మీరు ఎటువంటి అంశాలను కవితలుగా రాస్తారు? ఎలాంటి కవితలకు ఎలాంటి ప్రతిస్పందనని మీరు చూశారు?
ఇది కొంచెం కష్టమయిన ప్రశ్న, నాకు ఇష్టమయిన ప్రశ్న కూడా. నా కవిత్వాన్ని పనికట్టుకుని విమర్శించే కొందరు తరచూ సంధించే అస్త్రం కూడా ఇదే. కానీ, "రక్త స్పర్శ" నించి నా కవిత్వాన్ని దగ్గిరగా గమనిస్తున్న వాళ్ళకి సహజంగా ఈ ప్రశ్న పుట్టే అవకాశం లేదు. "రక్తస్పర్శ" లో వ్యక్తిగత కోణం, రాజకీయ దృక్పథం రెండూ వున్నాయి. వాటి మధ్య వంతెనని మనం అనేక విపరీత రాజకీయ కారణాల వల్ల కూల్చివేశాం, కాదంటే మన రాజకీయ తీవ్రత వల్ల ఆ వంతెనలన్నీ కాలిపోయాయి. వాటిని తిరిగి నిలబెట్టే ప్రయత్నం "రక్తస్పర్శ" లో కనిపిస్తుంది. ఆ పుస్తకం "అంతిమ స్పర్శ" అనే కవితతో మొదలయ్యింది. అది వొక విప్లవ కవికి నివాళి. కానీ, ఆ పుస్తకం నించి ఇప్పటికీ చాలా మంది కోట్ చేసే పంక్తులు కొంత వ్యక్తిగత కోణాన్ని చెప్పే పంక్తులే. "జ్ఞాపకాలు వేధిస్తాయే కానీ/ ఆప్యాయంగా పలకరించవు" లాంటివి. గుడిపాటి ఆ కవిత్వం "కోటబిలిటీ"కి కోట అంటాడు వొక వ్యాసంలో – ఈ పుస్తకం తను జైలులో వున్నప్పుడు చాలా కాలం బెడ్ సైడ్ బుక్ అనే వారట వరవరరావు. ఫైజ్ కవిత్వంలో వుండే పర్సనల్ అండ్ పాలిటిక్స్ అనే మిశ్ర లక్షణం "రక్తస్పర్శ"లో చాలా మందికి నచ్చింది. శివసాగర్ అజ్ఞాతవాసం నించి రాగానే బెజవాడలో నా మారుమూల గదిని వెతుక్కుంటూ వచ్చి నా నుదుటి మీద ముద్దు పెట్టి, చాలా సేపు నా చేతులు తన చేతుల్లోకి తీసుకొని 'రక్తస్పర్శ"లోని కొన్ని పంక్తులని అలవోకగా చెప్పేయడం నాకు బాగా గుర్తు. వీళ్ళందరికీ అందులో వున్న ఆ రాజకీయ తీవ్రత నచ్చింది.
ఇస్మాయిల్ గారు కూడా తరచూ ఇంటర్వ్యూలలో, వ్యాసాలలో మీ పేరు ప్రస్తావించే వారు కదా?
అవును. అదే సమయంలో ఇస్మాయిల్ కి కూడా ఆ పుస్తకం నచ్చింది. కానీ, ఆయనకి నా రాజకీయ నిబద్ధత నచ్చలేదు "మీరు ఆ రాజకీయ నిబద్ధత వదిలించుకోవాలి. నిబద్ధత జీవితానికే కానీ, రాజకీయాలకి కాదు" అని మందలించేవారు. అలా రాజకీయాల్ని వదిలించుకోవడం అన్నది నాకు అసహజం అనిపించింది. కమ్యూనిస్టు రాజకీయ నేపథ్యం లేకుండా నా కుటుంబ చరిత్రే లేదు, అలాంటప్పుడు నేను ఆ నేపథ్యాన్ని నిరాకరించడం అంటే నా సొంత చరిత్రని నిరాకరించడమే అవుతుంది. పైగా, నేను కవిత్వ ప్రయాణం నిర్దిష్టత వైపు సాగాలని అనుకుంటాను. అస్తిత్వాన్ని గురించి ఎంత నిర్దిష్టంగా చెప్పగలిగితే అంత మంచి కవిత్వం అనుకుంటున్నాను ఇప్పటికీ- ఈ తాత్వికత పునాదులు మీకు నా వ్యాస సంపుటి "ఆధునికత – అత్యాధునికత" (1992) లో కనిపిస్తాయి. ఈ వ్యాసాలు ఆ కాలంలో పట్టుబట్టి వేయించాడు తిరుపతిరావు. మొదటిసారిగా పోస్ట్ మోడర్నిజమ్ చర్చ ఇందులోనే మొదలు పెట్టాము.
కవి వ్యక్తిత్వం అనేక అంశాల సమాహారం. వాటన్నిటి మధ్యా వొక ఫైన్ బాలన్సు దృక్కోణం. ఆ బాలన్సు వెతుక్కోడానికి మనం రాస్తామని నా నమ్మకం. నా లోపలి విషయాలు ఎంత ముఖ్యమో, నా బయటి విషయాలు కూడా అంత ముఖ్యం అనుకుంటాను. దేన్నీ నిరాకరించలేమనుకుంటాను. నిరాకరిస్తున్నామంటే మనల్ని మనమే సెన్సార్ చేసుకుంటున్నామని అర్ధం. అన్ని రకాల సెన్సార్లనీ సవాల్ చెయ్యడమే నా కవిత్వ దృక్పథం. "ఊరి చివర" లో మీకు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పాత కొలమానాలతో చూసేవారికి అందులో కవిత్వం కనిపించకపోవచ్చు. వేలూరి ఈమాట సమీక్షలో లోపం అదే. ఆయన నన్ను కాకుండా, నా కవిత్వంలో తనని వెతుక్కునే ప్రయత్నం చేశారు, తను ఏ విధంగా చూడాలనుకున్నారో అలాగే నన్ను శాశ్వతంగా చూడాలని అనుకుంటున్నారు. ఇంకా కొంత మంది కూడా-
మీరు రాసినవాటిలో మీకు బాగా తృప్తి నిచ్చిన కవిత ఏది? ఎందుకు?
"ఊరి చివర"లో బిస్మిల్లాహ్ ఖాన్ మీద రాసిన ఎలిజి. "వొక రొట్టి ముక్కా, వొక దేశమూ, వొక షెహనాయీ" అనే కవిత. నేను తరచూ వినే స్వరం అది. ఆయన చనిపోవడానికి కచ్చితంగా వొక వారం ముందు వొక మిత్రుడి ద్వారా ఆయనని పలకరించే ప్రయత్నం చేశాను. కానీ, ఆయన వినికిడి సమస్య వల్ల సంభాషణ సాగలేదు. నా వ్యక్తిగత జీవితంలో పీర్ల పండగ చాలా ముఖ్యమైనది. బిస్మిల్లాహ్ ఖాన్ కర్బలా గానం నాకు నిత్యస్ఫూర్తి. ఆయన మరణం నన్ను బాగా బాధపెట్టింది. చివరాఖరికి ఆయనకి మిగిలింది ఆ నులక మంచం, ఆ రొట్టి ముక్క మాత్రమే అని తెలిసినప్పుడు ఇంకా బాధ పడ్డాను. కళాకారుడి మరణం ఇంత విషాదంగా ఎందుకు వుండాలో నాకు అర్ధం కాలేదు. జీవితంలో అన్నీ సుఖాలనీ నిరాకరించి షెహనాయికీ, తన దేశానికీ అంకితమయిన ఆయన ఆ నిశ్శబ్ద నిష్క్రమణలో నాకు చాలా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.
ఆ మరణాన్ని మీరే విధంగా చూశారు?
అసలు ఏ మరణమయినా అనేక ప్రశ్నల పుట్టినిల్లు. నేను చూసిన అన్ని మరణాలూ నాకు బాధ కలిగించాయి. ఏ మనిషి జీవితం సందేశం అవుతుందో లేదో తెలీదు గాని, ప్రతి మరణమూ నాకు వొక సందేశం, వొక సందేహం. వ్యక్తిగతంగా ఈ క్షణాన చేసే ఈ పనే గొప్ప పని అనుకుంటున్నాను. ప్రతి మరుక్షణమూ మరణమే అనుకుంటున్నాను. వ్యక్తి స్థాయి నించి సామూహిక స్థాయి దాకా జీవితం అనేది చాలా తాత్కాలికం అనే భావన బలపడుతోంది, పొద్దున ఇంట్లోంచి బయటికి వెళ్తే, సాయంత్రానికి సజీవంగా ఇంటికి చేరుతామన్న నమ్మకం పోయింది. తెలంగాణ పల్లెల్లో ఈ అశాంతి ఇంకా ఎక్కువగా వుంది. ప్రపంచ పటం మీద నిలబడినప్పుడు ఇంకా స్పష్టంగా ఇదే అనిపిస్తుంది. ఆ కవితలో చెప్పినట్టు "జీవితం వొక పిసినారి కల.." వొక తాత్విక భారం లాగా కనిపిస్తుంది ఇది, కానీ, ఇప్పటికిప్పుడు నేను ఇలాగే వున్నాను. వచ్చే క్షణం అనేది వుందో లేదో తెలీదు కాబట్టి, ఈ క్షణంలో చెయ్యాల్సిన అన్నీచెయ్యాలి అన్న వొక వెర్రి తపన. ఆ కవిత బిస్మిల్లాహ్ ఖాన్ కంటే ఎక్కువగా నా కోసం రాసుకున్నదే.
ఇతరుల రచనలు చదివి ఉత్తేజితులై ప్రేరణ పొంది మీరు రచన చేసిన సందర్భాలేమైనా వున్నాయా?
పథేర్ పాంచాలి. నేను వొకటికి పది సార్లు చదువుకున్న నా డైరీ లాంటి నవల. ఈ నవల నేను మొదటి సారి నా ఎనిమిదో తరగతి వేసవి సెలవుల్లో చదివా. ఆ తరవాత అది నా జీవితంలో విడదీయలేని భాగం అయ్యింది. చదివిన ఏడాది తరవాత ఆ సినిమా చూశాను. సత్యజిత్ రే మంచి దర్శకుడు కాదు అని అర్ధమయ్యింది, విభూతి భూషణ్ ముందు- సినిమా వొక్క సారి మాత్రమే చూశాను, నవల అప్పటి నించీ ప్రతి ఏడాది చదువుతూనే వున్నాను. ఆస్టిన్ వచ్చాక నేను చెప్పే దక్షిణాసియా నవల కోర్సులో అది టెక్స్ట్ బుక్ చేశా. అది ఇంగ్లీషులో కూడా అంత బాగా అనువాదం కాలేదు. కానీ, మద్దిపట్ల సూరి అనువాద మహిమని ఎప్పటికీ మరచిపోలేను. దాని ముందు సత్యజిత్ రే తెరానువాదం కూడా దిగదుడుపే.
ఆ నవలలో అంతగా కట్టిపడేసిన లక్షణం ఏమిటి?
నేను ముందే చెప్పినట్టు పుస్తకాలు చదివి ఉత్తేజితం కాలేను, ఆ పుస్తకంలో కనిపించే మనుషుల వల్ల ఉత్తేజితమవుతా. అపూ, దుర్గ నా తోబుట్టువులుగా మారిపోయారు దాదాపు – నా మొదటి కథ "అడివి"లో కొంత ఆ ప్రభావం కనిపిస్తుంది. కవిత్వంలో నేను అలా వొక రచన చదివి ప్రభావితమయి రాసిన సందర్భాలు అసలు లేవు. నా జీవితంతో ప్రత్యక్ష సంబంధం లేని ఏ విషయాన్నీ నేను కవిత్వంలోకి తీసుకు రాలేను. అది నా బలహీనత. అదే బలం కూడా కావచ్చు. పథేర్ పాంచాలిలో ఆ అపూలాగా, ఆ దుర్గ లాగా కవిత్వం నా కోసం నేను ఎక్కడో దాచి పెట్టుకున్న రహస్య ప్రదేశం.
మీరు చదివిన ఇతరుల రచనల్లో మీకు బాగా నచ్చిన రచనలు ఏవి?
మార్క్స్ -ఎంగెల్స్ సమకాలికుల స్మృతులు. అది నాకు బాగా నచ్చిన రచన చిన్నప్పటి నించీ ఇప్పటి దాకా. ఆ తరవాత నేను దాస్ కాపిటల్ చదివాను. అది చదవకపోతే, దాని గురించి రాజకీయ శిక్షణా శిబిరాల్లో చర్చించి వుండకపోతే నా బతుకు, నా ఆలోచనలు అసంపూర్ణంగా వుండేవి. వామపక్ష పాతం ఎంతో కొంత లేని వాళ్ళు జీవితాన్ని చదవలేరని ఇప్పటికీ నమ్ముతున్నా.
తెలుగులో నాకు బాగా నచ్చిన రచన వరవరరావు "సహచరులు," శ్రీపాద అనుభవాలూ-జ్ఞాపకాలూ, తిరుమల రామచంద్ర "హంపీ నుంచి హరప్పా దాకా". కవిత్వంలో బైరాగి, కథల్లో బుచ్చిబాబు, సాహిత్యవిమర్శలో రా.రా, పత్రికారచనలో నండూరి, ఈ కాలంలో సైదాచారి, పసుపులేటి గీత కవిత్వం – రాజిరెడ్డి, కె.శ్రీనివాస్ ల వచనం – కాత్యాయని , వేణు, గుడిపాటిల విమర్శ- చండీదాస్, కేశవరెడ్డి నవలలు.
మీ అభిమాన రచయిత ఎవరు?
వొకే వొక్క రచయిత పేరు అడిగితే కాఫ్కా. రెండు పేర్లు కావాలంటే కాఫ్కా, త్రిపుర -మూడు పేర్లు అడిగితే కాఫ్కా, త్రిపుర, రాజిరెడ్డి. ఆ ముగ్గురూ వొకే జాతి రచయితలు. నేను రాయలేని వచనం వాళ్ళు రాశారు. కవిత్వంలో ఎప్పటికీ శ్రీ శ్రీ, బైరాగి.
బోధనా రంగాన్ని ఎందుకు ఎంచుకొన్నారు? సాహితీ సృజనకు అవసరమైన వెసులుబాటు ఇతర రంగాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా ఉంటుందా? వృత్తి పరంగా మీ ప్రయాణం గురించి చెప్పండి.
డాక్టర్ కావాలనుకొని ఏదో అయ్యానని యాక్టర్లు అంటూ వుంటారు. అలాంటి కథ నేనూ చెప్పగలను. అది తరవాత చెప్తా.
బోధనా రంగం నేను ఎంచుకోలేదు. అది అనుకోకుండా దొరికిన వరమే. నాకు ఉన్నత విద్య మీద ఆసక్తి ఎక్కువ. అది నా జీవితంలో ఎప్పుడూ మిస్ అయిన రైలు. ఇక్కడికి వచ్చినప్పుడు మాడిసన్ లో నేను వొక ఏడాది కంటే ఎక్కువ వుండలేను అనుకున్నాను. ఎప్పటికప్పుడు ఆంధ్రా వెళ్లిపోతున్నా అన్న అనిశ్చితి వుండేది. అది ఇప్పటికీ వుంది. 2006 లో ఇండియా వచ్చినప్పుడు ఇక ఇండియాలో ఏదో చిన్న వుద్యోగంలో వుండిపోవాలన్న కోరిక వుండింది. కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో వుండి పోదామని దాదాపు ఖాయం చేసుకున్నాను. అలా అనుకున్న మరునాడు టెక్సాస్ యూనివర్సిటీ నించి పిలుపు వచ్చింది. వొక వారం వూగిసలాడాను. కానీ, వెల్చేరు నారాయణరావు గారు, నా అకడమిక్ గురువు ప్రొఫెసర్ చార్లెస్ హాలిసీతో సహా అందరూ "లేదు, ఇక్కడ కొన్నాళ్లు పని చేసి చూడండి" అన్నారు. టెక్సాస్ యూనివర్సిటీలో పని చేసే అవకాశం రావడం ఇంకో వరమే. ఇక్కడ నేను చెప్పిన ప్రతి కోర్సూ నా మనసుకి నచ్చిందే.
తెలుగులో రాయడం నాకు అత్యంత ఇష్టమయిన పని. ఆ కోణం నించి చూస్తే , తెలుగు సాహితీ సృజనకి అవసరమయిన వెసులుబాటు ఇక్కడి బోధనా రంగంలో ఎక్కువ వుందని అనుకోను, ఇప్పటికిప్పుడు నేను ముందే ఒప్పుకొని వెంటనే ముగించాల్సిన రాత పనులు చాలా వున్నాయి. అవి రాయడానికి నేను కొంత నన్ను నేను ముందుకు పుష్ చేసుకోవాలి. కానీ, తెలుగులో రాయడం అన్న దానికి అంత పుష్ అక్కరలేదు. పైగా, పాఠం చెప్పడానికి నేను ఎక్కువ తయారవుతాను. నేను చెప్పేవి ప్రధానంగా రైటింగ్ కోర్సులు కావడం వల్ల, విద్యార్ధుల రాత స్వయంగా చూడాలి అన్న తపన వల్ల, యాభయికి పైన విద్యార్ధుల రాత గ్రేడింగ్ చేసేసరికి వొక్కోసారి తల ప్రాణం తోకకి వస్తుంది. ఇప్పుడు విద్యార్థుల రాత పని మీద మా యూనివర్సిటీ చాలా శ్రద్ధ పెడుతోంది.
కానీ, అది నాకు చాలా ఇష్టమయిన పని. ఆ ఇష్టం వల్ల దాని మీద ఎక్కువ సమయం పెడతాను. ఈ పని వల్ల, తెలుగులో రాయడం అన్నది మూలన పడిపోతుంది. బోధన వృత్తి చిత్రమయింది, కేవలం పాఠం చెప్పే ఆ గంటకే పరిమితం చేసుకుంటే చాలా పనులు చెయ్యవచ్చు. ఆ గంటని జాగ్రత్తగా, చాలా నాణ్యంగా, శ్రద్ధగా మలచాలంటే చాలా గంటలు పడుతుంది. అప్పుడు మనకి సొంత సమయం అంటూ వుండదు.
మనసు పెట్టి చెయ్యలేకపోతే ఏ పనీ వొప్పుకోలేను కూడా. అది జర్నలిజం అయినా, పాఠమయినా, బ్లాగులో కామెంట్ అయినా సరే! చేసే పని చిన్నదయినా, రాసే పంక్తి వొక్కటే అయినా అది వొక దీర్ఘ ప్రక్రియ నాకు. "నువ్వు ఈ దీర్ఘ రోగం నించి బయటపడితే ఇంకా చాలా రాయగలవు" అని ఇప్పటికీ మిత్రులు మందలిస్తూ వుంటారు, కానీ, పుట్టుకతో వచ్చిన బుద్ధి!
(మెడిసిన్ సీటు వదులుకొని ఇంగ్లీషు సాహిత్యంలోకి…ఆ కథ ఈ సారి)
ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి
అఫ్సర్ గారి ఇంటర్వూ చాలా బాగుంది. చాలా అభిప్రాయాలు నిజాయితీగా ఉన్నాయి. తెలుగు డయాస్పోరా సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడానికి వీరి సాహిత్యం చాలా ఉపయోగపడుతుంది. ఊరు గురించి మారుతున్న అభిప్రాయాలు నాకు బాగా నచ్చాయి. పథేర్ పాంచాలి గురించి చెప్పిన అభిప్రాయం నవల సినిమాగా మారినప్పుడు గమనించవలపిన కళావిలువలకు సంబంధించింది. నాకు బాగా నిజాయితీగా చెప్పిన మాటగా ఆయన ముస్లం సాహిత్యం గురించి ఎందుకు రాయవలసి వచ్చిందో చెప్పింది బాగుంది. అలాగే నేడు ఊరు, జాతి, దేశభక్తి విషయంలో వస్తున్న భావజాల మార్పులు ఆయన చెప్పిన ఊరు భావన నిజం. మనం జీవిస్తున్న దేశాన్నీ, నేలనీ వదిలి మన జీవితం అతీతంగా ఉండదు. ఆ భావనల్లో చాలా మార్పులొస్తున్నాయి. వాటిని నిజాయితీగా చెప్పారనిపించింది.
ఇంకా రాయాల్సింది చాలా ఉంది
ఇప్పటికిది చాలు
అహినందనలతో
దార్ల
About a week ago, I posted a comment, which seems to be deleted….Is it due to any technical problem or any other?….May I know the reason?
విజయకుమార్ గారూ:
ఎంత కాలం అయ్యింది మిమ్మల్ని చూసి! ఇంతకు ముందె చెప్పినట్టు, ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు కలిగిన పెద్ద లాభం: నా పాత మిత్రులతో కొత్త బంధం. ప్రయాణాలా హడావుడిలో చాలా ఈమైల్స్ చూడలేదు కాని…ఇక్కడ మీరు చెప్పిన సంగతులు నేను కాస్త ఆలోచించాలి.
గ్లోబలి పీఠం మీద వున్న హైదరబాద్ మారడం సహజం, మారకపోవడం అసహజం. తెలంగాణా ఉద్యమం గానీ లేకపోతే, ఈ కాస్త అయినా హైదరాబాద్ వుండేది కాదనిపిస్తుంది. ఈ మార్పుని కూడా రచయితలు రచనల్లోకి తేవాలని నా ఆశ. మీరు చెప్పిన ఆ నాలుగు పేర్లు ఇప్పటి నగర జీవితంలో మినహాయింపులేమో ఆలోచించండి.
కోడూరి విజయకుమార్ గారూ – మీరూహించినట్టుగానే కొన్ని సాంకేతిక కారణాలవల్ల మీ వ్యాఖ్య కనిపించలేదు. మీ వ్యాఖ్యను పునరుద్ధరించాం. అయితే వ్యాఖ్యలు వెనకా ముందూ అయ్యాయి. దాన్ని కూడా చక్కదిద్దుతున్నాం. మా దృష్టికి తెచ్చినందుకు నెనరులు.
—
(సంపాదకులు)
afsar/koduri happy to read ur conversation on poddu. 3cheers.
afsar gaaru… anukokundaa ee interview chadivaanu…monne voka email pampinchaanu..choosaroo ledoo…
nizame…1998 lo nenu hyderabad shift ayinappudu choosina saahithya vaathavaranam koodaa ippudu ledu..edainaa voka sabhalo kaastha janam vunnarante adi e vv gaari pusthakam leka shivareddy gaari pusthakam sabha ayi vuntene saadhyam….kaani…hyderabad gurinchi …. saahithya vaathavaranam gurinchi anthagaa niraasha padaalsindi kooda ledanukuntaa… nenu naa anubhavame chebuthaanu.. ippatikee shivareddy & dwaarka friends, darbhashayanam, khadeer, akbar& geetha mari kontha mandimi frequent gaa kalusthune vuntaamu…
Interviewer emi adigaadu anedi pakkana pedithe, mee gurinchina visheshaalu ee vidhangaa thelusukovadam santhoshangaa vundi
Raaboye rojullonainaa meeru mee chinnappati sangathulni ‘aathmakatha maadirigaa’ raasthe (mukhyangaa mee naanna gaaritho meeru gadipina rojulni gurinchi) chaala baguntundani anukuntunna
KODURI VIJAYAKUMAR
afsar
mee interview bagundi.mee marichina vishayalatho maro interview thvaralo vastundani aashistanu.
I MISSED THIS WONDERFUL POST
WONDERFUL FEAST FOR ME TODAY