సత్యప్రభ ఆంధ్రవిష్ణు కాలంనాటి చారిత్రిక నవల. దీనికి మూలకథ వ్రాసినది సామాన్య వ్యక్తి కాదు. అతని పేరు గురుపరంపరలలో ఒకటిగా కీర్తింపబడుతోంది. ‘నాయన’ అని, ‘ముని’ అని ప్రేమగా శిష్యులు పిలుచుకొనే అతని పూర్తి పేరు – ‘శ్రీ.శ్రీ.శ్రీ వాసిష్ట కావ్యకంఠ గణపతి ముని’. భారతి సాహిత్య మాసపత్రికలో 1937లో ఇది ధారావాహికంగా ప్రచురింపబడింది. కాని ‘గణపతి ముని’ స్వర్గస్థులయి పోవడం వల్ల అది అసంపూర్ణంగా ఉండిపోయింది. (గణపతి ముని పై పొద్దులో గతంలో వచ్చిన వ్యాసం, ఒక నవయువకుని నవద్వీప విజయం చదవండి.)
శ్రీ గణపతి ముని ఈ నవలకి పెట్టిన పేరు ‘పూర్ణ’! ఆ తరువాత 30 సంవత్సరాలకి అతని కుమారుడు కీ.శే వాసిష్ట (అయలసోమయాజుల మహాదేవశాస్రి) ఈ నవలని, “సత్యప్రభ” అనే పేరుతో పూర్తి చేసారు. దానిని ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 1964లో సీరియల్ గా ప్రచురించింది.
ఆ తరువాత దానిని విశాలాంధ్ర ప్రచురణాలయం – విజయవాడ వారు పుస్తకంగా ప్రచురించారు.
దురదృష్ట వశాత్తు ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కాదు.
ఆతరువాత దీనిని శ్రీ గంటి శ్రీరామ మూర్తిగారు ఇంగ్లీషు భాషలో అనువదించారు. ఇంగ్లీషు ప్రతిని Kavya Kantha Bharati—ANAKAPALLE వారు ప్రచురించారు. ఇదీ.. నవలారాజమైన సత్యప్రభ ప్రస్థానం.
దురదృష్టవశాత్తు ఇప్పుడు అది కూడా లభ్యం కాదు.
……………………
సత్యప్రభ నవలను పొద్దులో ధారావాహికగా ప్రచురించేందుకు సంకల్పించి, అయలసోమయాజుల శ్రీధర్ గారిని సంప్రదించాం. ఆయన కీ.శే మహాదేవశాస్త్రి గారి తృతీయ పుత్రుడు, ‘నాయన’ గారికి స్వయానా పౌత్రుడు. శ్రీధర్ గారి కథలు 30 ఏళ్ల క్రిందట వివిధ మాస వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వాటిలో ‘స్మిత నయన’ అనే కథకి ‘జాగృతి’ బహుమతి వచ్చింది. ’విరిసిన హరివిల్లు’ అనే కథను ఆంధ్రప్రభ స్పెషల్ కథగా ప్రచురించింది. దాదాపు ఇరవై కథలు సామాన్య ప్రచురణకి నోచుకొన్నాయి. ‘చీకటి చకోరాలు’ అనే నాటికకి పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు వచ్చింది. ’బీబీ నాంచారి’ అనే నాటకం 14 కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శింపబడింది. 2004, ఏప్రిల్ 21 న ’బీబీ నాంచారి’ని మా టివి వారు ప్రసారం చేసారు. సీరియల్ పూర్తి కాకుండానే స్పాన్సర్స్ లేకపోవడాన అది ఆగిపోయింది.
పొద్దు పాఠకులకు శ్రీధర్ గారు సుపరిచితులే! తెలుగు అంతర్జాలంలో తొలి నాటికని, నాటకాన్ని ఈయన పొద్దు ద్వారా పరిచయం చేసారు. ‘రమల్’ ప్రశ్నశాస్త్రంపై వ్యాసాలను కూడా రాసారు. ఇప్పుడు ‘సత్యప్రభ’ను శ్రీధర్ గారి ద్వారా పొద్దు పాఠకులకు అందిస్తున్నాం.
శ్రీధర్ గారే రాసినందువల్ల, గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసంలోని వాక్యాలే మళ్ళీ కనిపించాయి ఇక్కడ. (http://pustakam.net/?p=3150)
చదివిందే మళ్ళీ చదవడం కాస్త చిరాకు పుట్టించింది.ఆ వ్యాసానికి లంకె ఇచ్చి ఉంటే సరిపోయేది అని నా అభిప్రాయం.