నీరెండ రంగుల్లో

పచ్చగా వున్నప్పుడు పట్టించుకోని
క్షణాలెన్నో
మనసుకింద పడి నలుగుతుంటాయి
నీరెండ రంగుల్లో పరిమళాలు చుట్టూ అల్లుకుంటుంటే
చూపెక్కడో అతుక్కుంటుంది
దృశ్యాలు దారం కట్టి లాగినట్టు
మెల్లిగా దూరంగా కదులుతుంటాయి
ఎవరెవరో మెదులుతూ… నవ్వుతూ…
మాట్లాడుతూ….
మళ్ళీ కధ మొదలయినట్టుగా!
 

జీవితమంతేనేమో..
మొదలయినట్టే ఆగిపోతుంది
ఆగిపోతూనే ఆరంభమవుతుంది
అందరిలో నుండి
అన్ని భయాల్లో నుండి
ఎదగడం నేర్పుకుపోతుంది
 

మధ్యాహ్నపు ఎండ,సాయంత్రపు గాలి,
రాత్రి చుక్కలు ఎప్పుడూ ఏదో ఒకటి
గుర్తుకు తెస్తూనే వుంటాయి
మనసు మెచ్చే క్షణాలెన్నెదురైనా,
అడుగు ఆగిపోయిన గతాలే ఎక్కువ!

About రామినేని లక్ష్మితులసి

లక్ష్మీతులసి రామినేని, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ, కుటుంబంతో చికాగోలో ఉంటున్నారు. కవితలు చదవడం-వ్రాయడం, పెయింటింగ్, సంగీతం వినడం, స్నేహితులతో గడపడం వీరి హాబీలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.