అంశం: పాతమాటలు – కొత్త కవిత:
స్వాతికుమారి: అమృతం కురిసిన రాత్రిలో ఒకచోట తిలక్ "తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక" అంటారు, ఉత్తారాలు పంచి
మౌనంగా తిరిగి వెళ్తున్న తపాలబంట్రోతుని ఉద్దేశించి..
అలా జీవన సాగరంలోకి వెళ్తున్న ఏకాకి నౌక ఎవరైనా కావచ్చు, సందర్భాలెన్నో ఉండొచ్చు. ఇదే కవితా పంక్తిని తీసుకుని మరొకరకంగా తమ సొంతశైలిలో కొత్త కవితను మిత్రులు ఎవరైనా రాయగలరా?
కర్లపాలెం హనుమంతరావు:
నడిసముద్రంలో ఒంటరి దిగులు నావ తెరచాప కొయ్య మీద దిగంతాల అంచుల్లోకి రిక్కించి
చూస్తున్న ఏకాకి కాకి సిల్హౌట్టి …మీద ఎవరైనా గుబులు పెట్టుకోగలరా కవులారా మీ
మనసారా!
కత్తి మహేష్ కుమార్:
కలసికన్న కలల అలలు
పెనుతుఫానుకు తీరం చేరాయి
విడిపడితే కలువలేమని తెలిసీ
తడిని వీడి పొడిని కోరిన ఫలితం
కళ్ళ ఎదుటి మధురస్వప్నం మరకపడింది
నీ స్త్రీత్వపు తడి నా దుప్పటిపై ఇంకా తడారలేదు
కానీ నీ పాదాల పారాణి మాత్రం అరిపోయింది
నీ జ్ఞాపకాల ప్రవాహంలో చుక్కాని వీడి
తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌకనో
తుఫాను తాకిడికి తుత్తునీయలైన నావనో
విరిగి ఒంటరిగా మిగిలానని మాత్రం తెలుసు
స్వాతీ శ్రీపాద:
ఋతువులు విసుగెత్తిపోయాయి
ఎంత ఠంచనుగా ఆగమన నిష్క్రమణలను పాఠిద్దామన్నా
ఎదురౌవుతున్న ఆటంకాలకు వశమై
గాడితప్పి దారిదొరక్క
తిరిగిన చోటే తిరుగుతూ
అలసి సొలసి సేద దీర్చుకుంటున్న
ఋతువులు విసుగెత్తిపోయాయి
ఆహ్వానించని అతిధుల్లా
అకాల వర్షాలు
ఆహ్వానమే అవసరం లేని చొరబాటుదార్లుగా
వరదలూ ముంపులూ
శీతలం వేడెక్కితే
వేసవి బాధను వర్షిస్తూ
గ్రీష్మం గాఢ నిద్రలో పలవరిస్తూ
చైత్రం తెల్లబోయి ఆలోచిస్తోంది
"తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక"లా
ఏ వైపుకు సాగాలని.
పెరుగు రామకృష్ణ:
*కొలిమి.*..
గుండె కొలిమి
జ్ఞాపకాలతో మండుతుంది..
క్షణ క్షణం గాయపు ఊపిరితిత్తులతో
కలల్ని పండిచుకున్న మనిషిలా..
పిట్టలేగిరిపోయి చెట్టు మాత్రమే మిగిలింది
వలసబోయిన పేగు బంధం
ఎడారిలో వచ్చిపోయే వసంతంలా …
మనుషులందరూ
కాలం తీర్చిన యంత్రాలయ్యాక
విలువలన్నీ తెరలమీదనే ఆవిష్కరణ…
బతుకు చారికల చరిత్రతో ..
ముడుతలు పడిన ముఖంతో
ఒక సాయం సంధ్యా సమయాన
తీరం వదలి సముద్రంలోకి వెళ్తున్న
ఏకాకి నౌకలా నేను..