నిశ్శబ్దపు హోరు

ఆఫీసుకి లేటవుతుండటంతో గబ గబా బ్రీఫ్ కేసు సర్దుకుంటున్నాను. తలుపు చప్పుడైంది! ఒంటరి పక్షిని! నాకోసం ఎవరు, ఈ టైంలో?"మీ వుత్తరం పొరపాట్న నా అడ్రసు కొచ్చింది! సారీ ఫర్ ది డిస్టర్బెన్స్!" మర్యాదగా వుత్తరం చేతికిచ్చి వెళ్ళిపోయింది ఆవిడ. ఎవరీవిడ? కనీసం పలకరించనైనా లేదే! ఆశ్చర్యంగా ఆవిడ వెళ్ళిన వైపే చూసాను. పక్కఫ్లాట్లోకెళ్ళిందావిడ.  కవరు పైన నా పేరుతోపాటు వాళ్ళ ఫ్లాటు నెంబరు వేసుంది. అది నా పేరేనని ఎలా తెలుసావిడకి? అసలు నేను తెలుగు వాణ్ణనెలా గుర్తు పట్టింది? ఏమిటో అంతా వింతగా వుంది.


సాయంత్రం ఆఫీసునించి వస్తూంటే వాళ్ళ ఫ్లాటు తలుపు తెరిచి వుంది. ఎవరో ఒకాయన ఇంటి ముందు ఫ్యూజ్ అయిపోయిన బల్బుని మారుస్తున్నారు. చూసి పలకరింపుగా నవ్వాడాయన. దాదాపు అరవైకి దగ్గరగానే వుండొచ్చు. మా నాన్నగారి కంటే కొంచెం చిన్న వారిలాగున్నారు.


కుర్చీ దిగి వచ్చి, చేయి ముందుకి చాపుతూ, "హలో! అయాం రాజగోపాల్! మీ పేరు పవన్ అని తెలిసింది నాకు. పక్క ఫ్లాటులో కొత్తగా దిగినట్టున్నారు!" అంటూ పరిచయం చేసుకున్నారు.

"అవునండీ. వచ్చి దాదాపు వారం రోజులైంది. ఇంతకీ నా పేరూ, నేను తెలుగు వాణ్ణనీ ఎలా తెలిసింది?" కుతూహలంగా అడిగాను.

"గుడ్ క్వశ్చెన్. ఆవిణ్ణే అడుగుదాం, రండి." ఫ్లాటు లోపలికి దారి తీసాడాయన. కొత్త వాళ్ళింట్లోకి వెళ్ళటానికి నాకు కొంచెం మొహమాటంగా అనిపించి అక్కడే ఆగిపోయాను.

"అదేమిటి అక్కడే ఆగిపోయారు? భలే మొహమాటస్తుల్లాగున్నారే! పరవాలేదు. ప్లీజ్ కమిన్!"

ఆ మాటతో లోపలికి వెళ్ళాను.

"సత్యా! పక్క ఫ్లాట్ పవన్ వొచ్చాడు చూడు." ఆవిడ బయటికొచ్చింది.

"నీ కితని  పేరూ వివరాలెలా తెలుసు?"


నా వైపు తిరిగిందావిడ.

"అదా! నిన్న కింద వాచ్మేన్ తో మాట్లాడుతుంటే మీరు అక్కణ్ణించి బయటికెళ్తూ సెల్ ఫోన్ ఎత్తి, "హలో పవన్ హియర్!" అన్నారు. కొంచెంసేపు తెలుగులో మాట్లాడారు! తరువాత ఇంటికొచ్చేసరికి మీ ఉత్తరం మా ఇంట్లో వుంది. అందుకే పొద్దున్న తెచ్చి ఇచ్చాను!" నాతోనే అన్నారావిడ.

"ఐ సీ! చాలా థాంక్స్ అండీ. ఈ మధ్యనే మెల్బోర్న్ వచ్చాను. అంతకు ముందు అడిలైడ్ లో వుండేవాణ్ణి." ఆవిడ అలాగా అన్నట్టు చూసి లోపలికెళ్ళి పోయారు. మళ్ళీ బయటికి రాలేదు. ఆయనతోటే అక్కడ కుర్చీలో కూర్చొని కాసేపు మాట్లాడాను.


బ్రహ్మచారి నవటంతో సాయంత్రం కాగానే ఎవరైనా భోజనానికి పిలిస్తే బాగుండని వుంటుంది నాకు. చాలా వరకు కుటుంబాల్లో సాయంత్రం కలిస్తే చాలు, "ఇప్పుడు ఒంటరిగా ఏం వొండుకుంటావులే, ఇక్కడే మాతో పాటు తినెయ్యి," అంటూ వుంటారు కూడా. చాలా సార్లు నేను సిగ్గు పడకుండా టాపిక్ భోజనం వైపు మళ్ళిస్తా కూడా! ఇవాళ కూడ వీళ్ళిద్దరూ భోజనానికి వుండమంటారని ఆశపడ్డాను.. అలాటిదేమీ లేకపోగా, పది నిమిషాలయ్యే సరికి ఆయన ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారని నాకర్ధం అయింది.


"సరే, నేనిక బయల్దేరుతానండీ," అంటూ లేచాను. ఆయన కూడా , "మళ్ళీ కలుద్దాం!" అంటూ నాతో పాటు బయటికొచ్చి ఫ్లాట్ తలుపులేసి తన దారిన వెళ్ళిపొయాడు.


మొదలు పలకరించి లోపలికెళ్ళినావిడ మళ్ళీ బయటికి రాలేదు, కనీసం ఆయన వెళ్తున్నప్పుడు కూడా. ఆవిడ మళ్ళీ బయటికెందుకు రాలేదో అనుకున్నాను! ఇంకా ఏదో అసహజంగా వుంది వాళ్ళింట్లో, అదేమిటో అంతు బట్టలేదు నాకు.

—————xooooox————-

ఆయన వారానికి రెండు మూడు సార్లు కనిపించేవాడు. సరిగ్గా నేను ఆఫీసు నించి వచ్చేసరికి వాళ్ళ ఫ్లాటు తలుపు తెరిచి వుండేది. ఆయన చాలా బిజీగా వుండేవాడు. కబ్-బోర్డులు దులుపుతూనో, రికార్డులు సర్దుతూనో, కార్పెట్లు వాక్యూం చేస్తూనో, బిల్లులు ఫైల్ చేస్తూనో, ఏదో ఒక పనిలో తలమునకలుగా వుండేవాడు. అయినా నన్ను చూడగానే నవ్వుతూ బయటికొచ్చి, "హలో పవన్! కాసేపు కూర్చొని వెళ్దువుగాని రా!" అని పిలిచేవాడు. తనే లోపలికెళ్ళి రెండు కప్పుల కాఫీ పెట్టి తనకొకటీ నాకొకటీ ఇచ్చేవాడు. ఆవిడ ఒక్కసారి బయటికొచ్చి తొంగి చూసి హలో అన్నట్టు తలాడించి లోపలికి వెళ్ళిపోయేదే తప్ప ఇంకే కదలికా వుండేది కాదు!


ఈవిడసలు సాయంత్రాలు వంట చేయదా?మరి రాత్రి భోజనం ఎలా చేస్తారు? అన్నిటికంటే ఈ ప్రశ్నే నన్నెక్కువగా వేధించేది. కాఫీ తాగగానే ఆయన కప్పులు వంటింట్లో పెట్టి బయటికి వెళ్ళటానికి షూసు వేసుకునేవాడు. ఆ క్లూతో నేనూ లేచేవాణ్ణి. ఇదే కార్యక్రమం ఏ మార్పూ లేకుండా. మిగతా నాలుగు రోజులూ తలుపు మూసే వుండేది. కొన్ని సార్లు పొద్దున్న ఆవిడ కారు ఆఫీసుకెళ్ళటానికి బయటికి తీస్తూ కనిపించేది. పలకరింపుగా తలాడించేది, అంతే!


అదొక లాటి నిశ్శబ్దం వాళ్ళింట్లో. రేడియో చప్పుడో, టీవీ చప్పుడో, వంటగదిలోంచి వచ్చే చప్పుడో, ఆఖరికి పేపరు కదులుతున్న చపుడు కూడా వచ్చేది కాదు. అసలు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కూడా చూడలేదు నేను నెలరోజుల్లో. ఇద్దరు భార్యా భర్తలూ ఒంటరి ద్వీపాల్లా అనిపించేవారు. ఆ కారణమేమిటో తెలియకపోవడంతో నాకు పంట్లో ఏదో ఇరికితే కలిగేలాటి అసౌకర్యం కలిగింది.


ఆయన ఎప్పుడూ వ్యక్తిగతమైన ప్రశ్నలెక్కువగా వేసేవాడు కాదు. దాంతో నాకూ ఏదైనా పర్సనల్ గా అడగాలంటే సంకోచంగా వుండేది. ముఖ్యంగా వాళ్ళ కబ్-బోర్డులోంచి తొంగి చూసే అందమైన ఆడపిల్ల ఫోటో గురించి తెలుసుకోవాలని ఎంత కుతూహలంగా వున్నా అడగలేకపోయేవాణ్ణి.

————-xooox———-

అర్ధరాత్రి మంచి నిద్రలో వున్నానేమో, గుయ్యిమని మోగిన శబ్దమేమిటో అర్ధం కాలేదు. రెండు క్షణాలైనాక గుర్తొచ్చింది అది ఫైర్ అలారం అని. వెంటనే బట్టలేసుకుని బయటికెళ్ళాను. మా ఫ్లోర్ మీద వుండే ఫైర్ వార్డెన్ అందరినీ జాగ్రత్తగా మెట్లు దిగమని చెప్తునాడు. నేనూ ఆదరాబాదరాగా పర్సూ, ఫ్లాటు తాళాలూ తీసుకుని కిందికెళ్ళాను.


బయట అందరూ హడావిడిగా మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్టుండి నాకు అక్కడున్న వాళ్ళలో పక్క ఫ్లాటులోని దంపతులు లేరని స్ఫురించింది. గబగబా ఫైర్ వార్డెన్ దగ్గరకెళ్ళి, "మా పక్క వాళ్ళు కిందికి రాలేదు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళను నిద్ర లేపి తీసుకొస్తాను," అన్నాను. సరే వెళ్ళి వీలైనంత త్వరగా రమ్మన్నాడు.


నాలుగంగల్లో మెట్లెక్కి వాళ్ళ తలుపు తట్టాను. నాలుగైదు సార్లు తట్టినా తలుపు తెరుచుకోలేదు. చెవులు గుయ్యిమనేలా అలారం మోగుతుంటే వీళ్ళకింత నిద్ర ఎలా పడుతుంది? నేను ఇంకొంచెం ఆందోళన పడేలోగానే లోపలినించి, "హూ ఇజిట్?" అని ఆవిడ కంఠం వినపడింది.


"నేనండీ పవన్! కొంచెం ఎమర్జెన్సీ, మీరు బయటకి రావాలి," గొంతు పెద్దగా పెంచి అన్నాను. ఆవిడ తలుపు తెరిచింది విసుగ్గా! కానీ ఆవిడకి అలారం శబ్దానికి అప్పుడే నిద్ర ఎగిరిపోయి వుండాలి.

"ఏం జరిగింది?" ఆశ్చర్యంగా అడిగారావిడ.

"ఫైర్ అలారం మోగుతుందండీ! అన్ని ఫ్లాట్ లూ చెక్ చేస్తున్నారు. అందరం ఫ్లాట్ వదిలి కిందకెళ్ళాలి."

"ఒక్క నిమిషం," లోపలికెళ్ళారావిడ.

రెండు నిమిషాల్లో బయటికొచ్చి "లెట్స్ గో!" అంది. ఆశ్చర్యపోయాను. అయినా మాట్లాడకుండా కిందికి దిగాను. బహుశా ఆయన ఊర్లో లేరేమో!

ఉండబట్టలేక అయిదు నిమిషాల తరువాత అడిగాను, "రాజ్ గోపాల్ గారు ఊళ్ళో లేరా?" అని.

"ఉన్నారే! ఏం అలా అడిగారు?"

"మరి కిందకి రాలేదు మీతో!" ఈసారి కోపంగా అన్నాను.

ఆవిడ ఒక్క క్షణం ఏమీ మాట్లాడకుండా గొంతు సవరించుకున్నారు.

"ఆయన నాతో వుండరు!"

"వాట్?" అదిరి పడ్డాను.

"అవును, వీ ఆర్ సెపరేటెడ్!" కామ్ గా చెప్పారావిడ.


నాకేం మాట్లాడాలో తోచలేదు. పక్కనే వున్న బెంచీ మీద కూలబడ్డాను. ఏదో బాధ మనసులో. నిజం చెప్పాలంటే వాళ్ళకీ నాకూ ఏమీ సంబంధం లేదు. పెద్ద స్నేహం కూడా లేదు. నేను బాధ పడటంలో అర్ధంలేదు. ఇక్కడ ఆరేడేళ్ళుగా వుంటున్న వాణ్ణి, విడాకులూ మారు పెళ్ళిల్లూ నాకేమీ కొత్త కూడా కాదు. కానీ దాదాపు మా అమ్మా నాన్న వయసున్న వాళ్ళనీ, భారతీయులనీ విడాకులు తీసుకున్న వాళ్ళని నేను చూడలేదు. అందువల్లనే కల్చర్ షాకేమో.

మళ్ళీ ఆవిడే అన్నారు, "మీకింకా తెలియదా? ఈ పాటికి ఎవరో ఒకళ్ళు చెవిలో వూదేసి వుండాలే?"

"ఈ ఊరు వచ్చి రెండు నెలలే కావటం వల్ల నాకు పెద్దగా ఎవరూ పరిచయం లేదు."


ఇంకేం మాట్లాడాలా అని నేను ఆలోచిస్తుండగానే, ఫైర్ వార్డెన్ వచ్చి ఏదో చిన్న లోపం వల్ల అలారం మోగిందనీ, అందరం ఇళ్ళకి వెళ్ళొచ్చనీ చెప్పాడు. లేచి మెట్లెక్కి పైకెళ్ళాం.


"వస్తా! గుడ్నైట్. మరీ అంతలా షాకవ్వకండి!!” ఆవిడ లోపలికెళ్ళిపోయారు.

——————-xoooox————–

శుక్రవారం, "హమ్మయ్య! రెండు రోజులు కాస్త తీరికగా పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చెయ్యొచ్చు," అనుకుంటూ మెట్లెక్కుతున్నాను. నా ఫ్లాట్లోకి వెళ్ళబోతూ పక్క ఫ్లాట్ వైపు చూసాను. మూణ్ణాలుగు వారాలుగా రాజగోపాల్ గారు కనిపించలేదు. ఎందుకనో! ఒక్కసారి తలుపు తట్టి ఆవిడెలా వున్నారో చూద్దామనిపించింది. కానీ ఏదో మొహమాటం, జంకూ అడ్డుపడ్డాయి. ఆవిడకి ఇతరులతో ఎక్కువగా మాట్లాడటం పెద్దగా ఇష్టం వుండదన్నట్టు అనిపించింది.


ఇంతలో పక్క ఫ్లాటు తలుపు తెరుచుకుని ఆవిడ బయటికొచ్చారు. లోపలికెళ్ళబోతూ తల తిప్పి ఆవిడని చూసి నివ్వెరపోయాను. మనిషి చాలా నీరసంగా పది లంఖణాలు చేసినట్టూ, ఏమాత్రమూ ఓపికా, శక్తీ లేనట్టున్నారు. మొహం అంతా పీక్కు పోయి, జుట్టంతా రేగి, ఆవిడని నేనెప్పుడలా చూడలేదు. నా వైపేనా చూడకుండా ఎటో వెళ్ళటానికి మెట్లు దిగుతున్నారు.


రెండంగల్లో ఆవిడని చేరుకున్నాను.

"సత్య గారూ! అలా వున్నారే? ఆరోగ్యం బాగా లేదా?"

ఉలిక్కి పడి నావైపు తిరిగారు.

"హల్లో పవన్! ఏమీ లేదు, కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్, అంతే. రెండు రోజులనించీ జ్వరం వల్ల కొంచెం నీరసంగా వుంది. మెడికల్ షాపు కెళ్ళి మందులు తెచ్చుకుందామని బయల్దేరాను."

"మీరు ఇంటికెళ్ళండి. ఆ ప్రిస్క్రిప్షన్ ఇటివ్వండి. నేను పట్టుకొస్తా మందులు. చాలా నీరసంగా వున్నారు. ఎక్కడైనా పడిపోతారు."

"నో!నో! అయాం ఆల్రైట్. ఇందాకే పానడాల్ వేసుకున్నా కూడా." నేననుకున్నట్టే ఆవిడ ప్రతిఘటించారు. కానీ ఆవిడని ఆ పరిస్థితిలో బయటికి పంపించటం మంచిది కాదనిపించింది నాకు.


"నా మాట వినండి. నేను ఇప్పుడే పాలు కొనటానికి బయటికెళ్ళాలని బయల్దేరబోతున్నాను. ఇరుగూ పొరుగున వుండి ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? నాకు ఒంట్లో బాగాలేకపోతే అలాగే వొదిలేస్తారా నన్ను?" ఏదేదో మాట్లాడుతూ ఆమెని చెయ్యి పట్టుకుని మెల్లిగా మళ్ళీ మెట్లెక్కించాను. ఆవిడ కూడా ఇంక ఎక్కువగా వాదించకుండా పైకొచ్చింది. తన చేతుల్లోంచి తాళాలు తీసుకుని వాళ్ళ ఫ్లాటు తలుపు తెరిచాను. పర్సు తెరిచి ఆవిడ ఇచ్చిన కాగితం అందుకుంటూ "ఇంకా ఏమైనా తేవాలా బజారు నించి?" అడిగాను. కానీ అప్పటికే కళ్ళు మూసుకుని సోఫాలో పడుకుండి పోయింది ఆవిడ. నాకొక్క క్షణం భయం వేసింది! దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయి వేసి చూసాను. ఒళ్ళంత వేడిగా ఏమీ లేదు! బహుశా నీరసమే ఎక్కువై ఉండొచ్చు! అసలేమైనా తిన్నారో లేదో. మొహమాటంగానే వంటొంట్లోకెళ్ళాను. నా అనుమానం నిజమే! ఏమీ వండుకున్న ఛాయలు గానీ, భోజనం చేసిన ఆన వాళ్ళు గానీ లేవు. ఫ్రిజ్ తెరిచి చూసాను. ఖాళీ! అదీ సంగతి!


ముందు నా ఫ్లాట్ కెళ్ళి ఆఫీసు బట్టలు మార్చుకుని వంట మొదలు పెట్టాను. కొంచెం అన్నమూ, చారూ పెట్టి అర గంటలో మళ్ళీ ఆవిడ దగ్గరకెళ్ళాను. పాపం, ఇంకా అలాగే పడుకుని ఉన్నారావిడ.

మెల్లిగా తట్టి లేపాను. కళ్ళు తెరిచి అయోమయంగా నా వైపు చూసారు. "ముందు కొంచెం ఈ చారన్నం తినండి. అప్పుడు మందు వేసుకోవచ్చు!"

"చారన్నమా?"

"మీరు బాగా నీరసంగా వున్నారు. లేచి కూర్చొని ఈ అన్నం తినేయండి."

నాకెప్పుడూ ఇలా ఒకళ్ళ బాగోగులు చూడటం అలవాటు లేదు! అందుకే కొంచెం కొత్తగా, ఇంకొంచెం ఇబ్బందిగా వుంది. లేచి బాత్రూంలో కెళ్ళి మొహం కడుక్కొచ్చారావిడ.

వేడి వేడిగా చారన్నం, మిరియాల వాసనొస్తూ! ఆ తరువాత పలచగా మజ్జిగా అన్నమూ కలిపిస్తే వొద్దనకుండా అదీ తినేసారు! కంచం లోపల సింకులో పెట్టి,

"నేను వెళ్ళి మందులూ అవీ పట్టుకొస్తాను. అప్పటిదాకా రెస్టు తీసుకొండి!" అని చెప్పి బయటికొచ్చాను. మందులతో పాటు పాలూ, బ్రెడ్డూ, పళ్ళూ, కాఫీ పౌడరూ అవీ ఇవీ అన్ని కొనుక్కుని ఇల్లు చేరేసరికి గంట పైనే అయింది. ఆవిడకి వంట చేసి పెట్టెయ్యటం మంచిదయింది, అనుకుంటూ ఇల్లు చేరుకున్నాను. వాళ్ళ ఫ్లాటు తలుపు తీసేసరికి కాటన్ పైజామాలోకి మారిపోయి పేపరు చదువుతున్నారావిడ. మొహం కాస్త తేట పడింది.


నన్ను చూసి ఇబ్బందిగా నవ్వారు. "అనవసరంగా మీకు ట్రబులిస్తున్నానా?" అన్నారు. నా కంటే మొహమాటస్తులని చూడటం ఇదే మొదలు నాకు!

"ఇందులో ట్రబులేముందండీ? అసలు ఎప్పణ్ణించీ జ్వరం? డాక్టరు దగ్గరికెళ్ళారా? అంత జ్వరం వస్తే నన్ను పిలిచి వుండాల్సింది. అదృష్టవశాత్తూ సాయంత్రం చూసాను నేను. లేకపోతే ఏమై వుండేదో!" సామాన్లు వంటింట్లో సర్దుతూ అన్నాను.

"నిన్న పొద్దట్నించీ! బుధవారం సాయంత్రమే కొంచెం ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. నిన్న సాయంత్రం డాక్టరు దగ్గరకెళ్ళాను కూడా. వైరల్ ఇన్ ఫెక్షన్ కావటంతో యాంటీబయాటిక్స్ ఏవీ వద్దంది. జస్ట్ పానడాల్ వేసుకుంటూ వుండమన్నారు. ఇవాళ్టితో ఆ పానడాల్ కూడా అయిపోయింది. పైగా ఒకటే ఆకలి! వండుకునే ఓపిక లేక బయటినించి తినటానికి ఏమైనా తెద్దామని బయల్దేరుతుంటే మీరు చూసారు!"

"పోన్లెండి, అదృష్టం మన వైపుంది. కొంచెం పాలు కానీ కాఫీ కానీ తాగుతారా?"

"నేను కాఫీ పెట్టుకుంటాలే గానీ, మీరు భోజనం చేసినట్టు లేదు."

"ఇదిగో ఇప్పుడే తింటాను."

"రండి, నేను వడ్డిస్తాను. మీకు వంట బాగానే వొచ్చే! చారు బాగా పెట్టారు."

సిగ్గు పడ్డాను. "అయిదారేళ్ళనించీ ఒంటరిగా వుండి అలవాటై పోయింది లెండి."

దగ్గర కూర్చొని వడ్డించారావిడ. ఇంకా వాళ్ళ ఇంట్లో ఆవకాయా, టమాటా పచ్చడితో కమ్మగా భోజనం చేసాను. సింకులో గిన్నెలు తోమేద్దామా అనుకుంటుంటే, "లీవ్ దెమ్ అలోన్! రేపు పొద్దున్నే నేను చేస్తాగా! హాల్లో కూర్చుందాం రండి." అంటూ బయటికి తీసికెళ్ళారావిడ. బయటికొచ్చి కూర్చున్నాం. ఎప్పట్లాగే నిశ్శబ్దంగా వుంది.


ఈసారి ఆవిడ నన్ను నా గురించీ, నా జాబ్ గురించీ, ఇంట్లో అమ్మా-నాన్నల గురించీ చాలానే ప్రశ్నలడిగారు. నేననుకున్న ప్రశ్న రానే వచ్చింది, "ఇంకా పెళ్ళి చేసుకోలేదేం? ఆరేళ్ళ నించీ ఉద్యోగం చేస్తున్నావు కూడా!" సంభాషణలో ఎప్పుడు నేను "మీరు" నుంచి "నువ్వు"గా మారేనో, నాకే గుర్తు రాలేదు. అందరికి జవాబిచ్చినట్టుగానే చిరు నవ్వుతో ఆ ప్రశ్నని తప్పించుకున్నాను.

"ఆ ఫోటోలో వున్నది మీ అమ్మాయా?" టాపిక్ మార్చటానికి మూడు నెలలుగా నన్ను వేధిస్తున్న ప్రశ్న అడిగాను. ఆవిడ మొహం వెల వెలా పోయింది. నేనడిగిన దాన్లో తప్పేమిటో నాకర్ధం కాలేదు.

"మా అమ్మాయే! మేఘన "

"ఇప్పుడెక్కడున్నారు? పెళ్ళై పోయిందా?"

"పెళ్ళా? అయింది! బ్రతికుంటే ఈ మెల్బోర్న్ లోనే వుండేది. నీ వయసే వుండి వుండేదేమో కూడా!"  చల్లటి నీళ్ళల్లో ముణిగినట్టు ఉక్కిరి బిక్కిరయ్యింది నాకు!.


ఏమంటాను! దీని గురించి అడగాలా, వొద్దా? వాళ్ళమ్మాయి మరణానికీ, వాళ్ళ విడాకులకీ ఏదైనా సంబంధముందా? నేను ఆవిడ వంక చూడటానికి భయమేసి గూట్లో వున్న పుస్తకాల వైపు దీక్షగా చూడసాగాను. ఆవిడ గొంతు సవరించుకున్నారు.


"నేను వేరే వచ్చెయ్యటానికి కారణం నేనెవ్వరికీ చెప్పలేదు! అందరు స్నేహితులూ చెవులు కొరుక్కున్నారు. ఒక్కళ్ళైనా నన్ను అసలేమైందని నన్నడగలేదు. రాజ గోపాల్ చంపేసారు, నా బిడ్డని చంపేసారు. యాక్సిడెంట్ లో పోయింది మేఘన, ఇదే అందరూ అనుకునే మాట. దాన్ని కన్న తండ్రే చంపేసాడు. ఇది నేననే మాట. అందుకే అతన్ని వదిలేసి ఒంటరిగా వుంటున్నాను."


"ముప్పై యేళ్ళ కింద రాజ గోపాల్ ని పెళ్ళాడి ఈ ఊరొచ్చాను. పాతికేళ్ళ కింద మేఘన పుట్టింది. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాం, అందరు అమ్మా-నాన్నల్లాగే! చురుగ్గా వుంటూ, బాగా చదువుకుంది. ఇరవై రెండేళ్ళకి మంచి ఉద్యోగం సంపాదించుకుంది. మూడేళ్ళ కింద తనతో పని చేసే బ్రెండన్ ని పెళ్ళాడతానంది. నేను అర్ధం చేసుకున్నాను కానీ రాజ గోపాల్ తట్టుకోలేక పోయారు. నీతీ జాతీ లేని తెల్ల వాళ్ళ పిల్లాడిని చేసుకుంటావా అని నానా మాటలూ అన్నాడు. చచ్చినా ఈ పెళ్ళి జరగటానికి వీల్లేదన్నాడు. తండ్రిని కాదని వెళ్ళిపోలేకా, ప్రేమించిన అబ్బాయిని మరిచిపోలేకా,ఎంత క్షోభ పడిందో! ఆఖరికి తండ్రిని కాదని పెళ్ళాడటానికే నిర్ణయించుకుంది. నాకెప్పుడూ ఆయనకి ఎదురు చెప్పే అలవాటు లేదు. అలాటి అవసరం రాలేదసలు. అలాటిది అప్పుడు బాగా దెబ్బలాడాను. ఒక్కగానొక్క కూతురు, దాన్ని అంతలా ఏడిపించి నిలబెట్టుకునే పరువు మనకక్కర్లేదన్నాను." కన్నీళ్ళు తుడుచుకోవటానికి ఆగారామె. లేచి వంటింట్లోంచి గ్లాసుతో మంచి నీళ్ళు తెచ్చాను. ఆమె పక్కనే కూర్చుని భుజం మీద చేయి వేసి తాగించాను.

"పోనీ లెండి. తరువాత మాట్లాడుకుందాం!"

"కాదు. సంవత్సరం నించీ నా మనసులోనే దాచుకున్నాను. చెప్తే నా చుట్టూ వున్న నిశ్శబ్దం పోతుందేమో!" మంచినీళ్ళు తాగారు. ఆమె దుఃఖం చూసి నాకూ గొంతు నొప్పి పుట్టి కళ్ళ నీళ్ళొస్తున్నాయి.


"నేను అంతగా ఏడ్చి మొత్తుకోని బ్రతిమిలాడితే రాజ గోపాల్ పెళ్ళికి మొక్కుబడిగా వొచ్చారు. సివిల్ మేరేజికి అతిథిలా వొచ్చారు. పెళ్ళి కూతుర్ని చేసి అచ్చటా ముచ్చటా తీర్చింది లేదు. ప్రేమగా ముద్దు పెట్టి భర్తతో పిల్లా పాపలతో వెయ్యేళ్ళు మహారాణిలా బ్రతకమని దీవించింది లేదు. అంత కఠినంగా ఎలా మారాడో! అది పాపం ఒక్కతీ టాక్సీలో వెళ్ళబోతూ, "అమ్మా! వెళ్ళొస్తా!" అంటే, దాన్ని ఆపి, "చూడూ! వద్దంటుంటే చేసుకున్నావీ పెళ్ళి. ఏ సమస్య వచ్చినా నా వాకిట్లోకి మాత్రం రాకు!" కఠినంగా చెప్పి వెళ్ళిపోయారు. దాని మొహం వెల వెలా పోయింది. "ఆయన అలానే అంటార్లేమ్మా! నువ్వు హాయిగా వుండు!" సర్ది చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర దింపాను.

ఎన్ని రోజులు అదే తలచుకుని ఏడ్చానో! రెండేళ్ళు బాగానే వున్నారు. అయినా దానితో కానీ, బ్రెండన్ తో కానీ ఒక్క మాటా మాట్లాడలేదీయన. రెండేళ్ళ తరువాత ఒకరోజు ఫోన్ చేసింది, "అమ్మా! సాయంత్రం ఇంట్లో వుంటావా?" అని. రమ్మన్నాను. మొహం కళ తప్పి వుంది. "అమ్మా! బ్రెండన్ విడాకులిస్తానంటున్నాడు. ఇంకెవరినో ప్రేమిస్తున్నానంటున్నాడు." ఆ క్షణమే వొణికిపోయాను. దాని సమస్య వల్ల భయంతో కాదు. రాజ గోపాల్ ఏమంటారో నని. అనుకున్నంతా అయింది! ఐనా అది తండ్రి మీద నమ్మకం చావక ఆ రాత్రి ఆయనతో చెప్పుకోవాలని ప్రయత్నించింది. కన్నతండ్రి, దెబ్బతిన్న బిడ్డని అక్కున చేర్చుకోకపోగా, "ఇందుకే నేనొద్దన్నాను! ఇప్పుడర్థమైందా? చేసుకున్నావుగా? అనుభవించు! యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్," అన్నాడు. అదేమీ మా సహాయం కోసం రాలేదు. కొంచెం ఓదార్పు, కొంచెం బలం! అది కూడా ఆ పిల్లకి పుట్టింట్లో కరువైపోయాయి. "సరే అయితే! ఐ విల్ లుక్ ఆఫ్టర్ మైసెల్ఫ్," అంటూ రాత్రి పదకొండింటికి కార్లో బయల్దేరింది. "వొద్దమ్మా! నాన్న అలాగే అంటారు. పొద్దుటికంతా మామూలుగా అవుతారు," అని ఎంత చెప్పినా వినకుండా! దార్లోనే యాక్సిడెంటులో….." ఆవిడ మోకాళ్ళ మీద మొహం పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. నాకు మనసంతా కెలికినట్టయింది.


“మొదటి సారి నేను జీవితంలో రాజ గోపాల్ మీద చేయి చేసుకున్నాను! మీద పడి కొట్టాను. నా బిడ్డని చంపింది నువ్వేనని ఏడ్చాను. ఆ రాత్రి తండ్రి ఆదరిస్తే, అది మా దగ్గరే వుండేది. ఒంటరిగా రోడ్డు మీద చచ్చిపోయి ఉండేది కాదు. అంత తప్పు అదేం చేసిందని దానికంత శిక్ష? ఇండియాకి మా తమ్ముడి దగ్గరికెళ్ళి పోయాను. కానీ ఎక్కడా వుండలేక పోయాను. మళ్ళీ మెల్బోర్న్ వొచ్చాను. ఎంత ప్రయత్నించినా రాజగోపాల్ ని క్షమించలేక పోతున్నాను. అందుకే వేరే వెళ్ళిపోతానని చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో, ఏమీ అనలేదు. నేనే ఈ ఫ్లాటు  వెతుక్కుని, ఇక్కడ వుంటున్నాను ఒంటరిగా! రాజ గోపాల్ మా ఇంట్లో ఒంటరిగా వుంటారు. ఈ దుఃఖం అసలు ఎప్పుడైనా పోతుందో లేక చివరి వరకూ ఇలాగే వుంటానో, తెలియదు. ఒంటరిగా వుంటున్నానని రాజ గోపాల్ అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్తుంటారు. అయినా నేనతనితో మాట్లాడను. అతనితో మాట్లాడితే నాకు మేఘన ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది."


ఇంకేమీ మాట్లాడలేదు నేను. ఆమె దుఃఖాన్ని పంచుకోవటానికి వీలు కాదేమో! ఆమె కడుపున పుట్టిన బిడ్డలా అది మొత్తం ఆమెకే సొంతం. ఆ రాత్రంతా ఏడుస్తూ వున్నారామె. పక్కన మౌనంగా నేను, క్షమించటం అంటే ఏమిటి అని ఆలోచిస్తూ. తెల్లవారు జామున అలాగే సోఫాలో నిద్రలో కొరిగారు. ఆమెకి చిన్న బ్లాంకెట్ కప్పి నేను లేచి నా ఫ్లాటు లోకెళ్ళాను.


పూడ్చుకోలేని నష్టం కలిగించిన వాళ్ళని క్షమించటం ఎంత కష్టమో నాకూ అనుభవమే! నేను అమ్మని క్షమించగలుగుతున్నానా? ఆవిడలాగే ఎవరికీ చెప్పకుండా నేను దాచుకున్న గతం నా మనసులో మెదలింది.

…..  ……….. …..

ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ప్రేమించాను, కాలనీలోని రమ్యని. బీయెస్సీ చదువుతూ సామాన్య కుటుంబంలో పుట్టి సౌమ్యంగా వుండేది. అదొకలాటి హాయి తనని తలచుకుంటే. తనని నేను చాలా ఇష్టపడుతున్నట్టు నేను తనకి కూడా చెప్పలేదు. ఇంజినీరింగ్ ముగిసి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చి బెంగుళూరు వెళ్ళబోయే ముందు మాత్రం చెప్పాను. సిగ్గూ, సంతోషమూ ముంచుకొచ్చేసరికి, ఏమీ మాట్లాడలేక, "మా ఇంట్లో అడగండి," అని మాత్రం అంది. అప్పటికే తను బీయెస్సీ ముగించి బేంకు ఉద్యోగం సంపాదించుకుంది కూడా!


ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకి అమ్మతో చెప్పాను రమ్య గురించి. ఏమనుకుందో కానీ, అమ్మ ఏమీ మాట్లాడలేదు."అయ్యో! శేఖరం మావయ్య కూతురు ప్రీతిని చేసుకుంటావని అంతా ఆశ పెట్టుకున్నారురా. బోల్డు కట్నం కూడా ఇస్తానన్నాడు మావయ్య!" అన్నదొక్కసారి. "సరేలే చూద్దాం," అంది ఆఖరికి. దాంతో అమ్మ అంగీకరించినట్టే అనుకుని ఎగిరి గంతేసాను. అమ్మ ఒప్పుకుంటే నాన్న ఒప్పుకున్నట్టే! రమ్యతో కూడా చెప్పాను అమ్మ ఒప్పుకుందని. మంచి రోజు చూసి వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా ఇంటికి వెళ్ళమని చెప్పాలని అనుకున్నాను. అమ్మకి ఇలాటి వాటిల్లో పట్టింపులు ఎక్కువ.


ఉన్నట్టుండి మా ఆఫీసులో ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్ళాలన్నారు. ఆరు నెలలు! ఎంత, క్షణంలో తిరిగిపోతాయి, అని రమ్యకి ఉత్తరం రాసి చెప్పి బయల్దేరాను. వాళ్ళ వాళ్ళని మా ఇంటికెళ్ళమని కూడా అన్నాను.

అమెరికా వెళ్ళిన రెండో నెలలో ఫోను, "రమ్య పెళ్ళి అయిపోయింది," అంటూ. ఆకాశం విరిగి నెత్తిన పడ్డట్టనిపించింది నాకు. రమ్యకి పెళ్ళవటం ఏమిటి?

"ఏమోరా! వాళ్ళు నెల కింద మన ఇంటికొచ్చారు. కట్న కానుకలు కూడా మాట్లాడుకున్నాం. నేనేమీ అడగలేదు కూడా. నాన్న కూడా అక్కడే వున్నారు. మళ్ళీ కలుస్తామంటూ సంతోషంగానే వెళ్ళారు. రెండు వారాల కింద వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరిందనీ, పది రోజుల్లో పెళ్ళనీ, నువ్వా అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా వుంటే సంతోషిస్తామనీ అన్నారు. అమెరికా సంబంధమట. అందుకే ఆశ పడ్డారెమో!నాకైతే తల కొట్టేసినట్టయిందనుకో! అక్కడికీ అన్నాను, మా వాడు మీ అమ్మాయినెందుకు డిస్టర్బ్ చేస్తాడండీ,అని"

అమ్మ ఇంకా ఏదో చెప్తూనే వుంది. నాకేమీ వినిపించలేదు. ఫోన్ పెట్టేసాను. భరించలేనంత నొప్పీ, బాధా, మనసులో! మిగతా నాలుగు నెలలూ అక్కడ వుండలేకా, ఇంటికి రాలేకా చిత్రవధ అనుభవించాను. రమ్యకి ఉత్తరం రాయాలనీ, ఫోన్ చేయాలనీ ఎన్నో సార్లు అనుకున్నాను, కానీ నిజంగానే తన కాపురంలో సమస్యలొస్తాయేమోనని భయపడ్డాను.


ఇండియా వెళ్ళగానే రమ్య వాళ్ళింటికెళ్ళాను. నిజమే, తన పెళ్ళయి అమెరికా వెళ్ళిపోయింది. ఎంత అడిగినా వాళ్ళింకేమీ చెప్పలేదు.  తరువాత రమ్యా వాళ్ళ తమ్ముణ్ణడిగితే మెల్లిగా సంగతంతా చెప్పాడు. అమ్మ చెప్పింది సగమే నిజం.

రమ్యా వాళ్ళింటికి మళ్ళీ వెళ్ళిందమ్మ! తనకొక అన్నగారున్నారనీ, గుండె జబ్బుతో నేడో రేపో అనేటట్టున్నాడనీ, నేను రమ్యని పెళ్ళాడితే మరుక్షణంలో ఆ కుటుంబం దిక్కులేని కుటుంబం అవుతుందనీ, రమ్యతో చెప్పి కన్నీళ్ళు పెట్టుకుందమ్మ. ఏమనుకుందో ఏమో, రమ్య మారు మాట్లాడకుండ తండ్రి తెచ్చిన సంబంధానికొప్పుకుంది. విషయం తెలిసి నేను నెల రోజుల కంటే ఎక్కువ ఇంట్లో వుండలేకపోయాను. ఆస్ట్రేలియా నించి అంతకు ముందే వచ్చిన ఉద్యోగం ఆఫరు ఒప్పుకుని వచ్చేసాను. ఆ తరువాత అమ్మతో ఎప్పట్లా మాట్లాడలేకపోయాను. నా చుట్టూ వున్న మౌనపు గోడకి అవతలే ఆమెని నిలబెట్టాను.


నన్నూ, నా మనసులో ప్రేమనీ అంత తేలిగ్గా ఎలా తీసుకుంది అమ్మ! చిన్నప్పణ్ణించీ ఏదడిగినా కాదనని అమ్మ, ఇంత పెద్ద విషయంలో నా అభిప్రాయానికీ, ఇష్టానికీ, నా మనసుకీ ఏ మాత్రం విలువ ఇవ్వకపోవటం నాకు మింగుడు పడటంలేదు. ఇక ఎవరినీ పెళ్ళాడాలని కానీ, ప్రేమగా, సంతోషంగా ఇంకొకరి వైపు చూడగలనని కానీ, నాకనిపించటంలేదు. ఆ నొప్పీ మానటంలేదు! ఎప్పటికైనా అమ్మని క్షమించి మామూలుగా అవుతానా? బహుశా నేనింత కఠినంగా తనని శిక్షిస్తానని అనుకుని వుండదమ్మ! ఎప్పుడైనా ఒక్కసారైనా మామూలుగా కాకపోతుందా అని ఆశతో వారం వారం వచ్చే రాజ గోపాల్ గారు గుర్తొచ్చారు. మనం చేసే పనుల పర్యవసానం ముందుగానే ఊహించటం మనవల్ల అయ్యే పనేనా? అంతెందుకు, నేనిలా మాట్లాడకుండా దూరంగా వున్నప్పుడు అమ్మకేమైనా ఐతే నన్ను నేను క్షమించుకోగలనా?

—————xooooox———

ఆ తరువాత వారం రాజ గోపాల్ తిరిగొచ్చారు. ఆఫీసునుండి వస్తూ వుంటే వాళ్ళ ఫ్లాటు ముందర పూల కుండీలేవో శుభ్రం చేస్తున్నారు.

"హాలో! చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. రండి కాఫీ తాగి వెళ్దురుగాని." లోపలికెళ్ళాను. ఇల్లంతా కొత్తగా వుంది. గూట్లో మేఘన ఫోటోకి పూల దండ వేసి వుంది. ఆమె ముందర చిన్న దీపం కూడా వెలిగించి వుంది.

"మీరు లేనప్పుడు సత్య గారికి బాగా జ్వరం వచ్చిందండీ!" చెప్పాను.

"అవును చెప్పింది! " కాఫీ తయారు చేస్తూ అన్నారాయన.

తలుపు దగ్గర అలికిడైంది. సత్య గారు అప్పుడే లోపలికొస్తున్నారు.

"హలో పవన్! బాగున్నావా?"

"బాగున్నానండీ!" లోపలికెళ్ళారు సామాన్లు సర్దటానికి.

బయటికొచ్చికాఫీ కప్పు చేతికిస్తూ,

"రాత్రికి ఇక్కడే భోజనం చేద్దువు గానిలే! రాజ గోపాల్ వంట చేస్తున్నారు!"

"అయితే తప్పకుండా తింటానండీ!"

"నీ వంటంత బాగుండదేమోనయ్యా పవనూ!" ఆయనా వచ్చి కూర్చున్నారు. ఇద్దరూ పక్క పక్కనే, ప్రశాంతంగా అనిపించింది.

"అన్నట్టు నాకు పెళ్ళి కుదిరిందండీ! మా బంధువులమ్మాయే! పై నెలలో ఇండియా వెళ్తున్నాను."

"ఫెంటాస్టిక్! ఇంతకీ తనకి వంటొచ్చా?"

"అబ్బే రాదండీ! మనమే నేర్పాలి," రాజ గోపాల్ గారితో వంటింట్లోకి నడుస్తూ అన్నాను. వెనక్కి తిరిగి హాల్లో మేఘన ఫోటో వైపు చూసాను. నవ్వుతుంది, అందంగా, సంతోషంగా!

About శారద

నివాసం : అడిలైడ్, ఆస్ట్రేలియా
వృత్తి : ఆస్ట్రేలియా లో సైంటిస్టు
కథలు: దాదాపు ముప్పై కి పైగా, తెలుగు పత్రికల్లో, ఇంగ్లీషు వెబ్ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

7 Responses to నిశ్శబ్దపు హోరు

  1. subhadra says:

    Nice narration.. చాలా బాగా రాసారు.

  2. madhuri says:

    Sharadakka kadha chaala bagundhi.
    manava sambadhalu chala complex and sensitive.okkasari oka chinna pora vasthe,adhi chaala badane migulusthundhi.

Comments are closed.