నీల గ్రహ నిదానము – 3

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము

శనిదేవుడు

ద్వితీయాంకము :: ద్వితీయ దృశ్యము

(అయోధ్య లోని నాలుగు రోడ్ల కూడలి)

(బుధుడు ఒక ఆసనంపై కూర్చొని ఉంటాడు. అకంపనుడు, అర్ణవ ష్ఠీవి శిష్యులుగా మారి అతనికి చెరొక ప్రక్క నిలబడి ఉంటారు.)

– పాట –
శిష్యులు:

సౌమ్య గురుని శరణు పొందండి, జనులార!
మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి

అకంప:

అత్రి మునికి మనుమడండీ!
అసుర గురుని శిష్యుడండీ!

అర్ణవ:

తపస్సాధన చేసి, దండి
సత్యమును కనిపెట్టినాడండీ! |

శిష్యులు:

సౌమ్య గురుని శరణు పొందండి, జనులార!
మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి

బుధుడు:

హర హరిః ఓం, హర హరిః ఓం,
హర హరిః ఓం, హర హరిః ఓం
అయోధ్యాపురి వాసులారా!
అన్నాలారా, అక్కలారా!
పూజ్య మాతా పితరులారా!
నే చెప్పబోయే నిజము వినరండి

శిష్యులు:

సౌమ్య గురుని శరణు పొందండి, జనులార!
మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి

బుధుడు:

ప్రజా రక్షకు పరమేష్ఠి ఘటితము
రోహిణీ నక్షత్ర శకటము
శనీశ్వరుని కది ప్రథమ కబళము
కానున్న అరిష్ట తరుణము
సమీపించెను కరువు కాటకము
పన్నెండేళ్ల ప్రళయ తాడవము!

శిష్యులు:

హర హరిః ఓం, హర హరిః ఓం,
హర హరిః ఓం, హర హరిః ఓం,

బుధుడు:

వాపీ కూప తటాకాదులు,
నదీ నద పాతాళ జలములు
వర్షించని రాతి మేఘాలు!
త్రాగు నీటిని చేయు గగ్గోలు!

శిష్యులు:

పాహి పాహి, త్రాహి త్రాహి
పరమ గురుడా తెలుపు దారి!

బుధుడు:

దారి తెన్ను కానలేరు
ఇసుక మేటల మధ్య మీరు
కోథ నేలే ధర్మ ప్రభువులు
నిక్కముగ మీ వారు కారు!
అయోధ్యలో ఇక బ్రతుక లేరు
రాతి గోడలే బీట వారు!

శిష్యులు:

సౌమ్య గురుని శరణు పొందండి, జనులార!
మీరు సౌఖ్య శాంతుల మర్మ మెరుగండి.

బుధుడు:

సాటిలేని మేటి మగడు!
తొల్లి తాపసి గౌతముండు
శని పీడ బాపిన ఉత్తముండు
శివుని కొప్పున, బొరలు మెండు
దివిజ గంగను, తెచ్చె రండు!

శిష్యులు:

సౌమ్య గురుని వెంట నడువండి
గోదారి జాలములె మనకు దిక్కండి.

బుధుడు:

హర హరిః ఓం, హర హరిః ఓం,
హర హరిః ఓం, హర హరిః ఓం,

(బుధుడు, మరోచోట పాట పాడడానికి లేస్తాడు. శిష్యులు వెను వెంట నడుస్తారు)

(సుమంత్రుడు పరుగు పరుగున వస్తాడు)
సుమంత్ర:

వలదు వలదు వలదండీ
అయోధ్య విడిచి పారి పోకండి
కలడు కలడు కలడు కలడండి
గౌతమునకు సరిజోడు నేడండి
భాగ్యవశమున మనకు నృపుడండి!
అరయుచున్నాడిదె దారి విడువండి.

(పాట ఆగిపోతుంది)

(ప్రవేశం :: దశరథుడు)

దశరథ: (వస్తూనే సౌమ్యునికి నమస్కరించి) సౌమ్య గురువరేణ్యా! చంద్రపత్నియైన రోహిణీ మాత మీ మాట నిజమని ధృవ పరిచినది. నా కర్తవ్యము నాకు తెలియ జేసినది.

బుధుడు: దశరథ రాజేంద్రా! నా మాట నిజమని తెలుసుకొని నీ ప్రజల ముందు దానిని ఒప్పుకొనుట నా కెంతయో సంతోషము కల్గించినది! నీ ప్రజలు అయోధ్య విడిచి వెళ్లుటకు కాతర నయనాలతో నీ వంక చూచు చున్నారు! వారి నెట్లు సమాధాన పరచెదవో నీ ఇష్టము!

దశరథ: గురువర్యా! ముందుగా మీరు మీ శిష్యులతో పాటు మా అతిథులై రాజప్రాసాదమునకు విచ్చేయుడు. ఈ దశరథుని కంఠమున ప్రాణమున్నంత వరకు, ఎవరును అయోధ్య విడిచి పోనవసరము లేదు.

బుధుడు: అటులనా దశరథా! మంచిది! మాకు అభ్యంతరము లేదు, అయినను కరువు కాటకముల నుండి మమ్ముల నెట్లు రక్షింతువో, వినుటకు కుతూహలముగా నున్నది.

దశరథ: మహాత్మా! శనిపీడ వలన నేర్పడబోవు క్షామమును నివారించుటకు, పూజ్య గౌతముడే నాకు ఆదర్శము.

బుధుడు: ఏమంటివి దశరథా? గౌతమునితో నీకు సామ్యమా! అతడు భూసురుడు, బ్రహ్మర్షి. తన తపశ్శక్తితో శివుని మెప్పించి, గోదావరి నదిని తెప్పించిన వాడాయెను!

దశరథ: విప్రోత్తమా! శనిదేవుడు రోహిణిని భేదించుటకు ఇంకను కొన్ని దినముల వ్యవధి ఉన్నది కదా?

బుధుడు: అవును, అయిన నేమయినది?

దశరథ: నేను నా కున్న క్షాత్రశక్తితో శని మార్గమును నిరోధించి, సామ దాన భేద దండోపాయములతో అతనిని వశ పరచుకొని, ఈ దుర్భిక్ష నివారణ కొరకు సంకల్పించితిని. అందులకు మీ అందరి ఆశీస్సులు నాకు కావలె!

బుధుడు: (సంతోషంతో) భళి! అజ కుమారా, భళి!! ఇప్పటికి కదా రాజోచితమైన మాట పలికినావు! నీవు శనీశ్వరుని ఎదిర్చి నిలుచుటకే నిశ్చయించితివా?

దశరథ: అవును మహానుభావా! నా బుద్ధికి అంతకన్న మార్గాంతరము తోచకున్నది.

బుధుడు: రాజేంద్రా! నీ కిదే నా ఆశీస్సులు! (అని ప్రజల నుద్దేశించి.. ‘పాట’)

ఏమి సాహస మేమి సాహసము!
అజకుమారా నీ దేమి సాహసము!
ఏడేడు లోకములందు నుత్తమము!
కాన జాలము దీని సరి సమము!

శిష్యులు:

ఏమి సాహస మేమి సాహసము!
ఏడేడు లోకములందు నుత్తమము!

బుధుడు: అజకుమారా! శనిదేవుని నెదిర్చి నిల్చుటకు సంకల్పించిన నీ ధైర్య సాహసములే రక్షా కవచములై నిన్ను కాపాడ గలవు! మేరునగ సమానమగు నీ ప్రజాహిత బుద్ధి స్వార్థ త్యాగ నిరతి, నీ శరీరమును వజ్రకాయముగా మార్చును గాక! నేను మా మంత్ర శక్తితో మృగాంకుని ‘హరిణ రథమును’ తెప్పించి, నిన్ను రోహిణి కడకు పంపగల వాడను. నీవు శస్త్రములను ధరించి సంసిద్ధుడవు కమ్ము!

దశరథ: ధన్యోస్మి! సౌమ్య గురుదేవా, ధన్యోస్మి!

బుధుడు: (ఉత్సాహంతో) అజకుమారా! నీకు జయమగు గాక!

(సుమంత్రునితో పాటు ప్రజావాణి ఒక్కుమ్మడిగా “అజ కుమారా, నీకు జయమగు గాక ” అని ఘోషిస్తారు)

(ద్వితీయ దృశ్యము సమాప్తము)

(ద్వితీయాంకము సమాప్తము)

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము

తృతీయాంకము

శేష దృశ్యము

(రోహిణీ నక్షత్ర మండలం. గమనిక : రోహిణీ నక్షత్రం శకటాకారంగా ఉండే అయిదు నక్షత్రాల కూటమి)

(రోహిణి పాన్పుపై కూర్చొని దశరథుని రాకకు ఎదురు చూస్తూ ఉంటుంది)

(దశరథుడు ధనుర్భాణములు చేత బట్టి, పూర్తి యుద్ధవేషంలో వస్తాడు.)

(రోహిణి దశరథుని రాక చూసి, దోసిలితో పూలని తీసుకొని పాన్పు దిగి వస్తుంది,)

రోహిణి: ఆగుమాగుము అకళంక కీర్తిచంద్ర, అయోధ్యాపురీ రమేంద్రా!

(దశరథుడు ఆగిపోతాడు)

రోహిణి: శశాంకుని ప్రియ భామిని అయిన ఈ రోహిణి నీకు స్వాగతము చెప్పుచున్నది.

(దోసెట్లో పూలు దశరథుని పాదాల మీద పోస్తుంది)

రోహిణి: స్వాగతం! దశరథ రాజేంద్రా, స్వాగతం!

దశరథ: మాతా! మీ నక్షత్ర మండలమున నా యందలి ప్రీతితో, మీ రిచ్చిన స్వాగతము నా జీవితమున ఒక మధురానుభవము! ఈ అల్పుని ప్రణామము స్వీకరించెదరు గాక!

రోహిణి: (ఆశ్చర్యంతో) ఇది యేమి అజ కుమారా! నేను నీ శరణాగతను. శరణార్థులు స్వాగత సత్కారములు చేయుటకే గాని స్వీకరించుటకు తగరు. నీవు నాకిట్లు నమస్కరించుట పాడి కాదు.

దశరథ: కొడుకెంత గొప్పవాడైనను, తల్లి కడ వినమ్రుడగుట పాడికాదనుట చెల్లునా? పరమేష్ఠి సృష్టిలో మీ నక్షత్ర మండలమును ప్రజా రక్షణకై నిర్మించెనని సౌమ్య గురువరేణ్యులు సెలవిచ్చినారు. నేనును ప్రజా హిత రక్షా దీక్షా కంకణుడను! సృష్టి క్రమమున మీరు ముందు నేను వెనుక, గనుక మనము మాతా పుత్రులమే! కాదందురా తల్లీ?

రోహిణి: ఆహా! దశరథా! నీ వెంతటి సౌజన్య మూర్తివి! నీ అనునయ వినయ వార్తాలాపములు నా మనసుని పాశము వలె బంధించి, నీపై పుత్ర వాత్సల్యమునకు గురి చేయుచున్నవి!

దశరథ: ధన్యోస్మి మాతా! నన్ను పుత్రునిగా నెంచిన నీ కడ, నే నొక వరమడుగ వచ్చునా?

రోహిణి: కుమారా, అవశ్యము! నా శక్తికి చాలిన దేదైనను ఇచ్చెదను, కోరుకొనుము!

దశరథ: తల్లీ! శనీశ్వరుడు నా యభీష్టము మన్నించి నిన్ను విడిచి పెట్టి, కథ సుఖాంత మైనప్పుడు వేడుకొనెదను!

రోహిణి: అటులనే కానిమ్ము కుమారా!

దశరథ: (దనుర్ధారియై) తల్లీ! శనిదేవుడు వచ్చు దిక్కు ఎక్కడ?

(రోహిణి ఫకాలున నవ్వుతుంది)

దశరథ: (ఆశ్చర్యంతో) పరిహాసమేల తల్లీ?

రోహిణి: (నవ్వును ఆపుకొంటూ) దశరథా! కాంతుల సముదాయమైన శనిదేవుడు, దుర్నిరీక్ష్యుడు సుమా! చూడగలిగిన వారికి అతడు, వలయాకారమగు నీలిరంగు మంటల చేత పరివేష్టితుడై కన్పట్టువాడు. శని వచ్చు దిశ ఏదియైనను, నీవు చూడ గలిగి నప్పుడు గదా, ఆ బాణమును వదల గలుగునది?

దశరథ: (దెబ్బతిని) తల్లీ! నా లక్ష్యము దృశ్యమైనను అదృశ్యమైనను శబ్దమును బట్టి, శబ్దవేధిని సంధించి చీల్చ గలను!

రోహిణి: భళి! సౌజన్యమునకే గాక సాహసమునకు కూడా నీలో లోటు లేదన్నమాట! ఇంకను నీ కడ ఏమేమి ఆయుధములు కలవు రాజా?

దశరథ: ధనుర్వేద పారంగతుడైన నా తండ్రి వద్దను, కుల గురువు వశిష్ట మహర్షుల వద్దను, నేర్చిన అగ్ని, వరుణ, ఇంద్ర, వాయు, స్తంభన, సమ్మోహనాది దివ్యాస్త్రములు చాల వరకు ఉన్నవి.

రోహిణి: ఎట్టి దివ్యాస్త్రములైనను, శనిని చుట్టుముట్టి ఉండే నీలి మంటలలో భస్మము కావలసినదే కుమారా! నీ ధనుర్భాణములు, కరవాలము.. అన్నియు నిరర్థకములే!

దశరథ: రవి తేజమును చూచుటకు మసి పూసిన కటకము నుపయోగించు చందమున, శని తేజమును చూచుటకు ఏవైన కటకములను సంపాదించ వలెనని అర్థమయినది. తల్లీ! శస్త్రాస్త్ర ప్రయోగమునకు కూడ ఏదైన ఉపాయముండక పోదు!

రోహిణి: (ప్రశంసా పూర్వకంగా చూస్తుంది) అవును దశరథా! అట్టి కటకముల నెట్లు సంపాదింతువు?

(దశరథుడు ధనుర్భాణములు విడిచి, ప్రార్థనా భంగిమలో కూర్చొంటాడు)

దశరథ: తల్లీ! నీ మనో విభుడైన శీత కిరణుని కడ అర్థింతును (అని ధ్యానిస్తాడు)

“దధి శంఖ తుషారాభం, క్షీరార్ణవ సముధ్భవం
నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం “

(దశరథుడు చంద్ర స్తోత్రం చేస్తూ ఉండగా, రోహిణి కూడ కృతాంజలియై చంద్రుణ్ణి ప్రార్థిస్తుంది)

రోహిణి: ప్రాణ నాథా! అమిత దుస్సాహసముతో నా రక్షణకై అరుదెంచిన ఈ రాజన్యుని, అభీష్టము నెరవేర్చెదరు గాక! !

(ప్రవేశం :: చంద్రుడు)

చంద్రుడు: (దశరథుని దగ్గరగా వచ్చి) అజ కుమారా! నీ అభీష్టము మేరకు, ప్రజ్వలిత జ్యోతిర్మయ తారకా గ్రహములు వేటినైనను చూడగల దివ్య చక్షువులను, నీ కొసగుచున్నాను. (ధశరథుని కనులను స్పృశించి, రోహిణితో) ప్రియే! రోహిణీ! లోహ, దారు, అస్థి, నిర్మితములగు శస్త్రములను విద్యుత్కాంతి ప్రభల తొడుగులో ప్రతిష్టించి ప్రయోగించిన యెడల, అవి శని వలయమును ఛేదించుకొని పోగలవు! ఈ రాజన్యుని శస్త్రములను అట్టి తేజో పూరితములు, చేయుటకు ‘కుమార మంగళు’ని ప్రార్థింపుము.

రోహిణి: నాథా! మంగళుడు మీ మిత్రుడే కదా! మన మండలమునకు, మన అవసరార్థము విచ్చేసిన దశరథునికి సహకరించుట మనకు కర్తవ్యమన్న మాట మరిచితిరా?

చంద్రుడు: దేవీ! అటులనే కానిమ్ము! మన మందరము సామూహికముగా ప్రార్థించెదము గాక!

(చంద్ర రోహిణులిద్దరూ చెరొక ప్రక్క నిలబడగా దశరథుడు మధ్యన నిలబడుతాధు, అందరూ కలిసి)

ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమ ప్రభం
కుమారం శక్తి హస్తంచ, ‘మంగళం’ ప్రణమామ్యహం

(రంగస్థలం మీద లైట్లు ఆరి, తిరిగి వెలుగుతాయి. కుజ గ్రహ చ్ఛాయ కనిపిస్తుంది.)

మంగళుడు: రోహిణీ చంద్రులారా! మీరు కోరిన మేరకు అజవాహనుడ నైన నేను ఈ అజకుమారుని ధనస్సును విద్యుచ్ఛక్తి పూరితము చేయుచున్నాడను.

( డైలాగు పూర్తి కాగానే, దశరథుని ధనుస్సును ఒక మెరుపు లాంటి కాంతి వచ్చి తాకుతుంది)

మంగళుడు: శశాంకా! ‘శని’, తన పాశముచేత ఈ దశరథుని, ధనస్సుతో పాటు, బంధింప వేయగల సమర్థుడు. అసుర గురుడైన శుక్రాచార్యుని కవచము సాధించి, ఈ రాజన్యుని శని పాశ బంధము నుండి రక్షించుము.

(కుజ గ్రహం నీడ మాయమవుతుంది. రంగ స్థలం పైన చిన్న స్పాట్ వెలుగులో, ముగ్గురూ శుక్రగ్రహ స్తోత్రం చేస్తూ కనిపిస్తారు)

” హిమ కుంద మృణాలాభం, దైత్యనాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్త్రారం, భార్గవం ప్రణమామ్యహం

(తెర వెనుక శుక్ర గ్రహం నీడ కనిపిస్తుంది)

శుక్రుడు: రోహిణీ మృగాంకులారా! ఒండొరుల నెడబాసి ఉండలేని మీ ప్రేమను అడ్డం పెట్టుకొని, దేవర్షి నారదుడు, అమేయ బుద్ధిబల సంపన్నుడైన బుధునితో కలసి, ‘శని పీడా నివారణోపాయమును’ కనుగొనుటకు వేసిన ఎత్తుగడ నాకు అర్థ మయినది. పథకము ఏదైనను ఫలితము మాత్రము, దేవ మానవులకే గాక, రాక్షసులకు కూడ ప్రయోజనకరము గావున నే నీ దశరథునకు నా రక్షా కవచమును ఇచ్చుచున్నాను. ఇది ఒకే ఒక పర్యాయము ఇతనికి ఉపకరింప గలదు.

(స్టేజి మీద స్పాట్ లైటు మందంగా వెలుగుతుంది. ఒక రక్షాబంధం ‘ రాఖీ ‘ లాంటిది పై నుంచి క్రిందన పడుతుంది. రోహిణి దానిని తీసుకొని దశరథుని చేతికి కడుతుంది.)

శుక్రుడు: దశరథా! శని చేతి భుజంగాస్త్రము, అతని పాశము కన్న భీషణమైనది. కాలసర్ప శిరః శరీరములైన ‘రాహు కేతువులే’ దాని నుండి నిన్ను తప్పింప గలవారు. వారి అనుగ్రహమును పొంది, అజేయుడవు కమ్ము! నీకు జయమగు గాక!

(నీడ జారిపోయి, తిరిగి రంగస్థలం మీద లైట్లు వెలుగుతాయి)

చంద్రుడు: విన్నావు కదా! దశరథా! దైత్య గ్రహములగు, వారి యనుగ్రహము నీకు కలదో లేక వలదో నీవే నిర్ణయించు కొనుము. నేను వారి ముఖ దర్శనము కూడ చేయ నిచ్చగింపను. ఇప్పటికే చాల కాలాతీత మయినది. ఇక సెలవా మరి!

దశరథ: తండ్రీ! నా కార్యము జయప్రద మగునట్లు నన్ను ఆశీర్వదింపనిదే మిమ్ములను వెళ్లనివ్వను.

చంద్రుడు: ప్రాణ సఖిని, పరుల రక్షణయందుంచి పారిపోవుచున్న నావంటి వాని ఆశీస్సులు నీ కేల నయ్యా? నన్ను పోనిమ్ము.

దశరథ: తండ్రీ! మీరిట్లనుట సమంజసము కాదు. పుత్రుడు కార్యము నెరవేర్చుట తండ్రికి తలవంపు లెట్లగును? కనుక మరి యే విధమైన ఆలోచనలు చేయక నన్ను దీవింపుడు!

చంద్రుడు: (గద్గదిక కంఠంతో) కుమారా! దశరథా! ఏమి సౌజన్య మూర్తివయా నీవు! బుధ నారదులు గ్రహము కాని గ్రహాంతర వాసివైన, నిన్ను ఎందులకీ పనికి పురికొల్పి తెచ్చినారో నాకు ఇప్పుడు అర్థమయినది. దశరథా! సావథాన చిత్తడవై వినుము- శనీశ్వరుడు చరాచర ప్రాణికోటి యందలి అహంకార చిత్త వృత్తులను క్రమక్రమముగా నాశనము చేసి వారిని జన్మ జన్మాంతరములందు ఆముష్మిక పథము వైపు నడిపించుటకే నియమింప బడిన వాడు. బల, అతిబల, మహాబలాది అహంకార చిహ్నములగు ఎట్టి శస్త్రాస్త్రముల కైనను అతడు అసాధ్యుడు. శిరము వంచి అంతర్ దృష్టితో చూచు వారలకే గాని, తల లెత్తి చూచువారలకు అతడు కనబడడు. తెలిసినదా కుమారా? వ్యర్థములైన శస్త్రములను నమ్ముకొనక, సడలని ఆత్మ విశ్వాసము తోడను, నీ స్వకీయమైన సౌజన్యాస్త్రము తోడను నీ పనిని సాధించుము. నీకివే నా శుభాశీస్సులు! (దీవించి వెళ్లిపోతాడు)

రోహిణి: దశరథ రాజేంద్రా! నీవు ‘రాహు, కేతువులను’ ప్రార్థింప దలచితివా?

దశరథ: తల్లీ! లక్ష్యము పవిత్రమైనప్పుడు, కార్య సాధనకు ఉచితానుచితములు పాటింప కుండుటయే రాజనీతి! నాకు ఆ మహానుభావుల ఆశీస్సులు కూడ అభిలషణీయమే!

రోహిణి: అట్లైన నేను వెడలి మరల వచ్చెదను. నా నాథుడు చూడ నిచ్చగింపని ఆ అసురులను నేను కూడ చూడజాలను! (వెళ్లి పోతుంది)

(దశరథుడు వినమ్రుడై రాహు కేతువులను ప్రార్థిస్తాడు.)

” అర్థ కాయం మహావీరం, చంద్రాదిత్య విమర్దనం
సింహికా గర్భ సంభూతం, తం రాహుం ప్రణమామ్యహం ”
పలాశ పుష్ప సంకాశం, తారకా గ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం “

(రంగస్థలం క్రమంగా చీకటయి తెరలో వికటాట్టహాసం వినిపిస్తుంది. తెర వెనుక లైట్లు వెలిగి, పాము శరీరము మానవ శిరస్సు గలిగిన రాహువు ఒకవైపు, పాము పడగ క్రింద మానవ శరీరము గల కేతువు మరొక వైపు కనిపిస్తారు)

రాహు, కేతువులు: రాజా! దశరథా! రాక్షసులకు కూడ ఉపయోగింపగల పని చేపట్టిన నీకు మా ఆశీస్సులు. శని చేతి భుజంగాస్త్రము నీ పట్ల నిరర్థకమగును గాక!

(వికటాట్ట హాసం చేస్తూ అదృశ్యమవుతారు)

(స్టేజి పైన తిరిగి లైట్లు వెలుగుతాయి. దశరథుడు తన ధనస్సు నందుకొని, లేచి నిలబడి నలు ప్రక్కల కలయ జూస్తాడు. తరువాత కుడివింగు వరకు వెళ్లి, వెనుకకి వచ్చి, బాణాన్ని ఆకర్ణాంతము సంధించి నిల్చొంటాడు)

(ప్రవేశం :: బుధ నారదులు)

బుధుడు: (వస్తూనే) ఆగుమాగుము దశరథ రాజేంద్రా! నీ శర ప్రయోగము ఎవరి పైన, శనీశ్వరుని పైన కాదు గదా?

నారదుడు: అజకుమారా! నీ అస్త్ర ప్రయోగము శనిపైననా?

దశరథ: (ఇద్దరికీ నమస్కరించి) బుధ నారదులారా! నా ప్రణామములు స్వీకరింపుడు! నా శస్త్రము శనీశ్వరునిపై ప్రయోగించుట కొరకే కదా, మీరు నన్ను తెప్పించినది!

బుధుడు: రాజా! నీకీ విషయమెట్లు తెలిసినది?

దశరథుడు: సౌమ్యేంద్రా! నన్ను రోహిణి మండలమునకు చేర్చుటకు మీరు తెప్పించిన, చంద్రుని ‘హరిణ రథము’ను’ నడుపు హరిణములే నాకీ విషయము, మార్గ మధ్యమందే తెలియ జేసినవి.

నారదుడు: ఓహో! ఇప్పుడు అర్థమయినది! నీవు ‘ఋశ్యశృంగ మహర్షి’ కడ మృగ భాషను నేర్చిన వాడవు కదా! ఆథులైన ఆ హరిణములు నీకు కథ యంతయు కరతలా మలకము చేసెనందువా?

దశరథ: అవును దేవర్షీ! ద్వాదశ వర్ష క్షామము ఉత్త కల్పన మాత్రమే ననియు, రోహిణీ రక్షణమను నేపథ్యమున మీరిరువురును కలిసి, ప్రాణికోటికి ‘ శని పీడా నివారణము’ చేయు ఉపాయము కొరకు నన్నింత దూరము తెచ్చినారని తెల్సినది! పూజ్యులైన శుక్రాచార్యుల మాటల వలన ఆ విషయము ధృవ పడినది కూడ!

బుధుడు: అటులైన మా పని సులువయినది! నీకీ నిజమును తెలియ జేయుటకే మే మిటుల వచ్చితిమి.

నారదుడు: అజకుమారా! క్షామ మేర్పడు వార్త అసత్యమని తెలిసిన వెనుక, నీవు మరలి పోక, శనిని ఎదిర్చి నిల్చుటకే నిల్చితి వేల?

దశరథ: మహర్షీ! మీ అభీష్టమునకు వ్యతిరేకముగ నే నెట్లు నడువగల వాడను? శని పీడ నుండి లోకులను రక్షించుట కూడ, ప్రజాహిత కార్యమే కదా?

నారదుడు: లెస్స పలికితివి దశరథా! బుధుని బుద్ధి కుశలత, నిన్ను ఎంపిక చేయుట యందే వెల్లడియైనది కుమారా! శనీశ్వరుని గురించి నీ కంతయు తెల్సినది కదా?

దశరథ: మునీంద్రా! అంతయు తెలిసినది గాని బాంధవ్య బంధితుడు కానివాడు, కన్నీటికి కరుగని వాడూ అయిన శనీశ్వరుడు తారకల కంటినీరు చూచి వారికి ఆశ్రయ మిచ్చెనేల?

నారదుడు: దశరథా! ఈ విషయమున, శనిదేవుని ఆంతర్యము నాకును సందేహాస్పదమే! బుధా, నీవేమైన తెల్పగలవా?

బుధుడు: శనీశ్వరుని ఆంతర్యము, రోహిణీ భేదనము కాక, రోహిణీ హృదయ భేదనము అయి ఉండవచ్చునని నాకు తోచుచున్నది. అయినను శని వచ్చు వేళ సమీపించినది కదా! మనలో మనకీ గ్రుద్దులాట లేల?

నారదుడు: అవునవును సౌమ్యా! శని వచ్చు వేళ అయినది కాబోలు, రోహిణి తడబడు నడకలతో ఇటు వైపే వచ్చుచున్నది. రమ్ము! మన మిచ్చోటనుండి సత్వరము తప్పించుకొని పోవలె!

బుధుడు: అజకుమారా! నీకు అభీష్ట సిద్ధి కలుగు గాక! మేము వరల వచ్చెదము, సెలవా మరి!

నారదుడు: తథాస్తు!

(బుధ నారదులు నిష్క్రమిస్తారు)

(ప్రవేశం ::— రోహిణి)

రోహిణి: దశరథా! శనీశ్వరుడు కృత్తిక కక్ష్యను వదలి నా కక్ష్యలో ప్రవేశింప నున్నాడు. అతను వచ్చు జాడ నీకేమైన తెలిసినదా?

దశరథ: ఇంకను స్పష్టము కాలేదు.

రోహిణి: (వింగు వరకు వెళ్లి చూసి వస్తుంది) గండు చీమల బారు వంటి చలన గతి కలిగిన శని కదలికలు, ఇంత త్వరితముగా స్పష్టమవవు! (దశరథుని దగ్గరగా వచ్చి, ప్రేమతో) కుమారా! నీవు కుశలమే కదా? ఏదైనను తినుటకు, త్రాగుటకు ఇచ్చగింతువా?

(రోహిణి మాట పూర్తి కాగానే, నేపథ్యంలో భయంకరమైన సంగీతం వినిపిస్తుంది. లైట్లు ఆరి డిమ్ అవుతాయి.)

(ఒక పాశము పై నుంచి, దశరథుని మీదుగా, అతని కాళ్ల వరకు జారి, తిరిగి మీదకి వెళ్లిపోతుంది)

(తరువాత ఒక పాము దశరథుని మీద పడి, క్రింద పడిపోతుంది)

రోహిణి: దశరథా! శని నీపై యుద్ధము ప్రకటించినట్లున్నది. సంసిద్ధుడవు కావేమి?

దశరథ: తల్లీ! శత్రువు ఎంత బలవంతుడైనను, హెచ్చరిక లేకుండా, శరప్రయోగము చేయుట యుద్ధనీతి కాదు. ధర్మమూర్తియైన యమునకు అన్నయగు శనీశ్వరుడు, యుద్ధనీతి తప్పునని నేను నమ్మను.

రోహిణి: అదేమి రాజా! మరి యీ పాశ భుజంగాస్త్ర ప్రయోగము?

(తెరలో వికటాట్టహాసం వినిపిస్తుంది. ఆ వెనుక శనికి ముఖ్య సఖుడగు గుళికుని కంఠ స్వరం వినిపిస్తుంది)

గుళికుడు: (తెరలోంచి) ఓసీ! మత్త కాశినీ! రోహిణీ! నిన్ను పిలుస్తున్నాడీ శని! చాటు మాటుల నుండి బయటికి రావే కులపాంశనీ.

రోహిణి: (భయంతో) అజకుమారా! శరణు శరణు! అదుగో శని!

దశరథ: ఏ మాత్రం చలించకుండా, తల్లీ! ఇతడు శనీశ్వరుడు కాడు, ఎవరో మాయావి! నీవు భీతిల్లకుము. నేనీ మాయావిని నిముషములో పట్టి తెచ్చెదను. (అని తన వస్త్రము నుంచి ఒక నూలుపోగు తీస్తాడు. దాన్ని గురు మంత్రంతో అభిమంత్రిస్తాడు)

” గురు బ్రహ్మా, గురుర్వష్ణు, గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః

ఓరీ మాయావీ! నీకు, ఋషికుల మంతటికీ పూజ్యుడైన మా కులగురువు వశిష్ట మహర్షి ఆన! నీవు మాయా రూపమును విడిచి వత్తువా? లేక ఈ నూలు పోగుతో బంధించి సప్త సముద్రముల కావల పడవైతు మందువా?

(ప్రవేశం :: విక్రృతాకారుడైన ‘ గుళికుడు)

గుళికుడు: ఏమేమి? నన్ను బంధించి సప్త సముద్రముల కావల పడవైతువా? క్షుద్ర మానవుడా! నీ కెంత ధైర్యము?

రోహిణి: దశరథా! ఇతఢు శనీశ్వరుడు కాదు. నీ వన్నట్లు ఎవరో మాయావి!

గుళికుడు: రోహిణీ! నిన్ను పట్టి బంధించుటకు, శనీశ్వరుడు దిగి రావలెనా? దురహంకారిణీ! శనికి ఇష్ట సఖుడగు యీ గుళికుడు చాలడా? షష్ప సమానములగు యీ మానవుని శస్త్రములా, నిన్ను కాపాడునవి?

దశరథ: గుళికేశ్వరా! అల్పుడు, అథముడు అయిన మానవునిపై, అధర్మ యుద్ధము చేయబూనిన నీవు ఎంతటి వాడవో, వేరుగా చేప్పవలయునా?

(రోహిణిని పట్టుకొని పాన్పు దగ్గరకు తీసుకెళ్లి, కూరచో పెడతాడు)

దశరథ: రోహిణీ మాత నా శరణాగత. శనికి సఖులయిన మీ ఆజ్ఞ లేవియైనను మాకు శిరోధార్యములే. అయినను, అవి భయాతురిత అయిన ఆమెతో గాక, నాకు సెలవిచ్చుట ధర్మమని నా విన్నపము.

గుళికుడు: ఏమేమి! రోహిణీ మాత (వ్యంగ్యంగా) నీ శరణాగతయా? నీ వామె దూతవా? -సరి, సరి! నీతోనే మాటలాడెదము గాక! ఓరీ! దూతాథమా! విను, దేవ దేవేశుడు, గ్రహచక్రవర్తియూ నగు శనీశ్వరుడు ఈమెపై కినుక వహించి, పాశమున బంధించి తెమ్మని, నన్నంపినాడు. శని కార్యమునకు అడ్డు తగిలిన నీవును, ఆ మహత్తర పాశ బంధితుడవు కాగలవు! శని పాశ బంధన యనిన ఎట్టి బృహత్తర దండనయో నీకు తెలియునా?

దశరథ: ఎందులకు తెలియదు? శని పాశము, అతని తమ్ముడైన యము పాశముల సంగతి తెలియని మానవులెవ్వరు? ఆ పాశద్వయము, మీ వంటి భృత్యులకు బృహత్తర మగునేమో గాని, మా మనుజులకు వాటి బలము బాగుగనే తెలియును. అవి మానవ ప్రాణ తంత్రులచే చేయబడినవే కదా మరి?

గుళికుడు: ఏమంటివి? శని పాశము మనిషి ప్రేగులతో నిర్మింప బడినదా?

దశరథ: కాదందువా, గుళికేశ్వరా? కొండలను సైతము పిండి చేయగల ఇంద్రుని వజ్రాయుధము, మనుజుని వెన్నెముక! పదునాలుగు భువనము లందును ఎదురులేని విధాత, బ్రహ్మశిరోనామకాస్త్రము మానవ కపాలము! అరి ధంశనమైన శ్రీహరి సుదర్శనము, మనిషి బొంగరపు కీలు! నరుని నెన్నెదురుపై నుండు మూడు నరముల శల్యమూలము, తిరుగులేని రుద్రుని త్రిశూలము! వేయేల, అష్ట దిక్పాలకుల ఆయుధము లన్నియు మానవాస్థికలే కదా?

గుళికుడు: ఓహో, అదియా నీ వాదన! మహా తపస్సంపన్ను డయిన, దథీచి మహర్షి కంకాళమే సురుల అస్త్రాగారమన్నమాట నిజమయినను, దథీచి మానవుడయినంత మాత్రమైన మీరందరును గొప్ప వారగుదురా?

దశరథ: సుర శబ్ద వాచ్యము చేత సురులందరును పూజనీయులేనా? మహోన్నతులైన మహితాత్ములు, సురాసుర మానవ తిర్యగ్ స్థావరములయందు లేరా? బలి ప్రహ్లాదులు రాక్షసుల యందును, దథీచి, గౌతమ, భగీరధ, రఘు, దిలీపులు మానవుల యందును, మేరు హిమ వింద్యాచలములు, పారిజాత, కల్పవృక్షములు స్థావరముల యందును, సురభి, నందినులు ధేనువులయందును, శేష వాసుకులు పన్నగముల యందును శ్రేష్టులు కారా? జాత్యుపజాతులు, వర్జ విశేషములు అన్నియు పరమాత్మ లీలా సంకల్పము లయినప్పుడు, ఒకరి ఎక్కువ, ఇంకొకరి తక్కువ ఎక్కడ నున్నవి?

గుళికుడు: బాగు, బాగు, దశరథా! నీ వాదన బాగుగనే యున్నది! నీ చూపును చంద్రుడు, ధనస్సును కుజుడు, బుద్ధిని బుధుడు, శరీరమును శుక్రుడు, మహా భుజంగ గరళ నిగళ మగుట నుండి, రాహుకేతువులూ కాపాడు చుండుట బట్టి, ప్రగల్భములు పలుకు చున్నావు! ఇందు నీ గొప్పతన మేమున్నది?

దశరథ: అత్యంత బలహీనుడు కూడ, గొప్పవారి ఆశ్రయ లాభము పొంది అద్భుతములు చేయగలడు. దూదిపింజల వంటి మేఘములు, వరుణుని ఆశ్రయము చేత, జలధరములై మెరుపులను ఉరుములను సృష్టించుట లేదా?

గుళికుడు: నీవు యుద్ధము చేయుమాట ఎటులున్నను పండితులతో వాగ్వాదములు మాత్రము చేయగలవు. ఈ వాదనలకు నా కంత వ్యవధి లేదు. రోహిణిని నాకు అప్పగించి పొమ్ము!

దశరథ: మన్నింపుడు మహానుభావా! రోహిణీ నక్షత్రము ప్రజాహితము కొరకు నిర్మింపబడినది, శని రోహిణీ మండలముల తాకిడికి, భూమి యందు పన్నెండేళ్ల దుర్భిక్షము సంభవించి ప్రజలు పెక్కు ఇక్కట్ల పాలగుదురు! గనుక రోహిణిని విడుచుట జరగని పని!

గుళికుడు: రాజా! ప్రజారక్షణ నీ కెట్టి కర్తవ్యమో, ప్రజాపీడన శని కట్టి కర్తవ్యము! రోహిణీ పీడనము వలన, భూలోకమున క్షామము సంభవించు నెడల, అది అతనికి సమ్మతమే యగును.

దశరథ: అయన భువి యందలి జీవులకు మరి తరుణోపాయమే లేదా?

గుళికుడు: శనికి సమ్మతమైనచో లేనట్లే!

దశరథ: అహంకార మర్దనుడు, పరిశుద్ధుడు అయిన శనిదేవుడు, ఇట్టి పాప కృత్యము తలపెట్టుట తగునా?

గుళికుడు: శనికి కార్యముతోనే గాని, కారణములు ఫలితములతో సంబంధము లేదు. పాపఫుణ్యములు అతనిని అంటవు. నీతి న్యాయములు అత నెరుగడు!

దశరథ: మీ సఖుడు, కన్నీటికి కూడ కరుగడా?

గుళికుడు: (ఫకాలున నవ్వి) ఏమంటివి? కన్నీరా? శనికి, యమునకు, మృత్య దేవతకు అవి పన్నీటితో సమానము.

దశరథ: గుళికేశ్వరా! అయిన నా నిర్ణయము కూడ వినుము. నన్ను చంపిన నాడే, మీరు రోహిణిని తాకగలరు.

గుళికుడు: రాజా! నీవకాల మృత్యువును ఆహ్వానించు చున్నావు!

దశరథ: మీ కెందులకా చింత గుళికేశ్వరా? మీకు కార్యముతోనే గాని, కార్యముతో సంబంధము లేదు గదా?

గుళికుడు: అవును, కాని నిన్ను చంపుటకు నిమిత్తము కావలె! అది యముని పని!

దశరథ: రోహిణీ పీడనమునకు అట్టి కారణము కలదా గుళికేశ్వరా?

గుళికుడు: ఈ మత్తకాశిని మాత్సర్య గుణముతో, సవతులకు పతీ వియోగము కల్గించినది.

దశరథ: అయిన నేమయినది గుళికేశ్వరా! ఈమె పరపీడన యందు పరోక్షముగా మీకు సహాయమే చేసినది తన రెండు కనుల నుంచి కారు కన్నీరు, మీకు పన్నీటి జల్లు కాజాలదని ఎంచి, తన సవతు లందరి చేత ఏడ్పించినది! శిక్షించుట తప్ప రక్షించుట మీ కర్తవ్యము కానప్పుడు, తక్కిన చుక్కలను సమర్థించుటేల?

గుళికుడు: (అప్రతిభుడయి) దశరథా! నీ వాదన యుక్తి యుక్తముగనే యున్నది! శనిదేవుడు తన కర్తవ్య నిర్వహణలో తప్పటడుగు వేసెనేల! సరి, ఈ విషయము శని కెరిగించి, రోహిణీ భేదన కార్యము స్వయముగా నిర్వర్తించుకోమని చెప్పెదను గాక! (వెళ్ళిపోతాడు)

రోహిణి: దశరథా! వికృతాకారుడు, భయంకరుడు అయిన గుళికుని నీవు మాటలతోనే మరల్చినావు. ఇది నీ విజయమునకు తొలి మెట్టు.!

దశరథ: తల్లీ! ఆకారములు, చేష్టలు వికృతములయినంత మాత్రమున, మనో వ్యాపారములు వికృతములనుట పొరపాటు! గుళికు డెంతటి భయంకరుడైనను న్యాయమును అభిలషించు వాడని, వెల్లడి అయినది కదా! ఎందరో సుందరాకారులు కపట మానసు లగుట నేను ఎరుగుదును.

రోహిణి: రాజా! నీ మాటలలో శ్లేష ధ్వనించు చున్నది. నేను నా సవతులతో ప్రవర్తించిన విధము వికృతము, భయంకరము అందువా?

దశరథ: తల్లీ! నా మాటల వెనుక నీ కట్టి యర్థము స్ఫరించిన యెడల నన్ను క్షమించుము. తల్లి, తండ్రుల వర్తనమును విమర్శించు అధికారము తనయునకు లేదు! (దశరథుని మాటలు పూర్తవగానే, తెరపై నీలి రంగు వెలుగు పడుతుంది, స్టేజంతా నీలం అయిపోతుంది)

రోహిణి: దశరథా! ఇదుగో శని తేజము! శని వచ్చుచున్నాడు. సంసిద్ధుడవు కమ్ము!

దశరథ: (చూసి) అవును, శని దేవుడు ప్రవేశింప నున్నాడు. తల్లీ! సామమున పని చక్కబెట్టు కొనుట ఎంతయు శ్రేయోదాయకము! ఎదురు రాబోవు దివ్య పురుషునకు స్వాగతము చెప్పెదము! ఏమందువు?

రోహిణి: కుమారా! నీ యెడల నాకు విశ్వాసము ఏర్పడినది! నీవు చెప్పినట్లే చేసెదను.

దశరథుడు: తల్లీ! త్వర పడుము! (స్తోత్రము)
ఇద్దరూ:

ఇంద్ర నీల ద్యుతి శూలీ, వరదో గృధ్ర వాహనః
బాణ బాణాసన, ధర్మ స్కర్త వ్యోర్కస్సుత సద
ప్రణమ్య దేవ దేవేశం, సర్వ గ్రహ దోష నివారణం
శనీశ్వరస్చ శాంతస్య, చింతయామసి పార్థివః

(శని మంద మంద గతితో కుంటు కుంటూ ప్రవేశిస్తాడు.)

ఇద్దరూ: (నమస్కరించి) స్వాగతం, శనీశ్వరా! సుస్వాగతం!!

శని: దశరథా! నన్నెదిర్చి నిల్చుటకు వచ్చినవాడివి శరములకు బదులు నమస్కారములు సేయనేల! ముందరి కాళ్లకు బంధములు వేయుటకా?

దశరథ: సూర్యపుత్రా! నీ కాలికి బంధములు వేయుటకు గాని, నీ పై శర ప్రయోగము చేయుటకు గాని, నాకు సామర్యమెక్కడిది? దేవాసురులను, నరులు, యక్ష, కిన్నెర, కింపురుషులు సిద్ధ, సాధ్య చారణులు, ఎవరైనను నీ చూపు పడినంత మాత్రమున భస్మమవుదురు! నే నింకను నిలిచి యుంటినేని..

శని: నా తండ్రి యగు సూర్యుడు, నీ జన్మకొక మహత్తర ప్రయోజన మున్నదని తెలియ జేయుట వలన నీ వింకను నిలువ గల్గితివి. (పద్యము)
చం-

కలదొక కారణమ్ము నిను గాల్చక ప్రాణము నిల్పి యుంచ, నీ
వలననె నుద్భవంబగును ప్రాభవ శీలుఁడు, రామచంద్రుఁడున్
కలగదు క్షామ మెన్నటికి గ్రచ్చర రోహిణి పీడనంబుచే
తెలియుము సత్య మియ్యెదయె తేల్చి వచించితి రాజ సత్తమా!
తొలగుము దారి వీడుచును, తొయ్యలినియ్యెడ నుంచి పొమ్మికన్!

రోహిణీ పీడనము వలన, దుర్భిక్షము సంభవించు ననునది అసత్యమని తెలుసుకొన్నావు కదా! నాతో నీ వైరమున కిక కారణము లేదు. ఆమె నిచట విడిచి, నీవు మరలి పొమ్ము!

దశరథ: శనిదేవా! అసాధ్యడవు, అజేయుడవు! అయిన నీతో వైరము నా కేల! నిల్చియే మాటలాడుచున్నావు, ఆ ఆసనము నలంకరించి మమ్ము కృతార్థులము చేయుము. (పద్యము)
గీ

నీ వజేయుండ వెందును నిక్కముగ
వైరమేటికి నీ తోడ వీర వర్య!
నిలిచి యుండుచు మాటలాడ నీ కదేల
కూరుచుండుము నియ్యెడ కూర్మితోడ!

శని: నన్ను పొమ్ము, పొమ్ము అనువారే గాని, రమ్మని పిలిచి ఆసనము చూపించిన వాడవు, నీవే కన్పట్టినావు! అయినను ఇది రోహిణి పాన్పు! నీ వేమందువు రోహిణీ! యీ అజకుమారుడు నన్ను నీ శయ్యపై కూర్చొనుమనుచున్నాడు! నీకు సమ్మతమేనా?

రోహిణి: శనీశ్వరా! అతఢు అజకుమారుడే కాదు, నాకును కుమారుడే! నీవు సంశయింపక ఆసీనుడువు కమ్ము!

శని: సరి సరి! నీవు కూర్చొన మన్నావు గనుక, ఈ శయ్యపై. నీ శయ్యపై (శయ్య అనే పదాన్ని వెరైటీ మాడ్యులేషన్ తో) కూర్చొంటిని. (కూర్చొంటాడు) దశరథా! నన్నీ రోహిణి శయ్యపై ఆసీనుని చేసి, నీ వివేకమును చూపించినావు! ఇక నీవు పోవచ్చును.

దశరథ: అనుజ్ఞ నిమ్ము యమాగ్రజా! నాతో పాటు, నా తల్లిని కూడ తీసుకొని పోయెదను!

శని: దశరథా! మరల నీవు మొదటికే వచ్చుచున్నావు! రోహిణీ భేదనము చేసెదనని నేను ప్రజాపతికి మాట ఇచ్చితిని.

దశరథ: శౌరీ! రోహిణీ రక్షణము చేసెదనని నేను ప్రజలకు మాట ఇచ్చినాడను.

శని: నీవు నీ ప్రజల కిచ్చిన మాట, క్షామముతో ముడిపడినది! ఇప్పుడది జరుగదు గావున, నీ విచ్చిన మాట చెల్లినట్లే!

దశరథ: దేవా! నీవు ప్రజాపతి కిచ్చిన మాట, అశ్విన్యాది తారకలతో చంద్రుని సామరస్యమునకు సంబంధించినది! ఆ సామరస్యము జరగనున్నది గావున నీ మాట కూడ చెల్లినట్లే!

(రోహిణి ఆశ్చర్యంతో దశరథుని వంక చూస్తుంది)

శని: దశరథా! నీవు నీ మాటల మాయాజాలమున నన్ను మభ్యపెట్టుచున్నావు. రోహిణికి, తక్కిన తారలతో సంధి కుదరనున్నదా? రోహిణీ నీవు మాట్లాడవేమి?

రోహిణి: కుమారా! నీ మాట నాకును మాయాజాలము వలెనే కన్పట్థు చున్నది. మనమధ్య అట్టి సామరస్యమునకు చర్చ జరగనే లేదే?

దశరథ: తల్లీ! ఇది వరకు జరగని మాట నిజము. ఇప్పుడు జరగ నున్నది. రోజుకొక చుక్కతో, చంద్రుని సమాగమమే నేను నిన్ను కోరెడి వరము! తీర్చలేవా తల్లీ?

(రోహిణి కొయ్యబారి పోతుంది)

శని: (నవ్వుతూ) రోహిణీ! వింటివి కదా, యీతని దుస్సాహస పూరిత ప్రస్తావము! ఈ రాజన్యుని ప్రజాహిత చింతకు, స్వార్థ త్యాగ నిరతికి నీవును, సౌమ్యుడును పెట్టిన అగ్ని పరీక్ష వంటిదే, అతడు నీకు పెట్టినాడు. వరము నిత్తువా, లేక చత్తువా?

(రోహిణి మాట్లాడదు)

దశరథ: తల్లీ! నీవు వరము నిచ్చినను, మానినను, నేను ఆడిన మాట తప్పను! నా శరమును శని పైననే కాదు, రుద్రునిపై కూడా సంధించి నిన్ను కాపాఢెదను.

రోహిణి: దశరథా! నీవు.. నీవు నన్ను ధర్మ సంకటమున పడవైచినావు. ఆలోచించుటకు నాకు సమయము కావలె.

శని: ఆలోచించుటకు వ్యవధిని, ఈ అజకుమారునికి మీరిచ్చినారా రోహిణీ? చుక్కలతో సంధికి ఇచ్చగింతువా.. సంతోషము! లేకున్న, సర్వనాశనము!! నీ మండలమున ఆశీనుడనైన నేను నిన్ను విడువను కాక విడువను.

దశరథ: తల్లీ! వరము నిత్తువా, లేక శరము నెత్తుమందువా? త్వరగా సెలవీయుము!

రోహిణి: (జనాంతికముగా) ఈశ్వరునికే చిత్త చాంచల్యము కలుగ జేయగల యీ శని, దశరథుని బుద్ధిని ఆకట్టుకొన్నాడు. ప్రయత్నమంతయు బూడిదలో పోసిన పన్నీరయినది! (ప్రకాశముగా) దశరథా! సమయము ప్రతికూల మైనప్పుడు సంధి సామరస్యములు దక్క, వేరు దిక్కేమున్నది! నీవు కోరినట్లే నా నాథుని శయ్యను, రోజుకొక సపత్నితో పంచుకొనుటకు సంసిద్ధురాల నైతిని. నా శయ్యపై కూర్చొన్న యీ శనిని సత్వరము లేచి పొమ్మని చెప్పుము.

దశరథ: మాతా! ధన్యడనయితిని! నీ నిశ్చయము, నా విజయమునకు చివరి మెట్టయినను, శనిని లేపుట నా తరమా? ప్రయత్నించి చూచెదను, (శనితో) రవి నందనా! నీ వంటి సుందరాకారులు, శయనించ దగిన శయ్య కాదిది. దేవదేవా, లేచి రమ్ము!

శని: ఏమన్నావు రాజా! నేను సుందరాకారుడనా? నా ముఖము కోతివలె వికృతము, శరీరము భల్లూకము వలె రోమ భూయిష్టము! చర్మము అర్థ దగ్థమై మసిబారిన కలుషితము! ఆసనమా, కర్కశ గృధ్ర తూలికా తల్పము! దశరథా, నా కీ హంస తూలికా తల్పము నచ్చినదయ్యా!

దశరథ: శనీశ్వరా! జీవుల అహంకారమునకు నిన్ను చేరుట చేత నీవు కురూపు డయితివి గాని, నీ హృదయ సౌందర్యము చెప్ప నలవి కానిది గదా! అది కోర్కెలకు అంక పీఠమగు పాన్పు. శనిదేవా! నీవు కూర్చొనుటకు తగినది కాదు.

రోహిణి: శనీశ్వరా! నీవు నా శయ్యపై కూర్చొన్నంతనే, ‘నా శయ్యా సౌఖ్యము’, ఇరువది ఆరు రోజుల ఎడమైనది! ఇక విశ్రమించితివేని, నేను సన్యాసము స్వీకరింపవలె! నన్ననుగ్రహించి పాన్పు దిగి రమ్ము!

శని: మీరెంత చెప్పినను, నే నీ శయ్యను వదలను! వదలను!!

(శని శయ్యపై గెంతి, వికృత చేష్టలు చేస్తాడు)

(రోహిణీ దశరథులు ఒకరి ముఖాలొకరు చూసుకొంటారు)

(శని స్తోత్రమునకు వచన రూపము)

దశరథ:

ఓ నల్లని శరీరము కలవాడా!
ఈశ్వరుని యొక్క కాంతి వంటి కాంతి కలవాడా!
శరీర మందంతటను, స్థూలమైన రోమములు గల యో శనీశ్వరా
నీకు నమస్కారము !

రోహిణి:

ఇంద్ర నీల మాణిక్యము వలె నల్లనైన కంఠ ప్రదేశము కలవాడా!
ఎల్లప్పుడును ఆకలిచే పీడింపబడెడి వాడా!
ఎంత చేసినను తృప్తిలేని యో శనీశ్వరా
నీకు నమస్కారము!

దశరథ:

ప్రళయాగ్ని వలె భయంకరమైన స్వరూపము గలవాడా!
యముని వలె మిక్కిలి ఘోరమైన వాడా!
విశేషమైన కోప స్వభావము కలవాడా!
కాంతుల యొక్క సముదాయుడవైన యో శనీశ్వరా
నీకు నమస్కారము! !

రోహిణి:

సమస్తమును భక్షించువాడా!
కోతి యొక్క ముఖము కలవాడా!
యో శనీశ్వరా
నీకు నమస్కారము! !

దశరథ:

దివ్యజ్ఞానము కలవాడా!
కశ్యప మహర్షి మనుమడా!
సంతోషించిన యెడల రాజ్యము లేని వారికి సైతము రాజ్యము నివ్వ గల సమర్థుడా!
కోపించిన యెడల రాజ్యములను సైతము హరించు వాడా!
యో శనీశ్వరా
నీకు నమస్కారము! !

రోహిణి:

ఓ శనీశ్వరా!
దేవేంద్రాది దేవతులు, సప్త మహర్షులు, నక్షత్రములు,
నీవు చూచినంత మాత్రమున స్థాన భ్రష్థులగుచున్నారు!
అట్టి యో శనీశ్వరా
నీకు నమస్కారము! !

దశరథ:

ఓ శనీశ్వరా!
దేశములు, నగరములు, గ్రామములు, ద్వీపములు, నదులు, వృక్షములు, లతలు,
నీచే చూడబడినంత మాత్రమున నశింపుచున్నవి!
అట్టి యో శనీశ్వరా
నీకు నమస్కారము! !

రోహిణి: ఓ గ్రహ రాజా! నన్ననుగ్రహించి నా గద్దె దిగుము.

దశరథ: ఓ గ్రహేశ్వరా! నన్ననుగ్రహించుము. నేను వరములను కోరుచున్నాను.

శని: (గద్దె దిగి) రోహిణీ! నీ గద్దె దిగడమే కాక, ఇంకెప్పుడును నిన్ను పీడింపనని వాగ్దానము చేయుచున్నాను! (దశరథునితో) దశరథా! నీ స్తోత్రము నాకు సంతోషము కలిగించినది.! నీకు ఎట్టి వరములు కావలయునో చెప్పుము.

దశరథ: ఓ సూర్యపుత్రా! ఇది మొదలు దేవాసురులకు గాని, మనష్యులకు గాని, పశు పక్షి మృగాదులకు గాని, పీడింపక పోవుటయే నాకు ఇష్టమైన వరము! ఆ వరమును అనుగ్రహింపుము! !

శని: ఓ రాజా! గ్రహములనగా పట్టుకొనునవి అర్థము! అవి జీవుల కర్మ పరిపాకముల ననుసరించి, బాధలను కలుగ జేయుచుండును. కనుక నీవు కోరిన వరము నిచ్చుటకు వీలు కాదు

ధశరథ: (మోకరిల్లి) శనీశ్వరా! నేనడిగిన వరమిచ్చునంత వరకు నీ చరణములు వదలను! ” ”
కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిః శనీశ్వరో మందః పిప్పలాదేన సంస్తుతః
దేవా! రవినందనా! నన్ను అనుగ్రహింపుము! ! అంత దనుక నీ నామములు స్మరించుట మానను! !

( ప్రవేశం :: బుధ నారదులు)

బుధ, నారదులు: శనీశ్వరా! అజ కుమారుని అభీష్టము మాకును ఇష్టము! !!

నీలాంజనాభం మిహిరేష్ట పుత్రం, గ్రహేశ్వరం
పాశ భుజంగ పాణిం! సురా సురాణాం భయదం
ద్విబాహుం స్మరే శనిం మానస పంకేజహం!

శని: ఓ దశరథ మహారాజా! నీచే చేయబడిన యీ నా స్తోత్రమును, ఏ దేవాసుర మానవాదులు ప్రతిదినము, పఠించెదరో వారికి నా వలన ఎట్టి పీడయు కలుగదు. (పద్యము)
సీ

ఎవ్వారు నీ చేయు స్తవ రాజమ్ము దీక్షతో పఠియింత్రు దిన దినమ్ము
నరులైన సురులైన నక్తంచరులయున వారిని నే పట్టి బాధ పెట్ట
గోచారమందున, కుజుఁడష్ట మందున్న యేల్నాటి శని నైన, యెట్టి దశల
జన్మ లగ్నంబందు చరమ సీమయందును అంతర దశ నైన యన్ని దశల

గీ

రవియు గురుఁడును కేతువు రాహువైన
శుక్రుఁడు బుధుడైన చివరకు సోముడైన
కుజుఁడు వీరలెవ్వరి చేతఁ కీధు గల్గ
రక్షణమ్మొనరింతు నే తక్షణమ్ము! !

బుధుడు: అజకుమారా! లెమ్ము.! నీవు దన్య చరితుడవైతివి.! నీ వలన లోకులకు శని పీడా నివారణోపాయము తెలిసినది! (నారదునితో) దేవర్షీ! ఇక నీ ఉపాయమును సమస్త ప్రాణికోటికి తెలియ జేయవలె!
నారదుడు:

పతితులారా, భ్రష్టులారా!
బాధా సర్ప దష్టులారా!
సకల పీడా కష్ట హారము
సర్వ మంగళ శుభ ప్రదము
దశరథ కృత శని స్తవము
పఠన పాఠన మాచరించండి

బుధుడు:

శని వాసర శుభ్ర వేళ
లోహ నిర్మిత శని ప్రతిమను
జమ్మి పూలతో పూజ చేయండి
కపిల ధేనువు దాన మీయండి.
వెతలు బాపే విధము తెలియండి!

(చంద్రుడు, దక్ష ప్రజాపతి, గుళికుడు, ప్రవేశిస్తారు)

(అందరూ నమస్కార భంగిమలోను, శని అభయముద్ర లోను స్టిల్ లో ఉండగా తెర వెనుక నుండి శని స్తోత్రం వినిపిస్తూ ఉండగా.. తెర)

(సమాప్తము)

This entry was posted in కథ and tagged . Bookmark the permalink.

One Response to నీల గ్రహ నిదానము – 3

  1. సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో “జాతీయ స్థాయి పద్య, గేయ, నాటక రచనల” పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము. వివరాలకోసం దయచే http://www.cpbrown.org చూడండి

Comments are closed.