ప్రతీకాలంలోనూ సమకాలీన జీవన స్వరూపానికి చరిత్రలో శాశ్వతమైన అస్తిత్వాన్ని కల్పించడానికి, ఆనాటికి చలామణిలో ఉన్నభాషకి సుదూర భవిష్యత్తులో సైతం సజీవత్వాన్ని సంపాదించి పెట్టడానికీ సాహిత్యం ఎప్పుడూ ఒక శక్తివంతమైన సాధనమే. కథారూపంలో కల్పిత పాత్రలని చదువరిలో పరకాయ ప్రవేశం చేయించినా; కవితాత్మకంగా భావోద్వేగాల్నీ, తాత్విక కోణాన్నీ, సౌందర్యానుభూతినీ ఆవిష్కరించినా; సిద్ధాంత మూలాల్నీ, శాస్త్రీయ విశేషాల్నీ వ్యాసాలుగా విపులీకరించినా; భాష ఆధారంగా విజ్ఞానాన్ని, తార్కిక సామర్థ్యాన్ని, మానవీయ లక్షణాల్నీ సరఫరా చెయ్యడమే వీటన్నిటిలోని అంతస్సూత్రం.
సాంకేతికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మధ్యమాల ద్వారా సాహితీ ప్రవాహం తనరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంది. అందులో భాగంగా ఆవిర్భవించినవే అంతర్జాల పత్రికలు. ’ఆ కోవలోనే మూడున్నరేళ్లక్రితం ఇంటర్నెట్ పాఠకుల ఎదుటకొచ్చింది పొద్దు. లేలేత కిరణాలతో ఉదయించినా సరికొత్త ప్రయోగాలతో, వినూత్నమైన రచనలతో, నానాటికీ బలపడుతున్న పాఠకాభిమానంతో అపరాహ్ణపు సూర్యుడిలా మరింత ప్రకాశవంతమవ్వడానికి తన సామర్ధాల్ని అనునిత్యం సుసంపన్నం చేసుకుంటూనే ఉందీ తొలిపొద్దు.
సాంప్రదాయ పత్రికారీతుల్ని అందిపుచ్చుకుని, ఆధునికతను సాంకేతికతనూ జోడించి ఆన్లైన్ కవి సమ్మేళనాలు, క్రమం తప్పక ఖచ్చితమైన ప్రమాణాలతో కూర్చుతున్న ’గడి’ వంటివి తెలుగు పాఠక లోకానికి మేము సవినయంగా సమర్పించిన కొన్ని కానుకలు. ఒకవైపు ఉద్ధండులైన రచయితలను, సాహితీ స్రష్టలను పరిచయం చేస్తూనే బ్లాగువనాల్లో వికసిస్తున్న రేపటి రచయితలకు కూడా సమాన స్థానమిచ్చి వారితో కూడా అప్పుడప్పుడూ కబుర్లు కలబోసుకుంటున్నాం. ఇక నవరసాల రచనలు అన్ని ప్రక్రియల్లోనూ యధావిధిగా ఉండనే ఉన్నాయి.
సంఖ్యాపరంగా అవలోకిస్తే- పత్రిక మొదలుపెట్టిన ఈ మూడేళ్ళలో నూటికి పైగా రచయితలు తమ రచనల్ని పొద్దుతో పంచుకున్నారు, వీరిలో తమ తొలిరచనలతో పాఠకలోకానికి పరిచయమైన వర్ధమాన రచయితలూ, అప్పటిదాకా అంతర్జాలానికి అపరిచితులైన ప్రముఖ రచయితలూ ఉన్నారు . అన్ని విభాగాల్లో కలిపి ఇప్పటికి నాలుగొందల పైచిలుకు విభిన్నమైన రచనల్ని ప్రచురించటం ద్వారా చెప్పుకోదగ్గ వైవిధ్యాన్ని సాధించగలిగామని భావిస్తున్నాము.
ఇప్పుడు కనిపిస్తున్న కొత్త రూపు కోసం ప్రయత్నాలు ఎప్పట్నుంచో సాగుతున్నా పాఠకులకు మరింత సౌలభ్యం అందించటం కోసం మెరుగులు దిద్దుతూ ఆశించిన స్థాయిలో రూపొందించగలిగాము. కంటికి ఇంపైన రంగుల కలబోతతో; సంచికల, సంపుటాల వర్గీకరణతో దృశ్యపరమైన మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ మొదటి చూపులో తెలియని మరికొన్ని కొత్త సౌకర్యాలు అందుబాటులోకొచ్చాయి. వీటన్నిటి ద్వారా పాఠకులు పొద్దులో ఎటువంటి ఇబ్బందీ లేకుండా తమకి కావల్సిన రచనలను చేరుకోవచ్చు. పైన పేర్కొన్నవే కాకుండా ప్రస్తుతం ఉన్న లోటుపాట్లను, విషయ విస్తృతిలోని కొద్దిపాటి అసమతుల్యతను అధిగమించడానికి, ప్రణాళికాబద్ధంగా మరింత నిబద్ధతతో పనిచెయ్యడానికి పొద్దు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటుంది.
మరిన్ని మంచి రచనలతో , మెరుగైన విలువలతో కూడిన సాహిత్యం కోసం కొనసాగించదలచుకున్న ఈ ప్రస్థానానికి మా పాఠకులు, రచయితలు, శ్రేయోభిలాషులు, స్నేహితులూ -అందరి ఆశీస్సులు మాకెప్పుడూ అవసరమే. మీ సూచనలను, సద్విమర్శలను సంతోషంతో స్వాగతిస్తాం. ఇక ఈ కొత్త ఉదయాన్ని కలిసి ఆస్వాదిద్దాం.