కవికృతి-౧౦

౧.

-చావా కిరణ్:

ఉదయాన్నే గుసగుసలు
మనిద్దరం కలిసి పడవపై
కేవలం మనిద్దరమే సుమా,
అలా అనంత తీరానికి
ఆనంద లోకానికి వెళ్తామని
ఉదయాన్నే గుసగుసలు.
—-
అంతే లేని సముద్రంపై
నీ నగుమోము చూస్తూ
అలల్లా పూర్ణస్వేచ్చతో
బంధనాలు లేని పదాలతో
నా పాటలు పరవశిస్తాయి.
—-
ఇంకా ఆ ఘడియ రాలేదా
ఇంకా పని మిగిలేఉందా
అయ్యో, సాయంత్రం తీరం చేరిందే.
మసక వెలుగులో సముద్ర-
పక్షులు గూటికి మరలాయే.
—-
ఎవరికి తెలుసు?
సంకెళ్లెప్పుడు తెగుతాయో.
సాయంత్రపు చివరి కాంతిరేఖలా
పడవ ఎప్పుడు చీకట్లోకి సాగుతుందో
ఎవరికి తెలుసు ?
=====
Early in the day it was whispered that
we should sail in a boat, only thou and
I, and never a soul in the world would
know of this our pilgrimage to no
coimtry and to no end.

In that shoreless ocean, at thy silently
listening smile my songs would swell
in melodies, free as waves, free from all
bondage of. wprds^

Is the time not come yet? Are there
works still to do? Lo, the evening
has come down upon the shore and in
the fading light the seabirds come
flying to their nests.

Who knows when the chains will be
off, and the boat, like the last glimmer
of sunset, vanish into the night?

౨. కళ్లం

– సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి:

ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు
జీవితాన్ని పంటకళ్ళం చేసేంత ఓపిక ఎవరికుందని?
తొలికోడి కూతకీ ఎద్దుల గాడికీ మధ్య
మనిషి వాసన లేదు_ట్రాక్టెర్ కమురు కంపు తప్ప
పేడతో అలికిన కళ్ళానికీ పంట కంకులకూ మధ్య
నూర్పిళ్ళపొలికేకల్లేవు _మిషన్ దబాయింపులు తప్ప
తూరుపెత్తే చేటలుండవు
చేట పొలివిసిరే చేతులుండవు
చేతముద్దబెట్టే ఇల్లాలుండదు
ఇల్లాలి కొంగునిండా గింజలుండవు
దండె కట్టు ఉండదు చెత్త తొక్కిళ్ళు ఉండవు
పశువుల బంతి ఉండదు
వృత్తిపనివాళ్ళ కదలికలుండవు
పంట ధాన్యంగా మారే అపురూప దృశ్యానికి
ఇప్పుడు కళ్ళం రంగస్థలం కానే కాదు
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు

కళ్ళమంత హృదయాలు ఇక్కడ ఎవరికున్నాయని ?
పదహారు చేతుల వ్యవసాయం
ఇప్పుడు రెండు చేతుల కింద లొంగిరాక
రైతు బతుకు ఇప్పుడు గిలగిల కొట్టుకుంటోంది
సంకటి ముద్దల శ్రమ సౌందర్యం కాస్తా
డబ్బు కాగితాల అంచుల రాపిడికి
గాయాల పాలై గిల గిల గింజుకుంటోంది
గట్టు మీద పచ్చని పిలుపుల్లేక
వాన చుట్టాలు నేలకు దిగటం లేదు
వృత్తి నాళాలకు చమురందక
బోరుబావి జలదీపాలు వెలగటం లేదు
కళ్ళుమూసుకు పోయిన కంకుల నుదుటిమీద
వ్యవసాయం ఆయుర్ధాయం రాయబడివుంది.
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితేచాలు

పచ్చిపేడ గంప బరువున్న మానవ సంబంధాలను
ఎవడు మోస్తాడని?
గోడకింద పసలగాడీ ,దొడ్డిలో గడ్డివామీ
చేలల్లో పచ్చిగడ్డీ కడుగునీళ్ళతొట్టీ, దాణా బుట్టీ
ఎద్దుల్లేకుంటే ఇవేమీ అఖ్ఖర్లేదు గదా?

కమ్మరి కుమ్మరి మాలా మాదిగా వడ్రంగీ చాకలీ
పండిన గింజగింజలో వాటా దారులైన కులవృత్తులన్నీ
కళ్ళం లేకుంటే ఈ స్వరాలేవీ పల్లెలో నిలువవుగదా!
పిచ్చుకలకు గింజలు దొరకవు. చీమలకు నూకలు రాలవు
నాణ్యమైన కంకులు వచ్చి మిద్దె దంతెలకు వేళ్ళాడవు
ఏదో ఒకరీతి గింజలు రాలగొడితే చాలు
గాదెలు గరిసెల్నిఏకొంప నిలబెట్టుకొందని
మనిషి అస్థిత్వమంతా అతని జేబులోనే ఒదిగిన తరువాత

౩.

-కిరణ్ కుమార్ చావా

నే కళ్లు తెరిచే సరికే
రంగు రంగుల రెపరెపల
ఈ లోకం ఇలాగే ఉంది.
మాట సాయం కావాలన్నా
చేత సాయం కావాలన్నా
ఆపదలందయినా మరి
ఆనందాలందయినా సరి
వడ్డీల లాభాల లెక్కలే.
బంధుత్వానికైనా
స్నేహిత్వానికైనా
వియ్యానికైనా
సహజీవనానికైనా
రంగు కాగితాలే సాక్షి.
ఎప్పుడో ఇలా లేదంట
ఎవరి జ్ఞాపకాల్లోనో
ఇంకా బ్రతుకుతున్న
ఆ లోకం చూట్టమే లేదు.
కల్పన కూడా కష్టమే.
జ్ఞాపకాలే కల్పనేమో.

౪.నిజం

– స్వాతీ శ్రీపాద

వేల వేల ఆశల్ను అదృశ్యంగా భుజాన మూట కట్టుకుని
ఏదో సాధించాలని మరేదో మిస్సయిపోతున్నానని
హడావిడిగా ఈ లోకం వాకిట్లోకి ఊడిపడ్డా
కళ్ళు విప్పకముందే మనసుల  కుళ్ళు వాసన
జన్మ జన్మాంతరాల మురికి కూపాల్ను ముందుకు లాక్కు వస్తోంది
రక్త మాంసాలు పంచిచ్చిన అమ్మ
మౌనం ఊబిలోకి తొంగిచూస్తే
ఈ బిడ్డ ఆడదే కావాలా నా ఖర్మ కాకపోతే మళ్ళీ కొడుకంటారు
మాటిమాటికీ చచ్చి బతికే పిల్లల యంత్రాన్ని కాక తప్పదా?
అప్పుడు తన్నుకు వచ్చింది కేరు మంటూ ఏడుపు
ఎంత దగా ఎంత దగా …. ఇదేనా ఈ లోకం నాకు పలికే స్వాగతం.
పక్కనే హడావిడి పడి పోతున్న వైద్యుడి
అంతరంగసొరంగాలను తడిమితే మూగ భావాలు
శిశిరపు ఉషోదయం లో నును లేత ఆకు కొసల్నిఒంచి జారే
మంచు స్పటికాల్లా
ఎన్ని రంగులను కలబోసుకున్నాయి?
లేత గులాబీలు నూరి ముద్దచేసి పోత పోసినట్టున్న ఈ పిల్ల
పదహారేళ్ళయాక ఎందరి గుండెల్లో రాజుకునే నిప్పురవ్వవుతుందో
అప్పటికి నా యౌవనం వయసు చెల్లిపోతుందే ………
అప్పుడనిపించింది నాచూపుకు లేజర్ శక్తి వుంటే
ఈ మూర్ఖత్వం బూడిద చెయ్యనా అని
ఒక వ్యామోహపు తెర తొలగి ఒక భావాతీత చైతన్యాన్నై
నా దిశ నిర్దేశించుకున్నాను
చూపుడూ వేలేత్తి లోకాన్ని బెదిరిస్తూ …..
దగాజిలుగు తోలుకప్పుకున్న మనసుల్లో
నగ్నంగా జుట్టిరబోసుకుని నర్తించే
ఈ వికృత రూపాలకు విమోచన నవ్వాలి
నేను నేనవాలి
అంతే కాని ఈ బిడ్డనో ఆ బిడ్డనో కాదు…
పులి బిడ్డనవ్వాలి.

౫.ఇప్పుడు వీస్తున్న గాలి

-స్వాతీ శ్రీపాద

ఇప్పుడు వీస్తున్నగాలికి
ఒళ్ళంతా ముళ్ళు మొలుస్తున్నాయి
లోలోన రాళ్ళు పెరుగుతున్నాయి
నరనరాన పాతేసిన గత కాలం చెత్తంతా తవ్విపోసి
తాతల నాటి శవాలవద్ద
తలవాకిట జాగారానికై
మాటలు కునికిపాట్లు పడుతున్నాయి
హైటెక్ జీవన విధానాలు హైటెక్ సంస్కృతీ
బాహ్యసౌందర్యానికి నగిషీలు చెక్కుతూ
నాగరికత తాపత్రయ పడుతున్నా
లోలోపల ఎక్కడో ఇంకా
వెలికి తలెత్తి మొలకెత్తని మొక్క
పదిలంగా తొలి పత్రాల వెచ్చని పొత్తిళ్ళలో
కలలుకంటూనే
మగతా మెలకువల మధ్య
కాలాన్ని కొలుస్తున్నవేళ
దీర్ఘకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న
పాత తరాన్ని తట్టి లేపి
ఆధునిక నడి వీధిలో గుడ్డలిప్పి ప్రదర్శించటం
సిగ్గు సిగ్గు
నరం లేని నాలుకపై
పరుషిస్తున్న తిట్లదండకాలు
ఇప్పుడు వీస్తున్నగాలి తలెత్తుకోలేక
నలుగురి మధ్యనా మొహం చూపించలేక
నిస్సత్తువగా నిస్తేజంగా
తనలోపలికి
లోలోపలికి దూరాలన్నవ్యర్ధ కాంక్షతో
మెలికలు తిరుగుతూ అదురుతున్న పెదవుల గుండెలు
మసక బారిన చూపుల పదాలు
చిక్క బట్టుకున్న వేలి చివర్ల నిస్తంత్రీ నాదాలు
నిశ్శబ్దంగా గుచ్చి గుచ్చి అడుగుతూ
చరిత్రలు తవ్వుకుంటే ఎవరికెవరు తీసిపోతారు?
ఏ వాకిట ఆగి వున్నా
ఏమున్నది గర్వ కారణం?
నరజాతి చరిత్ర సమస్థం
తిట్లూ బూతుల సముదాయమేగా …..

About స్వాతికుమారి

స్వాతికుమారి పొద్దు సంపాదకవర్గ సభ్యురాలు.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

One Response to కవికృతి-౧౦

  1. ramnarsimha says:

    సన్నపురెడ్డి గారు,

    “కళ్ళం లేకుంటే ఈ స్వరాలేవి పల్లెల్లో నిలువవు కదా!
    పిచ్చుకలకు గింజలు దొరకవు..చీమలకు నూకలు రాలవు..”

    మీ కవిత చాలా బాగుంది….అభినందనలు..

Comments are closed.