కథాకథనం – 3

కథ కానిది

కథలాగే వార్తా, వార్తాకథ,  వ్యాసం కూడా వచనరూపాలే.  నిడివిలో, నడకలో, పేరెట్టుకోడంలో ఈ నాల్గింటి మధ్యా ఇటీవల పెద్ద తేడాలు కనిపించవు. ఈ మధ్య ఇవి కూడా కథల్లా ఆరంభమై కథల్లా ముగుస్తున్నాయి.

కథ గురించిన మన అవగాహన మరింత స్పష్టం కావాలంటే – కథ పోలికలున్నా కథలుకాని – వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అందువల్ల వీటి నుండి కథ ఏవిధంగా భిన్నమో తెలుస్తుంది.


ముందుగా వార్తను తీసుకుందాం.
ఎనభై ఏడు జూలైలో మంచిర్యాల దగ్గర దక్షిణ ఎక్స్ ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున పొంగి వచ్చిన వరద కెరటంలో ఎనిమిది బోగీలు కొట్టుకుపోగా రెండు బోగీలు రైల్వేట్రాక్ కి ఐదువందల అడుగుల దూరంలో మట్టిలో కూరుకు పోయేయి.


ఫలానా తేదీన, ఫలానా ఇన్ని గంటలకు, ఫలానా ఛోట ఇలాంటిలాంటి సంఘటన ఇలా ఇలా జరిగింది. జరిగిన ఘోర నష్టాలివి – అంటూ వచ్చే భోగట్టాను వార్త అంటాం. ఆ భోగట్టాను లేదా వార్తను నిర్లిప్తంగా, నిర్ధుష్టంగా, తెలిసిన మేరకు సొంతంగా, వీలైనంత క్లుప్తంగా చెప్పడం పూర్వపద్ధతి. ఇప్పటికీ కొన్ని పత్రికలు ఈ సంప్రదాయాన్నే పాటిస్తాయి.


అలా కాకుండా –
అది తెల్లవారుఝాము.  పెట్టెలో ప్రయాణీకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు.  హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్తున్న నారాయణరావు అనే యువకుడికి ఎవరో కొట్టి లేపినట్టు తెలివొచ్చింది.  చూస్తే రైలు ఆగిపోయినట్టుంది.  భోగీ ఓ పక్కకు ఒరిగిందా అనిపించింది – అంటూ ఆరంభించి ఆయన పై బెర్తు మీంచి క్రిందికి దిగేసరికి చీలమండదాకా నీరుండడం, గబగబా వెళ్ళి తలుపు తీయబోతే తలుపు రాకపోటం, గాభరాగా ముందు పెట్టిలోకి పరుగెత్తడం, ప్రయాణికులంతా అల్లకల్లోలంగా రైల్లోంచి గెంతేస్తూండడం, తక్కినవారితో తనూ ఒక సురక్షిత ప్రాంతానికి చేరుకోడం, అప్పటికప్పుడే తగ్గుముఖం పడుతున్న నీటిలోంచి విషాద దృశ్యాలొకటొకటీ బయటకు తేలిరావడం,  కొందరు యువకులూ,  సాహసులూ ఆపదలో ఉన్నవారిని ఒడ్డుకు చేర్చడం, ఇంకో అరగంటలో మంచిర్యాల నుండి తండోపతండాలుగా జనం తరలివచ్చి అందరికీ సాయపడడం – ఇలా జరిగినదంతా ఓ ప్రత్యక్ష సాక్షి కథనంలా చెప్పడం కొత్త పద్ధతి.


ముందు చెప్పినట్టు నిర్లిప్తంగా చెప్పినా, ఇప్పుడు చెప్పినట్టు హృదయాన్ని తాకే విధంగా చెప్పినా, రెండింటిలోనూ చెప్పింది భోగట్టాయే. కాబట్టి అది వార్తే అవుతుంది.


ఆ తరవాత వార్తా కథ –

సంఘటనాత్మకమైన వార్తల్లో సంఘటనలు రెండు రకాలు.  పైన చూపినలా కొన్ని ఆకస్మిక సంఘటనలు.  వీటికి పూర్వ వృత్తాంతాలుగా చెప్పదగ్గవేమీ ఉండవు. ఆకస్మికాలు కాని సంఘటనలకు పూర్వాపరాలు రెండూ ఉంటాయి.

ఏదో రావులపూడిలోనో, రాజన్నపాలెంలోనో, ఓ వర్గంవారు కత్తులూ, బరిసెలూ, గండ్రగొడ్డళ్ళూ వంటి మారణాయుధాలతో ఇంకో వర్గం వారిమీద దాడి జరుపుతారు.


ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలైన వివరాలతో ముందుగా ఆ సంఘటన గురించి మొదటి భోగట్టాలొస్తాయి.  అప్పటికది తొలివార్త.  ఆ మర్నాడు దాడి వివరాలన్నీ దాని పూర్వాపరాలతో వస్తాయి. సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడిది? తక్కిన నాగరిక ప్రపంచంతో దానికుండే సంబంధాలు ఏపాటివి? ఘర్షించిన వర్గాలేవి? ఘర్షణకు మూల కారణమేమిటి? ఏ కొత్త చట్టమైనా, కోర్టు తీర్పైనా, ప్రభుత్వ ఉత్తరువైనా ఒకరి న్యాయసమ్మతమైన హక్కుని మరొకరికి చట్ట సమ్మతంగా (అంటే చట్టం అందతో) దఖలు పరిచిందా? మతపరమైన లేదా కులపరమైన ఘర్షణ అయితే – ఎవరు ఎవరిని ఎప్పుడెప్పుడు ఏ ఏ విధాల రెచ్చగొట్టడం వల్ల ఈ ఘర్షణ ఏర్పడింది? జరిగిన దాడి ఆకస్మిక ఆవేశాల ఫలితమా? ముందుగా వేసుకున్న పథకం ప్రకారం జరిగిందా? దాడిలో పరిస్థితులు ఎవరికి ఏవిధంగా అనుకూలించేయి? ఎవరికి ఎలా ప్రతికూలించేయి? భవిష్యత్తులో ఈ సంఘటన ఏ పరిణామాలకి దారి తీయొచ్చు?


ఇలాంటి అధారాలన్నింటికీ జవాబులా – ఏ ప్రత్యేక విలేఖరో అక్కడి ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగా జరిగిందీ, జరగబోయేదీ అంతా ఒక కథలా రాస్తారు.  అలాంటి దాన్ని వార్తా కథ అంటారు.


సంఘటనను విడిగా కాకుండా దాని పూర్వాపరాల మధ్య చూపడంవల్ల ఆ సంఘటన స్వభావాన్ని మరింత స్పష్టంచేయగలుగుతుంది – వార్తా కథ.

వార్తయినా, వార్తా కథయినా చేయవలసేది యదార్ధ ప్రకటన. యదార్ధమంటే ఊహకూ, కల్పనకూ, పక్షపాతాలకూ, స్వీయ ప్రయోజనాలకూ తావుండనిది.   విలువలు పాటించడం, పాటించకపోవడం వేరే సంగతి.


ఇంక వ్యాసానికొస్తే – ఆ రైలు ప్రమాదం మీదే వ్యాసం రాయదలచుకున్నామనుకోండి.  దాన్నీ ఓ కథలా ఆరంభించొచ్చు. ఆ పనే చేస్తున్నారు ఈ మధ్య.


ఆరోజు మీ మనవరాలి పుట్టినరోజు. రోజల్లా విందులూ, వినోదాలతో పిల్లల నవ్వులతో, ఆటలతో హాయిగా గడిచింది. సాయంత్రం పార్టీకొచ్చిన బంధుమిత్రులను సాగనంపడమూ అయ్యింది. ఇంటిల్లిపాదీ డైనింగ్ టేబుల్ దగ్గర చేరేరు. తన పుట్టినరోజు బహుమతుల గురిమ్చి బడాయిలు పోతుంది మనవరాలు. మీరూ, మీ అబ్బాయీ ప్రేమగా టీజ్ చేశారు. నాన్నమ్మ మనవరాలిని వెనకేసుకొస్తుంది. కబుర్లు, కబుర్లు, ఒకటే కబుర్లు. ఎవరో లైటార్పేస్తారు. అబ్బా పన్నెండయ్యిందా అంటూ పడకలెక్కుతారు. పడుకున్నదే తడవు నిద్ర పట్టేస్తూంది. నిద్దట్లో ఏవో శబ్ధాలు. ’అయ్యో! అమ్మా! ఇదేమిట్రా’ అని అరుపులు. అమ్మో తల పగిలిపోయింది. కదపబోతే కాళ్ళూ చేతులూ కదలవేం! ఇసకలో కూరుకుపోతున్నట్లు ఈ అనుభవమేమిటి! కళ్ళెందుకిలా కూరుకుపోతున్నాయ్! పీడకల! అవునంతా పీడకల!


ఆ కలలోనుంచి తేరుకునేసరికి మీరు ఆసుపత్రిలో ఉంటారు. మీ బెడ్ పక్కన మీ వాళ్ళొక్కరూ కనిపించరు. క్రమంగా ఒక్కొక్క భోగట్టాయే తెలుస్తుంది. మీ ఫ్లాట్కి పైనున్న రెండు ఫ్లాట్లూ కూలి, ఆ బరువు మీ కప్పుమీద పడ్దది.కప్పు విరిగి ఇంటిల్లపాదీ ఆ డెబ్రస్ లో కూరుకుపోయి చచ్చిపోయేరట. మీ బల్ల మంచం గోడవార ఉండడంవల్ల మీరు మాత్రం బతికిపోయారట.


ఇటువంటి దుర్ఘటన నిజంగానే మీకు జరిగిందనుకోండి. ఆ ప్రమాదానికి మీరేవిధంగా స్పందిస్తారు? మేడలూ, మిద్దెలూ ఒట్టినొట్టినే కూలిపోయాయంటే నమ్ముతారా? ఎక్కడో ఏదో జరిగింది.  ఎవ్వరో ఏదో చెయ్యరాని తప్పు చేసేరు.  కాంట్రాక్టర్లూ, కట్టించిన ఇంజనీర్లూ, మీకు దానిని అమ్మిన హౌసింగ్ బోర్డువారూ అదో ప్రమాదమని అనొచ్చు.  తగు రుజువులూ చూపొచ్చు.  కానీ మీరు మాత్రం ఆ వాదాన్ని అంగీకరించరు. అది ప్రమాదమని నమ్మరు.
అలానే నేనూ నమ్మను.


జూలై తొమ్మిది తెల్లవారు జామున మంచిర్యాల దగ్గర రైలుకి జరిగింది అచ్చమైన ప్రమాదం – అని రైల్వేమంత్రిగారు ఏ విచారణా జరపకుండానే చెప్పొచ్చు.  లేదా విచారణ జరిపించాక ఓ కమిటీచేతే చెప్పించొచ్చు.  ఎవరూ ఎప్పుడలా చెప్పినా నేనే కాదు బుద్ధీ జ్ఞానం ఉన్నవారెవరూ అలాంటి వాదాన్ని అంగీకరించరు.

-అంటూ ఆ వ్యాసాన్ని విషయంలో ఏ సంపర్కం లేని ఒకానొక కల్పనతో ఆరంభిస్తాము. ఆరంభం ఎలా జరిగినప్పటికీ వాదనను వివరించే దశలో ఒక్క పొల్లు మాటకు తావివ్వకుండా ప్రభుత్వం వారి రికార్డులనుండే సాక్ష్యాధారాలు చూపిస్తూ సంబంధిత ఇరిగేషన్, రైల్వేశాఖలు దానికెలా బాధ్యులో నిరూపిస్తాము.


వార్తలకు లాగానే వ్యాసాలకు కూడా యదార్థాలే ఊపిరి. రుజువుకి రాగల విడివిడీ యదార్ధాలను తగు తర్కంద్వారా పరిశీలించి, ఈ వాస్తవాన్ని గ్రహించి, దాన్ని వ్యక్తీకరించేందుకు తర్కానుగుణ్యమైన ఒక వాదనను నిర్మిస్తాం. అది వ్యాసం.

మరి కథలో జరిగేదేమిటి?

కథలో – వార్తలోలా ఒకానొక సంఘటనలోని యదార్ధానికి కాదు ప్రాధాన్యం. ఒకటిగానీ వ్యాసంలోలా ఒకటికన్నా ఎక్కువగాని యదార్ధాల నుండి వ్యక్తమయ్యే వాస్తవానికి ప్రాధాన్యం. ఆ వాస్తవం వ్యక్తమయ్యేటప్పటి వేదనకు ప్రాధాన్యం.


లోకంలో జరిగే అనేక సంఘటనల నుండీ, లేదా ఆయా పరిస్థితుల్లో, సన్నివేశాల్లో వ్యక్తుల ప్రవర్తన నుండీ, ఒకప్పుడు పలువురి జీవితాల పరిశీలన నుండీ వారి జీవనగతి నుండీ – ఇలా మానవ జీవితానికి సంబంధించిన వేర్వేరు ముఖాలలో ఏదో ఒక దానినుండి వ్యక్తమయ్యే వాస్తవాలను కల్పిత వృత్తాంతాల ద్వారా వ్యక్తం చేస్తాయి కథలు. వృత్తాంతాలు కల్పితాలే అయినా అవి జీవితమంత సహజంగా ఉండాలి. అందలి సమస్తం యదార్ధాలనిపించేటంతటి భ్రమ కలిగించాలి. వాటివల్ల మనం పొందే అనుభూతులూ, వేదనల తీవ్రతా, అలాంటివి నిజజీవితంలో మనం పొందేప్పుడు పోలిస్తే వీసమెత్తు తేడా రాకూడదు.


అంటే-
* చెప్పదగ్గ ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి సాకల్యమైన భోగట్టా నిర్లిప్తంగా ఇచ్చినా, సవిస్తరంగా ఇచ్చినా అది వార్తే అవుతుంది.
* ఒక సంఘటన తాలూకూ స్వభావం మరింత సుస్పష్టమయ్యే విధంగా ఆ సంఘటన పూర్వాపరాల మధ్య దాన్ని చూపితే అది వార్తా కథ అవుతుంది.
* సంఘటన భావుకతను ప్రేరేపిస్తే అప్పుడు పుట్టిన తర్కం ఫలితంగా ఏర్పడ్డ వాస్తవాన్ని లేదా నిజాన్ని నిరూపించేది వ్యాసం.
లోగడ-
* ఒట్టి వృత్తాంతమే అయితే అది కథ కాదనీ, కథ కాలేదనీ అనుకున్నాం.  కథ కానప్పుడు మరేదో అయినా కావాలి కదా! ఏమవుతుందో ఇప్పుడు చెప్పుకోవచ్చు.
* ఒట్టి వృత్తాంతం ఒక విధమైన వార్తో, వార్తా కథో అవుతుంది.
* అలానే – లోగడ అనుకోలేదు గాని ఇప్పుడు అనుకోవచ్చు.
* సాంఘిక దురాచారాలమీద కాని, కొన్ని ప్రభుత్వ విధానాల దుష్ఫలితాల మీదకాని, వ్యవస్థలో కనిపించే కొన్ని దుర్లక్షణాల మీదకానీ లేక ఇదే కోవకి చెందిన మరేదో అవకరం మీదకాని, మన అభిప్రాయాలను కథగా చెప్పాలనుకుంటాము. కొన్ని పాత్రలను ప్రవేశపెడుతూ మొదటి పేరాని కథలా ఆరంభించి క్రమక్రమంగా కథను ఒక చర్చాగోష్టిలా సాగించి, మన అభిప్రాయాలను ముఖ్యపాత్ర ద్వారా చెప్పించేస్తాం. అలా చేస్తే అది కథ ముసుగేసుకున్న చర్చా వ్యాసమౌతుందిగాని కథ కాదు.
* ఒక వృత్తాంతం హృదయాన్ని స్పృశించగలిగేదైనా అందులో వ్యక్తం కాగల వాస్తవం లేనప్పుడు కథ కాదు.ఒక వాస్తవాన్ని చెప్పగల రచనైనా అది  హృదయాన్ని స్పృశించే వృత్తాంతం కాకుంటే కథ కాదు.

About కాళీపట్నం రామారావు

కారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు. ఈయన చేసిన రచనలు రాసిలో తక్కువైనా వాసికెక్కిన రచనలు చేసారు.

1966లో వీరు రాసిన ”యజ్ఞం” కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు. కథానిలయం తెలుగు కథకి నిలయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండేలా దాన్ని తీర్చిదిద్దుతున్నారు.

This entry was posted in వ్యాసం and tagged , , . Bookmark the permalink.