ఉదయం ఐదున్నర. గంగారావు, ఆయన మిత్రుడు సూర్యనారాయణ పార్కులో బ్రిస్క్ వాక్ చేసి ఇంచుమించు అదే స్పీడులో రోడ్డుమీద కొచ్చారు. గంగారావు రోడ్ క్రాస్ చేద్దామంటే- ''ఏ పక్కనుంచి ఎప్పుడే కారొస్తుందో చెప్పలేం. కాస్త ముందుకెడితే జీబ్రా లైన్సొస్తాయి. అక్కడైతే మనకి సేఫ్'' అన్నాడు సూర్యనారాయణ.
''ఇక్కడే దాటితే పావు కిలోమీటరు కలిసొస్తుంది. మన ఆరోగ్యానికి ఇంతవరకూ నడిచింది చాలు కానీ, పద'' అన్నాడు గంగారావు. అంతలో దూరంగా కారొకటి కనిపిస్తే, ''సరేలే, ఆ కారెళ్లాక వెడదాం'' అన్నాడు సూర్యనారాయణ.
''దాని స్పీడు చూస్తుంటే తెలియడం లేదూ, అదిక్కడికొచ్చేసరికి మనం ఇంటికెళ్లిపోతాం'' హేళనగా అని ముందడుగేశాడు గంగారావు.
సూర్యనారాయణకి కారు స్పీడుగా వస్తున్నట్లే అనిపించి ఆగిపోయాడు. ఆయన అనుకున్నట్లే గంగారావు రోడ్డు మధ్యకి వెళ్లేలోగానే కారొచ్చేసింది. డ్రైవర్ సమయస్ఫూర్తికి తోడు- సడన్ బ్రేక్ పని చెయ్యకపోతే ఆయన కారు కింద పడాల్సినవాడే!
గంగారావు ఒక్క ఉదుటున అవతల పక్కకెళ్లాడు. కారు ఆగడంతో సూర్యనారాయణ కూడా ఆయన్ను చేరుకున్నాడు.
డ్రైవర్ సీట్లో వ్యక్తి తలుపు తీసి కారు దిగాడు. విసుగ్గా గంగారావుని చూస్తూ, ''కాస్త ముందుకెడితే జీబ్రా లైన్సొస్తాయి కదా. అక్కడ చెయ్యాల్సిన క్రాసింగ్ ఇక్కడ చేస్తే ఎలాగండీ?'' అన్నాడు.
గంగారావాయన్ని ఉరిమి చూస్తూ, ''జీబ్రా సంగతి చెప్పొద్దు. ఈ ఏరియాలో ఈ రోడ్డుమీద స్పీడు లిమిట్ మీకు తెలుసా?'' అంటూ గర్జించాడు.
కారు ఓనర్ తడబడి, ''అర్జంటు పనిమీద వెడుతున్నా. స్పీడు కాస్త ఎక్కువే ఉండొచ్చు. కానీ నడిచేటప్పుడు రూల్స్ పాటించకపోతే మీకే ఎక్కువ ప్రమాదం కదా! కారు కండిషన్లో ఉండి సడన్ బ్రేక్ పని చేసింది కాబట్టి కానీ- లేకపోతే మీకు కాలో చెయ్యో విరిగేది. ఒకోసారి ప్రాణానికే ముప్పు రావచ్చు'' అన్నాడు అనునయిస్తూ.
''మీ కారున్నవాళ్లంతా ఇలాగే మాట్లాడతారు. మీ సమయస్ఫూర్తికి నా టైమ్ సెన్స్ కూడా కలిసిరావడంవల్లే ప్రమాదం తప్పింది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. కాలో చెయ్యో విరిగితే కాంపెన్సేషనివ్వాలి. అదీ కాస్తా కూస్తా కాదు, ఇక మనిషి చస్తే హత్యానేరం కింద ఉరిశిక్ష పడినా పడొచ్చు. మనుషులు తిరిగే రోడ్లమీద స్పీడ్‌లిమిట్‌కి కాస్త దిగువనే ఉండడం మీకు మంచిది'' అన్నాడు గంగారావు.
కారు ఓనర్ ఆయనతో గొడవెందుకనుకున్నాడో ఏమో- తనలో తనే గొణుక్కుంటూ మరి మాట్లాడకుండా కారెక్కాడు. కారు కదలగానే, ''ఏంటీ గొణుగుతున్నావ్?'' అనరిచాడు గంగారావు. కారు స్పీడందుకుని వెళ్పిపోయింది.
''రాస్కెల్. చేసింది చేసి ఇంకా గొణుగుడొకటి. పారిపోయాడు కానీ ఈవేళ వాడి పని పట్టి ఉండేవాణ్ణి'' అన్నాడు గంగారావు ఆవేశంగా.
''ఆయన్ననడమెందుకు? తప్పు మనలోనూ ఉందిగా'' అన్నాడు సూర్యనారాయణ.
''తప్పు మనలో ఉందా? ఎలా?'' అన్నాడు గంగారావు మరింత ఆవేశంగా.
సూర్యనారాయణ జవాబివ్వలేదు. చిరకాలమిత్రుడు కావడంవల్ల గంగారావు తత్వం ఆయనకి బాగా తెలుసు. కారు ఓనరుకి వినపడదని రూఢి అయ్యాకనే గంగారావు రాస్కెల్ అన్న పదం వాడాడని ఆయనకి తెలుసు. ఎంత ఆవేశమొచ్చినా తన జాగ్రత్త తనకి తెలుసు. ఇక ఆవేశాన్ని ఎలాగో అలా బయటపడేయకపోతే కడుపుబ్బరం కదా. అది తగ్గడానికి మరిప్పుడు తనే సాధనం. ఇప్పుడాయన ఎంత రెచ్చిపోయినా ప్రమాదం లేదు. అణుశక్తి- బాంబులో కీడు కానీ, రియాక్టరులో మేలే కదా!
గంగారావు కసెక్కిపోయాడు. కారున్నవాళ్లకి పొగరన్నాడు. కండకావరమన్నాడు. ఇందాకటాయనపై స్కౌండ్రల్, బాస్టర్డ్ వంటి పదజాలాన్నుపయోగించి పవర్ చాలక తెలుగులోకి దిగిపోయాడు. కాస్త శాంతించేక, ''నాకు రూల్సు చెబుతాడా? మన దేశంలో కార్లున్నవారెందరు? లేనివారెందరు? పదిమంది కోసం పాతికలక్షలమందికి రూల్సా? రూల్స్ వాడు పాటించాలా- నేను పాటించాలా? ఐనా నడకకి కూడా రూల్స్ పెట్టడానికి ఇదేమన్నా హైవేయా? సరుకులు కొనాలన్నా, క్షౌరానికన్నా, బట్టల ఇస్త్రీకైనా ఇదేకదా రూటు. ఇక్కడ మనుషులు నడుస్తూంటే వాహనాలు తప్పుకుని దారివ్వాల్సిందే. లేకపోతే టాప్‌నుంచి బాటమ్ దాకా ఓ ఊపు ఊపేస్తా. సామాన్యుడంటే అంత లోకువా వీళ్లకి? అసలు సామాన్యుడు లేకపోతే వీళ్లకి బ్రతుకెక్కడిది?'' అన్నాడు.
అప్పుడాయన పదవి పేరు సామాన్యుడని వేరే చెప్పక్కర్లేదు.
—————–
గంగారావు ఇంటికెళ్లేసరికి ఆయన భార్య సావిత్రికి పనిమనిషి ఇంకా రాలేదని మహా చిరాగ్గా ఉంది. ఇంట్లో ఒక్క పనవలేదుట.
''ఇలాగంటున్నానని ఏమీ అనుకోకు. ఉన్నది ఇద్దరం. మనకసలు పనికి వేరే మనిషి అవసరమా? దాన్ని మాన్పించేయ్'' అన్నాడు గంగారావు సులభ పరిష్కారంగా.
''నిజమే- ఇంటి పనులు ఇద్దరం సమంగా పంచుకుంటే మనకి పనిమనిషే అక్కర్లేదు'' సావిత్రి రిటార్టు.
''ఐతే నేను రెడీ- నా పనులేంటో చెప్పు'' అనాయన అంటూండగా పనిమనిషి వచ్చింది. వస్తూనే చకచకా పనులు మొదలెట్టింది.
గంగారావు భార్యని పక్కకి పిలిచి నెమ్మదిగా, ''ఈ రోజుదాకా జీతం లెక్కకట్టిచ్చి దాన్ని పొమ్మని చెప్పు. మన పనులు మనం చేసుకుందాం'' అన్నాడు.
''ఆ విషయం ఇంకోసారి ఆలోచిద్దాం. వచ్చిందిగా, పని చేసుకుని వెళ్లనివ్వండి''
''ఏం రావడం- రోజూ లేటే- గట్టిగా డోసివ్వకపోతే పనివాళ్లిలాగే లోకువ కడతారు. నా మాట విని జీతం లెక్క కట్టిచ్చి…''
''జీతం వేరే లెక్క కట్టక్కర్లేదు. లేటుగా వచ్చావేమని కాస్త కసిరానంటే చాలు- అదే చెబుతుంది లెక్క. ఏరోజుకారోజు లెక్క చూసుకుంటుందో ఏమో ఠక్కుమని అంకె చెప్పి నా జీతం నాకిచ్చేస్తే మీ ఇంట్లో మానేసి వేరే ఇంట్లో కుదురుకుంటానంటుంది. మనం కాదంటే దానికి పాతికిళ్లు. అవసరం మనది'' అంది సావిత్రి.
''అదే నే చెబుతున్నా. మనకేమంత అవసరం లేదు. ఉందనుకోవడం భ్రమ! ఒక్కసారి మానిపించి మన పనులు మనం చేసుకుంటే పనివాళ్లకి దిమ్మతిరిగి కాళ్ల బేరానికొస్తారు''
''ఆఁ- దిమ్మతిరిగేదీ నాకే, కాళ్లబేరాని కొచ్చేదీ నేనే''
''ఊహించుకుని భయపడ్డం కాదు. నీకు సాయంగా నేనున్నానని హామీ ఇస్తున్నాగా. స్వానుభవానికీ ఓ ఛాన్సివ్వాలి. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడు''
''అయ్యో రాత! ఒక్కసారేం కర్మ- మూడు సార్లైందిప్పటికి. ప్రతిసారీ ఓ గంట పని చేశాక ఇక నా వల్లకాదని మీరు చేతులెత్తేశారు. మన పని మనం చేసుకోగలిగినా- మనిషిని పెట్టుకుంటే వాళ్లకి బతుకు తెరువన్నారు. వాళ్లు కష్టజీవులనీ మన పనికి మనకొచ్చేదాంతో పోలిస్తే వాళ్ల పనికి మనం వాళ్లకిచ్చేది చాలా తక్కువన్నారు. ఇంతోటిదానికీ రూల్స్ కూడానా- లేటుగా వచ్చినా పని సరిగ్గా చెయ్యకపోయినా చూసీ చూడనట్టు ఊరుకోమన్నారు. ఊహ కాదు, స్వానుభవమే నన్ను భయపెడుతుంట!''
''సరేలే- నీకిష్టమైతే ఇలాగే అనుభవించు. ఐనా పనిమనిషి నీ ప్రోబ్లం. ఇంకెప్పుడూ నీ విషయాల్లో తల దూర్చనులే'' అంటూ అక్కణ్ణించి వెళ్లిపోయాడు గంగారావు.
''ఇప్పుడేగా మన పన్లు మనం చేసుకుందామన్నారు. ఇంతలోనే అవి నా పనులైపోయాయా? అది నాలికా తాటిపట్టా? తెలిసే అంటారో మరి గుర్తుండదో ఈ మనిషికి'' ఆయనకు వినపడదని రూఢి అయ్యాక స్వగతంలా అంది సావిత్రి.
అప్పుడాయన పదవి పేరు ఉద్యోగస్థుడైన భర్త.
—————
సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో డిస్పెన్సరీ. తన సీట్లో కూర్చున్నాడు గంగారావు. ఆయన పక్కనే మిత్రుడు సూర్యనారాయణ ఉన్నాడు. ఎదురుగా ఉన్న పేషెంటు దగ్గిర ఫైలందుకుని పరిశీలించాడు. కొన్ని రొటీన్ ప్రశ్నలు వేశాడు. బిపి చెక్ చేసి కొన్ని మందులు వ్రాసి పేషెంటుని అదోలా చూస్తూ, ''డయావిట్ ఖరీదెక్కువ. బీకాంప్లెక్స్ రాస్తాను'' అన్నాడు.
''రెండూ ఒకటే ఐతే బీ కాంప్లెక్సే రాయండి'' అన్నాడు పేషంటు.
''ఒకటని కాదు. ప్రస్తుతానికి మీకు డయావిట్ ఎక్కువ మంచిది. బీ కాంప్లెక్స్ ఫరవాలేదు'' అన్నాడు గంగారావు.
''నా ఆరోగ్యం మీ చేతుల్లో పెట్టాను. మీరెలాగంటే అలా?'' అన్నాడు పేషంటు.
''ఇలాగంటున్నానని మరోలా అనుకోకండి. మనం కేంద్ర ప్రభుత్వోద్యోగులం. ప్రభుత్వం సర్వీసులో ఉండగా మనకిచ్చే కొన్ని సదుపాయాలు రిటైరయ్యాక కూడా కొనసాగిస్తోంది. వాటిలో వైద్య సదుపాయమొకటి. మీకిచ్చే మందుల ధరకి పరిమితి లేనిమాట నిజం. ఎంతైనా ప్రభుత్వం భరిస్తుందన్నదీ నిజం. కానీ మనమొకటి ఆలోచించాలి. మనది చాలా పేద దేశం. రోగాలకు మందుల సంగతటుంచి తినడానికి తిండే లేక చాలామంది చనిపోతున్నారు. తాను కరిగిపోతూ మనకి వెలుగిచ్చే కొవ్వొత్తిలా- అలాంటి సామాన్యుడే మన మందుల ఖర్చునీ భరిస్తున్నాడు. సర్వీసులో ఉన్న వాళ్లకి సరైన వైద్యసదుపాయం లేకపోతే- వాళ్ల సేవలందక సామాన్యుడు నష్టపోతాడు. కానీ పెన్షనర్స్ విషయం అలాక్కాదు. అదలాగుంచితే- మన ఆఫీసులో సర్వీసులో ఉన్నవారికంటే పెన్షనర్సే ఎక్కువ. ఆ సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతోంది. మందుల బిల్లు మీద సంతకం పెట్టేది నేనే కదా! ఆ ఖర్చు చూస్తుంటే గుండె చెరువైపోతూంటుంది''
పెన్షనర్ పేషంటు మాట్లాడలేదు. ఆయనకి తెలుసు. గంగారావు చెప్పేది మాట్లాడకుండా వింటే- ఆ తర్వాత ఆయనే డయావిట్ వ్రాస్తాడని. అదే జరిగేక డాక్టరుకి థాంక్స్ చెప్పి వెళ్లాడా పేషెంటు.
పేషెంట్లందరూ వెళ్లిపోయాక, ''వృద్ధాప్యంలో బిడ్డలు తలిదండ్రులకి ఆసరాగా ఉండి సంరక్షణ చూస్తూ ఆదుకుంటే అది వారి దయాగుణం అనిపించుకోదు. సంరక్షణ పిల్లల బాధ్యత, పెద్దల హక్కు. పెన్షనర్సుని ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ అని గౌరవిస్తున్నదీ అందుకే. పెన్షన్ దయాధర్మభిక్షం కాదు. దాన్ని డిఫర్డ్ శాలరీ అంటారు. వాళ్లకిచ్చే సదుపాయాలూ ఔదార్యం కాదు. నియమబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్న సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్న పెన్షనర్సు దేశానికి భారమైనట్లు మాట్లాడావ్. నాకు నచ్చలేదు'' అన్నాడు సూర్యనారాయణ.
''నీకు నచ్చినా నచ్చకపోయినా- ఉన్నమాటే అన్నాను. సర్వీసులో లేనివాళ్లమీద అంత ఖర్చు పెట్టడం సామాన్యుడికెంత భారమో అన్న స్పృహ వాళ్లకి కలగాలన్నదే నా తాపత్రయం. ఇటీజ్ మై డ్యూటీ. గవర్నమెంట్ సర్వెంట్సుకి డ్యూటీ ఇజ్ గాడ్'' అన్నాడు గంగారావు.
సూర్యనారాయణ మాట్లాడలేదు.
అప్పుడు గంగారావుది సర్వీసులో ఉన్న డాక్టరు పదవి.
———————-
పేషెంట్ల పనయ్యాక గంగారావు డ్రాయరు సొరుగు తెరిచి ఓ ఫైల్ తీసి చూశాడు. ఉండాల్సిన కాగితాలున్నాయని సంతృప్తిగా తలాడించాడు. తర్వాత సూర్యనారాయణతో, ''ఈరోజు నా మనసేదోలా ఉంది. నువ్వు పక్కన లేకపోతే ఆఫీసుకి డ్రైవ్ చేసుకుని రాగలిగేవాణ్ణి కాదు. తర్వాత ఆఫీసు పని మానుకుని మోరల్ సపోర్ట్‌గా రోజంతా నాదగ్గర కూర్చున్నావు. కాన్ఫరెన్స్ హాల్లో ఫంక్షన్‌కి తోడుగా వస్తున్నావ్. నువ్వు చాలా మంచి మిత్రుడివి సూర్యనారాయణా, నీకు చాలా చాలా థాంక్స్'' అన్నాడు.
''మంచి మిత్రుడినన్నావుగా, మరి మిత్రులమధ్య థాంక్సుండకూడదు. టెన్షన్‌గా కనిపిస్తున్నావ్. కారు నేను డ్రైవ్ చేసేదా?'' అన్నాడు సూర్యనారాయణ.
''నువ్వు పక్కనుంటే చాలు. నో టెన్షన్. నేనే డ్రైవ్ చేస్తా'' అన్నాడు గంగారావు.
ఆ వెంటనే ఇద్దరూ కార్లో బయల్దేరారు.
కాన్ఫరెన్స్ హాల్‌కీ డిస్పెన్సరీకీ దూరం నాలుగు కిలోమీటర్లు. రెండు రోడ్లు దాటాలి. ఒకచోట ట్రాఫిక్‌జామ్‌తో పది నిముషాలు ఆగిపోవాల్సి వచ్చింది. గంగారావు చీటికీమాటికీ టైం చూసుకుంటూ చిరాకు పడుతున్నాడు. ట్రాఫిక్ క్లియరవగానే స్పీడు పెంచితే, ''స్పీడ్ లిమిట్ దాటుతున్నావ్ జాగ్రత్త!'' అని హెచ్చరించాడు సూర్యనారాయణ.
''స్పీడ్ లిమిట్ కంటే టైమ్ లిమిట్ ముఖ్యం. ఏ ఫంక్షనుకీ ఒక్క నిముషం లేటు కాని నేను ఈ ఫంక్షన్‌కి లేటైతే- ఎంత అవమానం!'' అంటూ గంగారావు యాక్సిలరేటర్ బలంగా తొక్కాడు. కారు స్పీడు పెరిగి అప్పుడే రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తి కారు కింద పడబోయాడు. కాస్త గొడవయ్యాక ఆ వ్యక్తి గొణుక్కుంటూ వెళ్లిపోయాడు కానీ గంగారావు ఊరుకోలేదు. రోడ్లమీద నడిచేవాళ్ల అలక్ష్యవైఖర్నీ, పొగరుబోతుతనాన్నీ తెగ తిట్టాడు. కారున్నవాళ్లని చూస్తే లేనివాళ్లకి ఏడుపనీ, ఏదోవంకన అల్లరిపెట్టాలని చూస్తారన్నాడు. యాక్సిడెంటైతే తనకేం కాదనీ వాళ్లకే కాలోచెయ్యో, ప్రాణమో పోవచ్చనీ అన్నాడు. ''మనదేముందీ- ఇంత కాంపెన్సేషన్ పారేసి చేతులు దులిపేసుకుంటాం. ఆ తర్వాత బ్రతుకేంటని ఆలోచించాల్సింది వాళ్లు'' అన్నాడు చివరికి.
సూర్యనారాయణ మౌనంగా విన్నాడు.
అప్పుడు గంగారావుది కారున్న భాగ్యవంతుడి పదవి.
———————–
వేదికపై కూర్చున్నాడు గంగారావు. ఆయనకు పూలమాలలు వేశారు. శాలువ కప్పారు. సంస్థ అధిపతి ఆయన సంస్థకి చేసిన సేవల్ని ప్రస్తుతించి రిటైర్మెంటు బెనిఫిట్సు, పెన్షన్ కాగితాలు ఉన్న ఫైలు అందించాడు. సహోద్యోగిగా ఆయన గొప్పతనాన్ని ప్రశంసిస్తూ పలువురు ప్రసంగించారు. గంగారావు అందరికీ తగినవిధంగా ధన్యవాదాలు చెప్పి, ''కన్నబిడ్డలే తలిదండ్రుల్ని ఈసడిస్తున్న ఈ రోజుల్లో- ఉద్యోగవిరమణ తర్వాత కూడా మంచి పెన్షన్, వైద్య సదుపాయాలు అందిస్తున్న మన సంస్థ- మనకి గర్వకారణం. దేశంలో అన్ని సంస్థలకీ ఆదర్శం'' అంటూ ఆవేశంగా మాట్లాడాడు.
అప్పుడు గంగారావుది రిటైర్డ్ ఉద్యోగి పదవి.
——————-
పదవి కొందరికి పవిత్రబాధ్యత. వారు వివేకం, విచక్షణ, వితరణలో విక్రమార్కుడి వ్యక్తిత్వాన్ని సంతరించుకుని లబ్దప్రతిష్ఠులౌతారు.
పదవి కొందరికి సింహాసనం. అది విక్రమార్కుడి సింహాసనమైతే- దానిపై ఎవరు కూర్చున్నా పెదవి అతడి వివేకాన్నీ, విచక్షణనీ, వితరణనీ అప్రయత్నంగా పలుకుతుంది. కానీ అది పెదవికే పరిమితం.
ప్రజాస్వామ్యంలో సామాన్యుడే ప్రభువు. లేచింది మొదలు నిద్రపోయేదాకా అతడు నిర్వహించాల్సిన పదవులెన్నో, ఎన్నెన్నో. పదవిని పవిత్రబాధ్యతగా భావిస్తే అతడి వ్యకిత్వం వికసిస్తుంది. సింహాసనంగా భావిస్తే అతడి పలుకు పెదవికే పరిమితం. ఆ సింహాసనం విక్రమార్కుడిదైతే- ఆ పెదవి కూడా అందరికీ మేలే చేస్తుంది. కానీ ఇప్పుడు విక్రమార్కుణ్ణి మించి ప్రభావం చూపగల అక్రమార్కులున్నారు. ఎక్కడ చూసినా వారి సింహాసనాలే-
పరకీయంగా నాటకీయం. స్వకీయంగా పరస్పర విరుద్ధం. ఈ పలుకులు పదవి పెదవివేనని గ్రహిస్తే సమకాలీన సమాజం తీరుకి భాష్యం దొరుకుతుంది.
———————–0000000———————–