ఈ యుగాది శుభ దినాన …

ఈ యుగాది శుభ దినాన – ఎద పొంగును సంబరాన
బ్రతుకే ఒక పండుగైన – భావనౌను లోలోన                                            ……… ఈ యుగాది ………..

 

వాసంతుడు ఒళ్ళు విరిచి వ్యాహ్యాళికి చను దెంచెను
శైత్య మంత చాప చుట్టి చల్లంగా జారుకొనెను                 //వాసంతుడు//
 

ప్రకృతి నూత్న శోభలతో పరవశించి హసియించెను
పల్లె పట్లు పట్టణాలు తిలకించుచు పులకించెను                                      ……… ఈ యుగాది ………..

 

గున్న మావి చివురించెను పికము గొంతు సవరించెను
వేప కొమ్మ కుసుమించెను మల్లె తావి సిరి పంచెను         //గున్న మావి // 
 

తీపి పులుపు చేదు వగరు నా రసనను నర్తించెను
షడ్రుచులను మిన్న ఏదో చెప్ప నలవి గాకుండెను                                    ……… ఈ యుగాది ………..

 

నా యెదలో ఆశా లత క్రొం జివుళ్ళు ధరియించెను
నా ఊహల పిల్ల గ్రోవి క్రొత్త పాట వినిపించెను                  //నా యెదలో//

 
సుఖదు:ఖము లహర్నిశలు జీవితాన సహజ మనెను
అన్నిటినీ సమబుద్ధిని ఆదరించ ధర్మమ నెను                                        ……… ఈ యుగాది ………..

 
నవ వర్షపు వాకిలిలో నవ శోభల రంగవల్లి
నవ వసంత వేళలలో నల్దిశలను పాలవెల్లి                   //నవ వర్షపు //

 
నవనవ లాడే ప్రకృతికి క్రొందావుల సుమ వల్లరి
నా జీవన గీతిక కొక నవ్యమైన అను పల్లవి                                            ……… ఈ యుగాది ………..

 
******************************************************************************************


రచన: మిస్సన్న

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.