పొద్దు పత్రిక అంతర్జాలంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ళలో కథలకు సంబంధించి పోటీని నిర్వహించడం ఇదే మొదటిసారి. తెలిసిన రచయితలను అడిగి రాయించుకోవడమూ, అభిమానంతో మరికొందరు తామే పంపడమూ మాత్రమే ఇప్పటిదాకా అలవాటు. మరి పోటీ ఎందుకు? తెలిసినవాళ్లందరికీ ఉగాది కథలకోసం ఆహ్వానాలు పంపితే సరిపోతుందిగా అనుకున్నాం మొదట్లో. ’తెలియని రచయితల్ని తెలుసుకోవచ్చుగా!’ అన్నారొకరు; ’నిజమే కొత్తవారితో పరిచయమూ, జాలం బయటి జనంతో అనుబంధమూ’ కలిసొస్తాయనిపించింది.
"ఉగాదికా! అన్ని పత్రికలూ వేలకి వేలు బహుమతులిస్తున్నాయి, ’మీరిచ్చే బహుమతులేమిటి? అసలు పత్రికలన్నీ పోటీలు పెడుతుంటే మీకే ఎందుకు రాయాలి?" అన్నారు, సందేహనివృత్తి కోసం కొందరు. "మేము డబ్బులివ్వము. కథలకి తిరిగి కథలే ఇస్తాము. మంచి పత్రికలూ, పుస్తకాలూ, డిజిటల్ లైబ్రరీలో సభ్యత్వాలూ ఇస్తాము. అక్షర లక్షల కోసం రాసేవారుండకపోతారా? మనమీది అభిమానంతో పంపకపోతారా?" అని తిరిగి ప్రశ్నించుకున్నాం.
"ఐతే, ఎప్పట్లాగా మీరే ఎంపిక చేసి, ఎడిట్ చేస్తారనమాట!" -తప్పక రావల్సిన అనుమానమే! పోటీ అంటే పోటీయే. అనుభవజ్ఞులని అడిగాం, 'కొంచం కథలెంచిపెడతారా మాస్టారూ?' అని. ’నా పేరు బయట పెట్టకుంటే పని చేసిపెడతాను పోండ’ని నిరాడంబరంగా ఆశీర్వదించారు. ’మీ ఇమేజ్ కన్నా, అనుభవాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటాం ఆచార్యా’ అని సవినయంగా నమస్కరించాం.
———-
గడువు తక్కువ, ఆకర్షించే బహుమతుల్లేవు, పబ్లిసిటీ నామమాత్రమే, వృథాప్రయత్నమేమో అనుకునేంతలో మెల్లగా కథలొచ్చాయి. మెల్లగా మొదలై, జోరుగా సాగింది కథాధార. కొత్త రచయితలు ఎక్కువగా పాల్గొన్నారు. జాలంలో, పొద్దులో ఇదివరకు ఎప్పుడూ కనపడని వాళ్లనుండి ఎక్కువ స్పందన రావడం ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ అనిపించింది. పొద్దు జాలపత్రిక అని తెలియనివాళ్ళు కూడా కథలను పంపించారు. ఒక రచయిత అయితే, ’పొద్దు అనే పత్రిక ఉన్న సంగతే తెలియదు. వెంటనే నాకు పత్రిక పంపించండి. సంవత్సర చందా ఎంతో చెప్పండి ’ అంటూ కార్డు రాసారు.
నాణ్యత విషయంలో సహజంగానే తేడాలున్నాయి. కొందరు మంచి అంశాలని ఎంచుకున్నా శైలి, కథనాల్లో కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల నీరుగార్చినట్టు అనిపించింది. "చాలా మంది రచయితలు మంచి కథాంశాలను ఎంచుకుంటున్నారు గానీ, కథను ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమౌతున్నారు. ఈ పోటీలో కొన్ని కథలను ఆ కారణంగానే పక్కనపెట్టవలసి వచ్చింది" అని మా నిర్ణేతలలో ఒకరు చెప్పారు. మరికొందరు, కొత్త విషయాలకోసం ప్రయత్నించకుండా ఒక ఒరవడిలో పడి, మూస కథాంశాలను కథగా మలచడానికి ప్రయత్నం చేసినట్టు తోచింది.
ప్రచురణకు ఎంచుకున్నవాటిలో మూడు కథలు బహుమతికి అర్హమైనవిగా మా నిర్ణేతలు భావించారు. చిన్నపాటి సవరణలు అవసరమనిపించినా మొత్తం మీద ఫరవాలేదనిపించిన వాటిని సాధారణ ప్రచురణకు ఎంచుకున్నాం. ఈ కథలన్నిటినీ వరుసగా ప్రచురిస్తాం.
ఈ కథావసంతానికి స్పందించిన, సహకరించిన వారందరికీ మరొక్కసారి ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉత్సాహంతో పాల్గొన్న పాతకాపులకు, కొత్తవారికి, అభినందనలు. మీ కథల్ని పంపడానికి పొద్దుని ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు. మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో ముందుముందు మరిన్ని పోటీలు నిర్వహించాలని భావిస్తున్నాం. రాబోయే పోటీలలో కూడా ఇనుమడించిన ఉత్సాహంతో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం, పాల్గొంటారని ఆశిస్తున్నాం.
ఈ కథలపోటీ వివరాలను తమ వెబ్ సైట్లలో ప్రచురించి ప్రచారం కల్పించినందుకు కూడలి, జల్లెడ, హారం, మాలిక సంకలినుల అధిపతులకు, పుస్తకం నిర్వాహకులకు, సాక్షి దినపత్రికవారికి, సాక్షిలో ప్రకటించేందుకు సహకరించిన ప్రముఖ కవి, పాత్రికేయుడు పూదూరి రాజిరెడ్డి గారికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బహుమతులను స్పాన్సరు చేస్తున్న కినిగె.కామ్ వారికి కూడా మా కృతజ్ఞతలు.
బహుమతి కథలు:
కథ పేరు రచయిత/రచయిత్రి
మొదటి బహుమతి తుది విన్నపం రమ గమని
రెండవ బహుమతి స్వాప్నికం డా|| భైరవభట్ల విజయాదిత్య
మూడవ బహుమతి కలసివచ్చిన ఇల్లు అరిపిరాల సత్యప్రసాద్
సాధారణ ప్రచురణకు ఎంపిక చేసినవి
- అక్రమార్క సింహాసనం – వసుంధర
- ఏ బంధం కావాలి? – గంధం నాగసురేష్
- ఒక ఓదార్పు, ఒక నిట్టూర్పు – గంధం నాగసురేష్
- గమ్యం – తిరుమలశ్రీ
- థ్రిల్ – కౌండిన్య తిలక్
- నిశ్శబ్ధపు హోరు – శారదా మురళి
- మధు గీతం – జీ.వీ. రమణారెడ్డి
మిగిలిన కథలను తిరస్కరించడమైనది. ఈమెయిలైడీలు ఉన్న రచయితలు/రచయిత్రులకు సమాచారాన్ని తెలియజేస్తాం. ఇతరులు ఈ ప్రకటననే సమాచారంగా భావించవలసినది.