నందన నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొద్దు పత్రిక నిర్వహించిన వచన కవిసమ్మేళనం – నందనవనం
ఇందులో పాల్గొన్న కవులు;
1. హెచ్చార్కే
2. కేక్యూబ్ వర్మ
3. జాన్ హైడ్ కనుమూరి
4. కే. లుగేంద్ర
5. ఎమ్మెస్ నాయిడు
6. శైలజా మిత్ర
7. స్వాతీ శ్రీపాద
ముందుగా ఉగాదికి స్వాగతం;
పూర్వరంగం
– స్వాతీ శ్రీపాద
వెలుగు రేఖల మోపులు
అడవి కొమ్మల అణువణువునా
మెత్త మెత్తగా కళ్ళువిప్పుతున్న
లే చిగుళ్ళ నును సిగ్గు అరుణిమ
గాలి తీగలుగా సాగి సాగి
పలుకు తున్న కొత్త పాటల వానధారలు
రాబోయే వసంతానికి
పూర్వ రంగాలేగా
మెత్తని వెలుగు ప్రవాహం గడ్డకట్టి
బంగారపు ముక్కలయే వేళ
రాబోయే అతిధి స్వాగతానికి
అణువణువూ అలంకరణలో తలమునకలవుతూ
దారి పొడుగునా పూల తివాసీ పరచుకుంటూ
స్వాగత గీతాలు పాడటం తప్ప
ఎదురు చూసే వసంతానికి ఇంకేం చెబుతాం
——————
విజృంభణ
– స్వాతీ శ్రీపాద
కనుమరుగవుతున్న నిన్నటి శిఖరాల గుప్పిటనుండి విడిపించుకుని
చాలీచాలని అసంపూర్ణ హరిత వస్త్రాన్ని అస్తవ్యస్తంగా చుట్టుకు
జలప్తమై ఉరకలు పెడుతూ
వసంతం విజృంభణ
తెల్లారేసారికి వెచ్చని గాలుల ఊయల్లో తొణికిసలాడే తొందరపాటు పులకింత
ఆగామి నవ వత్సరానికి
స్వాగతగీతలు కూర్చుకుంటూ
తలలూపి పారవశ్యం తెలిపే లేచిగుళ్ళ భుజాలపై తలలనాన్చి
కూనిరాగాల కోలాహలంలో కొత్తకోయిలలు
శిశిరంతో తలపడి గెలుపు ఓటముల దొమ్మరి పోరాటంలో
ఓ సారి నింగికెగయడం మరంతలోనే నేల వాలటం ఎన్ని పొర్లింతల ఫలితమో
దుమ్ము కొట్టుకుపోయి అలసిపోయినా విజయగర్వం దక్కించుకున్న వసంతం
వీరవిహారనికి సంసిద్ధంగా…………..
గాలి చలిపాట పాడుతున్న వేళ
వేకువ రెప్పతెరచి
వ్యాయామం కోసం నడుస్తూ
ఆమె అంటోది
శిశిరం
ఆకులను తివాసీలా ఎలా పరిచిందో
ఎవరిని ఆహ్వానిస్తున్నట్టు
చూసావా?
నేనంటాను
ఆకులైనా తివాసీయైనా
నీకోసమేగా
ఎందుకంటే
వసంతరాణివి నీవే కదా!
————-
ఉగాది మనలోనే ఉంది
– శైలజామిత్ర
ప్రతి సాయంత్రం
విషాదం కాకుంటే
అది ఉగాది కాక ఏమవుతుంది ?
ప్రకృతి చల్లదనం
పక్షుల కిల కిలా రావం
పసిపాప చిరునవ్వుల హారం
మానవత్వ పరిమళం
దాతృత్వం
అర్థం చేసుకునే తత్వం
ఆదరించే మహోన్నతం
ఉగాది కాక మరేమవుతుంది ?
ఉగాది అనేది పండుగే అందరికి
ప్రకృతి ఆనందం ఉగాది
మనిషిలోనే ఉంది ఉగాది
మంచి ఆలోచనే ఉగాది
చేతిలో కావాల్సింది ఉంచుకుని
ఎక్కడో వెదికితే
మనకు మిగిలేది సందేహాల నిశీధి.!
నందనవనం లోకి ప్రవేశిస్తే – పూల తివాసీ పరచుకుంటూ… విజయగర్వం దక్కించుకున్న… వసంతరాణి… మనకు మిగిలేది — ఇదో ట్యాగుమేఘం
స్వాతిశ్రీపాద గారి విజృంభించిన ఉగాది, జాన్ హైడ్ కనుమూరి గారి వసంతం రాకకి ఆకుల తివాచీ పరచిన శిశిరం చాలా బాగున్నాయి.