చైత్రము కవితాంజలి – 6

కవి సమ్మేళనం చివరి  భాగంలో మరిన్ని కవితలు..

———————-

 

తోడున్న ఒంటరి

-రవి వీరెల్లి

 

నిండుకుంటున్న మేఘాలు
నింగికి తోడుగా ఎంతసేపుంటాయి
పచ్చతనంతో మురిసిపోతున్న చెట్టుకు
రంగులుమార్చే ఆకులు ఎన్నాళ్లుంటాయి?

ఆత్మకు ఆశ్రయమిచ్చిన శరీరం
ఆశలకు ఆయువుపోస్తూ ఇంకా ఎన్నేల్లుంటుంది?

ఒంటరితనం తప్పదు.

నువులేని నా జీవితానికో తోడు వెతుక్కున్నా…

రోజంతా ఎడతెరిపి లేకుండా కురుస్తూ
నీ తలపుల్ని తడిఆరనీకుండా చేస్తూ
ఏడిపిస్తునే నవ్విస్తూ
బ్రతికిస్తూనే చంపేస్తు
నన్ను నడిపిస్తున్న నీ జ్ఞాపకాల తోడు.

ఓ ఒంటరితనమా
వెతుక్కో
ఇంకో మేఘంలేని ఆకాశాన్ని
ఇంకో మోడువారిన చెట్టును.


 

వసంతగానం

-కెక్యూబ్ వర్మ

 

శిశిరంలో కప్పుకున్న
మంచుదుప్పటి
తెరలను విదుల్చుకొని
ఎండిన మోడులన్నీ
లేలేత చివుళ్ళతో
ఎఱెఱని
చిగురాశల పూతతో
గాయపడ్డ
హృదయాలను
స్వాంతన పరుస్తూ
ఓ వెదురుపూల వనం
చల్లని వేణు గానాలాపనతో
కువ కువల
రాగంతో
వసంతాన్ని
దేహమంతా చేతులై
ఆహ్వానిస్తూ…

మొదటి అడుగు

-స్వాతీ శ్రీపాద

అదిగో ఆ కొమ్మన చివురాకు తలల ఆహ్వానం
ఇదిగో ఈ రెమ్మ వెనుక కొత్త పూల మృదుగానం
కోయిలమ్మ గుండెలోన కోటికలల మెరుపు జల్లు
అదేనా అదేనా వసంతానికి పరచిన రంగుటలల  ఆహ్వానం.

గాలి కదలిక వేణువై తొలి ప్రేమ గీతిక రాగమై
మావి చిగురు కు మచ్చికై పెదవికదిపే చిరుగానమై
పల్లవించే పరవశించే వెలు గు వాకల వెన్నెలల కనులై
కదలివచ్చే కావ్యకన్యక      చైత్ర మాసపు సౌందర్య రాశిగ

 

అస్త్ర సన్యాసం

-స్వాతీ శ్రీపాద

 

ఋతువులు విసుగెత్తిపోయాయి
ఎంత ఠంచనుగా ఆగమన నిష్క్రమణలను పాఠిద్దామన్నా
ఎదురౌవుతున్న ఆటంకాలకు వశమై
గాడితప్పి దారిదొరక్క
తిరిగిన చోటే తిరుగుతూ
అలసి సొలసి సేద దీర్చుకుంటున్న

ఋతువులు విసుగెత్తిపోయాయి
ఆహ్వానించని అతిధుల్లా
అకాల వర్షాలు
ఆహ్వానమే అవసరం లేని చొరబాటుదార్లుగా
వరదలూ ముంపులూ
శీతలం వేడెక్కితే
వేసవి బాధను వర్షిస్తూ
గ్రీష్మం గాఢ నిద్రలో పలవరిస్తూ
చైత్రం తెల్లబోయి ఆలోచిస్తోంది
"తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక"లా
ఏ వైపుకు సాగాలని.

——————————-

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.