ఆధునికాంధ్రకవితాలోకంలో పెద్దగా పరిచయమక్కరలేని పేరు అఫ్సర్…
ఇన్ని వ్యాకరణాలూ
ఇన్ని నిఘంటువులు
అన్నీ వొంటి మీది బట్టల్లా కనిపిస్తాయి
అన్నిటి కిందా
ఒకే ఒక్క శరీరం ఘోష!"
అఫ్సర్ కవిత్వం వినిపించే తత్వం ఇదేకదా అనుకొని పలకరించాం…
ఎవరి భాషలో వాళ్లం
దూరాల్ని దగ్గిరగా 'నెట్టు'కొచ్చి…
మరిచిపోతున్న దేన్నో
మరింకోసారి గుర్తు చేసి!"
త్రిలింగదేశమంతా బాగా తెలిసినవాడు
భూగోళానికి రెండువైపులూ చూసినవాడు
పుట్టుకతోనే రెండు సంస్కృతుల సమ్మేళనం వొంటబట్టినవాడు
వొంటి మీది తెల్లని వస్త్రం నా మనసుని విప్పదు
నీ భాషలోకి వొదిగిపోయాను
నా అన్ని వుద్వేగాలతో, నేనూ
ఆవేశాలతో"
కవితల్లో చమత్కారమెంతుందో నేపథ్యంలో అంత సంఘర్షణ వుందని
మాటలయ్యాక వారి కవితలను చూస్తే మన గురించి తెలిసేవి కొన్ని
చదవండి అఫ్సర్‌గారితో ముఖాముఖి…
మొదటి భాగం
ముందుగా, మీకు సాహిత్య పరిచయం కలిగించిన వారి గురించి, ఆ విషయంగా మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుంది.?
మా నాన్నగారి ద్వారానే సాహిత్య పరిచయం. మాది కొంచెం ఆసక్తికరమయిన కుటుంబ చరిత్ర. మా అమ్మ తరఫు వాళ్ళంతా కమ్యూనిస్టులు. తెలంగాణా స్వాతంత్ర్య సమరంలో, పార్టీ కోసం వున్నదంతా ధారపోసి, కట్టుబట్టలతో మిగిలారు. దానికి భిన్నంగా మా తాతయ్య గారు (ఆయన పేరే నాకు పెట్టారు) నిజాం కొలువులో కస్టమ్స్ అధికారి. అనేక భాషలలో పండితుడు కావడం వల్ల నిజాంకి ఇష్టపాత్రులయ్యారని ఆయన గురించి చాలా కథలున్నాయి. ఆయన పాండిత్యానికి ఇనాంగా నిజాం ఆయనకి ఎర్రుపాలెం దగ్గిర బంగారం పండే భూములు ఇచ్చారు. మా నాన్నగారి దాకా వచ్చే సరికి మాకు సెంటు భూమి కూడా మిగలలేదు. ఆయనకి పూర్తి వ్యతిరేకంగా మా నాన్నగారు నిజాం వ్యతిరేక పోరాటంలో నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. ప్రజా నాట్య మండలిలో, అ.ర.సం లో కీలక పాత్ర పోషించారు. నిజాం ఇనామ్ భూములన్నీ వదులుకున్నారు. విశాలాంధ్ర పత్రికలో చిన్న జీతానికి చేరారు. ఆ తరవాత ఉత్తర భారత దేశం వెళ్ళి అక్కడ హిందీ మహావిద్యాలయంలోచదువుకున్నారు. ఖమ్మం దగ్గిర చింతకాని దగ్గిర హిందీ పండిత్ గా చేరారు. ఆ చిన్న వూళ్లోనే నేను పెరిగాను.
మాది ఆరుగురు పిల్లల పెద్ద కుటుంబం. రెండు గదుల అద్దె ఇల్లు ఎప్పుడూ. నా ఎలిమెంటరీ చదువు కొంత ఉర్దూ మీడియం, కొంత తెలుగు మీడియం. చుట్టూ పుస్తకాల గుట్టలు వుండేవి కాబట్టి, బాగా చదవడం అలవాటు అయ్యింది. ఆ చిన్న వూరికి దాశరథి, పెద్దిభొట్ల, మోరియా, కవిరాజ మూర్తి లాంటి అప్పటి పెద్ద రచయితలు నాన్నగారిని కలవడానికి అప్పుడప్పుడూ వస్తూండేవారు. వాళ్ళు వున్నంత సేపూ నాకు పండగ లాగా వుండేది. ఇంట్లో చాలా సందడిగా వుండేది. “అఫ్సూర్యుడా, ఎలా వున్నావ్ రా?” అని దాశరథి ప్రేమగా పలకరించేవారు. తరవాత ఉత్తరాలు రాసేటప్పుడు కూడా ఆయన నన్ను “అఫ్సూర్యుడు” (అఫ్సర్ ప్లస్ సూర్యుడు కలిపి) అనే పిలిచే వారు. నాకు ఉర్దూ అంటే ప్రాణంగా వుండేది. ఉర్దూ కవిత్వం ఎవరయినా చదువుతూ వుంటే ప్రాణానికి చాలా హాయిగా వుండేది. అమ్మ ముహర్రం పాటలు పాడేది. చాలా చిన్న వయసులో నేను ఖురాన్ చదువు పూర్తి చేశాను. ఆ స్మృతి నా “గోరీ మా” కథలో వినిపిస్తుంది.
చింతకాని బడిలో మా నాన్న గారు విద్యార్ధుల కోసం “మధుర వాణి” అనే పేరుతో దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడపత్రిక ప్రతి నెలా రాయించి పెట్టే వారు. ఈ గోడపత్రిక బడికే పరిమితమయినా, విద్యార్ధుల రచనల మీద ఆయన చాలా నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా అభిప్రాయాలు చెప్పడమే కాకుండా, విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకొని మార్పులూ చేర్పులూ చేయించేవారు. అవన్నీ నేను గమనిస్తూ వుండేవాణ్ని. వొక రచనని ఎడిట్ చేసుకోగలగడం గొప్ప కళ అని నమ్ముతాను నేను, నా రచనా జీవితం వొక విధంగా ఆ ఎడిటింగ్ పాఠాల నించే మొదలయ్యింది. కానీ, ఆయన అక్కడ వున్నంత కాలం నా కవిత్వం కానీ, చిట్టి కథలు గానీ వొక్కటి కూడా వేయలేదు. ఆ గోడపత్రికలో రచన చూసుకోవాలని విద్యార్ధులందరికీ తహతహగా వుండేది. నేను రచన ఇచ్చినప్పుడల్లా, చదివి, నవ్వి “నువ్వు బాగా రాయాలంటే బాగా చదవాలి” అని నా రచనని పక్కన పెట్టేసే వారు. అప్పుడు నేను నాటకాల వైపు మొగ్గాను. నేనే పది మందిని కూడదీసి, కొన్ని సీన్లు రాసి, మా ఇంటి పక్కన కిలారు గోవిందరావు గారి గొడ్లపాకలో అయిదు పైసల టిక్కెటు మీద వాటిని వేసే వాళ్ళం. అయిదు పైసలు లేని వాళ్ళు అయిదు చీట్ల పేకలు ఇవ్వాలని రూల్. ఆ వచ్చిన పేకలతో బెచ్చాలు ఆడేవాళ్లం.
మేం – పట్టణం అంటే ఖమ్మం రావడం మా బతుకులో పెద్ద మలుపు. ఏడో తరగతి నించి నేను ఖమ్మం జ్యోతి బాల మందిర్ లో చదివాను. ఇక్కడ నా అదృష్టం బాగుండి నాకు మంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు టీచర్లు దొరికారు. వాళ్ళు ఇంగ్లీషు, తెలుగు, హిందీలోనూ నా చేత కవిత్వం రాయించడం మొదలు పెట్టారు. తెలుగులో నేను ఎంతసేపటికీ ఛందోబద్ధ పద్యాలు రాసే వాణ్ని. అవి నాన్నగారికి చూపిస్తే, “వచన కవిత్వం ఈ కాలం కవిత్వం” అనే వారు. కానీ, నేను పద్యాల నించి బయటపడలేకపోయాను. ఇప్పటికీ ప్రాచీనసాహిత్యం చదివినంతగా ఆధునిక సాహిత్యం చదవను. పద్యాల నించి బయటపడే సమయం వచ్చేసరికి నాకు కవిత్వం మీద ఆసక్తి పోయింది. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీన పడింది. “సరిత” అని వొక మంచి సాహిత్య పత్రిక నడపాలన్న తపనతో మా నాన్నగారు “సాహితి ప్రెస్” అనేది పెట్టి నిలువునా మునిగిపోయారు. నేను ట్యూషన్లు చెప్పుకొని స్కూల్ ఫీజ్ కట్టుకునే పరిస్తితి వచ్చింది.
ఆ పరిస్థితిలో నండూరి రామమోహనరావు గారు, నేను వొక చిన్న వ్యాసం రాసి పంపిస్తే, వెంటనే అచ్చు వేశారు. అచ్చయిన వారానికి నాకు పాతిక రూపాయలు పంపించారు. ట్యూషన్లు తగ్గించి, “ఆంధ్రజ్యోతి” కి నెలకి మూడు వ్యాసాలు రాసే వాణ్ని. ఆ తరవాత అప్పుడప్పుడే కొత్త రూపం ధరిస్తున్న “ఆంధ్రప్రభ” ఆదివారం లో అనువాదాలు మొదలు పెట్టాను. “ఆంధ్ర జ్యోతి” లో నండూరి రామమోహన రావు గారు నా వ్యాసాల్ని ఎడిట్ చేసే వారు, ఆయన నా వ్యాసాన్ని ఎట్లా మార్చి ఎట్లా వేస్తారా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసే వాణ్ని. అవి వచనంలో నా తొలి పాఠాలు. అలా పరోక్షంగా మొదలయిన ఆయన శిష్యరికం నా డిగ్రీ కాక ముందే ఆయన ప్రత్యక్ష శిష్యరికంలోకి తీసుకువెళ్లింది.
సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే ఇంగ్లీషులో సీటు వచ్చింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండక నేను ఆంధ్రజ్యోతిలో చేరిపోయాను. సెంట్రల్ యూనివర్సిటీలో చేరమని, నెలకింతని తానే కొంత డబ్బు ఇస్తానని శివారెడ్డి గారు వొత్తిడి చేశారు. నా కాలేజ్ మిత్రులు నేను చదువు మానేస్తున్నందుకు కళ్ల నీళ్ళు పెట్టుకున్నారు, అనేక విధాలుగా నచ్చ చెప్పారు. యూనివర్సిటీ మెట్లు ఎక్కాలన్నది నా పెద్ద కల. అది వాళ్ళందరికీ తెలుసు. అది ఇండియాలో ఎప్పుడూ సవ్యంగా తీరలేదు, అప్పుడప్పుడూ యూనివర్శిటీల ఆహ్వానాల మీద ప్రసంగాలు ఇవ్వడం తప్ప.
మధ్యమధ్యలో నారాయణ రావు గారు “మీరు యూనివర్సిటీకి వెళ్లాలండీ. ఈ ఉద్యోగం మీకు సరయిన చోటు కాదు ” అంటూ అంటూనే వున్నారు. ఈ లోపు మిత్రుడు రమణ మూర్తి (త్రిపుర కథల పరిశోధకుడు) “కనీసం తెలుగు ఎమ్మే చదువు” అంటూ వొత్తిడి చెయ్యడం మొదలెట్టాడు. నేను వినని స్థితిలో కవి యాకూబ్ వొక ఎమ్మే అప్లికేషన్ ఫారం బెజవాడ పట్టుకొచ్చి, నా చేత నింపించాడు. పరీక్షలు నేను రాయలేనని మొండికేసినప్పుడు రమణ మూర్తి బలవంతంగా నన్ను పరీక్ష హాలులో కూర్చోబెట్టి, నేను పరీక్ష రాస్తున్నంత సేపూ తను కాంపస్ బయట నాకోసం ఎదురుచూస్తూ కూర్చునే వాడు. ఆ తరవాత నేను పీ ఎచ్ డీ చెయ్యాలన్నది గోపి గారి ఆలోచన. నాయని కృష్ణకుమారి, వేటూరి ఆనందమూర్తి, కులశేఖరరావు గారు ఆ ఆలోచనకి కాయితం రూపం ఇచ్చారు. ఎప్పటి మాదిరిగానే సీతారాం, గుడిపాటి, కాసుల ప్రతాప్ రెడ్డి, రామదాస్, సైదాచారి, పొనుగోటి కృష్ణా రెడ్డి, వెలిదండ నిత్యానంద రావు, పులికొండ సుబ్బాచారి, ఎండ్లూరి సుధాకర్ ఆ కాలంలోనూ నాకు గొప్ప అండ. సాహిత్యపరంగా అప్పుడు కొంత ఆరోగ్యకరమయిన వాతావరణం వుండేదని అనుకుంటాను. ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీతో పాటు అనేక చిన్న సాహిత్య బుల్లెటీన్లు, రచయితల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, అనుబంధాలు, సాహిత్య సభలూ…ఆ వాతావరణంలో ఇప్పుడు కాస్త మేఘాలు కమ్ముకున్నాయి. కవులూ రచయితల మధ్య అలాంటి సన్నిహిత వాతావరణం ఇప్పుడు వుందా అని అప్పుడప్పుడూ అనిపిస్తుంది.
మీ కవితాసృజనకు ముందు సాహిత్యంతో మీకున్న పరిచయం ఎలాంటిదో చెబుతారా?
— సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యం ప్రభావం ఎక్కువ. అమ్మ ముస్లిం అమరవీరుల కథలు చెప్పేది, ఇప్పటికీ నా కవిత్వంలో ఆ ప్రస్తావనలు వుంటాయి. మా తాత మహమ్మద్ సాలార్ (“రక్త కన్నీరు” ఫేమ్) ప్రజానాట్యమండలి నటుడు. గొప్ప గాయకుడు. చెరబండరాజు పాటలన్నీ పాడే వాడు. మార్క్సిజం వొక భావనగా అలా ఆ పాటల్లోంచి నా ఆలోచనల్లోకి చేరుకుంది. కుటుంబ నేపథ్యం వల్ల మార్క్సిజం, సంబంధిత సాహిత్యం నా జీవితంలో విడదీయలేని భాగం అయ్యింది.
సాహిత్యపరంగా రాయడం చాలా ఆలస్యంగా అంటే ఎనిమిదో తరగతిలో మొదలు పెట్టాను. పట్నం వచ్చాక వొక రకమయిన వొంటరితనంలోకి వెళ్లిపోయాను. ఆ వొంటరితనాన్ని నింపుకోవడానికి ఎక్కువ చదివే వాణ్ని, కొంత రాసేవాణ్ని. కానీ, రాయడం తక్కువే.
తొలి నాటి కవిత్వం కబుర్లు కొన్ని చెప్పండి?
ఎందుచేతనో కవిత్వంలోకి నేను ఆలస్యంగా అడుగుపెట్టాను. వ్యాసాలూ, చిన్న కథలూ, అనువాదాలూ ఎక్కువ చేసేవాణ్ని. రాసిన తొలినాళ్ళ కవిత్వం నా డైరీలకి మాత్రమే పరిమితమయ్యింది. అలా డైరీలలో రాసిన కవిత్వం వొక సారి పొరపాటున చదివిన సీతారాం దాన్ని తీసుకు వెళ్ళి నన్నేమీ మాట్లాడ నివ్వకుండా నేరుగా ప్రెస్ లో ఇచ్చాడు. అదే “రక్త స్పర్శ” (1985).
ఇంటర్/ డిగ్రీ చదువుకునే రోజులలో ఇంగ్లిష్ కవిత్వం రాయడం వొక పిచ్చి. అలా వొక కవిత ‘మిర్రర్” కి పంపాను. ఆ కవిత చదివి అప్పటి ‘మిర్రర్’ ఎడిటర్ ప్రభా గోవింద్ వెంటనే వుత్తరం రాశారు. నెలకి వొక కవిత నేను పంపేట్టు, ఆ పత్రిక వాళ్ళు నాకు వంద రూపాయలు ఇచ్చేట్టు ఆ వుత్తరంలో వొప్పందం అయ్యింది. అలా ఏడాది పాటు రాశాక విసుగు పుట్టి, ఇంగ్లీషు కవిత్వం మానేశాను.
1983 లో ఆంధ్రజ్యోతి వారపత్రిక కథలపోటీ పెట్టింది. ఆ పోటీలో “అడివి” అనే నా కథకి బహుమతి వచ్చాక నండూరి , పురాణం ఇద్దరూ నన్ను ఆంధ్రజ్యోతిలోకి తీసుకున్నారు. సాహిత్య వేదిక బాధ్యత అప్పజెప్పారు. అంతే…మళ్ళీ తెలుగు సాహిత్యంలోకి వచ్చి పడ్డాను. ఆంధ్రజ్యోతిలో పని చేసిన కాలం స్వర్ణయుగం. ఇప్పటికీ అప్పటి ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీలు గొప్ప ఆకర్షణగా కనిపిస్తాయి నాకు. నేను చూసిన గొప్ప వ్యక్తులలో మరచిపోలేని మనీషి నండూరి.
ఆ రోజుల్లో నండూరి అంటే చాలా గొప్ప ఎడిటర్. బయట ఎవరికయినా నేను నండూరి దగ్గిర పని చేస్తున్నానంటే నా గౌరవ మర్యాదలు పదింతలు పెరిగేవి. రోజూ ఆయనతో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ రోజులు మళ్ళీ రావు. ఆయన తన దగ్గిర వున్న పుస్తకాలు తెచ్చి ఇచ్చి నా చేత చదివించారు. తన దగ్గిరకి వచ్చిన ప్రతి రచయితనీ నాకు పరిచయం చేసే వారు. ఎవరయినా తనని సాహిత్య సభలకి పిలిస్తే, ’నేనెందుకు అఫ్సర్ వస్తాడు లెండి’ అని నన్ను వక్తగా పంపించేవారు. ఆకాశవాణిలో నాకు ప్రసంగాలు ఇప్పించేవారు. ఆంధ్రజ్యోతిలో నాకు వచ్చే జీతం మరీ అన్యాయంగా వుండేదన్న భావన లోంచి ఆయన వివిధ రకాలుగా డబ్బు వచ్చే ఇతర పనులు కూడా అప్పజెప్పే వారు. అందులో భాగమే ఈ ఆకాశవాణి ప్రసంగాలు. ఆ దశలో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, ఉషశ్రీ, రావిశాస్త్రి, చాసో, ఆరుద్ర, అజంతా, రోణంకి నాకు సన్నిహితంగా తెలిశారు.
మొదటి రేడియోప్రసంగం మల్లాది రామకృష్ణశాస్త్రి కథల మీద – మొదటి సారి రేడియో స్టూడియోలోకి పోగానే నాకు వణుకు మొదలై, గొంతు పెగల్లేదు. ‘ఒరే నాయనా, ఈ సారికి పోనివ్వు. రేపటి నించి పొద్దున్నే లేచి కృష్ణా నది ఒడ్డుకి వెళ్ళి, ఈ ప్రసంగం అంతా పెద్ద గొంతుతో ఆ కృష్ణమ్మకి వినిపించు. నీ గొంతు ఎంత పెద్దది అయితే అంత! వచ్చే సారి నువ్వు శ్రీపాద గురించి మాట్లాడాలి. నీ గొంతు పెరిగితే నీకు ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా. అయినా, నోరు లేకుండా ఎట్లా బతుకుతావు రా నువ్వు?!” ఆయన వెటకారంగా అన్నారా అని నేను నండూరి దగ్గిర బాధ పడితే, ఆయన నవ్వి “సరే. వెటకారమే అనుకో. కానీ దాన్ని కాస్త సీరియస్ గా కూడా తీసుకో. వొక ప్రయత్నం చెయ్యి, తప్పేమీ లేదు కదా! అయినా, నువ్వు ఇకనయినా కాస్త మాట్లాడ్డం నేర్చుకోవాలి. మౌనశంఖం లా వుండొద్దు. కానీ, ఉషశ్రీ ఆ మాట వెటకారంగా అనలేదులే! ఆయన అలాగే మాట్లాడతారు.” అన్నారు. నా మానసిక ఇబ్బందిని పక్కన పెట్టి, ఉషశ్రీ చెప్పినట్టే నేను ఆదివారాలు పొద్దున్నే లేచి నా ప్రసంగం కాయితాలు తీసుకుని, కృష్ణ నది ఇవతలి వొడ్డున నిలబడి అవతల మంగళగిరి కొండ అదిరిపోవాలన్నంత ఆవేశంగా వాటిని బిగ్గరగా చదివే వాణ్ని. అలాంటి పనులు తలచుకుంటే ఇప్పుడు నవ్వొస్తుంది కానీ, అది ఎంత మంచి సాధనో ఆలస్యంగా అయినా అర్ధం అయ్యింది. అతి కొద్ది కాలంలోనే నేను అలా ఆకాశవాణికి నిలయ విద్వాంసుడిని అయిపోయాను, కానీ ఏ నాడూ “నిలవ విద్వాంసుడి”ని కాలేదు. ప్రతి సారీ వొక కొత్త అంశం ప్రసంగానికి తీసుకునేవాణ్ని, వాల్మీకి నించి టాగోర్ దాకా, నన్నయ నించి నగ్నముని దాకా కవిత్వ సీమలో ఎల్లలు లేకుండా సంచరించాను. ఆ క్రమంలో బాగా చదవాల్సి వచ్చింది. “పది పుస్తకాలు చదువు, వొక పేజీ రాయి” అన్నది నండూరి మాట. శ్రీకాంత శర్మ గారు ప్రసంగం ప్రతి దగ్గిర చాలా పట్టింపుగా వుండేవారు. ప్రతి వాక్యం పట్టి పట్టి చదివే వారు, మొహమాటం లేకుండా మార్పులు చెప్పే వారు.
ఇంకో ప్రేరణ: పురాణం గారి ఇంట్లో “సాక్షి” సాహిత్య మిత్రుల సమావేశాలు జరిగేవి. రావిశాస్త్రి, చాసో, ఇస్మాయిల్, స్మైల్, కాళీపట్నం, భమిడిపాటి, అజంతా, పెద్దిభొట్ల, టీ ఎల్ కాంతా రావు, రామమోహన్ రాయ్…ఇవి కొన్ని పేర్లు మాత్రమే…ఎందరో ఈ “సాక్షి” క్లబ్ కి వచ్చే వారు. కొన్నిసార్లు ఈ సమావేశాలు అర్ధరాత్రి దాటేవి. చిత్ర విచిత్రమయిన వాగ్వివాదాలు జరిగేవి. వాటన్నిటికి నేను మూగ సాక్షిని మాత్రమే, ఎంత సేపటికీ మౌనంగా వుండేవాణ్ని. “ఏదయినా మాట్లాడ వయ్యా స్వామీ, నువ్వు మాట్లాడవూ, తాగవూ?!” అని పురాణం గారు పోరే వారు. నాకు చచ్చేంత బిడియం. “అఫ్సర్…కాయితం మీద కొమరం పులి. ఎదురుగా వుంటే బిక్కు బిక్కు పిల్లి” అని నండూరి నా మీద ఆశుకవిత్వం చెప్పడం గుర్తు. ఈ భయాన్ని చెదరగొట్టిన వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఉషశ్రీ మాత్రమే. ఆ తరవాత నన్ను బలవంతంగా రాజమండ్రిలో సాహిత్య వేదిక ఎక్కించి, ప్రసంగం చెప్పించిన సతీష్ చందర్. ఆ ప్రసంగం తరవాత వొకాయన వచ్చి “మీరు మహమ్మదీయులు అంటే నమ్మలేకపోయానండీ! మీ పలుకు ఎంత స్వచ్ఛంగా వుంది!” అన్నారొకాయన. నిజానికి నేను మహమ్మదీయుడిని అన్న భావం నాకు ఆ కాలంలో ఏ కోశానా లేదు. అది 1990 తరవాత వచ్చిన మార్పు మాత్రమే. నాకు నేను వొక ముస్లిం గా కనిపించడం 1990లోనే మొదలయ్యింది – యానాం వెళ్ళి వచ్చాక, “యానాం వేమన ఏమనే…” కవిత రాశాక.
నేను కవిత్వం రాయడానికి ముందు కథకుడిని, వ్యాస రచయితని. వ్యాసం రాయడం అంటే ఇప్పటికీ చాలా ఇష్టం. నేను రాసిన వ్యాసాలు ప్రతి పంక్తీ చదివి, “ఇలా రాయ్” అని దాదాపూ నా చెయ్యి పట్టి రాయించారు నండూరి, పురాణం. ఎప్పుడయినా కవిత్వం రాస్తే, పురాణం కోప్పడే వారు “ నీలో మంచి వచన రచయిత వున్నాడు. ఆ కవిత్వం రాసి వాడి కొంప ముంచకు” అనే వారు. కానీ, వద్దు అన్నది చెయ్యడం నా వ్యక్తిత్వ లక్షణం. చివరికి ఆయన అన్నంత పనీ చేశాను.
ఇంకా కవితా సృజనకి ముందు నా సాహిత్య పరిచయం ఎక్కువగా వచన సాహిత్య పఠనం మాత్రమే. హై స్కూల్ దాకా తెలుగు క్లాసిక్స్ అంటే ప్రాణం. హై స్కూల్ సెలవుల్లో ఇంట్లో ఇక చదవాల్సిన పుస్తకాలు ఏమీ దొరక్క మార్క్స్, ఎంగెల్స్ చదవడం మొదలు పెట్టాను. నా పఠన ప్రయాణంలో అది అనుకోని మజిలీ. మార్క్స్ రచన ఏది కనిపిస్తే అది చదవడం మొదలు పెట్టాను. నిజానికి మార్క్స్ భార్య జెన్నీ మార్క్స్ జీవితం ఆధారంగా ఒక కల్పిత మార్క్స్ ఆత్మ కథ రాసి మిత్రులకి వినిపించే వాణ్ని. అది నా మొదటి సృజనాత్మక వచన రచన.
ఇంటర్/ డిగ్రీ…. ఆ అయిదేళ్లూ నేను విపరీతంగా చదివిన కాలం. కానీ, కవిత్వం చదివే వాణ్ని కాదు. ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ నవలా సాహిత్యం ఏది దొరికితే అది చదివాను. భారతీయ సాహిత్యం ముఖ్యంగా బెంగాలీ, తమిళం, కన్నడ నించి వచ్చిన అనువాదాలు ఎక్కువ ఇష్టంగా చదివే వాణ్ని. ఖమ్మం లైబ్రరీ, మా సిద్ధార్థ కాలేజీ లైబ్రరీలో తక్కువ పుస్తకాలే వున్నా, మంచి పుస్తకాలు వుండేవి. ఖమ్మం ప్రభుత్వ కళాశాల లైబ్రరీ పెద్దది. అక్కడ గొప్ప ఇంగ్లీష్ సాహిత్యం అంతా దొరికేది. ఇవిగాక, హీరాలాల్ మోరియా సొంత లైబ్రరీ నాకు అత్యంత ఇష్టమయిన చోటు. మోరియా గారు ఎవరికీ పుస్తకాలు ఇంటికి తీసుకువెళ్లనిచ్చే వారు కాదు, ఆయన నా కోసం వొక కుర్చీ, టేబులు ఏర్పర్చి, ‘బేటా, నువ్వు ఇక్కడ ఎన్ని గంటలు కూర్చొని చదువుకున్నా పర్లేదు. కానీ, వొక్క పుస్తకం బయటికి ఇవ్వను. ఇక్కడే తిను, టీ తాగు” నేను ఆ ఇంట్లో కూర్చొని ఎన్ని పుస్తకాలు, పాత పత్రికలు చదివే వాణ్ణో లెక్క లేదు. మోరియా గారి భార్య, ఆయన కూతురు సాధన గంటకోసారి నాకు టీలూ, తినుబండారాలు తెచ్చి పెట్టే వారు. సాధన నా కంటే వొక ఏడాది పెద్దది, కానీ ఆమె ఇంగ్లీషులో రాసేది, అవి నేను తెలుగు అనువాదం చేసే వాణ్ని. ఇంటర్ లో మార్కులు సరిగ్గా రాలేదని సాధన ఆత్మ హత్య చేసుకుంది. నేను అతిదగ్గిరగా చూసిన వ్యక్తి అలా చనిపోవడం నాకు చాలా రోజులు నిద్రలేకుండా చేసింది. ఇది జరిగాక ఇంకో మిత్రుడు కుటుంబ సమస్యల వల్ల రైలు కింద తల పెట్టాడు, అదే సంవత్సరం నాకు అతి బాగా తెలిసిన, నాతో చింతకానిలో బాల్యంలో ఆడుకున్న వొక అమ్మాయి కాలేజీలో టీజింగ్ తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకుంది. తన భర్తతో పడక పెద్దక్క ఇల్లు చేరింది. రక రకాల ఈ వరస సంఘటనలు నన్ను ఇంకా అంతర్ముఖిని చేశాయి. చాలా కాలం దాదాపూ నోరు పడిపోయిందన్నంత పని అయ్యింది.
కానీ, మోరియా గారు “ఇంకా చాలా వుంటాయి జీవితంలో- ఇది మొదలు అంతే!” అని నన్ను రొటీన్ లోకి నెట్టారు. కానీ, మొత్తం మీద నా జీవితం నడక నిదానించింది. అప్పుడు పుస్తకాలు నాకు గొప్ప అండ. వొక విస్మృతి కింద దాక్కోవాలి అన్న తక్షణ భావంతో గంటల తరబడి పుస్తకంలో తలదాచుకునే వాణ్ని, ఆ మృత దేహాలు గుర్తుకు రాకుండా – కీట్స్, ఇలియట్, ఆల్బర్ట్ కామూ, కాఫ్కా, నీషే నాకు స్నేహితులయ్యారు. కానీ, నేను బాగా పారిపోతున్నానన్న స్పృహ నాకు వుండేది.
జీవితం ఏకాంతంలో లేదు, సామూహికతలో వుంది. నేను పెరిగిన పల్లె నాకు సామూహికతే నేర్పింది. ఈ స్పృహ వల్ల కొద్దికాలంలోనే నేను విద్యార్థి రాజకీయాల వైపు మళ్ళాను. కాలేజీకి అప్పట్లో శ్రీ శ్రీ, శివారెడ్డి, హెచ్చార్కే, వరవరరావు, కత్తి పద్మారావు, కేవీ రమణా రెడ్డి, టీ ఎల్ కాంతా రావు, పి. పుల్లయ్య (ఇప్పుడు ప్రసాద్) లాంటి వాళ్ళు వక్తలుగా వచ్చేవారు. నేను మళ్ళీ మార్క్సిస్టు బాటలోకి మళ్ళాను. విద్యార్థి రాజకీయాలలో నిండా కూరుకుపోయాక, ఇక నేను పార్టీలో ఫుల్ టైమర్ కావాలని వొత్తిడి మొదలయ్యింది. అప్పటికే పార్టీలో కుల రాజకీయాలు మొదలయ్యాయి. కుల, మత రాజకీయాలు వున్న చోట నాకు కాస్త కూడా వూపిరాడదు. ఇంత పోరాడీ మళ్ళీ, అదే బురదలో కూరుకుపోవడం ఏంటీ అనుకున్నాను. రాజకీయాలకు స్వస్తి చెప్పాను. మళ్ళీ చదువు. మళ్ళీ సాహిత్యం. మళ్ళీ అంతర్ముఖ పర్వం.
ఆ దశలో నా కుటుంబ నేపథ్య ప్రభావం వల్ల తెలంగాణా ఉద్యమం వైపు ఆలోచనలు తిరిగాయి. తెలంగాణా ఉద్యమం ఏం చేసింది? అన్న ప్రశ్న మొదలయ్యింది. ఆ ప్రశ్నే నా బతుకు బాటని తీర్చి దిద్దింది. తెలంగాణ ఉద్యమ సాహిత్యం మీద పరిశోధన చెయ్యాలి అన్న ఆలోచన అక్కడే వచ్చింది. మోరియా గారి ఇంటి పక్కనే వున్న విజ్ణాన నికేతనం లైబ్రరీలో సాహిత్య సమావేశాలు జరిగేవి. ఆ సమావేశాల తరవాత మళ్ళీ మోరియా గారి ఇంట్లో కబుర్లూ కాలక్షేపాలు వుండేవి. ఇవి నా లోపలి రచయితకి ప్రాణం పోశాయి.
ఉత్తరాలు రాయడం చాలా ఇష్టంగా వుండేది. ఇంగ్లీష్ కవిత్వ రచన వల్ల ఉత్తరాది రచయితలతో చాలా స్నేహాలు వుండేవి. వాళ్ళతో స్నేహం వల్ల పెద్ద నగరాల్లో వుండే రచయితలు అప్పుడప్పుడూ పుస్తకాలు పంపే వాళ్ళు. అలా నిస్సిమ్ ఏజెకీల్ తో కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాను. ఆయన కవిత్వం చదవడం, మననం చేసుకోవడం కాస్త సరదాగా వుండేది. ఇప్పుడు చేత్తో ఉత్తరాలు రాసే అదృష్టం లేకపోవడం దురదృష్టం.
ఒక పల్లెటూరిలో పుట్టడం ఒక కవిగా మీకు లాభించిందనుకుంటున్నారా? లేక సాహితీ మిత్రుల సాంగత్యంలో మరింత బాగా రచనలు చేసేవాణ్నని భావిస్తున్నారా?
చింతకాని అనే వూరు నా బాల్యంలో లేకపోతే, రచయిత కావడం సంగతి అటు వుంచండి, నేను కనీసం ఈ మాత్రం మనిషిగా కూడా మిగిలేవాణ్ణే కాదు. ఆ వూరిని నేనింకా పూర్తిగా నా రచనల్లోకి తేలేదు గానీ, ఇంకా చాలా రాయాల్సింది వుంది. కానీ వొక ఆలోచనా జీవిగా ఆ వూరు నా ఇడియాలజీ. నా థియరీ. నా పరిశోధన చూస్తే మీకు ఈ విషయం అర్ధం అవుతుంది. ‘గోరీమా” కథలో ఆ వూరి గురించి కొంత మాత్రమే రాశాను. సాహిత్య పరంగా అంటే పుస్తకాల నించి నేను పెద్దగా స్ఫూర్తి తీసుకోలేను. అనుభవం నాకు గొప్ప స్ఫూర్తి అనిపిస్తుంది. ఆ వూరే లేకపోతే నా బతుకు అసంపూర్తిగా, నా రచనా జీవితం అరకొరగా వుండేది. నాకు ప్రదేశాలు, వాటి చుట్టూ వుండే మనుషులూ, వాళ్ళ అనుభవాలు గొప్ప పుస్తకాలు. అందుకే నా కవిత్వంలో కూడా ప్రదేశాలు ఎక్కువ కనిపిస్తాయి, అది యానాం కావచ్చు, మాడిసన్ కావచ్చు. కానీ, నేను ఎక్కడికెళ్లినా వొక పల్లెటూరి సరుకునే అనుకుంటా. దూసుకుపోయి మాట్లాడ్డం నా వల్ల కాదు. హైదరాబాద్ వెళ్ళినా, అమెరికాలో వున్నా నాకు వొక పల్లెటూరు కావాలి. హైదరాబాద్ లో నేను ఎక్కువ కాలం వుండలేకపోవడానికి కారణం అక్కడి శృతి మించిన నగర వాతావరణం. అదనంగా సాహిత్య జనాభా మరీ ఎక్కువ కావడం. హైదరాబాద్ గొప్ప నగరం. అందులో నా పల్లెటూరి మొహానికి చోటు ఎప్పటికీ లేదు. హైదరాబాద్ గురించిన ఈ ambiguity ఇప్పుడిప్పుడే కాస్త తొలగుతోంది. వొక దూరం, వొక దగ్గిర తనం, వొక తెలియని అయిష్టం, తెలిసీ తెలిసినట్టున్న ఇష్టం , హైదరాబాద్ నా వాస్తవంలోంచి చేజారిపోతున్నదన్న బాధ ఇప్పటి నా తాజా అనుభూతి. దీనికీ అక్కడి రాజకీయ పరిస్తితికి కొంత సంబంధం వుంది. ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా వుండాలన్న కోరిక కూడా లోపల్లోపల బలంగా వుంది. కానీ, నాకు మౌలికంగానే రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయింది. అందుకే, నేను తెలంగాణ సాంస్కృతికత మీదా, హైదరాబాద్ సాంస్కృతికత మీదా, ఆ విలువల అన్వేషణ మీదా ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నాను.
ఇక అమెరికా వచ్చాక నేను వున్న రెండు వూళ్ళు- మాడిసన్, ఆస్టిన్ – నా పల్లెటూరి మొహానికి బాగా సరిపోయాయి. కాబట్టి, సాహితీమిత్రుల సాంగత్యంలో నేను మరింత మంచి రచనలు చేయగలను అని చెప్పలేను. నికార్సైన మానవ ప్రపంచం, నిజమయిన మానవ విలువలు సాహిత్యలోకంలో లేవనుకుంటా, రోజువారీ యుద్ధం చేసే సామాన్యుల లోకంలో వున్నాయి. అందుకే వున్న చోటే పదిలం అని నా “వలస” లో రాసుకున్నాను. వున్న వూరుతో ఎంత అనుబంధం వుంటే అంత బాగుంటుంది. అది చింతకాని కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనంతపురం కావచ్చు, మాడిసన్ కావచ్చు, ఆస్టిన్ కావచ్చు, ఏ ఇసక ఎడారి అయినా కావచ్చు. ఇక్కడి గాలిలో, ఇక్కడి చెట్లలో, ఇక్కడి నీళ్ళలో, ఇక్కడి మనుషుల్లో నేను కలిసిపోవాలి. ఆ కలిసిపోవడంలోని ఆనందం, అంతకన్నా గొప్ప అనుభవం ఏ పుస్తకమూ ఇవ్వదూ, ఏ రచయిత సన్నిధీ ఇవ్వదు. "స్థావరం నా సమాధి. జంగమం నా ఇలాకా” అని “ఊరి చివర” లో వొక చోట రాశాను. జీవితం ఎప్పుడూ అద్దె ఇల్లు బతుకు మాత్రమే….కాబట్టి, ముందు నాకు ఇప్పుడు వున్న ఈ క్షణం, ఈ ఊరు బాగుండాలి, అప్పుడు నా నోరు బాగుంటుంది. నా కవిత్వమూ బాగుంటుంది – బాగున్నా లేకపోయినా అది కనీసం నాకు తృప్తినిస్తుంది.
ముఖాముఖి నిర్వహణ: రానారె, స్వాతికుమారి
The first part is really very nice sir. It reflects various things. How the people love to revolt at that time, how Muslims feel being Muslims, Nijam’s regime and many things.Especially your fathers way of thinking really is inspirational sir. He revolted against his father and everything not because its like a passion and all but because he really felt that What nijam is doing is bad.
I think this sort of a family back ground is really useful for you to emerge as a poet. “Afsuryuda” i felt this name, the way he called sir. One can sense the humorous love of Dasharathi{i dont know if i should has to call him sir or tattiyah or uncle sir. i think yu will refuse me if i call him with name. please dont mind sir.}
Oka rachanani edit chesuko galagadam goppa kala. I agree with this thing sir. For me, i feel very reluctant to edit my poetry and all. Its a very difficult and a strict job sir. I think you really got advantage of that thing when you are very young.
“Nenu tuition lu cheppukoni fees katte paristhithi vachindi” sir, this line is enough to tell how many counter winds had blown against you in your life. But i also think all these things gave you experience.
Unfortunately there is no healthy environment among poets sir. But i think there are many reasons for it. Political, regional and many reasons.
In the second part, i really loved how Marxism got induced in you listening to the songs.you said “Sahithyam lo raayadam chaala aalasyamga…” Sir, i dont think writing depends on- how many years we wrote. I think it depends on how many experiences we faced. How many books we read.
I really love that thing sir, it got picturised in my brain- the way you run to the bank of river krishna and shout your works.
Ah so jealous i am sir. I would like to have one day with all those poets as you said. Talking about all those things upto 12, training your nerves and all. I felt like i came to that place, experiencing all the things seen you silent, glaring at the empty wine bottles.
Recently when i am reading you blog tathayyah and read some of your poetry and asked who read them. I showed your name. He exclaimed “how can a muslim write so good telugu” .May be the one who asked you if you are really a Muslim after listening to your speech also a person like tathaiyyah.
I really felt very nice when you said you talked with Ezekiel through letters. He is one of my fav’s.
Many things more i wish to tell sir, but school bell is going to ring. So i has to run.
ThanQ very much for letting me know about the thing and making me read it.
11 hours ago · Like
ముందుగా పొద్దుకు అఫ్సర్ కు ధన్యవాదాలు ..
అఫ్సర్ నాకు చాలా లేట్ గా తెలుసు..
కానీ కౌముది గారు 1987 నుండి నాకు హిందీ పాటాలు చెప్పిన గురవు గా తెలుసు..
గొప్ప విద్వత్తు ఉన్న మహా మనిసి వారు ..అతని రాకతో జిల్లాపరిషత్ తల్లంపాడు మరింత గుబాలించింది ..
వారి మధురవాణి గోడ పత్రిక అందనంత ఎత్తులో అంటిచడం శ్రద్హగా చదవటం ..ముక్యంగా ఆ పత్రిక కవర్ మీద వయ్యారంగా ఒక వీణ ఉండేది
వీణ మెట్లను తదేకంగా చూసేవాడిని ..ఇక పొతే ..”సరిత” పత్రిక కు నాకు కొంచం తెలుసు ఆ పత్రిక నిర్వాహకులు హరీష్ గారు లే ఆవుట్ ఆర్టిస్ట్ కాళ్ళ ( ప్రముఖ చిత్రకారుడు )ను
అత్యంత దగ్గరగా చూసాను వారి పరిచయం నా జీవితంలో మలుపు కౌముది, కాళ్ళ, హరీష్ …వీళ్ళు నాకు నడక నడవడిక నేర్పారు ..
నాకు విప్లవ పాటాలు పరిచయం చేసింది హరీష్ …
అఫ్సర్ అన్నట్లు ..వారి కుటుంబ వాపపక్ష నేపధ్యం మా ఖమ్మం వాసులకు బాగా తెలుసు ..ముక్యంగా అఫ్సర్ మిత్రుడు అమరుడు యాసిన్ నేను ఒకే ఊరిలో పుట్టాము ..
మాకు యాసిన్ ఒక స్ఫూర్తి …ఒక విషయంతో ..అఫ్సర తో నేను విభేదిస్తాను ..ఖమం వామపక్ష రాజకీయాలలో ..కులం ఉంటె ఉండొచ్చు ..దానివల్లే ఆ రాజకీయాలకు దూరం అవడం నాకు బాధగ్గా ఉంటది ..వారికి సైద్ధాంతిక విభేదాలు ఉన్దోచు..ఆ రోజుల్లో ఇంట కుల కంపు లేదనేది నా అభిప్రాయము ..
పురాణం మరియు నండూరి తో నీను వంద శాతం నిజం
అఫ్సర్ కవిత్వం కంటే వచనం విమర్శ , కథ, ఆయన ప్రతి కవితా అచ్చు అయినంత మేరా చదివాను ..నాకు బాగా గుర్తున్న నచ్చిన కవితలు అతి తక్కువ
కానీ వారి వచనం ఎప్పటికీ గుర్తుంటది
..మంచి విషయాలు చెప్పిన అఫ్సర్ కు కృతఙ్ఞతలు
పొద్దు మిత్రులకి:
ప్రాతస్మరణీయుడు అనే మాట ఎలా పుట్టిందో తెలీదు గాని, ప్రతి ప్రొద్దూ స్మరించుకోవాల్సిన వ్యక్తులూ, విషయాలూ కొన్ని వుంటాయి. అవి మనకి కొత్త ఊపిరి పోస్తాయి. ఈ పొద్దు మీ మాటలు వింటూ వుంటే అలాంటి భావమే కలుగుతోంది.
అందరితో అన్ని సంగతులూ పంచుకొలెం. కానీ, కొంత మంది ముఖం చూస్తే అన్నీ మాట్లాడాలని అనిపిస్తుంది. రానారె ముఖం చూసినప్పుడు, రానారె తో మాట్లాడుతున్నప్పుడు దాపరికాలు వుండవు. కాబట్టి, ఇందులో నేను రాసిందేమయినా వుంటే అది రానారే ముఖ దర్శనం వల్ల ప్రభావితమయి రాసిందే.
చాలా మంది కొత్త మిత్రుల వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నాను, పాత మిత్రుల పున కలయికల అపూర్వ సంభాషణాలూ వింటున్నాను. వొక పాత మిత్రుడిని అనేక కాలాల తరవాత కలిసే అవకాశం ఇవ్వడం కన్నా ఏ రచనకయినా గొప్ప ప్రయోజనం ఏముంటుంది? ఆ మిత్రులందరికీ ధన్యవాదాలు పేరు పేరునా.
ఈ స్పందనల్లో కూడా కొన్ని ప్రశ్నలున్నాయి. వాటికి నేను వీలు వెంబడి సమాధానాలిస్తా.
మా వూరి లైబ్రరీలో చిన్నప్పుడు ఎందుకు తెచ్చానో కానీ ఒకసారి సంజీవదేవ్ పుస్తకం ఒకటి తెచ్చాను.అప్పుడు నిండా 12 ఏళ్లు కూడా లేవు.ఆ పుస్తకంలో ని భాష భావం ఏమర్ధంయిందో తెలియుదు గాని మళ్ళా ఇంకో రెండు మూడు పుస్తకాలు తెచ్చి చదివాను పూర్తిగా.ఇప్పుడు విశ్లేషించుకుంటే అర్ధమవుతుంది ఆ పసి వయసులో అంత గా నన్ను ఆకర్షిన్చినదేమి టా అని.పరిక్వత కలిగిన రసభావలకు ఒక రకమైన సువాసన వుంటుందని ..పాములు సంపంగి పూల వాసనకి ఎగబడినట్లే నాకు తెలియకుండానే నా లోపలిది ఏదో ఆ సుగంధం వైపుకు ఆకర్షించబడిందని .అఫ్సర్ అక్షరం కూడా నన్ను అలాగే కట్టిపడేస్తుంటుంది ఎప్పుడు చదివినా .కవి భావం నాకు పూర్తిగా తలకెక్కుతున్నదో లేదో తెలియదు గాని ,ఆ కవిత్వం మీద నుంచి వచ్చే సుగుంధంమాత్రం నా గుండెలని నింపి వేస్తుంటుంది. పోఎం మొత్తం పూర్తయిన తరువాత మత్తుగా తగిన వాడి మల్లె అయిపోతుంది మనసు.ఈ కవిత్వంతో నాకు ఎప్పటినుంచో ఒక పూర్వ పరిచయం వున్నట్లు వుంటుంది.కవితో నాకు అసలు వ్యక్తిగత పరిచయమే లేదు కానీ ..ఈ అక్షరాల సంభంధమేదో చిన్ననాటినుంచే వున్నట్లుంటుంది. అఫ్సర్ నాకు ఒక కవి కాదు.అక్షర వ్యసనం.ఈ ఇంటర్వ్యూ చదువుతుంటే ఒక పల్లెమనిషిని అని తనను తను చెప్ప్పుకునే మనిషి వెనుక ఇంత పెద్ద తతంగం వుందా అని అనిపిస్తుంది కానీ ఆశర్యమయితే వేయదు.అఫ్సర్ ప్రతి అక్షరంలో ఒక నలిగిన పూర్తి జీవిత సుగంధం గుబాళించటానికి కారణం ఇప్పుడు తెలిసింది.
“జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా?
చిరుగు పాతల, బరువూ బ్రతుకుల నేతగాళ్ళే నేసినారూ”
అఫ్సర్ గారి కవిత్వం జిలుగు వెలుగుల చీర కాకపోవచ్చు. కాని మనస్సులో అణగారిన ఆకలిని జ్వలింపచేసే ఆ నాలుగు కవిత్వపు మెతుకుల వెనకా ఎంత జీవితపు ముడిసరుకు ఉందో తెలుస్తోంది. జీవితాన్ని కవిత్వంగా మార్చే ఆల్కెమీ కొద్దిగానైనా బోధపడుతుందేమో!
సీతారాములు;
వామ పక్ష రాజకీయాలతో నా తేడాల గురించి మీరడిగిన ప్రశ్న బాగుంది. నిజమే, కానీ, ఉద్యమంతో సన్నిహితంగా వున్నప్పుడు కానీ ఆ బాధ తెలీదు. నేను స్కూల్ లో వున్నప్పుడు ఖమ్మంలో విద్యార్థి ఉద్యమం చాలా బలంగా వుండేది. తొమ్మిదో తరగతి వచ్చే సరికి మేము ఆ ఉద్యమ ప్రభావంలో పడ్డాం. పదో తరగతి లో మేం వొక గోడ పత్రిక నడిపామ్, ఫోకస్ అనే పేరుతో! అప్పటి రాజకీయాల మీద కొరడా విసురులు లాంటి వ్యాసాలు అందులో వేసే వాళ్ళం. ఇంటర్ మొదటి సంవత్సరం నేను పీడి యస్ యూ కమిటీలో ప్రధాన బాధ్యుడిగా వున్నా. అది రక్తం ఉడికే వయసు. కానీ, కొద్ది కాలంలోనే కుల రాజకీయాల వూబిలో కూరుకుపోతున్నామని అర్ధమవడం మొదలయ్యింది. ఎంతో నిమగ్నతతో పని చేసిన వాళ్ళకి అది పెద్ద అసంతృప్తి.
యాసీన్ విషయం వేరు. యాసీన్ వుంది ఆర్ యస్ యూ లో! దాని నిర్మాణం వేరు! వయసు రీత్యా యాసీన్ అప్పటికి పెద్ద వాడు. నాతో పాటు ఇంకా కొద్ది మందిని ఆర్ యస్ యూ వైపు తీసుకు వెళ్లడానికి యాసీన్ ప్రయత్నిచాడు కానీ, ఏ కారణం వల్లనో మేం ఆగిపోయామ్. అప్పటికి నేను పూర్తిగా సాహిత్యం వైపు జరిగిపోతూ వున్నాను.
విద్యార్థి రాజకీయాలకి సంబంధించి ఇంకా చాలా మాట్లాడవచ్చు. ఆ సందర్భం వేరే వస్తుందనుకుంటున్నా.
అఫ్సర్,
మీ భాధ కాళోజీ “నా గొడవ” లాంటిది, నా ఉద్దేశ్యంలో. అది చాలు నిద్రపట్టకుండా చేయడానికి.
ఇంటర్వ్యూ బాగుంది. రాజకీయాల్లోనించి (అవి స్టూడెంట్ రాజకీయాలైనా సరే) బయటకొచ్చి “అఫ్సర్” ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలబడటం అనేది ఒక పెద్ద మలుపు అని నేననుకుంటాను. అది చాలా మంచి మలుపు కూడా.
అస్తిత్వాలూ వాటి సంఘర్షణల గురించి వస్తున్న రచనలు చూస్తున్నారనుకుంటా. మీ ఆలోచన, కల్పన గారి ఆలోచన నాకింకా కనిపించలేదు, ఆ ప్రస్తావనల్లో.
విప్లవ్
అఫ్సర్ గారి గురించి తెలిపినందుకు రానారే చాల థాంక్స్. మనకు తెలిసిన వ్యక్తి లో ఇంత కధ ఉందా అనిపిస్తుంది
ఆయన్ని చూస్తే తప్పకుండ అదోరకమైన Liking కలుగుతుంది.
మోహంలో ఒక రకమైన Childlikeness బయటకు తొంగి చూస్తూంటుంది, ఎప్పుడూ చిరునవ్వు తోనే ఉంటుంది
మొదటి సారే కలిసినప్పుడు ఇంకా చాల సార్లు కలవాలనిపిస్తుంది.
నోరు విప్పితే తెలుగు “ఇలా” మాట్లాడాలి అనిపించే వాక్శుద్ధి, వింటూవుంటే మరింత వినాలని అనిపిస్తుంది
హస్తినాపురంలో ప్రొఫెసర్ , తెలుగు సర్ మన ఈ అఫ్సర్ అప్సరస లాంటి కల్పన గారు పక్కన ఉంటె దేవేంద్రుడి లాగ వెలిగిపోతూ ఉంటాడనడం ఏమాత్రము అతిశయోక్తి కాదని నా అభిప్రాయం.
Cheers
Sudesh
It is like watching a good biography on big screen. very interesting.Looking forward for the second part.
అఫ్సర్‌జీ ! కొద్దిగా అసూయగా ఉంది. దాశరథి, నండూరి రామమోహనరావు, నాయని కృష్ణకుమారి, రావిశాస్త్రి, చాసో, ఇస్మాయిల్, స్మైల్, కాళీపట్నం, భమిడిపాటి, అజంతా, పెద్దిభొట్ల, …మరి అసూయగా అనిపించదా ? పక్క ఊర్లోనే ఉండి తరచూ కలుస్తున్నందుకు సంతోషంగా కూడా ఉందిలెండి. సరేగాని, పెద్దిభొట్ల అంటే పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారేనా ? మహానుభావుడు…ఇంటర్మీడియట్ లో మాకు తెలుగు చెప్పేవారు లయోలా కాలేజ్‌లో. నాకయితే పుస్తకంలో పాఠాల కన్నా సాహిత్యం గురించే ఎక్కువ చెప్పేవారు. చక్కటి ఇంటర్వ్యూ అందించిన మిత్రుడు రానారె కి అభినందనలు.
” నాకు నేను వొక ముస్లిం గా కనిపించడం 1990లోనే మొదలయ్యింది – యానాం వెళ్ళి వచ్చాక, “యానాం వేమన ఏమనే…” కవిత రాశాక” – ఏమిటా సందర్భం ? చెప్పదగినదే అయితే చెప్పండి. ఆ అస్తిత్వపు ఎరుక ఆలోచనల్లోనుండి కవిత్వంలోకి విస్తరించడం కూడా అప్పుడే మొదలయిందా ?
KC Chekuri
Dallas, TX
అఫ్సర్ గారూ! పల్లెటూర్లో పుట్టిపెరగడం నిజంగా మనిషి ఆలోచనల మీద, జీవితమ్మీద చెరగని ముద్ర వేస్తుంది. పట్నపు మనుషుల వేగమూ, గొప్పతనమూ అందిపుచ్చుకోలేమేమో అన్న సంఘర్షణ లో మనల్ని ఎదిగేలా చేస్తుంది. ఇదంతా మీరు ‘memoir’ గా ఎందుకు రాయకూడదు? మీ నేపధ్యం చదువుతున్నంత సేపూ నన్ను నేను అద్దం లో చూసుకుంటున్నట్లనిపించింది. నేపధ్యాలు వేరైనప్పటికీ, పల్లెటూరు తో ఉన్న అనుబంధం వల్ల అనుకుంటా. మాడిసన్, ఆస్టిన్ పల్లె వాతావరణాలకు ఎలా సరిపోతాయి? నాకు అర్థం కాలేదు.
ఉత్తరాలు రాయలేని బాధ కంటే, అందుకోలేని యుగం లోకి అడుగు పెట్టడం మరీ బాధాకరం-
మీరు రాసిన ఒక స్పూర్తి వాక్యం ఒక కవిని జీవితం లో కరిగిపోకుండా కవిగా నిలబెట్టింది- ఇంతకంటే మీ గురించి చెప్పదగినది ఏమైనా వుందా!
రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నా ఇవేళ్టి నించే-
అఫ్సర్ గారితో ముఖాముఖి ప్రచురించినందుకు పొద్దుకు మరియు రానారె గారికి నా ధన్యవాదాలు.
అఫ్సర్ గారు,
“నువ్వేమిటో
నీ పద్యమే చెబుతుంది” అన్నట్టు,
మీ కవిత్వం చదువుతున్నంతసేపు మిమ్ములను ఊహించుకునేవాణ్ని. మీ అక్షరం బ్లాగు అక్షరం పొల్లుపోకుండా చదివే నాకు అప్సర్ ఎలాంటి నేపద్యంనుండి వచ్చుంటాడు, ఎలా ఉంటాడు అన్నప్రశ్న రోజూ మదిలో మెదిలేది. ఎప్పుడూ మీగురించి తెలుసుకోవాలన్న అర్దాకలితో ఉన్న నాకు ఈ “నాలుగు కవిత్వపు మెతుకులు” చదివిన తర్వాత కడుపు నిండినట్టయింది, మీ మీదున్న గౌరవం వెయ్యింతలు పెరిగింది. తెలంగాణా ఉద్యమంలో/ఉద్యమ సాహిత్యంలో పాలుపంచుకున్నారు అని తెలిసాక మీ మీద అభిమానం మరింత పెరిగింది. నేను తెలంగాణా ఉద్యమ సాహిత్యం గురించి మీనుండి తెలుసుకోవాలి.
మీ ముఖాముఖి చదువుతుంటే ఎందుకోగాని నాకు ORHAN PAMUK other colors గుర్తుకువచ్చింది. అందులోని interview మరియు My Father’s Suitcase చదివినప్పుడు కూడా ఇలాగే చాలా భావోద్వేగం కలిగింది. మీ జీవితంలోని అన్ని చీకటి మలుపుల్లోను, ఎత్తుపల్లాలలోను మీరు నిర్భయంగా ముందుకు సాగడం నాకు చాల నచ్చింది/very inspiring too. ఆ మహానుభావుడు ఊరికనే “అఫ్సూర్యుడా” అనలేదు. మీరు మీ కవిత్వం ఎల్లకాలాలు ఆ సూర్యునిలా వెలుగుతూ ఉండాలని ఆశిస్తూ, రెండో భాగం కోసం ఎదురుచూస్తూ…
-రవి వీరెల్లి
డియర్ అప్సర్
నీ స్వీయ చరిత్ర చాల బాగుంది . చాల గొప్పగా ఉంది . అభినందనలు .
సామాజిక చరిత్ర తో ముడివడిన మన చరిత్ర కేవలం మన చరిత్ర కాదు . మనం ఆ పరిణామాలకు,సమాజాలకు ప్రతీకలం,ప్రతినిధులం .
అందు వల్ల నీ చరిత్ర మరింత వివరంగా రాయడం అవసరం .
ఈ ఇంటర్ వ్యూ పూర్తయ్యాక వివరంగా రాసి పుస్తకం గా తేగలవు .
అప్పుడే నీ కర్తవ్యం నేరవేర్చినట్టు .
అంతే గాని అల్ప సంతోషం మనిషిని ఎదగ నీయదు.
కనక ఇదే గొప్ప అనుకుని ఊరుకోవద్దు .
అప్పుడు నీ స్వీయ చరిత్ర ప్రపంచ సాహిత్యంలో మరాటి ,ఆఫ్రికా సాహిత్యాల స్వీయ చరిత్రల సరసన చేరుతుంది .
ఉంటా
బి ఎస్ రాములు
అతి చిన్నతనం నుంచీ, నీరు త్రాగినట్లుగా… గాలి పీల్చినట్లుగా సాహిత్య పరిచయాన్ని ఒంట్లోకి బాగా ఇంకించుకున్నారు. అది మీ అదృష్టం. తాత గారి పేరుతో పాటు సాహిత్య వారసత్వమూ సంక్రమించిందన్న మాట. ఇది కూడా మీ మరి మరీ అదృష్టం.
‘చింతకాని’ది – సంతోషమైందే కదా! ఆందుకే పుట్టి పెరిగిన ఊరు మీద అంతా మమకారమేమో! ‘గోరీ మా’ చాలా గొప్ప కథ, నన్ను కుదిపేసింది – అప్పట్లోనే చదివాను. అందులోని ఊరు ‘చింతకాని’ అని ఇప్పుడు తెలిసింది. అప్పుడు గోరీ మా కథ చదివి ఎంత మనో ఉద్వేగానికి గురయ్యానో! అప్పుడు మీ చిరునామా తెలీదు. అంతే కాకుండా నేనూ కొంత అంతర్ముఖిని. అందువల్ల కూడా బహుశా చొరవ చూపలేక పోయాననుకుంటా.
మీ పల్లె సామూహికతనే నేర్పినా, ఆ వాతావరణం నుంచి పట్నంలోకి రాగానే అంతర్ముఖులు కావడం వెనుక, చింతకాని ప్రభావం ఎలాంటిదో అర్థం అవుతుంది. రచయిత అనే మాట ఎలాగున్నా, కనీసం మిమ్మల్ని మనిషిగా మిగిల్చిన మీ ఊరు గొప్పది. ఆ ఊరిని పూర్తిగా మీ రచనలలోకి తెచ్చి మీరూ గొప్పవారు కావాలి. ఎక్కడి కెళ్ళినా మీకొక పల్లెటూరు కావాలన్నారు కానీ, ఆలోచిస్తే మీరే ఓ పల్లెటూరు – మీ ఆలోచనల్లో, రచనల్లో పల్లె స్వచ్చదనం, పచ్చదనం అక్షరాక్షరంలోనూ ఉంటుంది.
అతి చిన్నతనంలోనే దాశరథి,పెద్దిభొట్ల వంటి పెద్ద రచయితలతో పండుగ జరుపుకోగలగడం కూడా నిజంగా ఒక అదృష్టం – అఫ్సూర్యత్వం! “సాహిత్యం చాలా ఆలస్యంగా అంటే ఎనిమిదవ తరగతిలో మొద లెట్టాను” అన్న వాక్యం చదివి నవ్వాగలేదు.
అతి చిన్నతనంలోనే ఖురాన్ పటణం పూర్తి చెయ్యడం, రచన కంటే ముందు రచనని ఎడిట్ చేయడంలో అవగాహనా మిమ్మల్ని మంచి రచయితగా నిలబెట్టాయని నమ్ముతున్నాను. అంతా మంది రచయితలూ, కవులూ ప్రోత్సహించి మీ చేత ఎమ్మే,పి ఎచ్ డీ లు చేయించడం తెలుసుకుని ఆనందమైంది.
మీ సాహిత్య ప్రస్థానంలో ఒక్కో మెట్టు ఎక్కే నేపథ్యంలో నండూరి, పురాణం, ఉషశ్రీ ల్లాంటి దిగ్గజాల ప్రోత్సాహం – ఎవరికీ లభ్యం కానిది – మీకు లభించింది.
మా జిల్లా వచ్చి వెళ్ళిన తర్వాత మీకు మీరు ముస్లింగా కనిపించడం వెనుక కథ తెలీలేదు కానీ, భావనలో సంకుచిత్వం ఏర్పడిందా? ముస్లిం సాహిత్యానికి వికాసం అయ్యిందా? రెండోది అనుమానం లేని సత్యం.
‘జీవితం ఏకాంతంలో లేదు; సామూహికంలో ఉంది’ అన్న ఒక్క వాక్యంలోనే మీ జీవన తాత్త్వికత సర్వం ఇమిడిపోయింది. వలస నుంచి ఊరి చివరి వరకు మీ సాహిత్యాన్ని నడిపిన గొప్ప సూత్రం ఇదే.
రా.నా.రే.ఇంటర్వ్యూ వల్ల మీ గురించి చాలా తెలుసుకునే వీలు కలిగింది. అందుకు అతనికీ, ప్రచురించిన ‘పొద్దు’కూ అభినందనలు. తరువాత భాగాల కోసం ఎదురు చూస్తునాను.
– మాకినీడి సూర్య భాస్కర్, కాకినాడ.
అఫ్సర్ గారితో మొదట పరిచయం అయినపుడు చాలా సౌమ్యుడు అనే భావం కలిగింది. మా నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో రెండో సారి కలసి నప్పుడు స్నేహశీలి అనిపించారు. ఆయన వ్రాసిన Before the morning prayer ని ముఖపొత్తములో చూసి వెను వెంటనే ‘ సంధ్యావందనం ‘ గా తెలుగులో అనువదించి ఆయనకు పంపించాను. పొద్దునే ఆయన ఈమెయిల్ చేసారు. అందమైన ఆయన బ్లాగులో నా అనువాదమును చూడమని. ఆయన ఖురాను ప్రార్ధనకు నేను వార్చే సంధ్యావందనానికి నాకేమీ తేడా కనిపించక పోవడమే నా అనువాదానికి కారణము.
ఇప్పుడు రా.నా.రె. గారి ద్వారా పొద్దులో అఫ్సర్ గారి అనుభవాలు చదివాకా ఆయన గాంభీర్యానికి అర్ధం తెలిసింది. కాకపోతే ఇంచుమించు ఆ అనుభవాలు మనకూ ఉంటాయి. రెండు గదుల యిళ్ళు మనందఱికీ అలవాటే. తిరుమల రామచంద్ర గారి హంపీ నుంచి హరప్పా అనే ఆయన ఆత్మకధ చదివిన అనుభూతే మరల యీ దినము నాకు కలిగింది. గొప్ప వారి సాంగత్యం అఫ్సర్ గారి అదృష్టం అనుకొంటే అఫ్సర్ గారితో పరిచయము నా అదృష్టముగా పరిగణిస్తాను. ఆశీస్సులు కావాలన్నరు. ఆశీస్సులే కాదు,మీరు తెలుగు భాషకు చేస్తున్న సేవకు అఫ్సర్ గారూ మీకు నీరాజనము .
గుణాః పూజాస్థానం, గుణిషు నచ లింగం,న వయః.
మీకు మన పరమాత్మ ఆశీస్సులెప్పుడూ ఉంటాయి
గన్నవరపు నరసింహ మూర్తి.
అఫ్సర్:
బాగుంది మీ ఆత్మ కథ! మీసాహితీ ప్రయాణంలో ఇన్ని అధ్యాయాలు ఉన్నాయని నాకు తెలియదు. ఐతే నండూరి వారి ప్రభావం మీ మీద ఉందన్న మాట. మళ్ళీ కలిసినపుడు ఆ విషయం మీతో చర్చించాలి.
వచన కవిత్వం నాకు ఇప్పటికీ అర్ధం కాని సాహిత్య ప్రక్రియే! అర్ధం చేసుకోగలను కాని అందులోని అందాలను చూడగలిగే అనుభవం లేదు.
మీ తరవాతి “కవిత్వపు మెతుకుల” భాగాల కోసం ఎదురు చూస్తూ,
విష్ణుభొట్ల లక్ష్మన్న
ఓ కవి సాహితీ ప్రయాణం వెనక వున్న ఎత్తుపల్లాలు ఇంత ఉద్విగ్నతకు గురిచేస్తాయా? అని ఇంతకు ముందు శివారెడ్డి గారి నేపథ్యం విన్నప్పుడు అనిపించింది. మరలా ఇలా అఫ్సర్ గారి జీవన గమనం చదివినప్పుడు అవే భావాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా తెలుగునాట వున్న ప్రసిద్ధ కవులు, రచయితలు గ్రామీణ నేపథ్యం గలవారే నని, పల్లె వాతావరణం నుండి వచ్చిన వారికున్న జీవితం పట్ల అవగాహన పట్టణంలో దొరకదని మరోమారు రుజువయ్యింది. అఫ్సర్ గారన్నట్లే తనకు ఎక్కడా ముస్లిం కవిగా ముద్ర పడలేదు. అందుకు తన తండ్రిగారి జీవనశైలి తోడ్పడిందనుకుంటా. అసలు అఫ్సర్ అనే కవిని, రచయితను తెలుగు సాహితీలోకానికి కానుకగా ఇచ్చిన ఆయనను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరముంది. ఇంకో విషయం నాకు నచ్చినవి అప్పటి పాత ఆంధ్రజ్యోతి సాహితీ పేజీలు. ఆదివారం ఆంధ్రజ్యోతి టాబ్లాయిడ్ కోసం ఎదురుచూసే వాళ్ళం, అందులో కవిత వచ్చిందంటే కవిగా గుర్తింపు వచ్చినట్లు కాలరెగరేసే వాళ్ళం. ఆ పేజీల జ్నాపకాలను తడిమినందుకు అఫ్సర్గారికి కృతజ్నతలు. ఏమైనా తాను జీవన మార్గంలో అన్ని ఒడిదుడుకులెదుర్కొని రావడమే తన అక్షరానికి అంత నిక్కచ్చితనం, నిబ్బరం అబ్బాయన్నది అక్షర సత్యం. రెండో భాగం, యానాం నేపథ్యం కోసం ఎదురు చూస్తుంటాం..
ఈ పరిచయంతో మొదలైన ఇంటర్వ్యూ శీర్షికను ఇలాగే కవుల, రచయితల నేపథ్యాలతో కొనసాగించాలని కోరుకుంటూ రానారె గారికి, పొద్దు నిర్వాహకులకు ధన్యవాదాలు…
(సం :- ఈ-మెయిలు ద్వారా అందిన వ్యాఖ్య)
అఫ్సర్, నీ ఇంటర్వ్యూ పూర్తిగా చదివా.
నీ లోపలి మనిషిని ఇప్పుడే చూశా. చాలా బాగుంది అనడం కంటే చాలా
దగ్గరయ్యావనడం బాగుంటుందేమో!
అన్నట్లు … దాశరథి అంటే కృష్ణమాచార్యా, రంగాచార్యా … అర్థం కాలేదు.
నీ ఇంటర్వ్యూకంటే నీకు వచ్చిన ప్రశంసల జల్లులో తడిసి ముద్దయ్యా. శ్రీశ్రీ
మహాప్రస్థానానికి చలంగారి ముందుమాటల్లే!
– ఆత్మీయంగా గొరుసు
మా జిల్లా వచ్చి వెళ్ళిన తర్వాత మీకు మీరు ముస్లింగా కనిపించడం వెనుక కథ తెలీలేదు కానీ, భావనలో సంకుచిత్వం ఏర్పడిందా? ముస్లిం సాహిత్యానికి వికాసం అయ్యిందా? రెండోది అనుమానం లేని సత్యం.
భాస్కర్ గారూ:
యానాం కథ ఇంకా చెప్పాలి కానీ, నేను అక్కడికి వెళ్ళి వచ్చాక ముస్లిం గా కాదు, వొక నిర్దిష్టమయిన అస్తిత్వం గురించి కవిత్వం రావడం కూడా సహజమయిన వికాసమే అని అర్ధమయ్యింది. కానీ, సాహిత్యంలో అస్తిత్వం పాత్ర ఎంత వరకూ, దాని పరిమితులు ఏమిటీ అన్న విషయం మీద ఇప్పుడు ఆలోచనలు మారుతున్నాయి. రానారె ఈ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నల్లో అదీ వొక్కటి. కాబట్టి, ముందు వచ్చే భాగాల్లో ఆ విషయాలు స్పష్టం చేస్తాను.
అన్నట్టూ, మీ జిల్లా కవి ఉమర్ అలీ షా గురించి నేను కొంత పరిశోధన కూడా చేస్తున్నా. ఆ విషయాలు యెమయినా తెలిస్తే చెప్పండి. వారి కుటుంబీకులు వుంటే వారి వివరాలు కూడా ఇస్తే సంతోషిస్తాను.
చాలా ముఖ్యమయిన ప్రశ్న అడిగారు. అవును 1990, అంతకు ముందు యానాం ప్రయాణం. ఈ కథ త్వరలో ఈ ఇంటెర్వ్యూ లో చెప్తా.
అస్తిత్వ ఉద్యమాలకి సంబంధించి నా ఆలోచనలు అప్పుడే మారాయి, ఇప్పుడు ఇంకా మారుతున్నాయి!
విప్లవ్:
అస్తిత్వాలూ వాటి సంఘర్షణల గురించి…
“ఊరి చివర” పై పైన చదివినా తెలిసే విషయం అది! మీరు తెలంగాణా రాజకీయాల మీద పెడుతున్న శ్రద్ధలో కొంత అయినా తెలంగాణా సాహిత్యం మీదనో, సంస్కృతి మీదనో పెడితే “ఊరి చివర”లో అస్తిత్వ సంఘర్షణ మీద చాలా స్పష్టమయిన ఆలోచనలు/ ప్రస్తావనలు కనిపిస్తాయి.
తెలంగాణ సంస్కృతికి కె.సీ.యార్ వొక రాచపుండు. ఆ పుండు తెలంగాణ సంస్కృతిని తినేస్తోంది. “ఊరి చివర”లో ఆ నిరసన కూడా కనిపిస్తుంది.