కథ – వస్తువు
కథ కొన్ని యితర ప్రక్రియల నుండి ఎక్కడ ఏ విధంగా ఏ మేరకు భిన్నమో, ప్రత్యేకమో , యింతకుముందు చూసేం. ఆ ప్రక్రియలకూ వాటినేకాక మరెన్నింటికో కూడా ఉమ్మడి వస్తువు జీవితం. మానవ జీవితం వీటన్నిటి ఉమ్మడి నేల అయితే అందులో దేని పరిధి ఏదో, ఏ మేరకో తెలియాలి.
కథ పరిధి – అని గిరి గీయటానికి లేదు. సమర్థులు జీవితంలో ఏభాగం నుండైనా వస్తువు తీసుకోగలరు. ప్రతిభావంతులు దేనినైనా కథగా చెప్పగలరు. మనమూ అంతవారమైతే ఫరవాలేదు. లేనప్పుడు ఏ పొర జీవితమైతే కొత్త రచయితలు సులభంగా చెప్పగలుగుతారో, ఏ వస్తువైతే కథకు సులభంగా లొంగుతుందో తెలుసుకోవడం మంచిది.
ఈ ప్రపంచంలో అనునిత్యం, అనుక్షణం ఎన్నో జరుగుతుంటాయి.
మనుష్యులు కష్టించి శ్రమ చేస్తారు. చాకిరి చేస్తారు. ఆఫీసుల్లోనూ అక్కడా పనిచేస్తారు.
ఒకరికొకరు సహకరిస్తారు. పదుగురు కలసి ఒకే పని చేస్తారు. స్నేహితులవుతారు. శత్రువులవుతారు. బంధువులవుతారు. బానిసలవుతారు.
రహదార్లమీద లక్షలాది వాహనాల్లో కోట్లాదిగా ప్రయాణిస్తారు. రవాణాలు చేస్తారు. రవాణాలు చేసుకుంటారు.
ఆయా అవసరాల కోసం వారేర్పరచుకొని పోషిస్తున్న వ్యవస్థల చుట్టూ, సహాయం కోసం, న్యాయం కోసం, సేవల కోసం తిరుగుతుంటారు. వాటిని కొంటారు. ఇతరుల కందకుండా చేస్తారు. వంచిస్తారు. వంచితులవుతారు. లాభంపొందుతారు. దెబ్బతింటారు. నష్టపోతారు.
ప్రజల పేరుతో దేశాల్లోనూ, విదేశాలలోనూ ఒప్పందాలవుతాయి. పరస్పర సహకారాలకీ వాణిజ్యాలకూ ఒడంబడికలవుతాయి. కొన్నాళ్ళు సవ్యంగా సాగుతాయి. తగాదాలొస్తే కలహాలూ యుద్ధాలూ అవుతాయి. శాంతులు నెలకొంటాయి. సంధులు జరుగుతాయి. కొందరు బాగుపడి చాలమంది చెడతారు.
మనుష్యుల అజాగ్రత్తవల్లా, ప్రకృతి పరిణామాలవల్లా, అనర్థాలు సంభవిస్తాయి. వారూ వీరూ అన్న తేడా లేకుండా అందరూ దెబ్బతింటారు.
మనిషి మనుగడ భద్రమూ, సుఖవంతమూ చేయడానికి భూమి నాలుగు చెరగులా కొందరు మనుష్యులు అలా అహర్నిశలూ కృషిచేస్తూనే ఉంటారు. స్వార్థపరు లా కృషిని స్వీయ ప్రయోజనాలకు వినియోగించుకుని మనిషి కష్టాన్ని మరీ మరీ పెంచుతూనే ఉంటారు.
ఇవీ, యిలాంటివీ – అన్నీ మనిషి బయట ప్రపంచానికి సంబంధించినవి. మనుష్యుల ఉమ్మడి జీవితం అవుతూ వ్యక్తుల అంతరంగిక (మానసిక) జీవితాన్నీ, విడివిడిగా వారి బాహ్యజీవితాన్నీ, ప్రభావితం చేసేవి, ఎంతో కొంత మేరకి వాటిని నిర్ణయించేవి.
విడివిడిగా మనుష్యుల బాహ్య జీవితాల్లోనూ వ్యక్తిగతంగా వారివారి అంతరంగిక జీవితాల్లోనూ కూడా అనునిత్యం, అనుక్షణం ఎన్నెన్నో జరుగుతాయి.
మనుష్యులు ఎవరికి వారు –
పనులు నేర్చుకుంటారు. చదువుతారు. జీవిక కోసం వెదుక్కుంటారు. ఎందులోనో స్థిరిపడతారు. ముందే జీవిక అమరినవారు పుట్టిన చోటు నుండి కాలు కదపరు.
తోబుట్టువులవీ, కన్నవారివీ బరువులు మోస్తారు. వదల్చుకుంటారు. కట్టుకున్న వారినీ, కడుపున పుట్టిన వారినీ శ్రద్ధగా సాకుతారు. వాళ్ళ పాట్లకు వాళ్ళని వదలిపెడతారు. ఇంటా బయటా కలుపుగోలుగా ఉంటారు. కయ్యానికి కాలు దువ్వుతారు.
అయిన వారి మధ్యా కాని వారి మధ్యా గొప్పలకు పోతారు. పైవారితోనో కింద వారితోనో చేతులు కలుపుతారు. ఆస్తులు పెంచి అంతస్థులు నిర్మిస్తారు. స్థితిగతుల బాగుకోసం అలజడులో, పోరాటాలో సాగిస్తారు.
బాధ్యతలు గుర్తిస్తారు. బాధ్యతల్ని వహిస్తారు. త్యాగాలు చేస్తారు. విజయాలు సాధిస్తారు. బాధ్యతల్ని విస్మరిస్తారు. అపజయాల కింద అణగి పోతారు.
ఈ బాహ్య జీవితమేకాక ఎవరికి వారిదైన అంతరంగింక జీవితం – వారికి మాత్రమే తెలిసేది ఉంటుంది.
పుడతారు. అల్లారు ముద్దుగానో అడవిలో మొక్కలాగో పెరుగుతారు.
ఇతరుల యీర్ష్యాసూయలకు, పంతాలూ పట్టింపులకూ, భయభక్తులూ మమతాను రాగాలవంటి ఎన్నెన్నో ఉద్వేగాలకూ, వారి వారి స్వభావాను గుణ్యంగా ప్రతిస్పందిస్తారు.
తల్లి తండ్రులూ, గురువులూ, సహాధ్యాయులూ, సమాజంలో గొప్పవారు – ఇలా ఎందరెందరి ప్రభావానికో గురి అవుతూ ఎవరికివారు వ్యక్తిత్వాలేర్పచుకుంటారు. లేదా ఏర్పడతాయి.
జీవితాన్ని తెలివిగా, మొండిగా, బండగా, మెతకగా, పట్టుదలగా, కసిగా, రోషంగా, సాహసంగా, దర్జాగా, ధైర్యంగా, నిబ్బరంగా, నిర్లక్ష్యంగా, గాలివాటంగా రకరకాలుగా ఎదుర్కుంటారు.
తమతో ముడిపడివున్న జీవితాలకు చక్కదిద్దుతారు. ధ్వంసిస్తారు. చికాకు పరుస్తారు. నిర్మిస్తారు. ఆ క్రమంలో ప్రేమిస్తారు. హింసిస్తారు. బాధిస్తారు. బాధపడతారు. కష్టపడి పడ్డ కష్టాన్ని ధారపోస్తారు.
జీవితం వడ్డించిన విస్తరిగా, గులాబుల మెత్తగా, కత్తుల బోనుగా, కఠోర తపస్సుగా, కత్తిమీద సాముగా, సాగర తరణంగా, నిరంతర పోరాటంగా ఒక్కొక్కరి కొక్కవిధంగా వ్యక్తమై ఒక్కొక్కరి అంతరంగిక ప్రపంచం ఒక్కొక్క విధంగా రూపు దిద్దుకుంటుంది.
చివరికి ప్రశాంతంగానో, అశాంతిగానో, హాయిగానో, అసహాయంగానో అకస్మాత్తుగానో జీవితం ముగుస్తుంది.
ఈ విధంగా సాగే వ్యక్తుల అంతరంగిక జీవితాలూ, వారి విడివిడి బాహ్యజీవితాలూ – ఇవి కూడా పరస్పరం ప్రభావితం చేసుకుంటూ మనుష్యుల ఉమ్మడి జీవితాన్నీ బాహ్య ప్రపంచాన్నీ ప్రభావితం చేస్తాయి. ఏదో ఒక మేరకు నిర్ణయిస్తాయి.
ఇలా పరస్పర ప్రభావనా స్వభావం కలిగి ముప్పేటగా సాగే యీ మానవ జీవితమే వార్తకైనా, వ్యాసానికైనా, కథకైనా కథవంటి తదితర కళారూపాలకైనా ముడివస్తువు.
తమ తమ జీవితాల మీద మనిషి ఉమ్మడి జీవిత ప్రభావం ఉంటుందని తెలుసుకోడానికి లోకజ్ఞత అవసరమేమోకాని – పంటలు పోవడం, ఏలినవారు మారడం, కొత్తశాసనాలు తేవడం వంటి బయట ప్రపంచపు సంఘటనలకూ తమ జీవితానికి లంకె ఉంటుందని గ్రహించడానికి కొద్దిపాటి లోకానుభవం చాలు. కాబట్టే చదువుకున్న వారితో పాటు చదువుకోనివారూ, లోకజ్ఞానం బొత్తిగా లేనివారూ కూడా లోకం ఎలా నడుస్తుందో, ఎక్కడేం జరుగుతుందో, తెలుసుకోవడానికి ఆతృత పడతారు.
ఈ అవకాశం ఉపయోగించుకొని అనాదిగా ఉంటూ వచ్చిన వ్యవస్థలు మారగా ఇప్పటి వార్తాప్రకటనా వ్యవస్థా, వార్తా సేకరణ వ్యవస్థా పుట్టాయి.
మానవుల ఉమ్మడి జీవితం అవిరామం కాబట్టి దానికి గతం, వర్తమానం, భవిష్యత్తూ ఉన్నాయి.
భవిష్యత్తు చెడకుండా వర్తమానాన్ని సరిచేయాలన్నా, గతం నుంచి చెడిన వర్తమానాన్ని సరిదిద్దాలన్నా, వర్తమానస్థితి అర్థం కావాలి. వర్తమానం అర్థం కావడానికీ, గతం నుండి పాఠాలు తీసుకోవడానికీ, గతాన్ని పరిశీలించి విశ్లేషించాలి. ఈ పని చేయగల లోకజ్ఞులు ఏం చెపుతారో తెలుసుకోడానికీ, తద్వారా తమ జీవితపు వర్తమాన స్థితినీ భవిష్యత్తునీ అర్థం చేసుకోడానికీ, లోకజ్ఞానం కలవారు సదా ఆతృత పడతారు.
ఆ అవసరాన్ని తీర్చడానికి వ్యాసం, వ్యాసాన్ని పోలిన ఇతర ప్రక్రియలూ ఉపయోగపడతాయి.
లోకానుభవం తక్కువ కావడం, లోకజ్ఞానాన్ని పొందే అవకాశం లేకపోవడం, ఉన్నా అవసరాన్ని గుర్తించలేకపోవడం వంటివి కారణాలు ఏమన్నా కావచ్చు – తమ దుస్థితికీ లేదా సుస్థితికీ, ముప్పేటలుగా సాగే మానవ జీవితానికీ కల సంబంధం తెలియని వారుంటారు. వారంతా తమ మనోలోకంలో ఎన్నెన్నో సందేహాలకు సమాధానాలు దొరకక, దొరికినా, దొరికిన వాటిలో చిక్కుముడులు విడదీసుకోలేక, సాహిత్యంలో అలాంటి వాటికి జవాబులు దొరుకుతాయనీ, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో అవి విడమరిచి ఉంటాయనీ విని అందుకు సాహిత్యాన్ని ఆశ్రయిస్తారు.
సాహిత్యం, అందులో ఒక శాఖ అయిన కథా, ఆ పని చేయగలగాలి.
కథలు రాసే తొలిదశలో కథకుల లోకానుభవమైనా, వారి లోకజ్ఞానమైనా చాలా పరిమితాలే. కాబట్టి ముందే పెద్దకుండలకు ఎసరు పెట్టకుండా, తామెరిగిన జీవిత భాగాలతోనే, తమకు బాగా అర్థం కాగల జీవిత పరిధి నుండే వస్తువు తీసుకొని కథ చెప్పడానికి ప్రయత్నించడం మంచిది.
వ్యక్తుల అంతరంగిక జీవితాన్నీ, వారి వారి విడివిడి బాహ్య ప్రాపంచిక జీవితాన్నీ, చాతనైన మేరకి పరిశీలించి (చిత్తశుద్ధితో) అందుమీద కథలు రాయడం, నిడివి మీద తమ పరిశీలనను విస్తరిస్తూ పోయి మానవుల ఉమ్మడి జీవితం గ్రహించడం ఏ కొత్త రచయితకైనా అనుసరించదగ్గ మార్గం.
ఇంతవరకూ చెప్పిన దాన్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే –
٭ మనుష్యుల కందరికీ బయట ప్రపంచంలో ఒక ఉమ్మడి జీవితం ఉంటుంది.
٭ ప్రతి మనిషికీ బాహ్య ప్రపంచంలో ఒక పరిమిత జీవితం ఉంటుంది. ఎవరికి వారికి అంతరంగిక జీవితం ఉంటుంది.
٭ ఈ మూడూ దేనికదిగా తక్కిన రెండింటినీ ప్రభావితం చేస్తూ వాటిని ఒక మేరకి నిర్ణయిస్తాయి.
٭ మానవుల ఉమ్మడి జీవితం గురించీ, వ్యక్తుల రెండురకాల జీవితాలమీదా అది నెరపగల ప్రభావాల గురించీ తెలియాలంటే చాలా విషయాలు తెలియాలి. దానికి సంబంధించిన వార్తలనూ, వ్యాస విషయాలనూ కథలుగా తీసుకొని రాయడం కొత్తవారికి దుస్సాధ్యం.
٭ వారికి అర్థం కాగలదీ, అందుబాటులో ఉండేవీ, వ్యక్తుల బహిర్జీవితం. కాబట్టి మొదట్లో వారి రచనను వాటికే పరిమితం చేసుకోవడం వారికీ, సాహిత్యానికీ మంచిది.
ఈ వ్యాసం ఇంట్రెస్టింగా ఉంది. ఇంకా ఎన్ని భాగాలు ఉన్నాయి?