మీరు మీ రచనలు పత్రికలకి ఎందుకు పంపరు అనెవరో అడిగితే, దానికి సమాధానంగా “ఒక రచన ఉద్దిష్ట పరిపూర్ణత సాధించ గలిగిందనిపించినపుడు తప్పకుండా వాటిని బయటకు పంపిస్తాను. ఇక్కడ పోలిక ఇతరుల రచనలకూ నా రచనలకూ కాదు; నే రాయగలిగిన స్థాయికీ నేను రాసిన స్థాయికీ” అన్న మాటలు విన్నప్పుడు నా హృదయం ఉప్పొంగుతుంది. తన గమ్యమేమిటో తెలిసిన మనుషులెంత మందుంటారీ విశాలవిశ్వంలో?
అశోక సినిమాలో, ఒక సన్నివేశం గుర్తుకు వస్తోంది ఈ సందర్భంలో. ఒక బౌద్ధ భిక్షువు మారు వేషంలో ఉన్న అశోకుడితో “నీ భాగ్యం చాలా గొప్పది” అంటాడు. “అయితే చక్రవర్తినవుతానంటావా” అంటాడు ఆశగా అశోకుడు. “నీ భాగ్యం చక్రవర్తికన్నా గొప్పది” అన్న సమాధానం వినగానే అశోకుడు ఆశ్చర్యంగా “చక్రవర్తి అవటం కన్నా గొప్ప భాగ్యం ఏమిటి?” అనడగుతాడు. “ఎవరైతే తన యాత్రని పరిపూర్తి చెయ్యగలగుతాడో ఆ యాత్రికుడిది” అంటాడా సన్యాసి. తన గమ్యమేమిటో, దాన్ని చేరుకోటానికి చేయవలసిన ప్రయత్నమేమిటో, అందులోని సాధకబాధకాలేమిటో పూర్తిగా ఎరిగిన భాగ్యశాలి ఫణీంద్ర కుమార్. ఓ పది సంవత్సరాల తర్వాత మనమంతా – “ఓ ఆయనా – ఒకప్పుడు వారు మా తోటి బ్లాగరే” అనే రోజు తప్పకవస్తుంది. ఒక సుప్రసిద్ధుడైన రచయిత బ్లాగు మొదలెట్టటం కంటే, ఒక తోటి బ్లాగరు సుప్రసిధ్ధుడవటమే కదా కాంక్షించవలసింది?
ఒక టపాలో ఫణీంద్రగారి అమ్మగారు “నువ్వు ఇల్లువదిలి వెళ్ళిందగ్గరనుంచీ నీ జీవితంలో జరిగిన సంగతులు, నువ్వు చదివిన పుస్తకాల గురించి రాస్తే చాలా బావుంటుందిరా. నువ్వు మనసు పెట్టి రాస్తే చాలా బాగా రాయగలవు” అన్నారు. ఒకపక్క ఉత్సాహాన్ని నింపుతూ ఉత్తేజపరుస్తూ, మరోపక్క ప్రేమ, అభ్యర్థనా సమ్మిళితమైన ఆ మాతృమూర్తి ఆశీస్సులు ఫలించకేం చేస్తాయి? ఫణీంద్రకుమార్ ఎంతో బాగా రాయగలరన్నది ఇప్పుడు నిర్వివాదాంశం. ఏది రాసినా పూర్తిగా మనసు పెట్టి రాస్తారని కూడ రుజువు చేసుకొన్నారు. ఇకపోతే మిగిలిందల్లా తరచుగా రాయటమే.
కలంకలలు రోజుకో వెయ్యిపూలు విరగబూసే విరజాజి పందిరి కాలేదు, కానక్కరలేదు కాని – సంవత్సరానికోసారి మాత్రమే, ఎక్కడో ఎవరికీ అందనంత ఎత్తున హిమవన్నగసానువుల్లో, వసంతాన్ని పులకింపచేసే రోడోడెండ్రన్ మాదిరి కాకుండా, వారానికోసారి పూచే పెర్షియన్ గులాబీ మొక్కగానైనా ఉండాలని, ఈ బ్లాగుని ఎంతగానో అభిమానించే నాలాటి పాఠకుల కోరిక, అభ్యర్థనతో కూడిన అనుశాసనమూనూ.
|<మొదటి పేజీ — <<ముందు పేజీ
13 Responses to కలంకలల ఘలం ఘలలు