-అభిశప్తుడు
మొదటి అడుగు: భూమి కమ్ముకున్న అదృశ్య ప్రణవాన్ని అరచేతి దోనెలతో పోస్తానన్నావు
ప్రణయాణువులతో పిగిలిపోతున్న కాగితప్పొట్లాంలో కాస్తయినా ఖాళీలేదు మనోప్రస్తారం నుంచి మరే ప్రసారం వీలుకాదు
ఈదురుగాలుల్ని ఉడికించిన గడ్డిపోచ నేను రికామీ తెమ్మెరై వంచిన, వంచించిన నీ నవ్వు
రెండో అడుగు: ఆకాశం కంటిరెక్కలకి కట్టాను కంకరరాళ్ళు ఐనా లోన ఎండమావుల్ని రద్దు చేసే ఏకాగ్రత నా కంటని రోగం! రంగు చివికిన ఇనుపరజను తుప్పని నువ్వు తర్కమంటూ నేను-
కంటి తెరలు కదలకుండా బలవంతాన కుట్టాను కానీ, నా ఉల్కల్ని కప్పే స్థిరత్వం నాకు సోకని జాడ్యం సాగిలపడ్డ పొగడపూలు ఆధ్యాత్మికమని నువ్వు తాదాత్మ్యమని నేను- ఒకే నాణేనికి బొమ్మా బొరుసులం కదా నేను అవిశ్వాసిననడం అర్థ సత్యం
మూడో అడుగు: పాతాళం అది రేపటిలా పొంచిన భవం కాదు రోమాల్ని నిక్కించిన భ్రాంతీ కాదు
అది ఆదిమగర్భంలో నాదాంకురమై కెవ్వుమన్న నీ స్వరం కాదు లుంగలు చుట్టుకునే పాదం లేదు పారవశ్యంలేక పాలిన పదం లేదు ఒంటరి మాళిగలో గరుకు గోడలు మింగే నీ పాటలానూ లేదు
అది వెన్నెల్ని దిగవిడిచేస్తూ దిసమొలయ్యే నిండుచంద్రుడి నిర్లజ్జలాంటి నీ చూపు కాదు గాలం అంచున ఎరలేదు తాడు కొసన అసలు ఉచ్చేలేదు కాటుక అంచుల కొలనులో కోణంగిలా కదిలే నీ కంటిపాపలానూ లేదు
తలను తాటించి భుజాలు కదలించి మేను మొదలు కుదిపించి ఆత్మ మెడలు వంచి జన్మ తరింపించే స్పర్శ లేనేలేదు
ఊదా వలయాల మీద తారాడే కాంతినీడ
లెక్కతేలని తరంగాలని ఒడిసిపట్టే రజోవల అది ఓ అస్పృశ్య స్పర్శ! ఉప్పిరిసిన వెన్నుకి ఒగర్చే గుర్రాల శ్వాస
మొగలి రేకుల మీద నఖరేఖల నిట్టూర్పు
లావా సెగల తలవని స్పర్శకి హిమనగం జార్చే పైట
ఆత్రాల ఊడలవైపు నేల సాచే చేయి
మబ్బుకండెకి వడికే మెరుపుదారంలా స్పృహలాంటి స్పర్శ!
ఏకాగ్రతలంటించి స్థిరత్వాలు సోకించి రుజాగ్రస్తుడ్ని చేసిన అంటు
భూమ్యాకాశాలకు వెలిగా రస పాతాళానికి అణిచేసిన అస్పర్శ!
పునర్జన్మో, పునరపి మరణమో తేలని పుల'కల'లోకి కళ్ళుమూసిన మాయ-
** ** **
*రేకీ attunementకి ఎంతమాత్రం తగని నన్ను బలవంతాన
ఒప్పించి, గెలిచి ఓడిన గురుదేవికి-
అసతోమా సద్గమయ…
తమసోమా జ్యోతిర్గమయ…
మృత్యోర్మా అమృతంగమయ…
ఎంతో మహత్తర ప్రయాణం చేసింది నా ఆత్మ కూడా… మీ అక్షరాల వెంటే ఆ భావ చిత్రాలను చూస్తూ వెడుతుంటే నాకు అన్ని పనులూ మానేసి , ముందు నిర్మోహ వామనం ఎంత అందమైందో చెప్పడమే తక్షణ కర్తవ్యంగా తోచింది.
ఈ కవిత పైపైన చూసేది కాదు. నాకు ఇందులో భూమి యొక్క నిమ్నోన్నతాలు కనిపించినాయి.
మీ పదాల్లో ప్రకృతి మానవకాంత లా ఉంటుంది. నిశ్శబ్దం మాట్లాడుతుంది. చాలా చిత్రాలు జరుగుతాయి. నా ఆనందం మీతో పంచుకుంటూ…
నిర్మోహ వామనం
మొదటి అడుగు: భూమి
కమ్ముకున్న అదృశ్య ప్రణవాన్ని
అరచేతి దోనెలతో పోస్తానన్నావు
మూడు అడుగులు : 1 . భూమి 2 ఆకాశం 3 పాతాళం . ఇవి అభినవ వామనుడు కొలిచిన అడుగులు.
పరమ పద సోపానానికి మరొక్క అడుగేసి చేరుకోవడమే మిగిలిన పరిణతాత్మతో, తననొక అల్ప జీవిగా లెఖ్క వేసుకుంటూ , తన పరిమితులను తెలియజేస్తున్న ఒకానొక అపరిణత మనస్సు నెరపుతున్న సోలిలాక్వీ…డైలాగ్….
ఈ రెండింటికీ సరిగ్గా ఆకాశానికీ , భూమికీ ఉన్నంత దూరమూ ఉంది. భూమి మీద ఉండే జీవులకు, అంతటా కమ్ముకున్న ప్రణవం గురించి అర్థం కావాలంటే, ఆ తత్త్వమే ఎంతో దయతో , జీవి మీద ప్రేమతో దిగి రావాల్సిందే తప్ప, జీవికి దానంతట అదిగా ఎప్పుడూ యాదృచ్ఛికంగా తటస్థపడే ఘట్టం కాదది.
ప్రణయాణువులతో పిగిలిపోతున్న
కాగితప్పొట్లాంలో కాస్తయినా ఖాళీలేదు
మనోప్రస్తారం నుంచి మరే ప్రసారం వీలుకాదు
కాగితప్పొట్లాం ఈ భౌతిక శరీరం. ఇది ప్రణయస్పందనలతో సంచలిస్తున్నది. ఇక్కడ ఈ మనస్సులో ఈ నేపథ్యంలో ప్రణవారాధనతో సహా దేనికీ చోటు లేదు. నువ్వేం చెప్పినా సుఖం లేదు. గోపికలు ఉద్ధవుడితో కూడా ఇలాగే అన్నారు.
ఈదురుగాలుల్ని ఉడికించిన
గడ్డిపోచ నేను
రికామీ తెమ్మెరై
వంచిన, వంచించిన
నీ నవ్వు
గడ్డిపోచ పెనుగాలులను లెక్క చేయట్లేదు. ఇంత బతుకూ బతికి… ఇన్ని దేశాల్నీ గడగడలాడించిన నేను ఈ గడ్డిపోచను ఎందుకు కదిలించలేక పోయానా అని ప్రతి ఈదురుగాలీ దానితో అది స్వగతించుకుంది. ఇక నేను… ఎందరో మహానుభావులు నేను వెళ్లవలసిన దివ్య మార్గాలను చూపించారు. నేను పట్టించుకోలేదు. కానీ నువ్వేమిటో…చిన్న తెమ్మెర లాగానే వచ్చావు. నవ్వావు. గడ్డిపోచ కదిలింది. నీ దివ్య స్మితి లోని నవ్య సందేశం ఏమిటో గానీ నా అడుగులు అటుగా పడ్డాయి..
రెండో అడుగు: ఆకాశం
కంటిరెక్కలకి కట్టాను
కంకరరాళ్ళు
ఐనా
లోన ఎండమావుల్ని రద్దు చేసే
ఏకాగ్రత
నా కంటని రోగం!
అంతగా చెబుతున్నావు …అదేమిటో చూద్దామని … బలవంతంగా కళ్లు గట్టిగా మూసుకుని కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నాను. నా నేత్రం బయట ప్రపంచం చూడాలంటుంది…(చూసిన నేత్రం మామూలుగా ఊరుకోదు. ఊహ…కల్పన…లోకాల్లో విహరిస్తుంది. అదంతా ఎడారే అని అర్థం అవుతున్నా ఒయాసిస్సు దొరకక పోతుందా అనే ఆశ… కుక్క ఎముకను మాంసం ముక్క లాగ ఫీలవుతూ చీకుతుంటే దాని చిగుళ్ల వెంట కారే రక్తం బొమిక నించీ వస్తోందని అనుకుంటుంది. ఆహా .. ఎప్పడూ ఈ బొమికే చీకుతూ ఉండాలనే నిర్ణయం కూడా తీసుకుంటుంది) అయినా నువ్వు చెప్పావని … బలవంతంగా కళ్లు మూసుకుని కూర్చున్నాను. అయినా ఏకాగ్రత నాకు కుదరలేదు. అలాగే నేనున్న ఈ చాంచల్య స్థితి , ఈ వెదుకులాటా నాకు నచ్చాయి కాబట్టి ప్రస్తుతానికి ఏకాగ్రచిత్తత నా వరకూ నాకు అనారోగ్యంతో సమానమే .
రంగు చివికిన ఇనుపరజను
తుప్పని నువ్వు
తర్కమంటూ నేను
ఈ ప్రపంచం పరమ అసార వస్తువని నువ్వంటే …నేను కనిపిస్తున్న దాన్ని ఎలా లేదనుకోవాలీ అని తర్కిస్తాను.
కంటి తెరలు కదలకుండా
బలవంతాన కుట్టాను
కానీ,
నా ఉల్కల్ని కప్పే
స్థిరత్వం
నాకు సోకని జాడ్యం
అయినా నువ్వంటున్నావు కదా అని … నా స్వప్నాల్ని సాకారం (ఉల్కాపాతం) చేసుకునే పని అట్లా పక్కన పెట్టి మళ్ళీ ధ్యానం లో కూర్చున్నాను. ఇప్పటికీ ధ్యానానికి కావలసిన స్థిరత్వం కుదరడం లేదు. అందుకే స్థిరత్వం ప్రస్తుతం వరకూ జాడ్యం తో సమానమే…
సాగిలపడ్డ పొగడపూలు
ఆధ్యాత్మికమని నువ్వు
తాదాత్మ్యమని నేను
ఇక్కడా పొగడపూలు సాష్టాంగ పడితే నీకది ఒక సాంప్రదాయిక సదాచారం లాగా, దేవాలయంలో భక్తుడు భగవంతుడి ముందర సాష్టాంగ పడడం లాగా తోచింది.
కానీ అంత వరకూ తర్క బుద్ధితో ఉన్న నాకు ఆ చిట్టి సుగంధ సుమాలు ప్రకృతి తల్లి ఒడిలో తిరిగి లయించిపోయేందుకు సిద్ధమవుతున్న సంసిద్ధత దృశ్యమానమైంది.
ఒకే నాణేనికి
బొమ్మా బొరుసులం కదా
నేను అవిశ్వాసిననడం
అర్థ సత్యం
మనిద్దరి ద్వంద్వ దృష్టీ సత్యానికి అటూ…ఇటూ …
ధమనులూ…సిరల్లాగా…
వెలుతురూ…చీకటి లాగా…
విశ్వాసీ, అవిశ్వాసీ కూడా సత్య ప్రకటనలే..
రెండూ కలిస్తేనే సంపూర్ణం.
నేనిలా ఉండడమూ… నువ్వలా ఉండడమూ కూడా సృష్టి అవసరాలే !
విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్య తారు రోడ్డుకీ … సైకిల్ కీ ఉన్న
బంధం.
అవిశ్వాసికీ , అవిశ్వాసికీ మధ్య తారు రోడ్డుకీ … రోడ్ రోలర్ కీ
ఉన్న బంధం.
అతి కఠినమైన తారు రోడ్డు మీద సైకిల్ మెత్తటి టైరు రయ్ మని పరిగెడుతుంది. అదే రోడ్డు మీద రోడ్ రోలర్ బారెడు దూరానికీ బ్రహ్మాండమైన సౌండు…అంగుళం అంగుళానికీ అంగలారుస్తుంది.
మూడో అడుగు: పాతాళం
ఈ పాతాళంలో అద్భుతం జరగబోతుంది. అది గతంలో భూమ్యాకాశాల్లో జరగనిది !
నేతి మహావాక్య నిరూపణ వలె అక్కడ ఏం జరిగిందో అందించడానికి ఏం జరగలేదో చెబుతున్నారు.
అది
రేపటిలా పొంచిన భవం కాదు
రోమాల్ని నిక్కించిన భ్రాంతీ కాదు
అది రేపటి రోజున నా వంతుగా రాబోతున్న కర్మానుభవం కాదు. శ్వాసించింది మొదలుగా… ఇంత వరకూ నిరంతరంగా వంటి మీద అనుభూతి చెందుతూ వస్తున్న నవరసానుభూతుల్లో ఏ అనుభూతికీ చెందిన భ్రాంతీ కాదు. అంటే ఈ అనుభూతి అద్వితీయం. అనన్యం.
అది ఆదిమగర్భంలో
నాదాంకురమై కెవ్వుమన్న
నీ స్వరం కాదు
ఆ పాతాళంలో వినబడుతున్న స్వరం
లుంగలు చుట్టుకునే పాదం లేదు
పారవశ్యంలేక పాలిన పదం లేదు
ప్రేమికుల ఏకాంత సాన్నిహిత్యం అభివర్ణించే కల్పనా చిత్రం !
ఒంటరి మాళిగలో
గరుకు గోడలు మింగే
నీ పాటలానూ లేదు
అప్పుడు విన్న స్వరం ఒంటరిగా నువ్వు నీకోసంగా పాడుకునే పాట లాగానూ లేదు.
అది వెన్నెల్ని దిగవిడిచేస్తూ
దిసమొలయ్యే నిండుచంద్రుడి
నిర్లజ్జలాంటి నీ చూపు కాదు
వెన్నెల్ని దిగవిడిచేస్తూ , నిండుచంద్రుడు దిసమొల అవడం లోకానికి హితం చేకూరుస్తోంది . అలాంటి నిర్లజ్జనే ప్రదర్శించే నీ చూపు నాకూ అలాగే హితం చేసేది. కానీ ఇప్పుడు ఈ పాతాళంలో కనిపిస్తున్న ఈ చూపు నాకు తెలిసిన ఆ చూపుతో పోల్చలేనిది.
గాలం అంచున ఎరలేదు
తాడు కొసన అసలు ఉచ్చేలేదు
గాలం అంచున ఎరలేకపోవడం, తాడు కొసన అసలు ఉచ్చేలేకపోవడం అనేవి మోహ రహితం అనడానికి రెండు సూచనలు. ఏ విషయాలు మోహ రహితాలూ అంటే…ఇప్పటి వరకూ అక్కడ కనిపించిన అనన్య సామాన్యమైన దృశ్యం, స్వరం, పాట, ఇవన్నీ…అనమాట…
కాటుక అంచుల కొలనులో
కోణంగిలా కదిలే
నీ కంటిపాపలానూ లేదు
అది నీ సుందర నయన సంచలన దృశ్యమూ కాదు.
తలను తాటించి
భుజాలు కదలించి
మేను మొదలు కుదిపించి
ఆత్మ మెడలు వంచి
జన్మ తరింపించే స్పర్శ లేనేలేదు
అది అద్భుతమైన శారీరీక సమాగమం కూడా కాదు.
ఊదా వలయాల మీద
తారాడే కాంతినీడ
అది ఊదా రంగు వలయాల మీద తారాడే కాంతినీడ . ఊదా రంగు ఆధ్యాత్మిక సంస్కారానికి ప్రతీక…
లెక్కతేలని తరంగాలని
ఒడిసిపట్టే రజోవల
అది ఓ అస్పృశ్య స్పర్శ!
అది కేంద్రంగా పని చేస్తున్న చోట మిగతా వలయాల్లో జరుగుతున్న మార్పులు… అది ఓ అస్పృశ్య స్పర్శ గా నిర్థారణ !
ఉప్పిరిసిన వెన్నుకి
ఒగర్చే గుర్రాల శ్వాస
అలిసి పోయిన భౌతిక వాంఛా జీవితం…
మొగలి రేకుల మీద
నఖరేఖల నిట్టూర్పు
ఆత్మలో నుంచీ జారిపోయిన రతి సుఖాలూ…
లావా సెగల తలవని స్పర్శకి
హిమనగం జార్చే పైట
అనుకోకుండా ప్రాకృతికంగా జరిగిపోయే సహజ సంఘటనలు.
ఆత్రాల ఊడలవైపు
నేల సాచే చేయి
ఆత్రాలనే ఊడల వైపు నేల చేయి సాచడం… ఎంత గొప్ప పర్సానిఫికేషన్ …ఎంత సహజం..!
మబ్బుకండెకి వడికే
మెరుపుదారంలా
స్పృహలాంటి స్పర్శ!
స్పృహలాంటి స్పర్శ మెరుపుని దారంలా చేసి మబ్బుకండెకి వడుకుతోంది ! ఎప్పుడో ఒకప్పుడు ఆ కండె నించి మెరుపు గాలిపటం ఎగురుతుంది. లోకాన్ని విభ్రాంతి కి గురి చేస్తుంది. స్పృహ వల్లనే చైతన్యం పెల్లుభికుతుంది. కలిగిన అవగాహనే స్పర్శ !
ఏకాగ్రతలంటించి
స్థిరత్వాలు సోకించి
రుజాగ్రస్తుడ్ని చేసిన అంటు
ఏకాగ్రతలంటించడం, స్థిరత్వాలు సోకించడం, రుజాగ్రస్తుడ్ని చేయడం పైగా ఈ దివ్యత్వాన్ని అంటు గా చెప్పడం …నిందా స్తుతి. పైకి నింద , లోపల ప్రశంసా దీని ప్రత్యేకత !
భూమ్యాకాశాలకు
వెలిగా
రస పాతాళానికి అణిచేసిన అస్పర్శ!
ఇక్కడి నేల మీదా, అటు ఆకాశంలోనూ కూడా దొరకని దివ్య రసానుభూతి ఊహించని పాతాళంలో దొరికింది. అది స్పర్శతో , సంపర్కంతో సంబంధం లేకుండా…!
పునర్జన్మో, పునరపి మరణమో
తేలని పుల’కల’లోకి
కళ్ళుమూసిన మాయ
ఇప్పుడీ సమయం మళ్లీ కొత్త జన్మ ఎత్తినట్టో, మళ్లీ మరణిస్తున్నట్టో తెలియని సంధికాలం…అధ్భుతం జరిగే ముందు కొన్ని క్షణాలు…
సత్యం మెరిసింది. మాయ మాయమైంది.
నష్టోమోహః స్మృతిర్లభ్ధ్వా … అర్జునుడికి కలిగిన గీతా బోధ…!
** ** **
*రేకీ attunementకి ఎంతమాత్రం తగని నన్ను బలవంతాన
ఒప్పించి, గెలిచి ఓడిన గురుదేవి
ఇంతటి మహోపకారానికీ తిరిగి మీరిచ్చే గురుదక్షిణ ఏమిటంటే …ఇలాంటి రుజాగ్రస్తుల్ని లిస్ట్ లోకి చేర్చడమే!
పదం మీద మీకున్న పట్టు నాకు చలాన్ని గుర్తుకు తెచ్చింది. కానీ మీ మార్మికతలో సంపూర్ణత ఉంది.
…రమా సుందరి.
ఇది వామనం కాదు. వావ్ వనం మనం
కాదూ, ఇంతే అక్కున చేరిన కొన్ని అడుగుల ఆగడాల అండాశయ ఆనందానంద అంగుళీయమ్ లో జారిన కొన్నిబతికిన అనుభవాల సమీక్ష.
A small complaint in an absurd dissented how- where is your flower on unborn children. Where is your fatherhood as lover in spite of all our unloving, where is our fatherhood in a poetic motherhood as routine tragic dowry of life. Confession is a discount to a thought. Even there, conditional show of our silence, as usurped sentence, whispered beauty of memory, as the beauty of memory, as the lost footsteps of the god’s past, as the theme of a weaving tide as a distinct shape of a mirror, a laughing torn tear drop of a petal, an end pause for a calculated rainbow shadow, a sudden marriage of morphed mourning. When it was a night, when it wasn’t our speckled sphere of lullaby would have been a honey tomb. Let us have a complaint. Let there be an inner void for our sentence. Tongueless thought will snore forever. Incest death of air. Imprints of a friend’s dark drunken solitude is invisible to many, dispatch my distance to me.
ఆగి ఆగి పట్టి పట్టి చదివి, మౌనంగా వెళ్ళటమేగానీ ఈ కవితకి అభిప్రాయం రాయగల సత్తా నాకు లేదు. వెచ్చగా తడిమిన భావన, ఏదో తెలిసీ తెలియని అనుభూతి మాత్రం నావెంట బెట్టుకు పోతున్నాను.
I cld not understand anyth..
But someth unknown attraction is there..
rputluri@yahoo.com
the poem and the first comment took the mind to another state, may be to another world or being. enough for weeks to haunt. good feel. thanks abhishipthaa mithramaa