భూమి, ఆకాశం కలిసే చోటునుంచి –
సముద్రం మేఘాన్ని పలకరించే సమయంలో-
ఆమె వస్తూ ఉంటుందని ఎదురుచూస్తూ కూర్చున్నాడు.
దిగులు సాయంత్రాలు ఎర్రటి ఉషస్సులుగా అతని కళ్ళు జీరలయ్యాయి. సంధ్య అతని కనురెప్పల మీద వాలిపోయింది. గుండెల్లో చీకటి విశ్వవ్యాప్తమైంది. కొండల అంచులు, చేమంతుల తోటలు, నదులు పుట్టే స్థలాలు అన్నీ వెతికాడు. వెతికి వెతికి అలసి కూర్చుండి పోయాడు.
ఆమని వచ్చింది. గ్రీష్మం వెళ్ళింది. హేమంతం అంతమైంది. శరత్కాల తృణపత్రాలు విషాదాన్ని అక్షింతలుగా జల్లాయి.
నాన్న వచ్చి"రారా ఇంటికి" అన్నాడు.
సముద్రం మీద వర్షం కురుస్తోంది. "చూశావా నాన్నా ఆకాశం ఏడుస్తోంది" అన్నాడు జాలిగా.
నాన్న పిచ్చెక్కిందనుకున్నాడు. చెయ్యిపట్టి లాక్కెళ్ళాడు. సాంప్రదాయ పురోహితుడికి "వయస్సు దాటిపోతుందని" వేపమండ ఇచ్చి, పిచ్చి వదలకొట్టమన్నాడు. పిచ్చి కుదిరింది. పెళ్ళి మెడకు చుట్టమన్నారు.
"నువ్వేనా" అన్నాడు.
మల్లెపూల దారాల పక్క అంచుల మీద నుంచి ఆమె తలెత్తి"ఏమిటి నేనేనా?" అంది.
"భూమి, ఆకాశం కలిసేచోటు నుంచి సముద్రం మేఘాన్ని పలకరించే సమయంలో భావుకత్వం చీర కట్టుకుని కవిత్వం కాసుల పేరేసుకుని నా కలల ప్రాంగణంలోకి వస్తోంది నువ్వేనా?"
ఆమె దుఃఖించటం మొదలుపెట్టింది. "నన్ను మోసం చేశారు దేవుడో – పిచ్చాడ్ని తెచ్చికట్టబెట్టారు దేవుడో"
"ఏడవకు నేను మాములు మనిషినే"
"నిజంగానా" ఆనందంగా అడిగింది.
"అవును. హృదయ కవాటాలు మూసేసి బయటకు వచ్చేశాగా. ఇదిగో నావైపు చూడు. నా మొహం మీద మేకప్ బాగోలేదు కదా! ఏం కావాలి నీకు? డబ్బా, హోదానా, పేరా, అంతస్థా?"
"అన్నీ పాతిక పాతిక శాతం".
"తథాస్తు".
నిద్రించే మనసు నిన్న రాత్రి పక్కమీద రాలిన జ్ఞాపకాల మల్లెపూలను కలులుగా పేర్చి సుషుప్తి వైరాగ్యాన్ని ప్రసవిస్తోంది. ఎన్ని అనుభవాల ఉత్తరాలు వేసినా సాయంత్రానికి ఖాళీ అయ్యే పోస్ట్ బాక్స్ లాంటి మనసు.
అగ్నిపర్వతం అంచు మీద కూర్చుని –
లావాపై తేలివచ్చే పడవలో –
సన్నటి కొండల మధ్యనుంచి పాయలా మొదలై, విశాలమైన ఇసుక తిన్నెల మీద పరుచుకునే గోదారిలా… విషాదం, గుండెల నుంచి మెదడు వరకూ పాకుతూంది. కలం కదిలితే నువ్వు, పదం పలికితే నువ్వు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్య నువ్వు.
నేనే నువ్వు అనుకునే మూర్తి కోసం, ఆర్కిటికా అంచుల మీద నిలబడి అంటార్కిటికా లోతుల్లోకి తొంగిచూస్తున్నాడు.
"రా నాన్నా ఇంటికి" అన్నాడు కొడుకు ప్రేమగా – ఫస్టు తారీఖు వచ్చిందని.
మేఘం మెరిసింది. "చూశావా బాబూ, లౌక్యం అనే అడవిలో దావానలం వచ్చి ’అవసరం’కాలిపోతోంది" అన్నాడు ఆనందంగా కొడుకుతో.
తల్లీకొడుకులు దిష్టి తీశారు.
కళ్ళకి కాటుక శాంతి, పెదవులకి చిరునవ్వు తాంబూలం, కంఠాభరణం కరుణ, చెవులకి మృదు సంభాషణ పట్టీ – నుదుట సహనం బొట్టు, చేతుల్లో విజ్ఞానం వీణ – ఎవరైతేనేం ఆ నీహారిక.
ఆండ్రోమెడా గాలక్సీ అంతా వెతికి, అవతలపక్క రోదసిలో ఉందేమో అని వెళ్ళబోతూవుంటే –
"రా తాతా ఇంటికి" అన్నాడు మనవడొచ్చి.