ఉగాది వచన కవిసమ్మేళనపు ఈ భాగంలో కవులు తమ కొత్త కవితలను సమర్పించారు.
———————————————
మళ్ళీ నువ్వే
-మూలా సుబ్రహ్మణ్యం
కేవలం నీ చూపు సోకే
నేనో నదినై ప్రవహించాను
దిగంతాల్లో వెలిగే నక్షత్రాల్ని
నా లోతుల్లోకి ఆహ్వానించాను
జలపాతాన్నై
అగాధాల లోతుల్ని
అన్వేషించాను
నా అస్తిత్వాన్ని రూపు మాపేందుకు
అల్లంత దూరంలో
అంతులేని సముద్రానివై
మళ్ళీ నువ్వే!
———————-
కొలిమి
-పెరుగు.రామకృష్ణ
గుండె కొలిమి
జ్ఞాపకాలతో మండుతుంది..
క్షణ క్షణం గాయపు ఊపిరితిత్తులతో
కలల్ని పండిచుకున్న మనిషిలా..
పిట్టలేగిరిపోయి చెట్టు మాత్రమే మిగిలింది
వలసబోయిన పేగు బంధం
ఎడారిలో వచ్చిపోయే వసంతంలా …
మనుషులందరూ
కాలం తీర్చిన యంత్రాలయ్యాక
విలువలన్నీ తెరలమీదనే ఆవిష్కరణ…
బతుకు చారికల చరిత్రతో ..
ముడుతలు పడిన ముఖంతో
ఒక సాయం సంధ్యా సమయాన
తీరం వదలి సముద్రంలోకి వెళ్తున్న
ఏకాకి నౌకలా నేను..
(తిలక్ కవితలోని "తీరం వదిలి సముద్రంలోకి వెళ్తున్న ఏకాకి నౌక" పంక్తి ప్రేరణతో రాసిన కవిత)
———————————
శిశిర హేల
-స్వాతీ శ్రీపాద
నిస్సహాయంగా ఆశల హరితపత్రాలు
తలవాల్చుకు సెలవంటూ వెళ్ళిపోతున్నవేళ
పాలిపోయిన వాటి చెక్కిళ్ళలో
మారుతున్న ఉదయారుణిమలూ సాయం సంధ్యలూ
నక్షత్రాల చిరుజల్లుల లేత పచ్చని వెలుగులూ
ఒకదని వెనక ఒకటి రంగులరాట్నం పరుగుల వేటలోలా
క్షణం ఆగని ఊసరవెల్లి ఇంద్రధనుసులై
వెళ్లలేక ఆగలేక అయిష్టంగా
కొమ్మల చివరల వేళ్ళాడుతూ
మరోదారిలేక
అస్థి పంజరంలా చెట్టు ఆకు పిల్లల్ను
గాలి కరవాలాలకు బలిచ్చి
కొత్త చివుళ్ళకై
ఊపిరి పోసుకుంటూ
రేపటి వసంతానికై
నిరీక్షణలో ………….