కొత్త ఋతువు, కొత్త చివురులు, కొత్త పంచాంగం, కొత్త బడ్జెట్టు, కొత్త పన్నులు, వెరసి కొత్త సంవత్సరం!
సంవత్సరాంత పరీక్షలతో పిల్లలు హడావుడిగా ఉండే ఈ సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రతరమౌతూండటం ఆందోళన కలిగిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించాక కూడా పరిష్కార దిశగా తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో అనిశ్చిత స్థితి నెలకొంది. సమస్య సత్వర పరిష్కారానికి ప్రభుత్వ నేతలు, ఉద్యమ సారథులూ, వివిధ రాజకీయ పార్టీల నాయకులూ కృషిచేసి, ఈ అనిశ్చిత స్థితిని తొలగిస్తారని ఆశిస్తున్నాం. సమస్య పరిష్కారం ఎలా ఉన్నప్పటికీ, విద్యార్థుల చదువులు, పరీక్షలకూ ఎట్టి అంతరాయం కలగకుండా ఉద్యమాన్ని నడిపించాలని నాయకులను కోరుతున్నాం.
కవి సమ్మేళనాలతో ఉగాది వేడుకలు నిర్వహించడం పొద్దులో ఆనవాయితీగా వస్తోంది. వచన కవి సమ్మేళనం, పద్యకవిసమ్మేళనాలను విడివిడిగా నిర్వహించి, ఈ సమ్మేళనాల్లో వెల్లివిరిసిన కవితా సౌరభాలను పొద్దులో ప్రచురిస్తూ వస్తున్నాం. ఈమధ్య కాలంలో జాలంలో వచన కవిత రాసిలోనూ వాసిలోనూ కొంత తగ్గిన నేపథ్యంలో, పొద్దు కవిసమ్మేళనం ద్వారా కొత్త గొంతులను, కొంగొత్త కవిత్వాన్నీ వెలుగులోకి తీసుకురాగలమని ఆశిస్తున్నాం. ఒకవైపు వచనకవిత్వం తగ్గుదలలో ఉండగా, ఛందోబద్ధ పద్యాలు రాసి లోనూ వాసి లోనూ కూడా ఇతోధికంగా పెరగడం సంతోషం కలిగిస్తోంది. జాలంలో కొందరు పెద్దలు నిర్వహిస్తున్న సమస్యా పూరణలు ఇందుకు దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ యేటి పద్యకవిసమ్మేళనం కొత్త కవులతో ఎప్పటికంటే ఎక్కువగా శోభించే అవకాశం కనిపిస్తోంది.
ఖర నామ సంవత్సరంలో కవిసమ్మేళనాలతో పాటు, కొత్తగా కథలపోటీని కూడా నిర్వహిస్తున్నాం. ఈ పోటీకి సంబంధించిన ప్రకటనను ఈసరికే ప్రకటించాం. జాలంలోను, బయటా కూడా రచయితలు రచయిత్రుల నుండి నాణ్యమైన కథలను పొద్దు ఆహ్వానిస్తోంది. న్యాయనిర్ణేతలుగా పొద్దు సంపాదకవర్గ సభ్యులతో పాటుగా, సంవర్గంతో సంబంధం లేని ఒక ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కూడా ఉన్నారు. కినిగె.కామ్ వారి సౌజన్యంతో బహుమతులను సమర్పిస్తున్నాం. ఈ పోటీ ద్వారా, నాణ్యమైన కథలు తెలుగు సాహితీ లోకానికి అందగలవని పొద్దు ఆశిస్తోంది. మరిన్ని వివరాల కోసం కథలపోటీ ప్రకటన చూడండి.
’వసంతం’ సంచికతో కొత్త సంవత్సర సంపుటి మొదలవుతోంది. మా పాఠకులకు ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ’వసంతో’త్సవానికి స్వాగతం పలుకుతున్నాం.