నేనెఱిగిన విశ్వనాథ

<<                                                     మూడవ పేజీ

వశిష్ఠుడు రామునికి యోగ రహస్యాలని బోధించి కొంత ఉపశమనం కలిగిస్తాడు. అయినా రామునిలోని వైరాగ్యం అతన్ని వెంటాడుతునే ఉంటుంది. చివరికి సీతాదేవి స్వయంగా అతన్ని నిలదీస్తుంది. కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్ళతో రాముని కన్నీళ్ళు కలిసిపోతాయి. ఈ సన్నివేశమంతా చాలా రసార్ద్రంగా సాగుతుంది.

ఆఖరికి రాముడిలో కూడా యీ వేదన కనిపిస్తుంది. రాముడు మాయామానుష స్వరూపుడంటారు. అంటే తాను అవతార స్వరూపుడన్న జ్ఞానం తనకి లేదు. అందుకే అతను మానవ సహజమైన వేదనకి అతీతుడు కాడు. అదే రామాయణాన్ని రసవత్తర కావ్యంగా మార్చింది. అరణ్యవాసంలో ఏ రాక్షసుణ్ణి సంహరించినా అతను వారి గురించి ఆవేదన చెందుతూనే ఉంటాడు, ఎందుకీ రాక్షసులు మూర్ఖులై యిలా తమ చావుని తాము కొనితెచ్చుకుంటున్నారని.

అమ్మా! దేహమనన్ విచిత్రమగు దుఃఖారామ మంపించు దే
హమ్మున్నంతన జీవి పొందనగు బాధా సహ్యతల్ చెప్ప శ
క్యమ్మా? యొక్కొక జీవి యొక్కొక విధంబై పొందు దుఃఖమ్ము, రా
జ్యమ్మో! రాణియొ, కాననంబొ, ఋషి భార్యారత్నమో చెప్పగన్

రాముడు కౌసల్యతో అనే మాటలివి. ఇది రామునిలోని జీవుని వేదన. కల్యాణమైన కొన్నాళ్ళకి ఏదో విచిత్రమైన వైరాగ్యం, దుఃఖం రాముని మనస్సుని ఆక్రమిస్తుంది.

“స్వామీ! ప్రాణముకంటె ప్రాణము ధరాజాతా ముఖాంభోజమే
ఏమోగా కనిపించు, లోయెడదలో నింకున్ సమస్తావనీ
స్వామీత్వాధిక భావనా విషయ వాంఛాపూర్ణ వేశంతముల్
తా మండించెడు గ్రీష్మ మెచ్చటిది! తాతా! నన్ను మన్నింపవే”

అని వెళ్ళి వశిష్ఠునితో మొరపెట్టుకుంటాడు. వశిష్ఠుడు రామునికి యోగ రహస్యాలని బోధించి కొంత ఉపశమనం కలిగిస్తాడు. అయినా రాముని లోని వైరాగ్యం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. చివరికి సీతాదేవి స్వయంగా అతన్ని నిలదీస్తుంది. కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఆ కన్నీళ్ళతో రాముని కన్నీళ్ళు కలిసిపోతాయి. ఈ సన్నివేశమంతా చాలా రసార్ద్రంగా సాగుతుంది.

అని బాష్ప స్నపితాక్షిగల్లయును గాంతాకార దుఃఖంబునై
చను సీతం గని, రామచంద్రుడును బాష్పంబుల్ సుధా రమ్య వా
హినిగా మిశ్రిత శోకమోదవినయహ్రీ రుద్ధ కంఠుండు చా
చిన బాహా జటలన్ గ్రహించికొనియెన్ సీతా వియద్వాహినిన్

సీత కన్నులు కన్నీళ్ళతో నిండిపోయాయి. స్త్రీరూపం దాల్చిన దుఃఖంలా ఉన్న ఆ సీతని చూసి రామునికి కూడా కన్నీళ్ళు ఉబికాయి. అవి సుధా రమ్యంగా ఉన్నాయి, ఎందుకంటే అవి అంత స్వచ్ఛమైనవి కాబట్టి. దుఃఖము, ఆనందము, వినయము, లజ్జ ఇవన్నీ కలగలిసి పొంగుకొచ్చి గొంతు గద్గదమైపోయింది. కన్నీళ్ళలో ములిగిపోయిన సీత ఆకాశగంగలా ఉంది. ఆ గంగని, చాచిన తన చేతులనే జడలతో తనలోకి తీసుకున్నాడట ఆ రాముడు!

రాముడు తన వైరాగ్యం నుండి తేరుకొని, ఆమెతో అంటాడు:

శ్రీవశిష్ఠర్షి సాక్షిగా చెప్పుచుంటి
నస్వతంత్రమ్మయైన దేహమ్ము నందు
నౌనొ కాదొ వచింపగ లేను కాని
యాత్మ నిన్ను నిత్యంబుగా హత్తుకొందు

స్వేచ్ఛ లేని యీ దేహం సంగతి చెప్పలేనుకాని, ఆత్మలో నిన్ను నిత్యమూ హత్తుకొనే ఉంటానన్న రాముని మాటల్లో అద్వైత భావం ఎంతగా దేదీప్యమానమవుతోందో గమనించండి! అంతగా ఒకరికొకరు ఊరడిల్లినా, ఏదో తెలియని ఒకానొక భీతి, భవిష్యత్తులో కలిగే వియోగాన్ని సూచిస్తూ సీతారాముల మనసులని వెన్నాడుతూనే ఉందట.

హత్తిన ప్రీతి యిర్వురకు నాత్మలయం దెడబాటు భీతికిన్
గత్తళమై భజించియు నొకానొక దూర వియోగరేఖలో
నొత్తిన యట్లు తోచిన ముహుర్ముహురావృత గాఢ కాములై
చిత్తములం దొకళ్ళొకరు చేరగనీరు విరామ భావమున్

దూరంగా కనిపించే ఒకానొక వియోగ రేఖకి ఆత్మలో భయమున్నా, మళ్ళీ మళ్ళీ గాఢమైన అనురాగంతో ఒకళ్ళనొకళ్ళు సముదాయించుకుంటూ, మనసుల్లో విరామ భావనాన్ని చేరనివ్వకుండా రోజులు గడిపారట. ఆ తర్వాత అరణ్యవాసంలో ఆ ఎడబాటు కలగనే కలుగుతుంది. ఆ తర్వాత సీత కోసం రాముడు పొందిన ఆవేదనే కథని నడిపిస్తుంది. రాముడు జీవాత్మ అయితే, సీత పరమాత్మ. ఆ పరమాత్మకి దూరమై జీవుడు పొందిన ఆవేదనే రామాయణ కావ్యమయింది.

తనలోని జీవుని వేదనని శాంతింప చేసుకోనే ఆశయంతోనే కవితారూప తపస్సుచేసి, రామాయణాన్ని అద్వైత మత ప్రాతిపదికగా శాంత రస ప్రధానంగా సృజించారు విశ్వనాథ. తద్వారా రససిద్ధి పొందారు.

విశ్వనాథలోని యీ వేదనని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే అతని కవిత్వాన్ని లోతుగా అనుభవించగలం, ఆ అనుభూతిలో మనమూ మమైకమవ్వగలం.

దానికి యీ వ్యాసం ఏ కొంతైనా తోడ్పడుతుందని ఆశిస్తాను. ఇది విశ్వనాథ సాహిత్యాన్ని గురించి నిష్పక్షపాతమైన విమర్శా కాదు, సమగ్రమైన పరిచయమూ కాదు. కేవలం నేనెఱిగిన విశ్వనాథ కవిత్వాన్ని గురించి కొద్దిపాటి వివరణ మాత్రమే. ఎప్పుడైనా కవిత్వంలోని గొప్పదనం తెలియాలంటే, దాన్ని స్వయంగా చదివి, అర్థం చేసికొని, అనుభవించవలసిందే!

…దవ్వు పిల్లనగ్రోవి రవము
ప్రాకి పసిత్రాచు పిల్లలు దూకినట్లు,
జల్లుపడినప్డు పరుపైన రాళ్ళ మీద
వెండి నీళ్ళులు జలజల వెడలినట్లు,
నీల మధుమూర్తి గుండెలో నిండినపుడు
యోగి చెక్కిళ్ళ కన్నీళ్ళు సాగినట్లు,
నవ్వుచును పసివాడు స్తన్యంబు గ్రోలు
చమ్మ మొగమును చూచుచో నార విడుచు
సెలవులందున క్షీరమ్ము చిందినట్లు,
ఉపనిషద్దేవి ప్రక్కల కొరిగి నవ్వి
నట్లు, వేదముల్ గలగల లాడినట్లు…

మురళీ గానాన్ని వర్ణిస్తూ విశ్వనాథవారు రాసిన పద్యం యిది. చిన్న త్రాచు పిల్లలు దూకినట్లుగా, వానజల్లు పడినపుడు నున్నని రాళ్ళపై ఆ చినుకుల ధార జలజలా పారినట్లుగా, తాను ఆరాధిస్తున్న స్వామి తన గుండెలో నిండినపుడు ఉబికిన కన్నీళ్ళు యోగి చెంపలపై సాగినట్లుగా, నవ్వుతూ చనుబాలు తాగే పసివాడు మధ్యలో అమ్మని చూసినప్పుడు పాల బొట్లు చిందినట్లుగా, ఉపనిషత్ దేవి కాస్త పక్కకి ఒరిగి చిరునవ్వు నవ్వినట్లుగా, వేదాలు గలగలమన్నట్టుగా…
అలా ఉందట ఆ వేణు రవం.

కృష్ణశాస్త్రి వేణునాదం తీయనిదైతే విశ్వనాథది కడు విచిత్రమైనది. అతని కవిత్వమూ అంతే!

************************************

విశ్వనాథ సత్యనారాయణ

విశ్వనాథ రచనలు:

పద్య/గేయ కావ్యాలు

1. కోకిలమ్మ పెళ్ళి
2. కిన్నెరసాని పాటలు
3. పాము పాట
4. మ్రోయు తుమ్మెద
5. గిరికుమారుని ప్రేమ గీతాలు
6. సౌభద్రుని ప్రణయ యాత్ర
7. ఆంధ్ర పౌరుషం
8. ఆంధ్ర ప్రశస్తి (http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0004/311&first=1&last=76&barcode=2020120004308)
9. తెలుగు ఋతువులు
10. భ్రష్ట యోగి
11. మూగ నోము
12. శశి దూతం
13. బద్దన సేనాని
14. శాక్య ముని
15. రెండు నక్షత్రాలు
16. శృంగార వీథి
17. గోపికా గీతలు
18. భ్రమర గీతలు
19. శ్రీకృష్ణ సంగీతము
20. ప్రద్యుమ్నోదయము
21. శ్రీ కుమారాభ్యుదయము
22. ఝాన్సీ రాణి
23. శివార్పణము
24. విశ్వనాథ మధ్యాక్కరలు (పది శతకాలు)
25. మా స్వామి (విశ్వేశ్వర శతకము)
26. వరలక్ష్మీ త్రిశతి
27. విశ్వనాథ పంచశతి
28. రామాయణ కల్పవృక్షము
29. నా రాముడు
30. రురుచరిత్రము

తెలుగు నాటకాలు

1. నర్తనశాల
2. అనార్కలీ
3. వేనరాజు
4. త్రిశూలము
5. ధన్య కైలాసము
6. తల్లిలేని పిల్ల
7. అంతా నాటకమే
8. ప్రవాహము
9. సత్యాగ్రహము
10. లోపల – బయట
11. అవతార పరివర్తనము
12. ఆకాశరాజు
13. భస్మాసుర చయనము
14. కావ్య – వేద హరిశ్చంద్రములు
15. సౌప్తిక ప్రళయము

సంస్కృత రచనలు

1. అమృత శర్మిష్ఠము (నాటకం)
2. గుప్త పాశుపతం (నాటకం)
3. దేవీ త్రిశతి
4. శివ సహస్రము

నవలలు

1. తెఱచి రాజు
2. మా బాబు
3. బాణావతి
4. కడిమి చెట్టు
5. వీర పూజ
6. ధర్మ చక్రం
7. సముద్రపు దిబ్బ
8. బాణామతి
9. స్నేహఫలము
10. చందొవొలు రాణి
11. లలితాపట్టణపు రాణి
12. శార్వరినుండి శార్వరి దాకా
13. దిండుకింద పోకచెక్క
14. నందిగ్రామ రాజ్యం
15. విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
16. ఏకవీర
17. హాహా హూహూ
18. వీరవల్లుడు
19. స్వర్గానికి నిచ్చెనలు
20. జేబుదొంగలు
21. పరీక్ష
22. ఆరు నదులు
23. పునర్జన్మ
24. దమయంతీ స్వయంవరము
25. వల్లభ మంత్రి (http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0068/859&first=1&last=226&barcode=2990100068854)
26. అంతరాత్మ
27. పాతిపెట్టిన నాణెములు
28. భ్రమర వాసిని
29. చెలియలి కట్ట
30. వేయిపడగలు
31. ఆత్మ కథ
32. పులి ముగ్గు
33. …మొత్తం అతని నవలలు 34 అని అంటారు. అవి కాక,
34. పురాణవైర గ్రంథమాల (12 నవలలు)
35. కాశ్మీర రాజ చరిత్ర నవలలు (6 నవలలు)
36. నేపాళ రాజ చరిత్ర నవలలు (6 నవలలు)

కథలు

24 కథలు, అందులో కొన్ని

1. య్యో-ర్హిషిఖెయ్
2. చామర గ్రాహిణి
3. మాక్లీ దుర్గంలో కుక్క
4. రాజు
5. పరిపూర్తి
6. తిరోధానము
7. ముగ్గురు బిచ్చగాళ్ళు
8. కపర్ది
9. ఇంకొక విధము
10. సప్తాశ్వము
11. ఉరి
12. కాళిదాసు అపకీర్తి
13. ఆద్యంతములు
14. దొరగారు – దివాంజి
15. ఏమి సంబంధము
16. నా ఋణం తీర్చుకున్నా
17. పుణ్య ప్రేమము
18. జీవుడి ఇష్టము
19. అల్లాహ్ కే ఫకీర్
20. వియోగిని

విమర్శ రచనలు

1. నన్నయ్య ప్రసన్న కథా కలితార్థయుక్తి
2. అల్లసానివాని అల్లిక జిగిబిగి
3. ఒకడు నాచన సోమన
4. శాకుంతలముయొక్క అభిజ్ఞానత
5. సాహిత్య సురభి
6. కావ్యానందము (సాహిత్య మీమాంస)
7. కావ్య పరీమళము
8. కల్పవృక్ష రహస్యములు

సంపాదకత్వం నిర్వహించిన పుస్తకాలు

1. ఆంధ్ర క్రియా సర్వస్వ మణి దీపిక
2. తెలుగు సామెతలు
3. గద్య చంద్రిక

ఇవి కాక ముద్రిత అముద్రిత పద్య ఖండికలు, కథలు, వ్యాసాలు, పీఠికలు అనేకం ఉన్నాయి!

———–

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. రాయగల శక్తి ఉన్నవారు కూడాను. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగును ఇటీవలే మొదలుపెట్టి ప్రఖ్యాతి గాంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.

About భైరవభట్ల కామేశ్వరరావు

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగులో ప్రసిద్ధి చెంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

14 Responses to నేనెఱిగిన విశ్వనాథ

Comments are closed.