నారాయణ కల్పవృక్షమ్

(విశ్వనాథ సత్యనారాయణగారు జీవించి వుండి ఆరుద్ర గారి షష్టిపూర్తి ఉత్సవానికి సందేశం పంపివుంటే ఇట్లా వుండవచ్చు…)

భాగవతుల శంకరశాస్త్రి. ఇది కొందరికి తెలియును, కొందరికి తెలియదు. ఆరుద్ర. ఇది మిక్కిలి బ్రసిద్ధము. ఆరుద్ర యనునది యొక నక్షత్రము. పుష్య మాసములో వచ్చెడి ఆరుద్ర నక్షత్రము శైవులకు బర్వదినము. పరమేశ్వరుడు కైలాసము నుండి దిగి వచ్చునని వారి నమ్మిక. ఆ రోజు ద్వారదర్శనము చేయుదురు. కొందరు కొన్ని పేర్లు ధరించుటచే అవి ఖ్యాతి బడయును, కొందరు వాసికెక్కిన పేర్లు ధరించి ఖ్యాతి గడింతురు. మా ప్రాంతములో విశ్వనాథ నాగభూషణమని యొకడున్నాడు. వాని తాత ముత్తాతలు మెట్ట సేద్యములో దిట్టలు. వీనికి అది కూడ అబ్బినది కాదు. జులాయిగా తిరుగుచుండెడివాడు. అయినను ఇంటిపేరుచే గొంత ప్రాచుర్యము పొందినాడు. ఫలానా నాగభూషణము మీ దాయాదియా అని పలువురు నన్ను ప్రశ్నించుచుండెడివారు. అతడు మా శాఖవాడు కూడ కాదని నేను నిజము చెప్పెడి వాడను. కొందరికి యిట్టి వరములు ఆయాచితముగా లభించును.

ఆరుద్ర అభ్యుదయవాదినని చెప్పుకొనును. కాదనుటకు నావద్ద నిదర్శనములు లేవు. అయినచో అయివుండవచ్చును. కాకపోయినచో మాత్రము ప్రమాదమేమి? అతను గడ్డము పెంచును. ఆనాడు జులపాలు పెంచుటను భావకవులు ఆచారము చేసిరి. నేను ఏ వాదమునకూ జెందను. నా వాదము నాది. నచ్చినవారికి యది వేదము, లేని వారికి లేదు. వారికి జుత్తు బెంచుట అవశ్యకమని తోచినది. కవియైనవాడు మేధను బెంచుకొనుట ముఖ్యమని నాకు దోచును. ఏది ముఖ్యమో ప్రాజ్ఞులు గ్రహింతురు గాక!

త్వమేవాహమ్… అని యొకటి వ్రాసినాడు. సినీవాలి యని మరియొకటి వ్రాసినాడు. ఇవి సంస్కృత కావ్యములు గావు. పచ్చి ఆధునిక వచన కవితల కూర్పు. పచ్చియనిన జ్ఞాపకము వచ్చును. ఆరుద్ర పైలాపచ్చీసు యని కూడా ఒకటి రచించినాడు. ఈతడు రైలుబండిని మానవ జీవితమునకు ముడిపెట్టి ఒక కవిత అల్లినాడు. అందు జీవుని వేదన కొంత స్ఫురించును. భావకతయూ వున్నది. ఓ కూనలమ్మ యను మకుటములో బద్యములు గిలికినాడు. అవి మిక్కిలి చమత్కారముగా నుండును. అసలు చమత్కారమే యితని మతమని తోచును. ఒక చోట నేనతనికి గురుతుల్యుడనని బేర్కొన్నాడు. నా రచనలు గొన్నింటిని చదివి, యెట్లు వ్రాయకూడదో తెలిసికొంటినని చమత్కరించినాడు. ఏమైననేమి? ఆ ‘ఎఱుక’ యేదో నా వల్లనే కలిగినది కదా? అజ్ఞానము తొలగించిన వాడు గురువు, సముద్రమున ఆణిముత్తెములు ఉండును. నత్తగవ్వలును ఉండును. వారి వారి బ్రాప్తము ననుసరించియు, వారి వారి పూర్వజన్మ సుకృతమును బట్టియు అవియవి వారి వారికి లభించును. అతని ‘ఊహ’ యట్లున్నది. అతని కదియే ప్రాప్తమని భావింతును.

ఆరుద్ర పరిశోధకుడు, అని చెప్పగా వినియుంటిని. నాలుగు దశాబ్దములుగా చెన్నపట్టణములో నివాసము యుంటూ తెనుగు సాహిత్యము, తెనుగు జీవనము ఇత్యాది అంశములపై నితడు మిక్కిలిగా వ్యాసములు వెలువరించినాడు. జైనము గురించి ఇతనికి గొంత తెలియును.

ప్రస్తుతాంశము షష్ట్యబ్దిపూర్తి. అరువది సంవత్సరములు నిండుట యీ వేడుక అయినచో ఆరుద్రకు అరువది నిండినవా? లేదు… భాగవతుల శంకరశాస్త్రికి అరువది నిండియుండవచ్చును. ఆరుద్ర పుట్టినది తరువాత గదా! మరి ఆరుద్రకు అరువది యెక్కడివి? కనుక యీ షష్ట్యబ్దిపూర్తి భాగవతుల శంకరశాస్త్రికే గాని ఆరుద్రకు కాదు, ఔను. ఇది యొక చమత్కారము.

—————————–xxxx——————————-


ఈ వ్యాసంలోని బొమ్మ, శ్రీరమణ రాసిన "హాస్యజ్యోతి" పుస్తకం (నవోదయ పబ్లిషర్స్) నుండి సేకరించిన బొమ్మలనుండి తయారుచేసినది.

About శ్రీరమణ

ఆయన కథలు… శ్రావణ మాసపు నోముల్లో ఆది దంపతులు పోటీలు పడి పంచుకు తిన్న తాలింపు శనగలంత కమ్మగా ఉంటాయి. ”మిథునం” కథకుడాయన.

కవితల్నీ వచనాల్నీ ఆత్మలోకంటా చదివేసి పారడీ చేస్తే అసలు రచయితలు పెన్నులు తడుముకునేలాగుంటాయి. శ్రీరమణ పేరడీల కర్త ఆయనే.

కొంటెగా చమత్కార చమక్ తారల్ని నిశ్శబ్దపు చీకట్ల మీద చల్లితే, నవ్వుల వెన్నెల్ని ఆరబోయించే చెకుముకి పత్రికా ఫీచర్లూ నడిపారాయన. హాస్యజ్యోతి, గుత్తొంకాయకూర – మానవసంబంధాలు, శ్రీఛానెల్ ఆయన చలవే!

”బాల్యం చూసేవారికి బావుంటుంది. యవ్వనం అనుభవించే వారికి బావుంటుంది.” అని కన్ఫ్యూజన్ లేకుండా అనెయ్యగలరు, ”ఏ ప్రక్రియైనా ఒకే మూసలో వేసి తీసిన కజ్జికాయల్లా ఉండకూడదు. వేటికి అవి స్వేచ్చగా చేతితో వేసిన పకోడీల్లా ఉండాలంటాను.” అంటూ రుచిగా రచయితల వీపు చరచగలరు శ్రీరమణ.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారన్నట్టు మన పేర్లు చెప్పకుండా మన ఫోటోల నెగెటివ్ లని, మన రక్తమాంసాల వెనకున్న అసలు రూపాల్ని మనకే చూపించే గడసరి.

గచ్చు మీద కుప్పగా పోస్తే గుప్పెట నిండుగా గుండెకు హత్తుకోవాలనిపించే నీలపు గోళీల్లాంటి అక్షరాల ఆటలో నేర్పరి.

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

4 Responses to నారాయణ కల్పవృక్షమ్

  1. కళ్యాణి says:

    ఇంతకీ దీన్ని విశ్వనాథవారు చదివారా ? చదివుంటే ఎంత ఆనందించి వుండేవారో ? ఈ వివరాలు ఎవరైనా చెప్పగలరు.

Comments are closed.