చూరు కింది తడి ఎండలో పిట్టలు స్నానానికి రాక ముందు,
కొండల నీడలు ఊరి మీద పడడానికి చాల ముందు,
నాకున్న ఒకే ఒక తోలు పెట్టెలో
ఎముకల వేణువులు సర్దుకుని,
కాంతి తగ్గిన చుక్కల గొడుగు నీడల్లో నడుస్తూ,
అతడి వెంట ఎందుకు వెళ్లానో… ఇద్దరం మరిచిపోయాం.
మాటల నిప్పుల మీద కాల్చిన
మొక్కజొన్న పాటలు వింటూ,
ఊరు మరిచిన ఈగ నయ్యాను,
మస్తిష్కం మడతల కింద
మర్మర ధ్వనులుండిపోయాయి.
వానా కాలంలో చెట్లు ఎందుకలా ఏడుస్తాయో,
ఎండా కాలంలో లోపల్నుంచి
ఎందుకు దహనమవుతాయో
తెలుసుకుందామని చాల మందిని అడిగినట్టే అతడినీ అడిగాను.
జవాబు కావాలంటే చావును వరించాలంటే,
అదెంత భాగ్యమని,
తోలు పెట్టెలో ప్రాణాలు సర్దుకుని బయల్దేరాను.
రంధ్రాలు ఎలా మూసి తెరిచినా ఎముకలు మోగవు.
మొక్కజొన్న పొత్తులు చల్లారి పోయి
చెవుల-గాయాలవుతున్నాయి.
అతడొక నిర్విరామ కార్యశీలి.
అందిన సత్యం ఉన్న వాడు.
అపజయాలు దాటుడురాళ్లైన వాడు.
తోలు పెట్టెలు పోగు చేస్తూ ఇంకెటో వెళిపోయాడు.
అస్థికలు ఖననం చేసే చోటు కోసం
వెదుక్కుంటూ నేను.