రోజూ సాయంత్రం రామకృష్ణా బీచ్ కు వెళ్ళి…అగాధం లోంచి పడిలేస్తూ ఒడ్డుకు చేరాలని విక్రమార్కుడి సంతతిలా పట్టు విడవకుండా ఆరాటపడే కడలి తరంగాలను ఆసక్తిగా తిలకిస్తూ, సముద్రుడు నిశాకాంత ఒడిలో ఒరిగిపోయేంతవరకు గడపి రావడం అలవాటు నాకు. ఆ రోజూ అలాగే బీచ్ లో కూర్చున్నాను, చల్లటి గాలి సేదదీర్చుతూంటే.
అప్పుడే పడింది నా దృష్టి విరజ మీద. అక్కడకు ఎప్పుడు వచ్చిందో…ఎందుకు వచ్చిందో!
పరీక్షగా చూసాను ఆమె వంక… మునుపటికంటె మరింతగా నిగ్గుదేరినట్లనిపించింది ఆమె అందం. అణువణువునా లావణ్యం ఉట్టిపడుతోంది. పక్కనున్న యువకుడు ఆమె భర్తో, ప్రియుడో…అతని పైకి వాలిపోయి కూర్చుంది. గలగల నవ్వుతూ అతనితో మాట్లాడుతోంది. ఆమె నన్ను చూసినట్టు లేదు.
రెండేళ్ళ తరువాత హఠాత్తుగా విరజను అక్కడ చూసేసరికి నా మనసు గొప్ప భావోద్రేకానికి గురయింది. నిర్మల తటాకంలో రాయి విసిరినట్టయింది. ఇక అక్కడ కూర్చోబుద్ధి కాలేదు. కలత చెందిన మనసుతో లేచి రోడ్ వైపు నడక ఆరంభించాను. ఆలోచనాభారంతో ఇసుకలో అడుగులు కూరుకుపోతున్నాయి…
కోల్ కత్తా లోని ఓ ఫర్మ్ లో నేను పనిచేస్తూన్న రోజులవి. అప్పుడే విరజతో పరిచయమైంది నాకు. తెలుగు పిల్ల. అదే కంపెనీలో పనిచేసేది. నేను తెలుగువాణ్ణని తెలిసి తనంతట తానుగా వచ్చి పరిచయం చేసుకుంది. బాల్యం నుంచీ ప్రేమాభిమానాలకు దూరంగా ఉన్న నాకు ఆమెతో స్నేహం ఎడారి పయనంలో నీటి చెలమే అయింది. కొద్ది రోజులలోనే మా స్నేహం ప్రేమగా మారింది.
జీవితంలో మొదటిసారిగా నన్ను నన్నుగా ఇష్టపడి ప్రేమించిన తొలి యువతే కాదు, మొదటి వ్యక్తి కూడాను ఆమె. అహర్నిశలూ ఆమె తలపులే నా మది తలుపులను తట్టేవి. ఇద్దరమూ పెళ్ళి చేసుకోవాలనుకున్నాం… పెళ్ళికి ముందు నా జీవితపు పుటలను ఆమె ముందు తెరవాలనిపించింది.
నేను చెప్పిందంతా శ్రద్ధగా ఆలకించిం దామె. ఆ తరువాత నన్ను తప్పించుకు తిరగ నారంభించింది! ఓ రోజున నిలదీస్తే ఆమె ఇచ్చిన జవాబు నన్ను నిర్ఘాంతపరచింది… ’నేను కాంప్రమైజ్ ఐనా…ఓ అనాథను అల్లుడిగా చేసుకునే పెద్దమనసు నా పెద్దలకు లేదు. సారీ!’ అంది నిర్మొహమాటంగా.
జీవితంలో తొలిసారిగా నాకు ప్రేమ మాధుర్యాన్ని చవిచూపిన స్త్రీ, జీవితం పట్ల ఆసక్తిని కలిగించిన యువతి – అలా, ఎంత హఠాత్తుగా ప్రవేశించిందో అంత హఠాత్తుగానూ నిష్క్రమించడంతో…నా మనసు తీవ్రంగా గాయపడింది. ఇక అక్కడ ఉండలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసి విశాఖపట్టణం చేరుకున్నాను. ఓ ప్రైవేట్ కాలేజ్ లో లెక్చరర్ గా చేరాను…
కాలం గొప్ప ధన్వంతరి. గుండె గాయాలు మానినా, మచ్చలు మాత్రం మిగిలిపోయాయి. క్రమంగా విరజను నా మది కేన్వాస్ నుంచి చెరిపేసాను.
మళ్ళీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె కంట పడడంతో…తుంటరి కుర్రాడు తేనెపట్టు మీద రాయి విసిరినట్టయింది. జ్ఞాపకాల తేనెటీగలు రొద చేస్తూ నా మదిని కుట్టసాగాయి. గాయం రేగింది…ఆ బాధ భరించలేక జీవితంలో మొదటిసారిగా బార్ లో అడుగు పెట్టాను.
’ఈ జగమంత కుటుంబం నాది…
ఏకాకి జీవితం నాది…’
– రేడియో లోంచి పాట వినవస్తోంది. నాకెంతో ఇష్టమైన పాట అది. నా గురించే రాసినట్లనిపిస్తుంటుంది… నాకు అందరూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి. కాని, ఏకాకిలా మిగిలిపోయాను! ప్రేమార్తినై…ప్రేమించే మనుషుల కోసం, ప్రేమకు స్పందించే మనసుల కోసం అహర్నిశలూ తపన…ఆరాటం…
నా జ్ఞాపకాలలాగే మందు కూడా చేదుగా ఉంది. మందు ప్రభావం తలకు ఎక్కుతూంటే – గతం ఓ పీడకలలా మదిలో కరాళ నృత్యం ఆరంభించింది…
#
మనుషులలో ’అహం’ ఎంతటి విధ్వంసానికి కారకమౌతుందో తెలపడానికి నా జీవితమే ఓ ఉదాహరణ. పెద్దల ఆశీస్సులతో ఇష్టపడి పెళ్ళాడిన అమ్మ, నాన్నల నడుమ ’అహం’ భగ్గుమంది. వివాహ వ్యవస్థలో ఉడుంపట్టు కూడదనీ, పట్టు విడుపులు తప్పవనీ అంటారు. కాని, నా తల్లిదండ్రులు ఆ సూత్రానికి తిలోదకాలు ఇచ్చిన కారణంగా…ఇద్దరూ వేర్వేరు దారులను వెదుక్కున్నారు.
నాన్న ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్. కాని, ఓ ఫెయిల్డ్ హస్బెండ్. అదే అమ్మ, నాన్నల మధ్య ఫ్రిక్షన్ కు హేతువయింది. ఎవరి అహాన్ని వారు ఎరువు వేసి మరీ పెంచి పోషించుకున్నారే తప్ప, కాంప్రమైజ్ అన్న పదాన్ని తమ సంసార నిఘంటువులో చేర్చుకోలేకపోయారు. భార్యాభర్తలనే సున్నితపు బంధం పుటుక్కున తెగిపోయింది.
రెండేళ్ళు కూడా నిండని కన్న కొడుకు సైతం తనకు వద్దనుకుని వెళ్ళిపోయింది అమ్మ. కట్టుకున్న భర్త కంటె, కన్న కొడుకు కంటె తన అహం, అభిజాత్యాలే ఎక్కువ అనుకుంది… అమ్మకు, నాన్నకు ఒకరి అవసరం ఒకరికి లేకపోవచ్చును. కాని, పసివాడికి అమ్మ అవసరం ఎంతైనా ఉందన్న సత్యం ఆమె విస్మరించడం నా దురదృష్టం. అమ్మ ప్రేమ, లాలన, అనురాగం, ఆప్యాయతలకు దూరమై…నాన్నకు బరువై…అన్నీ ఉండీ, అందరూ ఉండీ అనాథలా పెరగమని ఆ విధాత నా నొసటను రాసి పంపితే…ఎవర్ని తప్పు పట్టి ఏం లాభం!?
తల్లిదండ్రులు విడిపోతే అధికంగా నష్టపోయేది వారి సంతానమే ననడానికి నిదర్శనం నేనే. అమ్మ ఏమైందో, ఎక్కడ ఉందో తెలియదు. నాన్న మాత్రం దర్జాగా మరో పెళ్ళి చేసుకున్నాడు, మగ మహారాజునన్న ’అహం’ తో. అమ్మఒడిలో ఆడుకోవలసిన వయసులో, నాన్న నీడలో ఎదగవలసిన ప్రాయంలో…శిశువిహార్ లో ఆయాల నీడకు చేరాను. నా బంగారు బాల్యమంతా చిల్డ్రన్స్ కేర్ సెంటర్లలో, హాస్టల్స్ లోనే గడచిపోయింది. అమ్మ- నాన్నల ముద్దు మురిపాలలో ఓలలాడవలసిన నేను…ఓ అనామకుడిగా, అనాథలా పెరిగాను… అమ్మ ఎలా ఉంటుందో గుర్తులేదు నాకు. నాన్న నన్ను చూడడానికి రాడు. నా చదువుకు, సదుపాయాలకు మాత్రం ఠంచనుగా డబ్బులు కట్టేసేవాడు.
పండుగలకు, వెకేషన్స్ కూ నా తోటి పిల్లలంతా ఇళ్ళకు వెళ్తూంటే…మనసంతా వెలితిగా ఐపోయి బాధగా ఉండేది నాకు. చదువు మీద ఏకాగ్రత తప్పేది. ఎప్పుడూ ఏవో అర్థంకాని ఆలోచనలు, భయాలు, బెంగలు, అభద్రతా భావం నన్ను పట్టి పీడించేవి. ఓ సారి ఉండబట్టలేక వార్డెన్ చేత నాన్నకు ఫోన్ చేయించాను, చూడాలని ఉందని. అప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాను. ఓ రోజు క్లాస్ లో ఉండగా పూన్ వచ్చి నాకోసం ఎవరో వచ్చారని చెప్పాడు. అప్పుడు నాలో కలిగిన ఉద్వేగం, భావాలూ, గుండె దడా…వర్ణింపజాలనివి. ఎప్పుడో ఐదేళ్ళ వయసప్పుడు చూసాను నాన్నను. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ నాకు కనిపించలే దాయన. అందుకే గుర్తు పట్టలేకపోయాను. ’నేనేరా, నీ నాన్నను’ అని చెప్పుకోవలసిన అగత్యం ఆయనకు ఏర్పడడం – మా ఇద్దరిలో ఎవరి దురదృష్టమో!
మధ్య వయస్కుడు ఆయన. చామనచాయలో ఎత్తుగా ఉన్నాడు. పలచబడుతున్న జుత్తు…తీక్ష్ణంగా ఉండే కన్నులు…గంభీర వదనం… ఆయన్ని చూసిన తరువాత అనిపించింది, బహుశా నాకు అమ్మ పోలిక వచ్చుంటుందని. నాన్న వస్తే ఎన్నెన్నో మాట్లాడాలనుకునేవాణ్ణి. ఏవేవో అడగాలనుకునేవాణ్ణి. కాని, నా ముందు నిలుచున్న నాన్న – ఓ ఆగంతకుడు నాకు! ఏం మాట్లాడాలో తెలియలేదు. ఉన్న కాసేపూ ఆయనే మాట్లాడాడు. బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉన్నందున నన్ను చూడ్డానికి రాలేకపోయానన్నాడు. నన్ను ఇంటికి తీసుకువెళ్ళాలని ఉన్నా తన రెండో భార్యకు జడిసి ఆ పని చేయలేకపోతున్నాడట. అసలు నాతో ఎటువంటి సంబంధమూ పెట్టుకోరాదన్న షరతు మీదే ఆయన్ని వివాహం చేసుకుందట. ఆవిడకు తెలియకుండానే నా సంరక్షణకు, చదువుకు ఫైనాన్స్ చేస్తున్నాడట… నన్ను గాలికి వదిలేయకుండా చదివిస్తున్నందుకు ఆయన పైన కృతజ్ఞతాభావం వెల్లివిరిసింది నాలో.
నాన్న వెళ్ళగానే దుఃఖం ముంచుకువచ్చింది నాకు.. కన్నతల్లికే అవసరం లేకపోయిన నేను – సవతి తల్లికి ఎందుకు ప్రియమౌతాను!? ఆమెను తప్పు పట్టడంలో అర్థం లేదనిపించింది.
పి. జి. ఫైనల్ ఇయర్లో ఉండగా నాన్న ఫోన్ చేసాడు. తన రెండో భార్య క్యాన్సర్ తో చనిపోయిందట. ఆమెకు సంతానం కలగలేదట. ఎగ్జామ్స్ ఐపోగానే ఫోన్ చేస్తే వచ్చి నన్ను ఇంటికి తీసుకువెళ్తాడట. తన బిజినెస్ లో ఇండక్ట్ చేస్తాడట.
పరీక్షలు పూర్తి అయ్యాక నాన్నకు ఫోన్ చేయలేదు నేను. తండ్రి ప్రేమకు నోచుకోలేకపోయిన నాకు ఆయన ఆస్తిపాస్తులు అవసరం లేదనిపించింది. ఫైనల్ ఎగ్జామ్ ఐన మర్నాడే ఆ హాస్టలు, ఆ ఊరు విడిచి ఓ స్నేహితుడితో కోల్ కత్తా వెళ్ళిపోయాను… అదంతా జరిగి ఐదేళ్ళయిపోయింది….
#
అలవాటులేని పనేమో, మందు కొట్టాక ఏదోలా ఉంది. కడుపులో త్రిప్పుతోంది. రాత్రి పది గంటలకు బార్ లోంచి బైట పడ్డాను.
అప్పటికే బీచ్ రోడ్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది. పెట్రోల్ ఐపోయినట్టుంది, కొంత దూరం వెళ్ళాక మోటార్ బైక్ ఆగిపోయింది. కోపంతో దాన్ని రోడ్ పక్కకు తన్నేసి తూలుకుంటూ నడక ఆరంభించాను. త్రాగిన మత్తులో కూడా మదిలోని బాధ ఉపశమించడంలేదు. కన్నతల్లి నన్ను అనాథను చేసి వెళ్ళిపోయింది. ప్రేమించిన పడతి అనాథనని విడిచిపెట్టేసింది. సవతి తల్లి నా నీడ కూడా సోకకూడదంది… నన్ను ఏకాకిని చేసిన స్త్రీ జాతి మీద కసిగా ఉంది.
కొంత దూరం వెళ్ళేసరికి కనిపించిందామె – పేవ్మెంట్ మీద, ఒంటరి చెట్టులా!…
ఆగి పరీక్షగా చూసాను. సన్నగా, పొడవుగా…వయసులో ఉంది. కాటన్ శారీలో, చిక్కిన శరీరం…కనులలో బెరుకు …వదనంలో నీలి నీడలు – ఆమె గుడ్ లుక్స్ ను మరుగుపరచలేకపోతున్నాయి.
అకారణంగానే ఆ యువతి మీద అరవాలనిపించింది నాకు. బహుశా, ఆడది అనేమో! కాని, అరవలేకపోయాను. ఆమె అమాయకపు చూపులు నా గొంతుకను పెకలనివ్వలేదు… అప్పుడప్పుడు నా మిత్రులు నా చేత మందు త్రాగించాలనీ, స్త్రీ పొందు కల్పించాలనీ ప్రయత్నించి విఫలమయ్యారు. కాని, ఈ రోజు విరజ కనిపించి నా మది గాయం రేపడంతో మందు త్రాగాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ. ఇంత రాత్రి వేళ వయసులో ఉన్న ఓ స్త్రీ బీచ్ రోడ్ లో ఒంటరిగా నిల్చుని ఉందంటే…అది తప్పకుండా విటుల కోసమే ననే నా మిత్రుల పలుకులు జ్ఞప్తికి వచ్చాయి. ’మందు’ మనసును మభ్యపెడితే, ’పొందు’ శరీరాన్ని జోకొడుతుందట! ఆ అనుభవం కూడా పొందాలనిపించింది. అంతకంటే, ఆ విధంగా ఆడదాని మీద కక్ష సాధించాలనిపించిందంటే సబబుగా ఉంటుందేమో!
ఆమె దగ్గరగా వెళ్ళాను. నేను ఏం అడిగానో, ఆమె ఏం చెప్పిందో…రెండు నిముషాల తరువాత ఆమె భుజం నిండా చెంగు కప్పుకుని నడుస్తూంటే, అనుసరించాను.
అక్కడకు సమీపంలోనే ఉంది ఆమె నివాసం. ఆరు వాటాల పాత లోగిలి. అందులో ఓ ఒంటి గది పోర్షన్ ఆమెది. ఆ ఇంట్లో దరిద్ర దేవత సహజీవనం చేస్తోంది. నేలపైన చాప. చాప మీద అతుకుల బొంత. దాని మీద నిద్రపోతూన్న నెలల పసిపాప. ఆమె కూతురు కాబోలు.
మంచం మీది దుప్పటి తీసి దులిపి పక్క వేసిందామె… తలుపు మూసి చొక్కా విప్పుతూ ఆమెను సమీపించాను. భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకోబోయాను, తిమ్మిరెక్కిన మనసుతో.
అదిగో, అప్పుడే అందామె…నా కళ్ళలోకి దీనంగా చూస్తూ. చటుక్కున వదిలేసాను.
"ఎన్నాళ్ళయింది?" అడిగాను, నిషా దిగిపోవడంతో.
తల వంచుకుని మూడు వ్రేళ్ళు చూపించింది. మళ్ళీ చొక్కా తొడుక్కుని బైటకు నడచాను…
కొంతసేపటికి ఫుడ్ ప్యాకెట్స్ తో తిరిగివచ్చిన నావంక కృతజ్ఞతతో చూసింది ఆమె. వాటిని అందుకుంటూ నాకు చేతులు జోడించింది.
పాపను లేపి, నేను బాటిల్ తో తెచ్చిన పాలను పట్టించింది. బొజ్జ నిండినట్టుంది, పాప నావంక చూసి బోసినవ్వులు ఒలికించింది.
ఆమె ఆవురావురుమంటూ తింటూంటే జాలివేసింది నాకు. ఆమె పలుకులు నా మదిలో సుళ్ళుతిరిగాయి… ’ఆకలితో శోష వస్తోంది. ముందుగా నాకు తినడానికేమైనా పెట్టించరూ?’ అంది అభ్యర్థనగా.
తినేసి చేయి కడుక్కుందామె. పాపను నిద్రపుచ్చుతూ మెల్లగా అంది – "మూడు రోజులుగా మంచినీళ్ళతోనే కడుపు నింపుకుంటూన్న కారణంగా చంటిదానికి పాలు లేకుండాపోయాయి. పాప ఆకలితో గుక్కపట్టి ఏడుస్తూంటే…చచ్చిపోతుందన్న భయంతో… గత్యంతరం కానక…జీవితంలో మొదటిసారి ఇలా…" ఆపైన ఆమె గొంతుక దుఃఖంతో పూడుకుపోయింది. తమాయించుకుని కనులు తుడుచుకుందామె. "నా బిడ్డ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదనిపించింది…పాప ప్రాణం కాపాడిన మీకు నేనేమిస్తే ఋణం తీరుతుంది!?"
నిశ్చేష్టుడనయ్యాను నేను. అహం నిలుపుకోవడం కోసం ప్రేగు త్రెంచుకు పుట్టిన బిడ్డనే కాదనుకుంది ఓ తల్లి! బిడ్డ కోసం తన మానాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడింది మరో తల్లి!!…ఎంత తేడా!!… ఆమెకు చేతులెత్తి నమస్కరించాలనిపించింది.
పాపను నిద్రపుచ్చి, పమిట తొలగించి బ్లౌజ్ హుక్స్ విప్పసాగిందామె.
హఠాత్తుగా నాలో వివేకం మేల్కొంది. సిగ్గు కూడా వేసింది…ఆమెను వారించి పమిట చెంగును భుజాల మీదుగా కప్పాను. ఆ సాయంత్రం నేను ’ఎ.టి.ఎమ్.’ నుండి డ్రా చేసిన డబ్బు ఐదు వేలు జేబులో ఉంది. దాన్ని తీసి మంచం మీద పెట్టాను. ’సారీ!’ అంటూ గొణిగి గబగబా బైటకు నడచాను. తెల్లబోయిన ఆమె కన్నీళ్ళతో నాకు చేతులు జోడించడం కనుకొసల నుండి కనిపించింది.
#
ఆ రాత్రి సంఘటన నన్ను మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది. దాని గురించే ఆలోచిస్తోంది నా మనసు… ఆమె కన్నీరే గుర్తుకు వస్తోంది. ఆమె పేరు కూడా అడగలేదు నేను. ఆమె భర్త ఏమయ్యాడో? ఆమె ఒంటరిది ఎందుకయిందో?…ఆ వివరాలేవీ తెలుసుకోలేదు. ఐతే పసిపాప నావంక చూసి నవ్విన బోసినవ్వులు జ్ఞప్తికి వచ్చినప్పుడు మాత్రం మనసుకు హాయిగా అనిపిస్తోంది.
ఉండబట్టలేక మూడో రోజున సాయంత్రం ఆ ఇంటికి వెళ్ళాను…అక్కడ ఎదురైన దృశ్యం నన్ను ఖంగు తినిపించింది.
జనం మూగియున్నారు. వాకిట్లో – ’ఆమె’ శవం!
ఓ ముసలామె బుజమ్మీద గుక్కపట్టి ఏడుస్తూన్న ఆమె బిడ్డ.
ఆ ముసలమ్మ చెప్పిన సంగతులు ఆలకించి కొయ్యబారిపోయాను… ’ఆమె’ పేరు కమల. భర్త ఆటో రిక్షా అద్దెకు తీసుకుని నడుపుతూంటాడు. పదవ తరగతి చదువుతూన్న కమలను ప్రేమ పేరిట ఏడాదిన్నర క్రితం లేవదీసుకు వచ్చాడు. మొదట్లో బాగానే ఉండేవాడు. రానురాను ఆరంభమయ్యాయి ఆమె వెతలు. సవారీ మీద వచ్చే డబ్బులు ఆటో అద్దెకే సరిపోయేవికావు. దానికి తోడు అతనికి త్రాగుడు అలవడింది. ఫలితంగా పస్తులకు తోడు రోజూ దెబ్బలకు కూడా గురయ్యేది కమల. రెండు మూడిళ్ళలో పనులు చేసుకుంటూ ఎలాగో నెట్టుకువచ్చేది. ఐతే ఆమె పనిచేసే చోట మగవారి వేధింపుల కారణంగా విరమించుకుంది. దాంతో పూట గడవడం మరింత గడ్డు ఐపోయింది. చంటిబిడ్డ తల్లి కూడాను. ఆమధ్య భర్త ఇంటికి సరిగా రావడం లేదు. వారానికో, పది రోజులకో వచ్చి త్రాగుడు మైకంలో ఏదో ఒక వంకతో గొడవ పెట్టి పెళ్ళాన్ని చితకబాది వెళ్తూంటాడు…
ఆ రోజు ఉదయం ఇంటికి వచ్చాడు అతను. మూడు రోజుల క్రితం నేను కమల కిచ్చిన డబ్బు కంటపడడంతో దాన్ని తీసుకుని పోబోయాడు. పిల్ల పాల కోసం ఓ ధర్మాత్ముడు ఇచ్చాడనీ, దాన్ని ముట్టుకోవద్దనీ ఆమె ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకోలేదు. దాంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆమెను బాగా కొట్టాడు. ఆ సమయంలో ఆమె తల గోడకు కొట్టుకుని అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అతను డబ్బు తీసుకుని పారిపోయాడు…
గిల్టీగా ఫీలయ్యాను నేను. కమల చావుకు కారణం నేనే ననిపించింది. నన్ను తన బోసినవ్వులతో అలరించిన ఆ పసిపాపకు ప్రతిగా నేనేం చేసాను? తల్లిని దూరం చేసి అన్యాయం చేసాను!…ఆ రాత్రి నేనామెకు డబ్బు ఇచ్చుండకపోతే…ఆ గొడవ జరిగేదికాదేమో! ఆమె చనిపోయేదికాదేమో! నా మూలంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఓ పసిపాప అనాథ ఐపోయింది.
పోలీసులు పోస్ట్ మార్టమ్ ముగిసాక కమల శవాన్ని అప్పగించేసారట. అక్కడి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దహన కార్యక్రమాలకు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
కొద్ది క్షణాలు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాను. క్రమంగా నా మనసును ముసిరిన మబ్బుతెరలు విడిపోతున్నట్లనిపించింది. ఇన్నేళ్ళూ ఏ ’గమ్యం’ కోసమైతే అగమ్యంగా అన్వేషిస్తున్నానో…ఆ గమ్యం నా మనో నేత్రంలో తళుక్కుమంది. అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేసాను.
నా గమ్యం – ఆ పసిపాప!… అమ్మ లేని వెలితి తెలియకుండా దానికి ప్రేమానురాగాలు పంచుతాను. పెంచి, ప్రయోజకురాలిని చేస్తాను. స్త్రీ జాతిలో మాణిక్యంలా విలసిల్లేటట్లు సాన పెడతాను…ఇకపైన అదే నా జీవిత లక్ష్యం! అదే, కమలకు నేను అర్పించగల నీరాజనం!!
కమల దహన సంస్కారాలను దగ్గరుండి శాస్త్రోక్తంగా జరిపించాను. ఆమె భర్త పోలీసులకు భయపడి ఎక్కడకు పారిపోయాడో తెలియదు. ఆమె చితి కూడా నేనే అంటించాను. అది ఏనాటి ఋణమో…!
కర్మకాండ ముగిసాక పసిదాన్ని తీసుకుని భుజాన వేసుకుని దృఢనిశ్చయంతో బైటకు నడుస్తూంటే…ఇన్నాళ్ళూ నన్ను వెలివేసిన శాంతి, ఊరట ఏవో మనసుకు లభించినట్లయింది.
==XX====XX====XX====XX====XX====XX====XX====XX==