి రాక్షసానందానికి అడ్డుతగిలి ‘వాదన చేతకాకపోతే సత్యమూ, న్యాయమూ కూడా అసత్యమూ, అన్యాయమూ అయి కూర్చుంటాయ’నే చేదు నిజాన్ని, “అన్నం పరబ్రహ్మస్వరూపం. దాన్నందించేవాడు ఆకలి బతుకుతో ఏ రీతిగానైనా ఆడుకోవచ్చు. అదే నీతి, న్యాయం, హక్కు అయిపోయిన” లోకంతీరును కూడా తెలుసుకుంటాడు. కానీ సమాధానపడలేక అశాంతికి గురవుతాడు. అదే అతడి మనసులో అలముకుంటున్న ముసురు.
జబ్బుచేసిన తన కొడుకును సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి డబ్బుల్లేక కొడుకును పోగొట్టుకుంటాడొక తండ్రి చెదిరిన చిత్రం కథలో. ఐతే అంతకుముందే ఆ తండ్రి ఎస్కేపిజాన్ని చూపించడం వల్ల ఇదొక మూస కథయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుని వాస్తవికతను పోగొట్టుకోకుండా మంచికథైంది. “జ్వరమేం చేస్తుంది? అదే తగ్గిపోతుందని నాకు నమ్మకం. డబ్బులేమి ఆ నమ్మకాన్ని బలపరుస్తోంది.” కానీ ఆ డబ్బులేమిని బలపరిచేదేమిటి? తాను చిరుద్యోగేకానీ నిరుద్యోగైనా కాడే?
”దేవుడా! బాబుకు జ్వరం పోవాల.” అనుకున్నాడు. ఆపైన ఏదైనా మొక్కుబడి మొక్కుకోవడానికి భయపడ్డాడు. మొక్కుకున్నాక తీర్చుకోలేకపోతే? దేవుడి దగ్గరే ఈ భయం.
ఇంట్లో ఏమీ లేవని తెలిసీ ఉత్తచేతులూపుకుంటూ ఇంటికి వచ్చి, పలకని భార్యను “బాబు ఏమన్నా తిన్నాడా?” అని పలకరిస్తే..? ‘అగ్నిపర్వతం బద్దలవుతుంది. నాకు అహం దెబ్బ తింటుంది. ఆ పైన అది దెబ్బలు తింటుంది. ఎందుకొచ్చిన గొడవ, పిల్లవాడికి బాగలేనప్పుడు?’ అనుకునే ఉదారపురుషుడతడు. స్నేహితుడి దగ్గర బదులు తీసుకున్న డబ్బుతో పిల్లాణ్ణి ఆస్పత్రికి తీసుకుపోయినట్లైతే ఇంట్లో తిండిగింజలనుంచీ అన్ని అవసరాలూ అలాగే మిగిలిపోతాయి. అదే డాక్టరు దగ్గరకెళ్ళకుండా మందుల షాపులో మందులు తీసుకుంటే డాక్టరు ఫీజు మిగులుతుంది. తనకున్న కనీసావసరాల్లో ఒకటి రెండైనా ఆ మిగిలిన డబ్బుతో తీరుతాయి. చివరకా పనే చేసి, మిగిలిన చిల్లరతో సమస్యల చీకాకుల నుంచి తప్పించుకోవడానికి బూతుసినిమాకెళితే ఆ డబ్బును తనకు బదులుగా ఇచ్చిన తన మిత్రుడే అక్కడ కౌంటర్లో టికెట్లమ్మే పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ కనబడ్డం, ఐనా ఇతడు తనను తాను సమర్థించుకోవడానికి కారణాలు వెతుక్కోవడం…ఇవన్నీ సమస్యలనెదుర్కోలేని అతడి పలాయనవాదాన్ని ఎత్తిచూపడం వల్ల అతడి స్థితిగతులకు, చివరికి అతడి కొడుకు చనిపోవడానికి అసలు కారణం కూడా అదేనని చెప్పకనే మనకర్థమవువుతుంది. మిల్లులో తాను చేసే గుమాస్తా ఉద్యోగమే చేసే సారథి అవసరంలో తనకు డబ్బెలా ఇవ్వగలుగుతున్నాడు? తానేమో పూటగడవని స్థితిలో ఎందుకున్నాడని కూడా ఆలోచించక తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అందర్నీ తిడుతూ కూర్చునేరకం ఈ కథలోని ‘నేను’ పాత్ర. సారథి ఆచరణాత్మక దృక్పథం, అవసరంలో తోటివారికి సాయపడగల అతడి సామర్థ్యానికి, అవసరంకోసం ఇతరుల ముందు చెయ్యి చాపవలసి వచ్చే ఇతడి అసమర్థతకు మధ్యగల తేడాను బలంగా ఎత్తిచూపాడు రచయిత.
ఆర్థిక సమస్యలతో ముడిపడి ఉన్నదే ఇంకొక కథ మనిషి. జబ్బేమిటో తెలియని తన తండ్రి మూడు రోజులుగా శవం మాదిరే ఆసుపత్రిలో పడి ఉన్నాడు. తమ ఇంటిల్లిపాదీ “బతుకంతా పిండుకుని” మిగుల్చుకున్నది కాస్తా ఇక్కడ ఆవిరైపోతోంది. నూరేళ్ళు బతకవలసిన పిల్లలకోసం దాచిన శ్రమ ఫలితం కాటికి కాళ్ళు చాచిన తండ్రికోసం ఖర్చుచెయ్యవలసి వస్తోంది. జబ్బేమిటని నర్సమ్మనడిగితే ‘చదువుసంధ్యల్లేనోళ్ళక్కూడా జబ్బులపేర్లెందుకో?’ అన్నట్లు చూసి ఆమె పలక్కుండానే వెళ్ళిపోతే ‘ఆమెకైనా తెలుసోలేదో?’ అనుకున్నాడు రాంరెడ్డి. తండ్రి ఆరోగ్యం గురించి బెంగపడుతున్న రాంరెడ్డికి ‘బెంగ పెట్టుకోవద్దు’ అని మనుషులిచ్చే ఓదార్పు పనికిరాదు. డబ్బులొచ్చి ఆ మాట చెప్తేనే ఊరట. ఆ డబ్బులైనా ఆకాశం నుంచి రాలిపడి అనాలి. మరే రకంగా వచ్చినా డబ్బును మోసే శక్తి తనకు లేదు. ఒకవైపు నుంచి ‘ఈ ముసిలోడు తొందరగా చచ్చిపోతే బాగుండు’ అనే పాడు ఆలోచనలు కూడా వస్తూ ఉంటే అక్కడుండలేక బయటికొచ్చిన రాంరెడ్డికి బయటి రొచ్చు వాసనే ఆస్పత్రి వాసన కంటే మేలనిపించింది. కానీ కొన్ని క్షణాల్లోనే అసలు రొంపి – పేదరికపు వికృతస్వరూపం – నగ్నంగా అతడి కళ్ళబడేసరికి పెళ్ళీడుకొచ్చిన తన కూతుళ్ళిద్దరూ గుర్తొచ్చి మనసు వికలమై అతడు గదికి తిరిగొచ్చేసరికి అతడి కళ్ళబడిన ఒక చిన్న సంఘటన – వేలకు వేలు తీసుకుంటూ ఉన్నా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆసుపత్రి సిబ్బంది వల్ల జరిగిన ఆ ఘటన – అతడిలో కొత్త ఆలోచనకు కారణమవుతుంది. ఆ ఆలోచన, దాని మూలంగా అతడి మనసులో జరిగిన సంఘర్షణే ఈ మనిషి కథ.
కమ్మటి సువాసనలు వెదజల్లే కరివేపాకును ఇష్టపడని వారుండరు. అలాగే తినేటప్పుడు దాన్ని ఏరి పారేయనివారూ దాదాపు ఉండరు. నోరూ వాయీ లేని ఆ కరివేపాకు లాగే ప్రేమించిన మనిషినీ వాడుకుని వదిలేస్తే ఆ మనిషి ఆ కృతఘ్నతను, ఆ అవమానాన్ని ఎలా సహించగలుగుతుంది? పూర్వాశ్రమంలో తన ప్రియురాలు భర్తచాటు భార్యగా ఉన్నప్పుడు ఆమెతో ప్రేమాయణం అతడికదో థ్రిల్. పైగా తన అవసరాలకు ఆమే అప్పుడప్పుడూ డబ్బిచ్చి ఆదుకునేది. కానీ అతడి మూలానే తనను భర్త వదిలేస్తే ఆమె మనసంతా ఇతడినే నింపుకుని ఇతడి జ్ఞాపకాలతోనే బతుకుతోంది – అని స్పష్టంగా తెలిసీ ఆమెను తప్పించుకుని తిరగాలనుకోవడం, ఆమెను కలవడమే తనకు పరువుతక్కువనుకోవడం ఆమెను కరివేపాకును చెయ్యడమే. దానికామె అతడికిచ్చిన ఘాటైన సమాధానం చెళ్ళుమని తాకుతుంది. మనసును తాకే కథ.
“చీకటి మరీ చిక్కగా ఉంది.”
“అయినా బాగుంది. అటుచూడు – రంగు రంగుల దీపాల గుంపంతా ఆ నీళ్ళలో పడి చూడ్డనికెంత బాగుందో?” నేను వెలుగులో చీకటిని చూపిస్తే ఆమె చీకట్లో వెలుగును చూపిస్తోంది. (అయినా ఆ వెలుగును చూడక చీకట్లోనే ఉండిపోయేవాళ్ళను ఎవరు బాగుచెయ్యగలరు?)
“మార్పు నీలోనే కాదు నీ తెలివిలోనూ వచ్చింది.”
“పలికే నాలికుంటే పెదాలతో నవ్వుతావెందుకు?” లాంటి సంభాషణలు ఈ కథకు మరింత అందాన్నిచ్చాయి.
పాములు కథ స్త్రీ-పురుష సంబంధాల్లోనిమరో పార్శ్వాన్ని విప్పి చూపుతుంది. ఇందులో కల్పన చేయవలసి వచ్చిన పని చంద్రశేఖర్ కు తాను ఎరగా మారి అవినీతికి పాల్పడిన తన భర్త హోదా తగ్గకుండా చూడ్డం. ఈ పనికి భర్త తననెలా అడగగలిగినాడు? 1. ఆడది తానొక మనిషిననుకునే స్పృహ లేకుండా చేసిన మగజాతికి చెందినవాడు కావడం వల్ల తన హోదాను, ఆస్థులను పెంచుకోవడానికి ఒక పనిముట్టుగా ఆడదాన్ని వాడుకోవడం అతనికి తప్పుగా అనిపించలేదు. 2. తనకు ప్రత్యేక గుర్తింపునివ్వకపోయినా పెళ్ళైన నాటినుంచి పూర్తి ‘స్వేచ్ఛ’నివ్వడం ద్వారా. ‘నిజంగా తనకు స్వేచ్ఛనే ఇచ్చాడా లేక తననలా భ్రమింపజేశాడా’ అనే అనుమానం ఆమెకప్పుడే కలిగిందింది – ఆ స్వేచ్ఛనామె అన్నాళ్ళూ పరిమితికి మించి వాడుకోలేదుగాబట్టి. మరి ఈ పనికి తనెలా ఒప్పుకోగలిగింది? డబ్బుతో పొందగల విలాసాలు, హోదాల మీద ఆశ ఉండడం వల్ల. అంతే ఐతే కథేముంది? భర్త ఒకందుకు తనను నియోగిస్తే తాను తన జాణతనం ఉపయోగించి రెండు పనులు చక్కబెట్టింది. భర్త అందుకు మురిసిపోయి తనను ముద్దుల్తో ముంచెత్తినా ఆ క్షణంలోనే వాళ్ళిద్దరి మనసుల్లోఆలోచనలు రేగుతాయి. ఆ ఆలోచనల వేడిలో ఇద్దరి అంతరంగాలూ పాముల్లా చెలరేగి బుసలు కొడతాయి.
కథనం పలచబడిపోకుండా ఒక కథలో సైద్ధాంతిక చర్చ చేయడమెలాగో తెలుసుకోవడానికి ఒక పాఠ్యగ్రంథంగా నిలుస్తుంది బతుకుబండి అనే కథ. ఇందులోని సారథి పాత్ర ఉరుకులు పరుగుల్తో వచ్చి దాదర్ ఎక్స్‌ప్రెస్ లో ఎక్కినప్పటి నుంచి గుండెలదరగొట్టే దాదర్ ఎక్స్‌ప్రెస్ తో పోటీపడి సాగిన ఈ కథన సామర్థ్యం వల్లే 17 పేజీల ఈ కథలో ఎక్కడా ఉత్కంఠ ఇసుమంతైనా తగ్గకుండా కథను నడిపించగలిగాడు రచయిత. అప్పటివరకూ పట్టాల్లేకుండా సాగిన అతడి బతుకు బండి పట్టాలెక్కేసిందనుకుంటున్నసమయంలోనే ఘోరంగా పట్టాలు తప్పి పోయి అతడి మూడేళ్ళ కూతురు, ఐదేళ్ల కొడుకు ప్లాట్‌ఫారమ్మీద దిక్కులేని పక్షుల్లా నిలబడిపోతారు. మనుషుల్లోని అవకాశవాదాన్ని, తమ ప్రాణాలు కాపాడినవాడిని నేరస్థుడిగా భావించి పోలీసులు నిలదీస్తుంటే “నీకీ శాస్తి కావాల్సిందే!” అనుకునే వాళ్ళ అహాన్ని, పోలీసులతణ్ణి దోపిడీదొంగగా నిర్ధారించి లాక్కెళ్తుంటే అడ్డుకోవడం మాని “మనకెందుకు దోవనపోయే దరిద్రం” అనుకునేవాళ్ళ ఉదాసీనత కళ్ళక్కట్టినట్లు వివరిస్తాడు.
“చెప్పు కింది పూలు” కథలో గుమ్మయ్య అనే దళితుడు బళ్ళోని టీచరు తన కొడుకును గురించి “వానికి ఏం తెలివితేటలయ్యా! ఇట్టాటి పిల్లోన్ని నేను పంజేసిన కాడ యాడా జూడలే. వాన్ని తప్పకుండా పై చదువులు చదివించమని” అంటూండడంతో వాణ్ణి హైస్కూల్లో చేర్చి చదివించడానికి పుస్తకాలు, ఫీజులకని ప్రెసిడెంటును డబ్బడగబోతే ఆ ప్రెసిడెంటు వాళ్ళ ఇంటిల్లిపాదీకి నేర్పుగా ఉచ్చు బిగించి వాళ్ళను ఎలా తన చెప్పు కింది పూలుగా మార్చి నలిపేశాడో విప్పి చెప్పాడు. దానికి అవకాశమిచ్చిందీ ఒక రకంగా ఆ దళిత కుటుంబీకుల జీవనవిధానం, గుమ్మయ్య తాగుడు అలవాట్లే. కానీ ఆ విషయం వాళ్ళు గ్రహించరు. వాళ్ళ ఆ అజ్ఞానమే వాళ్ళను ప్రెసిడెంటు లాంటివాళ్ళకు బానిసలుగా మారుస్తోంది. తమను కొట్టినా, తిట్టినా అవసరానికి డబ్బిచ్చీ, వ్యవహర్తగా మారీ తమను ఆదుకున్నాడన్న విశ్వాసమే వారి తరాన్ని అతడికి విశ్వాసులుగా మారుస్తుంది.
ఇక తోలుబొమ్మలు కథ మద్యనిషేధం నేపథ్యంలో సాగుతుంది. ఇది తన కులస్థుల మీద తనకున్న పట్టు నిలుపుకోవాలనే ఆత్రంతో విధేయతలు మార్చిన ఒక కులపెద్ద కథ. అంతకాలమూ రాఘవరెడ్డి మనిషిగా తాను విధేయతతో మసలుకొన్నా ఆయనేమో తన మాట వినిపించుకోకుండా తనకు సరిపడని మనిషొకడిని పై ఊరినుంచి రప్పించి సారా కాయించడానికి సిద్ధపడేసరికి నన్నప్ప రాఘవరెడ్డి ప్రత్యర్థైన ప్రెసిడెంటు పంచన చేరుతాడు. రాయలసీమ పల్లె ప్రజల జీవితాలను సునిశితంగా పరిశీలించిన ఈ రచయిత ఆ జీవితాల్లోని మరిన్ని పార్శ్వాలను తన కథల్లో స్పృశించగలడని తప్పకుండా ఆశించవచ్చు.
విశ్వప్రసాద్ రాయలసీమ కక్షల గురించి రాసిన రెండు కథల్లో మొదటిది “కరువొచ్చె కక్షలూ వచ్చె“. పేరులో ఉన్నట్లే ఈ కథ రాయలసీమలో కరువుకు, కక్షలకు మధ్య గల కార్య-కారణ సంబంధాన్ని తెలిపే ప్రయత్నం చేస్తుంది. “కాలే కడుపు కారుణ్యమెరుగదు” అంటారు ప్రసిద్ధ రచయిత కేతు విశ్వనాథరెడ్డి. నోటి దాకా వచ్చిన పైరు ఎండిపోతూ ఉంటే ఏం చేసైనా సరే పైరును నిలుపుకోవాలనే ఆరాటంలో దాయాదుల మధ్య పగలు రగిలిన వైనాన్ని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఒక కథలో వివరించాడు. విశ్వప్రసాద్ రాసిన ఈ కథలో “ఒక దిక్కు వానరాక పైరు ఎండిపోతాంటే ఉండే రోంత పైరునూ ఊళోళ్ళ పశువులు మేసి పోతాంటే ఎవరికైనా కడుపు కాల్తాది మల్ల.” ఆ కడుపు మంటే పాతపగలన్నిటినీ గుర్తుకు తెచ్చి పగల సెగలు రేపింది. ‘ మనుసులకు తిండెట్లా లేదు – ఉండే పసల మేతనన్నా కాపాడుకుందాం.’ అని మాట్లాడుకోవడానికొచ్చి అసలిది విడిచిపెట్టి ఆవేశాల్లో పడిరి.” “ఏదేమన్నా గానీ, మనం వొంగిపోగూడదు.అవతలోళ్ళను నాశనం చెయ్యాల. మనం చచ్చినా సమాధానమే.” అనుకుంటారు అక్కసుగా, పౌరుషంగా. ఫలితంగా “ఊరు వల్లకాడైపోయినట్లాయె”. మనుషులకు తిండిలేకఛస్తూంటే ప్రభుత్వమేం చేస్తోంది? అనే ప్రశ్నకు సమాధానమిలా ఇస్తాడు:” మన బతుకు మనం బతకడానికే పెద్ద పోరాటమైతాంది. ఇంగ ప్రభుత్వాలతో ఏం పోరాడ్తం? ఏం ఉద్యమాలు చేస్తం? మనకా స్తోమత లేదు. ఓట్లేయడానికి తప్పనిచ్చి దేనికీ పనికిరానోల్లం. మన్లో మనం కొట్టుకుంటా ఎట్లైనా రెండు పార్టీలకు చెరిసగం ఓట్లేస్తాం. అందుకే మనకు సాయం చెయ్యకపోయినా ఈ గవుర్మెంటుకు వొచ్చే నష్టమేం ఉండదు… కాబట్టి సాయం చెయ్యరు. ” అసలు ఇలాంటి కక్షలు ఇక్కడే ఎందుకున్నాయి? అనే ప్రశ్నకు ఈ కథలో “అనాదిగా ఈడ కక్షలుండయ్. అనాదిగా ఈడ కరువులుండయ్. కరువులకు, కక్షలకు కానరాని సంబంధముందేమో! చేయడానికి ఏం పన్లేక, ఆలోచించే ఇంగితం లేక తన అసహనాన్ని అణుచుకుండేదెట్లనో తెలియక కక్షల దిక్కు మళ్ళినాడేమో?” అని సమాధానమిచ్చినా ఈ పుస్తకం చివర చేర్చిన వ్యాసంలో విస్పష్టమైన, వివరణాత్మకమైన సమాధానమిస్తాడు.
“ఇక వీళ్ళ బతుకులిట్లా కాలిపోవలసిందేనా?” అనే ప్రశ్నకు సమాధానమే “చుక్కపొడిచింది” అనే కథ. గ్రామపార్టీలు ఒక చారిత్రక దశగా 1980ల నాటికే ఒక ముగింపుకొచ్చింది. నాటి శకలాలు ఇంకా అక్కడక్కడా ఉన్న మాట వాస్తవమే అయినా అవి కూడా పూర్తిగా సమసిపోయే దిశలో ఉన్నాయి. ఇప్పటి పొలిటికల్ ఫాక్షనిజంతో మమేకమై వికృతరూపంలో అప్పుడప్పుడూ బయటపడుతున్నాయి. ఇదే కథలో గ్రామపార్టీల్లో మునిగితేలుతున్న కుటుంబంలోకొచ్చిన కొత్త కోడలి అనుభవం ఆమె మాటల్లోనే “ఆత్మీయతలకు మాత్రం కొదవలేదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో లేని ఆపేక్షలు తనను ఉక్కిరిబిక్కిరి చేసేవి… తనను నెత్తిన బెట్టుకున్నంత పని చేసినారు.” ఐతే తన మామగారిని చంపిన వారిపై పెట్టిన కేసును జిల్లాకోర్టు కొట్టేసినప్పుడు తన అత్తగారు, మరిది “హైకోర్టుకు పోవడం ఖర్చులు దండగని” వారించడం ఎందుకో ప్రత్యర్థి ఖూనీ అయినప్పుడుగానీ ఆమెకు అర్థం కాలేదు. అవతలి వాడ్ని తన కొడుకులు ఖూనీ చేసినందుకు తన అత్తగారు తృప్తిపడ్డం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. తన మేనత్తను గుర్తు చేసుకుని “భర్తను చంపినవాణ్ణి చంపడానికి మానాన్నీ, ప్రాణాన్నీ ఎరగా వేసేంత ఉన్మాదమేంది?” అనుకొంది. “చంపినా చంపబడినా సాధించేదేం లేదు. ఎటుతిరిగినా ఓడిపోయే ఈ బతుకు నాకూ, నా పిల్లోళ్ళకూ వద్దు. కాలికి కత్తికట్టి నీ కొడుకులను నువ్వు బరిలోకి దించుతావేమో గానీ నా పిల్లోళ్ళను ఈ ఓడిపోయే పోరాటంలోకి దించను గాక దించను.” అని తన అత్తగారికి తెగేసి చెప్పింది. అప్పటికి “తూర్పున వేగుచుక్క పొడిచి దేదీప్యంగా మెరుస్తోంది”. అని సింబాలిక్ గా ముగుస్తుంది ఈ ఆఖరి కథ.
ఇక ఈ కథల్లో వాడిన భాష “ముతకముతగ్గా, ముట్టుకుంటే చేతులు గీరుకుపోయే మొనదేరిన నాపరాళ్ళ మాదిరి గరుగ్గా ఉంటుంది. కరుగ్గా వినిపిస్తుంది.” రచయిత తాను విన్నవాటినీ, కన్నవాటినీ యథాతథంగా రికార్డు చేయాలనుకోవడం ఒకటి రెండు కథల్లో లోపంగా కనిపిస్తుంది. గుమ్మయ్య ప్రెసిడెంటును ఐదువేలు కావాలని అడిగితే ఆయన “రూపాయలేనా? ఎర్రగుంట్లకు బొయి బాంకును కొడ్దాం పా! నాగ్గుడా అక్కరుండాది.” అని సెతురు పలికినప్పుడు, తలమీద దెబ్బపడిన గుమ్మయ్య భార్య “ఈని తలపండు పగలా! సంపినాడ్రో” అని అరిచినప్పుడు వాడుకున్నంత సహజంగా కడప ప్రాంత వ్యావహారిక భాషను అదే కథలో గుమ్మయ్య చెల్లెలి గురించి చెప్పేటప్పుడు, ముసురు కథలో ‘ఎర్రిదాన్ని’ గురించి చెప్పేటప్పుడు వాడుకోవడానికి ప్రయత్నించడంలో రచయిత తప్పటడుగు వేశాడేమోననిపిస్తుంది. అక్కడి భాష, భావం సహజమైనవే అయినా వాటిని కథలో రాసేటప్పుడు కాస్త నిగ్రహం పాటిస్తే బాగుండుననిపిస్తుంది.
గతంలో రాతిపూలు అనే విశిష్టకథల సంపుటి ప్రచురించిన నేత్రం ప్రచురణ సంస్థ తమ సాహితీత్రైమాసిక పత్రిక పున:ప్రారంభమైన తర్వాత ప్రచురించిన తొలి కథల సంపుటి ఈ చుక్కపొడిచింది. సీరియస్ సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన ఈ పుస్తకం ప్రతుల కోసం సంప్రదించవలసిన చిరునామా:
పి. పార్వతి 12/152, స్టేట్ బ్యాంక్ కాలనీ కడప – 516002
ఫోన్: (+91) 9849998034
తప్పక చదవాల్సిన పుస్తకంలా వుంది. “…నాగ్గూడా అక్కరుండాది” ఇలాంటి ఎగతాళిమాటలు అవసరంలో వున్నవాణ్ణి అక్కడే సగం చంపుతాయి. చెప్పితీరవలసిన మాట – సమీక్ష అద్భుతంగా రాశారు. “రచయిత తాను విన్నవాటినీ, కన్నవాటినీ యథాతథంగా రికార్డు చేయాలనుకోవడం ఒకటి రెండు కథల్లో లోపంగా కనిపిస్తుంది.” అన్నారు, నేనీ కథల్ని చదివిగానీ ఒప్పుకోను.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారిని భలే గుర్తుచేశారు. మహానుభావుడు. ఈయన రాసిన ‘దిగంబరం’ అనే కథలోని విషయం – ఒక ప్పుడు బాగా బతికిన కుటుంబం ఇప్పుడు కడు పేదరికంలో వున్నా, పాతరోజుల ప్రాభవాన్ని విడిచి కూలికెళ్లాల్సిన పరిస్థితిలో కడుపులు మాడ్చుకుంటున్నా, వయసుముదురుతున్న చెల్లెలి పెళ్లి చేయలేకున్నా కూడా ఆ కుటుంబపెద్ద ‘తగ్గి బతకడం పరువు తక్కువ’ని భావించడం, ఎదుగుతున్న అతని కూతురు ఆ పరిస్థితిలో వాస్తవంలో జీవించమని తన తండ్రికెదురుచెప్పలేక పడే అంతర్మథనం. ఆ కథ, దానికి ఆయన పెట్టిన పేరు మన చుట్టూ వున్న ఎన్నో రైతుకుటుంబాల జీవితాలకు దర్పణం. నా ప్రాంతపు పల్లె భాషలో ‘బిత్తలిసంబడం’. ఆకాశవాణి కడప కేంద్రంలో ఈ కథను అద్భుతంగా చదివాడు ఒక మహానుభావుడు (పేరు జనార్థనరెడ్డి అనుకుంటా). ఆ సమాజంలోనే పెరగడం వల్లకాబోలు ఆ సన్నివేశాలు, ఆ సంఘర్శణ, ఆ కథ మరపురాదు.
చక్కని సమీక్ష. ఇక నేనాగలేను. వెంటనే తెప్పించుకొని చదవాల్సిందే!
–ప్రసాద్
http://blog.charasala.com
ఈరోజేచూశాను.బాగుంది.
దార్ల వెంకటేశ్వరరావు
హైదరాబాదు
Pingback: సాహిత్య నేత్రం » The Dawn