–ఎ.శ్రీధర్
కనిబరిగె (గుల్బర్గా) లోని ప్రసిధ్ధమైన ‘కపిలేశ్వర దేవాలయంలో’ కపిలేశ్వరునికి అష్టోత్తర శతనామార్చన చేయించి శివోపస్థాన రూపమైన ద్విపద గీతిని ఆలాపించింది ‘అవనిజ’…
పూజారి కాగడా వెలుగులో ఆమె అమాయకమైన ముఖాన్ని చూసాడు. మచ్చలేని చంద్రబింబం లాంటి ఆమె ముఖం ఆ కాగడా వెలుగునే వెన్నెలలా ప్రతిబింబిస్తోంది.
రంగు మీరగ వచ్చి రమ కౌగలింప-బంగరు పుంఖపు ప్రభ కైతవమున
కాలంబు వచ్చు నాకలి దీరునంచు-గాలినెయ్యుండు ముఖంబున డాగ
తూణీర రూప పాథోరాశియందు—బాణ రూపంబున పవళించు హరిని
గారవమున లేపి కరమున నంది-స్ఫార సుమేరు చాపంబున గూర్చి
చికుర రూపంబగు జేజేల దారి- శకట రూపంబగు క్షమయును గదల
శకటాంగ రూప భృచ్చంద్రార్కరుచుల-ప్రకటాట్టహాస ప్రభలు మించి పర్వ
హుంకార బోధిత మురునభోవాటి– నోంకార పటునాద ముగ్రమై వెలయ
ధనురాయు మన చండ ధాటికి నదరి-మినుకుల గుర్రాలు మేనులు వంప
“జయము నీ కగుగాక శంకరా” యనుచు– హయ చోదకుడు బ్రహ్మ యాశీర్వదింప
ఒక్క యేటున మేటి నుగ్ర పురముల మూటి-స్రుక్కడగించిన ముక్కంటి గొలుతు
పూజారి ఆమె పాడుతున్న గీతాన్ని పరవశత్వంతో వింటూ, కపిలేశ్వరునికి హారతి నిస్తున్నాడు. ఇంతలో బయటినుంచి కోలాహలం! ఛీత్కారాలు, హయహేషలు, ఆర్తనాదాలు, వినిపించసాగాయి. వాటిమధ్య ఒక అశ్వారూఢుడైన యువకుడు, “పారిపొండి, పారిపొండి, సురత్రాణ సైన్యం వస్తోంది, పారిపోండి.” అంటూ హెచ్చరికలు చేస్తూ దేవాలయం ప్రధాన ద్వారం దగ్గర ఆగి మరికాస్త బిగ్గరగా వినిపించాడు.
పూజారి చేతిలోని ‘హంస హారతి’ క్రింద పడిపోయింది. “అమ్మా, అవనిజా! లోపలికి రా!” అంటూ, ఆమెను గర్భగుడిలోకి లాగి, గుడి తలుపులు మూస్తూ అన్నాడు, “అమ్మా! సురత్రాణ సైన్యం ముందుగా దేవాలయాల మీద దోపిడీకి దిగుతుంది. ఈ గుడి నుండి సడి చేయకుండా బయటికి పోవాలి. కపాలీశ్వరుని ఆభరణాలు తీయడంలో నాకు సహాయం చెయ్యి” అంటూ, గర్భగుడిలో ఉత్తరదిశలో, పట్టుబట్టలతో కప్పబడి ఉన్న ఒక భోషాణాన్ని తీసాడు. స్వామికి అలంకరించిన నగలు అవనిజ తీసి ఇస్తూ ఉండగా వాటిలో పడేసి, కపాలీశ్వరుని వెనుక భాగాన ఉన్న గోడలోని, రహస్యమైన యంత్రపు మరని త్రిప్పాడు. గదిగోడలలో ఒక భాగంగా కలిసి ఉన్న రాతిపలక తెరచుకొని దారి నిచ్చింది.
అవనిజ విప్పారిన పద్మనేత్రాలని బండి చక్రాలలాగ చేసుకొని ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా, భోషాణాన్ని ఆ సొరంగ మార్గంలోకి నెట్టి, “అవనిజా! పద త్వరగా!” అంటూ ఆమె చేయి పట్టుకొని లోనికి దారితీసాడు, పూజారి.
ఇద్దరూ లోపలికి ప్రవేశించి కాస్త స్థిమితపడ్డాక, ఆ సొరంగపు గోడలలో అమర్చిన ఒక కాగడాని తీసి వెలిగించాడు, అతను. ఆ కాగడా వెలుగులో ఇద్దరూ భోషాణాన్ని నెట్టుకొంటూ మెల్లగా అడుగులు వేస్తున్నారు. ఆ భోషాణానికి అమర్చి ఉన్న చక్రాలని కాగడా వెలుగులో బయటికి తీయడంతో దాన్ని నెట్టడం వాళ్లకి సులువయింది.
అప్పటివరకు జరిగినదాన్ని మననం చేసుకొన్న అవనిజ తన కాకలీ స్వరంతో “ఏమిటిది బాబాయ్?! ఎవరీ సురత్రాణ సైన్యాలు? ఎందుకిలా పారిపోవడం! మనని పరిపాలించే ఏలిక మహ్మద్ షా (రెండవ ) సురత్రాణుడు కదా! తన రాజ్యం మీద తనే తిరిగి దండయాత్ర చేయడ మేమిటి?” అని అడిగింది.
పూజారి కాగడా వెలుగులో ఆమె అమాయకమైన ముఖాన్ని చూసాడు. మచ్చలేని చంద్రబింబం లాంటి ఆమె ముఖం ఆ కాగడా వెలుగునే వెన్నెలలా ప్రతిబింబిస్తోంది. సమున్నతమైన ఆమె కోటేరులాంటి నాసిక, కనుబొమలనే రెండు ధనస్సుల మధ్యనుంచి ఎక్కుపెట్టిన బాణంలా నిటారుగా ఉంది. లక్కపిడతల్లాంటి ఆమె ఎర్రని పెదవులు, వాటిమధ్య మెరుస్తున్న తెల్లని పలువరస ఎలా కనిపిస్తున్నాయంటే అవి చూసిన పూజారికి ఒక శ్లోకం గుర్తుకొచ్చింది.
రాగవానధర ఏష సన్తతం: నిర్మల ద్విజ సమీప వర్త్యపి
ఏభిరస్య సహవాసతః ప్రియే : నేషదప్యపగతో నిజో గుణం!!”
శుద్ధ సత్వగుణముగల బ్రాహ్మణుల సన్నిధి యందున్నను రజోగుణమును విడువని జనము వలె, తెల్లని దంతముల చేరువనున్నను ఈ యధరము రక్తవర్ణమును విడువకున్నదని ఆ శ్లోక తాత్పర్యాన్ని స్ఫురించేలా చేసింది.
మరుక్షణం ప్రస్తుతానికి వచ్చిన పూజారి, అవనిజా! మన ఏలిక మహ్మద్ షాని, ఖాసిం బరీద్ అనే విద్రోహి యుద్ధంలో ఓడించి, బీదర్ కోటలో బందీని చేసాడు. మన ఏలిక కాస్త సౌమ్యుడు, మెతకవాడు. క్రొత్తగా వచ్చిన ఖసిం బదీర్ సురత్రాణుడు క్రూరుడు, మత యుద్ధమనే పేరుతో ధన మాన ప్రాణాలని దోచుకొనే రక్తపిపాసి. ఆ దుర్మార్గుని సైన్యం ఎలాంటి దౌర్జన్యాలు చేసారంటే ………..
“ఎలాంటి దురాగతాలు చేసాడు బాబాయ్?”
“తల్లీ! ఏం చెప్పమంటావ్?…
వడిగుళ్లు సొచ్చి, దేవళ్ల బద్దలు చేసి– ధట్టించి తేజీల గట్టునొకడు
జిగురు పాలకటంచు జిగురించు-రావిమ్రాకుల నజ్జు నజ్జుగా గొట్టునొకడు
గురు సార్వభౌముల గోఢు పోసుక పట్టి-నామముల్మొదలంట నాకు నొకడు
గద్దించి వెన వైదికపు బాపనయ్యల పిల్ల జుట్లూడంగ బెరుకునొకడు
పొట్టేళ్ల గతి బట్టి బోడి సన్యాసుల ఢీయని త్రాకులాడించు నొకడు
సోమయాజుల బ్రహ్మసూత్రముల్ ద్రెంచి, సింగాణి విండ్లకి నల్లెగట్టు నొకడు
పైకాలు గొమ్మని బల్మి గోమటివారి చెలువపై బడి బూతు చేయు నొకడు..”
చాలు, బాబాయ్! చాలు, మరి విన లేకున్నాను” అంది, అవనిజ, కండ్ల వెంట కన్నీరు ధార కట్టగా!
పూజారి ఆమె ముఖం చూసి మనస్థితిని అర్థం చేసుకొని ఆగి పోయాడు. “దిగులుపడకమ్మా, అవనిజా! అశ్వారూఢుడై వచ్చి మన దేవాలయం ముందు హెచ్చరించాడు చూడు, ఒక యువకుడు..”
“అవును బాబాయ్! స్పురద్రూపి అయిన ఒక యువకుడు! అతడెవరు బాబాయ్?!”
“అతడేనమ్మా! మన విమోచనోద్యమ నాయకుడు. పేరు ‘ననుక దేవరాయడు’. .వర్తమాన విజయనగర పాలకుడైన తుళువంశ క్షత్రియుడు, ‘శ్రీకృష్ణ దేవరాయలకు ‘ గురుకుల సహాధ్యాయుడు. విజయనగరానికి వెళ్లి ఖసిం బదీర్ దురాగతాల్ని శ్రీకృష్ణ దేవరాయలకు వినిపించి సహాయమడగాలని తీర్మానించాడు.”
“అలాగా బాబాయ్!” అని ఆగిపోయి దీనమైన స్వరంతో విలపించింది అవనిజ. “నేను ఆడుదానను అయిపోయాను బాబాయ్, లేకుంటే, ననుకదేవరాయునితో కలిసి వెళ్లేదాన్ని” అని అంది.
పుజారి ఆమె మాటలకి నివ్వెరపడి, ఆమె వంక తేరిపార చూసాడు. “అవనిజా! నువ్వు స్త్రీవి కావడమే, ఆ దేవుడు నీకిచ్చిన వరం. కళా పిపాసి అయిన ఆంధ్ర భోజుని నీ నాట్యంతో, నీ గానంతో రంజింప జేసి, ననుకదేవుని సందేశాన్ని వినిపించి మన సహాయానికి తరలించగల కౌశలం నీకే ఉంది. ననుకదేవునితో పాటు..”
“నేను అతనితో వెళ్లేందుకు సిద్ధమే బాబాయ్! విమోచన యజ్ఞానికి ఆహుతి నిచ్చే సమిధ నవుతాను. ఈ ప్రయత్నంలో నేను ప్రాణం పోగొట్టుకోడానికయినా వెనుదీయను. నా నాట్యం, నా గానం, నా కళాకౌశలం దానికి ఉపయోగపడితే జన్మ ధన్యమయినట్లు భావిస్తాను.” అంది అవనిజ ధృఢనిశ్చయంతో.
ఆమె ముఖం, ఇప్పుడు వెన్నెల వెదజల్లే జాబిల్లిలా లేదు. చండ ప్రచండ కిరణాలతో ఎదిరిని భస్మం చేయగల మధ్యందిన మార్తాండుని లాగా భాసించింది ఆ పూజారికి.
************************
సొరంగ మార్గంనుండి బయటపడిన తరువాత చుట్టుప్రక్కల పరిసరాలని చూసింది అవనిజ.
అడవిమధ్యలో అసిరమ్మ గుడి అది! (అసిరమ్మ-శిరము లేని అమ్మ- ఛిన్న మస్త) అప్పటికే అక్కడ ఆరుగురు ఆశ్వికులు, ఒక పల్లకీ తదుపరి ప్రస్థానానికి తయారుగా ఉన్నారు.
ననుకదేవుడు వారిని చూడగానే, అశ్వంనుండి క్రిందకి దిగి భోషాణాన్ని బయటికి లాగడంలో పూజారికి సహాయం చేసాడు. ఆ తరువాత తలవంచి అవనిజకి అభివాదన చేసాడు.
“ననుకదేరాయా! ఇదుగో ఈ అమ్మాయే అవనిజ! గానకోకిల, నాట్యమయూరి, రూపానికి లక్ష్మి, కళా కౌశల్యానికి సరస్వతి, నారీశక్తి ప్రతీకయైన దుర్గ, అమాయకత్వానికి సురభి, ఆలోచనకి ద్రౌపది,..” అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, “ఇక చాలు బాబాయ్!” అని అడ్డుపడింది అవనిజ. ” నా గురించి అతిశయోక్తులు చెప్పేకన్న అతని గురించిన వాస్తవాలు చెప్పండి”, అంటూ.
ననుకదేవుడు కూడా పూజారిని వారించాడు. “గురువర్యా! నా గురించి చెప్పడానికేమీ లేదన్నదే వాస్తవం. ఇప్పుడు చెప్పాల్సినదీ, చేయవలసినదీ నా కీర్తిగానాలు కాదు, శ్రీ కృష్ణదేవరాయల గురించి చెప్పండి.
“శ్రీకృష్ణ దేవరాయలా! ఆయనెవరు?” అడిగింది అవనిజ.
“శ్రీకృష్ణ దేవరాయలు, తుళువంశ క్షత్రియుడు. విజయనగర సామ్రాజ్య వారసత్వాన్ని తన అన్న వీర నరసింహ రాయల దగ్గర నుండి చేపట్టిన రాజాధిరాజు! అతడు ధర్మనిష్టలో యుధిష్ఠిరుడు, బాహుబలమందు భీముడు, ధనుర్విద్యయందు ధనంజయుడు, నిష్కపట నీతి యందు సహదేవుడు, ఔదార్యమందు కర్ణుడు, వ్యూహరచనలో ద్రోణుడు, స్వసైన్య రక్షాతంత్రంలో భీష్ముడు, పరసైన్య విదారణ పద్ధతిలో అశ్వత్ఠామ, అశ్వహృదయ జ్ఞానంలో నకులుడు, సప్రేమ మహాసుందరుల వివక్త సన్నిధిలో కూడా చలించని శ్రీశుకుడు, ఆంధ్ర సాహిత్య కళామతల్లికి అనుంగు పుత్రుడు, అతడే మనకి కాబోయే సార్వభౌముడు.”
అవనిజ తన చేయి చెక్కిలికి చేర్చి, “అర్థమయింది. ఒక్క మాటలో చెప్పాలంటే పురుషోత్తముడన్న మాట!” అంది.
“అవును మనము ఇప్పుడు అతని సన్నిధికే వెళ్తున్నాం. దేశవిమోచన దీక్షాకంకణులైన యువకిశోరాలు నాతోపాటు ద్వాదశసంఖ్యలో ఉన్నారు. వీరనారీమణులు మీతో కలిసి నలువురు, వెరసి పదహారుగురు. మనమందరం, కళాకారుల లాగా దారిలో మజిలీలు చేస్తూ విజయనగరం చేరుతాం. అల్లసాని పెద్దనామాత్యులవారు, మహామంత్రి తిమ్మరుసులవారు మనకి శ్రీకృష్ణ దేవరాయల సభాభవనమైన భువనవిజయంలో ప్రదర్శనకు ప్రవేశార్హత కలిగిస్తారు. ఆ ఆంద్రభోజుని మనసుని రాగరంజితం చేసాక కానుకలిచ్చే బదులు విమోచన నివ్వమని అడుగుదాం!” ఏకబిగిన చెప్పాడు, ననుకదేవుడు.
“ఆయన ఒప్పుకొంటాడంటారా?”
“ఆయన ఔదార్యంలో కర్ణుడని..”
“అటులనే, ఇప్పుడేం చేయాలి?”
“మీరు ఈ నగల భోషాణంతో పాటు ఆ పల్లకీ నెక్కి కూర్చోవాలి. తక్కిన కథ మన గురువర్యులు, మిత్రులు నడిపిస్తారు.”
************************
భువన విజయంలో మహారాజ శ్రీక్రష్ణ దేవరాయలు, మహామంత్రి తిమ్మరసు, అల్లసాని పెద్దనామాత్యులు తదితర రాజబంధువులు, రాజ పరివార బృందముల ఎదుట, బెల్గాం, బీదర్, కనిబెరిగ నుండి వచ్చిన యువకళాకారుల ‘రామాయణ ప్రదర్శన’ రక్తి కట్టింది. ఆ రోజు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహ ఘట్టం ప్రదర్శింపబడుతోంది.
దేవతల్ హర్షింప దేవ కామినులు— వావిరి నాట్యముల్ వర్థిల్ల జేయ
ఫుల్లాబ్జ దళ నేత్రి, పూర్ణేందువదన — నిల్లాండ్ర మేల్బంతి, యిభరాజవదన
జనకజ చేబట్టె, జన నాధ సుతుడు— ఘన ధన్వి రాముడు ఖచరులు వొగడ
భరతుడు గ్రహియించె భాసురంబుగను—కరముచే మాండవీ కర సరోజమును
సౌమిత్రి పట్టెను, సద్గుణవల్లి.— గామిని యూర్మిళ కర పల్లవంబు
శృతికీర్తి రమణీయ శోభన కరము,— జతగూర్చి పట్టెను శతృఘ్నుడంత!
కళ్యాణమయ్యెను గన్యకామణుల-కళ్యాణ మబ్బెను ఖచరవాసులకు
కళ్యాణ గానముల్ గంధర్వ సతులు—కళ్యాణ రవముచే గళమెత్తి పాడ
నూర్వశీ మేనకలున్నత స్థాయి—గర్వత నృత్యముల్ ఘటియించి యాడ
దేవతల్ సుమములన్ దివినుండి రాల్ప—భువి కళ్యాణోత్సవ భూరి వైభవము
ముగిసెను సంతోష పూర్వకంబుగను!
శ్రీకృష్ణ దేవరాయలు పాటను, నృత్యాన్ని, అభినయాన్ని చూసి ప్రశంసించాడు. కళ్యాణ శబ్దాన్ని పలుమార్లు నానార్థ సూచకంగా వాడినందుకు మెచ్చుకొన్నాడు. ప్రదర్శనకారులను ఏమి కావాలో కోరుకోమన్నాడు.
అవకాశం లభించిన ననుకదేవుడు, అవనిజ తధితరులు తమ రాకలోని పరమార్థాన్ని విడమరిచి చెప్పి రక్షించమని వేడుకొన్నారు. సార్వభౌములు వారిని తన ఏకాంతమందిరంలో కలియమని చెప్పి, కనుసన్నలతో తిమ్మరసుల వారిని అనుసరించమని సూచించి, వారితో పాటు అక్కడ నుంచి కదిలాడు.
************************
శ్రీకృష్ణ దేవరాయలు అరిభయంకరుడై ఖాసిం బదీర్తో పోరి, ఓడించి బీదర్ కోటలో బందీగా పడిఉన్న మహమ్మద్ షాను చెర నుండి విడిపించాడు. అంతే కాదు, ఎవరూ ఊహించని రీతిలో, తిరిగి అతనికే బహమనీ రాజ్యాన్ని అప్పగించాఢు. తిమ్మరసు మంత్రి దూరదర్శిత్వం, రాయల రాజనీతి ఎంత పటిష్ఠమైనవో ఆ సంఘటననే సాక్ష్యంగా ఛెప్పవచ్చు. ఆ రోజేగాని ఆ సురత్రాణుని వధించి ఉంటే తక్కిన ముస్లింపాలకుల మనసులలో ద్వేషబీజాలు మొలకలెత్తి వారందరి ఐకమత్యానికి దోహదం చేసి ఉండేవి. ఆ విధంగా అతడు అల్లసానివారి మాటలలో ‘యవన కోణిభవ స్థాపనా’!!’ అని, ‘పరిభూత సురత్రాణ!!’ అని కొనియాడబడ్డాడు.
ఆ సంఘటన ఇప్పటికి 500 సంవత్సరాలు (1510 జనవరి 23) క్రిందట జరిగింది అయినా దాని నుంచి మనం ఈ నాటికీ పాఠాలు నేర్చుకొని మనుగడని ఎలా సాగించాలో చరిత్ర చెప్తోంది!!!
స్వేచ్ఛావాయువులు పీల్చుకొన్న అవనిజా ననుకదేవులు రాయలచేత ఆదేశింపబడి తిరిగి కళ్యాణ బంధంలో బంధింపబడ్డారు..!!!!!!!
కథ (చరిత్ర?) బాగుంది, శైలి బాగుంది, కానీ ఇంకా పొడిగించి రాస్తే ఇంకా బాగుండేదని అనిపించింది.
’రాగ వాన ధర ’ అని చదివి కొంచం అర్థంకాక తికమక పడ్డాను. అది ’రాగవాన్ అధరః’ కాబట్టి, ’రాగవానధర ఏష’ అని సంపాదకులు సరిదిద్దితే బాగుంటుంది. అలాగే ’సన్తనం’ కాకుండా ’సన్తతం’ అని ఉండాలనుకుంటాను. ఒకసారి సరి చూడమని ప్రార్థన.
అలాగే ’నేష దప్య పగతో’ – అని కూడా విడగొట్టకూడదని నా భావన. అది ’న ఈషత్ అపి అపగతః’. సంధి చేస్తే, ’నేషదప్యపగతో’ అనే రాయాలనుకుంటాను.
తెలుగు పద్యాల్లో కూడా ఒకట్రెండుచోట్ల ఒత్తులు ఎక్కువయ్యాయి కానీ (భోధిత, చంఢ), రంధ్రాన్వేషణ చెయ్యడం మాత్రం ఇక్కడ నా ఉద్దేశ్యం కానే కాదు.
ఇంకొక సంగతి నాకర్థం కాలేదు. ’సురత్రాణుడు’ అంటే దేవతలని కాపాడేవాడు అని అర్థం అనుకుంటున్నాను. అదొక బిరుదని తోస్తూంది. దీనిక మరొక అర్థం ఏమైనా ఉందా?
నేననుకున్న అర్థమే అయితే, మహమ్మద్ షా కి ఆ బిరుదు ఉందని కథ ద్వారా తెలుస్తోంది.
>>మనని పరిపాలించే ఏలిక మహ్మద్ షా (రెండవ ) సురత్రాణుడు కదా!
మరి –
>>క్రొత్తగా వచ్చిన ఖసిం బదీర్ సురత్రాణుడు క్రూరుడు
>> సురత్రాణ సైన్యాలు
అని ఎందుకంటున్నారు? ఈ ’సురత్రాణ’ పదం గురించి కొంచం వివరించమని ప్రార్థన.
మంచికథని అందివ్వడంతోపాటూ చారిత్రక విశేషాలు కూడా తెలిపినందుకు రచయితకి ధన్యవాదాలు.
’సుల్తాన్’ ని ’సురత్రాణ’ అని మనవాళ్ళు అప్పట్లో అనేవారనుకుంటాను. అంతర్జాలంలో కొంచం వెతికితే అర్థం అయ్యింది. అయినా కథలో ఈ పదాన్ని కొంచం ambiguity లేకుండా వాడి ఉంటే బాగుండేది.
నాగమురళి గారూ, అక్షరదోషాలను సవరించామండి.
మీ సందేహాలకు రచయిత నుండి వచ్చే సమాధానాల కోసం చూద్దాం.
-సం.
నాగమురళి గారికి, సురత్రాణ శబ్దంలోని అర్థం పెద్దనామాత్యుడు రాయలవారికి ఇచ్చిన బిరుదులోనే వ్యక్తమవుతోందండీ ! ‘యవన కోణీభవ స్థాపనా’, ‘పరిభూత సురత్రాణ’ అన్న బిరుదులు ఆయన రాయలవారికి ఇచ్చారు. మీరు ఆ వాక్యాన్ని (బహుశా చిట్టచివరగా వ్రాయబడింది కాబట్టి)గమనించి ఉండరు.అందులో నానార్థాలు గాని, అసందిగ్ధత గాని లేదు. సుల్తానుని సురత్రాణ శబ్దంతో పిలవడం అప్పట్లో పరిపాటి! ప్రోలయ వేముని కాలంలో నుంచి కూడా ఈ శబ్దం వాడబడేదని అప్పటి శాసనాల ద్వారా తెలుస్తోంది. మీరు శ్లోకంలో సూచించిన తప్పులు సరైనవే!ఆ శ్లోకం ‘ఉమా సహస్రం’లోనిది. మీ సద్విమర్శకి, సహ్రుదయానికి ధన్యవాదాలు. పోతే కథ నిడివి గురించి మీకు ఆశాభంగం కలగడం సహజమే!నా కయితే ఈ కథని నలభై పేజీలు వ్రాయాలని ఉంది, కాని నెజ్జనులు నిడుపైన రచనలు చదవరండీ ! ఆ విషయం నాకు ‘పొద్దులోనే’ పడిన నా నాటిక ‘చీకటి చకోరాలు’తోనే అర్థమయింది. ఎంత బాగా వ్రాస్తే ఏం లాభం! చదివేవారు లేకపోతే, అందుకే దీనిని సంక్షిప్తంగా వ్రాసాను. మీరు నా నాటిక ‘చీకటి చకోరాలు’ చదవి నన్ను ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాను.
Dear Writer! Your story narration& characterization are Commendable!
Dear Poddu! your Presentation is appreciable as 500 years of Rayala pancha saatabdi is just started. much up-roar is going from Gov’t side. yet your contribution is well timed& dedeicated. Thanks for both of you.
challa baagundi.
చాలా బాగా వ్రాశారు. చరిత్ర, పద్యాలు, శ్లోకాలు అన్నీ చక్కగా అమరాయి. కథే కాబట్టి ఇంకా ఒక్కింత డ్రామా జోడిస్తే, మరింత ఆకర్షణీయమయి ఉండేదని నా అభిప్రాయం.
చాలా బాగా రాశారు. అరుదైన రచన.