ఒక ‘అన్ రెడ్’ స్టోరి

కలలో కూడా ఊహించి వుండను. నేనిలాంటి దుస్థితిలో చిక్కుకుంటానని.

విధి ఎంత బలీయమైనదో..నాకిప్పుడు అర్థమవుతోంది. లేకపోతే, నేనేమిటి.. ఇలా హంతకురాలిలా బోనులో నిలబడటమేమిటీ!!
నిన్న రాత్రి జరిగిన ఒక భయానక దృ శ్యం నా కళ్ళ ముందు కదిలింది. అంతే. మళ్ళీ నిలువునా వొణికిపోయాను. అప్పటి దాకా బలహీనంగా కొట్టుకుంటున్న గుండె ఇక ఆగిపోతానంటోంది…కళ్ళు తిరిగి స్పృహ తప్పేలా వున్నా..తూలి పడిపోకుండా వుండటం కోసం…బోను చువ్వల్ని ఆధారంగా చేసుకుని నిలబడాలని విఫల ప్రయత్నం చేస్తున్నా..

కోర్ట్ హాలంతా నిశ్శబ్దమై పోయింది. జడ్జ్ తో సహా అందరూ నా వైపే చూస్తున్న సంగతి – నే కళ్ళు తెరిచి చూడకపోయినా, నాకు స్పష్టంగా తెలుస్తూనే వుంది,
ఆ గుండెలదిరే నిశ్శబ్దంలో – పాడై పోయిన సీలింగ్ ఫాన్ మోత చెప్పలేనంత భయాని రేకెత్తిస్తోంది.
ఇంతలో-

నాకు క్రమేపీ దగ్గరవుతూ అతి సమీపంగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది. అవి ఎవరివో గ్రహించగలను. నల్ల కోటేసుకున్న మనిషివి. మరుక్షణంలో నే వినబోయే ప్రశ్న ఏమిటో కూడా నాకు బాగా తెలుసు.
‘మీరీ హత్య ఎందుకు చేసారు?’ అని..
తనేమని జవాబిస్తుంది?

నిజానికి తను దోషి కాదు. కనీసం ఒక పూట క్రితం దాకా కూడా..
తను హత్య చేయగలదని కానీ, తనో హంతకు రాలు అవుతుందన్న సంగతి తనకే తెలీదు.
అంతెందుకు, హత్య చేసాక కూడా..తనకు చంపడం వచ్చన్న నిజాన్ని తట్టుకోలేక బ్రతికి చచ్చిపోయినదైంది.. ఆ క్షణంలో చలనం లేని రాయి అయిపోయింది.
నిలువునా బిగుసుకు పోయి, నోటంట మాట రాక, వెక్కెక్కి ఏడ్చింది…మెదడు మీద పెద్ద మంచు ముద్ద పెట్టినట్టు.. పనిచేయడం ఎప్పుడోనే మానేసింది. తన ప్రమేయం లేకుండా..శరీరం మాత్రం పరుగులు పెట్టింది. తన అడుగులు ఎంత వేగంగా పడుతున్నా యంటే…పాదాలు భూమికి సరిగ్గా ఒక అంగుళం ఎత్తు లో ఎగురుతూ…చేతులు గాల్లో తేలుతూ..ఎలా ఇక్కడకొచ్చి పడిందో!

భగవాన్..ఏ స్త్రీకి ఇలాం టి దుస్ఠితి కలగ కూడదు. కాని, తనకు కలిగింది. కేవలం తనో స్త్రీ అయినందుకు మాత్రమే అలాంటి దారుణ మైన పరిస్థితి ఎదుర్కోవాల్సొచ్చింది.

“చెప్పండి. ఎందుకు చేసారు?” ఈసారి కొంచెం కఠినంగా అడుగుతోంది ఆ గొంతు.
ఎక్కణ్ణుంచి ప్రారంభించ మంటారు నా కథని!
నేను చెప్పడం అంటూ జరిగితే –
ఎన్ని తుఫాన్లు తిన్న సముద్రం సైతం, గుండె చీల్చుకుంటుంది.
వొరగడం రాని కొండ సైతం కుంగి, కరుగుతుంది..
కదలడం మాత్రమే తెల్సిన కాలం కూడా ఆగి, కరిగి కన్నీరవుతుంది.
అసలేం జరిగిందంటే..

ఆ రాత్రి ఎప్పట్లానే నైట్ షిఫ్ట్ చేసి, బయటకొస్తూ.. టైం ఆఫీస్ లో కార్డ్ పంచ్ చేసి, ఆఫీస్ కాబ్ లో ఇంటికి బయల్దేరాను. నాతో బాటే రావల్సిన ఆ ఇద్దరు ఆడ వాళ్ళూ రాలేదు. నేనూ, మరో అతను వున్నాం. అతన్ని నేనింతకు ముందు చూసినట్టు లేను. బహుశా, కొత్త గా జాయిన్ అయినట్టున్నాడు. డ్రైవర్ పక్క సీట్లో కూర్చునున్నాడు.
వెనక సీట్లో నేనొక్కదాన్నే! సీట్ వెనక్కి వాలి, కళ్ళు మూసుకుని, రిలాక్సెడ్ గా కూర్చున్నా.
ఆరోజు ఒక కస్టమర్ తో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
అసలు మరిస్తే కదా, మళ్ళీ గుర్తొచ్చిందనడానికి.
ఆ కస్టమర్ గొంతులో వినిపించే ద్వందార్ధాలు, తికమక పెట్టే మెలిక పాముల్లాంటి ప్రశ్నలు.
తను బదులివ్వలేక మౌనమైనప్పుడు నవ్విన ఆ నవ్వు..అన్నీ తనకు గుర్తున్నాయి. బాగా గుర్తున్నాయి.
వెంటనే మేనేజర్ మాటలూ గుర్తొచ్చాయి.

”అవతల వాళ్ళు ఏం మాట్లాడినా, ఎంత నోరు జారినా, గాల్స్! మీరు మాత్రం సహనంగానే వుండాలి. ఈ వుద్యోగంలో మీకుండాల్సిన మొదటి లక్షణం ఇదే. ఈ మొదటి సూత్రం మీరెప్పుడైతే అతిక్రమిస్తారో, ఆ తర్వాత మీరెన్ని విషయాలలో నిజాయితీగా వున్నా, లాభం వుండదు. వుద్యోగం లోంచి నిర్దాక్షిణ్యంగా గెంటేయ బడతారు. అందుకే, కస్టమర్ నుంచి మాకు ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ బాధ్యతని మీరెన్నాళ్ళు బాధ్యతాయుతంగా పాటిస్తే అన్నాళ్ళు మాత్రమే మీరీ వుద్యోగాన్ని కాపాడు కుంటారు.. అర్ధమైందిగా!”

హు! అంత బాగా చెప్పాక, అర్థం కాకుండా ఎలా వుంటుంది.
ఆ తర్వాత అతనితో తను చాలా మర్యాద గా మాట్లాడి, థాంక్స్ చెబుతూ.. టెక్నీషియన్ కి కాల్ ని డైవర్ట్ చేసింది.

సహనం! కొన్ని రకాల వుద్యో గాలు చేయడానికి వుండాల్సిన మొదటి లక్షణం అదే.
ఆడవాళ్ళు – బ్రతుకు చివరి వరకూ అలవరచు కోవాల్సిన లక్షణం కూడా అదే కాబట్టి, ఈ జాబ్స్ లో ఆడవాళ్ళు చాల చక్కగా ఇమిడిపోతారు. ముఖ్యంగా ఇక్కడ ఫిమేల్ వాయిస్ కి క్రేజ్ కూడా వుండటం మా లాంటి వారి పాలిట వరమే.
అప్పుడప్పుడు శాపం కూడా..అని అప్పుడు నాకు తెలీలేదు. అది తెలీడానికి నా కప్పటి కింకా కేవలం కొన్ని నిముషాల వ్యవధి మాత్రమే వుంది.

మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి.
పగలు కుంభకర్ణినిలా నిద్ర పోయి, రాత్రిళ్ళు నిశాచరినై అర్థరాత్రి దాటే ఈ వేళప్పుడు ఇంటికి వెళ్తూ….
ఇలా ఎంత కాలమని పని చేయాలి?.. తెలీదు. కాని, తప్పదు. చేయాలి.

ఒక మంచి (?) మొగుణ్ని కొనుక్కునేంత డబ్బు కూడ బెట్టుకునే దాకా చేయాలి. అదేం మాటబ్బా? మంచి వాడైతే డబ్బుకెందుకు దొరుకుతాడు? ‘డబ్బెట్టి కొనుక్కునేది మంచి తన మెలా అవుతుంది?’
‘అవును. నిజమే. కాదు. ఇక్కడ మంచి అంటే..మంచి ఆర్ధిక పరిస్థితి గలవాడు అని అర్థం. అంతే.
అంటే..డబ్బెట్టి, డబ్బున్న వాణ్ని శాశ్వతంగా కొనుక్కోవడాన్నే పెళ్ళి అని, అతన్ని మొగుడనీ అంటారా! సుఖ జీవనానికి అంత కష్టపడే బదులు.. పోని.. నాకున్న డబ్బుతో నేనే సుఖంగా కాలం గడిపిస్తే పోలా? ఏమంటావ్?’
‘అబ్బ! నీతో వాదించలేను తల్లీ..సరే అలాగే అనుకో. నిన్ను నువ్ పోషించుకోడానికి..ఆ తర్వాత వృధ్ధకన్యాశ్రమంలోమిగిలిన జీవితం సుఖంగా గడపడానికైనా. నువ్విలా కష్టపడక తప్పదు.
“అదీ అలా చెప్పు. నేనొప్పుకుంటా..”
తనతో తను నెగ్గలేనితనానికి తనలో తనే నవ్వుకుంది.

ఆలోచనలు.. అర్థం పర్థం లేని ఆలోచనలు ఇలా అప్పుడప్పుడు ఎక్కడికో తీసుకెళ్ళి, తీసుకొస్తుంటాయి. ఆలోకనం లోంచీ..ఈ లోకంలోకొస్తూ..గట్టిగా నిట్టూర్చాను. నా నిశ్వాసం నన్నే భయ పెడుతోందంటే..ఎంత కటిక నిశ్శబ్ద వాతావరణమో అది ఊహించ వచ్చు.

కళ్ళిప్పి చూశా…
చుట్టూ చీకటి. చిమ్మ చీకటి.
కార్ స్పీడ్ గా దూసుకెళ్తోంది.
ముందు సీట్లో అతడూ లేడు ఎప్పుడు దిగి పోయాడో..తను గమనించ లేదు.

రోడ్ కనిపించడం లేదు. సిటీ పొలిమేరలు దాటి చాలా సేపే అయినట్టుంది. వెలుగుతూ వీధి లైట్లూ లేవు. కాని, కాబ్ పరిగెడుతూ వుంది. చాలా వేగంగా పరుగెడ్తోంది. నేను పని చేసే ఎలెక్ట్రానిక్ సిటీ -నగర శివార్లలో చిట్టచివర వుంటుంది. నిజమే కాని, ఇదేమిటీ..ఈ ప్రదేశం తనకెప్పుడు తగల్లేదే!?.. విండో అద్దాలు దించి చూసా. కారు చిట్టడవిలోంచి వెళ్తున్నట్టు గ్రహించా. నల్లటి ఆకాశాన్ని కప్పేస్తూ కొమ్మలు చాచుకున్న ఎత్తైన వరస వృక్షాలు.. గాలికి జుట్టు విరబోసుకుని, నన్ను చూసి వికృతంగా నవ్వుతున్నాయి. నా మనసు కీడు శంకించింది. ఆ మరుక్షణం లోనే అంతా అర్థమై పోయింది. నేనొక పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నానని.
వెంఠనే..అరిచా..
“డ్రైవర్? ఏమిటిది..ఎక్క్..ఎక్కడికి తీసుకెళ్తున్నావ్..!” మాటలు తడబడ్డాయి..
“హ్హా..హ్హ్హా..”
“ఆపు..కారాపు..ఆపుతావా, అరవనా..”
“అరు..బాగా..అరు. ఎవ్వరూ రారు”
“హెల్ప్..హెల్ప్..”

“ఆ..ఆ! నువ్వంత తొందర పడితే ఆపకుండా ఎలా వుంటా? అరవకు..” అంటూ.. సర్రున కారాపాడు. . అది ఎక్కడాగిందంటే… ఆ అడవిలో ప్రవహిస్తున్న ఓ నిండు కాలవ పక్కన.

“ఇదే..మిటి..ఇక్క..డాపావ్?” మాట పెగలడం లేదు భయంతో.
“ఆపమన్నావుగా. ఆపా. దిగు. దిగవే..” అంటూనే వాడు తన సీట్ డోర్ తెరుచుకుని దిగాడు. బలంగా తలుపు మూసి, నా వైపు కొస్తున్నాడు.

ఐపోయింది. తన జీవితం మరి కొన్ని క్షణాలలో అధోగతి కాబోతోంది. వాడు తాగి వున్నాడు. తూల్తున్నాడు. వాడిప్పుడెంత కైపులో వున్నాడో వాడి మాటలే చెబుతున్నాయి. ఈ నిర్జనమైన ప్రదేశానికి తీసుకొచ్చి అతనేం చేయబోతున్నాడో ఒక్క క్షణంలో అర్థమై పోయింది. ముందు అత్యాచారం.. ఆ తర్వాత హత్యాచారం చేసి అదిగో ఆ కాలవలో విసిరేసి పోతాడు. తనిప్పుడెంత అరిచినా ఎవ్వరూ రారు. తను ఎంత దారుణంగా చచ్చిందీ.. ఎవరికీ తెలీదు. ఐపోయింది. తన జీవితం సర్వనాశనం కాబోతోంది.

వొళ్లంతా చల్లబడి పోయింది. గుండె ఐసు ముక్కలా వుంది.
ఇంతలో చావు ధైర్యం ముంచుకొచ్చింది. అర సెకనులో మెరుపులా తట్టింది. అప్పటికే వాడి చేయి డోర్ మీద పడ బోతోంది.
ఇక క్షణంలో వెయ్యిన్నర వంతైనా ఆలస్యం చేయకుండా, నా హాండ్ బ్యాగ్ కోసం చూసాను. అందులో ఒక చిన్న చాకు వుంటుంది. అది పళ్ళు కోసుకునే చాకు. ప్రస్తుతానికి అదే నా ఆయుధం. బ్యాగ్ వొళ్ళో లేదు. కింద పడి పోయినట్టుంది. వొంగి, చేత్తో బ్యాగ్ ని తడుముతున్నా.. నా చేతికి మెత్తని బ్యాగ్ బదులు కసుక్కు మంటూ ఒక ఇనప వస్తువేదో తగిలింది ..అది పెద్ద చాకు..పొడుగ్గా..పదునుగా. చేతిలోకొచ్చింది.

అప్పటికే వాడు డోర్ తెరిచి, నా చేయి పట్టి బయటకు లాగడం కోసం నా మీదకు వొంగ బోతున్నాడు…..గుఫ్ మంటూ నాటు మందు కంపు కొట్టింది.
అంతే.. వెనకా ముందూ ఆలోచించలేదు. అప్పటికే చేతిలోని చాకుని గురి చూసి..కసిగా..ఒక్క పోటు పొడిచా వాడి కడుపులోకి..
నా చేతుల్లోకి అంత బలం ఎక్కణ్నుంచి వచ్చిందో ఏమో..అది సూటిగా లోతుకల్లా గుచ్చుకుంది. నాకు తెలుస్తునే వుంది. లేకపోతే వాడంత చావు కేక వేసే అవకాశం లేదు.

అంత టెన్షన్ లోనూ నే విన్న మరో సంగతి ఏమిటంటే.. వాడు ఆర్త నాదాలు చేస్తూ వెనక్కి పడ్డప్పుడు.. రాయికి తగిలిన ఆ గట్టి చాకు కొస చప్పుడు నా చెవులకు స్పష్టంగా వినిపించింది. అంటే.. ఆ చాకు.. అది వాడి పొట్ట లోంచి వెనక వీపులోకి దిగబడి పోయిందన్న మాట!
వాడు గిల గిలా కొట్టుకుంటూ.. కుడి చేయి జాపుతూ..కార్ వైపుకు జరుగుతూ వస్తున్నాడు.
కెవ్వున అరవబోయిన కేక తన గొంతులోనే ఆగి పోయింది.

కారు మరో వైపు డోర్ తెరుచుకుని పరుగు మొదలు పెట్టా. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని.. పరుగు తీస్తున్నా…
వాడి వికృతమైన కేకలకి అడవి దద్దరిల్లుతోంది..నాకైతే..గుండెలదిరిపోతున్నాయి..
పరుగు..పరుగు..పరుగు..
నే ముందుకు పరెగెత్తు తున్న కొద్దీ..వాడి అరుపులు దూర మౌతున్నాయి..క్రమంగా..క్రమ క్రమంగా.. దూర మౌతున్నాయి..

నేనింకా ముందుకి.. పరిగెడ్తూనే వున్నా..
ఆ అడవి పక్కన పల్లె అనుకుంటా..అప్పుడే మేలుకుంటోంది….తెల్లవారుఝామున లేచిన జనం వెళ్తున్నారు. వాళ్ళ చేతుల్లో లాంతర్లున్నాయి..
చలికి నిండా ముసుగులు కప్పుకుని నడుస్తున్నారు..
చీకట్లోంచి కదిలి..నేనూ ఆ వరస లోకెళ్ళి చేరా. నేను కొత్త దాన్నని వాళ్ళకి తెలికుండా వుంటం కోసం..నిండా చెంగు కప్పుకుని వారి తో కలిసి నడుస్తున్నా..

అలా నాలుగడుగులు వేసానో లేదో..
ఒకతను నన్ను గుర్తు పట్టి.’.ఎవరు?’ అని అడిగాడు.
నేనేం జవాబు చెప్ప లేదు.
“ఎవరంటే మాట్లాడవేం?” అంటూ నా ముఖం మీద టా ర్చ్ లైట్ వేసాడు.
గభాల్న చేతులు అడ్డు పెట్టుకున్నా, ఆ కాంతి కళ్ళ ల్లోకొచ్చి పడుతూ వుంటే..భరించ లేక.

అతను నన్ను చూసి అరిచాడు. “ఆ!.రక్తం!!.వొంటి నిండా రక్తం. ఇన్ స్పెక్టర్! ఈమె ఎవర్నో చంపేసింది..”
“ఆ!? ఇందాక మనం విన్న కేకలు ఈమె చంపేసిన వాడివే….పట్టుకోండి..పట్టుకోండి..”
నేను నిర్ఘాంతపోయాను. జరుగుతున్న సంఘటనలతో నాకు మతి పోతోంది..వొంటి మీద స్పృహలేని దానిలా..అసలు నేను బ్రతికున్నానా లేక ఇదంతా పీడకలా అనే.. మతి తప్పీతప్పని ఒకానొక అయోమయావస్థలో వున్నా..

వాళ్ళు నన్నుపట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు..
తర్వాతేమైందంటే…
‘ ……………………………….’

కథ రాయడంలో పడి రాత్రి గడచి పోయిందన్న సంగతే తెలీలేదు..సుమీ!

ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్‌ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్‌ తిరుగుతూనే ఉంది.

కథ పూర్తి కావాలంటే..మళ్ళీ రాత్రి కావాల్సిందే, తప్పదు!

***********

నవంబరు 2011 సమస్యకు స్పందనగా వచ్చిన కథ

About ఆర్ దమయంతి

దమయంతి గారు 25 కవితలు, 50 కథలు రాశారు. కానీ, ఎప్పటికప్పుడు రచనలకు కొత్తేనని చెప్పుకుంటారామె. చదవడం, రాయడం రెండూ ఇష్టాలే. ఐతే, ఎక్కువ ఇష్టమైనది- మొదటిది అనే దమయంతి గారికి కొన్ని పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం వుంది.
This entry was posted in కథ and tagged . Bookmark the permalink.