తిరిగే చేతుల్లో
-ఎమ్.ఎస్.నాయిడు
కొన్ని చీమల చేతుల కింద తిరుగుతున్నా
వాటి నిద్రని తాకాలని
నా తలకాయలో
వాటి ప్రియురాళ్ళ ముఖాల్ని తుడిచేశాను
నిద్రలో పాకి
నా ప్రియురాళ్ళ ముఖాల్ని అవి తినేశాయి
కొన్ని కలలు
చీమల చేతుల్లో ఉంటాయి
మరికొన్ని తలలు
కలల చేతుల్లో చితుకుతాయి
తిరిగే చేతుల్లో
వంకర్లో కొంకర్లో పోయే కలలే మిగులుతాయి
———-
ఒకడు కలకంటున్నాడు
-జాన్ హైడ్ కనుమూరి
ఒకడు కలకంటున్నాడు
రెపరెపలాడుతున్న
తూనీగల్నో తుమ్మెదల్నో పట్టాలని
వెంటాడుతున్న బాల్యపుచేష్టలా
రంగులవైపు పరుగెడుతూ
అందాన్నేదో వెతుక్కుంటూ
అతడు కలకంటున్నాడు
ఒకడు కలకంటున్నాడు
అలసిన దేహంతో
జాము జాముకు కూసే
కోడిపుంజులా నిద్రిస్తూ
మైళ్ళు, సంవత్సరాల వేగంతో నడుస్తూ
తనలోనికో, బయటకో
విధుల్లోకో దేశాల్లోకో
సముద్రాల్లోకో, దేశదేశాల్లోకో
రహదారి వెంట
రాల్తున్న గుల్మోహర్ రేకల్లా
అక్షరాలను ఏరుకుంటూ
జీవితాన్ని మంత్రించిన పుష్పంచేసి
కాగితపు మడతల్లో
పుస్తకమై నిలిచిపోవాలని
అతడు కలకంటున్నాడు
ఒకడు కలకంటున్నాడు
ఆహ్లాద దేహంతో
కలకనే వేళ
కళ్ళలో గుచ్చుకుంటున్న
ముళ్ళలాంటి వాస్తవాల మధ్య పడిలేస్తూ
పొడిచే ముళ్ళను నరుకుతూ
గాయపడుతూ
గేయమౌతూ
శతాబ్దాలుగా కూరుకుపోతున్న
బురదవీధుల్లోంచి
నల్గురు నడిచే దారికోసం
చూపుడువేలై నిలవాలని
అతడు కల కంటున్నాడు
ఏ కలా లేకుండా
ఎన్ని ఏళ్ళగానో
మోయాలని ప్రయత్నిస్తున్నా
పథకాలు రచిస్తున్నా
ఇప్పుడే ఎదిగొచ్చినవాడు
నగ్నదేహంపై వస్త్రంలా తొడుక్కొని
అడుగులేసే పాదాలకు
పాదరక్షలుగా తొడుక్కొని
క్షణమో అరక్షణమో కాదు
గజమో మైలో కాదు
నిరంతర యానంలోకి
మోసుకెళ్తున్నాడు
నేనే చూస్తూ నిలుచుండిపోయాను
————-
ప్రపంచ జీవనీకరణ
-ఆచంట రాకేశ్వర రావు
మూఁడు వీదుల మా గ్లోబల్ విలేజిలో
దేశాలను విడదీశారు
మొదటి రెండవ మూడవ ప్రపంచాలుగా ॥
ఊరికొక్క షావకారు వెనకటికి ఋషులుగా బ్రతికినవారు
ఇంట్లోవారిచే చెప్పులు కుట్టించి పెరట్లో పెట్టి అమ్ముతున్నారు।
భార్యా పిల్లల రక్తాన్ని పాలుగా మలచి త్రాగారు
బాగా బలిశారు కాసులకు అలుసయ్యారు।
చచ్చిన నానా విశ్వకర్మలు అందాకా చేసిన వ్యాపారాలు
యికమందు సాగడానికెన్నో యంత్రాలు నిలిపారు, చైనా వీరి పేరు ॥
ఊరిలోనొక కుఱ్ఱకారు ఊరందరికీ పెద్ద దిక్కు
వ్యవసాయం తక్కువైన ఒట్టి చార్వాకుడు
సుఖాల తోటలో శయనించు మహాభోగి।
జనాలకు పనిలేకుండా పోకూడదని
అప్పు చేసి అన్నీ కొంటాడు, వాడుకుంటాడు।
హలాహలాన్ని నిత్యం మ్రింగేవాడు
అంతరంగం శూన్యమైనవాడు, వీడి పేరు అమెరికా॥
యువమహారాజుగారి ఆగడాలను
మావలూతాతలూ మేమేం తక్కువంటూ
అనుకరించి అపుడపుడూ భంగపడతారు
వీరి పేరు ఐరోపా।
మహాషావుకారితో పోటీపడుతూనే పడలేకే
చిల్లరవస్తువులమ్మే తోపుడుబళ్ళు
ఊరినిండా వారే మిగిలినవారు॥
అయ్యో ఒకనాడు అప్పుల్లో పడ్డాడు మహారాజు
ఆయన కొనకపోతే ఊరికే ఉద్యోగం లేదు।
పిల్లల్ని కాళీగావుంచలేక షావుకారు
మహారాజుకి అప్పిచ్చి సారాయి పోశాడు।
ఊళ్ళో అందరూ తలోచేయి వేసి
చేతనైనంత కల్లు దోసిట్లో పోసి
చిన్నయ్యగారిని ఆదుకున్నారు॥
ఊరిచుట్టూ కొండంతా పిండి, తోటంతా త్రవ్వి
చేయించిన ఆసనాలకూ పండించిన గంజాయికీ
వ్యసన పడి బానిసై, ప్రకృతి గుణాలకు పావైనాడు ।
వీడి శరీరంలో అణువణువూ అపుడోకొంతా ఇపుడోకొంతా
కొన్న షావుకారికి మిగిలిందీ జీవచ్ఛవం॥
క్షామకాలం మీదపడుతుండగా
రేపు రాబోయే పెనువిపత్తుకు
ఏర్పాట్లకు తీఱికలేని యాపారులంతా
ఎండుటాకుల్లా రాలినప్పుడు,
మిగిలిన ఆ నలుగురితో
మరు జనమెత్తనుంది మా వూరు।
తాగుమోతులా తాండవించి
పుఱ్ఱెలు కాలరాసే కాలానికి
చూపిన మావూరు చోద్యాలు ఎన్నో
ఉన్నఅన్నిటిలోనిది యొక్కటి మాత్రమే॥
naayudu,
poem baagundi. especially నా తలకాయలో / వాటి ప్రియురాళ్ళ ముఖాల్ని తుడిచేశాను /
నిద్రలో పాకి /నా ప్రియురాళ్ళ ముఖాల్ని అవి తినేశాయి chaalaa bagundi.
b.ajay prasad
Achanta garu,
Me Kavitha Adbhutam..
rputluri@yahoo.com
tirigae chaetullo,
pichchivaalla mukhamukhi baagundi. kavitalao nyna kaneesam.
ముగ్గురు కవులకీ అభినందనలు.
జాన్ గారు, నిన్ననే తిరగేసిన స్మైల్ గారి కవితా/వాదాల్లో కథల్లో తూనీగ ప్రస్తావనలు చదివాను. మళ్ళీ ఇక్కడ, నా కిటిక్కికి ఆవలా వాన ముందు వాతావరణంలోనూ అవే. నాకు మాత్రం చిన్నప్పుడూ ఇప్పుడూ వాటిని ఎగరనీయాలనే కల.