చైత్రము కవితాంజలి – 2

స్నేహ వాసంతిక

-భైరవభట్ల కామేశ్వర్రావు

కాసేపు,
మాటల నట్టేపెట్టి
మౌనపుటత్తరు సీసా మూత విప్పుదాం


ఆ పరిమళం
ఇద్దరి ముకుపుటాలనీ
ఒకేసారి తాకుతుంది


ఎన్నో ఏళ్ళుగా కట్టుకున్న
అడ్డుగోడలకి
ఎన్నెన్ని కన్నాలో!
అప్పుడర్థమవుతుంది


గుండెల్లో విషవాయువు
మెల్లగా కరిగిపోతుంది


గాల్లో తేలుతూ వచ్చి
మధుమాసం
మనలని చుట్టేసినట్టవుతుంది


నిజం! నన్ను నమ్ము


ఇద్దరి పెదాలపైనా
మల్లె విచ్చుకుంటుంది

———————————–

వస్తావా నేస్తం

-కెక్యూబ్ వర్మ


ఎప్పుడూ వసంతం కోసం
ఎదురు చూపేనా?


ఎండమావిలో
చేద వేసి తోడే
ప్రయత్నం ఎన్నేళ్ళు??


కలల సాగరంలో
ఈదులాడి
ఉప్పగా మిగిలిన
తడి!


మోడు వారిన ప్రతిసారీ
చిగురించగలిగే కొమ్మలా
దీవించే వారెవరు?


ఎవరికి వారు
వెతుకులాటలో
అనామకులౌతున్నారు!


నిలువెల్లా గాయమైనా
ప్రణవ నాదం పలికే
వెదురు ముక్కను
చూస్తే ముక్కలైన
గుండె అతుక్కుంటుంది!


వస్తావా నేస్తం
తడిగా ఒక్కసారి
నా నుదుటిపై
చేయివేయగలవా?

—————————————

ఉగాది వచ్చేస్తోంది

-స్వాతీ శ్రీపాద


ఉగాది వచ్చేస్తోంది
ఎప్పట్లాగే ఉగాది సందడీ
ఉరుకుల పరుగులతో
ఏడాది ఎదురుచూపులను
మోసుకు వస్తూ ఉగాది వచ్చేస్తోంది


ప్లాస్టిక్ సంస్కృతిని మేసి
సిమెంట్ భవనాల జైళ్లలో బందీలైపోయాక
ప్రకృతి వికృతై ఒళ్ళువిరుచుకుని
ఆధునికతకు దాసోహమన్నాక
బోన్సాయి మొక్కలుగా జీవితాలు
నాలుగ్గోడలకు పరిమితమయ్యాక
ఏసీ రూములు అనుమతించవు
కోయిల కుహూరవాలు వినిపించేందుకు

మామిడి చిగుళ్ళ పరిరక్షణకు చల్లిన
పురుగులమందు ఘాటుకు
జాతి అంతరించిపోయింది
సమయం అనుమతించదు
గతం స్వర రాగాలను రికార్డ్ చేసుకున్న
ఆధునిక పరికరాలే గతి

వసంతం ఏమూలో తలదాచుకున్న ఈ క్షణాన
కాగితం పువ్వులదే రాజ్యమయ్యింది.
కాలగమనాల గతులు తప్పి
రెండు రోజుల మధ్య సంధి కాలంలో
సంకట దశలో ఉగాది
నేడా రేపా అనేది ప్రభుత్వానికే తెలియాలి

ఉగాది వచ్చేస్తోంది.

———————–

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.