శారద దరహాసం – 3

రాకేశ్వరుఁడు: రవీ మీ దగ్గర పూరణ లేదా ? వచింప సిగ్గగున్ కి ?

కామేశ్వరరావు: భారారె తర్వాత మీ పూరణే, రెడీగా ఉండండి

రవి: చిత్తం

భారారె: అలాగే  (నా వచ్చీరాని తెలుగులో వాడరాని పద ప్రయోగాలతో)

రానారె: ఫరవాలేదు… అందరం అలా మొదలుపెట్టినవాళ్లమే.

భారారె: రవి గారూ కానివ్వండి..మీ తరువాత నేను చెప్తాను

dotC: కొందఱమింకా అలాగే ఉన్నాం! 🙁

భారారె:

 

ఏ కరమందు నా భరతమేది ధగద్ధగలున్, సువర్ణ మే
ధోకర సంపదంతయును దుర్గతిపాల్పడ నెంతదీనమున్
చీకున ఆంగ్లపాదముల చెంతన బిచ్చమునెత్తుతున్నదే !
బాకులు క్రుమ్మినట్లగును భారతపౌర ! వచింప సిగ్గగున్

dotC: 🙁

భారారె: కరమందు అంటే చేతిలో అని అర్థంలో వాడాను

dotC: పద్యం బాగుంది… బాకులు క్రుమ్మినట్లే అయింది!

పుష్యం: బాగు బాగు .. చక్కగా చెప్పారు

శ్రీరామ్: బాగుంది

శంకరయ్య: ఓకే

కామేశ్వరరావు: భరతము + ఏది ధగద్ధగలన్ – భరతము ధగధగలని వదులుకొందని

ఫణి: బాగుంది

సనత్ కుమార్: ఈ మధ్య ఆలోచించటం కూడా ఇంగ్లీషు లోనే చేసే దుస్థితి కి జారిపోతున్నామేమో… మీ పూరణ డైరక్టుగా గుండెల్లో దిగిందండీ…

రానారె: మ్…

భారారె: ధన్యవాదాలండి

రానారె: రవిగారు జారుకున్నారు

రానారె: ఆయనొచ్చేలోపు ఇంకో సమస్యను ముందుకు తెస్తారా, కామేశ్వర్రావుగారూ?

కామేశ్వరరావు: శంకరయ్యగారూ, మీ పూరణ వినిపించండి

నచకి: రవి కదా… రకరకాల చోట్ల ఉదయాస్తమయాలతో బిజీ!

సనత్ కుమార్: మబ్బుల్లో దోబూచులాడుతున్నారు (ఇంటర్నెట్ ప్రాబ్లమౌతోంది వారికి)

రాకేశ్వరుఁడు: బాగుంది పద్యం

శంకరయ్య:

 

ఏ కమనీయమౌ కలల నెంచి స్వతంత్రముఁ గోరి పోరిరో
లోకనుతుల్ మహాత్ములు; విలుప్తము లయ్యెను వారి స్వప్నముల్
చీకటి కార్యముల్ సెలఁగి చింతలు పొంద జనమ్ము; నా యెదన్
బాకులు క్రుమ్మి నట్లగును భారతపౌర! వచింప సిగ్గగున్.

dotC: ఇది కూడా… లోతుగా దిగినయి బాకులు!

శ్రీరామ్: అద్భుతం

కామేశ్వరరావు: మహాత్ముడైన గాంధీ స్వయంగా పడుతున్న బాధలా ఉందండీ!

ఫణి: గాంధీ జయంతి సందర్భంగా ఉచితంగా ఉంది. బాగుంది.

నరసింహ: చాలా బాగుందండీ. గుండెల్లో గుచ్చుకున్నట్టుందండీ

భారారె: పద్యం బాగుంది మాస్టారూ

కొత్తపాళి: విలుప్తము లయ్యెను

కొత్తపాళి: గాంధీ జయంతి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా సముచితంగా ఉన్నది మాస్టారూ!

రానారె: ఏ మహనీయ సాధ్వి జగదేక … పద్యం గుర్తొచ్చిందండీ

రానారె: లవకుశ సినిమాలోనిది.

సనత్ కుమార్: గుండెల్లో… గున్పాలు దింపేశారే, ఏవేవో ఉహల్తో పద్యాల్పూరించారె….

కొత్తపాళి: మిత్రులారా నా గృహకృత్యాలు పిలుస్తున్నాయి. సభకీ, సదస్సుకి శుభాభినందనలు.

శంకరయ్య: ధన్యవాదాలు

కామేశ్వరరావు: ఎలాగో గాంధీ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఆ మహాత్ముని తలచుకొందాం.

కామేశ్వరరావు: G-a-n-d-h-i అన్న అక్షరాలు పాదం మొదట వచ్చేట్టు గాంధీ గురించిన పద్యం. నచకిగారూ మీరందుకోండి

dotC: నేనే మొదలెట్టాలా? సరే!

భారారె: మొదలెట్టండి

dotC:

 

జీవనము మొత్తము నహింస భావనలకు
ఏమఱక నిచ్చియు మహాత్ముడేమి బొందె!
ఎందు లేరట్టి నిస్వార్థులెన్నగ నెవ
డీ భువిని ధర్మ సత్యవ్రతాభిలాష
హెచ్చుగ గలిగి చరియించె మెచ్చునట్లు?
ఐకమత్యమునాశించి అమరుడయ్యె!

….మొదలూ, చివఱా కూడా అయినై

ఫణి: స్వేచ్ఛా ఛందస్సా?

కామేశ్వరరావు: హృద్యంగా ఉందండి.

రానారె: వహ్వా

కామేశ్వరరావు: తేటగీతి

నరసింహ: మనోజ్ఞం

భారారె: wow

dotC: అంత స్వేచ్ఛ లేదండీ… తేటగీతి …అనుకుని వ్రాసాను… తప్పిందా యేం?!

రానారె: Nదులేరట్టి… Hచుగ గలిగి… భలే

ఫణి: బాగుంది.

రాకేశ్వరుఁడు: నచకి గారు చాలా సహజంగా వుంది మీ తేటమాలిక.

dotC: నెనర్లు, కామేశ్వరరావు, భారారె, రానారె, ఫణి, నరసిమ్హ, రాకేశ్వర గార్లూ!

కామేశ్వరరావు: శంకరయ్యగారూ, మీ పద్యం కూడా వినిపించండి

శంకరయ్య: నా పద్యం దాదాపు పై పద్యం లాగే ఉంది

శంకరయ్య:

 

జీవితమ్మును త్యాగమ్ముఁ జేసె నతఁడు
ఎలమి సత్యాగ్రహాయుధ మెన్నుకొనెను
ఎన్నగా లే రతని సాటి; యెన్నడును జ
డియుట నెఱుఁగని ధీరుండు, నియమశీలి
హెచ్చుగా సత్యము నహింస నెన్నువాఁడు
ఐన గాంధీకి భక్తి సుమాంజలి యిదె.

నరసింహ: బహు బాగు బాగు

dotC: పద్యాలకి పోలిక ఉంటుంది గాంధీ గారి గుఱించే కనుక… చక్కగా ఉంది పద్యం!

రానారె: భలే! ఎలమి … ఈ పదం చాలా బాగుంది.

ఫణి: గాంధీజీకి నిజమైన పద్యాంజలి.

సనత్ కుమార్: చాలా బాగున్నది…

కామేశ్వరరావు: గాంధీగారికి పద్యమాలికలు బాగున్నాయి

రానారె: ఎలమి కోరిన వరాలిచ్చేదేవుడే… అన్నమయ్య వాడిన పదం.

శ్రీరామ్: గాంధీజయంతి సందర్భంగా…

శంకరయ్య: చింతా రామకృష్ణారావు గారి పద్యం చూసాను. చాలా బాగుంది.

సనత్ కుమార్: అధ్యక్షా .. రవికేదో గ్రహణం పట్టినట్టయ్యింది. అంతర్జాలంలో వారు మరి నేడు దర్శనం ఇవ్వలేకపోవచ్చుట.

కామేశ్వరరావు: అవునండీ. వారు సభకు రాలేకపోవడం మన దురదృష్టం

సనత్ కుమార్: క్షంతవ్యుణ్ణీ అని తెలియజేయమన్నారు…

dotC: అయ్యో!

పుష్యం: అందులోనూ మీరు రవిగారి పూరణగురించి చాలా ఊరించిన తరువాత 🙁

ఫణి: 🙁

కామేశ్వరరావు: సరే, ఇక్కడ బాగా రాత్రయింది కదా మరి 🙂

రానారె: రామకృష్ణారావుగారి ఆశువులు లేకపోవడం లోటే… ఆశీస్సులు మాత్రం ఇచ్చారాయన. 🙂

సనత్ కుమార్: వారి పూరణను టైపుచేశారుట కానీ స్క్రీను అల్లానే మ్రాన్పడిపోయిందిట.

ఫణి: 🙂

కామేశ్వరరావు: తర్వాత దత్తపదికి వెళదాం

dotC: ఇక లేరా గాంధీలు?

సనత్ కుమార్: అంత ఊరించిన తర్వాత సభాధ్యక్షులేమైనా కరుణిస్తారా?

కామేశ్వరరావు: ఆసు, రాజు, రాణి, జాకి – నేటి విద్యావిధానం. సనత్ గారూ మీ పూరణ

శంకరయ్య: ఇంతకు ముందుది దత్తపది కాదా? దత్తాక్షరమా?

సనత్ కుమార్: దత్త పదులే? అప్పుడే?

కామేశ్వరరావు: శంకరయ్యగారూ, అవునండి అది దత్తాఖరి, ఇది దత్తపది

సనత్ కుమార్: సరే !!

కామేశ్వరరావు: దత్తాక్షరి

సనత్ కుమార్:

 

విద్యే వ్యాపారమయ్యెన్ ! 'విలువ' వలువలున్ వీడి రాణించెన్! ఔరా !
ఉద్యోగమ్మిచ్చు విద్యే యుగపు జపములై య్యొప్పెరా! జూడలే నీ
చోద్యమ్మున్ ! విఘ్నరాయా! సుగుణ సలలితా సుప్రజా ! కిన్కలేలా?
ఆద్యమ్మౌ వేదవిద్యా హలము నొసగరా ! ఆదుకో ! దుఃఖ దూరా !

కామేశ్వరరావు: సెహభాష్, స్రగ్ధరలో పూరించారు!

విశ్వామిత్ర: ఆసు ఎక్కడ

ఫణి: విలువ' వలువలున్ వీడి రాణించెన్! బాగుంది

శంకరయ్య: రాణించె నౌరా ?

కామేశ్వరరావు: దత్తపదాలు వెతుక్కోవలసిందే 🙂

dotC: విఘ్నరాయా సుగుణ

సనత్ కుమార్: విఘ్నరాయా! సు

విశ్వామిత్ర:  భలే

కామేశ్వరరావు: సుప్ర"జా ! కి"న్కలేలా

ఫణి: రాణించేనౌరా!

శంకరయ్య: అద్భుతం!

రానారె: భలే వచ్చింది పద్యం.

విశ్వామిత్ర: ఆదుకో ! దుఃఖ దూరా ! – నిజం – రోజూ బడిపిల్లలు ఇదే పాడుకుంటున్నారు

శ్రీరామ్: చాలా బాగుంది

నరసింహ: బాగా వచ్చింది.

పుష్యం: ఆసు, జాకీ కలిపి రాసారు, పోకర్లో మంచి హాండు 🙂

కామేశ్వరరావు: "ద్య"కార ప్రాసతో, దత్తపదాలని వాడుతూ, స్రగ్ధరని వ్రాయడం – ఆషామాషీ వ్యవహారం కాదు!

dotC: నిజం!

ఫణి: స్రగ్ధర. వ్రాసి యెరుంగనే!

విశ్వామిత్ర: అదీ  స్రగ్ధరలో

కామేశ్వరరావు: సరే. వాతావరణాన్ని కాస్త తేలికపరుద్దాం

కామేశ్వరరావు: పుష్యంగారూ తొలకరి జల్లులలో పిల్లల గెంతులు వర్ణించండి.

విశ్వామిత్ర: నేను "స్రగ్ధర" వ్రాయటం కూడ ఎరుగను, copy&paste  ఎ

సనత్ కుమార్: ఇదీ నేను చేసిన మొట్టమొదటి ప్రయత్నం.. కామేశ్వరరావు గారి ప్రోత్సాహంతో రాసినది

సనత్ కుమార్: అందరికీ ధన్యవాదాలు

పుష్యం: స్రగ్ధరలో మీ పూరణ – ముగ్ధముగా నుండెనండి మేలగు పదముల్

పుష్యం: కాస్కోండి 🙂

సనత్ కుమార్: స్నిగ్ధము మీ కామెంటే

పుష్యం:

 

నిప్పులు చెరిగెడి ఎండలు
ఎప్పుడు తగ్గునొ యనుచును ఎదురులు చూడన్
తిప్పలు తీర్చగ జనులవి
చప్పున వచ్చెను తొలకరి జల్లుల తోడన్

 

తడవగ జడిసెడి బుడతలు
గడప కడన తడఁబడుచును కదలక నిలవన్
గడుసరి పిడుగులు జడవక
ధడధడమని పరుగులిడుచు తడవగ వెడలన్

 

 

తొలకరి వానలందడవ తుమ్ములు దగ్గులు వచ్చునన్న తా
నలిగిన పిల్లవాని తన యక్కునఁ జేర్చుకు పిచ్చి తండ్రి నీ
తలకొక తుండు చుట్టెదను దానిని తీయక నాడుమన్నఁ; తాఁ
బిలుచుచు మిత్రులందరను వేగమె వానన గెంతులేయుచున్

విశ్వామిత్ర: వావ్

శ్రీరామ్: 🙂

విశ్వామిత్ర: వావ్2

రాకేశ్వరుఁడు: –

శంకరయ్య: భళి భళీ

విశ్వామిత్ర: ప్రాసకోసం తుమ్ములొచ్చినట్టున్నాయి , పాపం  🙂

నరసింహ: వాహ్వా

రానారె: ఆహా.. సర్వలఘు కందం ప్యత్నించారన్నమాట!

భారారె: ఆహా సూపర్

 

గిరగిరా తిరుగుతూ కేరింతలను కొట్టి – వల్లప్ప నరసప్ప పాట పాడి;
ధారగా కారేటి చూరునీళ్ళందున – తలనుంచుచును తాను తడిసి, మురిసి;
వానచినుకు నోట పట్టగా తలనెత్తి – నోరు తెరచి నాల్క బార చాపి;
వాన వెలిసి నీరు వాగులై పారగా – పడవలందున  వేసి పందెమాడి;

 

నేల రాలిన కాయల నేరి తెచ్చి
కోసి ఉప్పును కారము రాసి తినుచు
వేడివేసవిని మరచి నాడి పాడి
చేసినల్లరి గూర్చిక చెప్పఁదరమె

విశ్వామిత్ర: వాన వెలిసి నీరు వాగులై పారగా – పడవలందున  వేసి పందెమాడి; -వావ్3

పుష్యం: దొనె

పుష్యం: ———-

కామేశ్వరరావు: ఆహా! ఎంత బాగున్నోయో పద్యాలు!

నరసింహ: ఉప్పు కారము – నోరూరుతోందండి

కామేశ్వరరావు: సర్వలఘు కందం చాలా అందంగా ఉంది!

ఫణి: మీ చిననాటి జ్ఞాపకాల్లా ఉన్నాయే. చాలా బాగున్నాయి.

dotC: ఆహా, చాలా బాగున్నాయి! మధ్యలో డకరాపు వాన కురిపించారు సూపర్‌గా!

రానారె: వర్ణనలు చాలా సహజంగా వున్నాయి శాం గారూ… గిరిగారిలా మీరూ ఒక చిన్న పద్యకావ్యం రాయకూడదూ?

కామేశ్వరరావు: ఇవన్నీ తీరిగ్గా మళ్ళీ పొద్దులో చదువుకోవాలి

కామేశ్వరరావు: దీని గురించి నచకి గారూ కూడా ఒక చక్కని ఖండకావ్యమే వ్రాసారు. ఇప్పుడు సమయం లేదు కాబట్టీ అది పొద్దులో చదువుకుందాం

శ్రీరామ్: నైరుతిఋతుపవనాలు తెలుగునేలని తడిపినట్తుంది…

dotC: 🙂

పుష్యం: అందరికీ పేరుపేరునా నెనరులు

సనత్ కుమార్: చాలా బాగున్నది

About రానారె

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ సాఫ్టువేరు నిపుణుడి జ్ఞాపకాలు.
This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.