కథాకథనం – 2

కథ

కొత్త కథకులకి కథ రాయడం గురించి తెలియాలంటే ముందుగా కథంటే ఏమిటో తెలియాలి. జరిగిన ఒక బలమైన సంఘటనను యథాతథంగా రాసినా, మార్పులవసరమైతే సహజత్వం చెడకుండా మార్చినా కథ అవుతుందనుకుంటారు కొందరు. జరిగింది రాసినా, కల్పించి రాసినా, రచనలో ఏం ఉంటే అది కథ కాగలదో, ఎప్పుడది కాలేదో తెలియాలి. ఉత్తరోత్తరా ఏమోగానీ, ఆరంభదశలో చిత్రరచనకూ, కథారచనకూ కొన్ని దగ్గర పోలికలున్నాయి. తద్వారా కథంటే ఏమిటో కొంత తెలుసుకోవచ్చు.


చిత్రాలలో కనిపించే కొన్ని తిన్నని గీతలూ, రెండు మూడు సున్నలూ, మరికొన్ని చుక్కలూ – ఇలాంటివన్నీ ఏ పిల్లవాడో అస్తవ్యస్తంగా ఒక కాగితంమీద గీసేశాడనుకోండి. ఏమౌతుందీ, ఏమీ కాదు. అలాగే కొన్ని పాత్రలూ, కొన్ని వర్ణనలూ, ఆ పాత్రల మధ్య సంభాషణలూ, అవి జరిగిన తీరుతెన్నులూ, చెప్పుకుపోయినా – ఒక ప్రదేశమూ, అక్కడి పరిస్థితులూ, ఆ మధ్య పాత్రలూ, అవి చేసిన పనులూ, వాటికి సంబంధించిన కష్టనష్టాలూ చెప్పేసినా – వేనికి వానిగా చూసినప్పుడు అవన్నీ కొత్తగానో, రమ్యంగానో, చమత్కారంగానో కనిపించినా – వాటన్నింటినీ సవ్యంగా క్రమపరిచే అంతస్సూత్రం లోపించినప్పుడు, వాటి సమాహారాలు (కలబోసిన రాసులు) ఏమీ కావు. అర్ధం పర్థంలేని రచనలౌతాయి.

పైచెప్పిన గీతలూ మొదలైనవి ఒక క్రమంలో ఉంటూ, అలా ఉండటం ద్వారా ఓ వస్తువుదో, జంతువుదో లేక మరోదానిదో ఆకృతిని గుర్తింపజేస్తే అది బొమ్మ అవుతుంది.
 

అలానే – రచనలో సంఘటనలూ, వర్ణనలూ, పాత్రల ప్రవర్తనా, వాటి సంభాషణలూ ఇలాంటివన్నీ వాటి వాటి మితులకు లోబడి, ఒకానొక అంతస్సూత్రానికి కట్టుబడి ఉంటే తద్వారా ఒక వృత్తాంతం తెలుస్తుంది. అంతకుమించి తెలియవచ్చేది అందులో లేకపోతే అప్పటికది వృత్తాంతం అవుతుంది.

ఒక బొమ్మే చిత్రం కానట్టు ఓ వృత్తాంతమే కథ కాలేదు. బొమ్మ, చిత్రం పర్యాయపదాల్లా అర్ధమౌతాయి. కాని కావు. ఒక ఆకృతి – మాటవరసకు పులిది అనుకోండి. ఆ ఆకృతి కళ్ళల్లో దాని జాతికి సహజమైన క్రౌర్యమో, మండీమీద కూర్చున్నప్పుడు ఒకానొక పులి ఠీవో, జంతువును వేసేటప్పటి లేదా మరో క్రూరమృగంతో తలపడేటప్పటి దాని భీషణ స్వరూపమో వ్యక్తమౌతున్నప్పుడు అలాంటి ఆకృతిని చిత్రమంటాము. పటంకట్టించి గోడకు పెట్టుకుంటాము.


చక్కటి రేఖల్లో ఎంత సహజంగా గీసినా, మంచి మంచి రంగుల్లో ఎంత అందంగా లిఖించినా, అది పులి ఆకృతిని మించి ఇంకేమీ చూపలేనప్పుడు, అది ఒట్టి బొమ్మ. కాకపోతే అందమైన బొమ్మ, సహజమైన బొమ్మ. బొమ్మకూ, చిత్రానికీ ఉండే కొంత తేడా, కొంత సారూప్యతా వంటివే వృత్తాంతానికీ కథకీ ఉన్నాయి.
 

ఎప్పుడో, ఎక్కడో జరిగిన సంఘటననో, సన్నివేశాన్నీ కల్పించి రాయొచ్చు. ఎలా రాసినా ఆ సంఘటనకు సంబంధించిన వృత్తాంతంలో ఆసక్తికరమైన ఒక విశేషం ఉండాలి. చిత్రంలో అందలి బొమ్మ ద్వారానే దానిలో విశేషం వ్యక్తమైనట్టు రచనలో అందలి వృత్తాంతం ద్వారానే ఆ విశేషం వ్యక్తం కావాలి. అలా అంతర్గర్భిత విశేషాన్ని వ్యక్తీకరించే వృత్తాంతమే కథ కాగలదు. వ్యక్తీకరించడానికి ఏ విశేషమూ లేని వృత్తాంతం ఒత్తి వృత్తాంతంగానే మిగిలిపోతుంది.

పై విషయాలను మరింత విశదంగా తెలుసుకోడానికి ఆర్.కే పబ్లికేషన్సు వారి ’నేటికథ’ అనే సంపుటంలోని ఒక ఉదాహరణ తీసుకుందాం.

’కృతజ్ఞత’ అన్న రచన ఉంది. అందలి సన్నివేశం, పాత్రలూ, వాటి సంభాషణలూ, ప్రధాన పాత్ర గౌరి పరిస్థితీ, ఆమె సమస్యా, దాని పరిష్కారం వీటన్నిటిద్వారా మనకి తెలియవచ్చే వృత్తాంతం ఏమిటి?


అదొక బస్తీ. ఓ ప్రభుత్వ కార్యాలయం దగ్గర లారీల్లోంచి కేర్ గోధుమనూక బస్తాలను ఆఫీస్ గోడౌన్లలోకి తరలిస్తున్నారు. చిరిగిన బస్తాల్లో నూక నేల పాలవుతోంది. పేదవాళ్ల పిల్లలు డబ్బాల్లోకీ, పాత్రల్లోకీ ఆ నూక ఎత్తుకుంటున్నారు. గౌరి ఇంట్లో ఆ పూట తినడానిక్కూడా లేదు. అరువు అడగబోతే షావుకారు తిట్టి తగలీశాడు. తిరిగొస్తూ ఈ దృశ్యం చూసి ఆగిపోతుంది. నూక ఎత్తుకోవడానికి పాత్ర అడిగితే ఎవరూ ఇవ్వరు. ఇంటి దగ్గర్నుండి తేవాలంటే తిరిగొచ్చేసరికి బుగ్గి కూడా మిగల్దు. ఒడికెత్తుకోబోతుంది. మోకాళ్ళు దిగని పొట్టి స్కర్టు బాగా మడుద్దామంటే లోపల చెడ్డీ లేదు.కొంచం మడిస్తే నూక నిలవడం లేదు. ఆమె అవస్థ గమనించిన ఓ గుమస్తా, ఆరోజు న్యూస్ పేపర్ ఆమె ముందు పడేస్తాడు. కృతజ్ఞతతో ఆమె నూక ఎత్తుకుంటుంది.


ఈ వృత్తాంతంలో ఇమిడి ఉన్న విశేషం ఏమిటి?
గౌరి వయసు పదమూడేళ్ళు. చిన్నదైతే ఆకలి సంగతి పట్టకపోను. పట్టితే సిగ్గు అడ్డురాదు. స్కర్టు విప్పేసి అందులోకి నూక ఎత్తేసుకునేది. లేదా పాత్ర కోసం ఇంటికి పరిగెత్తేది. తిరిగొచ్చేసరికి మిగల్దేమో అన్న ఊహ ఆమెకి రాదు. గౌరి పదమూడేళ్లది కావడం వల్ల అటు ఆకలి, ఇటు సిగ్గు, క్షణక్షణానికీ సమయం మించిపోతుందన్న స్పృహ, వీటన్నిటివల్లా ఉపాయం తోచకపోవడం – ఇదీ ఆమె అవస్థ. అలా వచ్చీరాని ఈడులో ఉన్న ఈ పిల్ల అవస్థా, దానికి చలించి ఎవరో ఆమెను బయటపడేసే తీరూ, ఇందులో ఇమిడి ఉన్న విశేషం.

ఇలా ఒక విశేషాన్ని ఇమిడ్చుకున్న వృత్తాంతం అవడం వల్లే ఒకటి రెండు ఇతర లోపాలు ఉన్నా ఈ వృత్తాంతం కథ అయింది. ఇదే సన్నివేశాన్ని రచయిత ఇంకొకలా రాసేరనుకుందాం.

మట్టిపాలౌతున్న నూకను తక్కినవారెత్తుకుంటుండగా, గౌరి అన్న అమ్మాయి అక్కడకు వస్తుంది. ఈ గౌరి వయసు పదమూడేళ్ళు కాదు, ఏడో, ఎనిమిదో, అమ్మ పనిలోకెళ్లగా గౌరికంతా ఆటవిడుపే ఎక్కడెక్కడో తిరుగుతూ అటుగా వస్తుంది. నూకట్టుకెళ్ళి షావుకారుకమ్మితే కొబ్బరుండలో, జీళ్ళో పెడతాడు. అందరూ డబ్బాల్లోకి ఎత్తుకుంటున్నారు. ఎత్తుకోదానికి గౌరి దగ్గర ఏమీ లేదు. బస్తాలెత్తే కూలీ ఒకడు తన కొడుక్కి కాబోలు – గుమాస్తా దగ్గిర పేపరు తీసుకుని ఇస్తాడు. గౌరి అటూ ఇటూ చూస్తుంది. ఎండిపోయిన ఎంగిలి విస్తరాకు కనబడుతుంది. దాన్నే తిరగేసి అందులోకి గబగబా నూకెత్తుకుంటుంది.


ముగింపులో ఎంగిలి విస్తరాకును పాత్రగా తేవడం తప్పిస్తే ఇందులో ఇంకే విశేషం లేదు. సన్నివేశం సహజమైనది కావడంవల్లో, గౌరి పేదింటి చిన్న పిల్ల కావడంవల్లో కొసకొచ్చిన పులివిస్తరాకుల్లో దీనికి ’ఎంగిలికూడ’న్న పేరు పెడితే ఆ పేరు వల్లో, ఒకప్పుడది కథగా చలామణీ కాగలిగినా – ముందటి వృత్తాంతంలోలా హృదయాన్ని తాకే విశేషం ఇందులో లేదు. కాబట్టి కథ కాలేదు.


జరిగిన సంఘటన ఒక దానిని కథగా రాయదలిస్తే పైవిధంగా కథకు ప్రాణతుల్యమైనది ఆ సంఘటనలో ఉన్నదా లేదా? ఉంటే ఏదీ? తేల్చుకున్నాకే కథ రాయాలి. కల్పితమైన కథను రాస్తే ఒక విశేషం వ్యక్తం చెయ్యడానికి ఈ వృత్తాంతం కల్పిస్తాం. అయినా అందలి వృత్తాంతం, విశేషం విడివిడిగా కనిపించరాదు. ప్రాణీ ప్రాణంలా ఒకటిగా కనిపించాలి. పరిశీలించినప్పుడు ప్రాణిలో ప్రాణంలా వ్యక్తం కావాలి.

కొత్తలో ఈ రెండిటినీ ఎవరికి వారుగా చూడాలంటే ఒక కొండ గుర్తుంది. కథగా చెప్పదగ్గ ఈ సంఘటన జరిగినప్పుడు మనం అక్కడ ఉంటే – మన కళ్లకూ, చెవులకూ, తదితర ఇంద్రియాలకూ తెలియవచ్చేది కొంతా, ఆ సంఘతనతో ప్రమేయం ఉండే వ్యక్తుల గురించీ, పరిస్థితుల గురించీ ఊహించగలది కొంతా ఉంటాయి.

ఈ భోగట్టా, ఈ ఊహా కలిస్తే తెలియవచ్చేది ఈ సంఘటనకు సంబంధించిన వృత్తాంతం. ఈ వృత్తాంతంలో మనని కదిలించేది ఉంటే దానిని కథగా చెప్పాలనుకుంటాం. అలా కదిలించేదేతైతే ఉందో అదే విశేషం. వృత్తాంతంలా ఇది ఇంద్రియాలకూ, ఊహకీ తెలిసేది కాదు. హృదయాన్ని తాకేది. వివేచనకు మాత్రమే వ్యక్తమయ్యేది.

ఇలా కథను గుర్తించడానికి తెలియవలసిన అంశాలన్నీ క్రోడీకరిస్తే –
ప్రదేశాలూ, వాటి వర్ణనలూ, సంఘటనలూ పాత్రల చర్యలూ, వాటి సంభాషణలూ మొదలైనవన్నీ ఉన్నంత మాత్రాన ఓ రచన కథ కాదు.

పై కథా సామాగ్రి అంతా క్రమబద్ధంగా అమరి ఉంటే వాటివల్ల ఒక వృత్తాంతం తెలుస్తుంది. అదైనా వృత్తాంతమే కాని అదే కథ కాదు. వృత్తాంతంలో ఒక ఆసక్తికరమైన విశేషం ఇమిడి ఉండాలి. ఆ వృత్తాంతం ద్వారానే ఆ విశేషం వ్యక్తమవ్వాలి. అలా ఈ వృత్తాంతంలో ఒక విశేషం ఇమిడి ఉండి ఆ విశేషాన్ని ఆ వృత్తాంతమే వ్యక్తం చెయ్యగలిగినప్పుడు –

అదే కథ అవుతుంది.

About కాళీపట్నం రామారావు

కారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు. ఈయన చేసిన రచనలు రాసిలో తక్కువైనా వాసికెక్కిన రచనలు చేసారు.

1966లో వీరు రాసిన ”యజ్ఞం” కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు. కథానిలయం తెలుగు కథకి నిలయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండేలా దాన్ని తీర్చిదిద్దుతున్నారు.

This entry was posted in వ్యాసం and tagged , , . Bookmark the permalink.