మానవుడు ఆర్థికజీవి. ఆర్థిక పరిస్థితులే అతని దృష్టిని నిర్ణయిస్తున్నాయి. అతని దృష్టి మారాలంటే ఆర్థిక పరిస్థితులు మారాలి. సంఘం రెండు వర్గాలుగా చీలి ఉంది – ధనవంతులు, బీదవాళ్ళు. వాళ్ల దృష్టిని వాళ్ల పరిస్థితి నిర్ణయించింది. సంఘంలో ఉన్నంతకాలం ఈ ఇద్దరికీ ఈ భిన్న పరిస్థితులు సరిపడవు. ధనవంతులకు ’హృదయ పరివర్తన’ కలిగి బీదవాళ్లకు సహాయం చేస్తారనుకోవడం హాస్యాస్పదం. వాళ్ల ఆర్థిక పరిస్థితిని నిర్ణయించినప్పుడు, ఆర్థిక పరిస్థితిని బట్టి భావాలు కలిగేటప్పుడు, ఆ పరిస్థితి యధాతధంగా ఉండగా వాళ్ల దృష్టి ఎలా మారుతుంది? ఇవన్నీ అబద్ధాలు. బీదప్రజలను మోసం చెయ్యడానికి చెప్పేమాటలు. ఈ మాటలు నమ్మగూడదు. బీదప్రజలు బాగుపడటానికి విప్లవమే మార్గం. అందుకు వర్గకలహమే సాధనం. “ప్రపంచ కార్మికులారా, ఏకము గండు”, “ఈ పోరాటంతో సంకెళ్ళు తప్ప మనకు పోయేది ఏవీ లేదు.”
ఈ సిద్ధాంతంలో భావానికి ప్రాధాన్యంలేదు. భావం ఆర్ధికపరిస్థితుల చేతుల్లో కీలుబొమ్మ అయింది. భావంతోపాటు మానవుని పనీ అంతే అయింది. భగవంతుడు ఒకడున్నాడని అంగీకరించే ఆధ్యాత్మికవాదులు ’పురుష ప్రయత్నం అవసరం’ అని చెప్పినట్లే వీరూ ’మానవ ప్రయత్నం అవసరం’ అంటారు. అనటమేగాని మానవుడు ఒకప్పుడు ధనవంతుని చేతుల్లోనూ, మరొకప్పుడు భగవంతుని చేతుల్లోనూ కీలుబొమ్మ అయినప్పుడు ఎట్లా వీలు? అవసరం ఎక్కడ? అంతేకాదు నైతిక విలువలక్కూడా సంఘంలో స్థానం లేకుండా పోయింది.
అన్నం కావాలి. ధనికవర్గం అధికారంలో ఉన్నంతకాలం బీద ప్రజలకు అన్నం దొరకటం అనేది పేరాశ, జరిగే పని కాదు. కాబట్టి బీదప్రజలు అధికారాన్ని చేపట్టాలి. అందుకు ఏ పని చెయ్యటం అవసరమైతే అదే ధర్మం. ఏ సాధనం ఈ ఆదర్శాన్ని నెరవేర్చగలుగుతుందో అదే ఉత్తమ సాధనం, మిగిలినవన్నీ బూటకపు మాటలు. సంఘంలో మార్పు రాకుండా ఉండటానికి ధనికవర్గం తయారుచేసిన తియ్యని మాత్రలు.
ఈవిధంగా సిద్ధాంతం నిర్మించబడింది. ఉద్యమం ప్రచారంలోకి వచ్చింది. బీదప్రజలు నడుం కట్టారు. విప్లవాలు చెలరేగినాయి. దయాసత్యశౌచాలు లేవు. మానవుడికీ మానవుడికీ ఉన్న సంబంధం తెగిపోయింది. ధనార్జన పరమార్థం అయింది. ఏవిధంగానైనా సరే డబ్బు సంపాదించటమే ప్రయోజకత్వంగా భావింపబడింది. మిగిలిన విలువలన్నీ దద్దమ్మల ఊహలక్రింద జమకట్టబడినాయి. ఒకరినొకరు మోసం చేసుకోవటం, అబద్ధం ఆడో, అవినీతిగా ప్రవర్తించో తన పనిని నెరవేర్చుకోవటం పురుష లక్షణం అయింది. మానవసంఘం దద్దరిల్లింది. ఉత్తమ పురుషులు మానవులను ఆవహించిన ఈ పైశాచిక దృష్టికి ఆహుతి అయ్యారు. మానవులు ఏళ్లతరబడి మూటకట్టిన తమ సంస్కారాన్ని తుడిచిపెట్టి ఎకాఎకిని జంతుజాలంలోకి దిగజారటానికి సిద్ధపడుతున్నారు. తమ సమాధిని తాము తవ్వుకుంటున్నారు. ఎవరికివారు ఏదో ఘనకార్యం చేస్తున్నట్టు, ఏదో ఒక లోకోత్తర విషయాన్ని సాధిస్తున్నట్టు భావిస్తూ తమ శక్తినంతా ఉపయోగించి వృధా కాలయాపన అవుతుందేమో అనే భయంతో, రేపు మనది కాదు అనే ఆతురతతో తమ సమాధిని తాము తవ్వుకుంటున్నారు
ఇక గత్యంతరం ఏమిటి?
ప్రపంచానికి ఈ విషమ పరిస్థితి ’మానవుడు ఆర్థికజీవి’ అనుకోవటంవల్ల వచ్చింది. ఈ సిద్ధాంతం – సామాన్య ప్రజలను గర్భదారిద్ర్యంలో ఉంచి, ఉత్తమ సిద్ధాంతాలను తాము ఆచరించకుండా, ఇతరులను తమ సొంత బలుపుకి ఉపయోగించుకోవటానికిగాను వాడే ధనికవర్గం వల్ల అవసరం అయింది. బ్రతుకే అనిత్యంగా కనపడేటప్పుడు మిగిలిన మాటలు ఎవరి చెవులకి ఎక్కుతాయి? కాబట్టి, ఈ సిద్ధాంతం గాలిదుమారానికిమల్లే ప్రజల్లో వ్యాపించటానికి ముఖ్యకారకులు ప్రజలు కాదు. ఈ సిద్ధాంతం అవసరాన్ని సంఘానికి ’తప్పనిసరి’ చేసిన స్వార్ధపరులు.
***********************
జీవకోటి పరిణామం ఎక్కడో ఒకచోట ఆగదు. మానవుడు బ్రతకటానికి చేసే ప్రయత్నాన్నుంచి స్వతంత్రేచ్ఛకూ, స్వతంత్రేచ్ఛనుంచి సత్యాన్వేషణకూ పరిణామం చెందాడు కాని, మానవుని జ్ఞానం సంకుచితం అవటంవల్ల, ఒక దశలో ఉన్న మానవుడు ఆ దశే సత్యమనీ, నిత్యమనీ అనుకుని ఆ దశను పట్టుకుని కూర్చోవటం వల్ల అనేక చిక్కులూ, వ్యర్థపోరాటాలూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిణామం చెందటానికి, ఆ పరిణామానికి తగిన సంస్కారాన్ని సృష్టించుకోవటానికీ, మానవుడు వెనుకంజ వెయ్యటానికీ, విజ్ఞానం, అజ్ఞానజనితమైన భయం, రెండూ కారణాలు. కోతులు మానవదశకు రావటానికి చాలా ఎదురు తిరిగి ఉంటాయి. ఈ పరిణామాన్ని సూచించే చిహ్నాలను నిరుపయోగమైన, తమ బ్రతుకుని అంతంచేసే చిహ్నాలుగా భావించి వాటిని నిర్మూలించటానికి ఎంతో ప్రయత్నించి ఉంటాయి. ఎందుకంటే తాము ఉన్న స్థితికి ముఖ్యావసరంగా కనపడే అనేక లక్షణాలు వచ్చే స్థితిలో ఉండవు. అవి లేకుండా తామెలా బ్రతకటం? రెండు కాళ్లమీద నడవటానికి ప్రయత్నించిన మొదటి కోతిని మిగిలినవన్నీ ఎంత ఎగతాళి చేసి ఉంటాయో! ’దానికేమి పోయేరోగం!’ అని బుగ్గమీద వేలువేసుకుని ఉంటాయి.
మానవునిలోనూ ఈ లక్షణాలే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పై స్థితికి వెళ్లటానికి భయం. అదేదో అగాధంగా కనిపిస్తున్నది. ఈ స్థితికి అవసరం అయినవాటిని వదులుకుంటే ఏమౌతామో అనిపిస్తుంది. దీనినే ’fear of freedom’ అంటారు. ఈ భయం వల్ల ఎదురుతిరిగి తన ప్రాణాలను కూడా లెక్కచెయ్యక పోరాడుతాడు. ఉన్నచోట ఉండటమే వాంఛిస్తాడు. తెలియని మిత్రునికంటే తెలిసిన విరోధే నయం అనుకుంటాడు.
ఒకదశలో ఉన్న మానవుడు పైదశలో ఉన్న మానవుణ్ణి అర్థం చేసుకోవటం కూడా కష్టమే.ఎందుకంటే అతని చిత్తప్రవృత్తి వేరు, అతని సమస్యలు వేరు, అతని పరిష్కార మార్గాలు వేరు. ఎవరికివారు తమ తమ చిత్తవృత్తులనుబట్టే ఇతరులను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు గనుక, అపార్థం చేసుకోవటానికి ఎక్కువ వీలుంది. ఈ విషయం మన నిత్య జీవితంలో అనుక్షణం అనుభవానికి వస్తూనే ఉంటుంది. కానీ పై స్థితిలో ఉన్నవారికి కిందిస్థితిలో ఉన్నవారి సమస్యలు అర్ధం చేసుకోవటం తేలిక. వారికి మార్గంచూపి, అంటే వారి సమస్యలను పరిష్కరించటానికి సహాయపడి, వారి అభివృద్ధికి ఆటంకం తొలగించటం వారి ధర్మం. ఈ దృష్టివల్లనే ’వేదాంతం ఆకలితో మాడేవాడికి కాదు.’, ’నాదేశంలో ఒక కుక్క ఆకలితో మాడుతున్నా దాని ఆకలి తీర్చటమే నా ధర్మం’ అనే సూక్తులు వేదాంతుల నోటినుండి వెలువడ్డవి.
కాబట్టి ఆర్ధిక పరిస్థితులే మానవుని దృష్టిని నిర్ణయిస్తాయి అనుకోవటం పొరపాటు. అది ఒక బలమైన శక్తి, కాని మానవుని దృష్టిని నిర్ణయించే శక్తి మరొకటి కూడా ఉంది. అది జ్ఞానం. దీన్ని సంస్కారం అనండి, భావం అనండి, మరింకేమన్నా అనండి- ఆర్ధిక పరిస్థితికాక మరొక శక్తి కూడా మానవుని దృష్టిని నిర్ణయించటానికి తోడవుతూ ఉందని మాత్రం అంగీకరించాలి. ఇది అంగీకరించకపోతే మానవుడు పరిష్కరించలేని విషమ పరిస్థితులు కలుగుతాయి. భావాన్ని కూడా ఒక శక్తిగా అంగీకరించినంత మాత్రాన భావవాదుల సిద్ధాంతాన్నంతా అంగీకరించవలసిన అవసరం లేదు. పదార్ధం వేరు, శక్తి వేరు అని ఒప్పుకోవలసిన అవసరం లేదు. ఈ శక్తే వివిధరూపాలు ధరిస్తూ ఉందని ఒప్పుకోవలసిన అవసరం లేదు. ఈ శక్తి కూడా పదార్ధంలోనుంచి పుట్టినదే కాని తన ప్రభావం వల్ల తాను వృద్ధి చెందగలదు. తానొక శక్తిగా వృద్ధిచెంది, మానవుణ్ణి మార్చగలదు. పుట్టటం పదార్థ పరిణామంవల్ల పుట్టినా, పుట్టిన తరువాత తన కాళ్ల మీద తను నిలవగలదు.
“మీరు అన్నట్లు జ్ఞానం అంత శక్తి గలదైతే ఇతర వర్గాలకు చెందిన మేధావులు, మధ్యలో మోసంచేసి ధనికవాదుల్లో చేరతారు ఎందుకు?” అని అడిగాడు శిష్యుడు.
శిష్యుని మనస్సులో చెలరేగుతున్న ఊహలు గురువు గమనించాడు. ’మానవుని దృష్టి అచ్చగా ఆర్థిక పరిస్థితిని బట్టే ఉంటుంది’ అని చెప్పేవారి వాదన ఇది. ఆర్థిక పరిస్థితే కారణం అయినప్పుడు, ఇతర వర్గాలకు చెందిన మేధావులు బీద ప్రజలకు సహాయం చెయ్యటానికి పూనుకోవటంగానీ, బీదవాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడే పార్టీలో చేరటంగానీ, ఎలా తటస్థిస్తుంది?’ అనే ప్రశ్నకు ’కీర్తి కోసం’ అంటున్నారు. ఎవ్వరైనా సరిపడక మానుకుంటే ’అదుగో చూడు’ అని వేలుపెట్టి చూపుతున్నారు. ఇటువంటి మేధావులు ఎవ్వరైనా అగ్రగాములుగా ఉండి విప్లవాన్ని నడిపితే ఏమీ చెప్పలేక ’declassed individuals’ అని చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి, భావాల బలాన్ని అంగీకరించకపోవటం వల్ల వచ్చిన చిక్కులు ఇవి. ఈ సమస్యలన్నీ శిష్యుణ్ణీ కలవరపరుస్తున్నాయని గురువు గ్రహించాడు.
“నాయనా, అటువంటి వాళ్ళు భావాల బలంవల్ల చేరినవాళ్ళుగాని, ఆర్ధికస్థితి వల్ల చేరినవాళ్ళు కాదు. కష్టాలను తట్టుకునే జ్ఞానం వాళ్లకు లేనప్పుడు తమ ప్రయత్నంనుంచి విరమిస్తారు. ఇది ఒక్క మేధావులకే కాదు బీద ప్రజలకు కూడా వర్తిస్తుంది. దీనజనోద్ధరణకు కంకణం కట్టుకున్న పార్టీలకు ఎంతమంది బీద ప్రజలు వ్యతిరేకంగా నిలవటంలేదు! వారికి తగిన చైతన్యం లేదని నీవు సరిపుచ్చుకుంటావు. వీరిని గురించి కూడా ’కష్టాలను ఎదుర్కొనే ’భావ బలం’ వీళ్లకు లేకపోయింది’ అని ఎందుకు అనుకోవు? అది కాకుండా మరొక విషయం కూడా నీవు ఆలోచించాలి. .ఇతర వర్గాలకు చెందిన మేధావులు ఆపేక్షించేది అన్నం కాదు. వారిని నడిపేశక్తి స్వతంత్రేచ్ఛ, సత్యాన్వేషణ. వ్యక్తిగతంగా వారి అభిలాష ఏదైనా, దారిద్ర్యం నిర్మూలించటం ప్రథమ కర్తవ్యం గనక బీద ప్రజలకోసం, అన్నంకోసం పోరాడే ఉద్యమాలలో పాల్గొంటారు. ఒళ్ళు దాచుకోకుండా పాటుపడతారు కాని, వారి వ్యక్తిగత అభిలాషైన ’స్వతంత్రేచ్ఛ’కు, ’సత్యాన్వేషణ’కు ఈ ఉద్యమాలు అడ్డు తగిలినప్పుడు ఆ ఉద్యమాలనుంచి విరమిస్తారు, అంతకంటే గత్యంతరం ఏముంది?” అన్నాడు గురువు.
* * * * *
మానవుని పరిణామానికి దోహదం ఇచ్చే శక్తుల్లో భావానికి ప్రాధాన్యం ఇచ్చి తీరాలి. జీవకోటికి తెలివితేతలు వచ్చినప్పటినుంచి, ఆలోచించగలిగిన శక్తి వృద్ధి పొందినప్పటినుంచీ, భావ ప్రభావం మానవుని మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆలోచనాపరుల సంబంధాల్లో ఆర్థిక దృష్టి ఎంత తక్కువగా కనిపిస్తుందో మనకు తెలిసిన విషయమే! భావానికున్న ఈ శక్తిని మనం అంగీకరించకపోతే, స్వాతంత్ర్యం కోసం ఆస్తులను అమ్ముకున్న వారినీ, ఇతర వర్గాలకు చెందిన బీదవాళ్లకోసం సమస్తం త్యాగం చేసిన వారినీ మనం అర్థం చేసుకోలేము.
ప్రకృతి నియమబద్ధమైనది. మానవుడు ప్రకృతిలో భాగమే అందువల్ల ఈ నియమబద్ధత ఎప్పుడూ ఉంటూనే ఉంది. ఇన్ని అవాంతరాలు దాటి ఎవరో ముందుండి దారి చూపుతున్నట్లు ఒక స్థితినుంచి ఒక స్థితికి పరిణామం చెందగలిగేది కాదు. స్వభావ సిద్ధంగాఉన్న ఈ నియమ బద్ధతే నీతికి దారి తీసింది.
మానవజీవితంలో నీతినియమాలు ఎక్కడనుంచో వచ్చిపడినవి కాదు. ప్రకృతిలోఉన్న నియమబద్ధతకు సంబంధించిందే. ఒకరికొకరు సహాయం చేసుకోవటంవల్లా, అందరూ కలిసి బ్రతకవలసిన అవసరం ఉందటం వల్లా వచ్చినవే. ఒరిపిడివల్ల పుట్టి, అవసరంకొద్దీ నిలిచినవే. కాకపోతే, పరిణామక్రమంలో జీవకోటికి ఆలోచనాశక్తి వచ్చిన తర్వాత, సాంఘిక పరిస్థితులకు దూరంగా వాటంతట అవి నిలబడ గలుగుతున్నాయి. మానవకోటిని మృగదశకు జారకుండా కాపాడుతున్నాయి. నీతినియమాలు సంఘానికి ద్వారపాలకుల్లాగా ఎల్లప్పుడూ ఉండవలసిందే. వీటిని కాపాడి ఆచరించవలసిన బాధ్యత మాత్రం, మనముందు అన్నంకోసం తాపత్రయపడవలసిన అవసరంలేని వర్గాలది. వారే వీటిని విస్మరించి నిర్దాక్షిణ్యంగా ధనార్జనే పరమార్థంగా పెట్టుకుంటే, అన్నార్తులు తమ పొట్టకోసం వాటిని తిరస్కరించి విజృంభించటంలో ఆశ్చర్యం లేదు. ’నీవు రేపిన సుడిగాలి నీవే అనుభవిస్తావు’, ధర్మంగా బ్రతుకుతూ, దారిద్ర్యంలో, అజ్ఞానంలో ’దినదినగండంగా’ జీవితం వెళ్లబోసుకునేవాళ్ల సమస్యల పరిష్కారానికి సహాయపడి, వాళ్ళు కూడా నీతినియమాలు పాటించటానికి వీలైన పరిస్థితులను సృష్టించటం పైవర్గాల వారి విధి. అది జరగనప్పుడు ప్రళయమే.
* * * * * * * * * * *
మానవుడు పరిణామంలోని రాబోయే దశకు వెళ్ళటానికి భయపడుతున్నాడు. ఈనాడు మానవ జీవితానికి ఏవి ముఖ్యావసరం అనుకుంటున్నాడో, వాటికి రాబోయే దశలో విలువ ఉండదు. ’అవి ఊతంగా లేని స్థితిలో తను ఎలా బ్రతికేటట్టు? తను ఏమైపోతాడో?’ అని విపరీతమైన భయంతో వణికిపోతున్నాడు. ఇప్పటి లక్షణాలనుబట్టి ఆ స్థితిలో ఇప్పుడున్న ఆర్థిక సంబంధాలు, ఇప్పుడున్న విలువలు అన్నీ తారుమారు అయ్యేటట్లు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న మానవుని చిత్త ప్రవృత్తికి ఆ స్థితి ఏమీ ఆకర్షవంతంగా కనుపించటం లేదు. పర్వత శిఖరాగ్రంనుంచి లోయలోకి దూకవలసిన మనిషికిమల్లే భయపడుతున్నాడు. కాని పరిణామశక్తి అతన్ని ముందుకు నెడుతూ ఉంది. అతను ఉక్కిరిబిక్కిరై ఎదురు తిరిగి పోరాడుతున్నాడు. రావలసిన స్థితికి దోహదం ఇచ్చే గుణాలను నిర్మూలించుకుంటున్నాడు. ఏ సంస్కారం, ఏ విజ్ఞానం, ఏ నైతిక దృష్టి తనను “ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు” అని ప్రోత్సహిస్తూ ఉందో, బలవంతపెడుతూ ఉందో దాని గొంతు నులమటానికి పూనుకున్నాడు. అది నశిస్తేగాని తనకు రక్షణలేదు అనుకుంటున్నాడు. మృగదశకు తరలిపోవటానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నాడు.
ఇదీ నేటి విషమావస్థ. ఒక్క సంఘమే కాదు, ఏ మానవుడికి ఆ మానవుడే విషమావస్థలోపడి కొట్టుకుంటున్నాడు. అధోగతికి పోతున్న ప్రస్తుత పరిస్థితులలో బ్రతకటానికి అవసరం అయిన దృష్టీ, ఈ దృష్టికి వ్యతిరేకంగా ముందుస్థితికి వెళ్లమని ప్రోత్సహిస్తున్న పరిణామశక్తీ – ఈ రెంటికీ సమన్వయం కుదరక గగ్గోలు పడుతున్నాడు. తనలో రేగిన ఈ ద్వంద్వ సంరంభం వల్ల నిర్వీర్యుడై, దిగాలుపడి కూర్చున్నాడు.
మానవుడు రక్షింపబడాలి. పరిణామం అవిఘ్నంగా ముందుకు సాగిపోవాలి. మానవుని పతనానికి కారణం అయిన దారిద్ర్యాన్ని నిర్మూలించి, పురోగమనానికి అవకాశం కలిగించే పరిస్థితులు సృష్టించాలి. మానవునిలో ఉన్న, వచ్చేదశను సూచించే లక్షణాలకు ప్రోత్సాహం ఇచ్చి విజృంభింపజెయ్యాలి. ఆ శక్తులను సంఘటితపరచి, ముందుకు నడవాలి. మానవునికి ’చిన్నచూపు’ అలవాటైంది. స్వభావమైంది. ప్రతివస్తువునీ విభజించిగాని చూదలేకపోతున్నాడు. ఏ ముక్కకి ఆ ముక్కే పరిపూర్ణం అనుకుంటున్నాడు. వీటిని అన్నిటినీ కలిపి చూడగల శక్తి అతనికి కావాలి. భిన్నత్వంలో ఏకత్వం చూడగలగాలి. మానవుడు ముఖ్యం. మానవుడి శ్రేయస్సు మనం కాంక్షించేది. మానవుని సహజ శక్తులు అభివృద్ధి చెందటానికి అవకాశం కలిగించటం లక్ష్యం. ఏ రూపంలో, ఏ పేరుతో మానవుని స్వతంత్ర పిపాసను అరికట్టటానికి ప్రయత్నించినా అది మానవుని పతనానికి, సంఘవినాశనానికీ దారి తీస్తుంది.
ప్రపంచ పురోగమనాన్ని నిర్ణయించటానికి కొలబద్ద మానవుడే. అతన్ని వదిలి సంఘశ్రేయస్సు అనేది ప్రత్యేకం లేదు. దేశం, సంఘం, వర్గం, పార్టీ – ఈ భిన్నదృక్పథాలకు ఆదర్శం. మానవుని సహజ శక్తులు విజృంభించే అవకాశం కలుగజెయ్యటమేగాని, తమకు మానవునికి భిన్నంగా వ్యక్తిత్వం ఆపాదించుకొని, ఏదో ఒక వంకతో అరికట్టటం కాదు. ఏ దృక్పథమైనా అతని పరిణామానికి దోహదం ఇచ్చేదిగా ఉండాలి. కాని, అతనిమీద పెత్తనం చెలాయించేదిగా ఉండగూడదు.
“Man is the measure of things.”
మనస్సుని ఆత్మలో నిలపడమే నిజమైన ‘తత్వమసి’ అనే వాక్యము స్తుతి పరమా, ఉపాసనా లేక జ్ఞానపరమా, ఎందువలన? బింబ ప్రతి బింబముల రెంటి యొక్క రూపమలు బేధమా – అబేధమా?
మనస్సును ఆత్మలో లయము చేసుకొన్న మనస్సు జ్ఞానమును ఏ విధముగా పొందగలదు?
బ్రహ్మజ్ఞానము తెలిసిన సిద్ధునకు పోలికలేమిటి? బ్రహ్మజ్ఞానము నోటితో పలికిననేమి ప్రయోజనము? దినదినమునకు “నేను బ్రహ్మజ్ఞాని” ననెడి గర్వము మాత్రము తప్పక గల్గుచున్నది