ముందుమాట
కళలన్నవి పుట్టుకతో రావలసిందేగాని నేర్పితే వచ్చేవి కావంటారు. ఆమాటకొస్తే విద్యలైనా, చివరకు మాట్లాడడం, నడవడం, సైకిలు తొక్కడం వంటి చర్యలైనా నేర్పితే వచ్చేవి కావు. నేర్వవలసే వారికి ఇచ్ఛ ఉండాలి. నేర్చే ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నంలో నేర్పడానికి సిద్ధమైన వారి సహాయాన్ని వారు అంగీకరించాలి. అప్పుడే నేర్చుకోడం, నేర్పడం జరుగుతాయి.
ప్రయత్నమూ నేర్చేవారిదే. ఫలితమూ నేర్చేవారిదే. ప్రయాస మాత్రం నేర్పేవారిది.
నేర్పేవారు లేకపోయినా నేర్చేవార నేరుస్తూనే ఉంటారు.
ఇవన్నీ నేర్చేవారికి తెలియవు. నేర్పగలవారికి ఇవన్నీ తెలిసే ఉంటాయి.
అయినా నేర్చేవారుంటే నేర్పగలవారు నేర్పుతూనే ఉంటారు.
విద్యలు సరే. కళలో?
అశ్వారోహణం, గజారోహణం దగ్గర్నంచి పువ్వుల్ని దండలుగా కూర్చడం, దొంగతనం చెయ్యడం వరకూ అన్నీ కళలే. అరవైనాలుగున్నాయి మనకి. ఇవన్నీ పుట్టుకతో వచ్చేవేనా?
కళలు వేరు, లలిత కళలు వేరు.
సంగీతం, చిత్రలేఖనం కూడా లలితకళలే. అభిరుచీ, ఆసక్తీ, ప్రతిభా ఉన్నవారు నేర్చుకుంటారు. కొందరు వారికి నేర్పుతారు.
ఎందుకూ?
మానవ కృషిలో ప్రయాస తగ్గించుకోడానికీ, ఒకరు సాధించిన దానినే ఎవరికి వారు సాధించుకోవాలంటే మానవులంతా ఒక మెట్టు దగ్గరే ఆగిపోతారు.
కాట్టి సాహిత్యం ఒక లలితకళే అయినా కథారచన ఆ లలిత కళలలో భాగమే అయినా దాని గురించి ఇంకొకరి నుండి తెలుసుకోవడం తప్పుకాదు. తెలియజెప్పడమూ తప్పు కాదు.
ఎటొచ్చీ ఒక్క హెచ్చరిక మాత్రం అవసరం.
ఆదినే చెప్పినట్టు ఏదైనా ఒకరు నేర్పితే వచ్చేది కాదు. రావడం ప్రధానంగా నేర్చుకునేవారి మీదే ఆధారపడి ఉంటుంది. కథలు రాయడమైనా అంతే.
అయితే ఈ వ్యాసాలెందుకూ?
ఇవి జన్మతః మహారచయితలైన అసహాయశూరుల కోసం మాత్రం కాదు.
మామూలుగా కథలు రాయాలన్న సరదా ఉండి, తీరా రాయబోతే అడుగడుగునా సందేహాలొచ్చి, అడగబోతే ఆదుకునేవారు లేక, ఉన్నా వారిముందు తమ అజ్ఞానాన్ని అంగీకరించడానికి మొహమాటపడే సాధారణ రచయితలుంటే – వారు ఏకాంతంలో చదువుకోడానికి.
చదువుకొని ఇందులో వారికి పనికివచ్చేదేమైనా ఉంటే గుర్తు పెట్టుకుంటారు. లేకపోతే ఒక పక్కన పడేస్తారు.
కథల గురించి నేననుకునేది తెలియజెప్పడానికే ఈ వ్యాసాలుగాని కథలు రాయడం నేర్పడానికి కాదు.
అలాటి ప్రయత్నం ఈ పేజీలలో ఎక్కడేనా కనిపిస్తే దానిని నా ప్రతిజ్ఞా భంగ దోషంగానే గ్రహించాలిగాని అదే నా ఉద్దేశంగా భావించద్దని మనవి.
వ్యాసాలు రాయడంలో నాకు బొత్తిగా అనుభవం లేదు. ఇదే నా మొదటి ప్రయత్నం అని కూడా మనవి.
జనవరి 1990 – కాళీపట్నం రామారావు
———————————————————————————-
క్షమాపణ
ఈ పని చేవలసింది నేను కాదు. తగిన వారింకెవ్వరూ పూనుకోనందువల్లే నాకు చేతనైన విధంగా దీన్ని చేయబోయాను.
వైద్యం కొందరు విద్యంటారు. కొందరు శాస్త్రమంటారు. అదేదైనా మానవ జీవితంలో దానికి ప్రమేయం ఉంది. కాబట్టి వైద్యం చేయబోయే వారికి ముందుగా సుదీర్ఘమైన శిక్షణ ఉంటుంది. అందుకు కళాశాలలూ, బోలెడన్ని ఏర్పాట్లూ ఉన్నాయి.
నృత్యం, సంగీతం, చిత్రలేఖనం కళలంటారు. కళాసాధనకు ప్రధానంగా కావలసింది ప్రతిభే! అయినా విద్యార్థులు ఏండ్ల తరబడి గురువు సాన్నిధయంలో శిక్షణ పొందుతారు. శిక్షణ ఇవ్వడానికి కళాశాలలూ ఏర్పడ్డాయి.
పత్రికా రచన, నాటక దర్శకత్వం, నాటక రచన -వీటికి కూడా కోర్సులున్నాయి. నేర్పడానికి విశ్వవిద్యాలయాల్లో శాఖలున్నాయి.
శిల్పం, వాస్తు, వడ్రంగం, కమ్మరం నుండి నర్సింగ్, టీచింగ్, మిడ్‍వైఫరీ దాకా సహస్ర వృత్తులూ చివరికి దూదిలోంచి దారం తీయడానికి కూడా ట్రైనింగ్‍లున్నాయి.
పత్రికా సంపాదకత్వం, నవలా రచన, కథలు రాయడం, కవిత్వం చెప్పదం పైవాటిలో ఏ కోవకూ చెందవనో, మానవ జీవితంతో వీటికి ఏ ప్రమేయం లేదనో ముందుగాని, రాస్తున్న దశలో గాని ఏ శిక్షణా పొందటానికి ఏర్పాట్లు లేవు – కావాలనుకున్నవారికైనా. రచన చేయడంలో మెళకువలనూ, ఆ విద్యలో లోతుపాతులనూ పడుతూ లేచే పద్ధతిలో ఎవరికి వారుగా తెలుసుకోవాలంటే చాలాకాలం పడుతుంది. ఏభై యేళ్ళల్లో పాతిక కథపైనా రాయలేకపోయాను. ఈ విషయంలో నాదిస్వానుభవం.
అయితే ప్రతిభావంతులు తీరిక చిక్కని పరిశ్రమలో ఉంటారు. కాబట్టి వారు కరదీపికలు వెలిగించరు. కళ్ళున్నవారికి మసకచూపువారి కష్టం తెలీదు. తీరిక చిక్కీ తెలిసీ అలాంటి పెద్దలు ముందుకొచ్చేదాకా చీకటిలో తడుములాడేవారికి గుడ్డివాడైనా సాయం చేయబోవడం తప్పుకాదనుకున్నాను. తప్పైనా దురుద్దేశంతో చేసింది కాదు.
రచనాకాలం 1987. వీట్లో మొదటి పదకొండు వ్యాసాలు 1988 లో ఆంధ్ర భూమి దినపత్రికలో అక్షర భూమిలో వచ్చాయి. కృతజ్జ్ఞతలు.
————————————————-
ఈ వ్యాసాలెందుకు?
వరసగా రెండేళ్ళ పాటు ’నేటికథ’ కొచ్చిన కథలన్నీ చదివితే మనవాళ్ళలో కథలు రాయాలనే కోరికా, లేదా ప్రయత్నం ఈమధ్య చాలా విస్తృతమవుతోందనిపించింది.
ఆ కోరిక వ్యాప్తీ, విస్తరణా ఏ ధోరణిలో పెరుగుతున్నాయంటే – కథా వ్యాసంగానికి కావలసి విద్యా, సంస్కారం, సాహిత్య పరిచయం, జీవితానుభవం, యుక్తవయస్సూ లేకపోవడం ఏ ఒక్కటీ వీటికి ప్రతిబంధకంగా నిలవడం లేదు.
దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న అక్రమాలూ, అన్యాయాలూ, ఏ క్రమంలో పెరుగుతున్నాయో, వాటి నెదుర్కోవలసిన రాజకీయ పక్షాల వైఫల్యాలు జనంలో నిరాశను ఏ క్రమంలో పెంచుతున్నాయో, అదే క్రమంలో కొత్తవాళ్ళు రచనకు పూనుకుంటున్నారా? – అనిపిస్తుంది.
పల్లెల్లో హైస్కూలు విద్యార్థులూ అయ్యవార్లూ దగ్గర్నుంచి; అరకొరా చదివిన అవివాహితులూ గృహిణులూ, పొలాలు చూసుకొనేవారూ, చిన్న చిన్న బస్తీల్లో కిళ్ళీ బడ్డీలూ, సైకిలు షాపులూ నడుపుకునేవారూ, బస్తీల్లోనూ, పట్టణాల్లోనూ కాలేజీ చదువులవారూ, నిరుద్యోగులూ, మహానగరాల్లో డాక్టర్లూ యాక్టర్లూ పట్టభద్ర నిరుద్యోగులూ వంటి వెయ్యిన్నొక్క వర్గాల దాకా – చివరికి పదవీ విరమణ చేసిన పండు ముదుసళ్ళ దాకా ఎందరెందరో కథలు రాయడానికి కొత్తగా పూనుకుంటున్నారు.
వీళ్లలో గుణింతాలు రానివారున్నారు. బాగా పండితులున్నారు. తెలుగులోనో, ఇంగ్లీష్ లోనో డాక్టరేట్లు తీసుకున్నవారున్నారు. తీసుకోగల వారున్నారు. వివిధ భాషల్లో వచ్చిన వస్తున్న సాహిత్యంలో ఎంతోకొంత పరిచయం ఉన్నవారున్నారు. ఏ సాహిత్యంతోనూ ఎవ్విధమైన పరిచయాలూ లేనివారున్నారు. వెనక కవిత్వమో కవితలో నాటకాలో వ్యాసాలో రాసినవారున్నారు. బాల సాహిత్యం, పత్తేదారు సాహిత్యం, తప్పితే ఇంకేవీ అందని వారున్నారు.వీరూ వారూ అన్న తేడా లేకుండా అందరూ కథ రాయడానికి ప్రత్నిస్తున్నారు.
కథారచనపట్ల ఇంతగా విస్తరిస్తున్న ఈ కోరిక తీవ్రత ఏ మేరకంటే-
కొందరు కథను పత్రికకు పంపిన ప్రతిసారి ఎంతో వినయంగా చాలా ప్రాధేయపడుతూ సంపాదకులకు ఉత్తరాలు రాస్తారు. కొందరు పెద్దలలా బేలగా తేలిపోరు. వారి పద్ధతులు వేరుగా ఉంటాయి. కథ పడ్డాకా ఆశించిన గుర్తింపు రాకపోయినా, ఏ ఒక్క కథా వేసుకోకపోయినా ఏడాదిలో పాతిక నుండి యాభైదాకా అదే పత్రికకు కథలు పంపే పట్టువదలని విక్రమార్కులున్నారు.
ఇలా కథలు రాయాలనే కోరిక కొత్తవారిలో ఇంతగా వ్యాప్తి చెందడానికీ, ఇన్ని వర్గాల్లో విస్తరించడానికీ, రాసిన కథలు పడాలనే తహతహ వారిలో ఇంత తీవ్రంగా ఉందడానికీ, హేతువులు ఒకటి కన్నా ఎక్కువే ఉండొచ్చు.అయినా ఆదిని సూచించినదే వాటిలో ప్రధానమైనదనుకుంటాను. ఎంతో కొంత శాతం మినహాయిస్తే మిగిలిన వారంతా ఏం రాసినా తమ చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల అసంతృప్తితో, అసహనంలో, అసహ్యంతో ఆవేశపడీ, ఆగ్రహించీ రాస్తున్నట్టే కనిపిస్తుంది.
రోడ్లమీదా, బస్సుల్లోనూ, రైళ్లలోనూ జరిగే మోసాలను బట్తబయలు చేస్తున్నా, బజార్లలోనూ, బస్తీలలోనూ, రొడీలకూ, దాదాలకూ తలవంచే ప్రజల అసహాయతను చూపిస్తున్నా, పల్లెల్లో బలవంతులకు చెల్లిపోతున్న అత్యాచారాల గూర్చి చెపుతున్నా, ప్రజలవల్ల పదవులకెక్కి – ప్రజాద్రోహానికి ఒడికట్టే బూటకపు సన్యాసులు గుట్టు రట్టుచేస్తున్నా, ప్రజా సేవకులమంటూనే ప్రజలపై కొందరు చేసే పెత్తందారీని నిరసించినా, పథకాలపేర, ఉద్యోగావకాశాల పేర జరగగల దగాలను ముందే గ్రహించి ఈసడించుకున్నా, డబ్బుకి మూతబడే నోళ్ల గురించీ, అధికారానికి కట్టడిపోయే కళ్ల గురించి కటకటపడ్డా, వారి రచనల్లో వ్యక్తం చేయదలచింది ఈ వ్యవస్థలో పెరిగిపోతున్న పై దుర్లక్షణాల పట్ల కసి, అసహ్యం, రోత.
కుటుంబాలలోనూ, సమాజంలోనూ అబలలకూ, బలహీన వర్గాలకూ జరుగుతున్న అన్యాయాల గురించీ, కులమత వివక్షవల్ల వర్గాల మధ్య పెరుగుతున్న వైషమ్యాల గురించీ, బరితెగించిన నేతల బంధుమిత్రుల గురించీ, పేదరికం కోరల్లో నశిస్తున్న మానవత్వం గురించీ, వారు పడుతున్న కలవరం కూదా వారి వారి కథల్లో చూడొచ్చు.
చేయి తిరిగిన రచయితలు చెప్పే కథల వరవడి ఈనాడు ఇంకో విధంగా ఉన్నా, ఇంతమంది కొత్త రచయితలు సాహిత్యాన్ని ఇంకా మంచికే ఆశ్రయించడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొనఊపిరితో ఉన్న ఆశకి జీవం పోస్తుంది.
అయితే-
కారణాలు ఏవైనా కావచ్చు- ఈ రచయితల్లో నూటికి డెబ్భైమందికి కథంటే ఏమిటో తెలియదు. తెలిసిన ముప్ఫైమందిలో ఇరవైమందికి కథ సరిగా కట్టడం రాదు. కట్టడం వచ్చిన పదిమందిలో ఒకళ్ళిద్దరికి తప్పితే కథల మంచిచెడ్దల గురించి తెలియదు. ఆ తెలిసిన వారికైనా ఏ గుణాలవల్ల ఒక కథ మంచిదౌతుందో, వేనివల్ల ఇంకొకటి చెడ్దదవుతుందో – స్పష్టమైన అభిప్రాయాలున్నట్టు లేదు.
ఇందువల్ల, కొత్త రచయితల్లో కథలపట్ల ఇంతగా పెరుగుతున్న ఈ తపనా, అందుగురించి వాళ్లకవుతున్న వ్యయ ప్రయాసలూ – ఇవన్నీ వారికి గాని, మనకిగాని ఈయవలసిన సత్ఫలితాలను ఈయడం లేదు కదా అనుకున్నాను.
వాళ్ళ చొరవా, ప్రయత్నం, శ్రమా సత్ఫలితాలివ్వాలంటే వారంతట వారుగా గాని, ఇతరులు తెలియచెప్పడంవల్లగాని కథను గురించి తెలుసుకోవడానికి కొంతకాలం, శ్రమా అవసరముతాయి.అందుకని అలాటివారికోసం ఎవరేనా ఏదైనా చెయ్యడం అవసరమనిపించింది.
చెదురు మదురుగా వచ్చిన కొన్ని వ్యాసాల్లో అటువంటి ప్రయత్నం లోగడ కొంత జరిగింది. ఈలోగా ఇంకెవరో ఎక్కడో ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు.
* ఇవి సరికొత్త రచయితల కోసం, వారి సమస్యలనూ, సందేహాలనూ, లోటుపాట్లనూ దృష్టిలో ఉంచుకుని కథను గూర్చి వారి అవగాహనను పెంచుకోవడంలో వారికి సహాయపడేందుకు రాసిన వ్యాసాలు, కథలు రాయడం నేర్పడానికి కాదు.
*రాయడం ఎవరికి వారు నేర్వవల్సిందేగాని ఒకరు నేర్పితే వచ్చేది కాదు.