పిచికగూటిలో కవిత్వపు కిచకిచలు

– స్వాతికుమారి బండ్లమూడి

ఈయన కవిత్వం చదువుతుంటే ..
“ఊరి బయట పొంగిన వాన వాగును సముద్రం అనుకున్న క్షణాలు
బడి నుంచి ఇంటికి బహు దూరపు దారిలో గాలికి కంట్లో పడిన ఇసుక కణాలు” గుర్తుకొస్తాయి.

చదవటం ఆపేశాక “వస్తే రావొచ్చు మళ్లీ ఇక్కడికి, ఈ అందమైన నిరర్థక నిశ్శబ్దం లోనికి” అనిపిస్తుంది..


పిచికగూడు, కాశీమజిలీ, కోలాటం బ్లాగుల ద్వారా కవిత్వాన్నీ, కథల్నీ, వ్యాసాలూ-అనుభవాలనీ పంచుకుంటూ అంతర్జాలంలో సుపరిచితులైన తెలుగు కవి హెచార్కే గారితో పొద్దు జరిపిన మాటామంతీ;

 

1.   ముందుగా మీ పరిచయం – వ్యక్తిగా మీ నేపథ్యం, వివరాలు వగైరా

 

మా అమ్మ నాన్న పేర్లు కొడిదెల సుబ్బమ్మ, సంజీవ రెడ్డి. బాగా దిగువ మధ్య తరగతి కుటుంబం. ఊరి పేరు చెబితే పూర్తి పేరు చెప్పమంటారు. ‘గని’. అంతే. రెండక్షరాలు. కర్నూలు జిల్లాలో మారుమూల గ్రామం. పుట్టి బుద్ధెరిగే సమయానికి ఇంట్లో అప్పుల దుఃఖం. మా అమ్మ నవ్వుతూ ఉండిన సమయాలు గుర్తు లేవు. నా మందకొడి స్పందనల వల్లనో తన ఫ్రస్ట్రేషన్స్ వల్లనో నాన్న బాగా కొట్టే వాడు. అమ్మ అంటే రెండు నీళ్లు నిండిన కళ్లు, నాన్న అంటే ఒక చర్నాకోల గుర్తొస్తాయి. ఆ ఇరుకు జీవితానికి అమ్మ నాన్నల చెడ్డ అలవాట్లు, సోమరితనం కారణాలు కావు. చాల మంచి వాళ్లు, కష్ట జీవులు. పొలాన్ని మాత్రమే నమ్ముకున్న రైతులు. చాల మంది రాసీమ రైతుల లాగే తల వంచడం, మనసులో లేనిది చెప్పడం చాత కాని మనుషులు. బహుశా అందువల్లనే, తరచు అనవసరమైన పేచీలతో బాధ పడే వాళ్లు. ఆ నొప్పి, ఆ పేచీ కలిస్తే నేను అనుకుంటాను. మనుషులందరి లాగే నేనూ ‘మాతృ గర్భంలో మరణ వ్యూహం’ రూపొందిన వాడినే. చాల ఊళ్లు తిరిగాను. చాల పనులు చేశాను. వ్యూహం నుంచి బయట పడ్డానని అనిపించదు.

పొగాకు మండె తిప్పుతుండగా మండ్రగబ్బ తేలు కుట్టి ఒక రోజూ రాత్రి ఏడ్చి ఏడ్చి చనిపోయిన సావాసకాడు శివరామి రెడ్డి, పదారేండ్ల వయసులో నలభై దాటిన మనిషిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిన చిన్నత్త, అద్భుతంగా పాఠాలు చెప్పడంతో పాటు ‘ఏడవడం కాదురా, ఎదిరించి బతకాల’ని ధైర్యమిచ్చిన రమణ మూర్తి సారు… ఇంక‍ అలాంటి మరి కొందరు మనుషులు, ఘటనలు కలిసి నా జీవితం.

మాది ‘1970 తరం’ అని చెబితే చాలు, చాల విషయాలు ఇక చెప్పక్కర్లేదనుకుంటాను. అది… యువతరంలో అభద్రత భావం, వీర వీత్నాం, చైనా సాంస్కృతికి విప్లవం, జెపి సంపూర్ణ విప్లవం, ఎమర్జెన్సీ, నక్శల్బరి కెరటాల తరం. ఆ కెరటాలలో నేనూ ఒకడిని.

 

2.   కవిత్వంతో మీ అనుబంధం ఎప్పటిది? ప్రచురించిన కవితా సంకలనాలు,కవితలు కాకుండా మీరు చేసిన ఇతర రచనల వివరాలు..

 

అలా ఎందుకు జరుగుతుందో తెలియదు. ఆరో తరగతిలో స్కూలు లైబ్రరీ నుంచి నాకు ఇచ్చిన మొదటి పుస్తకం, ‘బంగారు దీవి’ అనే నవల ఆబగా చదివేశాను. అది ఏ జూల్స్ వెర్న్ నవల అనువాదమో కావచ్చు. దానితో పాటు మిగిలిన పిల్లలకు ఇచ్చిన పుస్తకాలు కూడా తీసుకుని చదివాను. అప్పటి నుంచి కథలు, నవలలంటే మోజు. ఎక్కడ ఎవరింటికి వెళ్లినా వాళ్ల గూళ్లలో చందమామ, ఆంధ్ర పత్రిక ఉంటాయేమోనని చూసే వాడిని. గూట్లో పుస్తకం కనిపిస్తే ఆ ఇంట్లో మనుషులు గొప్ప వాళ్లని అనుకునే వాడిని. 8/9వ తరగతిలో మాకు రవీంద్రుని రాజర్షి నవల నాన్ డిటెయిల్డ్ టెక్స్టుగా ఉండేది. చాల గొప్పగా అనిపించింది. అప్రయత్నంగా మొదలెట్టి ఆ నవలను అనుకరిస్తూ నలభై యాభై పేజీల నవల రాశాను. దేవాలయం బదులు దేవ్యాలయం అని రాస్తే, ఆదా‍టున నా నోట్‍బుక్ చూసిన తెలుగు సారు, నాకు నేనుగా చేసిన గుణసంధిని చూసిన భలే ముచ్చట పడ్డాడు. పదో తరగతిలో వ్యాస రచన పోటీ బహుమతిగా రమణ మూర్తి సారు ఇచ్చిన ‘మహా ప్రస్థానం’ అంటే ఇప్పటికీ ప్రాణం. ఆ తరువాత కొద్ది రోజులకే చదివిన కృష్ణ పక్షంలో ‘ఆకులో ఆకునై’ వంటి మెత్తటి పద్యాల కన్న ముందు నాకు నచ్చింది  “వికృత క్రూర క్షుథా క్షుభిత వికట పాండుర శుష్క వదన దంష్ర్టాగ్నిలో నవ్వేలా….” అనే సమాస భూయిష్టమైన పద్యం అని చెబితే ఆ మధ్య కొందరు పెద్దలు అబద్ధం చెబుతున్నాననుకున్నారు. కాని, నిజం. అది నాకెందుకు అంత ఇష్టమయిందో, అర్థాలు తెలుసుకుని మరీ ఎందుకు ఆనందించానో తెలియదు. అది తెలిస్తే నాకు ఒకేసారి శివారెడ్డి, నగ్నముని, ఇస్మాయిల్, జాక్ లండన్, శరత్, డాస్టావస్కీ, గోర్కీ… ఇలా బిన్నమైన రచయితలు ఎందుకు ఇష్టమవుతారో తెలుస్తుందనుకుంటాను.

ఎనిమిదో తరగతిలో రాజేశ్వర రావు అనే ఒక బ్రాహ్మణ పిల్లాడు నా సావాస కాడు, బెంచ్ మేట్. తను ఏదో పేచీలో కట్టు దప్పి ‘సూద్దర వెధవలింతేలే’ అన్నాడు. నాకు చాల ఖోపం వచ్చింది. శూద్రత్వం, రైతు పని చాల గొప్పవని చెబుతూ, పనిలో పనిగా బ్రాహ్మణులను ఈసడిస్తూ రాసింది నా మొదటి కవిత. రాజేశ్వర రావు ఆ కాగితం తీసుకెళ్లి వాళ్ల చిన్నాన్నకు, అంటే, మా టీచరుకు ఇచ్చాడు. అప్పుడు నా అరిచేతి మీద తేలిన బెత్తం దెబ్బలు కవిత్వానికి గాను నేను పొందిన మొదటి బహుమతి. ఆ తరువాత అట్టాంటివి చాలానే దొరికాయి, రెండేళ్ల జైలు సహా. J

మా ఊళ్లో విజయాత్రేయ అని పద్య కవి, నవలా (ఎంవిఎస్ పబ్లికేషన్స్) రచయిత ఉండే వారు. పుస్తకాల మీద ప్రేమతో ఆయనకు, ఆ కుటుంబానికి చేరువ అయ్యాను. తెలుగు పేపర్ బ్యాక్ నవలలు వాళ్లింట్లో విపరీతంగా చదివాను. సెలవు వస్తే చాలు వాటి కోసం వాళ్లింటి అరుగు మీద వాలే వాడిని. ఆదివారాలు తప్పని సరి. ఆ ఇంట్లో వాళ్లు నన్ను ‘ఆదివారం గాడు’ అని పిలిచే వాళ్లు. అమ్మయ్య వాళ్లు చెబితే అంగడికి వెళ్లి ఆకులు వక్కలు తీసుకు రావడం వంటి పనులు చేస్తూ పుస్తకాలు చదివే వాడిని. ‘రాయడం’ అనే పని మానవ మాత్రులు చేసేదే అని, నేను మానవుడిని గనుక నేనూ రాయగలనని అనుకోడానికి విజయాత్రేయ, వాళ్లింట్లో పుస్తకాలు కారణం.

కిరోసిన్ లాంతరు మసక వెలుగులో మా ‘కత జెప్పే పుల్లన్న’ వాళ్లావిడతో కలిసి చెప్పిన ‘డక్కి కత’లు వింటున్నప్పడు కత/ కవిత నాది కూడా అని బలంగా అనిపించింది. గ్రామ పంచాయతీ రేడియోలో ‘అలుగుటయే ఎరుంగని….’ పద్యాలు విని సరిగ్గా అలాగే నాలో నేను పాడుకుంటూ ‘పద్యాలు’ రాసి విజయాత్రేయకు చూపించినప్పుడు తెలిసింది, పద్యాలకు ఛందస్సు అని ఒకటి ఉంటుందని. ఆ తరువాత కొద్ది రోజులకే ఛందస్సు అక్కర్లేని కవిత్వం ఉందని, అది నాకు బాగుంటుందని తెలిసింది. అప్పటికి రాసిన సీస పద్యాలు, తేటగీతులను సంతోషంగా చించేశాను. నిజం చెప్పొద్దూ, కాస్త పెద్ద వాడినయ్యాక, “అయ్యా, మీరు ఈ చందస్సు పద్యాలు కాకుండా కవిత్వం రాయండి” అని విజయాత్రేయకు ఆరిందా సలహా కూడా ఇచ్చాను, ఆయన వినలేదు గాని.

నా మొదటి కవిత (‘చాటుమాటు’) ప్రీ యునివర్సిటీ కోర్సు చదువుతుండగా ‘మినీ జ్వాల’ (‘జ్వాల’ పత్రిక కవిత్వ అనుబంధం) లో వచ్చింది. విజయవాడ శీష్ మహల్ లో సినిమా చూసి వస్తున్నప్పుడు భోరు వానలో తడుస్తూ, తనుగా లేచి దాపుకు వెళ్లడం చేత కాక దీనంగా విలపించిన ఒక కుష్టు రోగి, అతడికి సాయపడని నా హీనత్వం ఆ కవిత వస్తువు. అచ్చులో నా పేరు చూసి మా నాన్న సంతోషపడ్డాడు. రెండో కవిత: బీఎస్సీలో ఉండగా ‘జ్యోతి’మాస పత్రికలో వచ్చింది (‘జీవితం కాగితం’). నన్ను చుట్టు ముట్టిన పలు ‘సిద్ధాంతాలు’ నన్ను నాకు కాకుండా చేస్తాయని, ఎవరెవరో రాసుకోడానికి, బొమ్మలేసుకోడానికి నన్నొక కాగితాన్ని చేస్తాయని, అ ఇంకులు రంగులతో నేను ఉబ్బిపోవడం మినహా ఏమీ ఉండదని ఆ కవిత. దాన్ని చదివి ‘నువ్వు ఆర్టిస్టువిరా’ అని నా ప్రాణ స్నేహితుడు తమ్మినేని పుల్లయ్య మెచ్చుకోడం తీపి గుర్తుల్లో ఒకటి.

ఆ కవిత లోని అభిప్రాయంతో నేను ఉండిపోలేదు. విప్లవోద్యమం లోనికి వెళ్లాను. పూర్తి కాలం కార్యకర్తగా పని చేశాను. కవిత్వం ఉద్యమానికి పనిముట్టు అనే భావనతో.. అదీ సమయం దొరికినప్పుడు… రాశాను. తనకు ‘కవిత్వమే జీవితం’ అన్నందుకు నా ఇష్ట కవి శివుడితో పేచీ పడ్డాను. వచన కవితతో పాటు చాల పాటలు రాశాను. ‘తూర్పు చేని గట్టు కాడ/ చెట్టు పుట్ట గొట్టెటోడ’, ‘జాజర జాజర జాజర జాజా/ జాజరాడుదం, జమ గుడి పోదం’, ‘అదరకండి బెదరకండి పోరాడే రైతులార/ చెదరకుండ నిలవండీ జనం పోరు గెలిచి తీరు’ వంటి కొన్ని పాటలు ఇప్పటికీ కొందరు గాయకులకు తెలుసు. కవిత్వం రాయదల్చుకుంటే, ‘కవిత్వమే జీవితం’ అనుకుని పని చేయాలన్న శివుడి అభిప్రాయం పూర్తిగా సరైందని తెలుసుకోడానికి నాకు చాల రోజులు పట్టింది. ఇప్పటికైనా తెలిసిందో లేదో.

మొదటి కవితా సంకలనం ‘గుండె దండోరా’లో రెండు మూడు బలహీనమైన వచన కవితలు మినహా అన్నీ పాటలే. ఆపైన ప్రచురించిన కవితా సంకలనాలు ఏడు. ‘రస్తా’, ‘లావా’, ‘అబద్ధం’, ‘ఒక్కొక్క రాత్రి’, ‘నకులుని ఆత్మ కథ’, ‘చిన్న చిన్న ఘటనలు’, ఇటీవలి ‘వానలో కొబ్బరి చెట్టు’.

కథలు రాయడం కూడా ఇష్టం. కథ పేరుతో మళ్లీ కవిత్వం రాయకుండా ఉండాలని అనుకుంటాను. ఒక్కోసారి అది కుదరక, ‘పోన్లే’ అనుకుంటాను.

సాహిత్య విమర్శ అని అనలేను గాని, అలాంటి పని చేశాను. అలాంటి ప్రయత్నాల సంపుటి పేరు ‘సంబరం’. అందులో నేను సమర్థించిన ఉత్తరాధునిక భావనలు నాకు ఇప్పటికీ నచ్చుతాయి. ప్రజలతో సన్నిహితంగా బతకాలనే కోరికతో ఉద్యమ జీవిని కావాలని ఇటీవల మరోసారి ప్రయత్నించాను.  ‘సంబరం’లోని అబిప్రాయాల గురించి ఇప్పడేమంటావు’ అని అడిగారు. ‘అదే మాట అంటాను, కుదరకపోతే వద్దు లెండి’ అనేసి ఇక ఆ ప్రయత్నం మానుకున్నాను.

‘ఈనాడు’ ఉద్యోగిగా పావని, దినకర్ అనే పేర్లతో రాజకీయార్థిక విషయాల మీద బోలెడు వ్యాసాలు రాశానండోయ్. ఏం చెబుతున్నాననేది వదిలేసి ఎలా చెబుతున్నాననేది ఒక్కటే పట్టించుకుని రాస్తే చాల మంది ఇష్టపడతారని అప్పుడే తెలిసింది. మూడు నాలుగు మినహా ఆ వ్యాసాలు నా అభిప్రాయాలు కావు. ‘ఆస్థాన’ కవిత్వం ఎంత బాగున్నా ఎందుకు మంచిది కాదో ఆ విధంగా నాకు అనుభవమయ్యింది. ఆ కాలంలో కవిత్వం కూడా మారు పేరుతోనే రాశాను. ( అవి ‘కాలానికి కన్నం వేసి దొంగిలించిన కొన్ని క్షణాలు’). మోసం బయట పడ్డాక, ఇక ఉద్యోగంలో ఉండగా కవిత్వం రాయ లేదు. కవిత్వం రాయకుండా ఉండడం కుదరక, ఆ తరువాత ఆర్నెళ్లకు రాజినామా చేశాను.

 

3.   మీకు బాగా నచ్చే సాహితి ప్రక్రియ ఏది? ఒకవేళ కవిత్వం ఐతే అది కాకుండా ఇష్టమైన మరోటి చెప్పండి. ఎందుకు ఇష్టమో కూడా.

 

పాఠకుడిగా నాకు బాగా నచ్చే సాహిత్య ప్రక్రియ కథ. ఆ తరువాత వరుసగా కవిత్వం, నవల, వ్యాసం. చాల సార్లు చిన్న కథగా రాయాల్సిన దాన్ని నవలగా పెంచుతారని నాకు అనిపిస్తుంది. అందుకని గొప్పగా ఉందని ఎవరో చెబితే తప్ప నవలల జోలికి పోను. వీలయినంత వరకు కథలు చదవడానికే ఇష్టపడతాను. (క్రైమ్ థ్రిల్లర్లు వేరు. అవి తాత్కాలికి మరణాలు. నన్ను నేను భరించలేక పిచ్చి పట్టి పోవడం కన్న, తప్పుడు నిర్ణయాలకు బలైపోవడం కన్న… ఒక్కోసారి అవే మేలు అనిపిస్తాయి.)

రచయితగా కవిత్వం ఎక్కువ ఇష్టం. ఆ తరువాతే కథ, వ్యాసం. కవిత్వం ఇచ్చే సాంత్వన (రచయితకు) ఇంకేవీ ఇవ్వవు. రాసే వరకు ఒక చోట కూర్చోనీయని అలజడి, రాశాక ఒక విముక్తి భావన చాల బాగుంటాయి. నా అనుభవం మేరకు; కథ కోసం ఓపిగ్గా ఆలోచించాలి. తగినంత మానసిక సంయమనం, భౌతిక తీరిక అత్యవసరం. బతుకులోని డిటెయిల్ ని శ్రద్ధగా చూడడానికి, అలా జరుగుతుందా, అలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించుకోడానికి, ఆపైన ప్లాట్ నిర్ణయించుకోడానికి, చివరికి ఎవరూ డిస్టర్బ్ చేయకుండా కూర్చుని రాసుకోడానికి తగినంత సౌకర్యం, స్థలం, సమయం, ఓపిక అవసరం. అవి నాకు ఇటీవలనే దొరుకుతున్నాయి. మునుపు లేవు.

కవిత్వం వేరు. ఒక భావోద్వేగం లోపలికి ప్రవేశిస్తుంది. గుండెకు గుచ్చుకుంటున్నట్లు తిరుగుతూ ఉండిపోతుంది. వదలదు. ఏ పని చేస్తున్నా లోపల రసాయనిక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒక పదంతో ఒక ఘటనతో లింకప్ అయినప్పుడు మనసు కాంతివంతం అవుతుంది. వెంటనే రాయకపోతే చాల కోల్పోతానని అనిపిస్తుంది. (ఔను, ‘క్యాపిటల్’ రాయకపోతే బతుకు వ్యర్థమని మార్క్సుకు అనిపించినంతగా అనిపిస్తుంది). రాయకుండా ఉండడం అసాధ్యమవుతుంది. అచ్చంగా రాయడానికి ఎంతో సేపు పట్టదు. రాసింది బాగుంటే బాగుంటుంది లేదా చించెయ్యొచ్చు. ఒకటి రెండు పేజీలే కదా?! అదే కథ అయితే, చించెయ్యాల్సి వస్తే ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. ఒక మేరకు మా‍ర్పులు అవసరమే గాని, మొదటి ఫీలింగ్స్ ని ఎడిట్ చేసుకోవడం వల్ల పద్యం చెడిపోతుందని నా అనుభవం. కవిత్వం రాయబడే ‘సమాధ్యవస్థ’ అనబడేది ఏదో ఉంది. ఏదో రహస్యం ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే; నేను కథ రాయకుండా, మందు కొట్టకుండా ఉండగలను. కవిత్వం రాయకుండా, సిగరెట్లు కాల్చకుండా ఉండలేను. J

పాఠకులకు ప్రయోజనమంటారా? కవిత్వం ‘ఆనందం’ ఇస్తుంది. సాంత్వన ఇస్తుంది. ‘ఓహ్ నేను అనుకుంటున్నది నిజమేనే’ అని భరోసా ఇస్తుంది. మంచి కవిత్వమైతే మరి మరి చదువుకోవాలని అనిపిస్తుంది. తగిన సందర్భంలో గుర్తుకు వచ్చి అవాంఛనీయ ఆలోచనలను వాయిదా వేయిస్తుంది. నడిపిస్తుంది. ఒక పాఠకుడిగా నాకు కవిత్వం చాల మేలు చేసింది. చాల సార్లు నన్ను బతికించింది.

పాఠకుల మీద ప్రభావం విషయంలో కవిత్వానిదే పెద్ద పీట. నా మట్టుకు నేను కథ/నవల, కవిత్వం రెండూ బాగానే చదివాను. నా జీవితాన్ని కవిత్వం ప్రభావితం చేసినంతగా కథ/నవల ప్రభావితం చేయలేదు. అంతే కాదు, ప్రాథమికంగా‍ కవినై ఉండడం వల్ల ఒక పాత్రికేయుడిగా నాకు ఎక్కువ మేలు జరిగింది. (కవుల మాటలు తీసుకుని హెడ్డింగులు పెట్టడం వంటి చిన్న ‘మేలు’ కాదు). భాష మీద, మానసిక రీతుల మీద పట్టు సంపాదించడానికి కవిత్వం ఎక్కువ ఉపయోగపడుతుంది. కథకుడి మాదిరిగా కాకుండా కవి తక్కువ మాటల్లో, అదీ నిర్దిష్టమైన, నిర్దుష్టమైన మాటల్లో మాట్లాడాల్సి ఉంటుంది. కవితలో సమాచారం తప్పైతే కొంపలేం మునగవు. సమాచారం కోసం ఎవరూ కవిత్వం చదవరు. చదవకూడదు. కవి చెప్పిన వాస్తవాల్ని క్రాస్ రెఫరెన్సు తరువాత తప్ప తీసుకోరు. భాషా ప్రయోగంలో, పీలింగ్స్ విషయంలో కవి తప్పులు చేయగూడదు. తగిన పదాల కోసం, ఫీలింగ్స్ ని సరిగ్గా పట్టి ఇచ్చే పదాల కోసం కవి తనను తాను తవ్వుకోవాల్సి ఉంటుంది. అందు వల్ల భాష మీద, మానసికాంశాల మీద పట్టు కోసం కవిత్వం చదవడం ఒక అవసరం.

ఊళ్లలో వినిపించే సామెతలలో, ఇచ్చకాలలో, తిట్లలో కవిత్వం ఉంటుంది. ఉదా: ‘గోడలకు చెవులు’, ‘తల మాయ’. మా నాన్న నుంచి విన్న ‘గుడ్డు పెట్టే కోడికి తెలుసురా ముడ్డి మంట’, మా అమ్మ నుంచి విన్న ‘వాదు ల్యాక వల్లూరుకు పోతొండా ఇరుగు పొరుగు నా సవుతులార ఇల్లు బద్రమే’ వంటి మాటల్లో కవిత్వం ఉంది. నా నాల్గవ తమ్ముడు, ఏడాది నిండని వాడు చనిపోయినప్పుడు రాత్రంతా ఏడ్చిన అమ్మ మాటల్లో కవిత్వం ఉంది. అమ్మమ్మ తాతయ్య చెప్పే కతల్లో కథ ఉంటుంది. భాష లోని సౌందర్యం సామెతలు, నుడికారాలు, ‘విచిత్రా’లే కదా?! దాదాపు ప్రతి అమ్మమ్మ కత చెబుతుంది. ఊళ్లో కొద్ది మంది మాత్రమే కొత్త కొత్త సామెతలు, నుడికారాలు, విచిత్రాలతో మాట్లాడి మనసును కాస్త పైకెత్తుతుంటారు. అందరం వాళ్ల గురించే మాటకారులని అంటాం. కత ఎప్పుడైనా చెప్పొచ్చు, చెప్పడానికి/వినడానికి తీరిక ఉంటే చాలు. కవిత్వం అనదగిన మాటలను కొన్ని ‘ఉద్రిక్త’ సమయాల్లోనే అంటాం/వింటాం. ఆ మాటలు మన తీరిక కోసం ఆగవు. కవితకు కథకు చాల తేడా ఉంది. కవిత్వం బతుకులోని తడి, కథ అంటే బతుకే.

కొత్తగా చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే తప్ప వ్యాసం రాయగూడదు. కొత్తది సమాచారం కావచ్చు, ఉన్న సమాచారంలోనే కొత్త కోణం కావచ్చు. అలాంటి అవసరం లేకుండా వ్రాసిన వ్యాసాలు చదవాల్సి వస్తే, రచయితను తిట్టిపోయాలనిపిస్తుంది. అలా రాసినందుకు నన్ను నేను తిట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కవిని, కథకుడిని మాత్రం… అది నేనే అయినప్పుడు కూడా… అలా తిట్టాలని అనిపించదు. బాగో లేదని చెప్పాల్సి వస్తే తప్పకుండా చెప్పాలి. దాని కన్న ముందు రచయిత ప్రయత్నాన్ని అభినందించాలని అంటాను. (ఇది నా మీద నా సానుభూతి (ప్యాట్రనైజేషన్) అనుకోవచ్చా? ఏమో!)

 

4.   కవిత్వానికి మీ నిర్వచనం, కవిత్వం కవికి ఎలా పనికొస్తుంది, పాఠకుడికి ఏమైనా పనికొస్తుందా?:)

 

కవిత్వం అనిర్వచనీయం. బతుకు లోని అనిర్వచనీయాలను వ్యక్తం చేయడానికే కవిత్వం ఉంది. సైన్సుకు, హేతువుకు, తర్కానికి అందని అజ్ఞాతాలను జ్ఞాతం చేసుకోవాలనే బలమైన కోరికకు అక్షర రూపం కవిత్వం. మనుషులకు కవిత్వం బాగా అనుభవం లోనికి వచ్చే కొద్దీ దేవుడి అవసరం తగ్గిపోతుందని నా నమ్మకం.

‘బతుకులో చాల దుఃఖం ఉంది. మీ కవిత్వంలో దుఃఖం, క్షోభ ఎందుకు కనిపించవు’ అని ఓసారి ఇస్మాయిల్ గారిని (ఉత్తరంలో) అడిగాను. కష్టాలు, సంక్షోభాల జీవితం లోంచి కవిత్వం ఆనందాన్ని పిండి ఇవ్వాలని ఆయన అన్నారు. ‘పిండి ఇవ్వడం’ అంటే జీవితం లోంచి ఆహ్లాదకర విషయాల్ని యాంత్రికంగా వేరు చేసి ఇవ్వడం కాదు. ‘భూమి గుట్టు తెరవబోయి బిరడాలో ఇస్క్రూలా ఇరుక్కున్న పురుగు’ నిజానికి ఒక అసంతోషం, స్వేచ్ఛ యొక్క తీవ్ర పరిమితి. కన్నీళ్లు, సంక్షోభాలు, విస్తరించే శూన్యాలు.. దేని లోంచి మాట్లాడినా కవిత్వం పరమావధి ‘ఆనంద’మే.

ఆనందం ఇచ్చే క్రమంలోనే కవిత్వం మనుషుల మనస్సులను ప్రభావితం చేస్తుంది. మనుషులు మనుషులుగా తయారు కావడానికి దోహదం చేస్తుంది. “విప్లవ కెరటం నన్ను ‘ఫ్రాడ్’ చేసింది” అన్నాడొక సారి శ్రీశ్రీ. విప్లవం సంగతేమో గాని, కవిత్వం మనుషులను ‘ఫ్రాడ్’ చేస్తుంది. దీన్ని విస్మరించి ప్రయోజనం లేదు. ఈ మేరకు ‘శుద్ధ కవితా’ వాదం అసాంఘికం. తన వాక్కు సమాజాన్ని ప్రభావితం చేస్తుందని కవి మరిచిపోకూడదు. ‘నాకు బాగున్నది నేను చెబుతానంతే’ అనడం ఒక రకం క్రూరత్వం. కవిత్వం ప్రచారం కోసం కాదు గాని, రాసి ప్రచురించిన ప్రతిదీ దేన్నో ఒక దాన్ని ప్రచారంలో పెడుతుంది. కవిత్వం ‘కదిలేదీ కదిలించేదీ’ అనే స్పృహ కవికి ఉండాలి. కవిత్వంలో మంచి సెబ్బరలపై మాట్లాడే సందర్భాల్లో ఈ ఆలోచన మరింత ముఖ్యం. తరచు దీన్ని ‘వస్తు చర్చ’ అంటూ ఉంటారు. అందమైన పాత్రలో విషం ఇచ్చినా ఫరవాలేదా అనే ఎదురు ప్రశ్నకు జవాబు లేదు.

 

5.    వ్యక్తి జీవితంలో కానీ, సమాజంలో కానీ సాహిత్యం/కవిత్వం ఉండటానికి లేకపోవడానికి మధ్య తేడా ఏమిటని మీరనుకుంటున్నారు?

 

కవిత్వం లేని సమాజం ఎండిపోయిన పువ్వు లాంటిది. ఎండిపోతేనేం అనుకుంటే పేచీ లేదు. ఎండబెట్టిన మాంసం, కూరల్లాగే ఎండిపోయినవి ఎక్కువ కాలం మన్నుతాయి. కాని, తడి ఉన్నవే బాగుంటాయి. అవే ఎక్కువ ఆరోగ్యం.

ఇవాళ మనకు కనిపిస్తున్న చాల ఘోరాలకు కారణం ఏమిటి?

తినడానికి తిండి, తలదాచుకోడానికి ఇల్లు లేకపోవడం, నిరుద్యోగం వంటి సమస్యలున్నాయి. రాను రాను ఈ కనీసావసరాల తీవ్రత తగ్గుతోంది. ఇందిరా గాంధీకి ‘రోటీ, కపడా ఔర్ మకాన్’ అంటే ఓట్లు పడ్డాయి. రాజశేఖర రెడ్డి వాటికి విద్యా, వైద్యాలను కలిపితే గాని ఓట్లు పడలేదు. ఈ అజెండా నుంచి ఏ పాలకుడూ తప్పించుకోలేడు. కొత్తగా వచ్చే పాలకుడు ఉన్న వాడిని బలిమిని తొలగించాలి లేదా అజెండాలో ‘భద్రత’ వంటి మిగిలిన నిత్యావసరాలను చేర్చి ఓట్లు అడగాలి. అదీ నేటి జీవితం. నిత్యావసరాల తీవ్రత ఇటీవల బాగా తగ్గింది. మరి; చుట్టూరా ఈ అలజడి, ఆందోళన, ఆత్మహత్యలు ఎందుకున్నట్లు? అట్టడుగు పొరల్లో ఇంకా జనం ఉన్నారు గాని, చాల మంది ఎగువకు పాకి ‘మధ్య తరగతి’లో చేరిపోయారు. అలజడులు, అందోళనలు, ఆత్మహత్యలు మధ్య తరగతిలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి కనీసావసరాలకు పరిమితమైనవి కావు. కొత్త కారణం ఏమిటి?

రింగు రోడ్డు మీద బోల్తాపడి నిండు ప్రాణాల్ని బలి తీసుకున్న ఖరీదైన బైకుల వెనుక, కొత్తగా మొలిచిన ఫ్యాషన్లను అందుకోలేని నిరాశతో పక్కదారులు పడుతున్న యువకుల వెనుక, వాస్తవికత పునాది లేని ఉద్యమాలలో ఆత్మహత్యల వెనుక… అసలు కారణం ఏమిటి? వీళ్లు కేవలం కూడు గుడ్డ లేని పేదవాళ్లు కాదు. జీవితం పట్ల ఆసక్తిని కోల్పోయిన వాళ్లు. వీటి వెనుక ఉన్నది ఒక రకమైన ‘బోర్డమ్’, సమాజం ‘ఎండిపోవడం’. సమాజం ఎండిపోకుండా, బతుకులో తడిని చేర్చగలిగేది ఏమిటి?

బడిలోనయినా, బయటైనా మనుషులను మనుషులుగా కాకుండా ‘సంపాదన యంత్రాలు’గా తయారు చేసే జీవితమే ఇవాళ ఉంది. ఇంత ‘ప్రొజాయిక్’ బతుకు ఇంతకు ముందు ఉండిందా? నీషే ఫిలాసఫించినట్లు ‘దేవుడు చనిపోయాడు’. దేవుడిని నమ్మం, నమ్ముతాం అనే ఇద్దరిలోనూ దేవుడు చనిపోయాడు. దేవుడు ఇచ్చే సాంత్వన లేదు. హృదయం/ ఆత్మ లేని సమాజానికి మతమే హృదయం/ఆత్మ అయ్యిందన్నాడు మార్క్సు. ఇప్పుడు వట్టి ‘క్రతువు’గా, ఇంకేవో అవసరాల వేదికగా తప్ప మతం లేదు. దేవుడి స్థానాన్ని కేవలం ‘మానవుడు’ భర్తీ చేయలేడు. మత విశ్వాసం స్థానాన్ని కేవలం ‘మానవత్వం’ భర్తీ చేయలేదు. భర్తీ చేయగలిగింది ఏమటి?

వినోదానికి కూడా వినియోగ వస్తువుగా తప్ప చోటు లేదు. ఆటలు, టీవీ, సినిమా వంటి వినోదాలలో ఉన్నది సంపాదన-కేంద్రకమైన హృదయ విదారక పోటీయే. వీటిలో సామాన్యులు వట్టి ప్రేక్షకులు లేదా ‘విజయులను’ చూసి అసూయ పడాల్సిన వాళ్లు. మనుషులు కేవలం ప్రేక్షకులుగా ఉండలేరు. తాము కూడా పాల్గొనే వినోదాన్ని కోరుకుంటారు. ప్రతి కదలికను ‘శ్రమ’గా ప్యాక్ చేసి, పోటీ పడి, అమ్ముకోలేకపోతే ఇప్పుడు దేని లోనూ పాల్గొనలేం. క్రికెట్ కామెంటరీలో ఆ యుద్ధ భాష ఎందుకు? హాయిగా ఆడుతూ పాడుతూ బతకడం కాకుండా నృత్య గానాలలోనూ ‘చెమటోడ్చడం’ ఎందుకు?

చాలకాలం క్రితం సోర్బాన్ (1968) విద్యార్థులు ఈ పరిస్థితిని చక్కగా వ్యక్తం చేశారు. అన్నం మాత్రమే కాదు మాకు అన్నీ కావాలన్నారు. ముఖ్యం గులాబీలు కావాలన్నారు. సౌందర్యం కోసం వీథులకెక్కారు. వాళ్లు అడిగిందీ నేటి సమాజంలోని ఖాళీని పూరించేది ఒక్కటే, ఈస్తటిక్ సౌందర్యం. అది సమాజంలో అత్యధికులకు అందుబాటులోకి వచ్చే కొద్దీ నేటి ‘రాహిత్య’ రూపాలన్నీ తోక ముడుస్తాయి. మనుషులు జీవితాన్ని ఆనందిస్తారు. ‘బోర్డమ్’ కు ఇదే తగిన జవాబు. ఇది కుదురుకునే వరకు అలజడి, ఆందోళన, ఆత్మ హత్యలు ఉంటాయి. బతకడం కన్న చావడం మేలని అనిపించడం ఉంటుంది. బతుకులో లేని సౌందర్యాన్ని మరణంలో వెదుక్కోవడం ఉంటుంది. అది ‘గ్లామరస్’ గానూ ఉంటుంది.

సహజ సౌందర్యంతో కూడిన జీవితానికి, జీవితేచ్ఛకు కవిత్వం, కథ మంచి సాధనాలు. డబ్బు లేకపోయినా సాధ్యాలు.

అందరూ తెలుగు భాష బతుకుతుందా లేదా అని చర్చిస్తున్నారు. తెలుగులో వ్యవహరించే వాళ్లు ఉన్నంత వరకు, దానిలో వ్యవహారాలు జరిగినంత వరకు తెలుగు భాష ఉంటుంది. వ్యవహారాలకు చాలక పోవడం వల్ల (మరో మాటలో, అవసరం లేకపోవడం వల్ల) తెలుగు భాష అదృశ్యమైతే పోయిందేం లేదు. తెలుగులో ఇంగ్లీషు పదాలు కలిసిపోవడం గురించి ఇలాంటి గగ్గోలే వినిపిస్తోంది. నిన్న సంస్కృత పదాలు, ఉర్దూ పదాలు తెలుగును ముంచెత్తితే ఏ ఫిర్యాదు లేదు. ఇవాళ తెలుగులో ఇగ్లీషు పదాలు కలిస్తే ఎందుకంత వీరంగం? వ్యవహారంలో ఉన్న భాష కథకు, కవిత్వానికి అవసరం. అలాంటి భాష ఎప్పడూ ఉంటుంది. మనుషులు ఉన్నంత కాలం ఉంటుంది. తెలుగు లేదా మరొక భాష కాదు; కథ, కవిత్వం ఉంటాయా లేదా అనేది అసలు సమస్య. ఇక ముందు మనుషులు ఎండిపోయిన జీవితానికి అలవాటు పడతారా లేక సరదాను, సౌందర్యాన్ని విస్తరిస్తారా అన్నదే వ్రశ్న.

‘బూర్జువజీకి ఒకే ఒక్క సరదా ఉంటుంది, అన్ని సరదాలను పాడు చేసే సరదా’ అని గుర్తు చేసినందుకు కూడా 1968 సోర్బాన్ పిల్లలంటే నాకు ఇష్టం. ఆ పిల్లలు వేలెత్తి చూపిన ‘నెగటివ్ సరదా’ను విమర్శించడం ద్వారా కవిత్వాన్ని, కథను కాపాడుకోగలమని అనుకుంటాను.

 

6.    కవిత్వం లోపల్నుండి తన్నుకొచ్చే ఒక ఆవేశంతో మొదలౌతుంది. ఉద్యమం లోలోపల రగిలించే ఒక ఆశయంతో కదులుతుంది. ఉద్యమ కవిత్వమూ, కవితా ఉద్యమాలపై మీ అభిప్రాయాలూ, అనుభవాలూ, ప్రయోగాలు చెప్పండి.

 

మీరన్నది నిజమే. ‘కవిత్వం లోపల్నుండి తన్నుకొచ్చే ఒక ఆవేశంతో మొదలౌతుంది’. సమాజం ‘లోపల రగిలే ఆశయంతో ఉద్యమం మొదలౌతుంది’. ఉద్యమాలు సమాజం చెప్పే కవిత్వాలు.

మిగతా అన్ని అనుభవాల వంటిదే ఉద్యమంలో ఉన్న వ్యక్తి అనుభవం కూడా. అంత కన్న ఎక్కువా కాదు తక్కువా కాదు. అటు కొందరు ఇటు కొందరం చేరి వాదించుకోనక్కర్లేదు. నేను ఉద్యమ కవిత్వాలతో ఉన్నాను. ఉద్యమేతర కవిత్వాలతోనూ ఉన్నాను. ఉంటాను. కవితా ఉద్యమాలతో లేను గనుక వాటి గురించి ఏమీ చెప్పలేను. అసలు తెలుగులో కవితా ఉద్యమాలు అనేవి సంభవించాయా? దిగంబర కవితోద్యమం అలాంటి ఒక ప్రయత్నం. అంతకు మించి…? వచని కవితోద్యమం ఒకటి ఉందని అంటే అనవచ్చు. సర్రియలిజం, డాడాయిజం వంటివి తెలుగులో కాస్త ప్రస్తావితం అయ్యాయే గాని,  అనువదితం కాలేదు. వాటి మీద ఒకరిద్దరు తీసుకున్న పి.హెచ్.డి. పత్రాలను చూస్తే ‘ఓరి దేవుడా’ అనిపిస్తుంది. అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాలు కవితోద్యమాలు కావు. అది సామాజిక ఉద్యమాలకు బాసటగా వచ్చిన కవిత్వం, అంతే. దళిత, స్త్రీవాద ఉద్యమాల విషయంలోనూ నేను ఇలాగే అనుకుంటున్నాను.

ఏ ఒక్క ఉద్యమం చిరస్థాయిగా ఉండదు. ప్రాణ శక్తిని కోల్పోయాక, తను ఏమి సాధించగలదో దాన్ని సాధించాక, ఉద్యమం ఉండదు. తాను చేయగలిగింది చేసి, సాధారణ జీవితంలో కలిసి పోతుంది. లేదా, స్వరూప స్వభావాలు మార్చుకుని కొత్త అవసరాల కోసం మరో ఉద్యమం అవుతుంది. పేరు అదే కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఉద్యమాలు లేకుండా సమాజం ఉండదు. సమాజం ఉద్యమాల రూపంలో గుణాత్మక మార్పులకు లోనవుతుంది.

తమ జీవితాలకు సంబంధం లేకపోవడం వల్ల కావచ్చు, తమ ప్రయోజనాలకు విరుద్ధం కావడం వల్ల కావచ్చు, వాటిని పట్టించుకుంటే గొప్ప కవిత్వం అసాధ్యమని నిజాయితీగా విశ్వసించడం వల్ల కావచ్చు… కొందరు కవులు ఉద్యమ స్పర్శకు దూరంగా ఉంటారు. అది తప్పూ కాదు, ఒప్పూ కాదు. నేను వాళ్ల నుంచి నేర్చుకుంటాను. ఉద్యమంలో తలమునకలవుతున్న వ్యక్తి కూడా ఇరవైనాలుగ్గంటలు ఉద్యమ జీవిగా ఉండడు. ఒక భర్తగా, ఒక తండ్రిగా, కొడుకుగా, స్నేహితుడిగా, ప్రేమికుడిగా ‘వ్యక్తిగత’ జీవితం ఉంటుంది. ఆ అనుభవాలూ రాయిస్తాయి. పూర్తికాలం విప్లవకారుడిగా ఉన్నప్పుడు రాసిన ‘లావా’ కవిత్వంలో నా వ్యక్తిగతం కూడా ఉంది. వ్యక్తిగతానికి, సామూహికానికి మరీ అంత దళసరి గీత ఉంటుందని అనుకోను. చర్చించాల్సింది కవిత్వాన్ని, ఉద్యమాన్ని కాదు.

ప్రయోగాలు అనే పెద్ద మాట వాడలేను. ఒకే రకం జీవితం జీవించలేదు. అలాంటప్పుడు ఒకే రకం కవిత్వం ఉండదు. జీవితంలోని ప్రయోగాలు కవిత్వంలో కనిపిస్తాయి. అన్నిటిలో అనుసరించిన సూత్రం ఒకటే: నాకు తెలియనిది తెలిసినట్టు పోజు కొట్టే కవిత్వం రాయొద్దు, నేను చేయనిది/ చెయ్యొద్దని అనుకుంటున్నది…. గిరాకీ ఉంది కదా అని… చేస్తున్నట్టు రాయొద్దు, చెప్పాలని బలంగా అనుకున్నది ఏ సమూహానికైనా బాధ కలిగిస్తుందేమోనని చెప్పడం మానెయ్యొద్దు, issue to issue కలిసి నడవాలే గాని ఎవరినీ అనుసరించొద్దు, ఎవరూ నన్ను  అనుసరించాలని కోరుకోవద్దు. నాకు నిమగ్నత, స్నేహం, ప్రేమ ఇష్టం. నిబద్ధత, విధేయత, భక్తి అయిష్టం. ఉత్తి అయిష్టం కాదు, కోపం. ఒక భావోద్వేగంగా ఈ కోపం నా కవిత్వంలో ఉంది. అది చాల సార్లు నా మీద నా కోపంగానే ఉంది. J

 

7.   తెలుగులో వచ్చిన, వస్తున్న కాల్పనికేతర సాహిత్యం గురించి ఏమంటారు. తెలుగేతర భాషలతో చూస్తే సంఖ్య, స్థాయి విషయంలో వీటి స్థానం ఏమిటి? మీకు బాగా నచ్చిన; ప్రభావితం చేసిన నాన్-ఫిక్షన్ పుస్తకాలేమిటి? తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ

 

తెలుగులో కాల్పనికేతర (కవిత్వేతర) సాహిత్యం తగినంతగా రాలేదనుకుంటాను. మహీధర నళినీమోహన్ సైన్సు పుస్తకాలు, నండూరి రామ్మోహన రావు విశ్వదర్శనం, నరావతారం వంటి పుస్తకా‍లు, కొడవటిగంటి సైన్సు వ్యాసాలు చాల చాల బాగుంటాయి. హాయిగా చదివించడంతో పాటు వాటి నుంచి తెలుసుకోడం కూడా వుంటుంది. జీవితం గురించి ఒక చూపు ఏర్పడడానికి, చూపు విశాలం కావడానికి ఉపయోగపడతాయి. అనువాదమే గాని; టెడ్ అలెన్, సిడ్నీ గోర్డన్ లు ‘గతి తార్కిన భౌతిక వాదా’న్ని పరిచయం చేస్తూ రాసిన పుస్తకం నా జీవితంలో ఒక మలుపు. విశ్లేషణలో, ఆలోచనలో ఇప్పటికీ నాకు నచ్చిన మోడల్. నన్ను హాంట్‍ చేసే మరో పుస్తకం కూడా అనువాదమే, (దాన్ని కవిత్వం అంటారేమో), ఏంజిలా కాట్రోచ్చి పుస్తకానికి శ్రీశ్రీ తెలుగు ‘రెక్క విప్పిన రెవల్యూషన్”.

గతంలో ‘అభిసారిక’ వంటి పత్రికలలో కాస్త చదవదగ్గ మంచి సమాచారం ఉండేది. ‘ఈనాడు’లో సమరం గారు ఆ పనిని కొంత కాలం కొనసాగించారు. నరసింహరావు గారు నడిపించిన పత్రిక (దాని పేరు ‘మార్పు’ అనుకుంటా) చాల ఆసక్తికరంగా నడిచింది.

మనస్తత్వ శాస్త్రంలో కనీస ప్రవేశం లేని వాళ్లు వ్యక్తిత్వ వికాసం పేరిట ఎక్కడెక్కడో ఏరుకొచ్చిన సమాచారంతో రాసిన నిష్పూచీ పుస్తకాలు చాలానే వచ్చాయి. యువతీ యువకులలోని అభద్రత భావాన్ని సొమ్ము చేసుకోడం మినహా వీటి వల్ల ప్రయోజనం ఉందని అనుకోను. కె.ఎన్. వై. పతంజలి చివరి రోజుల్లో రాసిన ‘గెలుపు సరే… బతకడం ఎలా’ అనే పుస్తకం చాల బాగుంటుంది. అలా నిర్మొహమాటంగా మాట్లాడి ఒప్పించిన పుస్తకాలు ఇంకేమైనా ఉన్నాయా?

ఇతర భాషల్లో కాల్పనికేతర సాహిత్యం… అల్తూజర్, గ్రాంసీ, ఫుకో, లేటార్డ్, బార్త్, డెరీడా, సయీద్, చాంస్కీ లు ఈ కాస్తయినా తెలియకపోతే; ఉద్యమంలో క్రియాశీల పాత్ర వదిలేశాక మిగిలిపోయిన నన్ను నేను అర్థం చేసుకోడం చాల కష్టమయ్యేది. ఇక్కడ నేనొక విషయం అంగీకరించాలి. ఉత్తరాధునిక భావనలను అసలు రచయితలపై వచ్చిన వ్యాఖ్యానాల ద్వారానే ఎక్కువగా అర్థం చేసుకున్నాను. నాది ‘పీఠికా పాండిత్య’మే, ‘సాధికారికం’ కాదు. బి. తిరుపతి రావు ‘పోస్ట్ మోడర్నిజం’ పుస్తకానికి మార్సిస్టు వ్యతిరేకత కేంద్ర బిందువు కాకపోయి ఉంటే, దాని వల్ల చాల మేలు జరిగేది.

 

8.     కవిగా, చదువరిగా వేర్వేరు దశల్లో మీ ఆలోచనలు, అబిరుచుల్లో వచ్చిన మార్పులు, తొక్కిన కొత్త దారులు.. ఈ మధ్య కాలంలో ఆకట్టుకుంటున్న రచయితలు, రచనలు, సాహిత్య ధోరణలు వగైరా?

 

ఇప్పటికే మీకు తెలిసిపోయింది. సాహిత్యంలో ‘గాడ్ పాదర్స్’ కా‍దు గదా, నా వాళ్లు అని చెప్పుకోదగిన మనుషులెవరూ నా జీవితంలో లేరు. ప్రతి అడుగూ చీకటిలో తడుములాట. అడివిలో ఒంటిరి పయనం. బాగా చిన్నప్పడు, క్లాసులో మొదటి సారి పాఠంగా విన్నప్పడే బౌద్ధం, కమ్యూనిజం చాల గొప్పవి, నావి అనిపించాయి. అందులో మార్పు లేదు. మానవ స్వభావాన్ని అర్థం చేసుకోడంలో నాలో కొంత మార్పు ఉంది. తాము బౌద్ధాన్ని, కమ్యూనిజాన్ని ఇష్ట పడతామని అనే వాళ్లంతా గొప్ప వాళ్లేనని ఒకప్పుడు అనుకునే వాడిని. వాటిని కూడా ‘వాడుకునే’ వాళ్లు ఉంటారని తెలిశాక, మొదట పట్టరాని దుఃఖం కలిగింది. తరువాత ఆ దుఃఖం నా జ్ఞానం (knowledge)గా మారింది. నా దుఃఖాన్ని, జ్ఞానాన్ని లోకంతో పంచుకోడానికి ప్రయత్నించాను. వినాయకుని బొడ్డులో వేలు పెట్టి తేలు కాటు తిన్న దొంగ ‘తనకు అద్భుతానందం కలిగింద’ని అబద్ధం చెప్పడం ద్రోహమని, ఆ జ్ఞానాన్ని సహచరులకు పంచడం అతడి కనీస ధర్మమని అనుకున్నాను.

‘హిపొక్రసీ’ ఒక విశ్వజనీన, విశ్వకాలీన విశేషం. దాన్ని అధిగమించి మనిషి వేసే ఒక్కొక్క అడుగు మంచి ప్రపంచం దిశగా ఒక్కొక్క విజయం. హిపోక్రసీ-వ్యతిరేకత ఇవాళ్టి కవి చేతనకు, మానవ ప్రవర్తనకు కేంద్ర బిందువుగా ఉండాలని కోరుకుంటాను.  హిపోక్రసీ లేని చోట చావు కూడా పెళ్లి వంటిదే, అది ఉన్న చోట పెళ్లి కూడా….!

కవిత్వంలో శ్రీశ్రీ మార్గం, కథనంలో కొకు దారి నాకు బాగా ఇష్టం. శ్రీశ్రీ మార్గమంటే ‘మహా ప్రస్థానం’ మాత్రమే కాదు, ఖడ్గసృష్టి కూడా. శ్రీశ్రీలోని ‘శబ్దం’, ఇస్మాయిల్ లోని ‘నిశ్శబ్దం’, నగ్నముని లోని సూటి మాట, శివుడి లోని సంక్లిష్టత ఏ ఒక్కటీ అన్ని సందర్భాలకు పనికొచ్చేది కాదు. ఏది ఎప్పుడు ఎలా అనేది కవి తనకు తాను చేసుకోవలసిన నిర్ణయం.

ఇంగ్లీషులో జాక్ లండన్ అంటే, ఆయన వచనంలోని కవిత్వం అంటే చాల ఇష్టం. ఇటీవల రాబర్ట్ బ్లై పద్యాలు నాకు చాల బాగుంటున్నాయి. చదువుతుంటే లోపల పొద్దు పొడుస్తున్నట్టు, వెన్నెల కాస్తున్నట్లు ఉంటుంది. ఇంకా చదవాలి, రాయాలి. పతంజలి అన్నట్లు ఒక కవి తన బతుకంతా అన్ని సార్లు రాసేదీ ఒకే ఒక్క పద్యమే అయిప్పటికీ.

 

9.     మతానికి, నమ్మకాలకి, ఒక్కోసారి తర్కానికీ కూడా అతీతమైన తాత్విక జిజ్ఞాస , ఆసక్తి కవుల్లో ఎంతో కొంత ఉంటుంది. ఈ దారిలో మీ ఆసక్తి, అనుభవాలు, దొరికిన మార్గదర్శకాలు గురించి?

 

చాల బాగా చెప్పారు. కవి ఎప్పుడూ జిజ్ఞాసానందుడే, వివేకానందుడు కాడు. తన అన్వేషణలో భాగంగా అప్పుడప్పుడు కొన్నిటికి అనుచరుడిలా కనిపిస్తాడు. ఎప్పుడూ నాయకుడు మాత్రం కాడు. కవి జవాబును వెదకడానికి ప్రేరణ ఇచ్చే ప్రశ్నే గాని, జవాబు కాడు.

కవిగా నన్ను నడిపించిన అనుభూతి ‘ఆశ్చర్యం’. ఒక ఘటన, మాట, ఊహ నాకు కలిగించిన ఆశ్చర్యం పంచుకోడానికి రాయాలనిపిస్తుంది. మతం, నమ్మకం, ఒక తర్కం ఆశ్చర్యం కలిగించినప్పుడు అదీ కవిత్వమే. గురజాడ ‘దేశమంటే మట్టి కాదోయ్…’ అలాంటి కవిత అనుకుంటాను. దాన్ని మొదట విన్నప్పుడు కలిగిన ఆశ్చర్యానుభూతి నాకు ఇప్పుడు విన్నా కలుగుతుంది. చెరబండరాజు ‘కొండలు పగలేసినం’ అని మొదలెట్టి వరుసగా వేసిన ప్రశ్నలు కూడా అంతే. ఆ ప్రశ్నలకు సరైన జవాబు దొరక్క పోవడం దీనికి కారణం కావచ్చు. జవాబు దొరికితే అవి ఒక విజయోత్సవంలో భాగంగా ఉండిపోతాయి.

ఇలాంటి వాటికి విశ్వజనీనత ఉండదనే వాదాన్ని అంగీకరించలేను. ఒక ప్రత్యేక స్థితి అదృశ్యమయ్యాక, ఆ స్థితి లోంచి రాసింది విలువ కోల్పోతుందని అనుకోను. రవీంద్రుని ‘లివింగ్ అండ్ ది డెడ్’ కథలోని యోగమాయలా నేను వితంతువును కాను, కాలేను, నాకు ప్రేమాస్పదులైన స్త్రీలు ఎవరికీ ఆ దురవస్థ ఉండదు. రేపు మాపు ఎక్కడా వితంతువులే ఉండకపోవచ్చు. అయినా నేను యోగమాయను అని నాకు ఎందుకు అనిపిస్తుంది? జాక్ లండన్ ‘కాల్ అఫ్ ది వైల్డ్’ లోని బక్ అనే కుక్కతో నేను ఎందుకు ఐడెంటిఫై అవుతాను? ‘విదూషకుని ఆత్మహత్య’ లోని విదూషకునితో…? పొనీ, మాతృ గర్భంలో మరణ వ్యూహం తెలుసుకున్న అబిమన్యునితో…?

వయసుతో, స్థలంతో, కాలంతో నిమిత్తం లేకుండా నాకు నచ్చిన ప్రతి మనిషీ, ప్రతి మాటా, ప్రతి ఘటనా నాకు మార్గదర్శకమే.  ఇక్కడ ‘నాకు నచ్చిన…’ అనే క్లాజు తప్పు కాకపోతే, నాకు దొరికిన మార్గదర్శకం ‘నేనే’ అనడం తప్పు కాదనుకుంటాను.

 

10.     ఆనందాన్ని కొనుక్కునే బద్ధకం నుండి బయటపడి తనకు తానే సంతోషాన్ని సృజించుకోగల వ్యక్తిత్వౌన్నత్యం గురించి ఇందాక చెప్పారు. బహుశా సాహిత్యం, కళల పట్ల అభిరుచి ద్వారా దీన్ని సాధించవచ్చేమో అనిపిస్తుంది. ఈ విషయంపై ఈ తరం వాళ్లకి మీరిచ్చే సలహా?

 

నేను ఈ తరం వాడినే. J సలహా ఏమైనా ఉంటే నాకు నేను ఇచ్చుకునేదే. నాకు ఏది నిజంగా సంతోషంగా ఉంటుందో అదే చెయ్యాలి. ఇతర్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఏది నాకు సంతోషకరమో నాకు నేను ఆలోచించుకోవాలి. ఇతర్లు తమకు సంతోషకరమైన పద్ధతిలో తాము ఉండడాన్ని గౌరవించాలి. దొంగతనం, అబద్ఢం, యుక్తి, ఆటలో తొండి, హత్య, ఇంకొకరిని ఆత్మహత్యకు పురికొల్పడం వంటి పనులతో సంతోష పడే వాళ్లు కూడా లోకంలో ఉన్నారు. వాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి. మారుమూల పల్లెటూరి వాడిని కావడం వల్ల ఈ విషయం తెలుసుకోడానికి చాల సమయం పట్టింది. దానికి చెల్లించుకున్న మూల్యం గురించి దిగులు పడను. జీవించడం ఎప్పుడైనా మొదలెట్టొచ్చునని నాకు నేను చెప్పుకుంటాను.

ఇప్పటి అవసరాల కోసం, శారీరకంగా చాత కాని సమయాల కోసం తగిన మిగులు ఉండేట్టు చూసుకోవా‍లి. దానికి మించి సమకూర్చుకోవడం అర్థ రహితం. ఇతర్లకు నా మీద అసూయ కలిగితే చూసి ఆనందించడానికి తప్ప అతి అదనం దేనికీ పనికి రాదు. అనందించడానికి మంచి ప్రత్యామ్నాయాలు చేరువ అయ్యే కొద్దీ ఈ ‘అసూయ మీద ఆధార పడిన ఆనందం’ అనవసరం అవుతుంది. సాహిత్యం అలాంటి మంచి ప్రత్యామ్నాయం. మనుషులు కవిత్వం, కథలతో ఆనందించే స్థితి పెరిగే కొద్దీ కూడబెట్టుకుని పొరుగు వాడి అసూయకు గురై ఆనందించా‍లనే కోరిక తగ్గుతుంది. వ్యక్తులుగా ఇప్పుడు కూడా ఎవరికి వాళ్లం దీన్ని అనుభవం లోనికి తెచ్చుకోవచ్చు. ఉన్నంతలో హాయిగా జీవించ వచ్చు.

ఈ మాటలు డబ్బుకే కాదు, గుర్తింపు/కీర్తికి కూడా వర్తిస్తాయి. నాకు నేనుగా బతికిన క్షణాలు చాలు. వాటి సెలబ్రేషన్ చాలు. స్నేహితులతో కలిసి చేసుకునే సెలబ్రేషన్ మరింత బాగుంటుంది. అది కుదరకపోతే, కుదరాలనే కోరిక కూడా కవిత్వమే.

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

11 Responses to పిచికగూటిలో కవిత్వపు కిచకిచలు

  1. ఇంటర్వ్యూ చాలా బాగా చేసారు. హెచార్కే గారి మాటల్లో చక్కని జవాబులు దొరికాయి.

    ‘ పొగాకు మండె తిప్పుతుండగా మండ్రగబ్బ తేలు కుట్టి ఒక రోజూ రాత్రి ఏడ్చి ఏడ్చి చనిపోయిన సావాసకాడు శివరామి రెడ్డి’ చదువుతూంటే, బాధేసిందండీ!
    నాకు నచ్చిన మాటలు :
    * వీలయినంత వరకు కథలు చదవడానికే ఇష్టపడతాను. (క్రైమ్ థ్రిల్లర్లు వేరు. అవి తాత్కాలికి మరణాలు. నన్ను నేను భరించలేక పిచ్చి పట్టి పోవడం కన్న, తప్పుడు నిర్ణయాలకు బలైపోవడం కన్న… ఒక్కోసారి అవే మేలు అనిపిస్తాయి.)
    * ఒక పాఠకుడిగా నాకు కవిత్వం చాల మేలు చేసింది. చాల సార్లు నన్ను బతికించింది.
    * భాషా ప్రయోగంలో, పీలింగ్స్ విషయంలో కవి తప్పులు చేయగూడదు. తగిన పదాల కోసం, ఫీలింగ్స్ ని సరిగ్గా పట్టి ఇచ్చే పదాల కోసం కవి తనను తాను తవ్వుకోవాల్సి ఉంటుంది. అందు వల్ల భాష మీద, మానసికాంశాల మీద పట్టు కోసం కవిత్వం చదవడం ఒక అవసరం.
    * కవిత్వం బతుకులోని తడి, కథ అంటే బతుకే.
    * బాగో లేదని చెప్పాల్సి వస్తే తప్పకుండా చెప్పాలి. దాని కన్న ముందు రచయిత ప్రయత్నాన్ని అభినందించాలని అంటాను. (ఇది నా మీద నా సానుభూతి (ప్యాట్రనైజేషన్) అనుకోవచ్చా? ఏమో!)
    * నేను ఈ తరం వాడినే. సలహా ఏమైనా ఉంటే నాకు నేను ఇచ్చుకునేదే. నాకు ఏది నిజంగా సంతోషంగా ఉంటుందో అదే చెయ్యాలి. ఇతర్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఏది నాకు సంతోషకరమో నాకు నేను ఆలోచించుకోవాలి. ఇతర్లు తమకు సంతోషకరమైన పద్ధతిలో తాము ఉండడాన్ని గౌరవించాలి
    నాకు నచ్చిన మాటలు ఇవి కొన్ని మాత్రమే!
    పొద్దు – ఆసక్తి కరమైన ప్రశ్నలు వేసి,ఉపయోగకరమైన సమాధానాలను రాబట్టారు. చాలా రోజుల తర్వాత..తెలుగులో ఒక చక్కని ఇంటర్వ్యూ చదివిన తృప్తి కలిగింది.
    మీకు, హెచార్కే గారికి నా అభినందనలు తెలుపుకుంటూ..
    నమస్సులతో-
    ఆర్.దమయంతి.

  2. రవి says:

    చాలా అభినందనీయమైన ప్రయత్నం. సమకాలీన కవులను/రచయితలను ముఖాముఖి చేసే ఒక సత్సాంప్రదాయానికి పొద్దు శ్రీకారం చుట్టడం హర్షించదగినది.

  3. ఆర్. దమయంతి గారు! మితృలు మనతో విభేదిస్తున్నారని తెలిసిన్పపడు మనల్ని మనం దిద్దుకోడానికి లేదా మరోసారి ఆలోచించుకోడానికి వీలవుతుంది. ఏకీభవించినప్పుడు మనలా ఆలోచించే వాళ్లు ఇంకొందరున్నారని తెలిసి, ‘నేను ఒంటరిని కాద’నే భరోసాతో ఇంకొంచెం ఎక్కువ పని చేయగలుతాం. నా మాటలు కొన్ని మీకు నచ్చినందుకు అలాంటి భరోసా, సంతోషం కలిగాయి. చాల కృతజ్ఞతలు.
    రవి గారు, గతంలో మీ వ్యాసాల్ని చదివి ఆనందించి ఉండడం వల్ల, ఇక్కడ విషయం జోలికి వెళ్లని వ్యాఖ్యను చూసి కొద్దిగా నిరాశ పడ్డాను.

  4. రవి says:

    హెచ్చార్కె గారు, కవిత్వం గురించి విమర్శన చేయడం నా వంటికి అంతగా పడదండి. మీరు ” కవిత్వం ‘ఆనందం’ ఇస్తుంది. సాంత్వన ఇస్తుంది” అన్నారు. నేను కవిని కాను కానీ నా భావం మాత్రం – కవిత్వం కవిని శూన్యత్వం (అద్వంద్వం) వైపు త్రోసే ప్రక్రియగా నా అనుకోలు. ఇందుకు ఉదాహరణగా ఠాగోర్ గుర్తొస్తాడు.ఇలాంటి భావాలు వైయక్తికాలు, చాలా సాంద్రమైనవి. వీటిని విశ్లేషించడాలవీ వ్యర్థం. అంచేత అలాంటి వ్యాఖ్యలు, విశ్లేషణలు వ్రాయలేను.

    ఇక ముఖాముఖిలో మీరు చెప్పిన ఇతర విషయాలు నాకు స్పష్టంగా తెలుసు. మాది కూడా రాయలసీమనే.మీ సావాసకాడు శివరామిరెడ్డి అయితే నాకు కృష్ణారెడ్డి.స్కూల్లో ప్రతి ఆటలపోటీలోను ప్రథముడిగా వచ్చేవాడు, చదువులో తప్ప.ఓ రోజు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడు.

    మాటతీరు కరకుగా ఉన్నా మాటతప్పని మనుషులు, గుడ్లు పెట్టే కోడికి గు.. నెప్పి తెలుస్సాది లాంటి పల్లెటూరి మాటలు (నాది పల్లె నేపథ్యం కాదు టౌన్ అయినా) నాకు అక్షరమక్షరం తెలుసండి. వ్యాఖ్యానించడానికి ఏమీ లేదు.

  5. Ravi garu, Thanks a lot, I take the cue. Yes, I see the distance. I happen to be a ‘dvaithi’ in this context.

  6. NS Murty says:

    1. “మనుషులకు కవిత్వం బాగా అనుభవం లోనికి వచ్చే కొద్దీ దేవుడి అవసరం తగ్గిపోతుందని నా నమ్మకం.”

    నాకు ఇది బాగా నచ్చింది. మనిషి మానవత్వం దిశగా సాగుతున్నకొద్దీ దేముడి అవసరం తగ్గిపోతుందని నా విశ్వాసం.

    2. (అ) ఇప్పుడు వట్టి ‘క్రతువు’గా, ఇంకేవో అవసరాల వేదికగా తప్ప మతం లేదు. ఇది నేను అంగీకరిస్తాను.
    (ఆ) దేవుడి స్థానాన్ని కేవలం ‘మానవుడు’ భర్తీ చేయలేడు. మత విశ్వాసం స్థానాన్ని కేవలం ‘మానవత్వం’ భర్తీ చేయలేదు. భర్తీ చేయగలిగింది ఏమటి?
    ఇందులో మాత్రం నేను విభేదిస్తాను. మీరు పైన చెప్పారే Dryness in the society అని. దానికి సమాధానం ఇక్కడ ఉంది. ఇక్కడే కవిత్వం కవిత్వంగా మిగిలిపోకుండా ఆచరణలోకి అన్వయించబడాలి. కవిత్వం లో తన్ను తాను వెదుక్కుంటూ వెళ్ళిన మనిషి, ప్రకృతిలో తన ఆత్మను ఆవిష్కరించుకున్నాక ఈ రెండింటి అభేదాన్ని ఆచరణలో ప్రతిఫలించగలగాలి. మన్ని మనం తెలుసుకునే ప్రయత్నం లో కొన్ని విశ్వాసాలని విసర్జించాలి. కవిత్వం చెప్పినంత సులువుగా విశ్వాసాలని వదులుకోలేరు కవులు. అందుకే ఈ dryness ను ఫీల్ అవడం.
    3. సహజ సౌందర్యంతో కూడిన జీవితానికి, జీవితేచ్ఛకు కవిత్వం, కథ మంచి సాధనాలు. డబ్బు లేకపోయినా సాధ్యాలు….
    ఇది బాగా చెప్పారు.
    4. కవితా ఉద్యమాలు అనేవి సంభవించాయా? దిగంబర కవితోద్యమం అలాంటి ఒక ప్రయత్నం. అంతకు మించి…? వచని కవితోద్యమం ఒకటి ఉందని అంటే అనవచ్చు. సర్రియలిజం, డాడాయిజం వంటివి తెలుగులో కాస్త ప్రస్తావితం అయ్యాయే గాని, అనువదితం కాలేదు. వాటి మీద ఒకరిద్దరు తీసుకున్న పి.హెచ్.డి. పత్రాలను చూస్తే ‘ఓరి దేవుడా’ అనిపిస్తుంది. అభ్యుదయ, విప్లవ సాహిత్యోద్యమాలు కవితోద్యమాలు కావు. అది సామాజిక ఉద్యమాలకు బాసటగా వచ్చిన కవిత్వం, అంతే. దళిత, స్త్రీవాద ఉద్యమాల విషయంలోనూ నేను ఇలాగే అనుకుంటున్నాను.
    Happy at least there is one person who said it boldly. you can’t expect a movement when you want to own it. It a product of collective thought and action.

    5. ‘హిపొక్రసీ’ ఒక విశ్వజనీన, విశ్వకాలీన విశేషం. దాన్ని అధిగమించి మనిషి వేసే ఒక్కొక్క అడుగు మంచి ప్రపంచం దిశగా ఒక్కొక్క విజయం.
    జీవితం బోధించే గుణపాఠం ఇదే… మనం ఎప్పుడూ జాగరూకులమై ఉండాలి. ఎదటవాళ్లగురించే కాదు… మనగురించి కూడా. పేరు వచ్చినకొద్దీ మనకు తెలియకుండానే హిపోక్రిసీ మనలో ప్రవేశిస్తుంది.

    హెచ్చార్కే గురించి మొదటిసారి తెలుసుకోగలిగేను. ఈ అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను.

  7. Thanks, Murthi garu. You put it so well, ‘you can’t expect a movement if you want to own it’. It needs no further comment. Better be left for friends to ponder.

  8. అమ్మ అంటే రెండు నీళ్లు నిండిన కళ్లు, నాన్న అంటే ఒక చర్నాకోల…..

  9. వాసుదేవ్ says:

    ఆసాంతం చదవడానికి మాములు సమయంకంటే రెండురెట్లు ఎక్కువ తీసుకుంది..ప్రతీ రెండో వాక్యాన్ని రెండుమూడుసార్లు చదువుకున్నాను. హెచ్చార్కె గురించి ఇంతవరకూ ఆయన రచనల్లో ఓ మనిషిగా తెల్సు. ఇప్పుడు ఆయన మాటల్లో ఓ రచయితగా తెల్సింది. చదివింతర్వాత మొత్తం ఇంటార్వ్యూ నుంచి నాకు నచ్చిన కొన్ని వాక్యాలని రాద్దామనుకుని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ఎందుకంటే అలా రాస్తే మళ్ళో వ్యాసం మొత్తం రాయాలి. బాల్యపు నేపథ్యాన్ని చెప్పడంలో శైలి,సాహితీ ప్రక్రీయలగురించి చెప్పడంలో నిజాయితీ–(ఈ వాక్యాల్ని అటునుంచి ఇట్నుంచీ అటూగా కూడా చెప్పుకోచచ్చు)ఇవన్నీ కలగలిపి ఇది ఓ గొప్ప రచన అని నానమ్మకం. ముఖ్యంగా కొత్త రచయితలకి చాలా ఉపయోగం మార్కెట్లో ముప్పైరోజుల్లో కవిత్వం లాంటి పుస్తకాలు దొరకవు కాబట్టి ఇలాంటి ఇంటర్యూలు కొన్ని వివాదాలకి దారితీస్తే వచ్చేనష్టం కూడ ఏమీలేదు. చివరగా ఒక్కమాట “మనుషులకు కవిత్వం బాగా అనుభవం లోనికి వచ్చే కొద్దీ దేవుడి అవసరం తగ్గిపోతుందని నా నమ్మకం.” చాలా ఆలోచింపజేసే ప్రకటన…పొద్దువారికి ధన్యవాదాలతో!!

  10. మోహన రాంప్రసాద్, వాసుదేవ్ గారలకు కృతజ్ఙతలు. ఔను, వివాదాల వల్ల లాభమే గాని నష్టం లేదు. ‘ఆరోగ్యవంతుల’ మధ్య వివాదాలు మంచి ఆలోచనలకు ప్రోది చేస్తాయి. సాహిత్యలోకంలో వివాదాలు ఒక్కోసారి కాస్త ఘటెక్కినా, ఫాసిస్టు పోకడలు పోయిన సందర్భాలు కనిపించవు. మూర్తిగారు మూవ్మెంట్స్ విషయంలో సూచించినట్లు అభిప్రాయాలపై ‘సొంత ఆస్తి భావన’ లేనంత వరకు… వివాదాలు లర్నింగ్, డీలర్నింగ్ లకు ఉపయోగ పడతాయి.

  11. murali says:

    నరసింహరావు గారు నడిపించిన పత్రిక (దాని పేరు ‘మార్పు’ అనుకుంటా) …………. aa patrika పేరు repu

Comments are closed.