విటప భంగము

2011 మార్చి 10న తెలుగువారి రాజధాని నడిబొడ్డున సాంస్కృతిక విధ్వంసం జరిగింది. జాతికి స్ఫూర్తిదాతలైన తెలుగువెలుగుల స్మృతి చిహ్నాలను ముష్కరులు ధ్వంసం చేసారు. ఈ సంఘటనపై కవి స్పందన, ఛందోబద్ధ పద్యాల్లో..


మ|| "చిరకాలంబుగఁ దెల్గుజాతికి బల | శ్రీదాతలై స్ఫూర్తివా
క్కరులై సత్పథ దర్శులౌచు ధ్రువ న | క్షత్రంబునుం బోని య
ప్పరమస్వచ్ఛమనీషులన్ స్మృతిపథం | బందుంచి యవ్వారలన్
స్థిరశశ్వద్విధి గౌరవింపఁగఁ బ్రతి | ష్ఠింతున్ గళాప్రాంగణిన్.         ౧


ఉ|| జాతిమతాదిభేదముల | జాడఁ జరింపని వర్గభేదనా
తీత సమాజ భావనకు | దిక్కును జూపుచుఁ బావనత్వమున్
లోఁతుగ నింపుచుండె నెద | లోపల నీ యతిలోకమూర్తులీ
నీతి నెఱింగినప్పుడిది | నిల్చును యాత్రిక దర్శనీయమై.            ౨


శా|| దివ్యత్వం బిడు నైతిహాసిక కళా | ధీమత్త్వ సంసేవనా
భవ్యప్రాంగణమౌ భవిష్యమున నీ | ప్రాంతంబు ; భూతార్థముల్
సవ్యాధ్వన్ మది గుర్తుసేయుచు విరా | జద్‌వర్తమానాళికిన్
నవ్యప్రేరణమిచ్చుచున్ భవితఁ దా | నర్చించు నీరాజనన్."         ౪


చ|| అనియెను నందమూరి సద | నాబ్జుఁడు తారక రామరావు తద్
ఘన మహనీయ మూర్తులెడ | గౌరవ భక్త్యనురాగ పుణ్య భా
వనలు నిజాంతరంగమున | వందలు వేలుగ సందడింపుడు-
న్ననుఁగుఁ దెనుంగు భావి పురు | షాంతరముల్ మదిలో స్ఫురింపుడున్. ౫


మ|| కలకత్తా నగరంబునం గలరు బెం | గాలీల యారాధ్య మూ
ర్తులు ; మద్రాసు మెరీన బీచిఁ గల వ | ట్లున్ ద్రావిడాగ్రేసరా
త్ముల శిల్పంబులు ; లోకమం దఖిల జా | తుల్ తమ్ముఁ దామిట్టులే
తొలుతన్ మన్నన సేసికో మనకు నీ | దుర్భిక్షమేలా ? యనెన్.        ౬


ఉ|| ఆ నటసార్వభౌముఁ డఖి | లాంధ్ర మహీతల శాసకుండు దే
శాన జనప్రశాస్తికిని | సంస్కృతి కేక ధురీణ నాయకుం
డూన విపక్షనాయకుల | యుగ్రవిమర్శలు క్రేణిసేసి హు
స్సేను సరస్సు నొడ్డున ర | చించెను ముప్పదిమూఁడు మూర్తులన్.   ౭


ఉ|| నాడు తెలుంగునాఁ డతి ధ | నాప్తి నెఱుంగని పేదదేశ ; మే
బేడకుఁ గానికైనఁ గడు | భీషణయుద్ధము ఢిల్లితోడ ; నే
డేడును బద్దులందు మిగి | లించిన దుడ్డు త్రికోటిరూప్యముల్
వాడి రచింపఁజేసె జన | వంద్య కళాకృతు లమ్మహాత్ముఁడున్.         ౮


సీ|| ఆద్యాంధ్రకవి నన్న | పార్యుండు కొలువయ్యెఁ
దిక్కన యజ్వయుఁ | దీర్చె గోష్ఠి
సత్ప్రబంధ పరమే | శ్వరుఁ డఖిలాగమ
విన్నాణి వచ్చె నె | ఱ్ఱన్న కూడ
దక్షిణాపథపతి | తానాంధ్ర శాతవా
హన చక్రవర్తియు | నరుగుదెంచెఁ
జాపకూటి మెయిని | సర్వసమత్వంబు
నుడివిన బ్రహ్మనా | యుఁడును వచ్చె

ఆ.వె|| భాగవతపుఁ గర్త | బమ్మెఱ పోతన్న
యలఁతిపదముల కవి | యన్నమయ్య
రణభయంకరి యగు | రాణి రుద్రమదేవి
చల్లని కవయిత్రి | మొల్లతల్లి.                                ౯


సీ|| శ్రీకృష్ణరాయలు | సింహగంభీరుఁడై
యొక్క పీఠమున ఱొ | మ్మొడ్డి నిలిచె
శ్రీరామ భక్తుఁడై | చివఱి రోజులు గడి
పిన తానిషా కూడఁ | బీఠమెక్కెఁ
దానిషాకును రామ | దర్శనదాతయౌ
రామదాసు నిలిచె | రమ్యసరణి
కూచిపూడీనృత్య | వాచస్పతి యయిన
సిద్ధేంద్రయోగి వేం | చేసె నచట

ఆ.వె|| ఆటవెలఁది పద్య | మాటాడుకొని పెక్కు
వేలు సెప్పినట్టి | వేమనయును
గాలవేదియగుచుఁ | గార్యముల్ దిద్దిన
పోతులూరి వీర | బొమ్మనయును.                                                                            ౧౦


సీ|| కర్ణాట వాగ్గేయ | కారశిరోమణి
త్యాగయ్యకా రథ్య | స్థానమయ్యె
మువ్వగోపాల స |మ్మోహన పదములు
వ్రాసిన క్షేత్రయ్య | వాసమయ్యె
యవనికా రంగోభ | యాభినయనుఁడైన
బళ్ళారి రాఘవ | బసయు నయ్యె
దక్షిణదేశాన | సాక్షాత్తుగా రామ
మోహనరాయిగా | మొరయు యశము

తే|| లీను శ్రీ కందుకూరి వీ | రేశలింగ
మిచట నెల్లలోకములొక్క | యిల్లటంచుఁ
బలుకు గురజాడ అప్పరా | వార్యుతోడ
నిలిచి తా జగదభివంద | నీయుఁడయ్యె.                                                                       ౧౧


సీ|| ఒగిఁ బాత్రికేయత | కొరవడి దిద్దిన
ముట్నూరి కృష్ణరా | వుండె నిచట
రఘుపతి వెంకట | రత్నము నాయుఁడు
ఠీవిఁ గూర్చుండె ని | త్తావునందె
గురుపీఠతుల్యుండు | గుఱ్ఱము జాషువా
పిల్లగాలుల హాయిఁ | బీల్చెనిచట
కావ్యవిమర్శన | కంఠీరవుండైన
రామలింగారెడ్డి | ధామమిదియె

తే|| ఱోయుచు మఱో ప్రపంచం మ | ఱో ప్రపంచ
మాశ్రయింతము పదుఁడన్న | శ్రీశ్రి యుండె
గౌతమీమండలప్రజ | కుదక కుంభ
ధుర్యుఁడగు సరార్థర్ కాట | నార్యు తోడ.                                                                      ౧౨

తే|| సరవి నాంధ్రుల సాంఘిక | చరితఁ గూర్చి
ధన్యుఁడగు సురవరము ప్ర | తాపరెడ్డి
మూఁడు వన్నెల బావుటా | ముద్దులొలుకఁ
బట్టు పింగళి వెంకయ్య | ప్రతిమలుండె.                                                                       ౧౩


తే|| కాననప్రజాకల్యాణ | కాముఁడగు న
రణ్యయోద్ధ సీతారామ | రాజుతోడ
త్రిపురనేని రామస్వామి | తీఱె దవున
రాజిలఁగను సర్వేపల్లి | రాధకృష్ణ.                                                                              ౧౪


కం|| మహబూబాలీఖానును
మొహియుద్దీన్ కవివరుండు | ముచ్చటగా నా
బహిరావరణమున మసలు
బహుజనులను జూచి కనుల | భాషింతురొగిన్.                                                              ౧౫


కం|| భాగ్యనగరమునకును సౌ
భాగ్యనగరికిని వివాహ | బంధన వేళా
యోగ్య మధుపర్కమటు గల
భోగ్యమహాపథమునఁ బొలు | పొందెను బ్రతిమల్.                                                            ౧౬


కం|| స్వీయజ్ఞాన వివేచన
సాయంబున రామరావు | స్వాంతమునం దా
నాయత్తము సేసికొనియె
నేయే శిల్పములొ యడుగఁ | డెవ్వఱి నైనన్.                                                                 ౧౭

కం|| "ఇవి కావలె, నివి వల"దని
యెవఱున్నానాడు చెప్ప | రే ; శిల్పములన్
బ్రవరాంశంబుగ నెవఱును
సవరింపరయిరటు లిఱు ద | శాబ్దుల దనుకన్.                                                               ౧౮


కం|| అది యొక తొలిపూనికయే,
తుదితీఱుపు కాదు ; ప్రభవ | తొలఁగ నటకళా
విదుఁడు పదంబును దొఱఁగెన్ ;
బదపడి కొనసాఁగదయ్యెఁ | బ్రతిమోద్యమమున్.                                                              ౧౯


కం|| మఱికొంతమంది ప్రముఖులు
చిరకాలాయువున నిఁకను | జీవించియె యుం
డిరి రామరావు యుగమున ;
గరుసులు కావయ్యెను బ్రతు | కరులకు మూర్తుల్.                                                          ౨౦


ఉ|| అందులఁ దెల్గుదేశమిది | యంతయునున్ మనదంచుఁ దెల్గువా
రందఱు నెంచుచుండ్రి ; నగ |రంబుల నంబువుఁ గూర్చి వాదముల్
పొంద రొకానొకప్పుడును ; బొమ్మలు స్థానికమో విదూరమో
కొందలమంద రత్తఱి న | కుంఠిత తెల్గు సమైక్యభావనన్.                                                     ౨౧


ఉ|| ఎందఱు పుణ్యమూర్తు లుద | యించిన ప్రాక్తన రత్నగర్భ యీ
సుందరమైన యాంధ్రక వ | సుంధర ! త్రవ్వినకొద్ది యింకను
న్నెందఱొ గొప్పగొప్ప మహ | నీయులు వెల్లడియౌదురే కదా !
ముందఱఁ గొందఱన్ బ్రభుత | మూర్తులుగా వెలయించె నాటికిన్ !                                     ౨౨


ఉ. కాలము నైకసైంధవ ని | కాయ వికర్షితమైన తేరునుం
బోలె ననూహ్యశీఘ్రగతిఁ | బోయెఁ ; గనుల్ తెఱువంగఁ జుట్టుతన్
దేలని క్రొత్తమోము లెగు | డై దిగుడైన పథం బవేద్యమౌ
గోలలు వింతగుంతలును | గోతులు పీతులు ఱొంపిఱోఁతలున్.                                         ౨౩


చ. మనుజులు తెల్విగా మిగుల | మాటల నాడఁగ నేర్చిరయ్యు నె
మ్మనఁమునఁ దెల్విగాఁ దలవ | మానిరి ; లోకమునం గుటుంబమున్
జనమతమున్ స్వసంస్కృతియు | సాహితియున్నొకటేమి ? యెల్లయున్
ఘనముగ రాజకీయములు | గాఁ బ్రభవించె నవార్థకల్పనన్.                                              ౨౪

About తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం

”నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం.” అనే తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుబ్లాగులోకానికి సుపరిచితులు. ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం అనేక తెలుగు పట్టణాలలో సాగింది. తర్వాత ఆయన మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. చేశారు.

తెలుగు భాష-సంస్కృతుల పట్ల ఆయనకున్న అభిమానం, వాటిలో ఆయనకున్న అభినివేశం ప్రశంసనీయమైనవి. ’తెలుగు సాహిత్యం’ బ్లాగులో సుమతీశతకం గురించి విపులంగా రాశారు. ఆసక్తి గలవారికి తన బ్లాగులో సంస్కృతపాఠాలు కూడా నేర్పారు. తెలుగుపదం గుంపులో ఆయన అనేక కొత్తపదాలను తాను సృష్టించడమేగాక అలా సృష్టించాలనుకునేవారికి మార్గదర్శకాలను సైతం రూపొందించారు.

ఆయన రచనల్లో ఎక్కువ భాగం అముద్రితాలు. వాటిని తన బ్లాగు ద్వారా అంతర్జాల పాఠకుల ముందుకు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.