సంపెంగపూవు

మూలం: రవీంద్రనాథ టాగోర్
అనువాదం: బొల్లోజు బాబా

సంపెంగపూవు

 

ఒకవేళ సరదాగా నేనో సంపెంగపూవునై ఆ ఎత్తైన చెట్టుకొమ్మ మధ్య
పెరుగుతూ,


గాలిలో నవ్వుతూ, ఆ నునులేత ఆకుల మధ్య నాట్యం చేస్తూ ఉంటే
నీవు నన్ను కనుగొనగలవా అమ్మా?
 

బుజ్జాయీ ఎక్కడున్నావూ? అని నీవు పిలుస్తో ఉంటే, నాలో నేనే
నవ్వుకొంటూ నిశ్శబ్దంగా దాగుండి పోతాను.


నా రేకల్ని మెల్లగా తెరచి నీవేం చేస్తూంటావో గమనిస్తాను.


నీవు స్నానం చేసి తడికురుల్ని నీ భుజాలపై విరబూసుకొని
ముంగిట్లోని ఈ సంపెంగ చెట్టు నీడలో ప్రార్ధనలు చేసుకొంటూ
నడిచేటపుడు పూల గంధాన్ని గుర్తిస్తావు కానీ
అది నానుంచి వచ్చిందని నీకు తెలియదు.


మధ్యాహ్న భోజనానంతరం
నీవు కిటికీ వద్ద కూర్చొని రామాయణాన్నిచదువుతూంటావు.
సంపెంగ చెట్టునీడ నీ కురులపై ఒడిపై పడుతూంటుంది.
ఆ పుస్తక పుటలో నీవు చదువుతున్న చోట నా చిరునీడ పడేలా చేస్తాను.


ఆ చిరునీడ నీ చిన్నారిదని నీవు ఊహించగలవా?


మునిమాపు వేళ చేత లాంతరుతో నీవు పశువులపాకకు వెళ్ళినపుడు
నేను చెట్టునుండి నేలకు దిగి,  ఏదైనా కధ చెప్పమంటూ మారాం చేసే
నీ బుజ్జాయినైపోతాను మరోసారి.


"అల్లరిపిల్లా ఎక్కడకు పోయావూ?
అమ్మా నేను చెప్పను" అంటూ ఇద్దరం పలకరించుకొంటాం.


మూలం: The Champa Flower – Crescent Moon by Ravindranath Tagore.


 

ముసురు

 

అంధకార అరణ్యపుటంచుల చుట్టూ కారుమబ్బులు కమ్ముకొంటున్నాయి
ఓయ్ పిల్లవాడా బయటకు వెళ్ళకు


చెరువుపక్కనున్న తాటి వరుసలు తమ తలల్ని నింగిపై బాదుకొంటున్నాయి
రెక్కలు తడిచిన కాకులు చింతకొమ్మల మధ్య నిశ్శబ్దంగా ఉన్నాయి.

తూరుపు రేవులో పెంజీకట్లు సంచరిస్తున్నాయి.
కంచెవద్ద ఆవు బెదరిపోయి అరుస్తోంది

బాబూ! నేను దాన్ని పాకలోకి తీసుకువచ్చేవరకూ ఇక్కడే ఉండు.


పొలాల్ని ముంచెత్తుతున్న గండిపడ్డ చెరువునీటిలోని
పారిపోతున్న చేపల్ని పట్టటానికై కొంతమంది గుమిగూడారు

తల్లికి దొరక్కుండా అటూ ఇటూ పరిగెట్టే అల్లరి పిల్లగాడిలా
వాన నీరు ఇరుకుబాటలపై పిచ్చిగా పరుగులెడుతూంది.


ఏటి ఒడ్డున ఎవరో పడవవానికై అరుస్తున్నారు, వినబడుతోందా!


ఓయ్ పిల్లవాడా!  చీకటిపడింది. నదిదాటింపు ఆగిపోయింది.
పిచ్చిగా కురుస్తున్న వాననెక్కి ఆకాశం సవారీ చేస్తున్నట్టుంది.

నది గర్జిస్తూ సుళ్ళు తిరుగుతోంది.  కడవలలో నీరు నింపుకొన్న స్త్రీలు
తొందరగా ఇళ్ళు చేరుకొంటున్నారు.  రాత్రిదీపాలు వెలిగాయి.


బజారుతోవలో సంచారం లేదు.  ఏటిగట్టు జారుడుగా ఉంది.
వెదురుపొదల మధ్య గాలి వలలో చిక్కుకొన్న మృగంలా
గింజుకొంటూ ఊళలు పెడుతోంది.


ఓయ్ పిల్లవాడా బయటకు వెళ్ళకు

మూలం: The Rainy Day – Crescent Moon by Ravindranath Tagore.

 

కాగితపు పడవలు

 

పారే నీటిపై ప్రతీరోజూ కాగితం పడవలను వదులుతూంటాను.
వాటిపై నా పేరు మా వూరి పేరు పెద్దపెద్ద అక్షరాలతో వ్రాస్తాను.


ఎవరో పరదేశి వాటిని చూసి నేనెవరో తెలుసుకొంటారని నా ఆశ.


మా తోటలో పూచిన పారిజాతం పూలతో నా చిట్టి పడవలను నింపుతాను
ఈ వేకువ పూలు సురక్షితంగా రాత్రి తీరానికి చేరతాయని నా ఆశ.


నా పడవలను నీటిపై వదిలి అలా ఆకాశం వైపు చూస్తాను.
అక్కడ చిట్టిమేఘాలు తమ తెల్లటి తెరచాపల్ని విప్పుకొని కనిపిస్తాయి.


నా పడవలతో పోటీ పడటానికై వాటిని ఆకాశంలోకి
ఏ నా చెలికాడు వదులుతున్నాడో నాకు తెలియదు.


ఆ రాత్రి నిదురలో నా కాగితపు పడవలు నిశీధి తారల నడుమ
అలా అలా సాగుతున్నట్లుగా కలలు కంటాను.


నిదుర కాంతలు వారి సజ్జలనిండాఅ స్వప్నాలు నింపుకొని
వాటిలో ప్రయాణిస్తూంటారు.


మూలం: Paper Boats – Crescent Moon by Ravindranath Tagore

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

2 Responses to సంపెంగపూవు

  1. Naren G. says:

    chala bagunnayi. manchi anuvadam sir.

    Naren.

Comments are closed.