తే|| "మనము"లో నొక్క వర్ణంబు | మాయమగుడు
మనము మేము మీరయ్యె ; "మే" | మన్న నేమి ?
యని వితర్కించి ప్రతివాడుఁ | దనకుఁ జెప్పి
కొనియెఁ దోఁచు సంకుచితార్థ | కోణరాశి. ౨౫
ఉ. అంతట మా ప్రదేశమని | యస్మదుదార కులంబటంచు నా
స్వంతపు లింగజాతి యని | స్వంత మతంబని పెక్కుభంగులన్
వింత లడాయిలన్ మొదలు | వెట్టిరి ; మానిసినన్నవాడొ తా
నంతును బొంతు లేకరిగె | నందఱి దృష్టి కుచింప నమ్మెయిన్. ౨౬
ఉ|| ఆ క్రమమందుఁ గొందఱు న | టాధిపుఁ డిడ్డ ప్రతీకరాశి లో
కాక్రమమంచు స్థానికము | కాదనుచున్ గుహకంబటంచు నూ
రే క్రిత మస్మదీయ ; మిట | లేదు స్థలం బితరాంధ్ర బుద్ధిమ
చ్చక్రము చక్కగా విడియ ; | సాఁగదిదంచు వచించి రేడ్తెఱన్. ౨౭
ఉ. నావుడు వారి వార్ వికృతి | నామశరత్తున ఫాల్గుణంబునన్
గ్రావలు గడ్డపారలును | ఱంపములున్ బెనురజ్జులూఁది యా
తావున కేఁగుదెంచి బహు | ధా ధ్వనిపూర్ణ జనార్ణవంబునన్
జేవగఁ గోసియున్ బగులఁ | జేసియుఁ గూల్చిరి విగ్రహంబులన్. ౨౮
కం|| కూలించుటొకటియే కా
దాలింపఁగరాని బూతు | లాడుచు వానిన్
గాలను ఱాఁచుచుఁ ద్రోయుచు
హేలన్ సరమందు విసిరి | యేసిరి కసిగాన్. ౨౯
కం|| కక్షయుఁ గార్పణ్యము న
ధ్యక్షత వహియించు నున్మ | దాత్మలకున్ మం
దాక్షం బేమి ? గరువమున
రాక్షసముగ నవ్వికొనిరి | ఱాల్ తల వంపన్. ౩౦
కం|| గుఱజాడయు బళ్ళారియు
సరార్థరును గట్టమంచి | చౌదరిగారున్
దరమిడి యెఱ్ఱయ క్షేత్రయ
విఱిగిరి సిద్ధేంద్రయోగి | వెంటను నీటన్. ౩౧
తే|| కందుకూరి వీరేశలిం | గమును శ్రీశ్రి
జాషువా రఘుపతి యదృ | శ్యంబులైరి
కృష్ణదేవరాయలు నట్లె | కృష్ణరావు
నన్నమయయుఁ గూలెన్ నన్న | యాకృతి సెడె. ౩౨
చ|| మఱచిరి తన్మహాత్మకుల | మానవతాభర జీవనోక్తులన్
మఱచిరి రామరాయని య | మంద సదాశయ బృందగంధమున్
మఱచిరి నైకవర్ష పరి | మాణక నైజ సరస్వతీదశన్
మఱచిరి భావిపౌరజన | మానసమందున హత్తు ముద్రలన్. ౩౩
తే|| బ్రతికిపోయి రచట లేని | బహుమహాత్ము
లస్థలీయు లమాయకు | లాంధ్రులిట్లు
ముష్కరుల చేత ముఖమును | ముక్కు మూతిఁ
బగులఁగొట్టించుకొనకుండఁ | బ్రాంతము కత. ౩౪
మ|| ఒక యాదర్శము నేర్పె నొక్క మహనీ | యుం డక్కళామూర్తులం
దొక ధర్మంపు సజీవమూర్తి యయి వే | ఱొక్కండు భాసించెఁ దా
నొక కైలాస మహేశ్వరీయ సుకళా | నుష్ఠాన నిష్ణాత వా
రికి నీ ఘోర పరాభవంబు జఱుగన్ | రేఁగెన్ మదిన్ బుండుగాన్. ౩౫
ఉ|| ఏమిటికేడ్వ ? విగ్రహము | లెల్లను లోహమయంబులే కదా !
సోముగ సొమ్ము వోసి యదె | చోటను నిల్పఁగవచ్చు నన్నఁ బ్రే
మామృత ధారలై కుఱియు | మాతృ దృగశ్రుజలంబు నాల్కపై
బామి జలంబు నుప్పు సమ | పాళ్ళని శాస్త్రముఁ జెప్పినట్లగున్. ౩౬
ఉ|| ఎంతటివాఁడు కోరి సృజి | యించె నగాధ మహత్త్వభావనన్ ?
జెంతను నిల్చుచున్ బరవ | శించెఁ బవిత్రుఁడనైతి నంచుఁ ; దా
నంతట వాని ముట్ట నెదు | రబ్బెను వానికి నైతిహాసిక
త్వాంతరమేదొ ; యా మధుర | తల్ మఱుగయ్యెను, మర్చిరందఱున్. ౩౭
ఉ|| కారణమేమియో తెలియఁ | గక్షల మానుపవచ్చుఁ గాని ని
ష్కారణ వైరమూని తన | కక్షకుఁ గక్షయె కారణం బటం
చూరక మాటిమాటికిని | నుగ్రతఁ బూనెడు మూర్ఖచిత్తులన్
జేఱి శమింపఁజేయుటది | చేతవునే ఋషిపుంగవాళికిన్ ? ౩౮
కం || నచ్చకపోయిన యెడలన్
మచ్చిక నటనంబు , మెప్పు | మాయావిత్వం
బిచ్చినదెల్లయు మోసము ,
ముచ్చటలన్నియును గుట్ర | ముమ్మాటికిలన్. ౩౯
కం || తన యనదతనమున నగు
ననుమానము దాని వలన | నగుఁ బెక్కళుకుల్
తన భయమే ద్వేషంబగు
తన ద్వేషంబు పురికొల్పుఁ | దగని పనులకున్. ౪౦
ఉ || రథ్యను సర్వనేత్ర బహి | రంగముగాఁ బని సేసెనేనియున్
మిథ్యనె చూతురే జను ల | మేయ మనోరచిత స్వమాయచేఁ ;
దథ్య యథార్థ వస్తుగత | తత్త్వవివేచనులేరి భూమి ? వై
తథ్యమె సత్యమై సకల | ధారుణిఁ బల్పరి చుట్టఁబెట్టెడున్. ౪౧
ఉ || తప్పులు సేయఁగూడదది | తానుగ నైన సమష్టి నైననుం
దప్పి యొనర్తురేని నిఁక | దా రొరులన్ గఱప న్నయోగ్యులై
యొప్పుదు రెల్లకాలమున | కోడదు చూడుము తత్కళంక మె
ల్లప్పుడు నిల్చిపోవు బహు | ళాబ్ద సహస్ర చరిత్రసంపుటిన్. ౪౨
కం || తమ రక్తమె, తమ భాషయె,
తమ ధర్మమె , తమదు పొఱుగె | తమదు కులములే
తమ గోత్రములే , తమకున్
సములే యగువారి నేల | సాధింపంగన్ ? ౪౩
కం || బోధించిన శ్రేయమునకె
ప్రాధాన్యము గాని చెప్పు | వారి యభిజనం
బాధారమె మాన్యతకున్ ?
బాధయె జగతికి సమంత | భద్రుని పుట్టిల్ ? ౪౪
ఉ || ఎక్కడనో జనించి మన | మేమి యెఱుంగని భాష సాహితిన్
జిక్కగ వ్రాసిపోయెనట | షేక్‌స్పియరన్న మహాకవీశ్వరుం
డిక్కడఁ బల్లెకూటముల | నింగ్లిషు శాఖలు వెట్టి యాతనిన్
వక్కణ సేయరో ? తెలుఁగు | వారలు వాని కొలంది సేయరో ? ౪౫
చ || మనకెఱుకైన స్థాన్యులగు | మాన్యుల బొమ్మలు లేవు పో ; వృథో
న్మనులగుటేల ? వారు తమ | మట్టుకెఱింగినవారి విగ్రహా
లునిచిరి , స్థాన్యులన్ దెలియ, | రూరక ద్వేషమదేల ? పెట్టవ
చ్చును గద ? యిప్పుడక్కడనె | సూటిగ ? నున్నవి కూల్పనేటికిన్ ? ౪౬
తే || మనము మన పూర్వతరముల | మహిమ నెఱుఁగ
మాని భీష్మించి తత్ప్రతి | మలను బ్రుంప
నీవు నేర్పిన విద్యయే | నీరజాక్ష !
యని మన యపరులొనరింతు | రట్లె మనకు. ౪౭
చ || గడచిన కాలమందు మన | కర్చనయోగ్యములైన దేవళా
లుడిపిరి శత్రుజాతులని | యుగ్రతఁ జూపెదమైన నిట్టు లి
ప్పుడు మనమే స్వయాన మన | పూర్వుల పూజ్యతమ ప్రతీకముల్
మడిపి యిఁ కే మొగంబున వి | మర్శన సేసెదమో విదేశ్యులన్. ౪౮
శా || మేనుల్ మండి యొనర్చియుంద్రు సహజ | మ్మే యన్నచో మూర్ఖతన్
బ్రాణాపాయముగా విశృంఖల పశు | ప్రాయంపుఁ గ్రోధంబునన్
లీనంబై ప్రహరింతురో తమదు త | ల్లిన్ దండ్రినిన్ ? గిన్కకున్
స్థానాస్థానములుండవే ? మనుజులై | తామెత్తరే జన్మమున్ ? ౪౯
ఉ|| వ్యక్తికిఁ బోలె జాతి కని | వార్యము బాల్యము ; తెల్గుజాతికిన్
ముక్తి లభింపలేదు పసి | మొగ్గతనంబున నుండి యింకనున్ ;
శక్తివిరాజితుల్ ప్రగత | సంస్కృతిమంతులు లాఁతిజాతు ; లా
సక్తిని వారి మట్టమును | సంస్పృశియింపుదుమో ? నశింతుమో ? ౫౦
చ || మనిషికిఁ బోలె జాతులకు | మానవు హృత్పరితాప ఘట్టముల్
జనులొనరించు తప్పులవి | సల్పు క్షణాన నెఱుంగనేర్తురే ?
పనివడి ఱేపొ మాపొ తెలు | పం గలుగున్ వెసఁ గాలపూరుషుం
డను నొక దక్ష దేశికుఁడు | తత్తదవస్థితులన్ సృజించుచున్. ౫౧
మ || పునరావృత్తమగున్ జరిత్ర మనుజుల్ | పూర్వప్రవృత్తంబులన్
వినియున్ గొంచెము నేర్చుకోరు గనుకన్ | వేఱైన కాలార్థముల్
తన కన్వేయము గాదటంచును నసం | దర్భంబటంచున్ వెసన్
మనుజానీకము త్రోసిపుచ్చుఁ గనుకన్ | మార్పుండదీ కర్మలోన్. ౫౨
తే || దారి దప్పిన స్నేహితుల్ | తప్పుఁ దెలిసి
మఱలఁ గలసిపోయెడు కాల | మమఱు నెపుడొ
ప్రేమయును ద్వేషము నిజ మ | భేదములగు
వెలుఁగునీడలై వెన్నంటి | మెలఁగు నవియు. ౫౩
తే || మఱపు మన్నింపు నను రెండు | మనుచుఁ బ్రోచి
మనుజులొండొరుచే రూపు | మాయకుండఁ ;
గంటికిం గన్ను సిద్ధాంత | కలనఁ జేసి
పోవుఁ దుదకీ జగత్తు క | బోది యగుచు. ౫౪
సమాప్తము