రమల్ – 1

రమల్ – రెండు సంస్కృతీ సాంప్రదాయాల మధ్య వారధి కట్టిన ప్రశ్నశాస్త్రం


జ్యోతిష శాస్త్రాన్ని  వ్రాసిన ఆచార్యులు పద్దెనిమిది మంది..వారి పేర్లు వరుసగా –

1. సూర్యుడు 2. పితామహుడు 3. వ్యాసుడు 4. వశిష్టుడు 5. అత్రి 6. పరాశరుడు 7. కశ్యపుడు 8. నారదుడు 9. గర్గుడు 10. మరీచి 11. మనువు 12.ఆంగీరసుడు 13. లోమశుడు 14. పౌలిశుడు 15. చ్యవనుడు 16. యవనుడు 17. భృగుడు 18. శౌనకుడు.


శృతులకి  నేత్రంగా  పరిగణింపబడే  జ్యోతిష శాస్త్రం, ముఖ్యంగా మూడు  భాగాలుగా విభాగింపబడింది.

1. ఫలితము,

2. గణితము

3. సిధ్ధాంతము


ఆ మూడింట్లోనూ ముఖ్యంగా ఫలిత భాగం ప్రాముఖ్యాన్ని సంపాదించింది, కారణమేమిటంటే అది మానవజాతి యొక్క  భూత, భవిష్యత్, వర్తమానాలని తెలియజేస్తుంది కాబట్టి !


ఫలిత భాగాన్ని తిరిగి కొన్ని అంగాలుగా విభజించడం జరిగింది. అవి 1. జాతకము 2. ప్రశ్న 3. తాజిక 4. ముహూర్తము. వీటిలో రెండవదైన ప్రశ్నశాస్త్రములో ప్రస్తుత  చర్చనీయాంశమైన  'రమల్' లెక్కలోకి వస్తుంది.  ఈ 'రమల్ ' రెండు సంస్కృతీ  సంప్రదాయాల మధ్య వారధి కట్టినా, రాజాదరణ / నవాబుల  ఆదరణ కోల్పోయి, క్రమంగా లుప్తమయి విస్మరింపబడింది. దానికికారణాలేవైనా ఎంతో ఉపయుక్తమైన ఈ శాస్త్రం యుక్క  పుట్టుపూర్వోత్తరాలు ఏ విధంగా ఉన్నాయో,  అది  రెండింటి మధ్య వారధి ఎలా అయిందో  తెలుసుకోవాలంటే, ముందుగా మూడు కథలు తెలుసుకోవాలి !


మొదటి కథ : ఇది  బారతదేశం లోనే  ఉత్పత్తి  చెంది, యవనుల  ద్వారా,  ఎల్లలు  దాటి, ' యవనాచార్యునిచే'  విస్తృతంగా  చర్చింపబడి  తిరిగి  మన  దేశానికి వచ్చిందనీ  'రమళ  రహస్యం" అన్న  సంస్కృత  గ్రంధంలో  వ్రాయడం జరిగింది.

రము క్రీడార్ధ  ధాతోశ్చ  తస్మాదళ  విధానతః |  
ఔణాదిత్వాదళం  ప్రాప్య  రమళేతి  ప్రథాం గతః ||

అన్న  శ్లోకం  ప్రకారం  'రము అనే  క్రీడా  శబ్దంలో  దళ  ప్రత్యయం చేయగా  రమళ  ఏర్పడిందనే  విషయం  తెలుస్తోంది.


ఈ పుస్తకం లోని  కథనం ప్రకారం, కైలాసంలో  ఒకసారి  పార్వతీ  పరమేశ్వరులు  విహారయాత్ర  చేస్తూ  ఉండగా, పార్వతీదేవికి  ఒక  చిలిపి  ఆలోచన  వచ్చి,  పరమేశ్వరుణ్ని  ఆట  పట్టించాలనే  ఉద్దేశంతో,  అతనికి  కనబడకుండా  దాక్కొంది. శివుడు ఆమె  కోసం  వెదికి  వెదికి  వేసారి, చివరికి  'మహా భైరవుణ్ని'  ప్రశ్నించాడట.


మహా భైరవుడు తాను  తల్లికి  మాట  ఇచ్చాననీ,  అందుచేత  నోటితో  చెప్పననీ  అని, తన  కాలితో  కొన్ని  చుక్కలు,  గీతలు లాంటి  సంకేతాలు  గీసి,  వాటి   ద్వారా  తెలుసుకోమన్నాడట. ఆ  సంకేతాలతో  శివుడు  చాల సేపు  ప్రయత్నించి విఫలుడయి, శక్తినే  శరణు  వేడాడట. అప్పుడు శక్తి  ఆ సంకేతాలకి  సమాధానం  చెప్పి,  అతని  ముందు  నిలిచిందట. ఆ తరువాత  మహా భైరవుడు  శివ  శక్తుల   అనుమతితో   ఆ  సంకేత  శాస్త్రాన్ని  వృద్ధి  చేసి,  కొంత మంది  మునులకి  దానిని   తెలియ చేసాడట.


రెండవ కథ : ఒకనాడు  కైలాస  పర్వతంలో  పరమ  శివుడు  విరాజమానుడై  ఉన్న  సమయంలో  పార్వతీ  మాత  అతనిని   చేరి,  భూత  భవిష్యత్  వర్తమాన  విషయాలని  సరళంగా తెలుసుకోగలిగి, లోకులకి  ఉపయోగపడే  విద్యని  తెలియ జేయమని అడుగగా, పరమేశ్వరుడు ఆమె కోరికని మన్నించి రహస్యమైన రమళ్ విద్యని  ఉపదేశించాడట !


శివుడు  శక్తికి  చెప్పినా , శక్తి  శివునికి  చెప్పినా  పెద్ద  తేడా  ఏమీ  లేదు  గాని , మూడో  కధ  మాత్రం  యీ  రెండింటికీ  భిన్నంగా  ఉంది.


మూడో కథ : ద్వాపర  యుగంలోని  అంతిమ  చరణంలో,  'మాదన్'  అనే  ఒక  ఋషి,  ఒకనాడు  ఒక  బ్రాహ్మణ  పండితుని  ఇంటికి  వెళ్లాడు. ఆ  సమయంలో  గృహ  యజమాని  ఇంట్లో  లేక పోయినా, అతని  నవ యవ్వనవతి  అయిన  కన్య  ఆ  ఋషిని  ఆహ్వానించి,  భోజనం  చేసి  వెళ్లమని  అడిగింది. మాదనుడు అంగీకరించి  ఆమె  వంట  ఇంట్లోకి  వెళ్లిన  వెంటనే,  ఆమె  సౌందర్యానికి  ఆకర్షితుడై, క్షణిక  ఆవేశంలో  తన  కౌపీనంలో  వీర్యస్ఖలనం  చేసుకొన్నాడట. తరువాత  తెప్పరిల్లి,  ఆ  కౌపీనాన్ని  అక్కడే  ఒక  మూల  విసిరేసి,  మనసుని  స్వాధీనం  చేసుకొని  ఆ  సుందరి  ఇచ్చిన  ఆతిథ్యాన్ని  స్వీకరించి  వెళ్లి  పోయాడు. ఆ  ముని  వెళ్లిన  వెంటనే  రజస్వల  అయన  ఆ  కన్య  తన  రజో  శ్రావాన్ని  ఆ  ముని  విడిచి  వెళ్లిన  కౌపీనం తోటి శుభ్రం  చేసుకొంది.


తత్ఫలితంగా  ఆ  కన్య  గర్భవతి  అయి,  తండ్రి  చేత  త్యజింపబడి,  దూరాన  ఉన్న  అరణ్యంలో  కుటీరాన్ని  కట్టుకొని,  నివసించ  సాగిందట. ఆమెకి  సూర్య  సమాన  తేజంతో,  పుత్రోదయం  కలిగింది. ఆ  పుత్రుడు  పుట్టగానే  దైవ  వశాన, మాదన   ఋషి  అక్కడికి  వచ్చి,  తన  కుమారుని  గుర్తించి,  సకల  విద్యా  పారంగతుణ్ని  చేసి,  శివమంత్రాన్ని  ఉపదేశించి  వెళ్ళిపోయాడట.


యువకుడైన  తరువాత  శివ  మంత్రాన్ని జపించి,  అతడు  మక్కేశ్వరున్ని ప్రసన్నం   చేసుకొని, గుప్త  విద్య  అయిన  రమల్  అభ్యసించి, యవనాచార్య  బిరుదంతో  జ్యోతిష  గ్రంధాన్ని  రచించాడట. ఋషుల  మీద  కోపంతో  దేవ  భాష  అయిన  సంస్కృతాన్ని కొన్ని  సంకేతాలతో  మార్చి,  'ఫారశీ  భాషని'  కనుగొన్నాడట. ఆ  సంకేతాల తోనే  తను  నేర్చిన విద్యని  వ్రాసి, దానిని  గ్రంధస్తం చేసాడట. ఆ  విధంగా  అతడు  విశ్వ  విఖ్యాత  జ్యోతిష  గ్రంధకర్త  అయ్యాడు.


పైన  చెప్పిన మూడు కథల ద్వారా, యీ  రమల్  విద్యని సదాశివుడే  చెప్పాడని తెలుస్తోంది. కాని  వీటిని  నమ్మడం  కష్టం. మొత్తం  మీద  అర్థమయిందేమిటంటే -ఈ  విద్య  యవన  దేశం  నుండి  వచ్చిందనీ,  దానినే సంస్కృత  విద్వాంసులు  స్వంతం  చేసుకొన్నారనీ  అభిప్రాయపడవలసి వస్తోంది.
 

ఏది  ఎలాగున్నా  ఈ  రమల్  ప్రాచుర్యాన్ని  మాత్రం  అంగీకరించక  తప్పదు ! ఇక   యీ  శాస్త్రం  ద్వారా  భవిష్య వాణిని  ఎలా తెలుసుకోవాలో  చూద్దాం. సంస్కృత  పండితుల  హస్తక్షేపం  వల్ల  ఇది  రెండు  సంస్కృతుల  మిశ్రమ  విద్య  అయింది. ప్రతీ  సంకేతానికి,  ఫారశీ  సంస్కృత  శబ్దాలు  ఉన్నాయి.  రెండు  భాషల  విద్వాంసులూ  సంయుక్తంగా  దీని  అభివృద్ధికి  కృషి  చేసారు. ఇది  ప్రశ్నశాస్త్రం  కాబట్టి,  పృచ్ఛకుడు  అడిగే  ఏ  ప్రశ్నకి  అయినా  జవాబు  ఇస్తుంది.  ప్రశ్న  సమయానికి  లగ్న  సాధన  అవసరం  లేదు. సంకేతాలని  తెలియజేసే  పాచికల్ని  విసిరి  వాటిని  ఆధారం  చేసుకొని  ప్రశ్నకి  జవాబు  ఇవ్వవచ్చు. పంచభూతాలైన  అగ్ని,  భూమి,  వాయువు,  ఆకాశం,  నీరు  ఎలా  ఏ  రీతిలో  ప్రవహిస్తున్నాయో  యీ  సంకేతాలు  చెప్తాయి  అని  యవనాచార్యుడు  అన్నాడు. మన  విద్వాంసులు  వీటికి  నవగ్రహాల భావ  లాస్యాలని  కూడ  జోడించారు. అందుకే  ఈ  శాస్త్రం  నాకు  అద్భుత  ప్రయోగమని  అనిపించి  ఈ  వ్యాస  రచనకి  ప్రోత్సహించింది.


పరిస్థితుల  ప్రభావం  వల్ల  విస్మరింపబడి,  అడుగంటిన  యీ  విద్యని  నాకు  తెలిసినంత  వరకు  పాఠకులకి  చెప్పాలనే  ప్రయత్నం ఇది.  ఆధునిక  కాలం  లోని  ప్రశ్నలకి  కూడ   దీని  ద్వారా  సమాధానాలు  తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రం గురించి వ్యాసాల రూపంలో వివరిస్తాను.

This entry was posted in వ్యాసం and tagged . Bookmark the permalink.