ధరణి రవీంద్రుల ధర్త ఎవండు / పరశక్తి పౌలోమి భర్త ఎవండు,
ఒజ్జలు వర్ణించు నుత్తము డెవడు / ముజ్జగముల నేలు మొనకాడెవండు,
ధాతల ధాతయౌ తాత యెవండు / భూతంబులకు మూల భూతమెవండు,
జీవులు జీవించు జీవమెవండు / దైవంబులర్చించు దైవమెవండు,
యుధ్ధేశుడగు నాది యోధ్ధ ఎవండు / బుధ్ధీశుడగు నాది బోధ్ద ఎవండు,
అందరి లోపల నాత్మ యెవండు / మందులు గానని మర్మమెవండు,
జాతులేకంబగు జాతి ఎవండు / అఖిలము మించిన వ్యాపకుడెవడు,
నిఖిలము మించిన నిత్యుడెవండు / ఆకాశ తనువుచే నలరారు నెవడు,
పాకారి తనువుచే పాలించునెవడు / ఆ యాది దేవుని, అభవు, ననంతు,
మాయావి నింద్రుని మదిలో దలంతు.
అని స్వకృతియైన ఇంద్ర దశకాన్ని పాడుకుంటూ, కౌండిన్య సుచంద్రుని ఇరవై మూడవ రాజ్య వర్షాన, ‘విజయ సంవత్సర జ్యేష్ట శుధ్ధ పంచమీ సోమవారం నాటిరాత్రి పూర్వయామంలో,‘సత్యప్రభ’ ‘గణపవర’ గ్రామం నుండి,‘శ్రీకాకుళ’ నగరానికి మరలి వస్తోంది! ఇప్పటికి నగరం అర క్రోసు దూరంలో ఉంది. ఆమె నడుస్తున్న స్థలం ఒక చిట్టడవి, దారి సంకుచితంగా ఉన్నా వెన్నెల్లో చక్కగా తెలుస్తూంది.
సత్యప్రభ పందొమ్మిది సంవత్సరాలు నిండిన యువతి. మహా సుందరిగా ఉన్నా, సుకుమారాంగి కాదు! వ్యాయామంఛే సంస్కారం పొంది, వజ్ర ధృడాలైన ఆమె అంగాలు వేరే శోభను పోషిస్తున్నాయి. ఆమె మంఛి బలవంతురాలే కాదు, ఆయుధ విద్యలన్నింటిలో నేర్పరి! ఆంధ్ర గీర్వాణ భాషల యందు వ్యుత్పన్నురాలు. అమృత వచనాలు సృజించు కవీశ్వరి!
ఆమె ధరించిన చీర ముతకగా ఉన్నా, నిర్మలంగా ఉంది. రవికె దానికి తగ్గట్లుగా ఉంది. చెవులకి ముత్యాల పోగులు, చేతులకు గాజులు, కాళ్లకి వెండి కడియాలు, మెడలో చిన్న వరాల పేరు.. ఇవి మాత్రమే ఆమె ధరించిన ఆభరణాలు. ఆమె వేషం నిరాడంబరమైనా ప్రసన్నంగా ఉంది.
కీర్తిశేషుడైన రాథీతర సత్యరథుని పెంపకపు కూతురు సత్యప్రభ. పదిహేడు సంవత్సరాల క్రిందట సత్యరథుడు ఆంధ్ర కళింగుల ఘోర సంగ్రామంలో అనేక శత్రువులను నురుమాడి రణహతుడై వీర స్వర్గాన్ని అలంకరించాడు. సత్యప్రభను పెంచిన సత్యరథుని పత్ని పేరు చంపావతి. సత్యరథునికి సత్యప్రభ ఈ చిట్టడివి లోనే దొరికిందట! ఇట్టి సుందరాంగి శిశువుని ఏ తల్లి విడిచి వేసిందో! సత్యప్రభని గహించిన పిమ్మట చంపావతీ సత్యరథులకి మణిమాల అనే కూతురు పుట్దింది. ఆ పిల్ల సత్యప్రభ కంటె ఒక సంవత్సరం చిన్నది.
సత్యప్రభ వెళ్తున్న దారిలో వైరూప సోమదత్తుని ఆశ్రమం ఉంది. అతని బిరుద నామం అక్షోభ్య ముని. మునిని ఒకసారి చూసి వెళ్లాలని తలచింది సత్యప్రభ. సత్యప్రభా మణిమాలలకు అతడు మంత్ర గురువు. కాబట్టి అతని ఆశ్రమాన్ని దాటి వెళ్లడానికి ఆమె ఇష్టపడ లేదు. ఆమె త్రోవలో నుండి ఆశ్రమం వైపు తిరిగింది. ఆశ్రమ ద్వారం తెరచే ఉంది. ముని లోపల ఉన్నారని ఆమె నిశ్శబ్దంగా ప్రవేశించింది.
ముని లోపల కన్పడ లేదు. అచ్చట ఇంకొకడున్నాడు. అతడు సుందర యువకుడు, కులీనుడైన సంపన్నుడు, గర్వితుడైన సైనికాధికారి. అతని సంపూర్ణ నామధేయం మౌద్గల్య వీరసింహుడు.
సత్యప్రభని చూడగానే వీరసింహుడు కూర్చొన్నవాడు లేచి నిలబడ్డాడు. అతడు సత్యప్రభను అనేక పర్యాయాలు చూసాడు. కాని ఇంత దగ్గరగా ఎప్పుడూ చూసి ఉండ లేదు. ఉజ్జ్వలమైన దీపం ఆమె ముఖాన్ని వానికి చక్కగా ప్ర్రదర్శిస్తూంది. వాడు ఆమెను చంపావతి పెద్ద కూతురని పోల్చాడు. సత్యప్రభ కూడ వాడెవడో తెలుసుకొంది, కాని సంభ్రమాన్ని చూపెట్టలేదు. ఆ పరస్పర దర్శనములో వీరసింహుడు తన దృష్టులతో ఆమె రూపాన్ని అర్చించడానికే పూనుకొన్నాడు. సత్యప్రభ తటస్థంగా నిలిచింది.
ఆ దర్శనోత్సాహంలో వీరసింహుని మనస్సు సత్యప్రభను ఈ విధంగా స్తుతించింది.
‘తాక్షక చంద్ర సేనుని కుమార్తె పర్ణినిని చక్కని చుక్క అని ఆ వాడ వారందరూ చెప్తారు. ఆ ఉత్తమ సుందరి ఈమె ముందు, సూర్యప్రభ కెదురైన కర దీపికవలె శోభింపదు.!’
‘మహారాజు కుమార్తె రథినీ కుమారి ప్రపంచము లోని చక్కని కన్యల్లో అగ్రగణ్యురాలని రూప మర్మఙ్ఞుడైన గావల్గణి రూపచంద్రుడు తీర్పిచ్చి ఉన్నాడు. వాడు కాని ఈమెను నిదానించి చూచినప్పుడు, తన తీర్పును గురించి పునరాలోచన చేయకుండా ఉండలేడు.’
‘చంపావతి పుత్రి మణిమాల అందరి కంటె చక్కనిదని నేను రూపచంద్రునితో వాదించడం కలదు. కాని ఈమె కంటె ఎక్కువ అని చెప్పజాలను. ఆమె ఎంత లావణ్యవతిగా ఉన్నా, దయనీయ తన్వంగి, ఈమె పరిపుష్ట భోగ క్షమాంగి! కండపుష్టి సౌందర్యంలో ప్రధానాంశమని నా అభిప్రాయం!’
‘చంపావతికి రెండు రత్నాలు లభించాయి. ఆ రెండింటిలో దీని వెలయే ఎక్కువ! ఈమె మహా వజ్రం! మణిమాల పుష్యరాగం!’
ఇట్లు హృదయంలో శబ్దించుకొంటూ వీరసింహుడు బహిరంగంగా ఇలా అన్నాడు:
“భద్రముఖీ! మునిగారిని చూడడానికా వచ్చావు?”
“ఔను” ముక్తసరిగా జవాబిచ్చింది సత్యప్రభ.
“ఈ పుష్యార్క యోగంలో ఒక మూలికను గ్రహించడానికి వారు అరణ్య మధ్యానికి వెళ్లి ఉన్నారు. వెళ్లి చాల సేపైంది. ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చో!”
ముని వచ్చేవరకు ఉండడమా లేక వెళ్ళిపోవడమా అని ఆలోచిస్తూ, కొన్ని క్షణాలు సత్యపభ గడిపింది. కొసకు వెళ్లి పోవడానికే తీర్మానించి వీరసింహునితో ఇలా అంది:
“నేను మరొకసారి మునీంద్రుని చూసుకొంటాను. ఇప్పుడు వెళ్లి పోతాను. నాకు ఉత్తరువు ఇప్పించండి.”
సత్యప్రభ లోపలికి ప్రవేశించిన తక్షణమే తన్ను చూసి సిగ్గుపడి వెనక్కు తగ్గక, తన కభిముఖంగా నిలుచుండి, వెళ్తానని చెప్పి, తన ఉత్తరువును ఎదురు చూడడం వీరసింహునికి అపోహ కలుగచేసింది! ఆమె ఆభిముఖ్య వినయాలు కామ ప్రేరితాలని వాడు భ్రమించాడు!
మహా వీరవనిత సత్యప్రభకు స్త్రీ జాతి సహజమైన లజ్జ తక్కువ. వీర పరీక్షలో వీరసింహుడు మొదటి తరగతిలో ఉత్తీర్ణుడయాడని, ఆమెకు వానిపై గౌరవం ఉంది. తన గురువైన అక్షోభ్య మునికి శిష్యుడని ప్రీతి కూడా ఉంది. ఈ రెండు భావాలూ ఆమెను వానికి అభిముఖంగా చేసాయి., వినయంతో మాట్లాడించాయి. బంధుత్వం లేని స్త్రీ తన పట్ల స్నేహం కొంచెం చూపితే చాలు, సాధారణంగా యువకుడు దానిని కామం అని ప్రాయికంగా శంకిస్తాడు. కామచ్ఛాయ లేని స్నేహం బంధువులుకాని స్త్రీ పురుషుల మధ్య ఉండగలదని నమ్మడానికి ఎంతో విశాల బుద్ధి కావలసి ఉంటుంది. వీరసింహునికి అంత విశాల బుధ్ధి లేదు. అందువలన సత్యప్రభ తనను కామించిందని వాడు శంకించడంలో ఆశ్చర్యం లేదు. ఈ భ్రమ వల్ల వానికి కొత్త ఉత్సాహం పుట్టింది, వాని శిరసు మిన్నుని అంటింది, వాని భుజస్కంధాలు ఉబికాయి, వాని వక్షో దేశం విశాలమయింది. వాని కండ్లలో భావతరంగాలకు మితిలేక పోయింది. వాడు పూర్తిగా కామునికి వశమైపోయాడు. కాని ఆ సంగతిని వాడు గ్రహించి ఉండలేదు. తన ఎదుట నిలబడి ఉన్న సుందరి తనను ప్రేమిస్తోందనే భావం మాత్రమే వానికి గోచరిస్తూంది.
కామింపబడ్డానని భ్రమించిన వీరసింహుడు సత్యప్రభను కామిస్తున్నాడు. వాని కామం స్థిరపడిన కొన్ని క్షణాలలో భ్రమ కొంత శిథిలమైంది.ఆమె తనను ప్రేమిస్తూందా లేదా అన్న సంశయం వానిలో ఉదయించింది. వెంటనే వాడు ఆమె మెల్లగా జారిపోతుందేమో అని సందేహించి, ముని వస్తున్నారేమో చూచే నెపంతో ద్వారదేశాన్ని ఆక్రమించుకొన్నాడు.
వాని దృష్టి బాహ్యప్రదేశం వంక లేదు. ముని వచ్చుచున్నారా, లేదా అనే గొడవే వానికి లేదు.వాని దృష్టి ఉన్మాదంతో సత్యప్రభ మీదకే దుముకుతూంది. ఉత్సాహంతో సత్యప్రభ అంగ సంధుల్లో ఆడుతూంది, పిపాసతో ఆమె లావణ్యామృతాన్ని త్రాగుతూంది.
సత్యప్రభ ఈ విషయాన్ని కనిపెట్టింది, ఆమెకు అనుమానం కలిగింది. కొన్ని క్షణాలలో కొండలా ఉన్న వీరసింహుడు ఆమె దృష్టిలో దూదిపింజై పోయాడు!
“నీవు రాథీతర సత్యరథుని కుమార్తె సత్యప్రభవని నేను పోల్చుకొన్నాను, నా పోలిక సరేనా?” అనిప్రశ్నించాడు వీరసింహుడు.
“ఔను.”
“నేనెవరో పోల్చుకొన్నావా?”
“ఎవరు మీరు?” అని అఙ్ఞానాన్ని అభినయించి అడిగింది సత్యప్రభ.
“మహాసమాహర్త (రెవిన్యూ మంత్రి) మౌద్గల హేమచంద్రుడు మా తండ్రి, నా పేరు వీరసింహుడు. ఆచార్య భవనంది గురుకులంలో శాస్త్రవిద్యల్నీ, ఆచార్య విషమసిధ్ధి గురుకులంలో శస్త్రవిద్యల్నీ చక్కగా అభ్యసించాను. రెండు మాసాలుగా రాజకీయ సేనలో ‘సహస్ర పతి’గా పనిచేస్తున్నాను.
“ఓహో అలాగా! చాల సంతోషం.”
“రాథీతరీ! నేను నీతో కొన్ని సంగతులు మాట్లాడవలసి ఉంది. దానికి తగిన సమయ ప్రదేశాలు లభించిన దానికి సంతోషిస్తున్నాను.”
“ఆ సంగతులేమో?”
“నా కనేకులు పిల్లల్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. నా మనస్సు, రాథీతరీ.., నీపై లగ్నమై పోయింది. రాథీతరి ముఖం నుండి అనుకూల వాక్యాన్ని అపేక్షిస్తున్నాను. నీ అభిప్రాయం అనుకూలంగా ఉంటే, నేను ఘడియలో నా తల్లి తండ్రులతో చెప్పి సంబంధాన్ని స్థిర పరుస్తాను.”
ఇప్పుడు వీరసింహుని భావం సత్యప్రభకి అర్థమయింది. అలాగు అడగడం తప్పని ఆమె భావించ లేదు. కాని అలాంటి ప్రసంగానికి తగిన దేశ కాలాలు అవి కావని ఆమె తలంచింది. తత్కాల కామోద్రేకమే దేశ కాలౌచిత్యాన్ని ఉల్లంఘించిన ప్రసంగానికి కారణమని ఆమె నిర్ణయం. అందువలన వీరసింహుని విషయంలో పడిపోయిన ఆమె గౌరవ బుధ్ధి తిరిగి తల ఎత్తలేక పోయింది. ఆమె భావ శూన్యమైనప్పటికిన్ని, మృదువుగానే ఇట్లు ప్రత్యుత్తరాన్ని ఇచ్చింది:
“మీ అమ్మగారు మా అమ్మను ఈ విషయంగా అడుగునట్లు ఏర్పాటు చేయండి. మా తల్లి అంగీకరిస్తే నేను బధ్ధురాలి నవుతాను..”
ప్రత్యుత్తరం ప్రతికూలంగా లేదు. కాబట్టి వీరసింహుని ఆశకు భంగం కలుగ లేదు. కాని సత్యప్రభ సూచించిన సంవిధానం వానికి నచ్చలేదు. వాని తాత్కాలికోద్రేకం విఘ్నాల్ని సహించలేక పోయింది.వాడు మరలా ఇట్లు అడిగాడు:
“మనం ముఖాముఖిగా సంప్రతించుకొని పరస్పరాంగీకారానికి వచ్చిన తరువాత, పెద్దల సమ్మతికి అనుధావించ వచ్చును. నా అంగీకారాన్ని చెప్పివేశాను. నీ యందు ప్రేమాతిశయంచే నేను ఎట్టి త్యాగం చేస్తున్నానో గమనించు. మా ఆస్తి పది లక్షల విలువ కలిగి ఉంది సుమా! నీ ముఖచంద్రుని నుండి వచ్చు ప్రత్యుత్తరాన్ని నేను వినగోరుతున్నాను.”
“నా అభిప్రాయాన్ని వినాలనే మీ కుందా?”
“ఔను రాథీతరీ!”
“ఆలోచించు కోవడానికి రేపు సాయంకాలం వరకు నాకు అవకాశం ఇవ్వండి.”
సత్యప్రభ ఇప్పటికి వాని నుండి తప్పించుకొని పోవడానికి అలాగు మృదువుగా బదులిచ్చింది. ఎలాంటి విలంబాన్ని సహించలేక పోయాడు, ఆ ఉధ్ధత వీర యువకుడు. వాడు ఆ బిగువుతోనే ఇలా అన్నాడు:
“ఇప్పటి నీ భావాన్ని నేను వినగోరుతున్నాను. నేను కపటం లేకుండా అడుగుతున్నాను. నీవు కూడా కపటం లేకుండా బదులు చెప్పాలి.”
వీరసింహుని స్పష్ట ప్రశ్నకు స్పష్టమైన ప్రత్యుత్తరాన్నే ఇవ్వాలని సత్యప్రభ నిశ్చయించింది. ఆమె వీరసింహుని ఆశ పటాపంచలయేటట్లు ధృఢ స్వరంతో పలికింది:
“స్పష్టంగా నా భావాన్ని మీరు వినగోరుతున్నారు కాబట్టి చెప్తున్నాను.. అధిక పరిచయం లేని ఒక కన్యకను ప్రథమ దర్శనంలోనే భావాన్ని చెప్పమని బలాత్కరించే మీ స్వభావం నాకు నచ్చలేదు. అధికంగా ఒక కన్యకను ప్రేమించిన వాడు ఇట్టి విరసమైన చర్యను అవలంబించడు. విలంబాన్ని సహించని ఇట్టి ఉద్రేకం పశు స్వభావమే కాని, మానవ స్వభావం కాదు. నేనిప్పుడు మిమ్మల్ని ప్రేమించలేక పోతున్నాను. ఎన్నటికి కూడా ప్రేమించలేను. మీరు సహ ధర్మాచరణానికి మరొక కన్యను వెతుక్కోండి.”
“ముగ్ధురాలా, ఏమిన్నీ ఆలోచించకుండా నీవు తిరస్కరించ వద్దు. కొద్ది రోజుల్లో నేను దండనాయక పదవికి రావడం తథ్యం. ప్రసాదంలో మా కుటుంబానికి ఉన్న పలుకుబడి నీకు తెలిసే ఉంటుంది. మా ఆస్తి కూడా అఖండ మయింది. నా వీరత్వం కూడా నీకు తెలియని విషయం కాదు.”
“ఈ విషయంలో ఆలోచనలు పనికిరావని మీరే నిర్ణయించారు. కాబట్టి నేను ఆలోచించను. నా భావాన్ని స్పష్టంగానే చెప్పాను. దీని గురించి మరి మీరు మాట్లాడ వద్దు.మర్యాదగా దారి ఇవ్వండి, నేను వెళ్లాలి.”’
ఇంతటితో వీరసింహుడు మౌనం వహించిన బాగుండును. వాడు తాను అవమానింప బడినట్లు తలంచాడు. ఆ తలంపు రాగానే వాని యుక్తాయుక్త విచారం అస్తమించింది. సాధ్యాసాధ్య విచారం తలనే ఎత్తలేదు. కార్యాకార్య విచారం వెనక పడింది. లాభాలాభ విచారం సన్నగిల్లింది. ధర్మాధర్మ విచారం అసలే వానికి లేదు. నా అంత వాడు కోరి తిరస్కరింప బడడమా అన్న పట్టుదల వానిని ఉత్తర ప్రసంగానికి పురికొల్పింది.
“నా మనస్సును దొంగలించిన కన్యను నేను ఉపేక్షింప జాలను. సుందరి యగు కన్యక వీరపురుషుని సొత్తు.”
“నిజమే! సుందరియగు కన్యక వీరపురుషుని సొత్తే అగును. నీవు మాత్రము వీరపురుషుడవు కావు. వీరపురుషులు రణరంగమున అద్భుత కృత్యాలను ఆచరింఛి సుందర కన్యకల మనస్సుల్ని ఆకర్షిస్తారు. వివిక్త ప్రదేశంలో స్త్రీలను భయపెట్టడం దస్యు లక్షణం. అది వీర లక్షణం కాదు. ఇలాంటి వివిక్త దేశ వీరుని నుంచి రాథీతరి సత్యప్రభ భయపడదు.”
వీరు కలంపేరును ‘వాసిష్ట’ గానే పెట్టుకున్నారా? లేక, ‘వాసిష్ఠ’ గా ఉన్నది పొద్దులో పొరపాటున ‘వాసిష్ట’ గా అచ్చు అయిందా?
వెంకట్.బి.రావు
ఇది టైపు పొరపాటేనండి. ‘మీరు సూచించినట్లు ,‘ వాసిష్ఠ ’ అనేదే సరైనది !
ఇంకొక పొరపాటు కూడా జరిగింది. — ఆమె ముతకగా ఉన్నా నిర్మలంగా ఉంది. రవిక కూడా — అన్న వాక్యంలో ఆమె ధరించిన చీర ముతకగా ఉన్నా నిర్మలంగా ఉంది — అని ఉండాలి. పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నాను– పొద్దు సంపాదకులని జరిగిన తప్పు సరిదిద్దమని అభ్యర్థిస్తున్నాను– శ్రీధర్.ఎ
సరిదిద్దామండి. -సం.
Is this a real historical story or a fiction based on history or pure fiction?
This is not a pur fition.Kavyakantha vsiashta muni was a great Indologist.He studied history of Andhra also.He lamented elswhere that he was unable to get sufficient books on Andhra History as he was out of Andhra main land for most of the time.However he new about Srikakulandhra Mahavishnu,for whom a temple is there in Srikakulam(Krishna District).He developed his own story keeping in view the main political and historical events in the ancient society-Murthy
“ఉజ్జ్వలమైన దీపం ఆమె ముఖాన్ని వానికి చక్కగా ప్రదర్శిస్తూంది”
“…మణిమాల అందరికంటె చక్కనిదని నేను రూపచంద్రునితో వాదించడం కలదు”
“…గాయాన్ని గాయపు చెట్టాకు కల్కము వేసి కట్టి ఉన్నాను”
ఎంత హృద్యంగా వున్నాయనిపించినప్పటికీ, ఇలాంటి వాక్య ప్రయోగాలు తెలుగులో సాధారణంగా కనపడవు. సంస్కృత సాహిత్యంలో ఎక్కువగా కనబడతాయి. సంస్కృతంలోనూ నిత్య వ్యవహారంలో ఈ తరహా వాక్యనిర్మాణాన్ని ఊహించలేం, సాహిత్యంలోనే ఇది సాధ్యమవుతుందనుకుంటాను. అందువలన, తెలుగులో ఈ తరహా వాక్య నిర్మాణం, భావాన్ని ముందుగా సంస్కృతంలో ఊహించుకుని, తెలుగులో వ్రాస్తే తయారయిన వాక్యాలన్న భ్రమను కలిగిస్తాయి.
“నేను (ఫలానా పనిని) చేసి ఉన్నాను”
“నేను (ఫలానా మాట) చెప్పి ఉన్నాను” లాంటి ప్రయోగాలు తెలుగులో నిత్యవ్యవహారంలోనూ, సాహిత్యంలోనూ కూడా ఇప్పుడు ఊహించలేం.
1930ల లోనూ, ఇంకా ఆపై ఒకటి రెండు దశకాల దాకానూ, తెలుగు సాహిత్యంలో భాష, వాక్య నిర్మాణాలపై సంస్కృత సాహిత్య ప్రభావం ఏంతగా ఉండిందో తెలుసుకోవడానికి, ఆ కాలంనాటి సాహిత్య భాషను ఆనందించడానికీ ‘సత్యప్రభ’ లాంటి రచనలు కొంత ఉపకరిస్తాయి.
venkat.b.rao