ఒక నిజ రేఖ మీద…..

1

గుడ్డితనాన్ని చెక్కుతున్నావ్ నువ్వు అదే పనిగా, అదే ధ్యాసగా తెరుచుకునే లోపే

కంటి మీద రెప్పల్ని ఇనప చువ్వలు చేస్తున్నావ్ అదే పనిగా, అదే ధ్యాసగా

వొక మోసపు నగిషీ చూపుని కిరాయికి తెచ్చుకున్నావేమో,

నీ కళ్ళ కింద ఇంకే ఆకాశాలూ, ఇంకే నేలా విచ్చుకోవడం లేదింక. పద్యం నీకొక భద్ర గది.

అది నాకు నిప్పు చేతుల నెగడు.
 

2

మంచు ముక్కని చేతుల్లోకి తీసుకుని ఒకానొక గడ్డ కట్టిన గుండ్రటి/నున్నటి లోకాన్ని

చూస్తూ చూస్తూ యెక్కడెక్కడికో జారుకుంటూ పోవాలని నీకనిపిస్తుందా,

అదే మంచు ముక్కలో నేను

గడ్డకట్టిన ఆకలి రాత్రుల్ని

చూపుని దడి కట్టిన ఇనప ఊచల్ని చూస్తాను.

కల కనే కళ్ళన్నీ రాల్చుకున్న అడివి

ఒక నిజ రేఖ మీద వూగుతున్న దొమ్మరిని నేను.
 

3

ఒక గుహలోకి చూపు మడిచి అదొక్కటే దిక్కు అనుకుంటున్నావ్ నువ్వు.

ఏడు ఆకాశాల నాలుగు దిక్కుల మూడు లోకాల చౌరాస్తా నేను.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.