నేనెఱిగిన విశ్వనాథ

<<                                                  రెండవ పేజీ                                                     >>

ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పద్యాన్ని చదివి శూర్పణఖ రూపాన్ని ఊహించుకోడానికి ప్రయత్నించండి. రసాభాసని యింత అద్భుతంగా ఒక పద్యంలో నిర్వహించడం అసామాన్యం! మనం ఎంత దూరం ఆలోచించినా అంతకు బారెడు దూరాన ఉంటుంది విశ్వనాథ ఊహ.

అయితే, విశ్వనాథ చేసిన కవితా యాత్ర చాలా విచిత్రమైనది! భావ కవిత్వంతో మొదలైన అతని ప్రస్థానం, ఆంధ్ర జాతీయతతో పదునెక్కి, శిల్పసుందరమైన నాటకాలతో ప్రౌఢత్వాన్ని సంతరించుకొని, ఒక వంక గాఢమైన ఆత్మానుభూతి, మరో వంక అనన్యమైన అద్భుత కల్పనా శక్తి, రెండు పాయలుగా సాగి, ఈ గుణాలన్నీ అతని “సకలోహవైభవ సనాథ”మైన రామాయణ కల్పవృక్షమనే సాగరంలో విలీనమయ్యాయి.

కన్నెకాటుక కళ్ళు – చిన్ని నాథుని చూచి

కదలులాడిన వేళ – కందళించిన వేళ

ఆకాశమధ్యాన – అటనొక తెలిమబ్బు

మెరుపులా మెరిసిందిలే – వెలుగులో వొరిసిందిలే

తొలిచిన్ని చూలాలు – కొలసిగ్గు ప్రేమతో

విభుని చూచినవేళ – విన్నబోయిన వేళ

బఱపు విన్నులలోన – ఒక నీటి తెరమబ్బు

సంజలో తారిందిలే – జాలుగా మారిందిలే

తొలికాన్పు పసిపాప – సాకనేరని బాల

తెలవోయి పతిజూచి – కళవళించిన వేళ

తూరుపు కోనలో – తొంగలించిన మబ్బు

తెగ పరుగు లెత్తిందిలే – సొగసుల్లు పోయిందిలే

ఈ కవితలో విశ్వనాథ అచ్చమైన భావకవే! ఇంత లలిత లలితమైన గీతాన్ని విశ్వనాథ రాసారని మొదటిసారి తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది! ఇలాంటి లాలిత్యం విశ్వనాథలో అరుదుగానే కనిపిస్తుంది.

నా ప్రాణములకు నీ పొగమబ్బుల

కేమి సంబంధమో! ఏను గూడ

పొగమబ్బునై కొండ చిగురు కోనలపైన

బురుజులపైని కొమ్మలకు పైని

వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనే నేల

రాలిపోనో గాలి తేలిపోనో…

అన్నప్పుడు అతని భావుకతకి ఆత్మీయత తోడవుతుంది.

ఈ మనోహర వీణ వాయించలేక

చేతమున నెంతు నే నశిక్షితుడనంచు

నా లతాంగి విలోల నేత్రాంచలమున

గదలుచున్నది దాని రాగాల మెఱుపు

మనోహరమైన ఒక వీణని వాయించలేక “అయ్యో నేను అశక్తుడనైపోయానే!” అని మనసులో అనుకున్నంతలో, ఎదురుగా ఉన్న లతాంగి కనుల తుదలలో ఆ వీణ రాగాల మెఱుపు కదులుతూ కనిపించిందట! ఎంత లోతైన ఊహ! ఇది ముగ్ధమైన భావ కవిత్వం.

ఇలా విశ్వనాథ అచ్చమైన భావకవిగా మనకి కొన్ని కావ్యాలలో కనిపిస్తారు. ఈ భావుకతే తర్వాత జాతీయాభిమానం దిశగా మళ్ళి తెలుగు జాతి ప్రశస్తిని, పౌరుషాన్ని దశదిశలా ప్రతిధ్వనించింది. అయితే, విశ్వనాథని విశ్వనాథ చేసింది మాత్రం అతని అనన్య కల్పనాచాతుర్యం, శిల్ప నైపుణ్యం.

కల్పన అంటే ఊహ. ఒక కొత్త ఆలోచన, కొత్త దృక్కోణం. మనందరికీ తెలిసున్న విషయాల గురించి మనకి తెలీని ఒక కొత్త అంశాన్ని ఆవిష్కరించ గలగడమే కల్పనా చాతుర్యం. ఉదాహరణకి అశోకవనంలో సీతాదేవిని వర్ణించే యీ పద్యం చూడండి :

ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ తీరు స్వామి చా
పాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామ దే
హాకృతి, సర్వ దేహమున యందును రాఘవవంశమౌళి ధ
ర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞ మూర్తియై

సీతాదేవి ఎలా ఉందీ అంటే, ఆమె ఆకారం రామచంద్రుని విరహానికి రూపంలా ఉందట. కనుబొమలేమో రాముని విల్లులా ఉన్నాయి. రాముని కరుణ కన్నులలో మూర్తికట్టింది. జడేమో రాముని శరీరకాంతితో మెఱుస్తోంది.

రామాయణ కల్పవృక్షం

సీతాదేవి శరీరమంతా కూడా రఘువంశ చంద్రుడైన రాముని ధర్మం రూపుకట్టినట్టుగా ఉంది. ఆ కూర్చున్న విధానమేమో రాముని ప్రతిజ్ఞ మూర్తీభవించినట్టుగా ఉందట! ఎంత ఉదాత్తమైన ఊహ యిది! అంత ఎడబాటులో కూడా ఎప్పుడూ ఆ సీతారాములు కలిసే ఉన్నారన్న ఆలోచన గొప్పది. కనుబొమలని ధనుస్సుతో పోల్చడం మామూలే. అలాగే కురుల సౌందర్యాన్ని చెప్పడానికి వాటి నల్లని నిగనిగలు వర్ణించడమూ సామాన్యమే. కాని వాటిని సీత విషయంలో రాముని విల్లుగా, రాముని శరీర కాంతిగా అభివర్ణించడం అసామాన్యం. బాహ్య రూపంతో మొదలుపెట్టి, చివరికి ఆమె శరీరమంతా రాముని ధర్మానికి ప్రతిరూపంలా ఉందనడం, ఆమె కూర్చున్న తీరులో రాముని ప్రతిజ్ఞ కనిపిస్తోందనడం సాధారణ కవులు చెయ్యలేని ఊహ. ఇది సీతారాముల అద్వైతాన్ని నిరూపించే పద్యం. కల్పవృక్షం నిండా ఇలాంటి ఊహలే. అవి ఎంత విచిత్రంగా ఉంటాయో అంత సముచితంగా ఉంటాయి. అంత ఉదాత్తంగా ఉంటాయి.

శబరి పూలూ పళ్ళూ ఒక బుట్టలో జాగ్రత్తగా సర్ది, ఆ బుట్ట నెత్తిపై పెట్టుకొని రాముని దగ్గరకు వస్తుంది. అప్పుడా శబరి “తుట్టతుదదాక ఎండిన చెట్టుకొమ్మ, శేఖరంబున యందు పుష్పించినట్లు” ఉందిట. ఎంత సుకుమార కల్పన యిది!

విశ్వనాథ ఊహ సుకుమారమైన సన్నివేశాలలో సుకుమారంగా ఉంటుంది, విచిత్రమైన సన్నివేశాలలో అంత విచిత్రంగానూ ఉంటుంది.

శూర్పణఖ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె గురించిన వర్ణన ఉంది. శూర్పణఖ అసలు రూపం మనకి తెలీదు. కాని, రామ లక్ష్మణుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అందమైన రూపంతోనే వెళ్ళింది. అలాటి అందమైన రూపాన్ని వర్ణించాలిక్కడ. అయితే అలా వర్ణించడం శృంగార రసాన్ని పోషించేదిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది రసాభాసమే కాని శృంగార రసం కాదు కదా. రామునికి ఆ అందాన్ని చూసి ఏవగింపే కలిగింది కాని మోజు కలగలేదు. మరి అలాంటి అందాన్ని ఎలా వర్ణించడం?

విరిసి మన్మథరాజు బిట్టావులించిన
ఆకాశమది రూపమందెననగ

విరి యమ్మువాని విల్ ఫెళ్ళున విఱిగిన
పెనురావమది మూర్తి తనరెననగ

శివదృగగ్ని నిపీత నవ మన్మథ శరీర
శిఖి యిట్టి యాకృతి చెందెననగ

మన్మథ దహన సంభవ రతి బాష్ప సం
తాన మీ దేహంబు పూనె ననగ

నన్నియును గూడియే యిట్టులాయెనొక్కొ
యనగ, లోచన సహజ దర్శన సమగ్ర
శక్తి యుప సంహృతిచ్ఛిదా చటుల మగునొ
నా నొకానొక కామిని కానిపించె

ఈ పద్యాన్ని ఒకసారి చదివితే చాలదు. మళ్ళీ మళ్ళీ చదవాలి. చదివి అలాటి రూపాన్ని మనం ఊహించుకోవాలి. ఇందులో శూర్పణఖ శరీరాన్ని వర్ణించలేదు. కాబట్టి భౌతికమైన, శారీరికమైన రూపమేదీ ఇందులో మనకి కనిపించదు. దీనిని మనం చదువుకుని ఊహించుకున్నప్పుడు, ఒక అభౌతిక భావన మన మనసులో కదలాడుతుంది. అది ఒక విచిత్రమైన సంచలనాన్ని, విరక్తిని కలిగిస్తుంది. శూర్పణఖని చూసిన రాముని మనసులో సరిగ్గా అలాటి భావనే కలిగి ఉండాలి! శూర్పణఖ పాంచభౌతికమైన అందాన్ని యిక్కడ వర్ణిస్తున్నారు. ఆకాశం, నీరు, నిప్పు, వాయువు ఇలా వీటన్నిటిలోనూ మన్మథునికి సంబంధించిన ఆంశ ఆమెలో ఉంది. అయితే అది ఎలాంటి అంశ? ఆకాశమేమో మన్మథుని ఆవులింతట! ఆవులింత జడత్వానికీ, నిద్రకీ చిహ్నం. అలాగే గాలిలో కదలికవల్ల యేర్పడే శబ్దం, మన్మథుని విల్లు “ఫెళ్ళు”మని విఱిగినట్టుందిట. మన్మథుని విల్లు కోరికని రేపేది. కానీ ఆ కోరిక యీమె విషయంలో విఱిగిపోతోంది. అంటే కోరికలు రేపే రూపమే అయినా ఇక్కడ అది కలగటం లేదు అని భావం. అలాగే ఆమెలోని అగ్ని మన్మథుని దహించిన అగ్ని స్వరూపం. ఆమెలోని నీరు మన్మథుడు కాలి బూడిదైనందుకు రతిదేవి కార్చిన కన్నీరు.

ఇవన్నీ ఉండికూడా యిలా ఉందేమిటి అనుకునేట్టుగా ఉందిట. అంటే పంచభూతాల్లోనూ మన్మథునికి సంబంధించిన అంశ ఉండికూడా యిలా కోరికని కాక వికర్షణని కలిగించేదిగా ఉందేమిటి అని అనుకొనే విధంగా ఉంది. కళ్ళకి ఉండే సహజమైన చూపంతా చెల్లాచెదరైపోయేట్టుగా ఉందట. “కనులు చెదరిపోయే అందం” అనే జాతీయాన్ని ఎలా మార్చారో చూడండి! ఇక్కడ చెదరిపోతున్నది కంటికి సహజమైన చూడగలిగే శక్తి. అంటే ఆమె రూపం అంత కృత్రిమంగా ఉందన్నమాట.

ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పద్యాన్ని చదివి శూర్పణఖ రూపాన్ని ఊహించుకోడానికి ప్రయత్నించండి. రసాభాసని యింత అద్భుతంగా ఒక పద్యంలో నిర్వహించడం అసామాన్యం! మనం ఎంత దూరం ఆలోచించినా అంతకు బారెడు దూరాన ఉంటుంది విశ్వనాథ ఊహ.

విశ్వనాథ ఊహ పరిథి ఎంత విశాలమైనదో అతని దృష్టి అంత నిశితమైనది. చిన్న చిన్న విషయాల గురించి కూడా సూక్ష్మంగా ఆలోచించి, అందులో ఒక కొత్తదనాన్ని చూపించడం విశ్వనాథ ప్రతిభ. రాముడు సీతకి తాళి కట్టే సన్నివేశంలో యీ పద్యాన్ని చూడండి:

కరరుహంబులు చర్మంబు గాకపోయె,
నవియు బులకించునేమొ ప్రియాగళాత్త
మైన స్పర్శసుఖాప్తి, బ్రియాగళంబు
నంటి బాధించు వీని కేలా సుఖంబు?

బంగారు లేడిని చూసి సీత దాన్ని పట్టి తెమ్మని రాముణ్ణి అడిగినప్పుడు, యిది రాక్షస మాయలా ఉంది అని లక్ష్మణుడు వారించడం వాల్మీకి రామాయణంలో ఉన్న సన్నివేశమే. అయితే లక్ష్మణుడు ఎందుకది రాక్షస మాయ అని అనుకుంటున్నాడో పెద్దగా వివరణ లేదు. కల్పవృక్షంలో దానికి సూక్ష్మ పరిశీలనా దృష్టితో సహేతుకమైన వివరణ కల్పన చేసారు విశ్వనాథ. అది లక్ష్మణుని ద్వారా పలికించారు.

సీత మెడలో రాముడు వంగి తాళి కడుతున్నాడు. అలా కట్టేటప్పుడు రాముని చేతి గోళ్ళు సీత మెడని తాకాయి. కాని గోళ్ళు చర్మం కాదు కదా. కాబట్టి వాటికి స్పర్శ జ్ఞానం లేదు. ఉంటే అవి కూడా ఆ స్పర్శకి పులకించి ఉండేవట. అయినా ప్రియురాలి మెడని తాకి బాధించిన ఆ గోళ్ళకి అలాంటి సుఖం ఎందుకు కలగాలి? సీతారామ కల్యాణాన్ని ప్రత్యక్షంగా తన అంతరంగంలో అతి సూక్ష్మంగా దర్శిస్తున్న కవి ఊహ యిది! రామాయణంలోని ప్రతి అంశాన్ని ఇంత సూక్ష్మంగా దర్శించి, మనకి దర్శింపచేస్తారు విశ్వనాథ.

విద్యను అభ్యసించే కాలంలో యాజ్ఞవల్క్యుని వృత్తాంతం గురించి చదువుకున్నాడు రాముడు. అప్పుడతను యిలా అనుకున్నాడట:

మనసై రాముడు మైథిలేయ పరిషన్మధ్యంబునన్ యాజ్ఞవ
ల్క్యుని వాదాద్భుత మట్టి యద్భుతము నాలోచించు, జేయంగ చే
సినచో నట్టిది మైథిలేయ సభలో జేయన్ వలెన్ వేదముల్
వినుతించున్ మిథిలా సభాగత మహావృత్తాంత మంచెంచుచున్

యాజ్ఞవల్క్యుడు జనకుని కొలువులో అద్భుతమైన శాస్త్ర చర్చని చేస్తాడు. దాని గురించి చదివినప్పుడు ఆ విషయమే ఆలోచించి, వేదాలన్నీ కీర్తించేలా జనకుని కొలువులో చేస్తే యిలాటి అద్భుతమైన కార్యమేదైనా చెయ్యాలి అని అనుకున్నాడట రాముడు. చదివే వాళ్ళందరికీ రామాయణం తెలుసు. రాముడు నిజంగానే జనకుని కొలువులో మహాద్భుతమైన కార్యం, శివధనుర్భంగం చేయబోతున్నాడని తెలుసు. అయితే, చదువుకొనే రోజుల్లోనే అలాంటి ఆలోచన రామునికి కలిగిందనే ఊహ గొప్పగా అనిపిస్తుంది. దీన్నే భవిష్యత్సూచన అంటారు. విశ్వనాథ రచనలలో చాలాచోట్ల ఇలాంటి భవిష్యత్ సూచనలు కనిపిస్తాయి. ఇది ఇంగ్లీషు నాటకాలలో ఎక్కువుగా ఉందని, తను అక్కడినుంచే దీన్ని గ్రహించాననీ విశ్వనాథ చెప్పుకున్నారు.

వర్ణనలలోనే కాదు, సన్నివేశ కల్పనలో కూడా విశ్వనాథ ఊహ సామాన్యమైనది కాదు. బంగారు లేడిని చూసి సీత దాన్ని పట్టి తెమ్మని రాముణ్ణి అడిగినప్పుడు, యిది రాక్షస మాయలా ఉంది అని లక్ష్మణుడు వారించడం వాల్మీకి రామాయణంలో ఉన్న సన్నివేశమే. అయితే లక్ష్మణుడు ఎందుకది రాక్షస మాయ అని అనుకుంటున్నాడో పెద్దగా వివరణ లేదు. కల్పవృక్షంలో దానికి సూక్ష్మ పరిశీలనా దృష్టితో సహేతుకమైన వివరణ కల్పన చేసారు విశ్వనాథ. అది లక్ష్మణుని ద్వారా పలికించారు.

“ఇది వరకు రెండు కాళ్ళపై నేగు ప్రాణి, యిపుడు నాలుగు కాళ్ళపై నేగవలసి పడెడు నిబ్బంది యల్ల కన్పడెడు” అంటాడు. పైగా ఆ మాయలేడి ప్రతి చర్యని అతి జాగ్రత్తగా గమనిస్తూ వివరిస్తాడు:

పచ్చిక మేయబో దదొక వాటుగ దా గొరుకున్, దదారుచిన్
మెచ్చదు కన్నులన్, నమిలి మ్రింగద, యీ దెస వెట్టు వీనుగా
నిచ్చటి వార్తలన్ వినునొ యేను వచించుచునుండ నంతలో
నచ్చపు మైజిగుల్ వెలతెలైనవి ముందరి కాంతులొప్పునే

“నిజంగా అది గడ్డి మేస్తున్నట్టు లేదు. అదొక పక్కగా కొరుకుతోంది. ఆ రుచి దానికి ఇష్టం లేదని ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నమిలి మింగటం లేదు. పైగా ఈ పక్కకి చెవులు రిక్కించి మన మాటలు వింటున్నట్టుగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగానే చూడండి ఎలా దాని శరీర కాంతి కోల్పోయి వెలవెల పోతోందో!”

ఇంతకన్నా నిశిత పరిశీలన ఎక్కడుంటుంది చెప్పండి! ఇదంతా చాటుగా వింటున్న రావణుడు లక్ష్మణుడి యీ హేతుబద్ధ పరిశీలనకి ఆశ్చర్యపోతాడు. సైన్యం లేకపోయినా ఫరవాలేదు, రాజ్యం లేకపోయినా బాధ లేదు, రాజుకి ఇలాంటి ఒక్క మంత్రి ఉంటే చాలు కదా అనుకుంటాడు. ఇంకా అనుకుంటాడూ,

ఇంత భయమెఱుంగ నేనెన్నడును వీని
భావ సరణి గనిన భయము వేయు
నొక్క మంత్రి యిట్టి డున్నచో నాకును
శతములైన జనకసుతల దెత్తు

భయమంటే తెలియని రావణుడికి లక్ష్మణుడి ఆలోచనా ధోరణి భయం కలిగించిందిట. ఎందుకంటే యింత వివరంగా అది లేడి కాదు రాక్షసుడే అని లక్ష్మణుడు చెపుతున్న మాటలని రాముడు కాదన గలడా? దాన్ని పట్టుకోడానికి రామలక్ష్మణులిద్దరూ సీతని విడిచిపెట్టి వెళతారా? తను వేసిన పథకమంతా పారకుండా పోతుందేమోననే భయం పుట్టింది. ఇక్కడదాకా ఎవరైనా ఊహించ గలరేమో, కాని తర్వాత ఆలోచన మాత్రం, మనసులో పాత్రల స్వభావాలు ప్రతిక్షణం కదలాడే కవి మాత్రమే చెయ్యగలిగిన ఆలోచన. “ఇలాంటి మంత్రే కనక నాకు ఒక్కడుంటేనా, యిలాటి సీతలని వందమందినైనా ఎత్తుకు వెళ్ళిపోయేవాణ్ణి కదా!” అనుకుంటాడట రావణుడు!

ఇలా వాల్మీకి రామాయణంతో విరోధించకుండా అద్భుతమైన కొత్త కల్పనలనెన్నిటినో విశ్వనాథ తన రామాయణ కల్పవృక్షంలో చేసారు.

విశ్వనాథవారి ఆవేదన కేవలం సంసార కష్టాల వల్ల మాత్రమే కలిగినది కాదు. అది మరింత విస్తృతమైనది. భారతీయ భాషా సంస్కృతులకు పట్టిన భ్రష్టత్వాన్ని అతను ఉపేక్షించ లేకపోయారు. లోపల్లోపల క్రుంగి పోయిన అతని బాధ ఒక నిర్వేదమై పద్యాలలో విషాద గీతంగా ప్రవహించింది.

శిల్ప నైపుణ్యం విషయానికి వస్తే, అది కథానిర్మాణానికి, కథనానికి, పాత్ర చిత్రణకి, సంభాషణలకి సంబంధించినది. కథా, కవిత్వమూ వేరు కాని రోజులలో యివన్నీ కావ్య రచనలో భాగంగానే ఉండేవి. కథా కావ్యం రసవంతం కావడానికి శిల్పం చాలా దోహదం చేస్తుంది. దీని గురించి వివరించాలంటే విశ్వనాథవారి నాటకాలు – అనార్కలి, నర్తనశాల, త్రిశూలం, వేనరాజు మొదలైనవాటి గురించి, రామాయణ కల్పవృక్షం గురించి మరింత వివరంగా పరిచయం చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడీ వ్యాసం పెద్ద గ్రంథమై కూర్చుంటుంది. అంతే కాకుండా ఇప్పుడు మనం కవిత్వం గురించి పరిమితార్థంలోనే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతానికి దాని జోలికి వెళ్ళడం లేదు.

బియ్యం, నీళ్ళు, వండడానికి పాత్ర – ఇన్నీ ఉన్నా నిప్పులేకుండా అన్నం తయారు కాదు. అలాగే రచనా నైపుణ్యం, భాష, కల్పనా చాతుర్యం, యిలా ఎన్నున్నా సరిపోవు. ఒక రచన కవిత్వం కావాలంటే కవి అంతరంగంలో నిరంతరం జ్వలించే ఒక తీవ్రానుభూతి అవసరం. ఆ అనుభూతే కవిత్వమై పాఠకుని అంతరంగాన్ని స్పృశిస్తుంది. దీనినే విశ్వనాథవారు “జీవుని వేదన” అన్నారు. “తండ్రి యాజ్ఞయును జీవుని వేదన రెండు నేకమై, నా సకలోహ వైభవ సనాథము నాథు కథన్ రచించెదన్” అని కల్పవృక్షంలో చెప్పుకున్నారు. అయితే యీ వేదన ఒక్క కల్పవృక్షంలోనే కాదు అతని రచనలన్నిటా కనిపిస్తుంది. మన గుండెలని కదిలిస్తుంది. కొన్ని రచనలలో అది ఆత్మాశ్రయమైతే, మరి కొన్ని రచనలలో పాత్రలని ఆశ్రయించి ఉంటుంది. ఇదీ అని తేల్చి చెప్పడానికి సాధ్యం కాని వేదన యిది. ఇందులో అనేక ఛాయలు. సంసారపుటీతిబాధలు ఒక వంక, మారుతున్న సమాజంలో మనం కోల్పోతున్న సాంప్రదాయ విలువల పట్ల మానసిక ఆరాటం మరో వంక వీటన్నిటినీ మించి ఏదో తెలియని ఒక ఆత్మీయమైన వేదన, విశ్వనాథ రచనలంతటా పరచుకొని ఉంటుంది.

ఆత్మాశ్రయమైన విశ్వనాథ వేదన ప్రముఖంగా అతని శతకాల్లో కనిపిస్తుంది. రసము, ఔచిత్యము, అలంకారాలు ఇవేవీ లేని “నగ్నోద్విగ్న కవిత్వము” తనదని విశ్వేశ్వర శతకంలో వాపోతారతను. ఈ శతకంలో విశ్వనాథ ఆ విశ్వేశ్వరునితో చాలా చనవు తీసుకుని మాట్లాడతారు. తన కష్ట సుఖాలన్నీ వెళ్ళబోసుకుంటారు.

విశ్వనాథ తండ్రి శోభనాద్రిగారు మహా దాత. ఆస్తులన్నీ అతని దాతృత్వపు మంటకి ఆహుతై పోయాయి. అతను కాశి నుంచి శివలింగాన్ని తెచ్చి వాళ్ళ స్వగ్రామం నందమూరులో ప్రతిష్ఠించారు. ఆ విశ్వేశ్వరుడే మీకు దిక్కని పిల్లలకి చెప్పి శోభనాద్రిగారు స్వర్గస్థులయ్యారు. అందుకే ఆ స్వామంటే విశ్వనాథకి అంత చనవు.

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీ మీ మధ్యనున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా !
ఏదో లెక్కలు తేల్చుకో ! మొఱటుతో నేలా ? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా !

“నీకూ మా తండ్రిగారికి మధ్యనున్న లావాదేవీలతో నాకు సంబంధం లేదు. ఇలా రా. ఈ లెక్కలేవో తేల్చేసి వెళ్ళు. నాలాంటి మొఱటు మనిషితో పెట్టుకోకు. ఒళ్ళు మండిందంటే నిన్ను ఏదో వచ్చినకాడికి అమ్మేస్తాను సుమా” అని విశ్వేశ్వరుని బెదిరించే ధైర్యం విశ్వనాథకి ఎక్కడనుంచి వచ్చింది? అతని మనసులో ఎంతటి ఆవేదన అతనిచేత యిలాటి మాటలనిపించింది? విశ్వనాథ పలుకు “దారుణాఖండలు శస్త్ర తుల్యము”, వజ్రాయుధం లాంటిది. అయితే ఇంతలేసి మాటలని కూడా చివరకి అతను చేసిందేమిటి ? జ్ఞానపీఠ బహుమతికి గాను తనకి వచ్చిన లక్షరూపాయలు నందమూరులో ఆ విశ్వేశ్వరుని దేవాలయానికే సమర్పించేసారు!

స్వామీ! యేలనయా బహూక్తుల నినున్ బ్రార్థించుచున్నాను, రెం
డే మాటల్, సిరులిచ్చి వ్యర్థ జనులందే సేవ చేయించ కె
ట్లో మాన్పింపుము, కాద యేని మృదు పాండు శ్రీ నవచ్ఛాయలో
నీ మై దీధితిలోన జేర్చుకొను తండ్రీ! నన్ను, విశ్వేశ్వరా!

“ఇన్ని మాటలెందుకయ్యా స్వామీ. రెండే మాటలు చెప్తాను విను. అయితే కావలసిన డబ్బు ప్రసాదించి వ్యర్థులైన జనుల సేవ చెయ్యకుండా ఎలాగయినా మాన్పించు. లేదా హాయిగా మృదువైన, తెల్లగా మెరిసిపోయే నీ శరీరకాంతిలో నన్ను చేర్చేసుకో” అని అనడంలో ఎంతటి పరితాపం ఉంది!

విశ్వనాథవారి ఆవేదన కేవలం సంసార కష్టాల వల్ల మాత్రమే కలిగినది కాదు. అది మరింత విస్తృతమైనది. భారతీయ భాషా సంస్కృతులకు పట్టిన భ్రష్టత్వాన్ని అతను ఉపేక్షించ లేకపోయారు. లోపల్లోపల క్రుంగి పోయిన అతని బాధ ఒక నిర్వేదమై పద్యాలలో విషాద గీతంగా ప్రవహించింది.

నా జాతి పూర్వప్రథా జీవ రహితమై
శక్తి నాడుల యందు చచ్చిపోయి

నా మాతృభూమి తేజో మహశ్చ్యుతిని బ్ర
హ్మ క్షత్ర తేజంబు మంట గలిసి

నా మాతృభాష నానా దుష్ట భాషల
ఔద్ధత్యమును తల నవధరించి

నా తల్లినేల వేనాటి యాచారముల్
పై మెరుగులు చూచి బ్రమసిపోయి

ఏమి మిగిలినదీ నాటి కిట్లు పొంగు
లొలయు వర్ణానదీ గభీరోదకముల
దైన్య గర్భ చారిత్రముల్ దక్క, భిన్న
గిరి శిఖర దుర్గ పరిదీన గీతి దక్క?

అక్షరాక్షరంలో అతని జాతీయాభిమానం, జాతి గురించిన ఆవేదనా ప్రతిబింబించే పద్యం. అతని మితి లేని జాతీయావేశమే పరభాషలని “దుష్ట భాషలు”అని అనిపించింది. విశ్వనాథలోని ఆవేదన మనం గ్రహించి ఆవేశాన్ని విడిచిపెట్టడం ఉచితం.

భౌతిక మానసిక అవస్థలని అధిగమించి విశ్వనాథ ఆర్తి ఆధ్యాత్మిక పరిధిని చేరుకొని అంతుతెలియని లోతులని సంతరించుకుంది. ఏదో జన్మలో చేసిన తపస్సు పరిపూర్ణం కాక మళ్ళీ జన్మనెత్తిన ఒక భ్రష్ట యోగిలా కనిపిస్తారు విశ్వనాథ.

ఈ యనిలాధ్వమెల్ల నినదించెడు మువ్వలమ్రోత దూరమై
పోయిన గోతతిం బిలుచు పోలిక ఏదొ వినిస్వనించెడున్
రాయిడి పొందుచున్ తెలియరాక వగర్చి పురానుభూతముల్
తీయని భావముల్ స్మృతికి తెచ్చుకొనన్ వలవంత కుందెదన్

అన్న శృంగారవీథిలోని యీ పద్యంలో అదే జీవుని వేదన – గాలిలో నినదిస్తూ “మువ్వలమ్రోత దూరమైపోయిన ఆవులమందని పిలుస్తున్నట్లు” ఏదో ఒక వింత సవ్వడి వినిపిస్తుంది. “గో” అంటే జ్ఞాన కిరణం అని కూడా ఒక అర్థం ఉంది. అలా దూరమై పోతున్న జ్ఞాన కిరణాలని తన వేణునాదంతో పిలుస్తున్న ఆ మురళీ కృష్ణుని పిలుపులా ఉందన్నమాట! అది మాటిమాటికీ గుర్తుకు వస్తూ, పూర్వమెప్పుడో అనుభవించిన తీయని అనుభూతులని జ్ఞపకం చేస్తూ, అదేమిటో తెలియక మనసు బాధతో నిండిపోయిందట.

విశ్వనాథ తనలోని ప్రగాఢమైన యీ ఆవేదన అంతటినీ ఒక తపస్సుగా, అంటే అచంచల దీక్షగా మార్చుకున్నారు. అది కవితా తపస్సు. “కవితా రూప తపస్సు చేసెదను శ్రీకంఠా!”, అని విశ్వనాథే స్వయంగా కల్పవృక్షంలో చెప్పుకున్నారు. భావన అనే పవిత్ర తీర్థంతో తన యింద్రియ వికారాలని కడిగేసుకోవాలని విశ్వనాథ ప్రయత్నం.

నిరంతరం అతనికి కవితాధ్యానమే. తాను రచించిన ప్రతి వస్తువులోనూ, పదంలోనూ, అక్షరంలోనూ లీనమైపోయి, తనదిగా చేసుకొని కవిత్వాన్ని సృష్టించారు విశ్వనాథ. అలా కాని నాడు యిదిగో యిలాంటి పద్యం రాయగలరా చూడండి!

హనుమంతుడు సీత గూర్చి వెతకి వెతకి చివరకి ఆ తల్లిని కనుగొంటాడు. దాని గురించి హనుమంతుని మాటలు యివి:

కవి మహర్షి తపోగ్నిచే క్రాగి క్రాగి
సర్వ తేజఃఫలంబు రసంబు తుదకు
జూచినట్లుగ జూచితి క్షోణి జాత
జారితార్థ్యంబు జన్మకు సంఘటింప

“కవి అనే మహర్షి కవితా తపస్సనే అగ్నిలో క్రాగి క్రాగి, చివరకి ఆ తపఃఫలితంగా రసాన్ని ఎలా కనుగొంటాడో అలా నేను సీతాదేవిని కనుగొన్నాను, నా జన్మ తరించిపోయిం”దని అంటాడు హనుమంతుడు. అలాటి రససిద్ధికోసమే విశ్వనాథ కూడా తపస్సు చేసారు. ఆ తపస్సంతా రామాయణ కల్పవృక్షంలో ఫలించింది. అందుకే అందులోని ప్రతి పాత్రా సజీవమై విశిష్ట వ్యక్తిత్వంతో వెలుగుతుంది. అతని వేదన ప్రతి పాత్రలోనూ ప్రతిఫలిస్తుంది. ఈ ఆవేదన ఎంత తీవ్రమైనది, విచిత్రమైనది అంటే, మనం ఊహించని పాత్రల్లో కూడా యిది దర్శనమిస్తుంది.

ఉదాహరణకి కైకలోని ఆవేదన యిదే. రాముని అభీష్టం మేరకు, తను అతన్ని అడవికి పంపవలసి వచ్చినప్పుడు, ఆమె అనుభవించిన దుఃఖం వర్ణనాతీతం. ఆ సన్నివేశంలో ఆమె మనస్స్థితిని విశ్వనాథ చిత్రించిన తీరు అమోఘం.

రావణునిలో కూడా యిదే వేదన సంశయ ఖండంలో మొదలై నిశ్శంశయ ఖండందాకా పెరిగి పెరిగి, చివరికి అతని మృత్యువుతో అది తీరుతుంది.

ముందు పేజీ —- తరువాతి పేజీ

About భైరవభట్ల కామేశ్వరరావు

భైరవభట్ల కామేశ్వరరావు గారికి తెలుగు భాషా సాహిత్యాల మీద ఎంతో ఆసక్తి. పద్యాలంటే మక్కువ ఎక్కువ. ఈమాటలో కథలూ, కవితలూ, వ్యాసాలూ రాస్తూంటారు. పొద్దు కోసం గడిని కూర్చుతూ ఉంటారు. తెలుగు పద్యం అనే బ్లాగులో ప్రసిద్ధి చెంచిన పద్యాల విశేషాలను వివరిస్తున్నారు.
This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.

14 Responses to నేనెఱిగిన విశ్వనాథ

  1. lalithasravanthi says:

    naaku “kalpavRksham” tution ceptaaraaa plssssss
    mee article chadivinadaggari nuncii manasantaa elaagO ayyindi, plss cheppanDi sir

  2. మాలతి says:

    కామేశ్వరరావుగారూ, నమోవాకములు. ఇంత విశిష్టమయిన విశ్లేషణ నేను చదివి చాలాకాలమయింది. చాలా సంతోషంగా వుంది మీవ్యాసం చదువుతుంటే. ధన్యవాదాలు.

  3. కామేశ్వరరావు గారు,
    చక్కటి వ్యాసాన్ని అందిచ్చినందుకు ధన్యవాదాలు.

  4. Vennela says:

    చక్కని వ్యాసం!!అద్భుతమైన పద్యాలు!నేను మొదట విన్న విశ్వనాధ వారి పద్యం
    “ఏ రాజు పంచెనో ఇచట శౌర్యపు పాయసమ్ములు నాగుల చవితినాళ్ళ
    ఏ యెఱ్ఱ సంజెలో నెలమి పల్లవ రాజ రమణులు కాళ్ళపారాణి నిడిరొ….”
    ఎంత అందమైన భావన ! ఎంత చదివినా, ఎన్ని సార్లు చదివినా, చదివిన ప్రతిసారీ ఆయన కవితాసౌందర్యానికి ఆశ్చర్య పోతూనే ఉంటాను.

    ధన్యవాదాలు.

  5. రవి says:

    చాలా అద్భుతంగా చెప్పారు. ఓ రచనలో తాదాత్మ్యత చెందితే తప్ప ఇంత ప్రగాఢమైన వ్యాసం వెలువడదు. పొద్దు వారికీ, మీకూ హృదయపూర్వక అభినందనలు.

    ఇక –
    “పక్క అంతయు జిమ్మితి పద్మనాభ!
    అన్న చూడుము, పుస్తకమ్మట్లు పండు
    కొనును, నీవేమొ పక్కంత కుమ్మి కుమ్మి
    పక్క యటులుండ నీవిట్లు పండుకొందు”

    అచ్చంగా మా పాపాయి ఇంతే. నిన్నే మనసులో అనుకున్నాను, “ఏమీ చంటిది, ఇలా గడియారం ముల్లు లా తిరుగుతోంది పక్క మీద అని.” పై పద్యం, నా మనసు నాతో మాట్లాడినట్టు ఉన్నది.

  6. రాఘవ says:

    విశ్వనాథవారి కృతులు కచ్చితంగా చదవాలన్న కుతూహలాన్ని పెంచేలా వ్రాసారు. బావుంది. 🙂

  7. విశ్వనాధ వారిపై ఇంత చక్కటి విశ్లేషణతో కూడిన వ్యాసం ఈ మధ్య కాలంలో ఇదే చదవటం! మీకూ, పొద్దు వారికీ హృదయపూర్వక ధన్యవాదాలు..

  8. యోగి says:

    భైరవభట్ల గారూ

    మీరెరిగిన విశ్వనాథను చూసి, ఒకవేళ బ్రతికి ఉంటే, అసలు విశ్వనాథ కూడా మిమ్మల్ని అభినందించేవారు 🙂

  9. భైరవభట్లగారికి
    అద్బుతమైన వ్యాసం చదివించారు. విశ్వనాధవారికి భయపడుతూనే అభిమానించేవారిలో నేనొకరిని.
    పద్యాల తాత్పర్యాలు, విశేషార్ధాలు ఎక్కడివక్కడ వివరించటం వల్ల పద్య అందాలు అర్ధంచేసుకోవటంలో దోహదపడ్డాయి.

    వ్యాసం ఆద్యంతం మెదడుకు మేతపెడుతూనే, మీరిరువురిపట్ల గౌరవాన్నినుమడింపచేస్తూ సాగింది.

    బొల్లోజు బాబా

  10. అద్భుతమైన వ్యాసం! ముఖ్యంగా సీతారాముల అద్వైతాన్ని వివరించే పద్యాన్ని మీరు వివరించిన తీరు!!

    మీ వ్యాసాలు, ఈమాటలో మోహన గారి వ్యాసాలతో పద్య సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలన్న కోరిక బలపడింది. ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి!

  11. వ్యాఖ రాసిన అందరికీ నెనరులు.
    @లలితగారు, కల్పవృక్షానికి ట్యూషన్ చెప్పేంత సీను నాకు లేదండి. అందులో నాకు నచ్చిన అంశాలని, నాకున్న అతి తక్కువ పరిథిలో, వివరించే ప్రయత్నం వీలువెంబడి చేస్తాను.
    కల్పవృక్ష కావ్యానికి అర్థ వ్యాఖ్యానాలతో ఒక్క ప్రచురణా లేకపోవడం దురదృష్టం. ఈ కాలంలో అది చెయ్యగలవాళ్ళు కూడా చాలా చాలా అరుదైపోయారు. సమీప భవిష్యత్తులో వాళ్ళుకూడా ఉండకుండా పోతారు. ఎవరైనా పెద్దవాళ్ళు పూనుకొని ఆ పని చేస్తే బావుంటుంది.

    @వెన్నెల గారు, మీరు చెప్పిన అద్భుతమైన పద్యం కూడా ఆంధ్రప్రశస్తిలోనిదే. ఆంధ్రభారతి సైటులో ఆంధ్రప్రశస్తి పద్యాలున్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు.

  12. Vaidehi Sasidhar says:

    చాలామంచి వ్యాసం! ఒకటికి రెండుసార్లు చదివించిన వ్యాసం. “కన్నె కాటుక కళ్ళు” కవితను పాటగా మా నాన్నగారు పాడటం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను. అది విశ్వనాధ వారి కవిత అని మా నాన్నగారు కొన్నేళ్ళ క్రితం ఏదో సందర్భం లో చెప్పినపుడు, “పాషాణా పాకా’ అనిపించుకున్న ఆయనేనా ఇంత సరళమైన,సొగసైన పదాలతో అంతటి సుకుమారమైన కవిత వ్రాసింది అని ఆశ్చర్యపోయాను.అందమైన పద్యాలు ఎన్నో పరిచయం చేసారు.ధన్యవాదాలు.

  13. విశ్వనాధని ఇంత గొప్పగా పరిచయం చేయడం మీకే చెల్లింది.

  14. C.S.Rao says:

    భైరవభట్ల కామేశ్వరరావు గారు విశ్వనాధ వారి కవితా వైభవాన్ని వారి వివిధ కావ్యాలనుండి సోదాహరణంగా వివరిస్తూ వ్రాసిన వ్యాసం చాలా బావుంది. అనేకానేక విషయాలు చక్కగా విశదీకరింపబడినవి.
    విశ్వనాధ వారి మహా కావ్యం రామాయణ కల్పవృక్షం యొక్క వైశిష్ట్యాన్ని విశ్లేషిస్తూ చక్కగా విపులీకరించారు.

    శ్రీ రామచంద్ర స్వామివారికి శబరి పూలు,పండ్లు తీసుకెళ్ళే దృశ్యాన్ని చాలా మనోహరంగా విశ్వనాధ వారు చిత్రీకరించారు.
    “తుట్టకొక ఎండిన చెట్టు కొమ్మ
    శేఖరంబున యందు పుష్పించినట్లు”

    ఇది కేవలం ఒక అందమైన భావమే కాదు; కేవలం ఒక భౌతికమైన ,సుందరమైన దృశ్యమే కాదు ;దీని ప్రత్యేకత కేవలం దీని లోని మెటఫారికల్ బ్యూటీ మాత్రమే కాదు.వయోభారం శరీరాన్ని కృశింపచేసినా ,ఒక మహదాశయం ,ఒక నిరంతర నిరీక్షణ ,ఒక నిస్వార్ధ సేవా తత్పరత, ఏ మాత్రం ఏనాటికీ సడలని పట్టుదల మనిషిని బ్రతికిస్తాయనేది ఇక్కడ సూచితార్ధం.ప్రేమతొ,భక్తితో,ఆనందంతో,తన జీవిత పరమార్ధం నెరవేరబోతుందనే పారవశ్యం తో శబరి నెమ్మది నెమ్మది గా ముందుకుసాగటం గొప్ప కమనీయమైన,కరుణామయమైన దృశ్యం.రామచంద్రస్వామి వారికి పూలు,పండ్లు సమర్పించుకోవటం వారి పాదాల చెంత సంపూర్ణమైన శరణాగతి కోరుకోవటమే.

    మరొక విషయం:
    శూర్పణఖ ఎపిసోడు లో ఒక గొప్ప స్పిరిచ్యువల్ సింబాలిజం ఉంది.దుర్బుద్ధితో,దుష్టశక్తులనుపయోగించి ,మాయాజాలంతో సంతరించుకున్న కృత్రిమసౌందర్యం రామస్వామివారి లాంటి ధర్మదీక్షాతత్పరుని ముందు కకావికలై పోతుందనేది సూచితం.

    ఇంకొక విషయం:
    మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి వంచనతో ,అతి తెలివితేటలతో, నమ్మించాలనే ఉద్దేశ్యంతో చేసే నటనతో కూడిన కౌటిల్యపుటాటలు రామచంద్రమూర్తి వారిలానే ధర్మదీక్షా తత్పరుడైన లక్ష్మణస్వామివారి ముందు సాగవు.ఇదంతా గమనిస్తున్న రావణుడు లక్ష్మణస్వామి వారి కుశాగ్రబుద్ధికి విస్తు పోతాడే కానీ ఆయన ధర్మ దీక్షా నిరతి వాని బుద్ధికందనట్టి ఎత్తులోనే నిలిచిపోతుంది.
    వీటన్నింటా గొప్ప తేజోమయమైన కవితాశిల్పం !!!
    శ్రీమద్రామాయణ మహోదధిలో ఎన్నెన్ని అనర్ఘ రత్నాలో!!

    ఇంతటి చక్కని వ్యాసాన్ని అందించిన భైరవభట్ల వారికి అభినందనలు!!!!

    సి.ఎస్.రావు

Comments are closed.