చైత్రము కవితాంజలి -4

నేనూ – కవిత్వం


కవిత్వాన్ని చదవడం, రాయడం, ఆస్వాదించడం అనుభవమున్న ప్రతివారికి దానితో ఏదో ఒక రకమైన అనుబంధమో, అభిప్రాయమో ఉండి తీరుతుంది. కొందరికి కేవలం అలవాటైతే మరికొందరికి పనిపాట్లని మరిపిపింపజేసే మాయ.

ఒకరికి వ్యాపకమైతే మరొకరికి వ్యసనం. “కవిత్వం – నా జీవన తత్వం- గడుస్తున్న ప్రతిరోజూ నేను జీవించే విధానం”
అన్నారొకరు


“జీవితం వేసవై విసిగించినప్పుడు ఊహల పావురాలను తలదాచుకోనిచ్చే చల్లని చెట్టు కవిత్వం. మనదైన ఒక స్వాప్నిక జగత్తు మనకోసం ఎప్పుడూ ఎదురు చూస్తుందనే ధీమాతో ఈ వాస్తవ జీవితం తాలూకూ కరకుదనాన్ని, నిర్లిప్తతని ధిక్కరించగలిగే ధైర్యాన్నిస్తుంది కవిత్వం. కవిత్వమంటే అనుభూతుల పెదవులపై నర్మగర్భం గా వెలిసే ఒక చిలిపి నవ్వు, నవ్వులనదులన్నీ ఆవిరైపోయాక చివరికి మిగిలే ఓ కన్నీటి బొట్టు. అన్నీ ఆశలూ అడుగంటాక కూడా బ్రతకడంలో కనిపించే చివరి అర్ధం”  – అనిపిస్తుంది నాకు.


మరి మీ జీవితంలో కవిత్వం ఏమిటి?

కవిత్వానికి మీరిచ్చే స్థానం, నిర్వచనం ఎలాంటివి?


– స్వాతికుమారి


————————


స్వాతికుమారి గారు, మీకు ఏమనిపిస్తుందో రాసింది చదివాక, ఇంత కంటె ఏం చెప్పగలను అనిపించింది నాకు. ఎందువల్లనో గాని, “నవ్వులనదులన్నీ ఆవిరైపోయాక చివరికి మిగిలే ఓ కన్నీటి బొట్టు.” అనే మాటలు ఉండాల్సింది కాదని అనిపించింది. నవ్వుల నదులు ఆరిపోక ముందు, కెరటం మీద కెరటమై పొరలు తున్నప్పుడు కూడా కవిత్వం ఉంటుంది గనుకనేమో. మొత్తం మీద చాల బాగా చెప్పారు. అభినందనలు. మీ ‘నిర్వచనం’ కింద నేనూ మరొక సంతకం పెడితే సరిపోతుందని అనిపించడం వల్ల నేనుగా ఏమీ రాయడం లేదు.


-హెచ్చార్కే

———————–

మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా..

కవిత్వం నాకు జీవన వాహిక. నిరంతరం నన్ను నేను పరీక్షించుకునే ఓ పరీక్షనాళిక..
నా భావోద్వేగాలను ఆవిష్కరించి నన్ను నేను నిలదొక్కుకునేట్లు చేసె నిరంతర శ్రమ..

అది కవిత్వమా కాదా అన్నదాంతో నాకు పనిలేదు..
ఏదో ఒక చట్రంలో ఇరికించి మెప్పించి రాయడానికి ఎన్నడూ ప్రయత్నించలేను..
గర్భంలో వున్నది హంతకుడో ప్రేమికుడో తెలియకుండానే కనే తల్లిలా
నాలో పెల్లుబికిన అక్షరాల మాలను అలా గుదిగుచ్చి కాయితంపై ఒలికిపోవడమే..

మన్నించండి..


– కెక్యూబ్ వర్మ..


—————————–


స్వాతికుమారి గారు,
చాలా బాగా చెప్పారు.

నా మటుకు నాకు ఇలా అనిపిస్తుంది:
ఆలోచనలను పెళ్లగించుకుని మదిలో తలెత్తిన మొక్కలు, గుత్తులు గుత్తులుగా
అక్షరాల పువ్వులు పూస్తే,
పువ్వులను నిర్దాక్షిణ్యంగా త్రుంచి తెల్లని హృదయంపై అమరుస్తూ.. అమరిక
అందంగా ఉందంటూ పొందిన అనుభూతిని/ఆనందాన్ని తిరిగి ఆ మొక్కలకే ఎరువుగా
వేస్తూ…
కవిత్వమే జీవితమై.. కవిత్వం అనే వ్యసనంలో పడి ఇలా తనను తానూ చంపుకుంటూ…
కవి, కవిత్వానికి ప్రాణం పోస్తే…   ప్రాణం పోసిన కవికి తిరిగి
జీవంపోసేదే కవిత్వం.
కవిత్వం కవిలో పెరుగుతున్న ఓ గంజాయి మొక్కలాంటిదేమో? :-) :-)

—————


       ప్రాణస్థానం లోతుల్నుంచి
       పదాలు తోడి
       మనోఫలకంపై  చిలకరిస్తూ
       నీకు నువ్వు మేలుకొల్పు పాడుకో.

       బాధల్ని భావనల్ని నాతో పంచుతూ
       గుండె పగిలేలా ఏడుస్తూ
       అతికించే అక్షరాలకోసం అలమటించు.

       మోయలేని పదసమూహాల
       మంచు మూటలెత్తుకొని
       రాని సూర్యోదయం కోసం నిరీక్షించే
       గడ్డిపరకా అవ్వూ.

       నన్ను లేపనంగా పూసుకో-
       దానికి ముందు
       నిన్ను నువ్వు ముక్కలుగా చీల్చుకో.

       నన్ను బతికించడం కోసం
       నిన్ను నువ్వు
       మళ్ళీ మళ్ళీ చంపుకో.
       అప్పుడు పుడతాను-
       నా కాళ్ళకింద సంతకమైన నిన్ను
       కవిగా బ్రతికించడానికి.


-రవి వీరెల్లి

————————–

కవిమిత్రులకి అభివందనం.

“కవిత్వమొక తీరని దాహం” – కవిత్వానికి నాకింతకన్నా మంచి నిర్వచనం
తెలీదు.


కవిత్వాన్ని గురించి, కవితా సృష్టిని గురించి నేను చాలాసార్లు ఆలోచించాను, నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాను. ఆలోచించే కొద్దీ
అబ్బురపరుస్తూనే ఉంటుంది. మొదట సృష్టి, ఆ తర్వాత జీవసృష్టి, ఈ రెండూ మనకి తెలిసిన అద్భుతాలలోకేల్లా అద్భుతాలు. ఆ కోవకే చెందిన మూడో అద్భుతం కవిత్వసృష్టి అని నేననుకుంటాను. ఏమీ లేనితనంలోంచి ఈ సృష్టి, నిర్జీవ పదార్థాలనుండి జీవం, వట్టి అక్షరాల కలయికలోంచి కవిత్వం – ఎలా పుట్టాయి?
సృష్టికి పూర్వమున్న ఒక మహాచైతన్యమేదో భౌతిక జగత్తుగా రూపొంది ఉండాలి. అప్పటికే ఉన్న జీవ చైతన్యం నిర్జీవ పదార్థాలలో ప్రవేశించి జీవి ఆవిర్భవించి ఉండాలి. అలాగే, ఈ జగత్తంతా నిండి ఉన్న కవితాచైతన్యమే అక్షరాలలో ఒదిగి కవిత్వంగా వెలుగుతుందని నా నమ్మకం. అనంతమైన ఆ చైతన్యాన్ని ఎంతని అనుభవించగలం. ఎంత అనుభవించినా అదింకా మిగిలే ఉంటుంది. అందుకే, కవిత్వమొక తీరని దాహం!


– కామేశ్వర రావు


——————-


కవిత్వం చెస్ట్ పై స్టీము ఒదిలించుకునే ఒక సాధనం.

-కత్తి మహష్


———————


పుట్టుక మీదా ,చావు మీదా ,వున్న నమ్మకమే కవిత్వం..ఎప్పటికప్పుడు ఆగిపోనీకుండా
రాయిస్తున్నది బహుశా ఈ రహస్య ప్రక్రియే..(ముకుంద రామా రావు)


-పెరుగు రామకృష్ణ


—————-


       ఆ పాప ఎన్ని నవ్వుల్ని పూసిందో!?
       ఆ మొక్క ఎన్ని పువ్వులతో నవ్విందో!?


ఇలా పట్టుకుంటూ, పట్టించుకుంటూ, పంచుకోకుండా ఉండలేని తనమే కవిత్వం.


-నారాయణ గరిమెళ్ళ.

————————-


నా కవిత్వం..!

       గుడ్డు లోంచి
       పిల్ల పిగిలేప్పుడు
       సజీవ సహజత్వాన్ని చూసి
       సంబర పడే తల్లి పిట్ట కళ్ళలోని ఆనందం…

       పంట నూర్పిడి చేసి
       కళ్లంలో ధాన్యం,తాలూ వేరు చేసి
       రాసి పోసిన తిండిగింజలు చూసి
       రైతు కళ్ళలో పొంగే విజయం…

       లక్ష్యం కాక
       గమ్యం ఎంచుకొని
       రహదారిని ఏర్పరచుకుంటూ
       చేసే బాట సారి ప్రయాణం…

      కవి నడచి వెళ్ళిన చోట
      కవిత్వం గుబాళించడం
      రేపటి తరానికి సైతం
      ఆ పరిమళం విస్తరించడం…!


– పెరుగు.రామకృష్ణ

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.