విమర్శ ప్రమాణము


(ఆంధ్ర పత్రిక 1944 తారణ సంవత్సరాది సంచిక నుండి)


సృష్ట్యాదినుండి ఇప్పటివరకు కవులెంతమంది పుట్టినారో చెప్పలేము. కాని, వారిలో మనమిప్పటికీ స్మరించేవారు కొద్దిమందే ఉన్నారు. అయితే మనము మరచిపోయినంతమాత్రము చేత మన జ్ఞప్తిలో లేనివారు కవులు కాకపోరు. మనకు జ్ఞాపకమున్నంత మాత్రము చేతనే వారంతా మంచి కవులనడానికీ వీలులేదు. ఇక మనము మరచిపోయిన విమర్శకులు ఎంతమంది ఉండేవారో చెప్పనేలేము కదా.


అందరూ విమర్శకులే.

వజ్ర పరిక్ష ఎంత కష్ట సాధ్యమైనదో అంతకంటే సహస్రగుణము కావ్యపరిక్ష కష్టసాధ్యమైనది. వజ్రపరిక్షకు ఒక వజ్ర ప్రపంచము తెలిస్తే చాలును కానీ కావ్య విమర్శకు కావల్సిన సామాగ్రి అపరిమితమైనది.

ఇప్పుడున్న కవుల సంఖ్య స్థూలంగా చూస్తే సృష్ట్యాది నుండీ ఇప్పటిదాకా ఉన్న కవుల సంఖ్యకు సరిపోతుందా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు విమర్శకుడు కానివాడే లేడు. డెమాక్రసీ రోజులు కనుక కవిత్వమూ, దాని విమర్శా సర్వసాధారణము కావడము న్యాయమే. నాకెందుకు, నేను పది పన్నెండేళ్ళు వచ్చినప్పటినుంచీ కవిత్వమూ, కవితావిమర్శా మొదలు పెట్టినాను. ఎప్పటికప్పుడు నేను చెప్పే కవిత్వమువలెనే నా విమర్శకూడా నాకు మాత్రము బాగుండేది. అయితే ఎప్పటికప్పుడే కాని ఆ తృప్తి, వెనకటి కాలంలో బాగున్న కవిత్వము కాని, విమర్శలు కాని ఇప్పుడు నాకే నచ్చడములేదు.
 

ఒకే ఒక ప్రశ్న

అందువల్ల ఈమధ్య కొంతకాలమునుంచీ నన్ను ఒక ప్రశ్నపట్టి బాధిస్తున్నది. బంగారము మంచిదో, చెడ్డదో విచారణ చేయవలెనంటే స్థూలంగా గీటురాయి వల్ల చెప్పవచ్చును. ఇంకా సూక్ష్మమైన సాధనాల వల్ల కొలత వేసి ఇంత బంగారము, ఇంత రాగి, ఇంతమట్టి అని చెప్పే వీలున్నది. అట్లాగే ఇతర విషయాలు కూడా మంచి చెడ్డల విచారణ చేయడానికి ఏవో ఆధారాలు ప్రమాణాలు ఉన్నవి.


ఏది కొలబద్ధ?

కవిత్వానికి, విమర్శకు అటువంటి కొలబద్ధలు ఏమైనా ఉన్నవా? ఉంటే అవి ఎంతవరకు నమ్మదగినవి? కావ్యము మంచిదేదో, చెడ్డదేదో తెలుసుకునేందుకు ప్రమాణము దొరికితే కవిత్వానికీ, విమర్శకూ ప్రమాణము దొరికినట్లే కాబట్టి రెండింటికి కలిపి పర్యాలోచన చేద్దాము. అందులో పాశ్చాత్య్లమీద అభిమానము చేత ఆధునికులు అమలులోకి తెచ్చిన కొన్ని ప్రమాణాలు ముందు విచారిద్దాము. అయితే అవి మనకూ కొత్తవి కావు.


కాలమా?

అటువంటి ప్రమాణ కోటిలో ప్రప్రథమముగా పరిగణించేది కాలము. ఏ కావ్యము శాశ్వతముగా జనాదరణపాత్రముగా ఉంటుందో అదే గొప్పకావ్యమని ఉద్దేశ్యము. ఎన్నో గ్రంథాలు తాత్కాలికముగా జనుల మనస్సులు ఆకర్షిస్తవి. కొద్ది రోజులకు మళ్ళీ వాటి సంగతి తలిచేవాళ్ళు కూడా ఉండరు. హోమరు, డాంటీ, షేక్స్పియరు – ఇత్యాది మహాకవుల గ్రంథాలు కొన్ని శతాబ్దాలుగా మనము చదివి ఆనందిస్తున్నారు అవే ఉత్తమ కావ్యాలు, వాటి గుణము శాశ్వతత్వము కాబట్టి కావ్యానికి కాలమే ప్రమాణములనిపిస్తున్నది.


అందులో విప్రతిపత్తి లేదు

ఐతే ఇవ్వాళ వ్రాసే కావ్యము మంచిదో, చెడ్డదో విమర్శించడానికి ప్రస్తుతము వీలు లేదన్నమాట. కాలము విమరీంచి నిలిపేదాకా మనము ఆగవలసి వస్తుంది. ఇక కాలమంటే ఎంతకాలము!
 

అదీగాక ఒక్కొక్క కావ్యము ఉండడానికి దాని గుణమేకాక మరెన్నో కారణాలు ఉండవచ్చును. ఒక మహాకవి వ్రాసిన సామాన్య కావ్యాలు కూడా జనము అతనిమీద గౌరవముచేత స్మరిస్తూ మరవకుండా ఉంటారు. ఒక్కొక్కప్పుడు మతసంబంధమైన స్పర్శ కలుగుతే ఆ మతస్థులకు అది పూజ్యమై శాశ్వతమవుతుంది. చివరకు ధైర్యము చేసి పచ్చిబూతుగా ఎవరైనా పుస్తకము వ్రాస్తే అన్నిటికంటే అది శాశ్వతమవుతుందని నా విశ్వాసము. విశ్వాసము లేనివారు కాళిదాస ప్రహసనమనే ప్రసిద్ధి ఉన్న ప్రహసనము వ్రాసినవాణ్ణి, మన కవి చౌడప్పనూ అడగండి! ఈ విధంగానే ఉత్తమత్వమే కాక మరెన్నో కారణాలు ఉండవచ్చును-చిరంజీవులుగా ఉండడానికి.


అంతేకాక ఉత్తమమైనవి ఎన్నో కావ్యాలు కాలగర్భంలో పడిపోయినవి కవి తాను ప్రచారము కోసము ప్రయత్నించకపోతే లోకానికి ఎట్లా తెలుస్తుంది! ఒక్కొక్కప్పుడు ఉపద్రవాలవల్ల కావ్యాలు పోతవి. కొన్ని గ్రంథభాగాలే కనిపిస్తవి.ఎన్నో కాలగర్భంలో పడిపోయినవి చిత్రముగా కొన్నాళ్ళకు పైకి వచ్చి జనాదరణపాత్రమవుతున్నవి. ఇటువంటిదానికి గొప్ప ఉదాహరణము ఇప్పుడు మనము సామాన్యముగా భాసనాటకాలని వ్యవహరిస్తున్న ప్రతిమాది నాటకల్లు. ఇందులో రెండు విశేషాలు. అవి ఎవరు వ్రాసినా చక్కని నాటకాలే. అవి ఎన్నాళు కాలగర్భంలో పడిపోయినవో తెలియదు కదా! ఇప్పుడా నాటకాలు నమ్మకమైన ఆధారాలు లేకపోయినా, భాసుడి పేరుతో ముడివేయడమువల్ల వాటికి మరింత జనాదరణము వచ్చినదనడము నిస్సందేహ విషయము!


కాబట్టి కాలమనే ప్రమాణము మనకు విశ్వాసపాత్రమైనది కాదు.


విశ్వజనీనతా?

కాలము కాదు కావ్యము బహుకనాదరపాత్రము కావలె అంటే ఒకరకమైన మనుష్యులకే కాక బహువిధాలవారికి కావ్యము నచ్చవలె. అప్పుడే అది మంచి కావ్యమవుతుంది. అంటే మంచికావ్యాలు బాలురవద్దనుంచీ పరిణతబుద్ధులవరకూ అందరికీ బాగుండవలె. పిల్లలు కథాచమత్కృతికి వ్యగ్రులవుతారు.శాబ్దికులు శబ్ద సౌష్టవం వల్ల ముగ్ధులవుతారు. ధర్మప్రబోధముతో ధార్మికులు సంతుష్టులవుతారు. మహాభారత ప్రస్తావనలో పూజ్యపాదుడైన నన్నయభట్టారకుడు కూడా ఈ గుణమే ఉద్ఘాటించినాడు.

 


"ధర్మతత్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని
యధ్యాత్మ విధులు వేదంతమనియు
నీతి విచాక్షునుల్ నీతి శాస్త్రంబని
కవి వృషభులు మహా కావ్యంబనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికు లితిహాసమనియు
పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చ యంబని"


ఇంకో విధముగా కూడా మనపెద్దలు ఈ గుణాన్నే వర్ణించినారు.


"ఒక్కొక్కని కావ్యము కవి గృహములోనే నిలిచిపోతుంది. మరొకరిది ఆ కవి స్నేహితుల ఇళ్ళదాకా వెళ్ళుతుంది. ఇక మరిఒకరి కావ్యము అనిదగ్ధుల సదనములందు పాదములుంచి విశ్వకుతూహలివలె శాశ్వతముగా సంచరిస్తుంది"


ఈ గుణాన్నే విశ్వజనీనత (Universality) అని పాశ్చాత్యవిమర్శకులంటారు.


అదీ నిలవదు

అయితే ఈ కొలబద్ద వేస్తే ఎన్నో మంచి కావ్యాలు పోతవి. కొన్ని కావ్యాలు పరిణతబుద్ధులకేకాని ఆనందము కలిగించవు.

 


"లేజవరాలు చెక్కుగీ
టిన వనవల్చు బాలకుడు
డెందమునన్ గరగంగ నేర్చునే?"


అన్నాడు కాదూ మన తెలుగు కవి! మరి అంతగొప్పగా నన్నయభట్టారకుడు మహాభారతమును ప్రశంసించినాడా? దాన్ని కూడా కొందరు నవనాగరికులు, ద్విజులు తమకు ద్విజేతరులచేత శాశ్వతముగా దాస్యము చేయించుకోడానికి వ్రాయించిన ప్రచార ప్రధానమైన గ్రంథమని తోసివేస్తున్నారు. అంతమాత్రముచేత మహాభారతము కూడా పోవలసిందేనా? కాబట్టి ఈ విశ్వజనీనత కూడా నమ్మకమైన కొలబద్ధ కాదు.


ఉదాత్తతా? అంటే……

ఇక కొందరు ఉత్తమ కావ్య లక్షణము ఉదాత్తత (Sublimity) అంటారు. మిల్టను వ్రాసిన పారడైజు లాస్టు చూడండి! అందులో మనుష్య జాతికే సంబంధించిన ఉదాత్త విషయాలు చిత్రించినాడు. డాంటీ వ్రాసిన డివైను కామెడీ కూడా అంతే! అట్లాగే గెటీ వ్రాసిన ఫాస్టు ఆలోచించండి. రవీంద్రుని 'కింగు ఆఫ్ ది డార్కు ఛేంబరు', మీటరు లింకు వ్రాసిన 'బ్లూబర్డు', 'ది సైటులెస్', హాప్ట్మను ది 'ది బెల్' హోమరు చిత్రించిన యుద్ధము కూడా సామాన్యమానవులది కాదు. దేవతాసములైన వీరులది. పెద్దలు పురాణము పంచలక్షణమని చెప్పినారు. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము! అట్టి ఉదాత్త ఏవయ వర్ణన చేసేదే ఉత్తమ కావ్యము!


అందులో బాధకాలు

ఈ గుణము కొలబద్దగా తీసుకుంటే ఉత్తమ కావ్యకోటిలో అందరూ సామాన్యముగా పరిగణించే కావ్యాలు చాలాభాగము వస్తవి. నాకెందుకు నాకు గాఢాభిమానపాత్రమైన కావ్యాలన్నీ వస్తవి. మహాభారతానికి మకుటాయమానమైన స్వర్గారోహణపర్వము ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకోండి! మానవులలో ఉత్తముడు ధర్మరాజు అందరిలో మానవ శరీరముతో స్వర్గములో అడుగుపెట్టదగినవాడు అతడొక్కడే! అతనికి బంధుజనులను చూడ బుద్ధిపుట్టగా ముందు ఉన్నతాసనము మీద దుర్యోధనుణ్ణి చూపుతారు. తన సోదరులు నరకములో ఉంటారు. దేవనీతిమీద కొంత సేపటికి అసహ్యము కలుగుతుంది ధర్మరాజుకు! చివరికి మానవనీతికీ దేవనీతికీ భేదము విశదీకరించి ఆకాశగంగలో స్నానము చేస్తేనే గానీ ధర్మరాజుకు కూడా 'మానవ భావ వికారముల శోకబంధము'లడగవని, అప్పుడే కాని స్వర్గ సౌఖ్యము అనుభవింపరాదనీ విశదీకరిస్తారు. ఈ విధముగా ఈ లోకనీతితో కట్టుబడే మనకు ఇంతకంటే ఉదాత్తమైన నీతి బోధించినాడు వ్తాసభగవానుడు! ఈ విధంగానే ఉదాత్తవిషయములు చిత్రించగలిగినవారే మహాకవికోటిలోకి వస్తున్నారు. అయితే ఈ ఉదాత్తధర్మమే ఉత్తమ కావ్య లక్షణమంటే బాగున్నట్లే ఉన్నది కానీ దీనికి కూడా ఎన్నో బాధకాలు ఉన్నవి.


అసలుకే మోసము

ముందు అసలిది సంసార పక్షమైన కొలత గాదు. ఈ కొలతబద్ధ వేసి కొలిస్తే నిలవగలిగే కావ్యాలు బహుస్వల్పము. ఇక మహాభారతాదులే కావ్యాల్య్ – ఇతరము కాదంటే కవులు చాలాభాగము వ్రాయకుండా ఊరుకోవలసి వస్తుంది. షేక్స్పియరు నాటకాలు చాలాభాగము పోతవి. మాలతీమాధవము నిలవదు. కాళిదాసు మేఘదూతము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము కూడా గణనలోకి రాకపోవచ్చును. అమరుకము ఏమి కావలె! గాథాసప్తశతి?


అవ్యాప్తి

కవులూ, విమర్శకులూ ఎందరో రామణీయకవాదులు కావ్యానికి ఉదాత్తత, దానికి ఉత్కృష్టత ఆపాదించే ఒక గుణవిశేషమే కాని నిత్యధర్మము కాదు. ఎన్నో కావ్యాలు రమ్యంగా మాత్రమే ఉంటవి. వాటి విషయముల ఈ ఉదాత్తత ఎంత గాఢాభిమానమైనా ప్రమాణభూతము కాని ఒప్పుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది.


పోనీ, రామణీయకమో?

ఇక ఉదాత్తతను బాధించిన రమ్యత పోనీ, విశ్వసనీయమైన ప్రమాణమవుతుందా?కావ్యము మనోజ్ఞముగా ఉండవలె! "A thing of beauty is a joy forever" అని కీట్సు ప్రారంభించినాడు. కొందరు కళకు గమ్యస్థానము కళయే అన్నారు. కవులు చిత్రకారులవలెనే సౌందర్యోపాసకులు. అలంకారికులలో అధునాతనుడైన జగన్నాథపండితరాయలు "రమణీయార్థ ప్రతిపాదక శబ్దమే కావ్య" మన్నాడు. శ్రీ రాయప్రోలు సుబ్బారావు కూడా అన్నాడు

 


"నిర్వికల్పక విజ్ఞాన నిరతులైన
బ్తహ్మ వాదులకును, హ్లాదరమణీయ
వాదులైన కవులకును భేదమెంతు,
తారతమ్య మీమాంసకు తగను నేను"


బాగానే ఉంటుంది

మమ్మట భట్టారకుడు "కవిభారతి హ్లాదైకమయ" మనీ, "నవరసరుచిర" మనీ అన్నాడు. కావ్య విమర్శకు ప్రమాణముగా ఈ రమ్యత, మనోజ్ఞత అని అంగీకరించేందుకు చాలా అవకాశము కనబడుతున్నది. ఎంత చిన్న కావ్యమైనా మనోజ్ఞమైతే మనకది గ్రాహ్మమే!


కానీ, దానికి వ్యవస్థ లేదు

ఐతే దీనికి కూడా బాధ లేకపోలేదు. కావ్యానికి మనోజ్ఞతే ప్రధాన లక్ష్యమైతే ఇప్పటికి లోకములో ఉత్తమోత్తమకావ్యాలుగా పూజింపబడే కావ్యాలే వెనుకబడిపోతవి. ఉదాత్త కావ్యకోటిలో ఉదాహృతమైన కావ్యాలన్నీ మనోజ్ఞతలో చాలా చిన్న కావ్యాలకు తీసిపోవచ్చును. అంతే కాదు. ఈ మనోజ్ఞతకు సరియైన వ్యవస్థ చేసే వీలు లేదు. ఈ మనోజ్ఞత మనిషిని బట్టి మారుతుంటుంది. కాముకునికి శృంగార ప్రశంస ఒక్కటే మనోజ్ఞము. భక్తునికి భక్తి ప్రశంసే కాని శృంగార ప్రశంస అసహ్యము కలిగిస్తుంది. ప్రాకృత జనానికి పచ్చి బూతు రుచిగా ఉంటుంది. పాపము! వరూధిని మనోజ్ఞత ప్రవరాఖ్యునికి పనికి రాలేదు. ఆ శ్రోత్రియబ్రాహ్మణునిని అరణులు, దర్భలు, అగ్నులు ప్రియమైనట్లు అన్యములు కావు.

కాబట్టి ఈ రమ్యత కూడా అవ్యవస్థితమై పోతుంది.


భావనాబలమూ కాదు

పోనీ, కొందరు కవికి భావనాబలము (Imagination) ఉండవలె నంటారు. కదా అంటే ఇదమిత్థమని మనము స్పష్టముగా తెలుసుకునే వస్తువు కాదిది!


కావ్యాలాపాలు

మరికొందరు మనిషిని కావ్యాలు కదిలిస్తవి, ఉద్రేకము కలిగిస్తవి అంటారు. మద్యాదుల సేవవల్ల కలిగే ఉత్సాహమూ, ఆవేశమూ వంటిదే కావ్యపఠనము వల్ల కలిగే ఫలితమని వీరి ఉద్దేశ్యము. తనపాఠకుల చేత వీరంగము వేయించడమే కవివిధి అంటే పెద్దమనుషులైన వారు కవిత్వము జోలికి పోరు. అటువంటి కావ్యాలను ఉద్దేశించే పెద్దలు 'కావ్యాలాపములు విసర్జించవలె'నని పలికి ఉంటారు.


ఉపజ్ఞలో ఓగు

అదికాదు కవికి ఉండవలసింది ఉపజ్ఞ (originality) అంటారు కొందరు. అయితే కాళిదాసంతటి వాడు తనకు ఉపజ్ఞలేదని

"మణౌ వజ్ర సముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః"

అని ఉద్ఘాటించినాడు. ఉపజ్ఞ విమర్శకు ప్రమాణమైతే రఘువంశము మంచి కావ్యము కాదని తోసివేసే అవస్థపడుతుంది. అటువంటి కావ్యవిమర్శకు దూరమునుండే నమస్కారము చేయవలసి వస్తుంది.


వైచిత్రిలోని విపరీతాలు

మరికొందరు కవికి కావలసింది "వైచిత్రి" అంటున్నారు. నిజముగా ఆలోచిస్తే ఉపజ్ఞలేని వాళ్ళను అనుకరించబోయి చూపే ఉపజ్ఞాభాస ఈ వైచిత్రి అని స్పష్టమవుతుంది. కావ్యరచన ధనసంపాదనకూ, కీర్తిసంపాదనకూ, ఉపకరించే వ్యాపారముగా మారిన తర్వాత లోకవంచనకు చిల్లరకవులు చేసే గారడీ ఈ వైచిత్రి. 'నీ పేరేమి' ని తలక్రిందులు చేసి చవుకగా వైచిత్రిగల కావ్యముగా చేయవచ్చును.అప్పుడు అది 'మిరేపేనీ'? అవుతుంది.

'వైచిత్రి' కావ్యానికి కొలబద్ధగా తీసుకుంటే ఏమవుతుందో అది 'వికటకవి' కే వదలవలసి ఉంటుంది.


దేని కదే

ఇక కొందరు "ఏ కావ్యాని ఆ కావ్యమే గాని కావ్యాలన్నింటికీ సామాన్య ధర్మము లేదు. ఏ కావ్యానికి అదే ప్రమాణము, అంటే కావ్యము చదివి అది ఏ ప్రమాణములతో బద్ధమైనదో తెలుసుకుని విచారించవలెను" అంతారు. ఇది విమర్శకులు ముఖ్యముగా గమనించదగిన విషయము. అయితే ఈ పద్ధతి విషయగ్రహణానికి మాత్రమే పనికి వస్తుంది కాని అది మంచిదా, చెడ్డదా, గొప్పదా, తక్కువదా-ఈ విధముగా విలువకట్టడానికి ఉపయోగించదు. అర్థము చేసుకోకుండా విమర్శ ప్రారంభించేవారికి ఈ పద్ధతి అడ్డు తగులుతుంది.


అభ్యుదయ రచయితలకు పోటీ

"ఇకముందు లోకంలో రాబోతున్నది కమ్యూనిజము, దానికి అనుకూలించేవే మంచి కావ్యాలు, ఇతరమంతా తుచ్ఛమైనవి" అంటారు ప్రోగ్రెసివ్ రైటర్సు అనే పేరుపెట్టుకుని కొందరు. వారు చెప్పేదంతా కావ్యవస్తువుకు సంబంధించినదే కాని, కావ్యస్వరూపానికి సంబంధమేమాత్రమూ లేనిది. ముందు ఎట్లా ఉన్నా, అది అంగీకరిస్తే ఇంతవరకూ లోకంలో గొప్పకావ్యాలనుకునేవి తోసివేయవలసి వస్తుంది. వాటి రుచి ఎరిగినవారు ఎన్నటికీ అందుకు ఒప్పుకోరు. వీర్తో పోటీగా చాలారకాల ప్రచారకులు తమకు ఇష్టమైన ప్రచారానికి ఉపయోగించేదే కావ్యమని పోటీకి వస్తున్నారు.


సున్నకు సున్న, హళ్ళికిహళ్ళి

ఇంతవరకూ పాశ్చాత్యవాసనవల్ల మనవాళ్ళు వాడుకలోకి తెచ్చిన విమర్శాదర్శములు పరీక్షించి చూచినాము. అవి అన్నీ కూడా కేవలము పాశ్చాత్యులవే కావని కూడా సూచించినాము. అయితే పైవాటిని పరీక్షింపగా ఒకటీ తృప్తిగా నిలువలేదు.

పూర్వాచార్యులేమంటారు?

మన పూర్వులు ఎందులో సమర్ధులు కాకపోయినా తత్వ వివేచనలో మాత్రము నిపుణులు.కాబట్టి వారు దీనికి ప్రమాణమేమైనా నిర్వచించినారేమో విచారిద్దాము!


రసమతము

అనాది నుండి బహుపండితాదరము పొందిన మతము రసమతము. పెద్దలు ఏమన్నారు?

 

"కావ్యస్య శబ్ధార్ధౌ శరీరమ్, రసాదిశ్చాత్మా, గుణాః శౌర్యాదివత్, దోషాః కాణత్వాదివత్ రీతయో2వయవసంస్థానవిశేషవత్, అలంకారాః కటక కుణ్డలాదివత్"

ఈ ప్రసిద్ధ వాక్యములో అలంకారికవతాలు చాలా భాగము సమన్వయమైనవి. ఔచిత్యవాదమొక్కటీ, ధ్వనిమత మొక్కటీ మిగిలిపోయినవి. సూక్ష్మముగా విచారిస్తే ధ్వనిమతానికి, రసమతానికి ఎక్కువ బేధము లేదు. ఔచిత్యము కూడా నిజముగా గుణ వాదములోనిదే.


ఎవడు సహృదయుడు

ఎవడు సహృదయుడు?

శ్రీ మమ్మట భట్టారకుడు కావ్యానికి హేతువుగా మూడు సామగ్రులు ఉదహరించినాడు.

 

"శక్తిర్నిపుణతా లోకశాస్త్ర కావ్యాద్యవేక్షణాత్
కావ్యజ్ఞ శిక్షయా2భ్యాస ఇతి హేతుస్తదుర్భవే"


అందులో 'శక్తి' ని వివరిస్తూ-

"శక్తి, కవిత్వ బీజరూపః సంస్కార విశేషః, యాం న వినా కావ్యం ప్రసరేత్, ప్రవృతం వా ఉపహసనీయం స్యాత్" అన్నాడు.


నిపుణతను వివరిస్తూ లోకజ్ఞానమూ, ఛంధో వ్యాకరణాది శాస్త్రములు, గజ తురగ ఖడ్గాది లక్షణ గ్రంధములు, మహా కవుల కావ్యములు, ఇతిహాసాదులూ -వీటి విమర్శ వల్ల వచ్చే వ్యుత్పత్తిగా నిరూపించినాడు.


అభ్యాసము వివరిస్తూ-
"కావ్యం కర్తుం విచారయితుంచ యే జానంతి తదుపదేశకరణే యోజనేన పౌనః పున్యేన ప్రవృత్తిః" అన్నాడు.


ఆపైన "ఈమూడూ వేరే వేరే కారణాలు కావు కారణమే అంటే అన్నీ ఉన్నప్పుడే సాధ్యము" అని ఉపదేశించాడు.


కావ్య విమర్శకుడికి కూడా ఇవన్నీ కావలసిన గుణాలుగా కనపడుతున్నవి. అటువంటి సామాగ్రి ఉన్నవాడే సహృదయుడు. వజ్ర పరిక్ష ఎంత కష్ట సాధ్యమైనదో అంతకంటే సహస్రగుణము కావ్యపరిక్ష కష్టసాధ్యమైనది. వజ్రపరిక్షకు ఒక వజ్ర ప్రపంచము తెలిస్తే చాలును కానీ కావ్య విమర్శకు కావల్సిన సామాగ్రి అపరిమితమైనది.
 

మనవి

విమర్శ ప్రమాణము సర్వ వ్యాధి నివారిణులని చెప్పే చిట్కా మందులవలే సులభసాధ్యమైనది కాదు. విమర్శ చేసేందుకు సమగ్రమైన సామాగ్రి మన విమర్శకులకు ఎందరికి ఉన్నదో ప్రశ్నించుకోవలసిందని మనవి చేస్తున్నాను.

This entry was posted in వ్యాసం. Bookmark the permalink.