సత్యప్రభ – 4

7 వ ప్రకరణం.

మంతనపు తృతీయ ఘట్టం ప్రారంభమయింది.

“ఇక శాంతిసేనా దేవి విన్నపం గురించి చర్చించ వలసి ఉంది.” అని మహారాజు పలికాడు.

“ఆ విషయం రాజకులంలో చర్చించ వలసిన అవసరం లేదు.. సావకాశంగా ప్రభువు వారే తగిన సందేశాన్ని ఆమెకు పంపవచ్చు.” అని చెప్పాడు మహామంత్రి.

“రెండు కారణాలచే ఈ సమస్య ఈ రాజకులంలో చర్చింప బడాల్సి ఉంది. రాజకులం ఉత్తరువు పొందకుండా రాజకుమారులపై గాని, రాజకుమారికలపై గాని, సామంత రాజులపై గాని, రాజ స్నుషలపై గాని, సామంత రాజ పత్నులపై గాని, దండార్హమైన నేరాన్ని, ఆరోపింఛే అభియోగాన్ని తీసుకొని రావడానికి వీలు లేదని నిబంధన ఉంది. చంద్రప్రభా దేవి సామంత రాజ పత్ని, రాజకులం ఉత్తరువు లేనిదే, మోసానికి ఆమెపై అభియోగం తెచ్చుట సాధ్యం కాదు. ఇది మొదటి కారణం.రెండవ కారణం ఏమిటంటే, అభిషిక్తుడయిన సామంత రాజు సరి అయిన వారసుడు కాడని ఎవరైనా రాజధర్మాసన సన్నిధిలో వ్యాజ్యం తెచ్చుటకు ముందుగా రాజకులం ఉత్తరువు పొంది ఉండాలి.

సచివుని మాటలు విన్న మహారాజు తనలో ఇట్లను కొన్నాడు.! ‘ ఇన్నాళ్లు మహామంత్రిగా పని చేసినా చిన్న మామయ్యకి రాజకులంతో సంబంధించిన నిబంధనలు కూడ చక్కగా తెలియవు. ఏదో మోరతోపు కొట్టుకొని పోతున్నాడు.

“సచివుడు చెప్పినది వాస్తవమే,” అని ప్రకాశంగా అన్నాడు మహారాజు.

“అది వాస్తవమే అయితే — ”

“మీరు నిబంధన చూడలేదా ? ఐతే అని అంటున్నారు ?”

“ముసలి వాణ్ని — మరచి పోయాను.”

“అయితే మీ వాక్య శేషాన్ని ముగించ వచ్చును.”

“ఈ సమస్యని విచారించడానికి మహాప్రాడ్వివాక తృతీయమైన రాజకులానికే అధికారముండును. న్యాయ సూత్రాలతో సంబంధించి ఉంది కదా ఈ సమస్య ?”

“ఇట్టి సమస్యలను చర్చించునపుడు న్యాయ సూత్రాలతో పని లేదు. ఔచిత్యం మాత్రమే చర్చించ బడుతుంది. అందువలన ఈ సమస్య అంతరంగిక శాఖకే సబంధించింది.” అని చెప్పాడు సమయోచితంగా సచివుడు.

“నిజమే ! ఇక చర్చని సాగించవచ్చును” అన్నాడు మహారాజు.

రూప చంద్రుడే మాట్లాడాడు.

“వృధ్ధురాలును, పూజ్యురాలును అయిన చంద్రప్రభా దేవిని న్యాయస్థానంలో నిలబెట్టి, విచారించడం అనుచితం. అలా అని విచారించడానికి వుత్తరువు ఇవ్వనప్పుడు శాంతిసేనా దేవికి అపారమైన నష్టం కలుగు తుంది.. ఆదిలో రాజకులాన అపవిధ్ధ పుత్రుడు, ఔరస పుత్రి కంటే కూడ ముఖ్య వారసుడు అని నిర్ణయింప బడింది. ఆ విషయం తిరుగ విచారించ వలసిన అవసరం ఉండదు. కాని వీరేశ్వర భట్టారకుడు మేఘస్వామి భట్టారకుల వారి అపవిధ్ధ పుత్రుడు కానప్పుడు, ఆ రాజకుల తీర్మానం శాంతిసేనా దేవిని బంధింపదు కదా ! అతడు అపవిధ్ధ పుత్రుడు కాడని రుజువు పరుస్తానని భర్తృదారిక వ్రాసి ఉన్నారు.దానికి రాజకులం అవకాశం ఇవ్వనప్పుడు న్యాయ ప్రకారంగా ఆమెకి రావలసిన ఒక గొప్ప మండలం ఆమెకి రానీయకుండా చేయడ మౌతుంది. అంతకంటే ఆమెకి నష్టం ఏముంటుంది ? ఒకరి గౌరవాన్ని రక్షించడానికై మరొకరికి అపారమైన నష్టం కలిగించడమా, లేక ఒకరి న్యాయమైన హక్కుని కాపాడడానికి ఇంకొకరి గౌరవానికి హాని కలుగ జేయడమా అన్న విషయన్నే రాజకులం ఇప్పుడు తీర్మానించ వలసి ఉంది. ఈ రెండింటిలో ఏది మేలు ? ఇదే మనకిప్పుడు చర్చనీయాంశం !”

మహారాజు మహామంత్రిని చూసి , “చిన్న మామయ్యా ! మీ అభిప్రాయం ఏమి ?” అని అడిగాడు.

“శాంతిసేనా దేవి విన్నపం త్రోసి వేయడం ఏ విధంగా తప్పో నా కింకా బోధపడడం లేదు.”

“ఆమె విన్నపాన్ని త్రోసివేస్తే ఆమెకి నష్టం ఉందదనా మీ తాత్పర్యం ?”

“వీరేశ్వర భట్టారకుడు అపవిధ్ధుడు కాకపోయిన, కృత్రిమ పుత్రుడు కావచ్చును. ద్వాదశవిధ పుత్రులలో ఎవడైనా సరే కుమార్తె కంటె ముఖ్యుడని రాజకులం ముందే నిర్ణయించింది. అలా వుండ శాంతిసేనా దేవికి న్యాయమైన నష్టం కలుగుతుందని మన మెట్లు నిర్ధారణ చేయగలం ?”

“మేఘస్వామి భట్టారకుల వారు పిల్లవాడు అపవిధ్ధుడనే ఎంచి, తన భార్యకి పెంచుకోవడానికి అనుఙ్ఞ యిచ్చారు..చెల్లెలి కుమారుని భార్య గుప్తంగా తీసుకొని వచ్చిందని తెలిసినట్లయితే అనుఙ్ఞ నిస్తారా ? అందు వల్ల ఆ పిల్లవాని కృతిమత్వ విషయంలో తండ్రికేమిన్నీ సంబంధం లేదు. ఆ పిల్లవాడు చంద్రప్రభా దేవికి మాత్రమే కృత్రిమ పుత్రుడు కావచ్చు. అంతేకాని మేఘస్వామి భట్టారకుల వారికి కృత్రిమ పుత్రుడు ఎట్లగును ?” అన్నాడు సచివుడు.

“కాబట్టే ఇది క్లిష్టమైన న్యాయ సమస్య ! దీన్ని మనం కొన్ని క్షణాలలో నిర్ణయించడం సాధ్యం కాదు. ఆలోచించడానికి వ్యవధి అవసరం,” అన్నాడు మహామంత్రి.

“క్లిష్టమైన ఈ న్యాయ సమస్యని ఆలోచించడానికి రాజధర్మాసనం ఉండనే ఉంది. అది దాని పని. పాక్షికంగా నైనా శాంతిసేనా దేవి సింహాసనం పొందే అవకాశం వున్నప్పుడు, ఆ అవకాశాన్ని ఆమెకి మనం ఎందులకు ఇయ్యకూడదు! చంద్రప్రభా దేవి గౌరవ భంగం ఒక్కటే దీనికి అడ్డుగా ఉంది. అందువల్ల ఏ తప్పు మేలా అని మనం ఇప్పుడు నిర్ధారణ చేయాలి.”

“చిన్న మామయ్యా ! క్లిష్ట సమస్యలను విచారించ వలసిన ఆవశ్యకత లేదు కాబట్టి, మీరు వ్యవధి తీసుకొనక్కర లేదుని నా మతం ! శాంతిసేనా దేవి విన్నపం త్రోసివేయాలా, లేక అంగీకరించాలా ? ఆ విషయంలో మీరు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పండి.”

సునందునికి ఆ రాత్రి పాపరాత్రిగా కనిపించింది.. మహారాజు మనస్సు తనకి అనుకూలంగ లేదు. అయిన అతడు తన ప్రయత్నాన్ని వదలకుండా ఇలా అన్నాడు-

“మహాప్రభో ! శాంతిసేనా దేవికి, వీరేశ్వర భట్టారకుల వారికి ఇద్దరికీ నష్టం లేని మార్గాన్ని అన్వేషించడానికే నేను వ్యవధి కోరాను. సచివుడన్నట్లు వృధ్ధురాలును, పూజ్యురాలును అగు చంద్రప్రభా దేవిని న్యాయస్థలానికి ఈడ్చుకొని రావడం గాని, సుమారు ఇరవై రెండేండ్లు శ్రీవారి స్వహస్తాలతో ఇచ్చిన రాజ్యన్ని అనుభవిస్తున్న వీరేశ్వర భట్టారకుల వారిని పదభ్రష్టుని చేయుట గాని నాకు సమ్మతాలు కావు.”

మహామంత్రి మాటలకు మిక్కిలి దాక్షిణ్య వంతుడైన మహారాజు లొంగిపోతాడేమోనని సచివుడు భయపడ్డాడు. వానికి ఒక విచిత్ర తత్కాల యుక్తి స్ఫురించింది. దానిని వాడు త్వరగా రాజ సన్నిధానంలో బహిరంగ పరిచాడు !

“మహాప్రభో ! చంద్రప్రభా దేవికి గౌరవ హాని లేకుండా విచారణ చేయుటకు ఒక ఉపాయం ఉంది.”

మహారాజు మిక్కిలి ఆతురతతో,”అది ఏది ?” అని ప్రశ్నించాడు.

“చంద్రప్రభా దేవి చెల్లెలు చంద్రముఖిన్నీ, ఆమె భర్త ధనపతిన్నీ ఇప్పటికీ జీవించి ఉన్నారు. వారు దేవిని తప్పు త్రోవ పట్టునట్లు ప్రోత్సహించి తమ పిల్లవానిని పార వేసి, ఆమెని పెంచునట్లు చేశారని వారిపై ఆరోపించిన దేవికి గౌరవ హాని కలుగదు.”

“ఈ సంవిధానం బాగుంది,” అని మహారాజు మహామంత్రిని చూసి,”చిన్న మామయ్యా ! మీరేమంటారు ?” అని ప్రశ్నించాడు.

సునందునికి, చంద్రప్రభా దేవికి, గౌరవ హాని అగునని చింత ఏ మాత్రము లేదు. అతని ఘోష అంతా అల్లునికి రాజ్యభ్రంశం కాకూడదనియే ! తన మాటకు మహారాజు బదులు చెప్పక ముందే సచివుడు మధ్యలో కలుగ జేసుకొని మాట్లాడి ప్రభువును ఆ గాలిలో ఎగురగొట్టుట మహమంత్రికి కోపాన్ని కలుగ జేసింది. అయినను ఆ వృధ్ధ మంత్రి తన కొస ప్రయత్నాన్ని విడువ లేదు.

“మహప్రభో ! నేను సంధిని గురించే ఆలోచిస్తున్నాను.”

“ఇప్పుడు శాంతి సేనా దేవి విన్నపం అంగీకరించినంత మాత్రాన, సంధికి అవకాశం పోదు. అంగీకరించ వచ్చునా, లేదా ? అన్నదే మీరు ఇప్పుడు చెప్పాలి.”

“అంగీకరించే పక్షంలో విచారణ తప్పకుండా జరుగుతుంది. విచారణలో శాంతిసేనా దేవికి జయం కలిగితే వీరేశ్వర భట్టారకుడు మేఘస్వామి భట్టారకుని పుత్రుడు కాడని స్థిరపడుతుంది. తనకొక కర్మనడిపించు పుత్రుడు వున్నాడని తృప్తితో వారు దివంగతులయ్యారు. ధర్మాసనపు తీర్పు అందులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారి పుంసంతతిని మనం తుడిచి వేసినట్లే అవుతుంది. కాబట్టి వ్యవధి కావాలంటున్నాను.”

సుచంద్రునికి ఇంత సేపటికి తన మహామంత్రి తత్వం బోధపడింది. అతడు తన కూతురు ద్వారా, ఏదో ఎత్తు పన్ని తన్నంగికరింప జేయడానికి వ్యవధి కోరుతున్నాడని తలంచాడు. అందువలన మహామంత్రికి వ్యవధి ఇవ్వకుండా ఉండడానికే మహారాజు తీర్మానించు కొన్నాడు. ఆ నిశ్చయంతో ఇలా అన్నాడు.

“ఇప్పటి పని ఇప్పుడే ముగిసి పోవాలి. సంధికి మంచి మార్గం మీకు తోచినప్పుడు నాకు చెప్పండి. నేను దానికి అనుకూలంగా ప్రయత్నిస్తాను.”

“తండ్రి పుత్రుడని విశ్వసించిన ఒక పిల్లవానిని అతని పరోక్షంలో, అతని పుత్రుడు కాదని నిర్ణయించ డానికి ఏ న్యాయస్థానానికీ హక్కు లేదని నా మతం. కాబట్టి శాంతిసేనా దేవి విన్నపాన్ని త్రోసి వేయ వలసిందే !”

మహారాజు సచివుని ముఖం చూసాడు.

“మేఘస్వామి భట్టారకులు వీరేశ్వర భట్టారకుని పెంపకాన్ని, పుత్రార్థం అంగీకరించారో, ధర్మార్థం అంగీక రించారో మనకి తెలియదు. వారు వీరేశ్వర భట్టారకుని తన పుత్రునిగా ఎప్పుడూ ప్రకటించ లేదు. ఉపనయనాన్ని ఆచార్యుల చేత చేయించారు గాని, స్వయంగా చేయించ లేదు. కాబట్టి వారు తన జీవిత కాలంలో అతనిని (వీరేశ్వర భట్టారకుని ) తన పుత్రునిగా విశ్వసించడం సంశయ గ్రస్తం ! కనుక శాంతిసేనా దేవి విన్నపాన్ని అంగీకరించాలని నా మతం.”

“తండ్రి భ్రాంతితో విశ్వసించినా, దాన్ని న్యాయస్థానం మన్నించి తీరాలని నిర్భంధం కలదా, అన్న విషయమే సంశయగ్రస్తంగా ఉంది. కాబట్టి నేను సచివునితో ఏకీభవించి, శాంతిసేనా దేవి విన్నపాన్ని అంగీకరిస్తున్నాను. ఆమె విన్నపం రాజకులంలో అంగీకరింప బడినట్లున్నూ, ఆమె మోసమునకై చంద్రప్రభా దేవిపై కాకుండా, చంద్రముఖి దంపతులపై అభియోగం తెచ్చుకోవచ్చునని కౌండిన్య ధర్మపాలునికి రేపు ప్రాతఃకాలానికి సందేశాన్ని పంపండి.”

మహారాజు సుచంద్రుని నిర్ణయాన్ని విన్న పిమ్మట సునందుని వెన్నెముక విరిగినట్లయింది. ‘ అనాధ పద్మావతీ ! ఇంక నిన్ను ఎవరు రక్షిస్తారు ? వెర్రికుక్క విషం వలె చిత్రకూట రాష్ట్ర సింహాసనోత్తరాధికారి సమస్య తిరిగి బయలు దేరింది. ఇప్పుడేం చేయాలి.? ’ అని అతని మనసు శోకించింది. బహిరంగంగా –

“ఆఙ్ఞాప్రకారం అలాగే చేస్తాను.” అన్నాడు దీనంగా.

‘ ఇన్నాళ్లకి ఇతని దశ తిరిగింది. ’ అని సచివుడు లోలోపల సంతోషించాడు.

“చిన్న మామయ్యా ! రేపు మహారాఙ్ఞి వర్ధంత్యుత్సవం. కనుక ఉత్సవం ముగింఛే వరకు ఈ రాత్రి రాజకుల చర్యలను ఆమె చెవిలో వెయవలదు.”

“చిత్తం” అన్నాడు మహామంత్రి.

సచివుని ఉద్దేశం నెరవేరింది. మహామంత్రి పలుకుబడి ఈ విధంగా ఆ రాత్రి భూస్థాపితం కావింప బడింది. దానికి పునర్జీవితం వచ్చే ఆశ కూడా అంతగా కన్పట్టుట లేదేమో !

===========

8 వ ప్రకరణం.

మరునాడు మహారాఙ్ఞి లీలావతీ దేవిగారి వర్ధంత్యుత్సవం జరిగింది. ప్రాతఃకాలంలో మహావైభవంతో ఆయుష్య హోమం నెరవేర్చబడింది. హోమానంతరం కోటలోని మైదానం ముందు, ఆమె పురస్త్రీలందరికీ దర్శన మిచ్చింది. మధ్యాహ్నం బీదలకు, బ్రాహ్మణులకు సంతర్పణలు జరిగాయి. భోజనానంతరం కొంత విశ్రాంతి తీసుకొన్న తరువాత అంతఃపురం లోని పెద్ద కచ్చేరి సావిడిలో సాక్షర నారీ సభ సమావేశ మయింది. ఆ వర్షపు వర్ధంతిలో భగవతి శుభ్రాంగి గురుకులంలో చదువుకొని కవిత్వం చెప్పగల కన్యకల కవిత్వ పరీక్ష జరుగునని ముందే చేటీ జనాధ్యక్షురాలు భృంగాలక ప్రకటించి ఉండింది..రాజధానిలోని చదువుకొన్నస్త్రీలందరూ సభలో సన్నిహితులయ్యారు.

నారీ సభా ప్రేక్షణార్థం కూడిన పురుషుల ఆసన పంక్తులు ఒక ప్రక్కగా ఉన్నవి. పదునేడుగురు పెద్ద మనుష్యులు ఆ భాగం మొదటి పంక్తిలో ఆసీనులై ఉన్నారు ఆ పంక్తిలో మధ్య మహారాజ సుచంద్ర భట్టారకుడు కనక సింహాసనముపై కూర్చొని ఉన్నాడు. అతని దక్షిణ పార్శ్వమందు కుమార శక్తిధరుడు, వామ పార్శ్వమందు కుమార భోగనాధుడు కూర్చొని ఉన్నారు..భోగనాధునికి కుడివైపుగా చిత్రకూట మహా మండలేశ్వరుని కుమారుడు దండనాయక రణేశ్వరుడు, మహామంత్రి సునందుడు, రాష్ట్రీయుడు వీరనందుడు, మహా సమాహర్త హేమచంద్రుడు, కోశాధ్యక్షుడు గుణాకరుడు, దూతసామంతుడు విశాలాక్షుడు, దండనాయక చండసేనుడు, కూర్చొని ఉన్నారు. శక్తి ధరునికి ఎడమవైపు వరుసగా సేనాపతి రణంధరుడు, పురోహితుడు వాణీధరుడు, మహా ప్రాడ్వివాక సత్యవ్రతుడు, సచివ రూపచంద్రుడు, బ్రహ్మకుల పరిషత్పతి ధర్మపాలుడు, ఆచార్య విషమ సిధ్ధి, ఆచార్య భవనంది కూర్చొన్నారు.

నారీ సభలో ప్రత్యేకంగా అమర్చ బడిన వేదికలో మధ్యన కనకాసనమున లీలావతీ దేవి కూర్చొని ఉన్నది. ఆమె దక్షిణ పార్శ్వమందు భగవతి శుభ్రాంగి, వామ పార్శ్వమున యోగిశ్వరి ధవలాక్షి కూర్చొని ఉన్నారు. ఇద్దరు చేటికలు చామరములతో రాణిగారికి విసురుతున్నారు.

సమ ప్రదేశంలో వేయబడ్డ ఆసన పంక్తులలో మొదటి పంక్తిలో పదముగ్గురు స్త్రీలున్నారు.మధ్యన ఉన్నత కనకాసనంలో రథినీ కుమారి కూర్చొని ఉంది. ఆమె కుడి పార్శ్వములో వరుసగా ఉన్మత్త సిధ్ధ కవీశ్వరి రాజకాళి, సత్యప్రభ, మణిమాల, మధువాణి, ఆమె సవతి తల్లి కాంతామణి, నాగకన్య పర్ణిని కూర్చొని ఉన్నారు.సత్యప్రబా రథినుల ప్రయత్నం వల్ల రాజకాళి ఆ సభకి వచ్చింది. ఆమె మాటిమాటికీ వెళ్లి పోవడానికి ఉంకిస్తున్నా, సత్యప్రభా రథినులు ఆమెను ఆపుచేస్తున్నారు.

రథినీ కుమారికి ఎడమ వైపున వరుసగా ఫలిని, భానుమతి, వీర సింహుని చెల్లెలు విలాసవతి, కనక వల్లి, విశాలాక్ష పుత్రి కుముదాక్షి, ధరణి, కూర్చొన్నారు. భృంగాలక, ధారావతి, ఙ్ఞానేశ్వరి, చంపావతి, పద్మాక్షి, కాత్యాయని, కామసేన మొదలైన పురనారీ మణులు కూర్చొని ఉన్నారు.

ఒక్క ఆంధ్ర సామ్రాజ్యమే కాదు, భరత ఖండ మంతటి సౌందర్యం ఆ నారీ సభ యందు కేంద్రీకృత మయిందని చెప్పవచ్చును. సౌందర్య తత్త్వఙ్ఞుడైన రాజసచివుడు రూపచంద్రుడు ఏమంటున్నాడో (స్వగతంగా) గమనిద్దాం.

‘ఈ రథినీ కుమారి శరీర ప్రభ జ్యోతిర్మయామృతం అని చెప్పక తప్పదు. ఈమె ముఖం శీతల దివాకర మండలం అని చెప్పడం సరి అయినది. ఈమె తన జ్యోతిస్సుతో సభాశాల నంతటినీ ముంచి వేస్తూంది ! ఈమె సౌందర్యం మనుష్య జాతి దుర్లభం. ఈమెను ఒకమారు చూసిన మహేంద్రుడు తన వేయి కండ్లు సార్థకాలయ్యాయని తలంచ గలడు.’

‘ఈ సత్యప్రభ చక్కదనం మాత్రాతీతం. వ్యాయామ విభక్తాలైన ఈమె అంగాల సౌష్టవం నిరుపమానం. ఈమెకు స్వయంవరమే చాటిస్తే, ఇంద్రాగ్ని యమ వరుణులు మరొకమారు భూమికి దిగక మానరు. శ్రీశైల మహా మండలేశ్వరుని ఏక పుత్రి రత్నప్రభను పెండ్లాడి, మహామండలేశ్వర పదవి పొందడం కంటె, ఈమెను పెండ్లాడి సామాన్య గృహస్థునిగా ఉండడమే మహాభాగ్యమని నా తలంపు.’

‘ఈ మణిమాల బ్రాహ్మణ జాతికి కీర్తి తెచ్చిన దివ్య లావణ్యవతి. వికసించిన పద్మం లాగ ఉన్న ఈమె ముఖమందు మహాలక్ష్మి వాసం చేస్తూంది. చతుర్ముఖుడు గాని ఈమెను చక్కగా నిదానించి చూస్తే, అతనికి తిలోత్తమ స్మరణకి రాక మానదు.’

‘ఈ ఫలిని పోతపోసిన శరశ్చంద్ర చంద్రిక. భూమికి దిగిన భారతీ తేజోంశము. మూర్తీభవించిన ప్రసన్నత. ఈమెను మహేశ్వరుడు వీక్షిస్తే చిరకాలం నుండి తాను తలపై మోస్తున్న గంగాదేవిపై కొంచెం అవఙ్ఞత వహించకుండా ఉండలేడు.’

‘ఈ మధువాణి స్థిరయై భూమిపై సంచరించు విద్యుల్లత. ప్రాణాలతో వెలసిన బంగారు బొమ్మ. బంగారనికి కాఠిన్యమనే దుర్గుణం ఉంది. ఈ కొత్త బంగారం అత్యంత సుకుమారం. ఈమెనే గాని నారాయణుడు ఒకసారి అవలోకిస్తే తాను వక్షప్రదేశంలో ధరించు మహాలక్ష్మిని పరిహసింపక మానడు.’

’ఈ ధరణి అధికాలంకారాలు లేక పోయినా, చక్కగా అలంకరించుకొన్న సంపన్న కన్యలను మించి శోభిస్తూంది. ఈమె జ్యోతిష్మద్విశాల నేత్రాలు ఈమె ముఖానికి అలంకారాలు. ఈమె శ్యామలంగా ఉన్నా లావణ్య తరంగ మాలిని. కృష్ణ ద్వైపాయన ముని ఈమెను ఒకసారి చూస్తే., తన జయేతిహాస నాయిక పాంచాలి ఇంకొకసారి భూలోకానికి దిగిందని వర్ణింపక మానడు.’

’ఈ పర్ణిని స్వర్గము నుండి మన లోకానికి పంపిన అచ్చర. ఈమెను చూసినా, ఈమెతో మాట్లాడినా ఈమె సంగీతాన్ని విన్నా, మనుష్యుల పుణ్యఫలం కొంత వ్యయం కాక మానదు. ఈమెను ఒకసారి దర్శించునెడల నలకూబరుడు రంభపై ఇంచుక అనాదరణ చూపక మానడు.’

‘ఈ భానుమతి వేదిగతాగ్ని జ్వాలవలె పవిత్ర మూర్తి. ఈమెను చూస్తే చాలు వైశ్వానరుడు‘ తన ప్రియకాంత స్వాహాదేవి అని భ్రమ పడక మానడు.!’

‘ఈ కనక వల్లి అభిమాన దేవత వలె సౌందర్యన్ని పోషిస్తూంది. ఈమె కోటీశ్వరుని ఏకైక పుత్రిక కాబట్టి ఈమెకు చెంద వలసిన మహా సంపద ఈమె సౌందర్యపు వెలను హెచ్చిస్తూంది.’

‘ఈ కన్యా నవకం శ్రీకాకుళ నగరంలో అమూల్య రత్ననవకం. నగరంలోని యువకులు వీరిలో ఒకరినైనా చూడని దినం దుర్దినమని తలస్తారు. వీరి ప్రభావం వల్ల శుభ్రాంగీ గురుకులానికి కీర్తి వచ్చింది. మహిమ హెచ్చింది. జనులకది యాత్రా స్థలమైంది. కృష్ణానదీ యాత్రకు వచ్చిన ప్రతీ వ్యక్తిన్నీ ఈ తొమ్మిది దేవతా విగ్రహాలని దర్శించి పోవలసిందే !’.

’ఈ కుముదాక్షి నయవేత్త విశాలాక్షుని చేతి జృంభకాస్త్రము. ఈమె చూపులు మదన జృంభకాస్త్ర జ్వాలలే అగును..విశాలాక్షుడీ అస్త్రాన్ని కుమార భోగనాధుని సాధించుటకై దాచి ఉన్నాడు. ఈమె తండ్రి వద్దనే సర్వ విద్యలను అభ్యసించింది. గురుకులం లోని తొమ్మిది రత్నాలకి తీసిపోని పదవ రత్నమిది !’

‘ఈ రాజకాళి సౌందర్యం మలిన వేషం వల్ల నివురు కప్పిన నిప్పు వలె ఉంది. ఈమె నోరెత్తిన చెవులు కల వారందరూ లొంగి పోవలసిందే! ఈ మె కంఠంలో సర్వేశ్వరుడుంచిన మాధుర్యం అపారం! ఈమె విశాల నేత్రాల లోని జ్యోతిస్సు, ఆకర్షణ శక్తి అత్యద్భుతం. ఈమె కవిత్వం లోని భావాలు అత్యంతం రమణీయాలు!’

‘ఉన్నత వేదికపై కూర్చొన్న మువ్వురిలో ఒకతె (లీలావతి ) తన సౌందర్య ప్రతాపంఛే ఆంధ్రేశ్వరుని వశం చేసుకొని ఈ గొప్ప సామ్రాజ్యాన్ని ఏలుతూంది. మరొకతె ( ధవలాక్షి ) తన సుందర ముఖభాగ్యం చేతనే ఆబాల గోపాలాన్ని శాసిస్తూంది. కీర్తి మాత్రం ఈమె యోగ మహిమకు వచ్చింది ! ఈమె ఇంకా అవివాహితగా ఉండడం చింతాకరం ! ఇంకొకతె ( శుభ్రాంగి ) జటావల్కల ధారిణియై, మూర్తీభవించిన విరక్తవలె కన్పడుతూంది. అలా ఉన్నా ఈమె సౌందర్యం నేత్ర్ర్పరణ కావించుతూనే ఉన్నది.!’

About వాసిష్ఠ

‘వాసిష్ఠ’ అన్నది , అయ్యల సోమయాజుల మహాదేవ శాస్త్రిగారి కలం పేరు. వీరు ‘ నాయన గారి’ కుమారులు. ఆయన రచనలో రమణీయత, మృదుమనోహరమైన భావాలు కనిపిస్తాయి. ఆయన గద్యరచనలోనే కాక, పద్య రచనలో కూడా సిధ్ధహస్తులు. ‘గణపతి స్తవము’, ’భక్త కుచేలుడు’, ’ప్రహ్లాద చరితము’, ’తోటక మాలా దశకం’, ’పార్థ సారధి శతకం’, ’పంచ చామర పంచ రత్నములు’, ’బాల ద్విపద రామాయణము’, ఇత్యాది పద్య రచనలే కాక, చాలా కథానికలు వ్రాసారు.

ఆయన కథానికలలో ప్రముఖమయినవి, ‘వృషాకపి’, ’జనస్థానం’, ’రాచప్పడు’, ’ఆంభ్రుణి’, ’కాత్యాయని’ మొదలయినవి ఆంధ్రప్రభ లోనూ, ‘ఉచ్చిష్ట సోమరసం’ అనే కథ ‘చుక్కాని’ లోనూ ప్రచురించ బడ్డాయి. ’గణపతి,’ ’ఇంద్రుడు’ , ’అగ్ని’, ’సంభాషణము’, ’మృదు కళ’ మొదలయినవి ఆయన వ్రాసిన వ్యాసములు. వీటన్నిటిలో ముద్రింప బడిన వాటి కన్న అముద్రితాలే ఎక్కువగా ఉన్నాయి.

ఈయన తంజావూరు సరస్వతీ మహలు గ్రంధాలయంలో తెలుగు రీసెర్చి పండితునిగా పనిచేసి, ’విప్రనారాయణ చరిత్ర’, ’మైరావణ చరిత్ర’, ’తాళ దశప్రాణ దీపిక’, ఇత్యాది గ్రంధాలను ‘ఎడిట్’ చేసి ముద్రింప చేసారు. ఈయన జననం ఫిబ్రవరి ’1901లో, నిర్యాణం మార్చి 1966 లో.

’సత్యప్రభ’ చారిత్రిక నవలలో మొదటి ముప్ఫై ప్రకరణాలను ’పూర్ణ’ పేరుతో గణపతి ముని రచించగా, తరువాతి ముప్ఫై ప్రకరణాలను వాసిష్ఠ రచించారు.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.