కథాకథనం – 1

తొలి ప్రయత్నంలోనే కథ రాయాలంటే అందరూ రాయలేరన్నది వాస్తవం. అలా రాయగలిగిన వారుంటే వారేదో ఆకాశం నుండి ఊడిపడ్డవారు కారు. మొదటిదెంత వాస్తవమో రాయడం పుట్టుకతో వచ్చేదనడం అంత అవాస్తవం. కథలు దాదాపు ఎవరైనా రాసుకోవచ్చునేమో, అందరూ ఎవరికి వారు పాడుకున్నట్టు. కానీ – మంచి కంఠం, నిశితమైన రాగజ్ఞానం, తాళజ్ఞానం ఉన్నవారు పాడినప్పుడే ఇతృలు వినగలుగుతారు. అలానే పదిమందికి పట్టే విధంగా (లేదా పదికాలాలు నిలిచేవిధంగా) రాయాలంటే అలా రాసేవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయి.
 


తమకు జరిగే మంచి చెడ్దలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ, మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది. కొందరిలో ఈ స్పందన తమకు జరిగే మంచి చెడ్దలతో ఆగదు. తమ వారికి జరిగే మంచి చెడ్డలకూ, తమవీ తమ వారివీ జీవితాలతో ముడిపడి ఉన్నవారి మంచి చెడ్దలకూ కూడా స్పందిస్తారు. అలా జీవితపు ముడుల సంగతి ఎక్కువగా తెలిసిన కొద్దీ – ప్రకితిలో కనిపించే అనేకానేక సూత్రాలకూ, దాని గాంభీర్యతకూ, అజేయతకూ, దానితో నిరంతరం పోరాడుతున్న మనిషి జీవితంలోని వెలుగు చీకట్లకూ, అందువల్ల ఏర్పడ్ద మానవ సంబధాల్లో పరస్పర ఘర్షణలకూ, వానిని క్రమ పరుచుకునేందుకు నిర్మించుకున్న వ్యవస్థలు మనిషి జీవితంపై నెరపే అనుకూల ప్రతికూల ప్రభావాలకూ, ఇలా తమ జీవితంలో ఆరంభించి దానితో ముడిపడి ఉన్న ఎన్నింటికో స్పందించే వారుంటారు. అలాంటి వాళ్ళు తక్కిన వాళ్ళ మీద మరింత మెరుగైన రచయితలు కావచ్చు.


వీరిలో –

కొందరు- ఎవరి డబ్బూ దస్కం వారిదే అన్నట్టు, ఎవరి కష్టసుఖాలూ, సమస్యలూ వారివే అనుకుంటారు. కొందరు డబ్బూ దస్కం ఎవరిది వారిదే అయినా కష్టసుఖాలూ, సమస్యలూ, పరిష్కారాలూ ఉమ్మడివనుకుంటారు. జీవితపు ముడుల సంగతి ఎక్కువగా తెలిసినవారు – జ్ఞానంతో సహా అన్నింటినీ తోటివారితో పంచుకోవడం భావ్యమనో, మంచిదనో అనుకుంటారు. పంచుకోగలిగినా, పంచుకోలేకున్నా మరికొందరు సాధ్యమైనన్నింటిని, సాధ్యమైన మేరకు, మమ్దితో పంచుకుంటారు. ఇదంతా వారి వారి సాంఘిక స్వభావం మీద చాలావరకూ ఆధారపడి ఉంటుంది. సాంఘిక స్వభావం అసలు లేనివారు రచయితలు కావడానికి ప్రయత్నించరు. ఇంతో అంతో ఉన్నవారెవరైనా ప్రయత్నిస్తే రచయితలు కావచ్చు.

రచయితలు కాగలవారు సాధారణంగా రాయడానికి ముందు చదువుతారు. చదువువల్ల దృక్పథం విశాలమైనట్టు కనిపించినా, చదువు వల్ల తాము మారినట్టనిపించినా, చదువుపట్లే కాకుండా రాతపట్ల కూడా ఆసక్తి పెరగ్గా చివరకు రచనకుండే శక్తి పట్ల నమ్మిక ఏర్పడ్దవారే, ప్రయత్నించినప్పుడు రచయితలయ్యే అవకాశం ఎక్కువ.

అలా కాకుండా-
ఫలానా శంకరనారాయణ రాసేడని ఒక ఆదినారాయణో, చెల్లెలు విమలమ్మ రాసిందని ఓ కమలమ్మో, అకస్మాత్తుగా కథ రాయబోతే ఎంత కొట్టుకున్నా వారి కలం ముందుకు సాగదు. పట్టుబలవంతాన ఎలాగో రాసి ముగిస్తే – అది ఏదో అవుతుందిగానీ కథ కాదు.

అలాగే-
పూర్వం లేదు కాని ఈ రోజుల్లో రాతల ద్వారా ఎంతో కొంత సంపాదనకవకాశముంది. ఏ పోటీలోనో మనం రాసిన కథ పేలితే, రాసిన ఐదారు పేజీలకే మూడు నాలుగు వేలు ముట్టే అవకాశముంది. ఈ స్థితి చూసికూడా కొందరు కథారచనకు దిగొచ్చు.

రాసిందానికి గుర్తింపో, డబ్బో రావడం వేరు. గొప్పలు కొట్టేయడానికీ, డబ్బులు పోగేసుకునేందుకూ రాయబోడం వేరు. ఇవి రెండూ రచయిత కావడానికి సహజమైన ప్రేరణలు కావు. ఇలాంటి ప్రేరనలతో రచనకు దిగినవారు ఎవరోకాని రచయితలు కాలేరు. అయితే పేరుకోసం, డబ్బుకోసం రాయడం తప్పా? వాటికోసం రచనలు చేస్తున్నవారు లేరా?

ఇవి విలువలకు సంబంధించిన ప్రశ్నలు. అందరి విలువలూ ఒకటి కావు. వాటికోసమే రాయదలచుకున్న వాళ్ళు వాటికోసమే రాయొచ్చు. తొలిదశలోనే వాటికోసం రాయదలచుకున్న వాళ్ళొక సంగతి గమనించాలి.

అచ్చం పేరుకోసం డబ్బుకోసం మాత్రమే రచనలు చేసేవారు చాలా తెలివైన వాళ్ళేకాక, ఎన్నో నేర్పులెరిగినవారై ఉంటారు. ఎన్నో ఒదులుకోగల వాళ్ళై ఇంకెన్నిటినో పోగొట్టుకోవడానికి సిద్ధమవ్వాలి. అయితే వాళ్లైనా ఆదిలో సహజమైన ప్రేరణలతోనే రచనా వ్యాసంగం ఆరంభిస్తారు. కథమీద పట్టు దొరికేక హృదయ వ్యాపారంగా మార్చుకుంటారు. మనంకూడా అంతటివారమే అయితే కథ రాయడం వచ్చేక ఆ మార్గం తొక్కొచ్చు.
అందాకా కథ రాయాలంటే-

 

  • మన స్వభావం జీవితంలో మంచిచెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి.
  • అనుభవాలనో, ఆవేశాలనో లేక అభిప్రాయాలనో ఇతరులతో పంచుకునే స్వభావం ఉందాలి.
  • సాహిత్యం ద్వారా ఆ పని జరుగుతుందన్న నమ్మకం, చేయగల శక్తీ ఉండాలి.
  • ఆదిలో ఆ శక్తి లేకున్నా ఫరవాలేదు. ప్రయత్నించి దానిని సంపాదించవచ్చు.

About కాళీపట్నం రామారావు

కారా మాస్టారుగా పసిద్ది పొందిన కాళీపట్నం రామారావు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన ఈయన రచనా శైలి సరళంగా ఉండి సామాన్యజ్ఞానం కల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేసారు. ఈయన చేసిన రచనలు రాసిలో తక్కువైనా వాసికెక్కిన రచనలు చేసారు.

1966లో వీరు రాసిన ”యజ్ఞం” కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రీకరించారు. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుపొందారు. ఈ ఒక్క కథ రేపిన సంచలనం, ఈ కథ గురించి జరిగిన చర్చ తెలుగులో ఏ ఒక్క కథకీ జరగలేదంటే అతిశయోక్తి కాదేమో.

ఈయన శ్రీకాకుళంలో ఫిబ్రవరి 22, 1997 సంవత్సరంలో కథానిలయం ఆవిష్కరించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటూ కథానిలయం కోసం ఎక్కువగా శ్రమిస్తున్నారు. కథానిలయం తెలుగు కథకి నిలయం. ప్రచురితమైన ప్రతి తెలుగు కథా అక్కడ ఉండేలా దాన్ని తీర్చిదిద్దుతున్నారు.

This entry was posted in వ్యాసం and tagged , , . Bookmark the permalink.