సత్యాన్వేషణ – మొదటిభాగం

మానవలోకంలో ధర్మానికి చోటు లేకుండా పోయిందని లోకం గగ్గోలు పెడుతూ ఉంది. ఇంచుమించు అన్ని దేశాలలోని మేధావులూ ఈ విషయం నొక్కి చెబుతున్నారు. పరిస్థితులు ఈ విధంగానే సాగిపోతే, కొద్దికాలంలోనే మానవుడు, యుగయుగాల నుంచీ తను సంపాదించిన జ్ఞానం, సంస్కారం కోల్పోయి జంజాలంలోకి దొర్లుతాడని భయపడవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి.
ఇటీవల పెచ్చుపెరిగిపోయిన దోపిడీవిధానం, దారిద్ర్యం దీనికి కారణం. మనిషికి ఎదో ఒక రకంగా బ్రతకటమే ముఖ్యసమస్య అయింది. బ్రతుకు దినదినగండం అయింది. అన్నమే ’పరబ్రహ్మ స్వరూపం’ అయింది. మనిషి ’ఆర్థికజీవి’ అయ్యాడు. అన్నం సంపాదించటానికి అవసరమైన విషయాలుకాక, మిగిలినవన్నీ తమ విరోధివర్గం తమను మోసం చేసి, తమను అజ్ఞానంలో, దారిద్ర్యంలో, బానిసత్వంలో అట్టిపెట్టటానికి లోకంమీద రుద్దిన ’విలువలు’గా పరిగణింపబడినాయి. అన్నంకోసం మానవుడు తన ఆత్మను చంపుకున్నాడు. సహజపరిణామాన్ని అరికట్టుకున్నాడు. బ్రతుకే దుర్ఘటం అయినప్పుడు అది అవసరమే అయింది. సంఘంలో నైతిక విలువలకు చోటు లేకుండా పోయింది.
మానవ పరిణామం ప్రాణం నిలుపుకోవటంతో ఆగదు. షడ్రసోపేతంగా భోజనం లభించినంత మాత్రాన మానవుడు తృప్తిపడడు, నిజమే. కానీ జనసామాన్యానికి తిండే కరువైనప్పుడు , ఏదో ఒకవిధంగా తిండి సంపాదించటమే ఆదర్శం అవుతుంది. తమకు తిండిని సంపాదించిపెట్టే ప్రతి సాధనం ఉత్తమసాధనమే అవుతుంది. నైతిక విలువలు నశిస్తాయి. సంఘం ఉడికిపోతుంది. ప్రజాబాహుళ్యాన్ని దారిద్ర్యంలో ఉంచటం వల్ల వచ్చిన పాపం మొత్తం సంఘానికి కొడుతుంది. మానవజాతే నశించేస్థితికి వస్తుంది. దారిద్ర్య నిర్మూలనమే దీనికి మందు. పైపూత వల్ల ప్రయోజనం ఉండదు. మానవుణ్ణి మిగిలిన విలువల్ని కోరగలిగిన స్థితిలో పెట్టాలి ముందు.
“అన్నమే పరబ్రహ్మం” అన్నాడు సత్యాన్వేషకుడైన శిష్యుడు.
“నాయనా, అన్నాన్ని మరిగించు” అన్నాడు గురువు.
శిష్యుడు మరిగించాడు. సత్యాన్ని కనిపెట్టాను అనుకున్నాడు.
“ప్రాణమే పరబ్రహ్మం” అన్నాడు.
“నాయనా, ప్రాణాన్ని మరిగించు” అన్నాడు గురువు తొణకకుండా

శిష్యుడు మరిగించాడు. ఈసారి తప్పకుండా సత్యాన్ని కనిపెట్టాను అనుకున్నాడు. ఉప్పొంగిపోయాడు.
“జ్ఞానమే పరబ్రహ్మం” అని చెప్పాడు.
దీనికి కూడా గురువు తొణకలేదు. “నాయనా, జ్ఞానాన్ని మరిగించు” అని చెప్పాడు.
శిష్యుడు జ్ఞానాన్ని మరిగించాడు. “ఆనందమే పరబ్రహ్మం” అని చెప్పాడు.

అధ్యాత్మికవాదులకు ’సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి’ పరమార్థం.అధ్యాత్మికవాదులు మానవునిలో అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలున్నాయని చెబుతారు. ఇది జీవకోటి పరిణామాన్ని నిరూపిస్తుంది. కానీ ఒకకోశం వృద్ధి చెందినంత మాత్రాన పూర్వకోశం రూపరహితం కాదు, ఉంటూనే ఉంటుంది. దానికి అవసరమైన పనులు జరుగుతూనే ఉండాలి. కానీ మానవుడి పరిణామాన్ని బట్టి ఒక్కొక్క దశలో ఒక్కొక్క కోశం ప్రాధాన్యం వహిస్తుంది.
పరిణామం ప్రవాహం లాంటిది. అంటే ఎప్పటికప్పుడు కొత్తనీరు కలుస్తున్నా పాతనీరు ఉండనే ఉంటుంది. పరిణామవాదాన్ని బట్టి, కదలని స్థితినుంచి కదులుతూ ఒక చోటునుంచి కదలని ఆ స్థితినుంచి నాలుగు కాళ్లమీద నడిచే స్థితికీ, ఆ స్థితి నుంచి రెండు కాళ్లమీద నడిచే మానవుని స్థితికీ ప్రకృతి పరిణామం చెందిందని తెలుస్తుంది. ఈ బాహ్యలక్షణాలన్నీ మానవునిలో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రపంచం స్థూలదృష్టికి కనిపిస్తున్నట్టు, ముక్కలు ముక్కలుగా, ఏ ముక్కకి ఆ ముక్కగా పరిణామం చెందటం లేదు. ఒకే పునాదినుంచి ఒకేవిధంగా పెరుగుతున్నది.
ఆధ్యాత్మికవాదులు భావానికి ప్రాధాన్యం ఇచ్చారు. పదార్థము చైతన్యమూ వేరనీ, చేతనశక్తి అనేక రూపాలు ధరిస్తూ ఉందనీ అనుకోవటం దీనికి కారణం. శక్తికి గుణం ఉండదు. జీవకోటికి కనపడే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పదార్ధానికి సంబంధించినవి. వీటిని జయించాలి, మానవుడు మోక్షాన్ని సాధించాలంటే త్రిగుణాతీతుడు కావాలి. తత్వమసి, ’అహం బ్రహ్మాస్మి’ అనే సంస్కారాన్ని పొందాలి అన్నారు.
పదార్థం, చైతన్యం వేరు అనుకోవటం వల్లా, చేతనశక్తి అనేకరూపాలు పొందుతూ ఉంది అని అనుకోవటం వల్లా, తనకూ మోక్షానికీ మధ్య పదార్థం నిలబడి తనను తప్పుదారులను తొక్కిస్తూ ఉంది అని అనుకోవటంవల్లా అనేక చిక్కులు తటస్థించినాయి. శరీరం మీద ఏహ్యభావం కలగటం, భౌతిక సమస్యలనుంచి వైదొలగటం, ప్రపంచాన్ని రోయటం, ఎవరికివారే తమ ముక్తికోసం కృషి చెయ్యటం, మానవప్రయత్నం మీద కంటే భగవంతునిమీద భారం వెయ్యటం మొదలైనవి. ఈ దృష్టి వల్ల ప్రజాబాహుళ్యానికి తీరని అపకారం జరిగింది. జ్ఞానంలో, దారిద్ర్యంలో మ్రగ్గటమే వారి జీవితం అయింది. తాము ముక్తిని పొంది, నిరంతరం ప్రజల సేవలో మునిగితేలినటువంటి బుద్ధునిలాంటి మహాపురుషులు మనదేశంలో లేకపోలేదు. తమకు విముక్తి లభించింది, తమ మనస్సులు అతినిర్మలంగా ఉంటాయి, వారు నిరంతరం కర్మలు చేస్తుంటారు కాని ఆ కర్మలు బంధాలు అవవు, వారిని అంటవు. ఈ స్థితికంటే పై స్థితి ఏదైనా ఉన్నా వారు కోరరు. బుద్ధుడు ఈ విధంగానే ప్రవర్తించాడని చరిత్ర చెప్పుతుంది. లోకంకోసం పై స్థితిని అతను నిరసించాడు.
కాని, ఇటువంటి దివ్యపురుషుల్ని కూడా ఆధ్యాత్మికవాదులు ’నాస్తికులు’ అని నిందించారు. దీనివల్ల ఆధ్యాత్మికవాదుల మనఃప్రవృత్తి అర్ధం అవుతుంది. ఏదైనా భగవంతుని వాసయోగ్యమైన ఈ శరీరం, వివిధ రూపాలు, ఈ ప్రపంచం వారికి పాపభూయిష్టంగా కనపడటం చాలా ఆశ్చర్యం.
మన వేదాంతంలో జ్ఞాని కర్మ చెయ్యాలా, అక్కర్లేదా అనేది చాలా తీవ్రమైన సమస్య. ఈ సమస్యమీద అనేక వాదోపవాదాలు చెలరేగినాయి. సామాన్య మానవుల మాట అటు వుంచి, జ్ఞానము, కర్మ -ఈ రెండూ వేరువేరు అయినట్లు అర్జునుడు శ్రీకృష్ణుని ’జ్ఞానకర్మలలో ఏది ఉత్తమము?’ అని అడిగాడు. ఇది ఉత్తమమా, అది ఉత్తమమా అని అడగటానికి ఈ రెండూ ఒకదానికి ఒకటి సంబంధంలేని విషయాలు కావు, ఒకదానిమీద ఒకటి ఆధారపడిన విషయాలు. ఒకే వస్తువు యొక్క రెండురూపాలు, ఎవరికీ అకర్మ స్థితిగాని, పూర్తికర్మస్థితిగాని సాధ్యంకాదు.

ఆలోచన కూడా ప్రకృతి చేష్టే! సంకల్పం కూడా కర్మే!
భగవంతునిమీద ఆధారపడటంవల్లగానీ, ఎవరి విముక్తి కోసం వారు పాటుపడుతూ, భౌతిక సమస్యలను సామాన్యుల చేతుల్లో ఉంచటంవల్లగానీ ప్రజలస్థితి దుర్భరం అయింది. దీనికితోడు అధికారంలో ఉన్నవారు ఆధ్యాత్మికవాదాన్ని తమ అధికారాన్ని నిలబెట్టుకోవటానికీ, తమ సుఖాలకూ ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. ప్రజలు నానాటికీ దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. వారిని రక్షించటానికి మరొక సిద్ధాంతం అవసరమయింది. ఆ పరిస్థితులు మరొక సిద్ధాంతానికి దారితీశాయి.
భగవంతుడు లేడు. సంఘంలోని ఈ హెచ్చుతగ్గులు భగవంతుడు సృష్టించాడని చెప్పటం మోసం. ప్రజాబాహుళ్యాన్ని దారిద్ర్యంలో ఉంచి, వారి సహజ శక్తుల్ని చంపి, నిరపాయంగా దోపిడీ చెయ్యటానికి స్వార్థపరులు, ధనికవాదులు సృష్టించిన సిద్ధాంతం ఇది. వర్గసామరస్యం అబద్ధం. దోచుకునేవాళ్లకీ, దోపిడీచెయ్యబడే వాళ్లకీ సామరస్యం ఏమిటి? వర్గకలహమే యథార్థం. వర్గకలహం వల్లే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది.
పదార్థమే అనాది పదార్థం. పదార్థానికి విడిగా దానిని నడిపించే మరేశక్తీ లేదు. పదార్థం తనకు తానే పరిణామం చెందుతూ ఉంది. అది దాని స్వభావం. పరిణామం చెందుతూ, తనలో ఉన్న శక్తులను బహిర్గతం చేసుకుంటూ ఉంటుంది. ఈ పరిణామాన్ని ఎవ్వరూ పైనుంచి నిర్దేశించలేదు. ఎవ్వరూ పైనుంచి ఈ పరిణామానికి సహాయం చెయ్యటం లేదు. అనుభవంవల్ల ప్రకృతిచేష్టలను అర్ధం చేసుకుని, ప్రకృతినుంచి రక్షించుకోటానికి అవసరమైన గుణాలను తనలో తాను పెంపొందించుకుంటూ జీవకోటి వృద్ధి చెందుతూ ఉంది.

 

(1949 విరోధి సంవత్సరాది సంచిక నుండి – DLI సౌజన్యంతో)

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.